ఆంధ్ర రచయితలు/నరసింహదేవర వేంకటశాస్త్రి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నరసింహదేవర వేంకటశాస్త్రి

1828 - 1915

ఆరామద్రావిడశాఖీయ బ్రాహ్మణుడు. అపస్తంబసూత్రుడు. శ్రీవత్స గోత్రుడు. తల్లి సీతమాంబ. తండ్రి ఉమామహేశ్వరశాస్త్రి. జన్మస్థానము: తాడేపల్లిగూడెము. నివాసము: తణుకు తాలూకాలోని వెలగదుర్రు. జననము: 1828- సర్వజిన్నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వితీయ. విశాఖ నక్షత్ర చరుర్థ చరణము. నిర్యాణము: 1915 సం|| రాక్షసనామ సంవత్సర శ్రావణ బహుళ పంచమి. గ్రంథములు: 1. వేంకటేశ్వర శతకము. 2. గౌరీ శతకము. 3. విచిత్ర రామాయణము.

ఇరువదియేండ్లు వచ్చువరకును వేంకటశాస్త్రిగారు పండితుడు కాడు. కవియును గాడు. అష్టపదులు తరంగములు కృతులు మృత్యుంజయ విలాసము అధ్యాత్మరామాయణ కీర్తనలు చెప్పుకొని పాడుకొను నొక భక్తుడు. దానికి దో డాయన మృదంగము కూడ జక్కగ వాయించు చుండువారు. వెలగదుర్రు గ్రామమునకు సభాపతియై పెత్తనము నిర్వహించుచుండెను. అట్టిసమయమున నెవరో యొక శాస్త్రులుగా రాయూరు వచ్చి మన వేంకటశాస్త్రిగారితో సంస్కృతమున మాటాడ నారంభించిరట. వీరి కాభాష బొత్తిగా రాదు. దానితో నభిమానము పుట్టి నాడు మొదలు వేంకటశాస్త్రిగారు సంస్కృతాంధ్ర భాషలు పట్టుదలతో సాధించిరి. 28 వ యేట రచించిన వేంకటేశ్వర శతకము వీరి తొలికబ్బము. తరువాత ' గౌరీశతకము ' రచించిరి. ముప్పదవయేట " విచిత్రరామాయణము " రచించుట కారంభించి మూడేండ్లలో నారుకాండములును బూర్తిచేసిరి. ఇది శ్రీరామాంకితము. ఈ కవివరుని కీర్తిని శాశ్వత మొనరించునది యీ యొక్క కావ్యమే.

గోపీనాథకవి వచనమున నీ విచిత్రరామాయణము తొలుత రచించెను. అదిచూచి గద్యపద్యకావ్యముగా వేంకటశాస్త్రిగారిది వ్రాసిరి. ఇందు లాక్షణికు లంగీకరింపని ప్రయోగములు కొన్ని యున్నను కవి త్వము మాత్రము ధారావాహి. ఆనాడు పెద్దపండితులైన కొక్కొండ వేంకటరత్న శర్మ, బహుజనపల్లి సీతారామాచార్యులు నీగ్రంథము మీద మంచి యభిప్రాయములిచ్చిరి. "...దండికావ్యము కంటెను అభినవ దండికావ్యముకంటెను జాలమేలనియెన్న దగియున్నది " అని వేంకటరత్నశర్మగారును, "...ఆధునిక గ్రంథస్థములని తెలియక యిందలి గద్యపద్యములను విన్నవారు అవి పూర్వగ్రంథస్థములేయని నిస్సందేహముగ దలంతురు " అని సీతారామాచార్యులుగారును విచిత్ర రామాయణమును గొండాడిరి. ఇందలి కవిత్వపు మచ్చునకు రెండు పద్యములు:

గుంపులుగూడి సీత మనకు న్మనసివ్వదు గాని చన్మొనల్
సొంపపు శక్రనీల మణిసోయగము న్వహియించి యున్న వీ
చంపకగంధి మోముజిగి చందురుతేటకు సాటిరా దగున్
దంపతులేమి నోచిరొకొ తథ్యము గర్భిణియందురందరున్.

లలితేందీవర కైరవాకృతజ కల్హరాదిపుష్పౌఘ సం
చలదిందిందిర బృందగానలహరీ సంయుక్తమంద క్రమా
నిలసంచారకృతార్భకోర్మియుత పానీయౌఘముంగల్గి ని
ర్మలమై యొప్పు సరోవరంబుగని రా క్ష్మాపుత్రికాలక్ష్మణుల్.

శాస్త్రిగారు తమ 78 వ యేట విచిత్రరామాయణమున నుత్తర కాండము సంపూర్తిపరిచి వారే ముద్రింపించుకొనిరి. తరువాత వారి కుమారులు 1937 లో నీగ్రంథము సమగ్రముగ వెలువరించిరి.

ఈకావ్యముగాక మనకవి ' విరాగసుమతీసంవాద ' మను వేదాంతపరమగు హరికథను వ్రాసెను. వీరికి నాగబంధ రథబంధాదుల రచనయందు మంచినేరుపు కలదు. గానకళలో జక్కని ప్రవేశము కలదు. ముహూర్త భాగమున బెద్ద యనుభవము కలదు. ఈయన యెట్టి కవియో యట్టి నైష్ఠికుడు. ఏకాదశీవ్రతము విడిచియెరుగడు. ఇట్టి భక్తకవి నోటినుండి వచ్చిన " విచిత్రరామాయణము " తెలుగుబాసకు దొడవగుట కాశ్చర్యమేమి ?