Jump to content

ఆంధ్ర రచయితలు/తుమ్మల సీతారామమూర్తి చౌదరి

వికీసోర్స్ నుండి

తుమ్మల సీతారామమూర్తి చౌదరి

1901

కమ్మవంశీయులు. తల్లి: చెంచమ్మ. తండ్రి: నారయ్య. జన్మస్థానము: గుంటూరు మండలములోని కావూరు. జననము: 25-12-1901. రచనలు: 1.ఆత్మకథ 2. రాష్ట్రగానము 3. ఆత్మార్పణము 4. ధర్మజ్యోతి. 5. అమరజ్యోతి 6. పరిగపంట. 7. పెద్ద కాపు (కావ్యములు) 8. మహేంద్రజననము (నాటకము) 9. రామలింగేశ్వర శతకము 10. రామశతకము 11. గాంధీ తారావళి - మున్నగునవి.

తెలుగువారి కవితా శాఖలో నిరువదవ శతాబ్దివచ్చి వసంతరేఖలు దిద్దినది. ఈ శతాబ్ది యవతారముతోపాటు జన్మించిన కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఆయన కృతులు ఆంధ్రరాష్ట్రమున గానము చేయ బడుచున్నవి. వారి "రాష్ట్రగానము" పేరు విననివా రుండరు. సీతారామమూర్తి చౌదరిగారు మహాత్ముని "ఆత్మకథ" కావ్యరూపముగా సంతరించిరి. అది సుప్రసిద్ధము. ఆయన ధర్మజ్యోతి, అమరజ్యోతి, పరిగపంట పెద్దకాపు ఇత్యాదులు యువరసికులకు నిత్యపారాయణమున నున్న కృతులు.

పుర్రెకొక్క బుద్ధి పుట్టు జిహ్వకు నొక్క
రుచి జనించు నంట రూడియైన
సరసులెల్ల మెచ్చ మెరయింతు గైతలో
గమ్మ దనము మత్కులమ్మున వలె.

ఇది చౌదరిగారి నియమము. ఈ నియమము తప్పకుండ కమ్మని కవిత గల కూర్పులు మనకెన్నో వా రందిచ్చిరి. తొల్లింటి కవుల ధర్మములు వీసమెత్తు కాదనుటకు వీ రిష్టపడరు. రసభావ పరిపుష్టమైన రచనావైదగ్ధ్య మాయనలో వలసినంత యున్నది. భాష నిర్దుష్టము. పలుకుబడి బింకమైనది. ప్రాతమాటలకు క్రొత్తపూతపూయు కూర్పు నేర్పు చౌదరిగారి కెన్నడో యలవడినది. ధర్మనిష్ఠకు నదవిష్ఠమైన యితివృత్తము లాయన యేరుకొన గలవారు. ఉభయ భాషలయందును చక్కని సాహిత్యము. సంస్కృతాంధ్ర శబ్దముల బరువులు, మురువులు పట్టిచూచు, తూచి పద్యములలో సంధానింప గలుగుటలో సీతారామమూర్తికవీ చేయితిరిగిన చతురుడు. సుశిక్షితులైన కవులు నేటివారిలో బలుచబడుచున్నా రన్నమాట కొందరికి కోపకారణము కారాదు. చౌదరిగారివలె ధారాళముగా గవిత కట్టువారు లేరనికాదు. ఈ సౌభాగ్యమునకు దోడు సౌష్ఠవము కూడ నుండవలయును. దానికి, సంస్కృతాంధ్ర కావ్య పరిజ్ఞానమేకాక, వ్యాకరణ ప్రవేశముకూడ విధిగా నుండవలసినది. ఈయుభయము మన సీతారామమూర్తి చౌదరి గారిలో నున్నవి. ఈ యస్తిత్వము చూచుకొని పండితకవులును వీరిని గౌరవించుచున్నారు. విద్వత్కవులగు తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి గారితో గాళిదాసత్రయము చౌదరిగారు పాఠముచేసిరి. ఆయన యాచార్యకము వీరి భావిజీవితమున కొక మేలిదారి నగపరిచిన దనవచ్చును. ఈ కృతజ్ఞత చౌదరిగారిలో నున్నది.

