Jump to content

ఆంధ్ర రచయితలు/దాసు శ్రీరామకవి

వికీసోర్స్ నుండి

దాసు శ్రీరామకవి

1864 - 1908

ఆరువేల నియోగిబ్రాహ్మణుడు. హరితసగోత్రోద్భవుడు. తండ్రి: కన్నయమంత్రి. తల్లి: కామాంబ. జననము 1864. నిధనము 1908. పుట్టుక: కృష్ణామండలములోని కూరాడలో. మృతి: గోదావరీ మండలములోని ఉప్పు ఏలూరులో. ఈతని ప్రత్యేక గ్రంథములు 34. 1. ఆచార నిరుక్తి 2. దురాశాపిశాచభంజిని 3. వైశ్యధర్మదీపిక 4. ఆంధ్రవీధి 5. అభినయదర్పణము 6. కృతులు 7. స్వరజితులు 8. పదములు 9. జానకీపరిణయ నాటకము 10 మనోలక్ష్మివిలాస నాటకము 11. అచ్చతెలుగు అభిజ్ఞాన శాకుంతలము 12. రత్నావళి. 13. మాలతీ మాధవము 14. మాళవికాగ్నిమిత్రము 15. ముద్రారాక్షసము 16. ఉత్తరతామచరితము 17. మహావీరచరితము 18. కురంగగౌరీ శంకరము 19. మంజరీమధుకరీయము 20. సంగీతరసతరంగిణి యను బుద్ధనాటకము 21. తర్కకౌముది 22. అభినవగద్య ప్రబంధము 23. సాత్రాజితీ విలాసము 24. లక్షణా విలాసము 25. ఆంధ్ర దేవీ భాగవతము 26. తెలుగునాడు 27. సూర్యశతకము. 28. భృంగరాజ మహిమ. 29. సంగీతరసతరంగిణి మున్నగునవి.

దేవీభాగవతము పదునెనిమిదివేల గ్రంథము. దాని నయిదునెలలో గద్యపద్యాత్మకముగా నాంధ్రీకరించి యాఱవనెలలో నచ్చున కిచ్చిన యాశుకవిసింహులు దాసు శ్రీరాములుగారు. ఆశుకవితయైనను నంద మెచ్చటను గొఱవడలేదు. దేవీభాగవతమును మెట్టమొదట దెలిగించిన కవి ములుగు పాపయారాధ్యుడు. దేవీభాగవతమును మొట్టమొదట బ్రచురించినకవి దాసు శ్రీరాములుగారు. తిరుపతి వేంకటకవు కూడ దీని ననువదించినటుల తెలియును. అదికూడ నచ్చు పడినచో నాంధ్రీకృత ప్రకటిత దేవీభాగవతముల సంఖ్య నాలుగు.

శ్రీరామకవిగారు తల్లిదండ్రుల కేకైకపుత్రులు. ఆకారణమున జిన్ననాటినుండియు గడు గారబముగా బెరిగిరి. కృష్ణామండలములోని "అల్లూరు" వీరి పూర్వులకు బూర్వప్రభువు లొసంగిరి. అందుచే వీరిజీవనమునకు లోటులేదు. తొలుత వీరిని బందరు నోబులు పాఠశాలకు జదువునకు బంపించిరి. అచ్చట నాంగ్లము , పారశీకము చదువుచు బదిమాసములు గడపిరి. ఈకవివరుని కుశాగ్రమతికి నివ్వెఱపడి నోబిలుదొర తనయింటికి నడుమనడుమ దీసికొనిపోవుచు నితనికి బుస్తకములిచ్చి ఫలాహారములు పెట్టుచుండెడివాడట. ఇది యెఱిగి శ్రీరామపండితుని తల్లిదండ్రులు క్రైస్తవమతవాసన వీని కెక్కడ గలుగునో యని యాచదువునకు స్వస్తిచెప్పించి యింటికి గొనిపోయిరట.

క్రమముగా బండితసాహాయ్యమున గొంతసంస్కృతాంధ్రజ్ఞానము నాకళించి కవిత నెల్ల నారంభించినా డీయన. 12 వ యేట వ్రాసినను వీరి సోమలింగేశ్వరశతకము ప్రౌడముగానున్నది. ఆకాలమున శతావధానప్రదర్శనమున బ్రసిద్ధినందిన మాడభూషి వేంకటాచార్యులవారు నూజవీడున సంస్థాన విద్వాంసులుగా నుండిరి. ఈయన పేరుబ్రతిష్ఠలు శ్రీరామకవిగారు తఱచు వినుచుండెడివారు. వీరికిని శతావధానము చేయవలె నని సంకల్పము ప్రబలినది. సంస్కృత విద్యాభ్యాసము గావింపవలె నని జిజ్ఞాసయు హెచ్చినది. ఒకనాటి తెల్లవాఱుజామున దల్లిదండ్రు లెఱుగకుండ నూజవీటికి బయనమయి వేంకటాచార్యులవారిని సందర్శించి వారియాదరమున నొక యవధానము గావించెను. అప్పుడాయన యీ కవికిశోరుని కవితాధారకు, మతినై శిత్యమునకు మెచ్చి "పది రెండేడుల యీడునం గవిత జెప్పంజొచ్చి వ్యస్తాక్షరీ" ఇత్యాది పద్యముతో బ్రశంసించెను. వారికడ గొంతసంస్కృతభాషాజ్ఞానము సంపాదించి మరల నింటికి వచ్చి సాత్రాజితీవిలాసము, (యక్షగానము - 14 వ యేట వ్రాసినది) పంచనృసింహక్షేత్రము, శుకరంభాసంవాదము, కృష్ణార్జునసంగ్రహము మున్నగు కొన్ని కబ్బము లల్లి 18 వ యేట నాగిరిపల్లి గీర్వాణవిద్యాపీఠమునకు బోయి సాహిత్యగ్రంథములు, సిద్ధాంతకౌముది చదివి తనకవితకు బాండిత్యపు మెఱుగు పెట్టెను.

