ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/చెల్లెలి మరణము
న్యాసకులుగను, అధ్యక్షకులుగను నుండిరి. విద్యాశాఖ డైరెక్టరు స్టోను దొరగారు ప్రదర్శనము నారంభించిరి. సుబ్బారాయఁడుశాస్త్రిగారు స్వాగతోపన్యాస మిచ్చిరి. "పాఠశాలలోని పని-తలిదండ్రుల" ను గూర్చి నేనొక యాంధ్రవ్యాసమును రచించి చదివితిని.
12. చెల్లెలి మరణము
1911 వ సంవత్సరమున కళాశాలలో విద్యాబోధనమునకంటె నితర వ్యాసంగములే నా కెక్కువ భారమయ్యెను. విద్యావిషయక సభలనుగుఱించి యిదివఱకె ప్రస్తావించితిని. ఆ జనవరిలో సభలు ప్రదర్శనములు జరిగెనేగాని, ప్రదర్శనమునకు సంబంధించిన పను లెన్నియో మిగిలియుండెను. ఆ సంవత్సరపు "ఆంధ్ర పత్రిక : ఉగాదిసంచిక"లో "ఉత్తమబోధక లక్షణము" లను గూర్చి నే నొక వ్యాసమును వ్రాసితిని. ఈశ్వరముఖముఁ జూచియు పారమార్థిక చింతతోడను, ఉపాధ్యాయ ధర్మనిర్వహణమునకుఁ గడంగిన బోధకుఁడె బోధకుఁ డనియు, అట్టి గురుముఖమున శిష్యునికి లభించిన విద్యయే విద్యయనియును, గురువు విద్యాపారంగతుఁడు గావలెననియు, విద్యాబోధనమువలని ముఖ్యప్రయోజనము విద్యార్థికి జ్ఞానమునకంటె నయసంపద సమకూర్చుటయే యనియు, మంచి యుపాధ్యాయుఁడు మానుషస్వభావమును గ్రహించి శిష్యుని మన:కుసుమమునకు వికసనము గలిగించి, శ్రీకృష్ణుఁడు అర్జునుని పట్ల మెలంగినట్లు మెలంగుననియును నేను వ్రాసితిని.
ఆ సంవత్సరము 16 ఏప్రిలున, నరసాపురమున జరిగిన "కృష్ణా గుంటూరుమండల సంఘసంస్కరణసభ"కు నానగ్రాసనాధిపతిగఁ గోరు కొనిరి. గుంటూరునుండి శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు నాతో నరసాపురము విచ్చేసిరి. జబ్బుగా నుండుటచేత కొండ వేంకటప్పయ్యగారు రాలేకపోయిరి. నే నాసమయమున నిచ్చిన యుపన్యాసము నందు, సంఘసంస్కరణములను గుఱించి మన దేశీయులకుఁ గల విపరీతాభిప్రాయములు ముందుగ విమర్శించితిని: జుట్టును బొట్టును లేక యుండుటయు, అనాచారవంతు లగుటయు, ప్రాచీనసదాచారములను నిరసించుటయు సంఘసంస్కారిధర్మము లని కొందఱు భ్రమపడుచున్నారు ! ఏ సాంఘికాచారప్రభావమున సంఘమునందు నయసంపదయు, నభ్యున్నతియు భంగ మొందెనో, ఏయాచారముల ననుసరించి హిందువులు నాగరికతయందు వెనుకఁబడిరో, అట్టిపద్ధతులను ఆచారములనే మనము సంస్కరింపవలెను. సంస్కరించుట యనఁగా బాగుపఱచుటయే కాని పాడుచేయుట గాదు. మన దేశమున కిపుడు కావలసిన సంస్కరణములు ముఖ్యముగ విద్యావిషయకములు, వివాహవిషయకములును. జను లందఱును వ్రాయను జదువను నేర్చినఁగాని, ఏ దేశమునకును నిజమగుమేలు గలుగనేరదు. వివాహ సంస్కరణములలో, ముందుగ నతిబాల్యవివాహములు నిషేధించి, యుక్తవయస్సు వచ్చిన యువతీయువకులకే వివాహములు జరుపవలె ననియు, దురాచారభూయిష్ఠ మని హిందూ సంఘమును విసర్జించి యన్యమతస్వీకారము చేయుట దేశభక్తుల ధర్మము గాదనియును, - నేను జెప్పితిని.
