ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/సుఖదినములు

వికీసోర్స్ నుండి

మందఱమును కోటలోనికిఁబోయి, రాజాగారిని వారిసోదరుని బరామర్శించితిమి. మేము క్రిందనిలుచుండి, పాన్పుమీఁద నాసీనులగు రాజులను సందర్శించితిమి. వారు మౌనము వహించియుండిరి. వారికి సంభవించిన విపత్తును గుఱించి మాలోనొకరు ప్రస్తావింపఁగా, ఇంకొకరు ప్రత్యుత్తర మిచ్చుచువచ్చిరి. మాలోమాకే యీ సంభాషణ జరిగిన పిమ్మట, మేము సెలవు గైకొంటిమి. ఓడ్ర ప్రభువుల మరియాద లివియని నాకుఁ దెలిసెను. పిమ్మటఁ గొంతకాలమునకు యువరాజుగారు చనిపోయినప్పుడు, మే మిట్లే ప్రభుపరామర్శచేసి వచ్చితిమి. ఎవరుగాని యనుశ్రుతమగు నాచారము నతిక్రమింపఁ జాలరు !

నేను విద్యగఱపిన తరగతులు బహిరంగపరీక్షలలోను కళాశాలపరీక్షలలోను బాగుగ జయమందుటచేత, అచటి యేర్పాటు ననుసరించి, నాజీత మైదురూపాయిలు హెచ్చుచేయఁబడెను.

మాతమ్ముఁడు వెంకటరామయ్య కొలఁదికాలములోనే రాజమంద్రినుండి వెడలిపోవఁదలంచినందున, 1902 సెప్టెంబరునుండియె జనానా పత్రికకు నేనొక్కడనే సంపాదకుఁడగనుంటిని. నాకోరిక మీఁద పర్లాకిమిడి విద్యాలయమందలి బోధకులు కొందఱు నాపత్రికకు వ్యాసములు తఱచుగ వ్రాయుచుండువారు. వారిలో ముఖ్యులు ఇవటూరి కనకాచలముగారు.

4. సుఖదినములు

1903 వ సంవత్సరారంభమున మా తమ్ముఁడు వెంకటరామయ్య సకుటుంబముగ రాజమంద్రినుండి భీమవరము వెడలిపోయెను. అచట కొలఁదికాలము క్రిందటనే క్రొత్తగ మునసబు కోర్టు పెట్టిరి. అతనిచేతఁ బనియుఁ బణమునంతఁ బుష్కలముగఁ గానఁబడెను. ఆ వేసవికాలమున నేను మాతమ్ముఁడును తణుకు తాలూకా వెళ్లి, మా కక్కడ మిగిలియుండిన భూములును రేలంగియిల్లును అమ్మివైచి, గోటేటిరాజుగారి యప్పు తీర్చివేసితిమి. ఆస్తియంతయు విక్రయించివేసినను మూఁడువేలరూపాయిల యప్పు మాకు మిగిలి యుండెను.

ఆ వేసవిని నా కింకొక చిన్న యుద్యోగము లభించెను. పర్లాకిమిడి కళాశాలలో విద్య నేర్చుకొనుటకై, విశాఘపట్టణ మండల మందలి పార్వతీపురమునుండి బెల్గాము మైనరు జమీందారు లిఱువురును తమ తల్లిగారితోఁగూడి పర్లాకిమిడి వచ్చిరి. ఆ జమీందారులకు సంరక్షకునిగను, ఉపాధ్యాయునిగను నెల కిఱువది రూపాయిల జీతముమీఁద దొరతనమువారు నన్ను నియమించిరి. నా కీక్రొత్తపని మొదట కష్టముగఁ గానిపించినను; రాజకుమారులు బుద్ధిమంతు లగుట చేతను, వారి జనని యగు రాణి సోదరునివలె నన్ను భావించి మన్నించుటచేతను, నా కేమియు నొత్తిడి కలుగలేదు. సత్పురుషులగు నీ రాజకుమారుల సావాసము నాకు శ్రేయోదాయక మయ్యెను. వా రిపుడు పెద్దవారలు సుగుణోపేతులునై, సంస్థానమును గడు సమర్థతతో సొంతముగఁ బరిపాలించుచు, ప్రతిభావంతు లగుట నా కెంతయు ముదావహముగ నున్నది.

