Jump to content

ఆంధ్ర రచయితలు/గిడుగు వేంకట రామమూర్తి పంతులు

వికీసోర్స్ నుండి

గిడుగు వేంకట రామమూర్తి పంతులు

1863 - 1940

వీరి పూర్వులు తూర్పుగోదావరి మండలములోని ఇందుపల్లికి జెందినవారు. వీరి తండ్రిగారికి విజయనగర సంస్థానములో నుద్యోగము లభింప నక్కడకు వచ్చిరి. తండ్రి: వీరరాజు. పంతులుగారి జన్మస్థానము: ఉత్తరవిశాఖ మండలములోని పర్వతాలపేట. నివాసము: పర్లాకిమిడి, రాజమహేంద్రవరము. జననము 12-8-1863. మరణము 22-1-1940. రచించిన గ్రంథములు: 1. వ్యాససంగ్రహము 2. వ్యాసావళి 3. బాలకవి శరణ్యము 4. ఆంధ్ర పండితభిషక్కుల భాషాభేషజము 5. గద్య చింతామణి, మరియు ననేక వ్యాసములు.

రామమూర్తిపంతులుగారిచేయి నాలుగుదశాబ్దులు వాజ్మయములో నలిగినది. ఆంధ్రసాహిత్యపరిషత్తున కారంభములో రామమూర్తిగారు సభ్యులు. క్రమముగ నవ్యసాహిత్యపరిషత్తునకు వీరు ప్రతిష్ఠాపకులైరి. పంతులుగారు వ్యావహారికభాషాసౌధనిర్మితికివిశ్వకర్మలు. వీరు పాశ్చాత్యవాజ్మయమునుదఱచి ప్రాచీనభాషాతత్త్వము గాలించి యాంధ్రసారస్వత రంగమున బ్రవేశించిరి. స్వయంకృషిచేత బి. యే. పరీక్షలో రాజధానికి రెండవవాడుగా గృతార్థుడైన మేధానిధి. సగము రక్తమాంసములు భాషావాజ్మయచరిత్ర పఠనపరిశోధనములకు, బురాతన వస్తు శాస్త్రపరిశీలనములకు వెచ్చించిన దీక్షితుడు. కళింగసామ్రాజ్యముంకు ముఖ్యపట్టనము ముఖలింగక్షేత్రమని బహుళాధారములు చూపి


సవరలకు లిపి వ్యాకరణములు పుట్టించి పుణ్యము

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) వఱకు బంతులుగారు పర్లాకిమిడి రాజావారి కళాశాలలో రాజకీయార్థికచరిత్రాధ్యాపకులుగ నున్నారు. ప్రత్యేకరాష్ట్ర విభజనవిషయములో బర్లాకిమిడిని ఓడ్రులు పొట్ట బెట్టుకొనుట వీరి కసహ్యమైనది. పర్లాకిమిడి తెలుగునేలలో గలియుదాక దిరిగిరామని ప్రతిజ్ఞచేసి రాజమహేంద్రవరమున బ్రవేశించినారు.


గిడుగు రామమూర్తిపంతులుగారిపేరు స్మరించినతోడనే వ్యావహారిక వాదము స్మరణకు వచ్చును. మొట్టమొదట నీవాదముప్రతిపాదించిన వారు విశాఖపట్టణ నివాసులు పి. టి. శ్రీనివాసయ్యంగారు, గురుజాడ అప్పారావుగారు, గిడుగురామమూర్తిగారును. కన్యాశుల్కము వ్రాసిన గురుజాడ వారి కలము గిడుగువారి నూతనవాదమునకు సహస్రముఖముల సహకారియైనది. విశ్వవిద్యాలయములో వ్యావహారికము ప్రవేశ పెట్టవలె నని రామమూర్తిపంతులుగారు గట్టిపట్టు పట్టిరి. కాని కొంతకాలమువఱకు ప్రయోజనము కలుగలేదు. మొత్తము మీద నిప్పుడు విశ్వమంతయు వ్యాపించిన దనవచ్చును. "గిడుగురామమూర్తినుడువు నిల్వకపోయె, నొగి జయంతి రామమూర్తి గెలిచె" నని యప్పట్ల వడ్డాది సుబ్బారాయుడుగారు తమపక్షమునకు గలిగినవిజయమున కానందించినారు. అప్పుడు వాదమునకుబ్రచారము సన్న గిల్లినను వాదికిమాత్రము నిరుత్సాహము కలుగలేదు. నాటికిని నేటికిని నెంత మార్పువచ్చినదో చూడుడు. పరోక్షమున నెవరెట్లు తిట్టుకొనినను బ్రత్యక్షముగా రామమూర్తిపంతులుగారి వాదమును నిరసించుటకు వీలు కలుగనీయలేదు. ఈసందర్భమున నలగి నలగియున్న గ్రాంథికవ్యావహారిక వివాదముల బేర్కొని సదసన్నిర్ణయ మొనరించుట యప్రస్తుతము. కాని వీరి వాదమెట్లుండునో తెలిసికొనవలయును.


