ఆంధ్ర రచయితలు/పరవస్తు వేంకట రంగాచార్యులు

వికీసోర్స్ నుండి

పరవస్తు వేంకట రంగాచార్యులు

1822 - 1900

జననము: 1822 సం. నిర్యాణము: 1900 సం. నివాసస్థానము: విశాఖపట్టణము. తండ్రి: శ్రీనివాసాచార్యులు. గ్రంథములు: 1. మంజుల నైషధము (ఏడంకముల నాటకము). 2. లఘువ్యాకరణము (శ్లోకరూపమగు సులభ వ్యాకరణము) 3. ప్రపత్తివాదము (వేదాంత గ్రంథము) 4. కుంభకర్ణ విజయము 5. ఆంగ్లాధిరాజ్యస్వాగతము (చిన్న కావ్యములు) 6. శకుంతలము (ఆంధ్రీకరణము) 7. కమలినీ కలహంసము (రాజచూడామణి దీక్షితుని కృతి కాంధ్ర పరివర్తనము) 8. శబ్దార్థ సర్వస్వము (నిఘంటువు) 9. ఈళ, కేన, ప్రశ్న, ముండ, మాండు క్యాది దశోపనిషత్తులకు బద్యానువాదము. మున్నగునవి.

మన ప్రాచీనకవి పండితుల నిరంకుశతకు గుఱుతులుగా ననేక చరితములు చెప్పుకొందురు. పిఠాపురసంస్థాన ప్రభువగు గంగాధరరామారావుగారు గొప్ప రసిక ప్రభువులనియు, వారియాస్థానిలో బులుసు పాపయ్య శాస్త్రి ప్రభృతులు పండితులుగా నుండి చేసిన నిరంకుశవాదములు స్మరణీయము లనియు నేడు కథలుగా, గాథలుగా నల్లుకొన్నవి. విజయనగర సంస్థానములో కలిగొట్టు కామరాజుగారని గొప్ప గాయకుడు. ఆయన పల్లవిపాటలో జోడులేనివాడు. మహారాజు బతిమాలినను, దనకు దోచినపుడుగాని గొంతెత్తువాడు కాదట.


మహామహోపాధ్యాయులగు పరవస్తు రంగాచార్యుల వారిని దర్శింప వలయునని విజయనగర సంస్థాన ప్రభువు నభిలాష. ఎన్నో సారులు వర్తమానము లంపిరి. చివరకు రంగాచార్యులవారు మూడు నియమముల కడ్డు చెప్పనిచో వచ్చుట కభ్యంతరము లేదని కబురు చేసిరి. 1.సవారిలో కోటగుమ్మమువరకు వెళ్ళుట (2) కోటగుమ్మముకడ సవారి దిగి పాదుకలతో సభామండపముదాక వెళ్ళుట. (3)అక్కడ పాదుకలువదలి సభలో చిత్రాసనముమీదగూర్చుండుట. పయి షరతులలో మొదటి రెండును మహారాజున కంగీకార్యములైనవి. చివరిది మాత్రము వా రంగీకరింపలేదు. "చిత్రాసనముమీద గూరుచుండుట మాకేమియు వ్యతిరేకముకాదుగాని, పండితుల కవమానకరమగు" నని ప్రభువుల యుద్దేశము. ఆపద్ధతిని మేము రానేరామని రంగాచార్యులవారి సమాధానము.


ఇట్టి యాచార్యులవారి పాండితీ పటిష్టత యెంతగొప్పదో! అయన తర్క వ్యాకరణ మీమాంసా ద్యనేక శాస్త్రములలో సందెవేసినచేయి. మహా మహోపాధ్యాయ బిరుదుమునందిన మన తెలుగువారిలో బ్రథములు రంగాచార్యులవారు. వీరితరువాత తాతా సుబ్బారాయశాస్త్రిగారికే యాబిరుద మస్వర్థమై యందగించినది. పదపడి, దానిలోని బిగువు కొంత సడలిపోయి బెడగు తగ్గినది. శాస్త్రములలో నింత పరిశ్రమ చేయువారు, తెలుగుబాసపై తేలికచూపు వేయుదురు. వీరటులు కాదు. కాళిదాసు శాకుంతలము 1872 ళొదెలుగున నంతరించి 'సకల విద్యాభివర్ధనీ పత్రిక' లో రెండంకములు వెలువరించిరి. మిగిలిన గ్రంథము ప్రచురితమైనట్లు చూడలేదు. రంగాచార్యులవారి యీ తెలిగింపు వీరేశలింగము పంతులుగారి శాకుంతలాంధ్రీకృతికి గొంతయుత్సాహ మిచ్చినదని స్వీయ చరిత్రములోని పంతులుగారి వ్రాతవలన దెలియును.


