Jump to content

ఆంధ్ర రచయితలు/నోరి నరసింహ శాస్త్రి

వికీసోర్స్ నుండి

నోరి నరసింహ శాస్త్రి

1900

హరితస గోత్రులు. ఆపస్తంబ సూత్రులు. జన్మస్థానము: గుంటూరు. ప్రకృతనివాసము: రేపల్లె. తల్లి: మహాలక్ష్మమ్మ. తండ్రి: హనుమచ్ఛాస్త్రి. జననము: వికారి వత్సర మాఘ శుద్ధ సప్తమి. 6-2-1900 సం|| తేది. రచనలు: 1. గీతమాలిక 2. భాగవతావరణము (పద్యనాటిక) 3. సోమనాథ విజయము (నాటకము) 4. ఖేమాభిక్కుని 5. వరాగమనము 6. ఆత్మమృతి 7. తేనెతెట్టె 8. పతంగయాత్ర 9. స్వయంవరము. 10. షణ్ణవతి (ఇత్యాది నాటికలు, కావ్యములు) 11. నారాయణభట్టు 12. రుద్రమదేవి (నవలలు) ఇంకను, అనేక కథలు, వ్యాసములును.

శిష్టాచార సంపదలో నోరివారి వంశము పేరుమోసినది. నరసింహ శాస్త్రిగారి తండ్రి హనుమచ్ఛాస్త్రి గారు గుంటూరు "మిషను కళాశాల"లో సంస్కృతాంధ్రాధ్యాపకులు. వీరు పాదుకాంత దీక్షితులు. వారి తండ్రి గోపాల కృష్ణయ్యగారు మంత్రశాస్త్రకోవిదులు. ఇట్టి శిష్టవంశమున నరసింహ శాస్త్రిగారి పుట్టుక. వీరి పినతండ్రి గురులింగశాస్త్రిగారు సుగృహీతనాములు. వారు చెన్నపురి తొండమండలము హైస్కూలున పండిత పదవిలో నుండెదివారు. వ్యాకరణము, వేదాంతము, జ్యోతిషము, మున్నగు శాస్త్రములలో వీరిది గట్టిచేయి. తెలుగువచనములో ననేక పురాణములు వ్రాసినారు. భగవద్గీతా గుప్తార్థ ప్రకాశిక వీరు వ్రాసినదే. ఆంధ్రవాజ్మయ సూచికలో, ముద్రితములైన వీరి రచనలు చాల నున్నట్లు కనబడుచున్నది. మహాభారతము, స్కాందపురాణము, మార్కండేయ పురాణము, జైమిని భారతము మున్నగు గ్రంథములకు దెలుగువచనములు వీరు రచించియున్నారు. బరూరి త్యాగరాయ శాస్త్రులు అండు సన్సువారు వెనుక వెలువరించిన కృతులలో ముప్పాతికపాలు గురులింగశాస్త్రిగారివే యనవలయును. ఇట్టి బహుగ్రంథములు రచించిన విద్వాంసుల వంశము నరసింహశాస్త్రి గారిది.

శ్రీ నరసింహ శాస్త్రిగారు అద్యతనాంధ్రకవులలో సంప్రదాయ సిద్ధమైన రచన సాగించుచున్నారు. ఆయన దేవిభాగవత రచన నేడు సుప్రసిద్ధ మగుచున్నది. నారాయణభట్టు - రుద్రమదేవి మున్నగు నవలలు వారివి మక్కువతో బఠించుచున్నాము. నాటికలు కూడ దరచుగా నరసింహశాస్త్రిగారు వ్రాయుచున్నారు. వారి విమర్శనములు పత్త్రికలలో గనుచుందుము. అనగా వీరికలమునకు బహుముఖములుగా సాగునేర్పు కలదని స్పష్టపడుచున్నది. ఇట్టి ప్రముఖ రచయిత జీవితవిశేషములు పేర్కొనదగినవి.

