ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము/పీఠిక
పీఠిక.
అన్ని దేశములలోను జనులందఱును నొక్కటే భాష నెందుకు మాట్లాడరు ? శబ్దములు మొట్టమొదట నె ట్లుత్పత్తి నొందినవి ? మాటకును నది తెలియజేయు వస్తువునకును గల సంబంధమేమి ? ఒక మనుష్యునికిగాని, ఒక వస్తువునకుగాని, యున్న పేరే యేల యుండవలెను ? మఱియొక పే రెందుకు లేదు ? - ఇట్ట్లి ప్రశ్నలు మనుష్యులు తమ భాషనుగుఱించి యాలోచింప మొదలుపెట్టిన నాటనుండియు కలుగుచునే యున్నవి. పూర్వకాలమున నిట్టి ప్రశ్నలకు సమాధానములు మతమునకు సంబంధించి యుండెడివి. దైవమో, ఏదో యొక పేరుగల దేవుడో భాషను సృజించినాడనియో, లేదా, దేవుడు జంతువులన్నిటిని మొట్టమొదట సృష్టినందిన పురుషునియొద్దకు తీసికొనిపోగా, ఆ మనుష్యుడు వానికి పేళ్లుపెట్టినా డనియో, సమాధానము చెప్పుచుండెడివారు. మనుష్యుడు చేసిన పాపములకును, నతని యహంభావమునకును దండనముగా మనుష్యులభాషలలో ననేకత్వము సంభవించినదని బైబిలుప్రాచీన భాగమునందు తెలుపబడియున్నది. యూదు లిట్టి సామాన్యప్రశ్నములను గూర్చికాక స్వయంవ్యక్తములు కాని కొన్ని సంజ్ఞావాచకశబ్దముల లను గూర్చి విచారించుచుండెడివారు.
గ్రీకు వైయాకరణులుకూడ నిట్టి వ్యుత్పత్తులనుగూర్చియే వాదములు చేయుచుండిరి. కాని, వారి వ్యుత్పత్తులు శాస్త్రీయములుకాక, ధ్వనిసామ్యము ననుసరించి యుండెను. ఊహచేత కిట్టించిన వ్యుత్పత్తులతో వారు తృప్తిపడుచుండెడివారు. అయినను, వా రిట్టి స్వల్పవిషయములనేకాక, మాటలు తాము తెలియజేయు భావములకు స్వాభావికములును, ఆవశ్యకములును నయిన చిహ్నములా ? లేక; సాంకేతికములును, ఇచ్ఛాధీనముగ నేర్పరుపబడినవియు నయిన గుఱుతులా ? ఆయా భావముల కాయామాటలనేకాని, ఇతర శబ్దముల నుపయోగింప వీలులేదా?-అనునిట్టి సామాన్య విషయములనుగుఱించి కూడ నెక్కువగా వాదములు చేసియుండిరి. ప్లేటో వ్రాసిన "క్రేటిలాన్" అను గ్రంథమువంటి గ్రంథములలో నిట్టి యనంతములయిన వాదములు కనబడుచున్నవి. వీని కొకదారియు నొకతెన్నును నుండదు; సిద్ధాంతము తేలదు. వారి వాదమున కాధారము తమ గ్రీకుభాష మాత్రమే యగుటచేత నొక సిద్ధాంతమును తేల్చుటకు వీలు లేకపోయునది. ఇట్టివాదములే చాలకాలమువఱకును జరిగినవి. పరస్పర సామ్యభాషాశాస్త్రమును గుఱించి (comparative Philoiogy) యొక శతాబ్దమునుండియు కృషి జరుగుచున్నను, నిప్పటికి నిట్టి ప్రశ్నలకు సరియైన సమాధాన మిదియని చెప్ప వీలులేదు. గ్రీసుదేశములో భాషస్వాభావికమనియు (phusei), సాంకేతికమనియు (thesei) వాదించువారు రెండుపక్షములుగా నేర్పడి ఘోరముగా వాదములు చేసినారు. సోక్రెటీసను తత్త్వవేత్త శబ్దమునకును వస్తువునకును స్వాభావికమైన సంబంధ మేమియులేదని యొప్పుకొన్నను, నట్టి స్వాభావికసంబంధముగల భాషయొకటియావశ్యకమని యభిప్రాయపడినాడు. ఈ యభిప్రాయము ననుసరించియే బిషప్పు విల్కిన్సు మొదలయిన నవీనులు తాత్త్వికభాషానిర్మాణమునకు బ్రయత్నములు చేసినారు.
