ఆత్మచరిత్రము/చతుర్థభాగము : విశ్రాంతిదశ/హరిజనోద్యమము

వికీసోర్స్ నుండి

భీమవరము వెళ్లునప్పటికి నాచరిత్రమునందలి ప్రథమభాగము శుద్ధప్రతి వ్రాసి, భీమవరము నరసాపురముల కదితీసికొనిపోయి, నాసోదరీసోదరులకును, ఒకరిద్దఱు మిత్రులకు నది చదువనిచ్చితిని. అంత నా నవంబరు డిసెంబరు నెలలలో మిగిలిన మూఁడుభాగములును బూర్తిపఱిచితిని. వాని శుద్ధప్రతిని వ్రాయుటకే నా కెంతో ప్రయాసకలిగెను.

1932 వేసవిని దంపతుల మిరువురమును భీమవరములో నుంటిమి. మాతమ్ముఁడు వెంకటరామయ్య కుటుంబమును మేమును గలసి మాక్రొత్తయింట నివసించితిమి. ఇంటఁ గొన్ని మరమ్మతులు చేయించితిమి. నాభూముల శిస్తులు పోగుచేయుచును, భూముల వమరకపఱచుచును, నేను వేసవిని భీమవరప్రాంతములందుఁ గడపితిని.

ఇటీవలనే ఢిల్లీలోజరిగెడి దేశీయమహాసభ కేగుటకుఁ బ్రయత్నించుటవలన నానగరమునఁ గారాగారాబంధితులై విడువఁ బడియు, మరల జూనునెలలో గుంటూరులో రక్షకభటులచే బంధితులయిన కొండ వెంకటప్పయ్యగారి దేహారోగ్యవిషయమై యాయనబంధువులు మిత్రులును మిగుల నలజడిపడిరి. వెంకటప్పయ్యగారిభార్యకును దేహములో రుగ్ణత హెచ్చెనని మాకుఁ దెలియవచ్చెను.

4. హరిజనోద్యమము

1931 వ సంవత్సరమధ్యమున నేను రచించిన "వీరేశలింగసంస్మృతి" ఆంధ్రవిశ్వవిద్యాలయమువారి ప్రాపుగాంచ నేరకున్నను, చెన్నపురి సర్వకళాశాలవారి యాదరణ భాగ్యమును గొంత చవిచూచెను. 1934 వ సంవత్సరమందలి యింటరు మీడియేటుపరీక్ష కాంధ్రమున నీపుస్తక మొక పఠనీయ గ్రంథముగ నియమింపఁబడెను. కాని, చెన్నపురి విశ్వవిద్యాలయమున నాంధ్రవిద్యార్థులు మిక్కిలి తక్కువగ నుండుటచేత నాపుస్తక ప్రతులు కొలఁదిమాత్రమె యమ్ముడువోయెను.

1932 జులై మొదటితేదీని నాతమ్ముఁడు వెంకటరామయ్యయు, నరసింహము, నాపత్నియు వెంటరాఁగా, నేను గోదావరి పుష్కరమునకై రాజమంద్రి పోయి నదీస్నానముచేసితిని. జన సమ్మర్దము విశేషముగ నుండెడి యా పట్టణమున నుండుట కిష్టము లేక, ఆరాత్రియె మరల మేము భీమవరము వచ్చితిమి. పారిశ్రామిక ప్రదర్శనోత్సవ సందర్భమున రాజమంద్రిలో కోటిలింగములయొద్ద జరిగిన బహిరంగసభకు మేము పోయి, పలువురు ప్రాఁతనేస్తులను జూచితిమి. నాభార్య తన చెల్లెండ్రపిల్ల లను జూచుటకై కొవ్వూరులో దిగెను.

ఇటీవల నొకసంవత్సరము చదువు నిలిపివేసిన జనార్దనము మరల నిపుడు వైద్యవిద్యకొఱకు చెన్నపురి కేగెను. బి. యలు. పరీక్ష పూర్తిచేయుటకు నరసింహమును, యఫ్. యలు పరీక్ష తరగతిలో ప్రవేశించుటకు సుబ్బారాయఁడును చెన్నపురికి వెళ్లిరి. నేను జులై 17 వ తేదీని గుంటూరు వచ్చితిని. తన వృత్తి పనులతోపాటు కుటుంబపరిపోషణకార్యము నెఱపుచు తమ్ముఁడు వెంకటరామయ్య భీమవరములో నిలిచియుండెను.