ఈ యేప్రిలుమాసాంతమున మాయమ్మమ్మ వేలివెన్నులో ననాయాసమరణ మందెను. చనిపోవునప్పటి కామెకు సుమారు 90 సంవత్సరముల వయస్సు. చిరకాలజీవియగు నీ పుణ్యవతి తుదిదినముల వఱకును ఆరోగ్యభాగ్య మనుభవించెను. చివర రెండుమూఁడేండ్లు మాత్రము మాయమ్మమ్మను అంధత్వబధిరత్వములు బాధించెను. మా తల్లి చనిపోయినపిమ్మట నీ యిల్లాలికి దు:ఖ మధికమై, ఆమెను జూచుటకు మనుమల మెవరమైన వేలివెన్ను వెళ్లునపుడు, మమ్ముఁ జేరఁబిలిచి, "నాయనా ! నీవు చాలాచదువుకొన్నావు. నాకు చావేలాగున వచ్చునోచెప్పవా ?" యని యాదీన యడిగి, కంట నీరుపెట్టుకొనియెడిది. శాంతమూర్తియు, సుస్వభావయునగు నీ సుదతి మనుమలమగు మమ్ము ప్రాణతుల్యులగఁ జూచుకొనియెడిది.
ఆసంవత్సరము సెప్టెంబరునెలలో మాచిన్న చెల్లెలు కామేశ్వరమ్మ పురుడుపోసికొనుటకు గుంటూరు వచ్చెను. వెనుక సన్నిపాత జ్వరము వచ్చినప్పటినుండియు కొంత చిక్కియుండినను, ఈసమయమున నామె సామాన్యారోగ్యము గలిగియెయుండెను. అక్టోబరు తుది రోజులలో కామేశ్వరమ్మకుఁ గొంచెము జ్వరమువచ్చెను. జ్వరములోనే నొప్పులు ప్రారంభమయ్యెను. ఆమె ప్రసవ మగుట దుస్తర మని తోఁచఁగనే, 30 వ తేదీ రాత్రి వైద్యురాలగు కుగ్లరు దొరసానిని బిలువఁగా, రోగి నామె తనవైద్యాలయమునకుఁ గొనిపోయెను. ఒక గంటలోనే కామేశ్వరమ్మ ప్రసవమయ్యెను. ఎన్ని సాధనములు చేసిన పిమ్మటనోగాని యపుడు జనించిన శిశు నేడువలేదు. పిల్లవానిమాట యెటు లుండినను, తల్లినిగుఱించి భయపడ నక్కఱలేదని దొరసాని చెప్పెను. కాని, యొకరోజులోనే పరిస్థితులు తాఱుమాఱయ్యెను. 31 వ తేదీని మధ్యాహ్నమున మాచెల్లెలికిఁ జాల జబ్బుచేసెనని మా కింటికి వర్తమానము వచ్చెను. మే మందఱమును పోయి చూచితిమి. రోగి స్పృహలేక పడియుండి, వేదనపడుచు, రాత్రి పదిగంటలకు కాలధర్మము నొందెను. మేము దు:ఖసాగరమున మునిఁగిపోయితిమి. కొన్ని సంవత్సరములనుండి దు:ఖమును మఱచియుండిన మాకు మరల కష్టదశ సంప్రాప్తమయ్యెను. మాయందఱిలోను మిగుల చిన్నదియు, మితభాషిణియు, వినయాది సుగుణభూషితయు నగు మా చెల్లెలి కీ యకాల మరణము సంప్రాప్తమగునని కలనైన ననుకొనలేదు. ఇపుడు జనించిన పిల్లవాఁడుకాక యామెకు విశ్వనాధమను నింకొక కుమారుఁడుగలఁడు. మాతంతి నందుకొని గుంటూరువచ్చిన కామేశ్వరమ్మభర్త దహనాది కర్మలు జరిపి, పెద్దపిల్ల వానినిఁ దనవెంటఁ దీసికొని, స్వగ్రామము వెడలిపోయెను. ఒకమూల మావెల్లెలి చావునకు విలపించుచుండు మేము, ఆమె విడిచిపోయిన యర్భకునిఁ బెంచవలసివచ్చెను. పిల్లవాని ప్రాణమునుగుఱించి యాశ యంతగలేక, పుట్టిన పదిదినములవఱకును వానిని వైద్యాలయముననే యుంచి, పిమ్మట మాయింటికిఁ గొనివచ్చితిమి.