నేను మాతమ్ముఁడును పట్టుపట్టి, యేఁడాది తిరుగకుండగనే ఋణ శేషమును దీర్చివైచితిమి. నెలకు సుమా రిన్నూఱురూపాయి లాతఁడును, నూఱు నేనును మా రాఁబడిలో మిగిల్చి, అప్పునంతయు నిచ్చి వేసి, కృతకృత్యుల మయితిమి. అప్పు తీఱిపోయిననాఁటనుండియు మాకు శిరమునుండి గొప్ప భారము తొలఁగిపోయినటు లయ్యెను. అంతకుఁ బూర్వము కష్ట భూయిష్ఠముగఁ దోఁచిన లోకయాత్ర మరల సుఖప్రదమును, ధర్మ నిర్వహణమున కనుకూలమును నయ్యెను. ఇపుడు మా కుటుంబమునకు బాధాకరములగు ఋణములేకాక, విశేషవ్యయముకూడ లేకుండెను. 1903 వ సంవత్సరాంతమున కృష్ణమూర్తి బోధనాభ్యసన కళాశాల విడిచి, శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు భీమవరమున నూతనముగ స్థాపించిన విద్యాలయమున బోధకుఁ డయ్యెను. ఇట్లు మాసోదరుల మెవరి కుటుంబపోషణమువారు జరుపుకొనుటకు వలయు సమర్థత గాంచి, కాలక్రమమున ధనమును, భూవసతిని సంపాదించు కొనఁగలిగితిమి.

నేను పర్లాకిమిడిలోఁ గడపినదినములు నా జీవితమం దెల్ల సుఖతమకాల మని చెప్పవచ్చును. ప్రాఁతబాధలు మఱచిపోయి, క్రొత్త ప్రదేశమున మంచి యుద్యోగమందిన నాకు, మనస్సున నూతనాశయము లిగురొత్తుచుండెను. అపుడు నావయస్సు 32 - 34 వ సంవత్సరముల మధ్యకాలము. కనుల కింపగు ప్రకృతిదృశ్యములు తండోప తండములుగ నా పురపరిసరముల నుండెను. కాలు సాగునట్టుగ నే నెంత దూరమైనను వాహ్యాళి కేగవచ్చును. రమ్యములగు పొదలు చెట్లును, మధుర రుతములు చేయు వివిధజాతుల పక్షులును, అనుదినమును నా కగఁబడెడి సామాన్యదృశ్యములే. చుట్టు నుండువారందఱు నావలెనే యాంధ్రులుగాక, భిన్న వేష భాషాచారములతో నొప్పెడి యోడ్రజనులు. వీరుకాక, పర్వతప్రాంతములనుండి కూరగాయలు కట్టెపుల్లలును గొనివచ్చి చౌకగ నమ్మెడి సవరవాండ్ర యమాయిక ప్రవర్తన మాశ్చర్యము గొలుపుచుండెను. ఇటు లనేకకారణముల వలన నా కీప్రదేశమందలి నివాస మత్యంతహర్ష దాయక మయ్యెను. కాని, తాత్కాలికానంద మొకటియే నిరతము మన జీవితమును నడుపుచుండెడి శక్తివిశేషము కాదు. నాకిపుడు బాగుగ జరిగిపోవు చుండుట వాస్తవమె కాని, ముం దెపుడును నే నీ మాఱుమూలదూర ప్రదేశమందలి చిన్న కళాశాల నంటిపట్టుకొని యుండవలసినదేనా ? నా సోదరులు బంధువులు నుండు గోదావరి మండల మిచటికి వందల కొలఁది మైళ్లదూరమున నున్నది. సంవత్సరమునకు రెండు మూఁడు మాఱులు నేను స్వస్థలమునకుఁ బోయి వచ్చు చున్నచో, "లంక మేఁతం యేటియీఁత" యనునట్లు నాసొమ్ము రెయిళ్లపాలు కావలసినదే ! ఇటీవల రెండు మూఁడుసారులు నే నిచట మన్యపుజ్వరమువలన బాధపడితిని. ఎల్లప్పుడు నన్నీప్రదేశ మాకర్షించు ననుటకు, ఇది నాజన్మస్థల మైనఁగాదు! ఇదిగాక, నాకు లభించినతోడనె మటుమాయమైన దొరతనమువారి కొలువునుగూర్చి యింకను నామనస్సు మెర మెరలాడుచుండెను. దానికొఱకు మరల మరల నే నిటీవల ప్రయత్నించినను, నాకృషి సఫలముకాలేదు. ఇటు లుండఁగా, ఒక విజయనగరపు మిత్రుఁడు, అచటి మహారాజావారి కళాశాలలో నాంగ్లోపన్యాసక పదవి ఖాళీ యయ్యె నని యొకనాఁడు నాకుఁ జెప్పెను. విజయనగరము స్వదేశము గాకున్నను, పర్లాకిమిడికంటె దానికిఁ జేరువతావెగదా. నేనంత నొక దరఖాస్తునంపి, సిఫారసు చేయుఁడని పరీక్షాధికారికి వ్రాసితిని. ఎవరి మొగ మెఱుకయు లేని విజయనగరమున నాకే లాభమును గలుగు నని నే నాశింప లేదు.

