ఆంధ్ర వేదములు : ఋగ్వేదము/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము.
ఋగ్వేదము, (శుక్ల - కృష్ణ) యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము నని నాల్గువేదములు. యజుర్వేదము వచనశైలి, తక్కినవి పద్యశైలిలో నున్నవి. ప్రతివేదము సంహిత, బ్రాహ్మణము, అని రెండువిధములు. అన్నిటిలోను బ్రాహ్మణములు వచనశైలులు. సంహితలలో దేవతాప్రార్థనలు, మఱికొన్ని ప్రకృతివైచిత్ర్య వర్ణనములుకలవు. సామవేదము గేయము, తక్కినవి పాఠ్యములు.
బ్రాహ్మణములలో యాగముల విధులు, నిషేధములునుగలవు. అధర్వవేదమున మానవుఁడు తాను ప్రపంచమునఁగోరెడు సమస్తమయిన కోర్కెలను నాధించు జపహోమాదులుగలవు. తదితర వేదములందు స్వర్గాదిపారలౌకికఫలములు విశేషించి కలవు. ఐహికములును గలవు. అందు వ్యవసాయము, గోరక్ష, శత్రువుల నెదిరించుట మొదలగు విషయములు పదేపదే వణిన్ంపఁబడినవి.
ప్రస్తుతము మేము తెనిఁగించినవి సంహితలుమాత్రమే, మున్ముందు బ్రాహ్మణములుగూడ దెలిగింతుము.
వేదము ప్రాచీనగీర్వాణభాషలోనున్నది. దాని భాష్యములు సంస్కృత భాషలోనున్నవి. నిరుక్తమను వేదపదనిఘంటువును యాస్కముని సంస్కృతభాషలోనే వ్రాసినాడు. దానింబట్టియే వ్యాఖ్యాతలు వేదమున కర్ధమువ్రాసినారు. ఉవ్వటుడు, మహీధరుఁడు, శ్రీ విద్యారణ్యస్వామియు భాష్యములు వ్రాసినారు. విద్యారణ్యభాష్యమే యన్నిటిలో విపులము. శుక్లయజుర్వేదమునకు మాత్రమే ఉవ్వటభాష్యము ననుసరించితిమి. తక్కిన యన్నిటియర్ధమునకు విద్యారణ్యభాష్యమునే అనుసరించినారము. అందు మాస్వంత యభిప్రాయములు రవ్వంతయును సూచింపనైనలేదు. ఆ యాస్కుఁడొక్కక్కపదమున కనేకార్ధములు వ్రాసినాఁడు. భాష్యకర్తలుకూడ దానింబట్టి "యద్వా అధవా" ఇత్యాదిగా ననేకములర్ధములు వ్రాసినారు. దానింబట్టి వారు వేదార్ధమిదేయని నిర్ణయింప శక్యముకానట్టు లూహింపవచ్చును. ఒకర్ధమునే నిర్ణయించితే వికల్పములు వ్రాసియుండరు. కావున బుద్ధిమంతులు ఇంకొక యర్ధమునుగూడఁ జెప్పవీలున్నది. దయానందసరస్వతి, తిలక్ పండితుఁడు, మాక్సుముల్లరు మొదలగు ప్రాచ్యప్రతీచ్య నవీనపండితులు తమతమ యర్ధములు భిన్నభిన్నములుగాఁ గొన్నివ్రాసిరి. వాటిని, మాస్వంతయభిప్రాయమును, చివరసంపుటమునందే ప్రకటింతుము.
ఋగ్వేదమున విభాగము రెండువిధములు, ఒకటి - పదిమండలములు, మండలములలో అంతభా౯గములు అనువాకములు, వాటిలో సూక్తములు, అందులో మంత్రములు, మంత్రమునకే ఋక్కనిపేరు.
రెండవది. అష్టకము లెనిమిది, అందధ్యాయములు, అందువర్గములు, వర్గము లనుపయోగములని వదలివేసితిమి.
ఋక్కు లకు వరుససంఖ్యనిచ్చితిమి.
( ) ఇందువ్రాసిన గ్రంథముమూలమున లేదనియు సందర్భానుసారము భాష్యకర్తలు సంధించినది యనియు తెలియనగును. మఱియు తాత్పర్యవివరణములునుగలవు. దం|| ఇది దండాన్వయమని తా. అం దీ తాత్పర్యమని యెఱుంగనగును.
పాఠకమహాశయులారా! నిత్యములైన ప్రకృతిచిత్రములు వేదమందుఁగలవు. వేదమనఁగా జ్ఞానము, అపౌరుషేయమును, పదముల ఆనుపూర్విఋషులు రచించినదికావచ్చును అందలి తాత్పర్యము మాత్రమనాది. కనుకనే యపౌరుషేయము. ప్రకృతిని బలురీతుల వర్ణించును. ఇందు గొన్నిగూఢార్ధములు కలవు. అశ్వ = సూర్యుఁడు, గో = మేఘములోని యుదకము, హవిస్సు = ఆవిరి, సోమరసము = పచ్చివస్తువులలోని రసము దేవ = సూర్యకిరణములు, ఆ రసమును అవి గ్రహించుట యజ్ఞము, ఈయర్ధములును నిరుక్తముననున్నవే. ఇట్టి యర్ధవిశేషములు, చివరసంపుట మందే చూపుదుము. ఇపుడే యేలచూపలేదంటే, ఒకయర్ధము సమగ్ర గ్రంథమునకుఁ దెలిసినతర్వాత నర్ధాన్తరము లాయాప్రకరణాది సామగ్రింబట్టి బుద్ధిమంతులకు విమర్శింప వీలుచిక్కునని.
