ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)5

వికీసోర్స్ నుండి
అనంతపురము జిల్లా


అనంతపురము జిల్లా - ఇది చెన్న రాజధానియందలి యొక తెలుగుజిల్లా. ఇప్పుడు రాయలసీమ (పూర్వపు దత్తమండలములు) అనబడు జిల్లాలలో దక్షినపుది. పూర్వము బళ్లారి జిల్లాలోనే అనంతపురముకూడ కలిసియుండెను. బళ్లారి నుండి దీనిని 1882లో వేఱుచేసిరి. దీనికుత్తరమున బళ్లారి , కర్నూలుజిల్లాలును, తూర్పున కడప జిల్లాయును, దక్షినమున మైసూరు రాజ్యమును చిత్తూరుజిల్లాలును, పడ్మట మైసూరు రాజ్యమును, బళ్లారి జిల్లాయునూ గలవు. ఇందుపూర్వము అనంతపురము, ధర్మపరము, గుత్తి, హిందూపురము, కల్యాణ దుర్గము, మడకశిర, పెనుకొండ, తాడిపత్రి అను నెనిపిది తాలూకాలే యుండెను. 1910వ సంత్సరమున నూతనముగ చిత్తూరుజిల్లా యేర్పడినప్పుడు కదిరితాలూకా నిందు గలుపుటవలన నిప్పుడు తొమ్మిదితాలూకా లయినవి.

భూస్వభావము

అనంతపురముజిల్లా సమప్రదేశముకలది కాదు; ఉన్నత ప్రదేశము. ఇది మైసూరు పీఠభూమి చివరిభాగము. దక్షిణమువైపు ఉన్నతముగను, పోనుపోను ఉత్తరమువైపు పల్లముగను నుండును. దక్షిణపు వైపుప్రదేశము 2200ల అడుగులయెత్తున నున్నది. బళ్ళారికిని గుత్తికిని నడుమ నున్నరేఁగటి నేల యెత్తు 1182 అడుగులు; తూర్పు భాగమున తాడిపత్రి యొద్ద 900 అడుగులు.