Jump to content

ఆత్మచరిత్రము/చతుర్థభాగము : విశ్రాంతిదశ/సింహావలోకనము

వికీసోర్స్ నుండి

సింహావలోకనము

'కథ కంచెకుఁబోయి, మన మింటికివచ్చు' సమయ మయినది. తెంపులేని యీ దీర్ఘ వృత్తాంతము నోర్పుతో నూఁకొట్టిన పాఠకసుజనుల వీడ్కోలు నే నందవలయును. జీవితమందువలెనే నాజీవితచరిత్రమందును గల లోపములు వా రిపు డెఱుఁగనివి లేవు. నాకు సాధ్యమయినరీతిని నా జీవితకథను జెప్పితిని. పాఠకు లిందలి మంచిని గ్రహించి, చెడు గున్న సైరింతురుగాక !

వయోవిద్యానుభవములతో నాగుణశీలముల కెట్టి పరిణామము గలిగెనో చదువరులు గమనించియున్నారు. అన్నిటికంటెను నామత విశ్వాసములందలి పరివర్తనమె మిగుల స్ఫుటముగఁ దోఁచును. బాల్య కాలమునందలి వైష్ణవక్రైస్తవవిశ్వాసములు యౌవనమున బ్రాహ్మప్రార్థనసమాజాదర్శరూపము దాల్చినను, పూర్వవాసనలు పిమ్మట పూర్తిగ వీడెనని కాని, పరిణామకార్య మింతలో నిలిచిపోయె నని కాని చెప్ప వలనుపడదు. లోకానుభవము హెచ్చినకొలఁది, బ్రాహ్మమతోద్బోధకమగు పరిశుద్ధాస్తికాదర్శముల పోకడలు, బ్రాహ్మసమాజమునందెకాక, మాతృసంఘమునందును నా కనులకు గోచరించెను. ఇంతియకాదు. కొన్ని సమయములందు క్రొత్తగ వెలసిన సమాజములలో నూతనాశయములు వేవేగమె వన్నెవాయుటయు, మాతృసంఘమె యుదారనవీనభావములతో భాసిల్లుటయు మనము కాంచుచున్నాము. కావుననే, హిందూమతముపట్ల యౌవనమున నాకుఁ గలిగిన నిరసనము నానాట తొలఁగిపోయి, అందలి యుత్కృష్టాదర్శములు హృద్యము లయ్యెను. భగవంతునిప్రాఁపున సంసారయాత్రయందు ధన్యులు కాఁగోరువారు, నామరూపముల విషయమై లేనిపోని దురభిమానములకు లోనుగాక, సర్వమతధర్మములును సాధనములుగఁ జేకొని సత్యము గ్రహింపవచ్చు నని నేను దలంచితిని.

ఇఱువదవ సంవత్సరమందువలెనే యఱువది దాటినప్పుడును, సంఘసంస్కరణము నా కభిమతవిషయమె. ఐనను, సంస్కరణాశయములు సాధనప్రణాళికలును కాలానుసారముగ మార్పులు చెందవలె ననియె నానమ్మిక. సాధ్యమగునంతవఱకు, ఉదారజాతీయాదర్శములకును సాంప్రదాయములకును ననుగుణ్యములగు పద్ధతులె సంస్కర్త యవలంబించుట యుక్తమని నాకు నచ్చెను. స్త్రీ పునర్వివాహము మొదటినుండియు నాయభిమానసంస్కరణము. కాని, యిందలి ప్రణాళికలో స్వతస్సిద్ధమగు కష్టములు కొన్నిగలవు. వధూవరుల శీలప్రవర్తనములు మునుముందుగఁ గనిపెట్టు టసులభముకాదు. పెండ్లికాయితమయిన స్త్రీ పురుషుల పూర్వోత్తరములు యోగ్యతాయోగ్యతలును సమగ్రముగఁ దెలిసికొనక, ఒకరిగుణము లొకరు గ్రహింప వారికిఁ దగు నవకాశము లొసంగక, వేగిరపాటున సంస్కర్తలు వారికి వివాహబంధ మొనఁగూర్చుటవలన, మన దేశమునందు పలుచోట్ల నీ సంస్కరణమున కపయశస్సును, వధూవరుల కసౌఖ్యమును బాటిల్లుచున్నవి. ఇట్టి లోపములు నివారించినయెడల, దేశాభ్యుదయమున కావశ్యకమయిన వితంతూద్వాహసంస్కరణము జనసమ్మత మగును. సామాన్య వివాహములవలెనే వితంతూద్వాహములును స్వగృహమున వధూవరుల జననీజనకులు పరిపూర్ణామోదమున జరిపి, యీసంస్కరణమును జయప్రదముగఁ జేయవలసిన సమయము వచ్చినది.

హిందూసంఘశ్రేయోభివృద్ధికి హరిజనోద్ధరణ మత్యంతావశ్యకమని ప్రప్రథమమునుండియు నే నెంచువాఁడను. గాంధిమహాత్ముఁడు, మాళవ్యాపండితుఁడు, బిర్లామహాశయుఁడు మున్నగు దేశనాయకు లిటీవలఁ గావించిన ప్రబోధమహిమమున, భారతీయులహృదయములం దిపుడు ప్రబలసంచలనము గలిగెను. అస్పృశ్యతాభిమాన దాస్యము నుండి దేశమాత విముక్తినొందు విషయమున దేశారాధకులు సల్పు ప్రచారమున నేనును గొంత పాల్గొనుచు వచ్చితిని.