ఈ మాఱు చదువుటకై నారాయణ యొక్కఁడు మాత్రమె గుంటూరు వచ్చెను. వానితోఁబుట్టువు లిరువురును రాలేదు. మాలతి చదువు మాట మఱచిపోయి, పుట్టినింట తన దుర్దశను జ్ఞప్తికిఁదెచ్చుకొని మరల వనటఁ జెందుచుండెనని మేమును, నా తమ్ములును దలంచి, ఆమెనుగుఱించి ఖేదపడితిమి. కొలఁది మాసముల క్రిందటనే యొకపుత్రుని గోలుపోయి తాను జబ్బుపడి యిపుడె స్వస్థతఁ జెందుచుండు మఱఁదలు చామాలమ్మ రెండవకూఁతురు చంద్రమతి తన చిన్నకుమ్మాళ్లను వెంటఁబెట్టుకొని, గుంటూరువచ్చి, ఆగష్టునెలలో కొన్నిదినములు మాతోనుండెను. కాని, యధిక వర్షములచేతనో మఱి యేకారణమువనననో యామెకును, రెండవ పిల్ల వానికిని జ్వరము దగ్గును కలిగి, మిగుల బాధపడిరి. చేరువనుండు నొక వైద్యుని సాయమువలన వారికి స్వస్థత కలిగెను.

మా మఱఁదలు చామాలమ్మ ఆగష్టు 9 వ తేదీని నెల్లూరు కారాగృహమునుండి విడుదలయై, గుంటూరువచ్చి మాతోఁ గొన్ని దినములుండెను. కన్ననూరు నెల్లూరు కారాగృహములలో రాజకీయ ఖైదీలగు స్త్రీలు బాలికలు నెట్లు కాలము గడుపుచుండిరో యామె చెప్పెను. మిక్కిలి లేఁతవయస్సుననుండు స్త్రీలు సయితము తమ కష్టములను బొత్తిగ లెక్కసేయక, స్వదేశోద్ధరణమునుగుఱించి కారాగారముల కేగుచుండిరని యామె చెప్పెను.

మాపెరఁటిలో నిపుడు యానాదుల ఉటుంబము కాపుర ముండెను. వాండ్రకు మేమిచ్చెడిది నెలకు నాలుగు రూపాయిలె యయ్యును, వారుండుటవలన మాకు మిగులసౌఖ్యము గలిగెను.

ఈ సెప్టెంబరు 10 వ తేదీని నేను గుంటూరుమండలబోధక సమాజమువారి సంవత్సరోత్సవసందర్భమున "బోధకుల ప్రస్తుతకాల సమస్యలు" అను శీర్షికతో నొక యాంగ్లవ్యాసము వ్రాసి చదివితిని. మనదేశమున స్థానికప్రభుత్వసంస్థలు రాజకీయవిషయములందెకాక, విద్యావిషయములందును దేశమున దసంతృప్తిని గలిగించుచున్నవని నేను జెప్పితిని. పనియుండునపుడె, మనకు మఱింత పనిగలుగుచుండును. ఆ నెల తుది దినమున గుడివాడలో జరిగిన "కృష్ణామండల బోధకసమాజ" వార్షికసభకు నా కంత నాహ్వానము వచ్చెను. నే నచటి కేగి, నా పూర్వశిష్యులగు శ్రీ ఉప్పులూరి ఆదినారాయణమూర్తిగారి యింట బసచేసితిని. "విద్యాబోధకులకుఁ గొన్ని హితవచనములు" అను మకుటముతో నేనొక యాంగ్లవ్యాసము వ్రాసి, ఆసందర్భమునఁ జదివితిని.

