Jump to content

ఆంధ్ర రచయితలు/మంత్రిప్రెగడ భుజంగరావు

వికీసోర్స్ నుండి

మంత్రిప్రెగడ భుజంగరావు

1876 - 1940


ఆరువేల నియోగి శాఖీయ బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడు, హరితస గోత్రుడు. లక్కవరము జమీందారు. దత్తత గొన్న తల్లిదండ్రులు: విజయలక్ష్మమ్మ, మల్లికార్జున ప్రసాదరావు. కన్నతల్లి: వెంకమాంబ. కన్నతండ్రి: మల్లయామాత్యుడు. జన్మస్థానము: ఏలురు. జననము: 1876, ధాతృసంవత్సర చైత్ర బహుళ పంచమీ గురువారము. నిర్యాణము: 1940 సం|| గ్రంథములు: దిలీపచరిత్రము, స్తవరాజము, హరిశ్చంద్ర నాటకము, మైరావణుడు, మోహలేఖావళి, మాల్కిసువార్త, మార్కండేయేశ్వర చరిత్రము, పాండవాజ్ఞాతవాసము, పరమ పురుషాన్వేషనము, పదార్థ విజ్ఞాన శాస్త్రము, నిరపవాద ప్రహసనము, చిత్ర హరిశ్చంద్ర నాటకము, చారుమతీ పరిణయము, ఉత్తరరామ చరితము, ఆధునిక కవిజీవితములు, కలియుగ నటనామృతము, విజయాంక సాహసము, అభిజ్ఞాన శాకుంతలము, వచననైషధము, వాసంతిక, వ్యవసాయ, మార్కండేయ శతకము, రాజహంస, మధుప విహారము, తత్త్వమీమాంస, ఆంధ్ర కథా సరిత్సాగరము, గోఖలే చరిత్ర, లూకా సువార్త, దీనరక్షామణి శతకము, అగ్గిరాముని మరణావేదనము- ఇత్యాది నాటకములు, నవలలు, విమర్శన గ్రంథములు, వివిధ విషయక గ్రంథములు వీరిని శతాధికముగా నచ్చుపడినవి.


శ్రీ భుజంగరావుగారిని జమీందారులు గాను, కవులుగాను మన మెఱుగుదుము. వారు సామాన్య రచయితలుగాక శతాధిక గ్రంథ రచయితలు, దర్శనాచార్యులు, వితరణ చతురులు కూడను. వీరికి సంస్కృతాంధ్రములలో దగిన సాహిత్యమున్న దని కృతులు ప్రకటించుచున్నవి. ఆంగ్లమునందును బ్రజ్ఞ గొప్పది. గ్రంథరచన మందేకాక 'మంజువాణి' పత్త్రికా ప్రచరణముచే దమ ప్రతిభ వితతముగా వెలువరించుకొనిరి. అంతతో దృప్తిపడక విలాసార్థ మవధానములు జేసినారు. వీరు చేసిన యష్టావధానమునకు సభాపతులైన కొక్కొండ మహామహోపాధ్యాయుడు బంగారు వృత్తములో నిట్లు భుజంగరాయ కవి నుగ్గడించెను.


వాకట్టు గట్టించి పరలెద వట నీవె

యందఱ కిష్ట మృష్టాన్నభుక్తిహర్షముగా

గట్టింతు వట నీవె పుట్టంబులనె యెందఱనొ

ప్రబంధుండన నెనయ ముదము , ఘనుడవుగా

మునుగువేయించుచు నొసగెదవట నీవె

సత్పండితులకు సాలువులను శ్లాఘ్యముగా

జేకట్టు కట్టించి చెలగెద వట నీవె

కవివరులకు బైడి కడియములనె, ఖ్యాతిగదా


ధర్మభూయంత్రములను స్తంభన మొనర్చి వంద్యుడెయౌ

సాప్రభాకరునే యాగితట యెటువలె నారసెదో

యొక్క డిక్కవిమణి నీకు జిక్కె నిపుడు చక్కగాను

సత్కవీశ్వరరాజ భుజంగ రాయ! సర్వగేయ!


విశ్వతోముఖమగు బుద్దిబలమును బ్రస్తరింపజేసి కవులలో గవులై, పండితులలో బండితులై, విమర్శకులలో విమర్శకులై, ప్రభువులలో బ్రభువులై, దాతలలో దాతలై ఖ్యాతినందిన యదృష్ట జీవనులు భుజంగ రావుగారు.


