Jump to content

ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/పరిస్థితులలోని మార్పు

వికీసోర్స్ నుండి

వృద్ధిమీఁద 120 రూపాయిలవఱకు నేర్పాటయ్యెనని విని సంతోషించితిమి. ఎన్ని సంవత్సరములకైన నూఱురూపాయిలుకాని బెజవాడ పాఠశాలలోని పనికంటె నిచటి యుద్యోగమే మేలని మే మానంద మందితిమి.

3. పరిస్థితులలోని మార్పు

20 వ సెప్టెంబరున మాతమ్మునియొద్దనుండి వచ్చిన యుత్తరములో, అత్తవారియింట మా చిన్న చెల్లెలు కామేశ్వరమ్మ జబ్బుపడెనని యుండెను. మఱునాఁటిజాబు రోగి మఱపు చెఱపు మాటలాడు చుండెనని తెలిపెను. 24 వ తేదీని వచ్చిన లేఖనుబట్టి, చెల్లెలింకను వ్యాథిపీడితయని తెలిసెను. తాను వెడలిపోయెదనని మాతల్లి యంతట పట్టుపట్టెను. ఒకవిద్యార్థి నామెకుఁదోడిచ్చి, మఱునాఁటి రెయిలుమీఁద మాతల్లిని అట్లపాడు పంపివేసితిని. తొందరపనులచే నేను వెళ్ల లేక పోయినను, నామనస్సు మాచెల్లెలిలిమీఁదనే యుండెను. కొలఁది నెలలక్రిందటనే మేము మ ముద్దులతమ్మునిఁ గోలుపోయితిమిగదా ! ఇంతలో నింకొక యుపద్రవము మమ్ము తఱుముకొనివచ్చుటకు నేను భీతిల్లితిని.

కొద్దిరోజులలోనే మాచెల్లెలికి వ్యాధి ప్రబలెనని తెలియుటచేత నేను గోదావరిజిల్లాకు బయలుదేరిపోయితిని. నేను వెళ్లి చూచునప్పటికి రోగి చాల బలహీనస్థితిలో నుండెను. మాతల్లి, తమ్ములు, కొందఱు బంధువులును, అట్లపాడు వచ్చియుండిరి. ఒక మంగలి వైద్యము చేయుచుండెను. ఎన్ని దినములకును జ్వరము తగ్గదయ్యెను. లంకణములు కట్టుటవలన రోగి మిగుల బలహీనయయ్యెను. మేమంత నొక యాలోచన చేసితిమి. మా తమ్ములకుఁ బరిచయముగల పట్నాయకు అనునొక యోడ్రవైద్యుఁడు రాజమంద్రిలోఁగలఁడు. అతఁడు మంచి సాధకుఁడని తెలిసెను. తమ్ముఁడు కృష్ణయ్య యాయన నిచటికిఁ గొని వచ్చెను. ఆయన మంచి నాడీనిదాన నెఱిఁగిన వైద్యుఁడు. జ్వరము దిగపోకుండినను రోగి కాహారమిచ్చుచుండవలెనని యాయన చెప్పి, గోధుమగంజి పోయించెను; మందు మార్చివైచెను. కొన్ని రోజులకు జ్వరము నిమ్మళించెను. అంత నచటినుండి మాచెల్లెలిని మేము రాజమంద్రి తీసికొనివచ్చితిమి. ఆవైద్యుని యౌషధములవలన నామెకు దేహమున నారోగ్యముగలిగి క్రమముగ బలముపట్టెను.

కొద్దినెలలక్రిందట మా రాజమంద్రినివేశన మొకటి యమ్మివైచితిమి. ఇపుడు రెండవదికూడ నమ్మఁజూపితిమి. నేనంత కాకినాడమీఁదుగ పర్లాకిమిడి వెడలితిని. మాయత్తగారు తమకూఁతును జూచివచ్చుటకై నాతో బయలుదేఱిరి. వైద్యుని సలహాననుసరించి, యౌషధసేవకై నాభార్యను 10 వ నవంబరున తల్లితో టెక్కలి పంపివేసితిని. నేను కళాశాలా భోజనవసతిగృహమున మరలఁ బ్రవేశించితిని. ఆరోజులలో మావిద్యాలయమును తనిఖీచేయవచ్చిన విలియమ్సుపిళ్ల గారు నాతరగతులు పరీక్షించి, నాపని మిగుల బాగుగ నుండెనని మెచ్చుకొనిరి. బెజవాడకంటె పర్లాకిమిడియు, అందలి పాఠశాలకంటె నిందలి విద్యాలయమును మంచిస్థితిలోనుండెనను వారి యభిప్రాయమున సత్యము లేకపోలేదు. ఈవిద్యాశాలలో విద్యార్థుల సంఖ్యయు, వారి పరిశ్రమాదులును చక్కఁగ నుండెను.