స్వకీయాదర్శానుసారణముతోపాటు పరుల విశ్వాసములపట్ల సహనగౌరవములు నే నలవఱుచుకొంటిని. తాను హిందూమతాను గుణ్యమగు భక్తి గలిగి, సంఘసంస్కరణవిషయమున నానాట సానుభూతు గాంచి, నాభార్య తోడిస్త్రీల హృదయసీమల విశాలభావములు వెలయించుట కిటీవల కొంతకాలమునుండి కృషి సల్పుచుండెను.

విద్యాబోధకవృత్తిని గూర్చిన నా యభిప్రాయానుభవముల నించుక ప్రస్తావించెదను. చిన్న నాఁడు నే ననుకొనినట్టుగ పాఠశాలావరణమునకు వెలుపలిప్రదేశము పాపభూమి కాదనియు, వృత్తులందు పవిత్రత్వాపవిత్రత్వములు నియతములు కావనియు, సంకల్పశుద్ధియె సామాన్యముగ నేకార్యప్రాశస్త్యమునుగాని నిర్ణయించుననియునా నాట నాకు నచ్చెను. లోకములోవలెనే బోధకలోకమందును మేకవన్నె పులులు లేకపోలేదు. కామి, పరుల సంకుచితాశయములు పామరకృత్యములు నొరవడిగఁ గైకొనవలదని సదా నేను మానసబోధ గావించుకొనువాఁడను. కీర్తిధనాదులనుపరమావధిగ నెంచక, వృత్తి నిర్వహణమె ధర్మనిర్వహణముగఁజేకొని మఱివిద్యాబోధనమొనరింపఁ బ్రయత్నించుచు వచ్చితిని. జ్ఞానస్వీకారమున నుత్తేజిత చేతస్కులగు శిష్యుల ముఖావలోకనము నిరతము నాకుఁ గనులపండువుగ నుండెడిది. కాని, యిది రానురాను క్రమశిక్షణధర్మనిర్వహణములకు భంగకరమగు సుఖలోలత్వవ్యసనముగఁ బరిణమించిన తరుణము వృత్తివిరామమున కద నని గ్రహించి, విశ్రాంతి చేకొంటిని.

కళాశాలాదినములనుండియు, సంతతకార్యనిమగ్నతకు నేనభ్యాసపడియుంటిని. నా గురువర్యులగు వీరేశలింగముపంతులుగారి సహవాస సద్భోధనములుకూడ నా కీవిషయమున నమితసహకారు లయ్యెను. సోమరితనము వృధాకాలక్షేపమును నా కాబాల్యశత్రువులు. చదువుచునొ వ్రాయుచునొ, వ్యాయామమందొ, విద్యాపరిశ్రమమమందొ, కర్మకాండలోనొ, జ్ఞానకాండలోనొ, కాలము గడుపుట నా కభ్యాస మయ్యెను. ఇట్లు మెలంగుట నాకు శ్రేయస్కరము నారోగ్యప్రదము నయ్యెను. నా ప్రబలశత్రువులగు దుస్సంకల్పముల నరికట్టుటకును, సత్పథమున సాగిపోవుటకును నా కిదియె పరమసాధన మయ్యెను. ఇంతియకాదు. అంతకంత కీచిరకాలాభ్యాసము నుల్లంఘించుటయె నాకు బాధాకరమయ్యెను. కాలు కదపక, కలము సాగింపక, మనస్సు పరిశ్రమింపక యుండు నిర్బంధవిపరీతవిశ్రమ మెవరికైన శాంతి సౌఖ్యము లొనఁగూర్చినఁ గూర్చుఁగాక. నాకుమాత్ర మది కేవల దుర్భర దుస్థ్సితియె !

దీనికి సంబంధించిన యింకొక సంగతి యిటఁ బ్రస్తావించెదను. చిన్ననాఁటనుండి నేఁటివఱకును ప్రతిదినము చాల దూరము పచేరమునకుఁ బోవుట నా యలవాటు. ఇది కాలుసాగుటకు గాలి పీల్చుటకు నేర్పడిన సాధకవిశేషమె కాదు. భవబాధ లొకింత మఱచి, మనస్సు శాంతి వికాసము లందెడి పవిత్రసమయ మిది. ప్రకృతిసౌందర్యములఁ గ్రోలి, ఆత్మ పరమాత్మానుసంధాన మభిలషించెడి పుణ్యకాల మిది. రచనాప్రణాళికయు కథాసంవిధానమును మనమున నే నేర్పఱుచుకొను సుసమయ మిది. అధిక మన:క్లేశమునఁ గాని, కార్యభారమునఁగాని డస్సిన స్థూలసూక్ష్మశరీరములకు సంధ్యాసమయమందలి నాదీర్ఘ విహారములు పునర్జీవన మొసంగుచుండెడివి.

ఇవ్విధమున నా జీవితము గడచిపోయెను. నాకన్నులకె మిగుల లోపభూయిష్ఠముగ నున్న యీ జీవితము, స్వచ్ఛమును నాదర్శప్రాయము నని నే నెట్లు మురియఁగలను ? ఐన నీకథ యెవరి కేమాత్రముగ నుపకరించినను, నేను ధన్యుఁడను. ముందును దయామయుఁడగు పరాత్పరుని ప్రాఁపె జీవితయాత్రయందు నాకుఁ జేయూఁత యగుఁ గాత!