ఇది జరిగిన కొలఁది దినములకే నా కింకొక దిశనుండి పిలుపు వచ్చెను. వేటపాలెమునందలి "సారస్వతనికేతనపు" జయంతోత్సవ సమయమున నన్నగ్రాసనాధిపత్యము వహింపుఁడని, ధర్మకర్తయగు శ్రీ. ఊ. వెం. శ్రేష్ఠిగారు కోరిరి., అంతియ కాక, యా సమయమున స్త్రీలసభ యొకటి జరుగునుగాన, దానికిఁగూడ నన్నే యేర్పాటులు చేయుఁడనిరి. కాఁబట్టి దసరా పండుగరోజున (9-10-32 ఆదివారము) నా భార్యయు, కొండ వెంకటప్పయ్యగారి రెండవ కొమార్తె పార్వతమ్మయును గలసిరాఁగా, నేను వేటపాలెము వెళ్లితిని. "ప్రస్తుత హిందూసంఘ పరిస్థితులు" అను నొక యాంధ్రవ్యాసము వ్రాసి, నేనా దినమున సభలోఁ జదివితిని. మఱునాఁటి స్త్రీలసభలో నాతో గుంటూరునుండి వచ్చిన యిరువురు స్త్రీరత్నములును నుపన్యాసము లిచ్చిరి. 11 వ తేదీని మే మందఱమును బాపట్లవచ్చి, బంధువగు సత్తిరాజు రామచంద్రరావుగారియింట బసచేసితిమి. స్త్రీలకొక యుపన్యాసమీయుఁడని శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు కోరఁగా, "స్త్రీహితైషిణీ మండలి" సమాజసభలో "స్త్రీల ప్రస్తుతవిధులు" అను విషయమును గుఱించి నేను బ్రసంగించితిని. ఆరాత్రి రెయిలులో బయలుదేఱి, మేము గుంటూరు తిరిగి వచ్చితిమి. పై సభలలో నేను "అస్పృశ్యతానివారణము" ను గుఱించి నొక్కి చెప్పితిని. దీనికిఁ గారణము లేకపోలేదు. భ్రిటిషుదొరతనము వారు నూతనరాజ్యాంగసంస్కరణములందు అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గము లేర్పఱుచుటవలన, ఇదివఱకు సాంఘికముగ జరిగిన కీడునకుఁ దోడుగ, ముందునుండి రాజకీయముగఁగూడ నస్పృశ్యుల కనర్థము గలుగుననియు, వారు హిందూసంఘమునుండి శాశ్వతముగ విడిపోవుదురనియును దలంచి, యీ యనర్థము హిందూదేశమునకు వాటిల్ల కుండుట కై తాను ప్రాయోపవేశము చేతు నని గాంధీమహాత్ముఁడు యరవాడ చెరసాలలో సెప్టెంబరు 20 వ తేదీనుండి నిరాహారదీక్ష నారంభించెను. గాంధిమహాత్ముని నిరహారదీక్ష దేశము నంతటిని కలవరపఱిచెను. దేశమునం దంతటను మహాసభలు జరిగి, తీర్మానములు గావింపఁబడెను. పునహాలో జరిగిన రాజీవలన నీవిషయమున దొరతనమువారు తమ నిర్ధారణమును గొంతవఱ కుపసంహరించుకొనిరి. గాంధిమహాత్ముఁడు 7 వ దినమున ఆహారము స్వీకరించెను. దేశమంతయు నంతట శాంతినొందెను.

ఆ సెప్టెంబరు 20 వ తేదీని దేశములో ననేకప్రదేశములందు వలెనే మాయింటఁగూడ మేము ముగ్గురమును ఉపవాసముచేసితిమి. నాకు పిలుపురాఁగా పురమందిరమున నస్పృశ్యతానివారణమును గుఱించి జరిగిన మిత్రులసభకు నేను బోయితిని. నాఁటిసభకు నే నధ్యక్షుఁడనయితిని. అస్పృశ్యత తొలఁగిపోవుటకై పంచములతోఁ గలసి భజనలు ప్రార్థనలు నూరేగింపులును జరుగుట యవశ్యమని మేము నిశ్చయించుకొంటిమి.

ఆమఱునాఁడె యువకులగు మా మిత్రులు కొందఱు పంచములను దీసికొని, అరండలుపేట బ్రాడీపేటలలోఁగల సర్కారుబావులను వారలచే తాకించిరి. కొన్నిగృహముల కంటియుండు నూతులుకూడ యజమానుల యంగీకారముచే పంచములు స్పృశించిరి. మాబావికిఁ గూడ నీభాగ్యము పట్టెను !