వేదార్థముయొక్క యుపయోగము.
మంత్రముల యర్ధమును గుర్తించుచునే కర్మలాచరింపవలెను. అపుడే కర్మ ఫలము కలుగును. అని పూర్వులసిద్ధాన్తము. అందుకనే గీర్వాణభాషకు సంస్కృతార్థము భాష్యకర్తలు వ్రాసిరి - అప్పటికి సంస్కృతము కర్మలుచేయువారికెల్లను దెలియుచుండెను. రానురాను సంస్కృతము నెఱుగనివారు ఇప్పటికి నూటికిఁ దొంబది మంది కలరు. నూటికి డెబ్బదిమంది కర్మలయందాసక్తి కలవారే, వారికి అర్ధమెట్లు తెలియనగును? సంస్కృత గ్రంథములు పాఠములు చెప్పినప్పుడు ప్రారంభ విద్యార్ధులకు గురువులు స్వభాషలోనే అర్ధము చెప్పుచున్నారుకదా! ఆ సంస్కృత భాష్యములలోని వేదార్ధముకూడ దేశభాషలోనే చెప్పవలసియున్నది.
మఱియుఁ గర్మలాచరించితే వచ్చుఫలము ఆమంత్రార్ధము నెఱింగినవానికిం గూడ వచ్చునని "యఉచైన దేవందేవ" = ఎవఁడు దీనినిట్లు తెలిసికొనునో ఆని శ్రుతియుంగలదు. ఇది యిట్లుండ;
వేదము తెలిగించుట కవసరమేమివచ్చె; అని కొందఱు ప్రశ్నింతురు. ఇదివరకు మీఁదవివరించినదేయవసరమని ఉత్తరము కనఁబడుచున్నను ప్రత్యేకించి మరలఁ జెప్పుచున్నాను.
1. పలుజాతీయములయిన యితర భాషాగ్రంథములు తెలిగించుచున్నట్లే భారతీయుల మతమునకుఁ బ్రధానమయిన వేదమును దెలిగించుట ఆంధ్రుల విజ్ఞానాభివృద్ధి కననగును.
2. తెలుగునఁ బురాణేతిహాసములు చదువువారలకు ఆ కథలమూలములు కల వేదముల యర్ధము నెఱుఁగుట అత్యవసరము.
3. ప్రాచీనదేశపరిస్థితి, అప్పటివారి యాచారములు వర్తనములు దెలిసినచో నాచారవర్తనముల పరివర్తనకాలమగు నిపుడు హేయోపాదేయములు గ్రహించుట సులభము.
4. ధర్మనిర్ణయగ్రంథముల ప్రామాణ్య నిర్ణయము. వివిధదేశాచార మతాచార సంఘర్షణకల యీ శతాబ్దమున స్వమత పరిజ్ఞాన సాకల్యము స్వమత క్షేమఁకరము.
5. ఆంధ్రలోకమున జిజ్ఞాసయుఁగలదు. ఎట్లన - గతయేబది సంవత్సరముల నుండి ఆంధ్రులలో ముగ్గురు, నల్వురు వేదమునకు ఆంధ్రానువాద మారంభించి కొద్ది లోనే విఘ్నితులై నట్లు వారిగ్రంథములు తెల్పుచున్నవి. గంజాంమండలమువాసు లొకరు పద్యరూపమున ఋగ్వేదము తెనిఁగించిరి. అంతకుముందే శ్రీ బసవాచార్యులవారి యాంధ్రగ్రంధమున ననేక శ్రుతుల యర్ధములు, వానిచర్చలును గలవు. ముఖ్యముగా వివిధమత సామరస్యమునకైన యేకేశ్వరారాధనమే యీ వేదమునఁ గలదు. కూలంకషముగాఁ జూడక కొందఱు వేదములలో అనేక దేవతలు చెప్పఁబడినవి అని అన్నారు కాని యీ ఋగ్వేద ప్రధమ మండలము నూటయరువదినాల్గవసూక్తమున నలువదియాఱవ మంత్రమున - "ఏకంసద్వి ప్రాబహుధావదంతి = " వరుణ మిత్ర, వాయు, ఇత్యాది దేవతలంజెప్పి ఒకేవస్తువును విప్రులు పలువిధములుగాఁ బలుకుచున్నారు అని యున్నది. ఇట్టివనేకములు కలవు.
6. ఇంకొకటిచెప్పి ముగింతును. భూతభవిష్యత్తులంగూడ గోచరించుకొన్న మంత్రద్రష్టల పలుకులలోనుండి దేశకాల పరిస్థితుల గమనించిన బుద్ధిమంతులు, సంస్కృతమురానివారు, ఆంధ్రవేదముచదివి క్రొత్తవిశేషములంగూడఁ గనిపెట్టఁగలరు. కనుక మాయుద్యమము సాధిష్ఠము, సఫలము.
ఇట్లు,
బంకుపల్లె మల్లయ్యశాస్త్రి.
21 - 5 - 40