ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/కలకత్తానివాసము

వికీసోర్స్ నుండి

మనమేనల్లుడు నన్నువదలనేలేదు ! నాతో నర్సాపురం వచ్చెదనన్నాడు - పాపము వానితల్లి గుంటూరునుండి తిరిగి యెపుడో అట్లపాడు వచ్చునను ఆశపెట్టి, యింటిలోనివారు వానిని మరిపించుచుండిరి....వాడును వాని తమ్ముడును మనతోనుండి, విద్యాబుద్ధులు నేర్చి, ముందు మన కానందము కలుగజేతురను ఆశతో నుంటిమి ! చిన్న పిల్లవాడు క్షేమమా ? -

రా. కృష్ణమూర్తి"

13. కలకత్తానివాసము

"గుంటూరు విద్యావిషయక ప్రదర్శనము" 1911 జనవరి నెలలోనె పూర్తియయ్యెను గాని, దాని సంబంధమగు పనులెన్నియో యింకొకసంవత్సరమువఱకును సాగుచునే యుండెను. ప్రదర్శనమున కనుపఁబడిన వస్తువు లెవరివి వారికిఁ బంపవలసివచ్చెను. లెక్కలన్నియు సరిచూపించి, నివేదికవ్రాసి, యచ్చొత్తించవలసి వచ్చెను. ఈలోపుగ కార్యదర్శులలో నిద్దఱు గుంటూరునుండి వెడలి పోవుటచేత, కార్యభార మంతయు నాశిరముననే పడెను. ఆ పనులన్నియు నేను సమగ్రముగ నెఱవేర్చి, తుది బహిరంగసభను జరిపించి, ఈయవలసినవారికి బహుమతు లిప్పించి, కార్యనిర్వాహకసంఘమువారి యనుమతి ననుసరించి మిగిలినసొమ్మును, కాకితములును పాఠశాలా పరీక్షాధికారి కార్యస్థానమున కంపివేసితిని.

1913 వ సంవత్సరారంభమున గుంటూరుకళాశాలోపాధ్యాయులలోఁ గొన్ని మార్పులు గలిగెను. అదివఱ కేండ్లనుండి విరామ మెఱుఁగక పనిచేసిన డాక్టరు ఊలుదొరగారు అమెరికాపోయి వచ్చుటకు సంకల్పించుకొనిరి. వారిస్థానమున ప్రకృతిశాస్త్రోపన్యాసకులగు స్ట్రాకుదొరగా రధ్యక్షులయిరి. కళాశాల తరగతులకు ఊలుదొరయు, నేనును ఆంగ్లసాహిత్యమును బోధించువారము. ఆయన పరదేశమున నుండుకాలమున నింగ్లీషునకు నన్ను ప్రధానోపన్యాసకునిగఁ జేయుదు రనుకొంటిని. అట్లుగాక, యీ యుద్యోగమునకు దాత్కాలికముగ నొక క్రొత్తదొరను గొనివచ్చెదరని నాకుఁ దెలిసెను. ఆంగ్ల సాహిత్యబోధనమున నాకెంత యనుభవ నైపుణ్యము లున్నను, యమ్. యే. పరీక్షలో నేను జయమందినఁగాని వృత్తివిషయమున నాకిఁక నభివృద్ధి గలుగదని గ్రహించి, యాపరీక్షకు దీక్షతోఁ జదువ నుద్యుక్తుఁడ నయితిని. పూర్వము విజయనగరమున నాకు శిష్యుఁడును ఇపుడు కొంతకాలమునుండి యీ గుంటూరు కళాశాలలో బోధకుఁడునునైన భమిడిపాటి బంగారయ్య, తానును, తన స్నేహితుఁడగు మండవిల్లి సత్యనారాయణయును, 1913 జూలైనుండి కలకత్తా పోయి, అచట యమ్. యె. పరీక్షకుఁ జదువ నుద్దేశించితిమని చెప్పి, నన్ను కలకత్తా కాహ్వానించిరి. బి. యె. పరీక్షనిచ్చినప్పటినుండియు నేను యమ్. యె. పరీక్షకుఁ బోవ వాంఛించియె యుంటిని. కాని బోధనాకార్యనిమగ్నుఁడ నైయుండినపు డాపెద్దపరీక్షకుఁ జదివి, యందు విజయము గాంచుట దుస్సాధ్య మని తోఁచెను. కావున, నా మిత్రులును, ప్రస్తుతమున కాకినాడకళాశాలలో నుపన్యాసకులునగు శ్రీ వేమూరి రామకృష్ణారావుగారివలెనే నేనును రెండు సంవత్సరములు కళాశాలలో సెలవు పుచ్చుకొని కలకత్తా పోయి, అచటి యే కళాశాలలోనైనఁ జదివినచో, నేనును బరీక్షలో నుత్తీర్ణుఁడనై, ఉద్యోగవిషయమున మంచిలాభము నొందఁగలనని యనుకొంటిని. ఆసంవత్సరము వేసవి సెలవులకు ముందుగ కలకత్తాలో విద్య ముగించు కొని బందరువచ్చిన రామకృష్ణారావుగారిని నేను గలసికొని మాటాడఁగా, కలకత్తాలోఁ జదువుమని నన్ను వారు ప్రోత్సహించిరి.

