ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/సంఘసంస్కరణసభ

వికీసోర్స్ నుండి

" 'మతగురువులు నా కొనరించు నపకార మే మనఁగా, - పాపమె నావినోద మని నన్నుగుఱించి వారు నిందలువేసి, అపవాదములు వెలయించుచున్నారు ! మనుష్యుఁడా ! ఇపుడైన నీవు నిజము గ్రహింపుము. పాప మేరికైన సంతోషదాయక మగునా ? లోక వినాశకరమగు పాతక మెల్లయు మనుష్యకృతమెసుఁడీ. పాపము దేవుని కపచారము, నావెతల కాలవాలమును ! లోకమందెచట నేమనుజుఁడు దుష్కృతము లొనరించినను, అవి నావేదనల నభివృద్ధి చేసి, నా బానిసత్వమునకు దోహద మొసంగుచున్నవి. నిరతము నరుని శోధింతునని నేను నియమ మూనితిని. ఐనను, మనుజుఁడు నాకు లోఁబడ నక్కఱలేదు. కార్యస్వతంత్రుఁడై యతఁడు నన్ను ధిక్కరించినచో, నేను పలాయన మయ్యెదను. అతఁడు న న్నాదరించెనా, వాని యండనె నేను నిలిచియుండెదను !

" 'అనాదిగ మానిసివేసమున నేను పుడమిని గ్రుమ్మరుచున్నాఁడను. ప్రభువులకు ప్రధానులకును, శిష్యులకు శాస్త్రజ్ఞులకును, పిన్నలకు పెద్దలకును, వారివారి లోపముల ననుసరించి, నేను సాక్షాత్కార మగుచున్నాను ! కాని, యోగ్యులకు పవిత్రులకు విశ్వాసకులకును నేను నమస్కృతు లొనరించి, సంతోషమున వారిని వీడి పలాయితుఁడ నగుచున్నాఁడను. ఇదియె నా నిజస్థితి. నరుఁడు మన:పూర్వకముగ నన్నుద్ధరించి నాకు విముక్తి గలిగించువఱకును, నేను వానినె యాశ్రయించి, అవనియందె నిలిచి యుందును !' "

19. సంఘసంస్కరణసభ

రాజమంద్రిలో 28 వ మెయి తేదీని నేను పురమందిరమునకుఁ బోయి, అచటి పఠనాలయమునుండి "ఇమర్సనుని రచనలు" అను గ్రంథమును, ఆస్తిక పుస్తకాలయమునుండి కార్లయిలుని "శూరులు, శూరపూజ"యు, ఆడమ్సువిరచితమగు "నిరాడంబరజీవితము, ఉత్కృష్ట విచారము" అను పుస్తకమును జదువఁ దీసికొంటిని. ఒకటి రెండు దినములలోనే ఇమర్సనుని "ఆంగ్లేయుల గుణవిశేషములు", "పరమాత్మ", అను వ్యాసములును, కార్లయిలుని "వీరప్రవక్త" అను రచనమును జదివి వినోదించితిని. వీరిరువురును ప్రతిభాశాలురగురచయితలె. ఐనను, ఇమర్సనునికంటె కార్లయిలె నామనస్తత్త్వము నెక్కునగ నాకర్షించెను. ఇమర్సనునందు మౌనగాంభీర్యములు, బ్రహ్మజ్ఞానసంపత్తి, ఆత్మోపలబ్ధియును నతిశయించియుండెను. కార్లయిలునందు ధైర్యశూరతావాగ్విభవములు ప్రదర్శితములయ్యెను. ఇమర్సను ఆత్మవిచార దీక్షను, కార్లయిలు కార్యోత్సాహమును బురికొల్పుచుందురు. మొదటి రచయిత మనస్సును దేవునిదెసకు మరలుపఁ జూచును. రెండవవాఁడు మనుష్యుని నీచతాహేయత్వములను నిరసించును. ఇరువురు నసమాన ప్రతిభావంతులును, పరమార్థతత్త్వకోవిదులును.

ఈసెలవులలో మాయప్పుదారులలో నిరువురకుఁ దిరిగి క్రొత్త పత్రములు వ్రాసి యిచ్చి సంతృప్తిపఱచితిమి. మాకడగొట్టుతమ్ముఁడు సూర్యనారాయణకు వడుగు చేసితిమి.