వైద్యశాలలో నున్నదినములలో పలుమాఱు శిశువు సొమ్మసిల్లుచువచ్చెను. మాయింటికిఁ గొనివచ్చినప్పుడు వాఁడు ప్రాణము లనట్టుగనుండెను. వానినిఁ బోషించుభారము మామీఁదనే పడెను. వలసినప్పుడు చనుబాలు వానికి దొరకుట దుస్తరమున నుండెను. పగలు రాత్రులును దాదులను బెట్టి, శిశువునకుఁ బా లిప్పించుచువచ్చితిమి.
పిల్ల వాని పోషణమును గుఱించి రాత్రులు సరిగా నిద్రలేక పోవుటచే నాభార్యకు 'కామిలా' వ్యాధి సోఁకెను. ఆమె యందు వలన కొన్నిదినములు కుగ్లరువైద్యాలయములో నుండవలసివచ్చెను. ఆరోజులలోనే పసివానికిని జబ్బుచేయుటవలన వానినిఁగూడ నా వైద్యశాలకే చేర్చితిమి. అంత స్వాస్థ్యముగలిగి, ఫిబ్రవరి 15 వ తేదీని వారిరువురు నిలుసేరిరి. ఇంతవఱకును మాకు సాయముచేసిన పెద్ద చెల్లెలు కనకమ్మ, తనమువ్వురు పిల్లలతో, 23 వ తేదీని అత్తవారింటికి వెడలిపోయెను.
మేము పడరానిపాట్లుపడి పిల్లవానిని బెంచుచుంటిమి. రేయుంబవళ్లు పాలిచ్చుట కొక పాలదాదిని బెట్టితిమి. స్వతస్సిద్ధముగ బలహీనుఁ డగు పిల్లవాఁడు, పలుమాఱు వ్యాధిపీడితుఁ డగుచువచ్చెను. అందువలన మే మిరువురము నమితమగు నలజడికిఁ బాల్పడితిమి. 1912 ఫిబ్రవరి మార్చి నెలలో మరల శిశువునకు జబ్బుచేయుటచే, కుగ్లరు వైద్యాలయమునకు వానిని గొనిపోయితిమి. కుగ్లరుదొరసాని వాని రోగనివారణమును గుఱించి యెంతయో శ్రమపడెను. వ్యాధి నివారణము తన కిఁక సాధ్యము కాదని యామె యొకనాఁడు చెప్పివేయఁగా, మిత్రులయాలోచనలచొప్పున నాయుర్వేదవైద్యవేత్త రాఘవాచార్యులుగారిని దీసికొనిపోయి పిల్లవానిని జూపించితిమి. వైద్యము చేయుట కాయన యొప్పుకొనఁగా, పిల్లవాని నింటికిఁ గొనివచ్చితిమి. ఆయన మంచి మందిచ్చి యొకటి రెండు దినములలో నే జ్వరమును, వమనములను గట్టించెను. ఆయుర్వేదవైద్యమునం దిట్టి సూక్ష్మప్రక్రియ లుండుటకు డాక్టరు కుగ్లరు ఆశ్చర్యమందెను. పిల్లవానికిఁ గృత్రిమాహారము లెవ్వియు సరిపడ వనియు, తేప తేపకను మానిసిపాలు పితికించి పోయుఁ డనియును గ్రొత్తవైద్యుఁడు విధించుటచేత, రేయుంబవళ్లు మే మెంతయో శ్రమపడి శిశుపోషణము జరిపితిమి. అంతట పిల్ల వానికి నింపాదించెను.