ఆసమయమున "లోపభూయిష్ఠుఁడగు ప్రధానోపాధ్యాయుఁడు" అను నాంగ్ల వ్యాసము నొకటి వ్రాసి, నేనది చదివెదననియు, సభకు వారు అధ్యక్షులుగ నుండవలెననియు, పిళ్ల గారిని నేను గోరితిని. నా యుపన్యాసము వ్యక్తిదూషణముల కెడమిచ్చునను నపోహలు గలుగు నని యాయన వారించినందున నేనది పత్రిక కంపివైచితిని. "ప్రధానోపాధ్యాయుఁడు, ఆతని సహాయకులు" అను మకుటముతో నావ్యాసము "సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రితమయ్యెను. దానిలో వ్యక్తిదూషణము లెవ్వియును లేవు. అనేక పాఠశాలలందలి యుపాధ్యాయులలోఁ గక్షలుగలవనియు, సామాన్యముగ ప్రథానోపాధ్యాయుఁడు ఆతని సహాయకులును పరస్పర శత్రువులుగ నుందురనియును, ఇది విద్యాలయమందలి క్రమశిక్షణమునకును జ్ఞానప్రబోధమునకును భంగకరమనియును నాయభిప్రాయము. విద్యాలయములు శాంతినిలయములుగ నుండిననే, అచటివిద్యార్థులకు విద్యావినయము లబ్బును గాన, ప్రధానోపాధ్యాయుఁడు తన సహాయకులను స్నేహభావమునఁ జూడవలెననియు, ఉపాధ్యాయులలో సోదరసామరస్య మున్నఁగాని విద్యాసంస్థ యేదేశమునఁగాని జయప్రదముగ సాగదనియును నేను వ్రాసితిని.

1902 ఫిబ్రవరినుండియే నేను "హిందూసుందరీమణుల చరిత్రము"ల మూఁడవభాగ మారంభించితిని. దీనిలో మొదటికథ 'లీలావతి'. చివరదియగు 'విశాల' ఆ డిశంబరు సంచికలో వ్రాసి, మూఁడవ భాగమును ముగించితిని. పదునొకండు కథలున్న యీభాగము మొదటి రెండింటికంటెను మిగుల చిన్నది. ఇట్లు 1902 వ సంవత్సరాంతమునకు నాతెలుఁగుపుస్తకము లాఱును సిద్ధమయ్యెను. స్త్రీలకుఁ జదువుకొనుట కంతగ పుస్తకములు లేని యాకాలమున నీ పుస్తకములు స్త్రీలోకమున కత్యంతోపయుక్తములుగ నుండెడివి.

1902 వ సంవత్సరము డిశెంబరు సెలవులలో నేను రాజమంద్రివెళ్లి, మాతల్లిని, సోదరులను జూచితిని. మద్రాసునుండి మావావమఱఁది వెంకటరత్న మపుడేవచ్చెను. రాజమంద్రిలోని మారెం డవ నివేశనముకూడ నమ్మివేయుటకు మే మేర్పఱుచుకొంటిమి. మా తమ్ముఁడు రాజమంద్రినుండి సకుటుంబముగ భీమవరము వెళ్లుటకు సంసిద్ధమయ్యెను. ప్రథమశాస్త్రపరీక్షలో గెలుపొందినను లేకున్నను కృష్ణయ్య యుద్యోగమునఁ బ్రవేశింపవలసినదెయని నేను జెప్పివేసితిని. 1903 జనవరి 5 వ తేదీని పర్లాకిమిడికి బయలుదేఱితిని.