ఈసంవత్సరము గోదావరిమండల సభలు ఏలూరులో జరుగుట కేర్పాటయ్యెను. రాజకీయసభకు రెంటాల వేంకటసుబ్బారావుపంతులుగారు అగ్రాసనాధిపతులు. సాంఘిక సభకు న్యాపతి సుబ్బారావుపంతులుగారధ్యక్షులుగ నుండుట కంగీకరించిరికాని, వారు రాలేకపోవుటచేత, కందుకూరి వీరేశలింగముపంతులుగా రగ్రాసనాసీనులైరి. సతీసమేతముగ నే నీసభల కేగ నిశ్చయించుకొనుట మాతల్లికి సమ్మతముగ లేదు. ఐనను, 7 వ జూనుతేదీని మే మిరువురమును ఏలూరు బయలుదేఱితిమి. సాంఘికసభా కార్యదర్శి శ్రీ సత్తిరాజు కామేశ్వరరావుగారియింట మేము విడిసితిమి. బహిరంగసభకు భార్య నాతఁడు గొనిపోవుట అతని సోదరులకును నంగీకృతము కాలేదు. కాని, యీవిషయమున నావలెనే కామేశ్వరరావుకూడ గట్టిపట్టు పట్టెను. 9 వ జూనున జరిగిన సాంఘికసభలోనికి కామేశ్వరరావు నేనును పత్నీసమేతముగఁ బోయితిమి. రాజ్యలక్ష్మమ్మగారును సభ కేతెంచిరి. ఇంకఁ గొందఱు స్త్రీలుకూడ సభకు వచ్చి, స్త్రీలకొఱకు బ్రత్యేకించినప్రదేశమున నాసీనలయిరి.

వీరేశలింగముగారి యధ్యక్షతక్రింద జరిగిన యాసభలో 'స్త్రీవిద్య' 'అతిబాల్యవివాహముల'ను గుఱించిన తీర్మానములను నే నుపపాదించితిని. సభ నిర్విఘ్నముగ జరిగెను. కొలఁదికాలము క్రిందటనే తండ్రి కాలధర్మమునొందిన నా తోడియల్లుఁడు సత్తిరాజు వెంకటరత్నమును, మామఱఁదలు శ్యామలాంబను బంధువులను మే మంత పరామర్శ చేసి, మఱునాఁటిరాత్రికి రాజమంద్రి చేరితిమి. అంత వీరేశలింగముగారి యధ్యక్షోపన్యాసమును నే నాంగ్లము చేసి, ఎల్లేపద్ది నారాయణశాస్త్రిగారి కిచ్చితిని. అది యాంగ్ల పత్రికలలోఁ బ్రకటననిమిత్తము మద్రాసు పంపఁబడెను.

22 వ జూను తేదీని విక్టోరియా మహారాణిగారి జూబిలీమహోత్సవము రాజమంద్రిపురమందిరమున నతివైభవమున జరిగెను. కలక్టరు బ్రాడీదొర అగ్రాసనాధిపత్యము వహించెను. వీరేశలింగముపంతులుగారొక తీర్మానమును ప్రతిపాదించుచు, రాణీగారి చరిత్రాంశములను జెప్పిరి. కొందఱు పద్యములు చదివిరి. వీథులలో పెద్ద యూరేగింపు జరిగెను. నాఁడు సభలోఁ జదువఁబడినపద్యము లింట నాఁడువాండ్రకు నేను జదివి వినిపించితిని.

23 వ తేదీని నేను సెలవుగైకొనుటకు వీరేశలింగముగారి యింటి కేగితిని. వారిచరిత్రమును నా "జనానాపత్రిక"లో బ్రచురింపఁగోరి, వారి జీవితమునుండి కొన్ని ముఖ్యాంశము లాసమయమున నేను వ్రాసికొంటిని. ఆకాలమున వీరేశలింగమహాశయునినామము స్మరించినంతనే నామనస్సున ధైర్యోత్సాహములు ముప్పిరిగొనుచుండెను. వారివలెనే సంస్కరణపక్ష మవలంబించి, నా జీవితమును సార్థకపఱుచుకొన నా మహదాశయము.