ఆ వేసవి సెలవులలో పిల్ల వానిని జల్లగ నుండు నర్సాపురము కొనిపోవుద మను నుద్దేశముతో నేలూరువఱకును మేము వెళ్లి, అక్కడ మా తోడియల్లుఁడు వెంకటరత్నముగారియింట నొకటి రెండు దినములు నిలిచితిమి. ఇంతలో పిల్లవానికి మరల జబ్బు చేసెను. ఎండ లతి తీవ్రముగ నుండుటచేతను, మంచి పాలదాది యేలూరులో కుదురుటచేతను, మేమచటనే యొకనెల యుంటిమి. పిమ్మట నరసాపురమున వొక నెల గడపి, జూనునెల తుదిని గుంటూరు వచ్చితిమి. ఒకసంవత్సరము దాటినఁగాని పిల్లవాఁడు మెడలు నిలుపనేలేదు. తెలివితేటలందుమాత్రము వాఁడు దినదినాభివృద్ధి నొందుచుండెను.
ఈ వేసవికాలమున నిడదవోలులో మహాసభ లెన్నియో కూడెను. చెల్లెలు చనిపోయినప్పటినుండియు సభలు, సమావేశములును నా కేమియు రుచింపకుండినను, సంఘసంస్కరణసభలో శ్రీమతి ఆచంట రుక్మిణమ్మగారు చేసిన యాంగ్లోపన్యాసమును తెలుఁగు చేసి చెప్పితిని. సభలకు విచ్చేసిన ప్రాఁతమిత్రు లనేకులు నాకుఁ గానఁబడిరి. శ్రీయుత కొండ వెంకటప్పయ్యగారు తా మిటీవల కొనిన వేఁటపాలెముతోఁటలో "శారదానికేతన" మను పేర నొక స్త్రీ గురుకులాశ్రమమును స్థాపించుటనుగుఱించి స్నేహితులతో నపుడు మాటాడిరి. స్త్రీవిద్యాభివృద్ధికై చాలకాలము పరిశ్రమచేసిన నేనె యీ స్త్రీసంస్థను జరుపుట యుక్తమని పలువు రనిరి. ఒక సంవత్సరము గుంటూరికళాశాలలో సెలవు పుచ్చుకొని, జీతము గైకొనక యీ యువతీ విద్యాలయమును నడపుదు ననియు, అప్పటి ఫలితములను జూచి నాముందరి ప్రణాళిక నేర్పఱుచుకొందు ననియును నేను బ్రత్యుత్తర మిచ్చితిని. తోడనే యొకసారిగ నేను నాయుద్యోగమును విరమించుకొని, "శారదానికేతన" యాజమాన్యమును స్వీకరింపవలె నని నామిత్రు లనిరి. నే నట్లు చేయఁజాల నని చెప్పివేసితిని.
ఇంతలో మా కింకొకకష్టము సంప్రాప్త మయ్యెను ! చనిపోయిన మాచెల్లెలి పెద్దపిల్లవాఁడు, ఆసంవత్సరము జూలై నెలలో నాక స్మికముగ మృతినొందెనని తెలిసెను. వీఁడు మొదటినుండియు నారోగ్యవంతుఁడె. తల్లిచనిపోయినపుడు, తండ్రి వానిని స్వగ్రామమునకుఁ గొనిపోయెను. ఇటీవల నేనచటికిఁ బోయి చూచినపుడు, వాఁడు చక్కఁగ నుండెను. వీని చావు మమ్మందఱిని దు:ఖపరవశులఁ జేసెను. ఆకష్టసమయమున మాతమ్ముఁడు, చెల్లెలును నా కిట్లు వ్రాసిరి.