తరువాత 'సెకండుగ్రేడుప్లీడరు' పరీక్షలో నుత్తీర్ణులై బందరులో న్యాయవాదిగా బ్రవేశించిరి. బందరుపౌరులు నాడు వీరి పాదములు వెండిపూలచే బూజించి, బంగారుపూలచే శిరము నర్చించి పల్లకి నెక్కించి బ్రహ్మరథము పట్టిరని విందుము. ఉద్యోగము చేసికొనుచు వ్యాఖ్యానపఠనము గావించుచు గవితారచనము. 1884 లో జిల్లా కోర్టు పట్టాపొంది యేలూరు 'సబార్డినేటుకోర్టు' లో బండ్రెండేండ్లవిచ్ఛిన్నముగా నుద్యోగ ధర్మము నిర్వహించిన న్యాయవాది యాయన. శ్రీరామపండితు డెంతధనసంపాదకుడో యంతదాత. పండితులకు గవులకు నీయన యెన్నో సన్మానములు గావించె. కవులయెడ సహజముగ నుండునసూయాదిగుణములు వీరియెడ గనబడవు. సంగీతాభినయగ్రంథములు చాల రచించిన కళావిదు డీయన. జ్యోతిశ్శాస్త్రమున మంచి ప్రవేశము. 1901 లో "శ్రావణమాస మధికమా, ఆషాడమాస మధికమా ? యనుచర్చ రాజమహేంద్రవరమున జరిగెను. దీని పరిష్కరణమున మువ్వురు పండితు లేర్పడిరి. నాడు వీరి సిద్ధాంతమే నెగ్గిన దని పలువురు ప్రశంచిరి. ఇదిగాక సంఘసంస్కరణము, మతాచారములు, ధర్మము, బౌతికనీతులు మున్నగు విషయములు గుఱించి వీరనేక వ్యాసములు వెలువరించిరి. 1880 సం లో ...... ...... ............... మాధవము, మహావీరచరితము, మాళవికాగ్ని మిత్రము మొదలగు నాటకము లెన్నియో యాంధ్రీకరించి ఘనత గాంచిరి.

వీరి కావ్యప్రపంచమున జిరస్థాయిగా నుండునది దేవీభాగవతము. రసవిలసితముగా నున్నది "తెలుగునాడు". ఇది స్వతంత్రపు గబ్బము. ఇందలి పద్యములు స్వభావసిద్ధములు. మందునకు కొన్ని పొందుపఱుతును.

ముదికరణాలు రాముగుడిమోసల రచ్చలుదీర్చి, భారతాల్ చదువుచు, లోకవార్తల ప్రశంసల నండ్రు: తెలుగుబాస మం చిది, మన పిల్లకాయలు వచించెడి యింగిలిపీసు పుంపునన్ బెదవులు దాట దెంతటి 'ఎఫేయు' 'బియే' 'ఎమియే' వచించినన్. లేవరు 'లెండు లెం" డనిన లేచినవారయినం దటాలునం బోవరు పోవుచున్ని లిచిపోదుము త్రోయకుండటం చీవరు సందు గేస్తునలయింతురు పెండిలిలో నదన్య సం భావనవేళ జూడవలె బావనసాముల సాములన్నియున్. నమ్మిన నమ్మకున్న నది నావశమా? జను లాడికొన్న వా క్యమ్మును నేను జెప్పిదభయంపడియో పడకో, నియోగిలో క మ్మనివార్య కార్యఘటక మ్మవుగాని పరోపకార శూ న్యమ్మును స్వప్రయోజన పరాయణముం దలపోయ నిద్ధరన్. చెళ్ళపిళ్ళ కవి వ్రాసినట్టు లిక్కవికవిత జనరంజకము, లోకానుభవ వ్యంజకము నై యున్నది. అస్సే చూస్సివషే వొషే చెవుడషే అష్లాగషే యేమిషే నిస్సా వజ్ఘలవారి బుఱ్ఱినష ఆవిస్సాయి కిస్సారుషే. విస్సం డెంతటివాడె? యేళ్ళు పదిషే......


ఈపద్య మీయనదే.


ఈయన పోతనవలె సహజపాండిత్యుడు. అతడు భాగవతము నాంధ్రీకరించిన నితడు దేవీభాగవతము నాంధ్రీకరించినాడు. ఈయన కవితాసంపన్నుడేగాక మోహనరూప సంపన్నుడు కూడనని చూచినవారు చెప్పుదురు.


ధనము, రూపము, విద్య, వితరణము, వినయము, వివేకము కలిగిన ఈ శ్రీరామపండితునకు బుత్రులాఱుగు రుదయించి పెంపొందుట యెంతటి యదృష్టమో పరికింపుడు. కుమారులకు కేశవనామములను నామములుగా నుంచెను. శ్రీరామకవి సర్వధాధన్యుడైన కవివతంసుడు. ఆంధ్రదేవీభాగవత రచయితలగు శ్రీ ములుగు పాపయారాధ్యుడు, దాసుశ్రీరామకవి, తిరుపతివేంకటకవులు, త్రిపురాన తమ్మనకవి తెలుగువారికి వందనీయులు.            ____________