కాని, నిరతము వ్యాధిగ్రస్తుఁ డగు మాయర్భకుని, నా భార్యను గుంటూరులో విడిచివైచి నే నెట్లు దూరదేశము పోయి చదువు సాగింపఁగలను ? ఈ రెండు వత్సరములును కలకత్తాలో నుండి చదువుకొనుటకు వలసిన సొమ్మెట్లు నాకు సమకూరును ? ఈ సమస్యలు నే నిపుడు పరిష్కరించుకొనవలెను. భార్యను పిల్లవానిని నాతో కలకత్తా యేల గొనిపోఁ గూడ దని నే నంత నాలోచించితిని. అందువలన నచట నాకు వ్యయ మధికమగుట స్పష్టమె కాని, లేనిచో నాకు భోజనసౌకర్యము గలిగి పిల్ల వానిని గూర్చిన యాందోళనము తొలఁగదు గదా ! బంగాళాదేశము ఆయుర్వేదవైద్యశాస్త్రజ్ఞుల కాటపట్టు. వారి సాయమున పిల్లవాఁడు పరిపూర్ణారోగ్యవంతుఁడు కావచ్చును. ఈ కళాశాలాధికారులు నా చదువునకుఁ గొంత సొమ్మిచ్చెదమని చెప్పిరి. కావుననేను కలకత్తాప్రయాణమున కాయితపడితిని. పూర్వము విజయనగరమున నా శిష్యుఁడై, ఇపుడు తర్కమునందు యమ్. ఏ. పరీక్షలో జయమందిన శ్రీజయంతి సత్యనారాయణమూర్తిగారు నాకు బదులుగ నీ కళాశాలలో నీ రెండు సంవత్సరములు పనిచేయ సమ్మతించిరి.

1913 వేసంగిని, కుటుంబసహితముగ నరసాపురము పోయి, అచట మా తమ్ముఁడు కృష్ణమూర్తియింట నివసించితిని. అచట నుండునపుడు పిల్లవాఁడు బాగుగనే యుండెను. కాని, యచటనుండి బయలుదేఱు సమయమున వానికి వ్యాధి యారంభముకాఁగా మార్గమందలి ధవళేశ్వరమున మా తోడియల్లుఁడు పోడూరి కృష్ణమూర్తిగారి యింటఁ గొన్ని దినములు నివసించి, పిల్లవానికిఁ గొంచెము నిమ్మ ళించినపిదప గుంటూరు వచ్చితిమి. డాక్టరు కుగ్లరు పిల్లవానికి మందిచ్చి వ్యాధినివారణఁ జేసి, నేను కలకత్తాప్రయాణము విరమింప నక్కఱ లేదని చెప్పెను. కళాశాలలో నాకు రెండు సంవత్సరములు జీతము ముట్టనిపద్ధతిని సెలవిచ్చిరి. మా తమ్ముఁడు వెంకటరామయ్య నా చదువునకుఁ గావలసిన సొమ్ము ఒసఁగెద ననెను. అందువలన 1913 జూను 20 వ తేదీని నేను కలకత్తా వెడలిపోయితిని. భార్యయు, పిల్లవాఁడును మాబావమఱఁది యుద్యోగస్థలమగు పామఱ్ఱు వెడలిపోయిరి.