పైని చెప్పబడిన వాదము లెంత మనోహరముగా నున్నను, నవిశాస్త్రీయములని చెప్ప వీలులేదు. భాషావిషయముల నొకచోటజేర్చి, వానిని వర్గీకరించి, అందువలన తేలిన సామాన్యసూత్రముల నేర్పరించుటయే భాషా శాస్త్రము చేయవలసిన పని. గ్రీకు వైయాకరణు లట్టిపనిని చేయలేదు. శాస్త్రీయముగా భాషావిషయమై తత్త్వదృష్టితో నాలోచించినవారు ప్రాచీనభారతవర్షీయులు. ప్రాచీనవేదభాష కొన్నిపట్టుల దుర్గ్రాహమయ్యెను; కాని, వేదమతప్రాబల్యముచేత మంత్రములలోని యొక మాత్రమయినను తప్పకుండ, తరువాతి తరములవారు వేదములను కాపాడుకొనుచు వచ్చినారు. స్వల్పవిషయములలో గూడ వేదములలో నెట్టివ్యత్యాసమును కలుగ లేదు. ఇందువలన ధ్వనులను సంస్కృతవైయాకరణులు స్థాన, కరణ, ప్రయత్నాది భేదములతో వర్గీకరణముచేసి, వ్యాకరణరూపముల నద్భుతముగా నేర్పరించి, కృత్రిమమును సాంకేతకమును నయినను, నల్పాక్షర త్వాసందిగ్ధత్వాది నియమములతో నాశ్చర్యకరముగ భాషాశాస్త్రమును రచించినారు. ఈప్రాచ్యపద్ధతికిని పాశ్చాత్యపద్ధతికిని చాల భేదమున్నది. పాణిన్యాదుల గ్రంథములను పఠించిన పాశ్చాత్యుల కీపద్ధతి యద్భుతావహమైనది. అందుచేతనే, సంస్కృత వ్యాకరణ సంజ్ఞలను పాశ్చాత్య భాషాశాస్త్రజ్ఞులు కూడ గొన్నిటి నవలంబించి యిప్పటికిని వానిని విడువలే కున్నారు.
ఐరోపాఖండములో భాషాశాస్త్రము మొదట గ్రీసుదేశములోను, తరువాత రోములోను చాల మందముగా నభివృద్ధి పొందినది. ఆరిస్టాటిలు మొట్టమొదట భాషాభాగముల నేర్పాటుచేసి, విభక్తియను నూహను బయలు పఱచినాడు. ఈత డారంభించినదానిని స్టోయికులు (stoics) అను తత్త్వవాదులు సాగించినారు; వీరు కల్పించిన వ్యాకరణ విభాగములను, సంజ్ఞలను తరువాతివారు కూడ నవలంబించినారు కాని, యా సంజ్ఞలు లాటినుభాషలో నుండుటచేత, వానికి తప్పు టర్థములను కల్పించినారు. 'జెనికె' (genike) అనగా 'విశేషవిభక్తి' అను నర్థమున వాడినదానిని 'జెనిటివుస్' (genitivus) 'ఉత్పత్తివిభక్తి' అను నర్థమునను, 'ఐతిఆతికె' (aitiatike) అనగా కర్మవిభక్తి యను నర్థము కలదానిని 'ఐతిఆఓమై' (aitiaomai) 'నిందించుచున్నాను' అను నర్థమునను వాడినారు. తరువాతికాలమున నలగ్జాండ్రియా పట్టణమున వైయాకరణులు బయలుదేరినారు. పూర్వకవుల కావ్యముల కర్థము దుర్గ్రాహముకాగా, వాని కర్థము చెప్పుటయే వీరి ముఖ్యోద్దేశమయ్యెను. వీరు విభక్తి విశేషములను గుఱించియు, మాటల యర్థములను గుఱించియు కృషిచేసి, సామ్యము, సామ్యరాహిత్యము, అను రెండు విషయములనుబట్టి యాయా విభాగములను చేసినారు. కాని, భాషాస్వభావమును గూర్చిన జ్ఞానము నలగ్జాండ్రియా వైయాకరణులుగాని, వారి ననుసరించిన తరువాతి రోముదేశపు వైయాకరణులుగాని వృద్ధిపొందింపలేదు. అందుచేత చాలకాలమువఱకును వ్యుత్పత్తి శాస్త్రము (నిరుక్తము) బాల్యావస్థలోనే నిలిచిపోయినది.