9 ఆగష్టు 1912, శుక్రవారము, ఆర్తమూరు.
""అన్నయ్యా,
5 వ తేదీని నీవువ్రాసిన కార్డు చూచి దు:ఖసముద్రములో మునిఁగితిని. కాని మనవంటి నిర్భాగ్యులకు విచారించుటకూడ చాల సిగ్గు. మనచెల్లెలు ధన్యూరాలని యిపుడు తలంచితిని. ఇదివఱకు జరిగిన దానికి విచారించనా, దీనికి విచారించనా ? ముందుకూడ ఇట్టిబాధలే అనుభవింతుము.
"చంటిపిల్ల వాడుకూడ మనకు ఋణసంబంధమె అని తలంచెదను. అయినను మన మేమిచేయగలము ? సౌ. పెద్దవదెన నీవును చాలప్రేమచేత విధికార్యము నెరవేర్చుకొనుచున్నారు. దైవాధీనము తెలియదు...అన్నయ్యా, ధైర్యముగా ఉండు. మనకును ఇక్కడ శాశ్వతం లేదు...నీమనస్సును పాడుచేసుకోవద్దు.
పులుగుర్తు కనకమ్మ"
నరసాపురము, 6 - 8 - 12
"అన్నయ్యకు,
మనచెల్లెలు కామేశ్వరమ్మ పెద్దకుమారుడు విశ్వనాధము చనిపోయెనని తెలుపు అట్లపాడు ఉత్తరము చదువగానె, నామనసు నీరైపోయెను ! కొన్ని నెలల క్రిందట నేనాగ్రామము వెళ్లినపుడు, మనమేనల్లుడు నన్నువదలనేలేదు ! నాతో నర్సాపురం వచ్చెదనన్నాడు - పాపము వానితల్లి గుంటూరునుండి తిరిగి యెపుడో అట్లపాడు వచ్చునను ఆశపెట్టి, యింటిలోనివారు వానిని మరిపించుచుండిరి....వాడును వాని తమ్ముడును మనతోనుండి, విద్యాబుద్ధులు నేర్చి, ముందు మన కానందము కలుగజేతురను ఆశతో నుంటిమి ! చిన్న పిల్లవాడు క్షేమమా ? -
రా. కృష్ణమూర్తి"
13. కలకత్తానివాసము
"గుంటూరు విద్యావిషయక ప్రదర్శనము" 1911 జనవరి నెలలోనె పూర్తియయ్యెను గాని, దాని సంబంధమగు పనులెన్నియో యింకొకసంవత్సరమువఱకును సాగుచునే యుండెను. ప్రదర్శనమున కనుపఁబడిన వస్తువు లెవరివి వారికిఁ బంపవలసివచ్చెను. లెక్కలన్నియు సరిచూపించి, నివేదికవ్రాసి, యచ్చొత్తించవలసి వచ్చెను. ఈలోపుగ కార్యదర్శులలో నిద్దఱు గుంటూరునుండి వెడలి పోవుటచేత, కార్యభార మంతయు నాశిరముననే పడెను. ఆ పనులన్నియు నేను సమగ్రముగ నెఱవేర్చి, తుది బహిరంగసభను జరిపించి, ఈయవలసినవారికి బహుమతు లిప్పించి, కార్యనిర్వాహకసంఘమువారి యనుమతి ననుసరించి మిగిలినసొమ్మును, కాకితములును పాఠశాలా పరీక్షాధికారి కార్యస్థానమున కంపివేసితిని.
1913 వ సంవత్సరారంభమున గుంటూరుకళాశాలోపాధ్యాయులలోఁ గొన్ని మార్పులు గలిగెను. అదివఱ కేండ్లనుండి విరామ మెఱుఁగక పనిచేసిన డాక్టరు ఊలుదొరగారు అమెరికాపోయి