జూలయినెలలో నొకనాఁటి రాత్రి నాకొక తంతి వచ్చెను. అది విజయనగరము కళాశాలాధ్యక్షునియొద్దనుండియే. నాకుఁ దమ కళాశాలలో ప్రథమ సహాయోపన్యాసక పదవిని 110 రూపాయిల జీతముమీఁద నిచ్చితిమని యం దుండెను. పర్లాకిమిడి కళాశాల రెండవతరగతి కళాశాలయె. విజయనగరమునందలిది మొదటితరగతి కళాశాల. అచటి కళాశాలతరగతులందే నేను బోధింపవలయును. ఇది నాకెంతయు సంతోషదాయక మగు కార్యము. కాని, విజయనగరమున జీతముమాత్రము తక్కువగ నుండెను. కావున హెచ్చుజీత మిచ్చిన నే నాయుద్యోగముఁ జేకొందునని విజయనగరమునకు తంతి నిచ్చితిని. ఆయుద్యోగమునకుండు నత్యధికమగు జీతము 120 రూపాయిలు నిపుడే యిచ్చితి మని నాకు మాఱుతంతి వచ్చెను. కావున నే నాయుద్యోగమును స్వీకరించితిని.

ఆగష్టునెల మధ్యనే నేను పర్లాకిమిడి విడిచి, విజయనగరము పోవలయును. నాప్రయాణవార్త పర్లాకిమిడి విద్యార్థుల కమితవిషాదము గలిగించెను. ఇటీవలనే నే నిచ్చటివిద్యార్థులలో "సంఘపారిశుద్ధ్య సమాజము" నొకటి నెలకొల్పితిని. పొగాకు, మద్యపానము మున్నగు నుద్రేకజనకపదార్థములు దరికిఁ జేరనీయక, మనో వాక్కాయ కర్మల యందు పవిత్రత దాల్చియుండవలె నను నియమమును ప్రతిసభ్యుఁడును పూనవలెను. ఈ ప్రదేశమున సామాన్యముగ పెద్దలు పిన్నలును పొగాకు "కిల్లీలు" సదా నమలుచుందురు. అట్టి యభ్యాసము నరికట్టుట దుర్ఘటము. ఐనను. నా ప్రోత్సాహమున త్వరితకాలముననే విద్యార్థు లనేకు లీ సమాజమునఁ జేరిరి. ఉపాధ్యాయులును గొందఱు పొగాకు విసర్జించివేసిరి. దినమున కొక చుట్టమాత్రమే తా మిపు డుపయోగించుచుంటిమని గిడుగు రామమూర్తిపంతులుగారు నాకుఁ జెప్పిరి. ఎపుడును దౌడను కిల్లీ నుంచుకొనెడి యలవాటుగల కళాశాలాధ్యక్షులు శ్రీనివాసరావుగారు, కిల్లీ యిపుడు పూర్తిగ విసర్జించి, దంతముల తీపు శమించుటకై కిల్లీకి మాఱుగ సొంటికొమ్మును బుగ్గను బెట్టుకొనిరి. ఇట్టి ప్రదేశమును ప్రచారమును విడనాడుట నాకు మిగుల కష్టముగ నుండెను. తెలుఁగువారితో పోటీపడి యోడ్రవిద్యార్థులు నాకు గౌరవపూర్వకమగు వీడ్కో లొసంగిరి. విద్యార్థులు మూఁడు నాలుగు విజ్ఞాపనపత్రములును, ఒక బంగారు పతకమును సమర్పించిరి. నన్ను గుఱించి వారు నాలుగుభాషలలోను సిద్ధపఱచి చదివిన పద్యములకు నాకన్నులు చెమ్మగిల్లెను. అత్తయింటికిఁ బోవు క్రొత్తకోడలివలె కన్నీటిధారతో పర్లాకిమిడి మిత్రమండలిని వీడి, నేను విజయనగరము వెడలి పోయితిని.

పర్లాకిమిడి మిత్రులు నాబోధనాకౌశలమును, శీలప్రవర్తనములను మెచ్చుకొని, నా కాసమయమునఁ జేసిన గొప్ప సత్కార మెన్నటికిని మఱచిపోఁజాలను. వీడ్కోలు సమయమున నామిత్రులును కళాశాలా పండితులు నగు శ్రీ బంకుపల్లి మల్లయ్యశాస్త్రులుగారు చదివిన పత్రములోని యీక్రింది పద్యము, నా శీలవర్ణన విషయమున నతిశయోక్తియయ్యును, నాయాదర్శములను బట్టి స్వభావోక్తియు, రుచిరాలంకారభూయిష్ఠమునై నా లేఁత హృదయమున కమితా మోదము గలిగించెను -

                      "చ. కటువగు మాట లెప్పుడు ముఖంబున వెల్వడవెంచిచూడఁ ద
                            క్కటి వ్యసనమ్ములందగులు గానము విద్యలయందె గాక, వేం
                            కటశివుఁ జూచి నేర్చుకొనగాఁ దగు కాలము వమ్ము సేయకుం
                            డుట, దయకోపముం దన కనుంగవనే తగ నిల్పెడున్ దఱిన్ !"

5. "జనానాపత్రిక"(2)

నాకు విజయనగరమందలి యుద్యోగమగుట నామిత్రులకు, సోదరులకును నాశ్చర్య ప్రమోదములు గలిగించెను. దీనిని గుఱించి