నేను కలకత్తా చేరునప్పటికి నా పూర్వశిష్యులు బంగారయ్య సత్యనారాయణగార్లు, హారిసను రోడ్డున నుండు నొక మేడగది పుచ్చుకొని, నన్నచటి కాహ్వానించిరి. మేము మువ్వుర మా గదిలో నివసించితిమి. ఆ మేడభాగమున తక్కిన గదులలోఁగూడ నాంధ్ర యువకులె యుండిరి. వీరందఱును ఒక యోడ్రబ్రాహ్మణునిచే మేడమీఁద వంట చేయించుకొని భుజించువారు. వీరిలో పెక్కండ్రు నా పూర్వశిష్యులె. వీ రందఱు నా కిపుడు సహవాసులైరి. నేను దొరతనమువారి రాజధానీ కళాశాలలోఁ జేరితిని. మా తరగతిలో నలువదిమంది విద్యార్థులు గలరు. వీరందఱిలో వయసున నేనె పెద్దవాఁడను.

ఇరువదియేండ్లు ఉపాధ్యాయునిగ నుండి నలువదియేండ్లు దాఁటిన నేను, పరదేశమున మరల పుస్తకములు చేతఁబట్టి, నాకంటెఁ జిన్న వార లగు గురువులయొద్ద శుశ్రూష చేయుటకై యనుదినమును విద్యాశాలకుఁ బోయి వచ్చుచుండుట మొదట కడు దుస్సహముగ నుండెను. దీనికిఁ దోడు మా భోజనశాలలోని భోజనము నాకంతగ సరిపడలేదు. గోదావరిమండలమున మాఱుమూల నుండు నొక కుగ్రామమున భార్యయుఁ, బసివాఁడును నెటు లుండిరో యని సదా డెందమున నలజడిగ నుండెడిది. కాని, పరిచితులు మిత్రులు నగు నాంధ్రులు నన్నుఁ బరివేష్టించియుండుటచేత, నేనెటులో యామూఁడు నెలలును పరదేశమునఁ గడపి, దుర్గపూజ సెలవులకు గోదావరిజిల్లా వెడలివచ్చితిని.

ఆ దసరాసెలవులలో పామఱ్ఱులో నివసించి, అక్టోబరునెలలో భార్యను, పిల్ల వానిని దీసికొని కొంత సామగ్రితో నేను కలకత్తా పోయిచేరితిని. బంగారయ్యయు సకుటుంబముగ నిపుడు కలకత్తా వచ్చుటచేత, మే మిరువురమును ముక్తారామబాబువీథిలో నొక చిన్న యింట బసచేసితిమి. ఈమాఱు నామనస్సునకుఁ గొంత నెమ్మది గలిగెను. వైద్యులకుఁ బిల్లవానినిఁ జూపించి, వారిచే మందు లిప్పించితిని. మాతమ్ముఁడు వెంకటరామయ్య మమ్ముఁ జూచిపోవుటకు 1914 వ సంవత్సరారంభమున కలకత్తావచ్చి, ఆవేసవిని భీమవరమునకు మమ్మాహ్వానించెను.

