ఆంధ్ర రచయితలు/సురవరము ప్రతాపరెడ్డి

వికీసోర్స్ నుండి

సురవరము ప్రతాపరెడ్డి

1896

రెడ్డి వంశీయులు. తలిదండ్రులు: గంగమ్మ, నారాయణరెడ్డి. జన్మస్థానము: గద్వాల సంస్థానములోని బోరవెల్లి. జననము: దుర్ముఖి - అధికజ్యేష్ఠ బహుళ ప్రతిపత్తు. 1896 సం. రచనలు: 1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. 2. హైందవధర్మవీరులు. 3. రామాయణ విశేషములు. 4. హిందువుల పండుగలు. 5. ప్రజాధికారములు 6. తుకారాము (నాటకము) 7. ఉచ్ఛల విషాదము (నాటకము) 8. యువజన విజ్ఞానం. 9. మొగలాయి కథలు. ఇత్యాదులు.

హైదరాబాదు, ఆంధ్రసాహిత్య రచయితలు - అను తలపులో తొట్టతొలుత సురవరము ప్రతాపరెడ్డిగారు తగిలి వేఱొకరు తట్టెదరు. "ఆంధ్రుల సాంఘికచరిత్ర" గ్రంథరచనతో - మెఱపు మెఱపులుగా విరసియున్న ప్రతాపరెడ్డిగారి యశస్సు స్థిరపడి నిలిచినది. ఇట్టి యుత్తమ రచయిత జీవన సింధువునుండి యథాశక్తి నేఱుకొన్న కొన్ని బిందువులీక్రిందివి.

ప్రతాపరెడ్డి గద్వాల సంస్థానములోని బోరవెల్లి గ్రామములో జన్మించి, యేడేండ్లదాక నచటనే పెరిగెను. మొదటి గురుత్వము తండ్రిది. పిదప నెనిమిదవయేట 'కర్నూలు' లో జేరి 'మెట్రికు' వఱకు విద్యాభ్యాసము. ఎఫ్.ఏ. హైదరాబాదునందు, బి.ఏ. మదరాసు ప్రెసిడెన్సీ కాలేజీయందు చదువుట. భీ.ఏ. వఱకును సంస్కృతము ద్వితీయభాషగా గ్రహించి పఠించుటచే నాభాషలోని మెలకువలు ప్రతాపరెడ్డిగారికి దెలియును. అదిగాక, గురుముఖమున గావ్యపంచకము లఘుకౌముదియును జదువుకొని తమశక్తికి మెఱుగుపెట్టుకొనెను. బి.ఏ. చదువుచుండగనే 'ఉచ్ఛల' నాటకము వీరు సంఘటించిరి. న్యాయవాది పట్టము వడసి హైదరాబాదులోనే, ఉర్దూభాషలో నెనిమిదేండ్లు ప్లీడరుపని చేసిరనగా, ప్రతాపరెడ్డిగారి కాభాషలోని ప్రవేశమెంతటిదో తెలియగలదు. 'పార్శీ' యందును వీరి సరిశ్రమము ప్రశంసనీయమైనది. మొత్తముమీద సంస్కృతము, ఉర్దూ, పార్శీ, ఆంధ్రము, ఆంగ్లము - భాషలలో జక్కని పరిచయము ప్రతాపరెడ్డిగారి కున్న యది. ఇట్టి విజ్ఞతలతో నీయన సారస్వతోద్యోగము నిర్వహించుచున్నారు. రాజకీయోద్యోగములు కోరిన మానిసి కాకపోవుటచే ప్రతాపరెడ్డి లక్షలకధికారి కాలేకపోయెను. పోనిండు! ఆయన గ్రంథములు నేనవేలు విలువకలవి కావచ్చును.

నిండుగా నిరువది నాలుగేండ్లు ప్రతాపరెడ్డిగారు నెఱపిన మహోద్యోగ మొక డున్నది. అది "గోలకొండ" పత్త్రికాసంపాదత. వీరి యధికారములో 'గోలకొండ' అర్ధవార పత్త్రికయై మంచి ప్రఖ్యాతి ప్రచారములు పడసివచ్చినది. ఇటు లుండగా 'లిమిటెడ్ కంపెనీ' వారు వచ్చి దానిని దినపత్త్రికగా మార్పుచేసి నడపుచున్నారు. కారణాంతరములచే వారితో గుదురక రెడ్డిగారు సంపాదకత వదలుకొని 'ఇటికాలపాడు' అను గ్రామములో బ్రకృతము గడపుచున్నారు.