1918 వరకు నరసింహ శాస్త్రిగారు గుంటూరున ' ఇంటరు ' చదివిరి. పదపడి, పచ్చయప్ప కళాశాలలో బి. ఏ. చదివి యుత్తీర్ణత. పట్టభద్రులయిన తరువాత, గుంటూరు కళాశాలలో రెండేండ్లు ఉద్యోగము. 1925 సం||లో బి. యల్. పరీక్షలో నెగ్గి గుంటూరిలో న్యాయవాదిత్వమునకు బ్రారంభము చేసినారు. 27 సం|| నుండి ' రేపల్లె ' మకాము మార్చి నేటిదాక నక్కడనే వృత్తినిర్వహణము. సంస్కృతాంధ్రములు గురుముఖమున బఠించినారు. పదవయేటనే కవి కావలె నన్న కోరిక నరసింహ శాస్త్రిగారిలో మొలకయెత్తినది. ఈ మొలకను దోహదముచేసి, మొక్కగా బెంచిన యుదారులు శ్రీ శివశంకర శాస్త్రిగారు. కొడవటిగంటి వేంకట సుబ్బయ్య, త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పెద్దిభట్ల పూర్ణశర్మ, కోపల్లె శివకామేశ్వర రావు - మున్నగు ప్రథమ ' సాహితీసమితి ' కవుల స్నేహముతో మన నరసింహశాస్త్రిగారికి నవ్యసాహిత్యములో నొక వెలుగు కానిపించినదట. పదునెనిమిదేండ్ల వయస్సు నిండువరకు వీరు వీరగ్రాంథిక వాదులు. తరువాత, వ్యావహారిక భాషావాదులు. పద్యరచనకూడ వ్యావహారికములోనే సాగింపవలెనని కొన్నాళ్లు వీరిపట్టు. అది క్రమముగా సడలి పద్యమునకు గ్రాంథికము, గద్యమునకు వ్యావహారికము కావలెనని కొంతకాలము. ఇప్పుడు పూర్తిగా నరసింహశాస్త్రి గారిలో గ్రొత్తమారుపు. వ్యావహారికభాష వచనరచనకుగూడ అనుకూలము కాదని నిశ్చయము చేసికొన్నారట. శాస్త్రాది విషయములు నిరూపించు వ్యాసములు, పూర్వకాలమునకు సంబంధించిన కథలు, నవలలు గ్రాంథికవాణిలోను, నేటి కాలమునకు సంబంధించిన కథలు, నాటికలు, సిద్ధాంతములు చేయని వ్యాసములు వ్యావహారిక వాణిలోను నుండవలయునని నరసింహశాస్త్రిగా రిప్పటికి జేసికొన్న సిద్ధాంతము. 1930 నుండి, శాస్త్రిగారిలో కర్మశ్రద్ధ ప్రబలినది. 41 సం|| నుండి పూర్ణదీక్ష. వంశీయమైన ధర్మము తప్పింప దరముకాదు.

శ్రీ నరసింహశాస్త్రిగారికి గథారచనలోను శ్రద్ధ యున్నది. గులాబిపువ్వు, శ్యామసుందరుడు, గానభంగము, చేసుకున్నవారికి చేసుకున్నంత, భవిష్యత్తు, వధూసర - ఇత్యాదులయిన వీరి కథలు సాహితి, సఖి, భారతి, ఆంధ్రవార్షిక సంచికలలో చూచియుందురు. శాస్త్రిగారి నాటికలు సోమనాధ విజయము, ఖేమార్ఖుని, వరాగమనము, ఆత్మమృతి, పతంగయాత్ర, షణ్ణవతి, ఇత్యాదులు రసికమానసములు కరగించునవిగా నున్నవి. శ్రీ శివశంకరశాస్త్రిగారి వలెనే వీరెక్కువగా బద్యనాటికలు వ్రాయుటకు మక్కువ చూపినారు. ప్రధానముగా నరసింహశాస్త్రిగారి ' నారాయణభట్టు ' పేర్కొనదగిన మంచి నవల. వీరి గద్యరచనా విధానము చాల సరస మధురమైనది. పాత్రల సంభాషణము ఉదాత్తముగా నడపింతురు. కథాసంవిధానము మీద కంటె, విషయ విమర్శనము మీద వీరు ప్రీతిచూపెదరు. ఈ గుణము " నారాయణభట్టు " లో గన నగును. పలుమొగాల వెలి విరిసిన నరసింహశాస్త్రిగారి వాణి నేడు దేవీభాగవత రచనలో బరిణతమై యున్నది. అందలి సుందరధోరణి యీతీరు గలది.

శా|| ఆలీలన్ శుకయోగి తండ్రిదరి గార్హస్థ్యంబు వెళ్ళించి పై
కైలాసాచల శృంగభూమి పితృసంగంబున్ వధుసంగమున్
బాలాపుత్ర సమస్త సంగతులు పోనంబెట్టి నిశ్చింత మే
ధాలక్ష్యం బగుపేర్మి నిశ్చలత నాత్మధ్యానియై నిల్చినన్.

శా|| అంతం గొండొకకాల మేగ శుకు డాత్మారాముడై సిద్ధుడై
వింతం గొల్పుచు సర్వభుతములకున్ విద్యుత్ప్రభాపుంజ భా
స్వంతుండై సెనసెన్ విహాయసిని భాస్వద్బింబ సంభేదియై
భ్రాతంబై గిరిశృంగ మచ్చట ద్విధా వ్రయ్యంగ నుత్క్షిప్తమై.

మ|| సకల త్రైదశ మౌనిసిద్ధ బహుధా సంస్తూయమాన ప్రథన్
శుకు డాకాశపథంబునందు పృషదశ్వుండట్లు స్వచ్ఛందుడై
ప్రకటాశాళి ద్వితీయ భాస్కరుని ఠేవన్ వెల్గుచుం బోవ, తం
డ్రికి నుత్పాత పరంపరల్ కనబడెన్ భీశోకముల్ కూర్చుచున్.


ఇట్టి హృదయంగమ శైలిలో దేవీభాగవతము నాంధ్రీకరించు శ్రీ నరసింహశాస్త్రిగారికి ' కవిసామ్రాట్ ' బిరుదముతో దేశము సత్కరించినది. సాహితీసమితి కార్యదర్శిగా వారు చేయు సాహిత్య ప్రచారము విశేషించి గౌరవార్హము.