ఏకశ్లోక రహస్య బోధనముచే నెవ్వాడు శిష్యున్ సుధీ
లోకాగ్రేసరు జేయు నవ్విబుధు గొల్తున్ వెంకటప్పార్యు న
స్తోక శ్లోక మయూఖరాజదఖిలాశున్ రామగాథామృతా
ఖ్యాక గ్రంథమతల్లికా జనకు మద్గైర్వాణ భాషాగురున్.

1930 లో వీరు ఉభయభాషాప్రవీణ పరీక్షలో నుత్తీర్ణత నందినారు. చిట్టిగూడూరు పాఠశాలలో వీరికి గురుత్వము నెరపిన శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రిగారిని గూర్చి ' ఆత్మకథ ' లో నిటులు స్తుతి చేయుచున్నారు. "శబ్దశాస్త్రాది లక్షణ సంప్రదాయ

మెవ్వ డెఱిగించె నాకు సయ్యిద్ధ చరితు

బ్రస్తుతించెద బుంభావ పద్మజాత

రమణి దువ్వూరి వేంకటరమణ శాస్త్రి"

ఈ యుదాహరణము లెందు కనగా, సీతారామ మూర్తిచౌదరి గారు గాలిచదువు చదివిన వారుగాక గురుకుల క్లిష్టులై శాబ్దాదుల యందు గృత పరిశ్రమ లనుటకు-వాస్తవమునకు, వారియేపద్యము పట్టినను, ఈవిషయము వెల్లడి యగును. "ఉభయతోముఖ గవాయుత దాన ఫలదాత్రి"-దేశభక్తి పదవీ నదవీయసి" "తచ్చ్రవణ సాహితి దుశ్శక మెట్టివారికిన్"-"పుంపవు రీడ్యమాన" "శ్రద్దధానుడు"-:రామాభిధానపు న్నిర యార్చీరంగ"-ఇత్యాదులైన రహస్యములు శిక్షితునకుగాని తెలియనివి. ఇట్టివి చౌదరిగారు కృతులలో వందలు వాడినారు. అట్లని, కేవల ప్రయోగ వ్యామోహము కలవారే యనుకొనరాదు. రసదృష్టిలో జూచినను వారి రచనలకు మంచి స్థానమున్నది. శయ్యా సౌందర్యము మంచిది. భావనము గంభీరమైనది. ఆవేశమును ప్రశంసనీయమైనది. పోకడలు ధర్మనిష్ఠానిష్ఠితము లయినవి. ఇక వారి ధోరణి యెటు లుండును? అందులో, నిండుగా దెలుగు దనమును వలచిన రచయితలు చౌదరిగారు. పరభాషా-వేష సంస్కార సంపర్కములు బొత్తిగా నీయనకు నచ్చవు. జాతీయ మైన పరమ ధర్మము నీయన దివ్యమంత్రముగా నుపాసించుచున్నారు. ఆయన రాష్ట్రగానాదులు దీనికి దారకాణగా నిలబడురచనలు. క్షేత్రజీవులు, ఆదర్శజీవులు, శిథిలక్షేత్రములు-ఇవన్నియు చౌదరిగారి కవితా వాహినీ పూరములో బరిపూతములగు వస్తువులు. అమ్మ తల్లులవంటి యావు లింటింటిలో

గదుపులై యమృతంబు పిదుక జేసి

కండబింకము సూపి కొండలైనను మోసి

కలుము లంది చ్చుగిత్తలను బెంచి

పనిముద్దుగాని సంపద ముద్దుగాదన్న

జీవసూత్రము శిరసావహించి

గొడగరి వడ్రంగి గోసంగి కనుదోయి

దైన్య రేఖలకు దౌదవ్వొసర్చి

కదురుగలచోటు కవ్వంబు కదలుచోటు

కఱవులకు ధూమ కేతువుగా నెఱింగి

త్యాగమున కాశ్రయము కర్మయోగి నగుచు

గీర్తిగనవయ్య భారతక్షేత్రజీవి!

       *

బెబ్బులివంటి మా తెలుగుబిడ్డమగంటిమి మొన్నసైతమున్

బొబ్బిలికోటలో నుబికి పొంగి పరాసుల ముంచిముంచి త

బ్బిబ్బొనరించి శాత్రవుల బిట్టుపొగడ్తల గాంచదా? జగం

బబ్బురమంద నాచికొనదా? శరదిందువికాసకీర్తులన్.