ఢిల్లీ దర్బారు సందర్శించి వచ్చిన పర్లాకిమిడి రాజావారికి సుస్వాగత మొసంగుటకు 7 వ జనవరిని ఉపాధ్యాయుల మందఱము రెయిలునొద్దకుఁ బోయితిమి. 10 వ జనవరిని కళాశాలాంధ్రోపధ్యాయులగు మత్స వెంకటకవిగారు కీర్తిశేషులైరి.

అంత మా వాండ్రు టెక్కలినుండి పర్లాకిమిడి వచ్చివేసిరి. పాండ్యాగారి మందువలన నాభార్య కేమియు లాభము గలుగలేదు.

మాకళాశాలలో ప్రథమశాస్త్ర పరీక్షకుఁ బోయిన 19 లోను 11 విద్యార్థులును, ప్రవేశపరీక్షలో 21 కి 12 విద్యార్థులును జయమందినట్లు తెలిసి మిగుల సంతోషించితిమి. మాతమ్ముఁడు రాజమంద్రిలోని రెండవస్థల యమ్మివేసి కొంతయప్పు తీర్చివేసెనని తెలియవచ్చెను. ఇంకను గొంతయప్పు మిగిలియేయుండెను. ఇది యెట్లు తీఱు నాయని యాలోచించితిమి. ప్రథమ శాస్త్రపరీక్షయందు కృష్ణయ్య జయమందుట సంతోషకరమగు వార్త. బి. ఏ. పరీక్షకు తాను జదివెదనని యాతఁడు వ్రాసెనుగాని, ఇంకఁ జదువు విరమించి, యుద్యోగ ప్రయత్నము చేయుమని నేను జెప్పితిని. బోధకవృత్తిలోఁ బ్రవేశించుటకై యాతఁ డంత రాజమంద్రిలోని బోధనాభ్యసనకళాశాలలోఁ జేరెను.

29 వ జనవరిని రాజాగారి చెల్లెలగు జలాంత్రరాణిగారు చనిపోయిరని తెలిసి విషాదమందితిమి. మఱునాఁడు ఉపాధ్యాయుల మందఱమును కోటలోనికిఁబోయి, రాజాగారిని వారిసోదరుని బరామర్శించితిమి. మేము క్రిందనిలుచుండి, పాన్పుమీఁద నాసీనులగు రాజులను సందర్శించితిమి. వారు మౌనము వహించియుండిరి. వారికి సంభవించిన విపత్తును గుఱించి మాలోనొకరు ప్రస్తావింపఁగా, ఇంకొకరు ప్రత్యుత్తర మిచ్చుచువచ్చిరి. మాలోమాకే యీ సంభాషణ జరిగిన పిమ్మట, మేము సెలవు గైకొంటిమి. ఓడ్ర ప్రభువుల మరియాద లివియని నాకుఁ దెలిసెను. పిమ్మటఁ గొంతకాలమునకు యువరాజుగారు చనిపోయినప్పుడు, మే మిట్లే ప్రభుపరామర్శచేసి వచ్చితిమి. ఎవరుగాని యనుశ్రుతమగు నాచారము నతిక్రమింపఁ జాలరు !

నేను విద్యగఱపిన తరగతులు బహిరంగపరీక్షలలోను కళాశాలపరీక్షలలోను బాగుగ జయమందుటచేత, అచటి యేర్పాటు ననుసరించి, నాజీత మైదురూపాయిలు హెచ్చుచేయఁబడెను.

మాతమ్ముఁడు వెంకటరామయ్య కొలఁదికాలములోనే రాజమంద్రినుండి వెడలిపోవఁదలంచినందున, 1902 సెప్టెంబరునుండియె జనానా పత్రికకు నేనొక్కడనే సంపాదకుఁడగనుంటిని. నాకోరిక మీఁద పర్లాకిమిడి విద్యాలయమందలి బోధకులు కొందఱు నాపత్రికకు వ్యాసములు తఱచుగ వ్రాయుచుండువారు. వారిలో ముఖ్యులు ఇవటూరి కనకాచలముగారు.

4. సుఖదినములు

1903 వ సంవత్సరారంభమున మా తమ్ముఁడు వెంకటరామయ్య సకుటుంబముగ రాజమంద్రినుండి భీమవరము వెడలిపోయెను. అచట కొలఁదికాలము క్రిందటనే క్రొత్తగ మునసబు