ఆమఱునాఁడు గుంటూరు మైదానమున జరిగిన "అస్పృశ్యతా నివారణసభ" కనేకులు వచ్చిరి. నన్ను మరల నగ్రాసనాసీనునిఁ జేసిరి. ఈ సంస్కరణమునుగుఱించి ప్రస్తుతపుసంగతులు నేను విరళముగఁ జెప్పితిని. ఈరెండుదినములును నిరశనవ్రతము సలుపుచుండు ఉన్నవ లక్ష్మీనారాయణగారు తీవ్రముగ మాటాడిరి. సభికులు మిక్కిలి యుత్సాహముతో నుండిరి.

ఇంకఁ గొన్ని దినములపిమ్మట "పురపాలకపుస్తకాలయము"న జరిగిన సభలో "గుంటూరుమండల హరిజనసేవాసమితి" యేర్పడెను. ఈ సమితికి నన్ను అధ్యక్షునిగను, శ్రీయుత కొల్లి సత్యనారాయణ మల్లాది యజ్ఞనారాయణశాస్త్రిగార్లను కార్యదర్శులగను నియమించిరి. అప్పటినుండియు మాసంఘ యాజమాన్యమున జరిగిన బహిరంగసభలలో నేను అస్పృశ్యతానివారణమును గూర్చి తఱచుగ మాట్లాడుచు వచ్చితిని.

అక్టోబరు 9 వ తేదీని బెజవాడలో శ్రీ న్యాపతి సుబ్బారావుగారి యాధిపత్యమున జరిగిన మహాసభలో "ఆంధ్రహరిజనసేవా సంఘసమితి" నెలకొల్పఁబడెను. దానికి దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావుపంతులుగారు అధ్యక్షులుగను, మాగంటి బాపినీడు గారు మున్నగు ముగ్గురు కార్యదర్శులుగను ఏర్పడిరి. కార్యనిర్వాహకసభలో సభ్యునిగను, సమితి ప్రచారకులలో నొకనినిగను నన్ను గోరుకొనిరి. 17 వ అక్టోబరున నేను కూచిపూడిగ్రామమువెళ్లి, అచట నెలకొల్పఁబడిన "సేవాసమితి" సభ కగ్రాసనాధిపత్యము వహించితిని. నాతో శ్రీమాగంటి బాపినీడుగారుకూడ నుండిరి. మే మాదినముననే సాయంత్రము తెనాలిలో నొక బహిరంగసభలో నుపన్యసించితిని.

అక్టోబరు 30 వ తేదీని శ్రీ న్యాపతి సుబ్బారావుగారు రాజమంద్రిలో తమయింట నొక సభగావించిరి. నాకుఁ బిలుపురాఁగా నే నచటికేగితిని. హిందూ మతోద్ధరణము జరుపుటకు దేశములోఁ గొందఱు యువకులను మతప్రచారకులనుగ సిద్ధముచేయుటకై యొక యాశ్రమమును రాజమంద్రిలో స్థాపింప వలెనని పంతులుగారి యుద్దేశము. అందు గౌరవబోధకులుగను, వ్యవహారకర్తలుగను నుండుఁడని నన్నును, శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తిగారిని వారు కోరిరి. మేము సమ్మతించితిమి. ఈ యుద్యమ నిర్వహణమునకు పంతులుగారు తమతోఁట నిచ్చెదమనియు, వలసిన సొమ్మునకై తిరిగెదమనియుఁ జెప్పిరి. వారు 10 వేలకు తక్కువగాకుండ నిలువ ధనము నిచ్చినచో, త్వరలో నిట్టి సంస్థ యేర్పడఁ గలదని నేను జెప్పివేసితిని.

రాజమంద్రినుండి నేను భీమవరము నరసాపురములు వెళ్లి, తమ్ములను, తక్కిన వారలను జూచి, తిరిగి 7 వ నవంబరుకు గుంటూరు వచ్చితిని.

