Jump to content

ఆంధ్ర రచయితలు/మాడపాటి హనుమంతరావు

వికీసోర్స్ నుండి

మాడపాటి హనుమంతరావు

1885

బ్రాహ్మణులు. తల్లి: సుబ్బమ్మ. తండ్రి: వేంకటప్పయ్య. జన్మస్థానము: కృష్ణాజిల్లా, నందిగామ తాలూకాలోని పొక్కునూరు. నివాసము: హైదరాబాదు. జననతిథి: తారణ సంవత్సర మాఖ శుద్ధ షష్ఠి. 1885 జనవరి. రచనలు: ముద్రితములు: 1. మల్లికాగుచ్ఛము 2. మాలతీగుచ్ఛము 3. క్షాత్రకాలపు హింద్వార్యులు 4. తెలంగాణా ఆంధ్రోద్యమము (1 భా) ఆముద్రితములు: 1. గ్యారబాల్ది చరిత్రము 2. మహాభారత సమీక్షణము. 3. తెలంగాణా ఆంధ్రోద్యమము (2వ భాగము) 4. రోమక సామ్రాజ్యచరిత్రము (అసంపూర్ణము)

జన్మదేశము కృష్ణామండలమేకాని, హనుమంతరావుగారు హైదరాబాదు నివాసులు. నిజాము రాజ్యములో రాజకీయ ప్రాముఖ్యము వహించిన తెలుగువారిలో వీరు ప్రథమశ్రేణికి జెందినవారు. ఆయనను రచయితలుగా నెక్కువమంది వినియుండరు. ఏమనగా హనుమంతరావు గారు రచించిన గ్రంథములు పుటల ప్రమాణములో దక్కువ. అవియైనను, సాహిత్యసంబంధము కలవికావు. ఎక్కువ, దేశభక్తి సముత్తేజకములు. చరిత్ర విషయకములును. ఆంధ్రోద్యమము వీరి ప్రాణప్రాణము. తెలంగాణా ఆంధ్రోద్యమము వీరిది ప్రథమ భాగము ముద్రితమైనది. మల్లికా - మాలతీ గుచ్ఛములు రెండు ముద్దయిన గ్రంథములు. అందలికథలు ప్రాచినాంధ్రుల విశిష్టతకు మహాదర్శములు. తెలుగులో గ్రాంధికశైలి వీరిది తీరుగానుండి విందుసేయును. మల్లికా గుచ్ఛమున జారిత్రకములు సాంఘికములు నగుకథలు మధురధోరణిలో నున్నవి. రుద్రమదేవి మున్నుగా నున్న గాథలు వీరి చరిత్ర దృష్టికి మంచి నిదర్శనములు.

హనుమంత రావుగారు బి.ఏ., బి.యల్. పట్టమునందిన న్యాయవాదులు. 19 వత్సరముల యీడునుండి యిరువది యేడేండ్ల యీడు వచ్చువరకు బ్రభుత్వము వారి విద్యాశాఖలో నుద్యోగము. అంతటి నుండి, యారు వత్సరములు హైదరాబాదు శాసన నిర్మాణ సభలో నాంధ్రానువాదక పదవీనిర్వహణము. పిమ్మట నిరువదినాలు గేండ్లు నిండుగా హైకోర్టు వకీలువృత్తి. ప్రకృతము విశ్రాంతి. హనుమంతరావుగారికి ఆంగ్లము, ఆంధ్రము నందేకాక సంస్కృతము, ఉరుదూ భాషలలోగూడ మంచిపాండితి యున్నది. వీరికి శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారి రచనా విధానము ఆదర్శమత. వ్యావహారిక భాషయం దెక్కువ యాదరనముగాని దాని యుపయోగమును గూర్చి యెక్కువ విశ్వాసముగాని కలవారు కారు.

విశేష మేమనగా హనుమంతరావుగారు హైదరాబాదు రాజ్యములో నేటి ప్రజోద్యములయందు బాలుగొని గొప్ప కీర్తి గడించినారు. రచయితలలో వారికీయదగిన గౌరవము, ఆకీర్తిని బట్టి కాక సాహిత్య-చరిత్ర సంబంధమైన మల్లికా గుచ్ఛ, మహా భారత సమీక్షణాది కృతి రచనమువలన నని గుర్తింపవలయును.