ఐరోపాలో మధ్య యుగమున గూడ భాషాశాస్త్ర మభివృద్ధి పొందలేదు. చర్చి ప్రాబల్య మెక్కువగా నుండుటచేతను, చర్చి అవలంబించిన భాష లాటినుభాష యగుటచేతను, లాటినుభాషను, ఆనాటి నాగరకతనుగుఱించియు మాత్రమే యా కాలములో కృషిచేయుచుండెడివారు. కాని, ఈలాటిను భాష నప్పటిపండితులు శాస్త్రదృష్టితో పరిశీలింపలేదు. ఒకదాని తరువాత నింకొకటిగా బొడచూపుచుండిన దేశభాషలనుగుఱించి వారు మొదలే యాలోచింపలేదు.
మధ్యయుగ మంతరించిన వెంటనే యైరోపాలో జాతీయోజ్జీవనము కలిగినది. అందుమూలమున నన్నివిషయములందును విశాలదృష్టి యుదయించినది. లాటినుభాషకు దోడుగా గ్రీకుభాషకు గూడ ప్రాముఖ్యము కలిగినది. లాటినువాఙ్మయమున నుత్తమగ్రంథపఠనము మూలమున ప్రమాణ లాటినుభాషా పరిశోధనము హెచ్చయి వ్యాకరణము గూర్చిన కృషి ప్రబలినది. పండితు లందఱు నప్పటినుండియు సిసెరో వ్రాసిన లాటినుభాషను పరమలక్ష్యముగా నుంచుకొని, యతనివలె వ్రాయుటకు ప్రయత్నములుచేయ నారంభించిరి. ఈ లోగా దేశభాషలలో వాఙ్మయ సృష్టి కలుగుటచేతను, వాని ప్రాధాన్య మెక్కువ యగుచుండుటచేతను, నంతర్జాతీయ సహవాసమును వ్యాపారమును నభివృద్ధి యగుటచేతను, ఐరోపాలోని దేశభాషలను గూర్చిన వ్యాసంగ మభివృద్ధి యయినది. ఈ కాలముననే ముద్రణ యంత్రనిర్మాణము జరిగినది. ఇందుమూలమున దేశభాషలను చదువుట కవకాశములు హెచ్చయినవి. బైబిలు ప్రాచీనభాగమునకు మూలముహీబ్రూ భాషలో నుండుటచేత నానాటి మతాచార్యులు హీబ్రూభాషలో నెక్కువగా కృషిచేయ మొదలుపెట్టిరి. హీబ్రూభాష స్వర్గములో దేవతలుమాట్లాడు భాష యను నభిప్రాయము స్థిరపడుటచేత, ప్రపంచములోని భాషలన్నియు హీబ్రూభాషాజన్యములే యను నభిప్రాయము కుదురుకొన్నది. హీబ్రూభాష సెమెటిక్ భాషా కుటుంబములోనిది. ఈ సెమెటిక్ భాషల స్వభావ మానాటివారికి తెలిసియుండలేదు. ఈ సెమెటిక్ భాషల నిర్మాణమునకును, యూరోపియను భాషల నిర్మాణమునకును నెట్టి సంబంధమును లేకపోయినను, యూరోపియను భాషలు హీబ్రూభాషాజన్యములే యను నిశ్చయముచేత, హీబ్రూ పదములకును యూరోపియను భాషా పదములకును నేదో యొకరీతిగా ముడిపెట్టుట కారంభించినారు. అందువలన భాషాశాస్త్ర మెన్నో దోషములపా లయినది. హీబ్రూభాషను కుడినుండి యెడమ వైపునకు వ్రాయుదురు; ఆ పద్ధతినుండియే యూరోపియను భాషలలో నెడమనుండి కుడివైపునకు వ్రాయుపద్ధతి పుట్టినదని యూహించినవా రగుటచేత, నెట్టి మాటలనయినను వానిలోని యక్షరములను, ధ్వనులను తారుమారు చేసి, మార్చి, చేర్చి, యర్థసామ్య మెంతదూరముగా నున్నను సరే, వారు