12-13 తేదీలలో జరిగిన "ఆఱవ ఆంధ్రరాష్ట్రీయ మహిళాసభకు" ప్రతినిధిగా నా భార్య రాజమంద్రి వెళ్లి, అక్కడనుండి తనపుట్టినిల్లగు వెలిచేరు పోయి, 18 వ తేదీకి గుంటూరు వచ్చెను. ఆమెతో మాలతియును, మా బావమఱఁది యిద్దఱు కోడండ్రును, గుంటూరు వచ్చిరి. నేను నవంబరు 18 వ తేదీని బెజవాడవెళ్లి, అక్కడనుండి శ్రీ నాగేశ్వరరావుపంతులుగారితో ఏలూరుపోయితిని. బెజవాడకు 19 వ తేదీ యుదయమునకు వచ్చిన ఆంధ్రవిశ్వవిద్యాలయ వైసుచాన్సెలరుగారగు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణయ్యగారితోఁ గలసి మాట్లాడితిని. ఏలూరులో "ఆంధ్ర హరిజన సేవాసమితి" వారి కార్యనిర్వహకసభకుఁ బోయితిని. ఆసాయంకాలము ఏలూరులో జరిగిన బహిరంగసభలో మిత్రులతో నేనును "అస్పృశ్యతానివారణమును" గుఱించి యుపన్యసించితిని.

శ్రీ నాగేశ్వరరావుగారు నా "ఆత్మచరిత్రమును" తమ యాంధ్రగ్రంథమాలా కుసుమములో నొకటిగా స్వీకరించి ముద్రింతు మనిచెప్పిరి. వారికోరికమీఁద "ఆంధ్రపత్రిక" కు క్రొత్తవ్యాసములు వ్రాయుదునని పలికితిని.

"నా పూర్వపరిచితులు" అను శీర్షికతో నే నంతట కొన్ని వ్యాసములు "ఆంధ్రపత్రిక"కు వ్రాయ నిశ్చయించుకొని, వేదము వెంకటాచలయ్య, మన్నవ బుచ్చయ్యపంతులు మున్నగువారల సంగ్రహ జీవితములు వ్రాసి, ఆంధ్రపత్రికలో ముద్రింపించితిని.

"ఆంధ్రహరిజనసేవాసమితి" ప్రచారకవర్గమునుండి పిలుపురాఁగా, నేను నవంబరు 27 వ తేదీని గుడివాడవెళ్లి, అచ్చట 28 వ తేదీని, ఆ మఱునాఁడు బందరులోను, మూఁడవరోజున చవటపాలెములోను జరిగిన సభలలోఁ బాల్గొంటిని. ఇట్లు విశ్రాంతి ననుభవించుచుండు నేను, పరిస్థితులప్రభావమున వ్యాసములు వ్రాయుటకును, ఉపన్యాసము లిచ్చుటకును బూనుకొని, దేశాటనమునకుఁ గడంగితిని. ఇట్లే ఆ డిశంబరు 9 వ తేది మొదలు 17 వఱకును నేను పై సమాజ ప్రచారకవర్గముతోఁగూడి విశాఘపట్టణము, చోడవరము, అనకా పల్లి, విజయనగరము, శ్రీకాకుళము, ఛత్రపురము, బరంపురము, పర్లాకిమిడిపట్టణములకుఁ బోయి, అచట అస్పృశ్యతానివారణమును గుఱించి జరిగిన సభలలో పాల్గొంటిని. నేనిదివఱకు కళాశాలాధ్యాపకుఁ డనుగనుండిన పర్లాకిమిడి విజయనగరముపురములలోను, తదితర ప్రదేశములలోను ప్రాఁతస్నేహితులను, ప్రాఁత విద్యార్థులను జూచి మిగుల సంతోషించితిని.

డిసెంబరు 28 వ తేదీని గుంటూరునకు "అఖిలభారత హరిజన సేవకసమాజము" వారి కార్యదర్శియగు అమృతలాలు ధక్కరుగారు స్నేహితులతో గుంటూరువచ్చి యొకరోజు నిలిచియుండిరి. ఆ సమయమున మా తమ్ముఁడు వెంకటరామయ్యయును వచ్చెను.

అస్పృశ్యతానివారణోద్యమమును గుఱించి ప్రచారము చేయుట నా కిపుడు నిత్యవిధి యయ్యెను. జనవరి 6 వ తేదీని నేను, నా పూర్వమిత్రులగు బంకుపల్లి మల్లయ్యశాస్త్రులు గారితోఁగలసి నరసారావుపేట వెళ్లి, అక్కడ సభచేసి వచ్చితిని. 12 వ తేదీని కట్టెంపూడిలోను, చేరువనుండు తాళ్లపాలెము పంచమాశ్రమము నందును సభలు చేసితిమి. ఈ పంచమాశ్రమవాసులు శ్రీ బాపినీడు, రంగనాయకులు మున్నగు వారికిని నాకును ఫలాహారములిడిరి.