1914 వేసవి మేము భీమవరమునఁ గడిపితిమి. మాతమ్ముఁడపు డారంభించిన నూతన గృహనిర్మాణమున నేనాతనికి సాయము చేసితిని. ఒకచేతఁ బుస్తకమును, ఒకచేతఁ బిల్లవానిని దీసికొని, కనులు పనివారలమీఁద నుంచి, నే నా సెలవుదినములు గడపితిని. సెలవులు ముగియునప్పటి కిల్లు దాదాపుగఁ బూర్తియయ్యెను కాని, తుది దినములలో మాకుఁ గొంత మనశ్శాంతి తొలఁగిపోయెను. వెంకటరామయ్య మూఁడవకుమారుఁడు సూర్యనారాయణ కపుడు ఐదారేండ్ల వయస్సు. వాఁడు బాల్యచాపల్యమున నెండలో నల్లరిగఁ దిరుగుచు, కనఁబడినకాయకసరులు నమలుచుండుటచేత, వాంతులు విరేచనములును వాని నమితముగ బాధించెను. వానివ్యాధినివారణము మిగుల కష్టసాధ్యమయ్యెను. నెమ్మదిపడినపిమ్మటకూడ వాఁడతి నీరస స్థితిలోనుండెను. ఇంతలో మేము పెంచెడి యర్భకునికిని జబ్బు చేసెను. వానికిఁ గొంత నెమ్మది కలగుఁగనే మేము కలకత్తా ప్రయాణమైతిమి.

ఆ జూలయినెల జరిగినపిమ్మట పిల్ల వానికి కలకత్తాలోఁ జాల జబ్బుచేసెను. కొన్నిదినములవఱకు వానిప్రాణములమీఁది యాస వదలుకొంటిమి. కాని, యొకకవిరాజుయొక్కయు నాకు మిత్రులైన డాక్టరుప్రాణ కృష్ణాచార్యులవారియు సాయమువలన, వాని, కారోగ్యము కలిగెను.

ఆ సంవత్సరము దుర్గపూజ సెలవులలో మేము మువ్వురము కాశి, గయ, ప్రయాగ క్షేత్రములు సందర్శించి వచ్చితిమి. గయలో కర్మకాండ ముగించి, బుద్ధగయ చూచితిమి. బుద్ధభగవానుఁడు తపస్సు చేసికొనిన మఱ్ఱిచెట్టునీడనె యానాఁడు నాచదువును, మాపిల్లవాని సాపాటును జరిగెను. బౌద్ధదేవాలయము హిందూధర్మకర్తల పరిపాలన మందుండుటయు, దేవళముచుట్టును హిందూవిగ్రహాదులు వెలయుటయు నా కమితాశ్చర్యమును గొలిపెను. అచ్చటినుండి మేము కాశివెళ్లి యొక వారము నిలిచితిమి. ఒక మణికర్ణికాఘట్టమునొద్ద స్నానముతోనే నేను సంతృప్తుఁడనైతిని. పుణ్య క్షేత్ర సందర్శనమునకంటె నాకు పరీక్షావిజయమె మోక్షదాయకముగఁ దోఁచెను ! కలకత్తాలోకంటె కాశిలో నా కెక్కువగ దక్షిణదేశపుఁ బోలికలు గాన వచ్చెను. ఇచట దాక్షిణాత్యు లనేకులు గలరు. ఒకనాఁడు మేము వ్యాసకాశి పోయి, రాజుగారిభవనమును జూచివచ్చితిమి. దీనికేమి గాని, కాశిలో కోఁతులబాధ యమితముగఁ గానవచ్చెను. అచట నరులమీఁద వానరులె యధికారము చెల్లించున ట్లగపడెను. ఒక నాఁడు మేడ డాబామీఁద నేను గూర్చుండి చదువుకొనుచుండఁగా, భార్య నాచెంత నెండవేసిన చీరను కోఁతియొకటి మెల్లగఁ బట్టుకొని పాఱిపోయెను. తనకు లాభములేని పనులలోఁ బ్రసక్తి ప్రమోదములు గలిపించుకొనుట యనుదుర్గుణము, నరునిజూచి వానరముగ్రంహిచెనా, వానరమునుండి నరునికి సంక్రమించెనా యని నే నాశ్చర్యమందితిని !