యూరోపియను శబ్దములకు హీబ్రూ ప్రకృతుల నేర్పాటు చేయుచుండిరి. ఈ రీతిగా నెవరి యిష్టానుసారము వారు తమయూహల ననుసరించి వ్యుత్పత్తులను గల్పించినను, నిందువలన భాషాశాస్త్రము మొట్టమొదట తప్పుత్రోవ త్రొక్కినను, కొంత కాలమునకు శబ్దజాలము నొకచోట జేర్చి, వర్ఘీకరణము చేయుటచేత, తరువాతివారు కొంత నిదానముతో నాయా శబ్దములను గుఱించి శాస్త్రీయదృష్టితో నాలోచించుటకు మార్గ మేర్పడినది.
ప్రాచీన గోధానికు (జెర్మానికు) భాషలలో 'పుల్ఫిలా' అను నతడు వ్రాసిన బైబిలుయొక్క గాధికు భాషాంతరీకరణము మొదలయిన గ్రంథము లీ లోపుగా బయలుపడినవి. అదే సమయమున నాంగ్లో - సాక్సను (ప్రాచీనాంగ్లభాష), జర్మను, ప్రాచీన ఐస్లాండికు భాషలలో గూడ బైబిలు వ్రాయబడినది. ఇందు మూలమున 18, 19 శతాబ్దములలో నీభాషా కుటుంబమునుగుఱించి చారిత్రాత్మక మగు వ్యాకరణము వ్రాయుట కవకాశ మేర్పడినది. అయినను నాకాలములో భాషాచరిత్రనిర్మాణముమీద దృష్టి తక్కువయనియే చెప్పవలెను. ఏదోయొకభాష పరిణామమును గుఱించి యెక్కువగా నాలోచింపక, యప్పటి విద్వాంసులు వ్యవహారములో నున్న యనేక భాషలలోని శబ్దజాలము నొకచోట చేర్చుటయందే శ్రద్ధవహించియుండిరి. ఇట్టివారిలో లీబ్‌నిజ్ అను తత్త్వవేత్త ముఖ్యుడు. ప్రపంచ మంతటికిని సామాన్యముగా నొక భాషను నిర్మింపవచ్చునని యీతని నిశ్చయమగుట చేత, నతడు పీటర్ ది గ్రేట్ అను చక్రవర్తిని ప్రేరేపించి యాతని రాజ్యమున వాడుకలోనున్న యన్నిభాషలకును సంబంధించిన పదసముదాయములను సమకూర్పింప బ్రయత్నించినాడు. కేధరీన్ (II) చక్రవర్తినికిగూడ నిట్టిపనియందు చాలకుతూహల ముండెడిది. ఈ రాజాదరమువలననే 'పల్లాను' (1786 - 87), హెర్వాను (1800 - 5), ఆడెలుంగు (1806 - 17), అనువారు తమ నానాభాషాకోశములను రచించినారు. ఈ నిఘంటువులలో లోపములు లేకపోలేదు. వీనిలో విమర్శదృష్టి లేదు. అన్నిభాషలను గుఱించియు నొకటే రీతిగా వీనిలో వ్రాయలేదు. నైఘంటుక విషయములే వీనిలో నెక్కువగాని, వ్యాకరణవిషయము లెక్కువగా లేవు. బైబిలుగ్రంథము మాత్రమే వీనికాధారము. అయినను నీ కోశము లానాడు చాలముఖ్యములుగా నుండెడివి. వైయాకరణులు వానిని ప్రమాణగ్రంథములుగా తలంచి, వాని యాధారమున బరిశోధనలుచేయుచుండిరి. ఈపరిశోధనములమూలముననే పందొమ్మిదో శతాబ్దమున భాషాశాస్త్రమునకు గ్రొత్త జీవము వచ్చినది. ఇదిగాక, భాషా శాస్త్రమునకు శబ్దజాలముకాక వ్యాకరణమే ముఖ్యమని తలంచినవారిలో పైని చెప్పిన హెర్వాసు పండితుడే మొదటివాడని జ్ఞాపక ముంచుకోవలెను.