24 వ తేదీని జరిగిన రాజమంద్రిప్రార్థనసమాజ ప్రత్యేక సభలో, సత్యసంవర్థనీపత్రికను పునరుద్ధరింపవలె ననియు, ఆపత్రికకు నేనును కనకరాజును సంపాదకులముగను, సాంబశివరావు వ్యవహార కర్తగను నుండునటుల తీర్మానమయ్యెను. నే నంతగ నిచ్చగింప కున్నను, మరల "సత్యసంవర్థని" నా మెడ కంటఁగట్టఁబడెను !

తలిదండ్రులయొద్ద వీడ్కోలొంది నేను బెజవాడ పయనమయితిని. అంతకుముం దొకటిరెండు దినములక్రిందట, ఒకరాత్రి భోజన సమయమున నాకును మాతండ్రికిని కుటుంబవ్యయముల విషయమై కొంత వాగ్వాదము జరిగెను. ఇంటికర్చులకు నెల కెంత కావలయు నను నాప్రశ్నమునకు మానాయన కమితకోపము వచ్చెను. తమకుఁ గావలసినసొమ్ము నేను క్రమముగ బంపకుండుటవలననే, కుటుంబ ఋణము పెరుఁగుచుండె నని మాతండ్రి మొఱ. అంత మాయిరువురకును జరిగిన సంఘర్షణమునకుఁ బిమ్మట నేను మిగుల వగచితిని. వయసు చెల్లిన యాతండ్రిని, మూర్ఛలచేఁ గృశించిన యాతల్లిని విడిచిపోవుటకుఁ గాళ్లాడక, నే నెంతో దైన్యమందితిని.

20. చెన్నపురి యుద్యోగము

నేను సైదాపేట బోధనాభ్యసనకళాశాల విడువఁగనే, నూతనముగ వెలసిన రాజమంద్రిబోధనాభ్యసనకళాశాలలో నా కుద్యోగ మిప్పింపవలెనని మాగురువర్యులును, ఏతత్కళాశాలాధ్యక్షులును నగు మెట్కాపుదొరగారు సిద్ధపడిరి. కాని, నేను యల్. టి. పరీక్ష రెండవ భాగములోఁ దప్పిపోవుటచేత, ఆపని నాకుఁ గాక, నామిత్రుఁడు మృత్యుంజయరావున కీయఁబడెను. పిమ్మట నేను తమ దర్శనము చేయునపుడెల్ల, నేను యల్. టి. పరీక్ష పూర్తిపఱిచితినా యని దొరగారు నన్నడుగుచేనేవచ్చిరి. కాని, అది యేమిచిత్రమో కాని, 1897 వ సంవత్సరమువఱకును నే నాపరీక్ష నీయలేకపోయితిని. అందు చేత, మెట్కాపుదొరకు నాయం దెంత ప్రేమాభిమానము లుండినను, రాజమంద్రికళాశాలలో నాకుఁ బ్రవేశము కలుగలేదు ! 97 వ సంవత్సరారంభమునం దా దొరగారు తమ యుద్యోగమును జాలించుకొని ఇంగ్లండు వెడలిపోయిరి. నేనా మార్చినెలలోనే యల్. టి. లోఁ గృతార్థుఁడనైతిని !

అంత రాజమంద్రికళాశాలకు మిడిల్ మాస్టుదొర అధ్యక్షుఁడుగ నియమింపఁబడెను. వారి కళాశాలలోఁ దర్కశాస్త్రము బోధించుట కొక యుపాధ్యాయుఁడు కావలసినట్టు నాకుఁ దెలిసి, మద్రాసునుండి రాజమంద్రి ప్రయాణముఁ జేయుచు, బెజవాడరెయిలు స్టేషనులో దిగి యుండిన యాదొరగారిని జులై 5 వ తేదీని నేను సందర్శించి, నాసంగతి చెప్పుకొంటిని. నన్నాయన స్వయముగ నెఱుఁగడు కావున, నేను దరఖాస్తు చేసికొనినచో, తా నాలోచింతునని యాయన చెప్పెను. నేను దరఖాస్తుపెట్టి 9 వ జూలై తేదీని రాజమంద్రి బయలుదేఱి