తమ్ముఁడు కృష్ణమూర్తికి జ్వరము వచ్చుచుండెనని తెలిసి, నేను 1933 సం. జనవరి 16 వ తేదీని నరసాపురము వెళ్లితిని. అతనికి క్రమముగ నెమ్మదిపడఁగా, ఆప్రాంతములకు ప్రచారమునకు వచ్చిన శ్రీయుతులు నాగేశ్వరరావు, బాపినీడు, చెరుకువాడ వెంకట నరసింహముగార్లతోఁ గలసి, నరసాపురము, భీమవరము, వేండ్ర, తణుకు మున్నగు ప్రదేశములుపోయి, అస్పృశ్యతానివారణమును గుఱించిన సభలలో పాల్గొని వచ్చితిని.

మరల పై ప్రచారకసంఘమువారితోఁ గూడి, 6 వ ఫిబ్రవరిని మద్రాసు బయలుదేఱి, గుంటకల్లు, ఉరవకొండ, అనంతపురము, ధర్మవరము, మదనపల్లియును తిరిగితిని. పోవునపుడును వచ్చునపుడును చెన్నపురిలోని మా పిల్లవాండ్రను జూచితిని. నెల్లూరు, అల్లూరు, కావలిలోను, శ్రీ బాపినీడుగారితో సంచారముచేసి, నేను 19 వ తేదీకి గుంటూరు వచ్చితిని. మార్చి 10 వ తేదీని గుంటూరులో మా యింట జరిగిన "మండల హరిజన సేవాసమితి" మహాసభలో నూతన సంవత్సరమునకుఁ గ్రొత్తకార్య నిర్వాహకవర్గ మేర్పడెను. ఈ వేసవియందును, ముఖ్యముగ గాంధీమహాత్ముని యుపవాసకాలమందును, నేను భీమవరము ప్రాంతములందు హరిజనోద్యమ ప్రచారమును సలిపితిని.

సింహావలోకనము

'కథ కంచెకుఁబోయి, మన మింటికివచ్చు' సమయ మయినది. తెంపులేని యీ దీర్ఘ వృత్తాంతము నోర్పుతో నూఁకొట్టిన పాఠకసుజనుల వీడ్కోలు నే నందవలయును. జీవితమందువలెనే నాజీవితచరిత్రమందును గల లోపములు వా రిపు డెఱుఁగనివి లేవు. నాకు సాధ్యమయినరీతిని నా జీవితకథను జెప్పితిని. పాఠకు లిందలి మంచిని గ్రహించి, చెడు గున్న సైరింతురుగాక !

వయోవిద్యానుభవములతో నాగుణశీలముల కెట్టి పరిణామము గలిగెనో చదువరులు గమనించియున్నారు. అన్నిటికంటెను నామత విశ్వాసములందలి పరివర్తనమె మిగుల స్ఫుటముగఁ దోఁచును. బాల్య కాలమునందలి వైష్ణవక్రైస్తవవిశ్వాసములు యౌవనమున బ్రాహ్మప్రార్థనసమాజాదర్శరూపము దాల్చినను, పూర్వవాసనలు పిమ్మట పూర్తిగ వీడెనని కాని, పరిణామకార్య మింతలో నిలిచిపోయె నని కాని చెప్ప వలనుపడదు. లోకానుభవము హెచ్చినకొలఁది, బ్రాహ్మమతోద్బోధకమగు పరిశుద్ధాస్తికాదర్శముల పోకడలు, బ్రాహ్మసమాజమునందెకాక, మాతృసంఘమునందును నా కనులకు గోచరించెను. ఇంతియకాదు. కొన్ని సమయములందు క్రొత్తగ వెలసిన సమాజములలో నూతనాశయములు వేవేగమె వన్నెవాయుటయు, మాతృసంఘమె యుదారనవీనభావములతో భాసిల్లుటయు మనము కాంచుచున్నాము. కావుననే, హిందూమతముపట్ల యౌవనమున