సామ్యభాషాశాస్త్రము (Comparative Linguistics) ఆరంభము కాకమునుపు భాషలనుగుఱించియు, భాషాబోధనముగుఱించియునెట్టి యభిప్రాయము లుండెడివో కొంచె మాలోచింపవలసి యున్నది. అభ్యసింపదగిన భాష లాటిను. పండితులకు బరిచయముండిన వ్యాకరణము లాటిను వ్యాకరణము. అందుచేత, వ్యాకరణమనిన లాటినుభాషావ్యాకరణమనియే చాలమంది యభిప్రాయమై యుండెను. ఇప్పుడు పిల్లలు నేర్చుకోవలసిన ముఖ్యవిషయములు దేశభాష,శాస్త్రము, చరిత్రము, మొదలయినవి; కాని, ఆకాలములో వీనిని బోధించుచుండలేదు. బడులలో లాటినుభాషావ్యాకరణమే ప్రధానపాఠ్యవిషయముగా నుండెడిది. ఇప్పుడు 'సెకండరీస్కూలు' అని చెప్పబడెడు పాఠశాలకు అప్పుడు - చాలకాలమువఱకు - 'గ్రామరుస్కూలు' అనియు, డెన్మార్కుదేశములో 'లాటిన్ స్కోలె' అనియు పేళ్ళు. ఈపేళ్ళు కలుగుటకు కారణము లాటిను భాషమీది యభిమానమే. సామాన్యముగా భాషాశాస్త్రము విషయమై లాటిను భాషాపరనమునకు గల ప్రాముఖ్యమునుగుఱించియే మనమిప్పుడాలోచింపవలసిన విషయము; ఈ లాటినుభాష భాషాశాస్త్రవిషయమున ననేకవిధములుగా బ్రాముఖ్యమును వహించియుండెడిది.
లాటినుభాష ప్రకృతి ప్రత్యయ సంయోజనమువలన నేర్పడినది. అయినను నితరభాషా వ్యాకరణములనుగుఱించి ముచ్చటింపవలసి వచ్చినప్పు డాభాషలకును లాటినునకును నెట్టి సంబంధమును లేని సందర్భములలో గూడ లాటిను వ్యాకరణసంజ్ఞల నుపయోగించుచు వచ్చినారు, ఇంగ్లీషు, డేనిషు, భాషలలో ద్వితియా, చతుర్థీ, పంచమీ విభక్తి ప్రత్యయములు లేకున్నను నా భాషల వ్యాకరణములలో నా విభక్తులను జేర్చినారు. విచక్షణత లేకుండ నన్ని భాషల వ్యాకరణములలోను క్రియాప్రక్రియయంతయు లాటిను వ్యాకరణము ననుసరించి చేరినది. అందుకోస మాయాభాషల నిజస్థితికి మార్పు, కూర్పు, చేర్పులు కలుగవలసి వచ్చినది. ఆ యా భాషలలో లేని విషయములను లాటిను భాషలో నున్నవిగదా యని చేర్చుట, లాటినులో లేవనుకారణముచేత నా భాషలలో నుండు విషయములను వదలిపెట్టుటకూడ జరిగినది. లాటిను వ్యాకరణప్రమాణముతో నితర భాషలనుగూర్చి యోచించుటయిప్పటికిని సంతరించలేదు. చాల వ్యాకరణములలో లాటిను భాషావ్యాకరణదృష్టి యిప్పటికిని కనబడుచునే యున్నది.