కాశినుండి మేము ప్రయాగ వెళ్లితిమి. గంగాయమునా సంగమ ప్రదేశ మత్యంత రమణీయముగ నుండెను. అచట మిగుల పెద్ద తాఁబేళ్లను జూచి యాశ్చర్య మందితిమి. అ పురమందలి యాంధ్రప్రముఖు లగు శ్రీ చింతామణిగారి వొకనాఁడు సందర్శించి వచ్చితిని. వారు నాకు మద్రాసులో పరిచితులు. తమిళులు మున్నగు పొరుగు జనులతో నాంధ్రులు పోటీచేసి గౌరవస్థానము గడించుట కర్తవ్యమని వారు చెప్పిరి. మే మంతట గృహోన్ముఖుల మైతిమి. దీపావళినాఁడు మేము తిరుగుపయనము చేసితిమి. రాత్రి యంతయు పంజాబుమెయిలు వాయువేగమునఁ బరుగులెత్తెను. దారిపొడుగునను దీపములచే నలంకృతముగాని రెయిలు స్టేషనుగాని, పట్టణపక్కణములు గాని మాకుఁ గానుపింపలేదు. దీపావళి హిందూజాతికంతకును ప్రధానమైన పండుగయని మా కానాఁడు దృగ్గోచర మయ్యెను !

1915 ఫిబ్రవరిమాసాంతమునకె నా కళాశాల చదువు సంపూర్తి యయ్యెను. సకుటుంబముగ నే నంత గుంటూరువచ్చి వేసితిని. నా పుస్తకములు సామానులును వేసియుండు కొట్టు తాళము తీసి చూడఁగా, ఒక బీరువా చదులు పట్టిపోయెను. విలువగల నా వెనుకటి రచనముల వ్రాఁతప్రతులు, పత్రికా సంపుటములు కొన్నియును చదపురుగుల కాహార మయ్యెను. తాత్కాలికముగ మే మొక యింటిభాగమునఁ గాఁపురముంటిమి. నేను కళాశాల చేరి నా పనులు చూచుకొనుచువచ్చితిని. వేసవి సెలవు లీయఁగనె మేము వెలిచేరు వెళ్లితిమి. అచట మా యత్త మామలు, బావమఱఁది కుటుంబమువారు నుండిరి. మా బావమఱఁది పెద్దకొమార్తె చంద్రమతిని మామఱఁదలు చామాలమ్మ కుమారుఁడు కృష్ణారావునకుఁ బెండ్లిచేయ నిశ్చయ మయ్యెను. ఆలగ్నముననే మా తమ్ముఁడు కృష్ణమూర్తి పెద్ద కొమార్తె సీతమ్మవివాహముకూడ జరుగవలసియుండెను. నే నీ పెండ్లి వేడుకలలోఁ బడిపోయితినేని, నా చదువు వెనుకఁబడునని భయపడి, జూను నెల తుదినే నేనొక్కఁడను కలకత్తా వెడలిపోయి, అక్కడ ద్రావిడ భోజనశాలాధికారి శ్రీనివాస అయ్యరున కతిథినై, ఆదాత యిడిన గదిలోఁ జదువు సాగించితిని. మిత్రుఁడు బంగారయ్య చెంతయింట సకుటుంబముగ నుండెను. నే నతి దీక్షతోఁ జదివి, పరీక్ష కేగితిని. పరీక్ష పూర్తియైనతోడనే నేను గుంటూరు వచ్చి కళాశాలలో ప్రవేశించితిని.

14. "చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు"

నేను కలకత్తాలో నుండినకాలమున నాకు "మద్రాసు స్టాండర్డు" దినపత్రిక వచ్చుచునేయుండెను. అక్కడ విద్యార్థిగ నుండి ప్రాఁతవడిన కలకత్తావార్తల నంపుటకంటె, చెన్నపురి రాజధాని వాఁడనగు నాకన్నుల కచట నగఁబడిన వింతలు వ్రాయుట సమంజసముగఁ దోఁచి, "చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు" అను శీర్షికతో నప్పుడప్పుడు వినోదకరములగు సంగతులు వ్రాయుచుండువాఁడను. ఈమకుటముక్రింద వ్రాసిన వ్యాసములలో, "మాతృభాషా ప్రయోగము" అనునది మొదటిది కాకపోయినను, మొదటివాని