ఎంతటి కఠినాంశ మయినను జేతి యుసిరికవలె నందజేయు చాతుర్యము రంగాచార్యులవారికి నినర్గజము. ఆయన మాటాడునపుడు జనులు ముగ్ధులగుచుండెడివారు. సభ్యుల యభిరుచులు కనిపెట్టి, యిట్టే తమయభిప్రాయము మార్చుకొని యుపన్యసించుటలో వీరికున్నంత నేరుపు వేఱెవరికి నుండదని పలువు రిప్పటికి జెప్పుకొనుట కలదు. 1889---లో వీరొకతూరి రాజమహేంద్రవరము వేంచేసినపుడు జరిగినముచ్చట శ్రీవీరేశలింగము పంతులుగారు ముచ్చటించిరి. హిందూమత ప్రశస్తతనుగూర్చి రంగాచార్యులవారు సుధా సహోదరమగు మధురధోరణిలో నుపన్యసించెను. వెనువెంటనే మహారాష్ట్ర పాఠశాల స్థాపించి నడపుచుండిన ముత్తుస్వామి శాస్త్రి భావోద్రేకత నాపలేక "తా నదివఱకు క్రైస్తవ మతావలంబిననియు మీ యనుగ్రహము వలన నేటినుండి హైందవ మతావలంబి నయితిననియు" జెప్పి ప్రణమిల్లెనట. ఆయనకేకాదు, నాడు వీరియుపన్యాసము విన్న పరమతస్థుల మనస్సు లెన్నో హిందూమతమువైపునకు వచ్చి స్థిరపడినవి. వాదవిషయమున గొంత స్వతంత్రత చూపినట్లున్నను, మొత్తముమీద శాస్త్రప్రామాణ్యమునకు దవ్వుగాని త్రోవ రంగాచార్యులవారు తీసినారని యనేకుల యభిప్రాయము.


వీరు తమ యెనిమిదవయేటనే కుంభకర్ణవిజయ మను సంస్కృత కావ్యము రచించిరి. ప్రౌడ భాషాసరస్వతి బొరుదాడ్యులై ----లో విక్టోరియా జూబిలిలో మహామహోపాధ్యాయులై వన్నె గాంచిన రంగాచార్యులవారు బొబ్బిలి,ఉర్లాము,పిఠాపురము,మైసూరు,మందసా మున్నగు సంస్థానములలో సన్మానింపబడిరి. బొబ్బిలి సంస్థానమున మూడు వందల సృచ్ఛకులతో బరశ్శతావధానము గావించిరని ప్రసిద్ధి.


ఆంగ్లములోని "ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా" గ్రంథము తీరు నాదర్శముగా గొని శబ్దార్థ సర్వస్వమను గొప్ప నిఘంటువును వీరు రచించినారు. ఇది వీరి సారస్వతోద్యమములలో శిరోమణి. దీని రచనకు మొత్తము నలువదియేండ్లు పట్టినది. 200 పుటలలో అకార. ఆకారాది పదములు గల రెండు సంపుటములు వెలువరించ బడినవి. శేషభాగ మెంతయో వెలుగు చూడవలసి యున్నదై యున్నది. మొదటి సంపుటములు చూచినచో శ్రీ రంగాచార్యుల వారి విశ్వతోముఖపాండిత్య మందు రూపముగట్టి కనుపట్టును. వీరి తండ్రిగారు శ్రీనివాసాచార్యులు "సర్వశబ్దసంబోధిని" యను అశారాది సంస్కృత నిఘంటువు రచించిరి. అదిగాక వారు వేంకటాధ్వరి "విశ్వగుణాదర్శము" తెలుగు పఱిచిరి.కుమారుడు తండ్రిని మించిన పండితుడు.