కవిప్రయోగము తప్పు అని మరి వాదించకూడదు. అది దుష్టవాదము. అది వ్యాకరణమునకు విరుద్ధముగానున్న ఆక్షేపించరాదు. కవివాడిన శబ్దములు చూచి అవి లక్ష్యముగాచేసికొని లక్షణము చెప్పవలసినవాడు లక్ష్యము తప్పనడమునకు అధికారము కలవాడుకాడు. లక్షణములో అనేకదోషము లుండవచ్చును. చెప్పవలసిదంతా చెప్పకపోవడము ఒకదోషము. చెప్పకూడనిది చెప్పడము ఒకటి...

'బాలకవి శరణ్యపీఠిక.'


ప్రాచీనకవుల కావ్యములు శ్రద్ధగాజదివి కోశాకారులు లాక్షణికులు తప్పులని త్రోసివైచిన యనేక ప్రయోగములు వానిలోనుండి యేరి యవి వ్యాకరించిరి. అదియే 'బాలకవిశరణ్యము' నన్న యాదులకు గూడ గ్రామ్యము వాడక తప్పలేదని వీరు ఘంటాపథముగా జెప్పిరి. నోటిమాటయు జేతివ్రాతయు నొకరీతిగా నుండవలెననియు, గ్రంథములలో నున్న సలక్షణభాష పరమప్రాచీనమై యందఱకు నందుపాటులో లేదనియు గనుక నదివీడి వ్యవహారభాషలో గ్రంథరచనకావింపవలెనని వీరి నాదసారము. ఈవాదము బాగుగ నున్నదని నేటి పత్రికారచయితలు, నవకవులు, ఆంగ్లవిద్యాధికులు నెందఱో యాదారిని బోవుచున్నారు. ప్రాచ్యభాషాపండితులతో గూడ నీపద్ధతి నంగీకరించిన వారు కలరు.


పక్షపాతములు వీడి తటస్థులమై రామమూర్తిపంతులు గారినిగూర్చి ముచ్చటించుకొనినచో నాయన గొప్ప వాజ్మయవేత్త. గొప్ప స్థిర సంకల్పుడు. గొప్పవిమర్శకుడు. గొప్పప్రయోగవిజ్ఞడు. అన్ని శక్తులను మించినది వీరిలో జ్ఞాపకశక్తి. భారతము పదునెనిమిది పర్వములను వీరి హృదయఫలకమున నున్నవి.నాయనా, సీతాపతీ! శాంతిపర్వము-----సములో 'వేదుఱు' అన్న ప్రయోగము 17 వ పద్య

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) దృడనిశ్చయము, కార్యదీక్ష, స్వతంత్రోద్దేశము, అహోరాత్ర పర్శ్రమము ఇవన్నియు గూడి 'రామమూర్తి' రూపముదాల్చినవి. ఈయననవకవులను వెనుకనుంచుకొని గ్రాంథికపండితులమీది కురికి శంఖనాదము చేసినారు. రామమూర్తి పంతులుగారి బధిరము వారివాదమునకు బెద్ద సాహాయ్య మొనరించినది. పంతులుగారు గంటలకొలది గంగాప్రవాహమువోలె భాషింపగల వాగ్మి. ప్రతిపక్షు లెంతగోల పెట్టుచున్నను వారికి వినబడదు. వారిధోరణి వారిదే. ఈయన తనకువచ్చిన యుత్తరములుగూడ గంఠస్థము చేసికొనెడివారు. ప్రత్యుత్తరముల నకళ్లుకూడ భద్రపఱిచెడివారు. ఈయననుగూర్చి మిత్రులొక రిట్లు వ్రాసిరి. "ఇతనిపండ్ల పటపటయందు వాడియైనతర్క మున్నది. ఈతని తీక్ష్ణదృక్కులందు మిఱుమిట్లు గొలుపు సారస్వత మున్నది. ఈతని బల్లెంపుటుక్తులయందు కోసైన మీ మాంస యున్నది. ఈతని పిడికిలి యందు బలమైన యాత్మవిశ్వాస మున్నది."