మత్తయినువార్త, క్రైస్తవగూడార్థ దీపిక, మాల్కిమవార్త, యోహానునువార్త ఇవి వీరు పద్యములుగా వ్రాసి తమకై పరమతాభిమానమును జాటుకొనిరి. ఇట్లని ప్రాచీన మతాచార్యుల యధృష్టములను శిరసావహింపనివారు కారు. ఇటీవల వీరు వెలువరించిన యెనిమిది నూర్ల పద్యములతో గూడిన 'తత్త్వ మీ మాంస చూడుడు ఇందు శంకర, రామానుజ, మధ్వాచార్య, చైతన్య బుద్ధ, జైన, మహమ్మదుల మతాశయములు సరిచూపుతో బగి లితము చేసి ప్రదర్శింపబడియున్నవి. వీరి శతాధికగ్రంథములలో గల కవితాధారయెల్ల యతిప్రాసములకు దడవుకోకుండ నడచిపోవుచున్నట్లుండును. రసభావదృష్టితో విమర్శించినచో నిలబడుపద్యములు మిక్కిలితక్కువగానుండును. చ్యుతసంస్కారములు దొరలు చుండుటయు గలదు. కాని ధోరణి యెత్తు పల్లములు లేక యొ కే తీరున సాగుట మెచ్చుకో దగిన ముఖ్యవిషయము. బహుగ్రంథ రచనమునందే వీరికి వేడుక కలిగియుండిన కారణమున, శాశ్వతస్థాయిగా నుండగల గ్రంథ మొకటియు వ్రాయలేక పోయినారు. వ్రాసినవానిలో గొన్ని కొంతపేరు సంపాదించుకొన్నవి యున్నవి. A History of Telugu Literature అనుపేర వీ రాంగ్లములో నొక గ్రంథము వెలువరించిరి. దాని రచనలో పి. చెంచయ్య గారు తోడ్పడిరి. అది కొంత పేరుగొన్న కూర్పు. "ఆధునికాంధ్ర కవిజీవితములు" అను పేరుపెట్టి వీ రొకగ్రంథము నచ్చు కొట్టించిరి. అది వీరి ప్రథమ పుత్రిక పరిణయ సందర్భమున సమావేశమై 233 విద్వత్కవులు చేసిన యాశీస్సులు గల కృతి. అందు విశేషమేమనగా వారి వారి సంక్షిప్త చరిత్రములు కూడ జేర్పబడి యున్నవి. ఆకారణమున, ఆపుస్తకము దాచుకో వలసినదిగా దోచును. కొమార్తెల వివాహములు మహావైభవముగా జేసి భుజంగరావుగారు మంచిపేరు కవిలోకములో సంపాదించుకొనిరి. ఒక కవి యిట్లు వ్రాసినాడు.


క. రాజా భుజంగరాట్కవి

భోజు డహా! దేవదుందుభులు మ్రోగించెన్

భూజనముల బూజనముల

భోజనముల దనిపి ప్రథమపుత్రిక పెండ్లిన్.


అభిజ్ఞాన శాకుంతలము, ఉత్తరరామచరితము వీరు మధురముగా నాంద్రీకరించిరి. 'తత్త్వమీమాంస' యనుకృతి పండువయస్సులో వ్రాయబడినది. కావున నందుండి కొన్ని పద్యములు స్మరించుకొందన ధారాళత యెంతో శ్రుతిసుఖముగా నుండును. విషయము నుపవిత్ర


సీ. ఏవరేశు నమోఘ హృదయ సంకల్పముల్

బహ్మాండ మండలో త్పాదనములు

ఏచిదాత్ము కటాక్షవీక్షణా సారముల్

జీవకోట్లకు నుధాసేచనములు

ఏమహాహుని యుద్దామవాగ్విభవముల్

మునిజన సంశయోన్మూలనములు

ఏదయాళు నిరంకుశోదార కృత్యముల్

ప్రాణి సంరక్షా పరాయణములు


అట్టి పరమేష్టి వదనగహ్వర చతుష్ట

యంబునుండి యనాది కాలంబునందు

నాశుధారా ప్రవాహ సామ్యంబు దోప

సగణితామ్నాయ సముదాయ మవతరించె.


ఉ. ఆ నిగమంబు లెన్నగ ననంతములై పరధర్మ బోధనా

స్థానములై మహాగుణ విధానములై పురుషార్థ సాధనో

ద్యాసములై మహాగుణ నిధానములై విలసిల్లి సంతతా

నూస కలావిలాసముల నొప్పుచునుండె జగత్త్రయంబునన్.


గీ. అట్టి యామ్నాయ నిదయ మహాంబురాశి

యందలి మహత్తరార్థంబు లఖిల జనుల

కాది నెంతయు దురవగాహములు గాగ

వాని విభజించె నప్పు డా వ్యాసమౌని.


చ. ఎనసిన యబ్ధులట్లు భరియింపగ శక్యముగాని వేదరా

శిని విడదీసి కొంత ససిజేసిన వ్యాసమునీంద్రు దివ్యశో


నాట నుండియు సుజరతర శ్రుతిసంచయంబు న
బోధయొనర్పుచునుండి రా------

(ఈఖాళీలలోని అక్ష్రములు కనబడుటలేదు) గీ. ఆకులారవు; గంటంబు లసలెకావు;

కాగితంబులు కలము లెక్కడను లేవు;

ఒక్కయక్కర మైన వ్రాయుపనిలేక

యెల్లశ్రుతులును వల్లించి రెల్ల ఋషులు.


గీ. తనువులకు జీవకళపోల్కి దరణి చంద్ర

ములకు బ్రభవోలె నా వేదపుంజమునకు

నస్ఖలితమై వెలుంగు మహాస్వరంబె

ముఖ్యముగ నెన్నబడె ఋషిముఖులచేత.


ఈ రకమగు కవితాధారతో శ్రీభుజంగరావుగారు శతాధికములు కృతులు సంతరించి రనగానదిపురాజానుషమైన పుణ్యఫలము. "కవియు రాజును, మంత్రిప్రగడ భుజంగ, రావుబహదూరు, హేలాపుర ప్రధాని, నయశతాధిక గ్రంథకర్త, యవధాని దర్శనాచార్యబిరుదమ్ము దనరబూనె" అని యాయన వ్రాసికొన్నట్లుగా సకలభాగ్యములు వీరికి బట్టినవి. శ్రీ కొత్తపల్లి సుందరరావు అను కవివరునొకని తనసంస్థానములో బెట్టుకొని గౌరవించిన యీ కవిప్రభువు శీలసంపత్తి గణనీయము.

                          ________________