ఈశా ద్యుపనిషత్తులకు దెలుగు పద్యములలో ననువాదము రంగాచార్యులు గావించిరి. అదిచూడ నబ్బురమగును. ఆపద్యముల పొందిక సుందరమైనది.


శా న్తి:|| పూర్ణమద:,పూర్ణమిదం,పూర్ణా త్పూర్ణ ముదచ్యతే !

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ మేనావశిష్యతే ||


క. పూర్ణ మది, పూర్ణమిదియుం

బూర్ణంబగు దానివలన బూర్ణము పొడమున్

బూర్ణమగు దానిదే యగు

పూర్ణము గొని మిగులుచుండు బూర్ణమె యెందున్.


శా న్తి:|| అప్యాయన్తు మ మాంగాని, వాక్ర్పాణశ్చక్షు శ్శ్రోత్ర

మధోబల మిన్ద్రియాణి చ సర్వాణి, సర్వం బ్రహ్మోపనిషదం,

మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మామా బ్రహ్మ నిరాకరో,

దనిరాకరణ మ, స్త్వనిరాకరణం మే అస్తు, తదాత్మని నిరతేయ

ఉపనిషత్సు ధర్మా న్తేమయి సన్తు తే మయి సన్తు ||


సీ. అప్యాయితములు నాయంగంబు లగు గాత,

ప్రాణంబు వాక్కు నేత్రంబు జెవియు

బల సుఖిలేంద్రియంబులు నట్లయగు గాత

నిఖలంబు బ్రహ్మోపనిషదమె యగు

బ్రహ్మంబు నేను నిరాకరింపగరాదు

బ్రహ్మంబు నన్ను నిరాకరింప

రా, దెందును నిరాకరణము కాకుండుగా

వుత, లేకయుండు గావుత మదీయ

గీ. మగు నిరాకరణంబును, నాత్మనిరత

మైన చోటున నుపనిష ద్వ్యాహృతంబు లైన ధర్మంబులెల్ల నాయందు నెపుడు

కలుగు గాత, నాయం దవి కలుగు గాత


శా న్తి:|| భద్రం కర్ణేభి శ్శృణుయామదేవా: | భద్రం పశ్యే మాక్షభి

ర్యజత్రా:| స్థిర రజ్గై స్తుష్టువాగ్‌సప్తనూభి:! వ్యశేమ

దేవహితం యదాయ:|స్వస్తిన ఇన్ద్రో వృద్ధశ్రవా:!

స్వస్తిన: పూషా విశ్వవేదా:!స్వస్తి న స్తార్క్ష్యో అరిష్ట

నేమి:! స్వస్తి నో బృహస్పతి ర్దిధాతు ||


ఉ. విందుముగాత మాచెవుల వేలుపులార శుభంబు లెప్పుడు.

గందుముగాత భద్రములె కన్నుల నోయజనీములాగ! యె

పుందిరమైన యంగముల పోడిమి నిన్ను నుతించువారిమై

యుందుముగాత, ఆయు విరవొందగ మేనుల నీకు నింపుగన్.


ఆ.వె. ఇంద్రుడిచ్చు మేలు వృద్ధశ్రవుడు విశ్వ

వేదుడైన పూష నిభుడు నట్ల

తా నరిష్టనేమి తార్‌క్ష్యుండు మాకు బృ

హస్పతియును శుభదు లగుదు రెలమి.


శా న్తి:|| సహనా సవతు!సహనా భునక్తు!

సహవీర్యం కరనావహై!తేజస్వినా వధీత మస్తు

మా విద్విషానహై! ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తి:||


చం. మసల సతండు ప్రోచుత సమంబుగ బాలసనేయుగాపుతిన్

మనమును వీర్యమొక్కమొగిమానక చేతుముగాత, మెప్పుడున్

మనదగు నీయధీతమును మానిత తేజముగాత, ద్వేషమున్

మనకెపుడుం దొలంగుత, శమంబు శమంబుగాపుతన్!


                 --------------------------