           *

కమ్మనిమాటలాడి నయగారము నూపినమాత్ర జచ్చు పె

ద్దమ్మల నాయకత్వ మిసుమంత సహింపడు తెల్గుబిడ్డ; శౌ

ర్యము నమంచితాశయపరంపర బిట్టు వెలార్చు నేతకై

క్రుమ్మరుచున్నవా; డతనికోరిక లెన్నటికిన్ ఫలించునో?

ఈ తీరయిన జాతీయావేశముగల కవులు తక్కువ.----లో పన్నుల నిరాకరణోద్యమమున మన చౌదరిగారు జరిమానా శిక్ష కందెను. అదిగాక, గుంటూరుజిల్లాకాంగ్రెసు సంఘములో వీరు పదేండ్లపాటు సభ్యులై జాతీయ ప్రభొధము గావించినారు. రాట్నము, గాంధి, అస్పశ్యత, పంజాబువధలు, భారతమాత ఇత్యాదిశీర్షికలతో వీరు రచించిన పద్యములు తెలుగు చదువరులకు సుపరిచితములు. వీరి యాదర్శములకు దగినటులుగా మహాత్ముని యాత్మకథ మధురమైన కావ్యముగా సంతరించినారు. ఈరచన లిటులు సాగించుచునే దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల హైస్కూళ్లలో నాంధ్రోపాధ్యాయ పదవి నిర్వహించి శిష్యుల నెందఱనో దిద్దినారు. ప్రకృతము వీ రుపాధ్యాయ పదవియందే యున్నారు.

ఈయభినవ తిక్కననుగన్న తలిదండ్రులు ధన్యులు. చౌదరిగారితండ్రి నారయ్య ధర్మజ్యోతి. ఆయన శీలసంపద శాశ్వతమైన కృతిగా సంతరించి, యీపుత్రుడు మనకిచ్చెను. జనకునిపై తనయునకు గల భక్తిగౌరవములకేకాక, నీతి నిష్ఠావిశేషమునకు, రసభావ సౌష్ఠవములకుగూడ 'ధర్మజ్యోతి' తారకాణమైన కావ్యము. చౌదరిగారు తండ్రినిగూర్చి యిటులు వ్రాయుచున్నారు:

చదువక యున్ననేమి బుధనత్తము లుబ్బగ నర్థభానసం

పద వికసింప భాగవత భారతముల్ వివరించు; హృద్యముల్

తదమలకావ్యపద్యములు ధారణ కగ్గముచేసి వేనవేల్

చదువునతండు; తచ్చ్రవణసాహితి దుశ్శక మెట్టివారికిన్.

మక్కువమై కొండికనా

డక్కఱగల యడ్డు లేనియప్పుడు నొఱసౌ

చక్కట్ల దండ లాతడు

పెక్కులు మన్మృదుల హృదయపీఠిక జుట్టెన్.

సౌజన్యమూర్తియగు "తుమ్మల" కవికి 1948 లో, కనకాభిషేక గౌరవము జరిగిన సందర్భమున శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి యధ్యక్షుడుగా విప్పిన హృదయ మిట్లున్నది. "మన చౌదరి యతిప్రాసములకై భంగపాటుచెంది తలగోకికొనుచు బలాత్కార పద ప్రయోగములుచేసి, యర్థము ననుసరించి పదములు వాడక, పదములబట్టి యర్థమును వంపులుపెట్టి వంగజేయు నీరనుడుగాడు. భావ మనర్గళముగా బ్రవహించు చందనా వ్రాయు మహనీయుడు. యతి పదాదియందేకాక మధ్యమునను గొసలువ్రాలును. ప్రాసమునకు యతికినై పద్యము నడక నిలిచి దాటవలసిన యిబ్బంది లేదు. అర్థమునుబట్టి పదములు, పదములలో లీనమైనరీతిని యతిప్రాసములు ననాయాసముగ నప్రయత్నముగ, స్వచ్చందముగ వచ్చి చేరు చుండును. ఈసిద్ధియందు బ్రసిద్ధుడు తిక్కన. ఈవర్గమున తిక్కనతో సజాతీయుడైన వాడు మన చౌదరి. అనగా సరిసమానుడని యతిశయోక్తి, బలికి ప్రమాదము దేను. ఆవర్గమున నగ్రానసత్వము లేకున్నను నానసత్వము కలవాడని నామనవి"

                            ______________





______________________________________________________________________

సరస్వతీ పవర్ ప్రెస్, రాజమహేంద్రవరము - 1950