రామమూర్తి పంతులుగారికి గల తెలుగు బాస తెలివిడికి వారి 'ప్రాదెమగు గమ్మ' మేలిమచ్చు. ఈకమ్మ సలక్షణాంధ్రభాషపై క్త్తిగట్టి పోరినది. అచ్చతెనుగు కావ్యములు వ్రాసిన మహాకవులకు సైతము నిట్టిధారయు, భాషాజ్ఞానము నలవడలేదని దీనిని చూచిన దెలియగలదు.


పంతులుగారు గురుజాడ అప్పారావుగారి సహపాఠముతో 'మెట్రిక్యులేషన్‌' పరీక్ష దేలిరి. అప్పటికంతతో జదువుచాలించి యాఱునెలలు 'కలక్టరుకచేరీ' లో గుమస్తాపని చేసిరి. 1880 లో పర్లాకిమిడి పాఠశాలలో బ్రవేశించిరి. అక్కడ పనిచేయుచునే ఎఫ్.ఏ.లో నెగ్గిరి. 1892 లో నవరభాషనుగూర్చి తెలిసికొనదలచి గొప్ప కృషి చేసిరి. ముఖలింగదేవాలయము మీది శిలాశాసనలిపి చదువదొడగిరి. నవరభాషలోగల పాటలు సేకరించుటకును, తద్భాషాతత్త్వ మెఱుగు టకును పంతులుగారు ఒకయేడు వేసవిసెలవులలో గొండలకు బయలుదేఱి పోయిరి. అక్కడ వీరిని చలిజ్వరము పట్టి పీడించినది. చలిజ్వరమునకు 'క్వినైను' బ్రహ్మాస్త్రము. ఆ మందు సేవించుటచే పంతులుగారికి బధికరము ముదిరినది. నవరభాషను సంపాదింపవలయు నన్న పట్టుదలతో నొక యింద్రియముపని చెడ గొట్టుకొనిన పండితు డీయన ఆభాషలో వ్యాకరణము, నిఘంటువువ్రాసిరి. దానిలోని పాటలు వ్రాసికొనిరట. నవరలకు బడులు పెట్టించిరి. కొంద ఱాంగ్లేయులకు నవరభాష నేర్పించిరి. శబరభాషావాగనుశాసకుడగు రామమూర్తిగారు మనకు జిరస్మరణీయుడు. 1913 లో వీరిని ప్రభుత్వమువారు రావుసాహేబు అని సన్మానించిరి. వీరు భాషా సంస్కారవాదులే కాక వితంతూద్వాహము, హరిజనోద్ధరణము కోరిన సంఘసంస్కార ప్రియులు కూడను. కన్నేపల్లి వేంకటనరసింహముపంతులుగా రనబడు వీరి శిష్యులొకరు ఇంగ్లండులో 'బారిష్టరు' చదువు చదువుకొని వచ్చిరి. వారిని పిలిచి రామమూర్తి గారు తమయింట విందుచేసిరి. అది సనాతను లిష్టపడక విరిని నాడు వెలివెట్టిరి. వజ్రచిత్తున కిటువంటి వెలియొకలెక్కా! పర్లాకిమిడి ఒరిస్సారాష్ట్రములో నన్యాయముగ గలిపివేయుటను సహింపలేక, రాజాగ్రహమును దిగదుడిచి రాజమహేంద్రవరము వచ్చి కూర్చుండిన యేకైకవీరుడు రామమూర్తి పంతులుగారు. "భారతీశతకము", మఱికొన్ని గ్రంథ పీఠికలు, బహువ్యాసములు వ్రాసి పేరువడయు లక్ష్మీసీతాపతి రావుగారు రామమూర్తి పంతులుగారి సత్సంతతి.


                           __________