చరిత్ర, పరిశోధనము - అనగా వీరి కెంతో సంబరము. వీరియిల్లు చరిత్ర భాండారమని చెప్ప విందుము. ప్రతాపరెడ్డిగారి కథలు, సారస్వత వ్యాసములు, చరిత్ర, పరిశోధన రచనలు మొత్తము మున్నూఱు సంఖ్యకు బైపడియున్నది. నాటకములువ్రాసిరి. పద్యరచనచేసిరి. 'ప్రజాధికారములు' మున్నగా నెన్నో రాజకీయ విషయములపై చర్చాగ్రంథములు వెలువఱిచిరి. హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషములు, హిందువుల పండుగలు మున్నయిన రెడ్డిగారి కూర్పులు వారి వివిధవిషయజ్ఞతకు నిదర్శనము లైనవి. ఈయన పద్యకవితయు సాధుమధురమైనది. తెనుగు భాషామతల్లిపై వ్రాసిన యీసీసము చూడవలయును: పరిపూర్ణ పావనాంభ స్తరగోద్వోగ

గౌతమీ గంభీర గమనమునకు

ఆలంపురీ నందనారామ విభ్రౌజి

మల్గోబ ఫలరాజి మధురరుచికి

ఆంధ్రీ కుమారీ సమాయుక్త పరిపూత

తుంగా వయస్సు మాధుర్యమునకు

ఖండ శర్కర, జాతి, ఖర్జూర, గోక్షీర

ద్రాక్షాదియుత రామ రసమునకును

అమృత నిష్యంది వల్లకీ హ్లాదమునకు

రాగిణీ దివ్య సమ్మోహరాగమునకు

తేనెతేటల నవకంపు సోసలకును

సాటి యగును మాతెనుగు భాషామతల్లి.

'ప్రణయని' పై వీరు కట్టిన కవిత యెట్టులున్నదో యరయవచ్చును:

ఉ.నీ నునుజెక్కులున్ మరియు నీ చిరునవ్వును దంతకాంతియున్

నీనయగారముల్ కలికి! నీదు మీటారపు గుబ్బదోయియున్

నీనడయాడుకౌ నరయ నీచికురంబును కెంపుమోనియున్

చానరొ! నాటె నాయెడద సంశయ ముండిన చీల్చి చూడుమా!

ఉ. ఎచ్చటి కేగినన్ మరియు నేమి యొనర్చిన నీదురూపమే

యిచ్చ దలంచుచుండు, కృపయించుక పూన వదేమొ, ఓర్వగా

వచ్చునె యీమనోవ్యధల వారిజలోచన! నీకటాక్షమున్

నచ్చితి నింక తాళగలనా, లలనా! చలమూస పాడియే!

ఉ. నీ సరసంపు ముచ్చటలు నీతరళాయిత నేత్రయుగ్మమున్

వీసరవోని మోహమున నేమరు చిత్తములో స్మరించుచున్

వేసర కెల్లవేళలను ప్రేయసి! నిన్ గనగోరునాకయో!

ఆసలుగొల్పి యేచడగునా, మగువా! వగ హెచ్చుచున్నదే! ప్రతాపరెడ్డిగారి, ఇత్యాదికమైన కవిత్వ మంతయు నొకయెత్తు, వారి 'ఆంధ్రుల సాంఘికచరిత్ర' గ్రంథ మొకయెత్తును. 1929 సంవత్సరమునుండియు రెడ్డిగారు తెలుగువారి సంఘమర్యాదలను, ఆయాకవుల గ్రంథముల ద్వారమును గుర్తించుకొనుచు వ్యాసరూపమున వెలువరించుచున్నారు. ఆ కృషియంతయు 1949 నాటికి పంటకు వచ్చి యేతద్‌గ్రంథరూపమున మనకు భుక్తమైనది. కాకతీయ సామ్రాజ్యము నాడు, రెడ్లపాలనమునాడు, విజయనగరరాజుల యేలుబడినాడు, మఱి వివిధప్రభుత్వములనాడు సాంఘికముగా దెలుగుల మర్యాదలు, నడతలు నెట్టివో యీ కూర్పున హృదయంగమఫక్కిని ప్రదర్శింప బడినవి. ఈ రచనవిషయమై రెడ్డిగారు కావించిన కావ్యపరిశీలనము, చరిత్ర పరిశోధనము గణనీయములైనవి. ఈకృతి చిరకాలస్థాయిగానుండి తెలుగువారి కుపయోగపడు ననుటలో విప్రతిపన్ను లుండరు. వీరి రచనయు నింపుగా సొంపుగా నడచినది. వారు వ్రాసినటులు-

" రాజుల రాజ్యాల చరిత్ర వ్రాయుట అంతకష్టము కాదు. కాని సాంఘికచరిత్రము వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు) విదేశీయులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాజ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్ధులు, జంగముకథలు, పాటలు, చాటువులు, పూర్వవస్తు సంచయములు (collections) - ఇవి సాంఘిక చరిత్రకు పనికి వచ్చు సాధనములు"

ఇంత సామగ్రితో శ్రమించి సంధానించిన రెడ్డిగారి సాంఘిక చరిత్రము నేటి సారస్వత కృతి సంభారమున కొక వెలుగు నిచ్చి, మెచ్చుకోలు పడయదగిన గ్రంథమై, వారి యశోలతకు మాఱాకు హత్తించు నదిగ నున్నది.

                                _________