లాటినుభాషను వ్రాతమూలముగా నేర్పుచు, నుచ్చారణమును గుఱించి శ్రద్ధ తీసికొనకపోవుటచేత నక్షరములే ప్రధానములయినవికాని, ధ్వనులకు బ్రాధాన్యము కలుగలేదు. పదియాఱవు శతాబ్దమునాటికే ఫ్రెంచి విద్వాంసులును, ఇంగ్లీషు విద్వాంసులును నొకటేలాటినుభాషలో పాండిత్యము సంపాదించియున్నను, నా భాషలో సంభాషణ చేయునప్పు డొకరిమాట లొకరికి బోధపడకుండ నుండెడివి. భాషింపబడునదేభాష, వ్రాతలోనున్నది భాషకుసరియైన గుఱుతుకాదు. భాషాజీవము నోటిలోను, చెవిలోను నున్నది; కలములోను, కంటిలోను లేదు, అను విషయము నానాటి విద్వాంసులు గ్రహింపలేదు. ఇందువలన భాషాతత్త్వము, భాషా పరిణామములగూర్చి సరియైన జ్ఞానము కలుగలేదు. ఒకభాషను మాట్లాడనేర్చుకొనుట కవకాశములున్నను పండితులు దానిని చదువుటతోనే తృప్తిపడుచుండెడివారు. భాష ధ్వన్యాత్మకమను సంగతి పదియాఱవు శతాబ్దమునుండియు భాషాతత్త్వవాదులకు సంపూర్ణముగా నిప్పటికిని పట్టువడలేదు. స్వరశాస్త్రమునుగుఱించి ఎక్కువగా నిప్పుడు కృషిజరుగుచున్నది. కాని, భాషనుగుఱించి వ్రాసినప్పటికిని చాలమంది యక్షర విన్యాసమునుగూర్చి యాలోచింతురుగాని, ధ్వని పరిణామమును గుఱించి యాలోచింపరు. వారు తాము వ్రాసినదానిని మరల చదువుకొన్నప్పుడు తబ్బిబ్బులు పడుటకూడ తటస్థించుచుండును. "పరిశోధకునికి సర్వశాస్త్ర శిక్షణము లేకపోవుటవలన ముఖ్యమయినభాషాశాస్త్ర విషయములను, సూత్రములను, విడిచిపెట్టుటయో, తార్మారు చేయుటయో, జరుగుచున్న దన్నందు కనేకోదాహరణములను చూపవచ్చును. స్ల్కీకరుపండితుడు లిథుఏనియను భాషలోని స్వరములను గుర్తించకపోవుటయు, కుర్షాటుపండి తుడు వానిని తెలియజేసినను తెలిసికొనలేక పోవుటయు నిందుకుదార్కాణము" అని స్వీటు తన 'Handbook of Phonetics' శిక్షాసంగ్రహము అను పుస్తకమున 1877 సం. రములో తెలిపిన అభిప్రాయ మిప్పటికిని వర్తించుచున్నది. ఈరీతిగా జెవికి సంబంధించిన శబ్దశాస్త్రముకంటె కంటికి సంబంధంచిన శబ్దశాస్త్రము ప్రాముఖ్యమును బొందుటకు గారణము లాటిను భాషాభ్యాసమునకు ప్రాధాన్యము నిచ్చుటయే యనిచెప్పుట కెట్టిసందేహమును లేదు.
మధ్యయుగములో లాటినుభాషనే యంతముఖ్యముగా నభ్యసించుటకు గారణము జ్ఞానసంపాదనము నిమిత్తముకాదు; జ్ఞానసంపాదము నిమిత్తమైనయెడల నేదయిన నొక యాఫ్రికాదేశపు భాషనుగాని అమెరికా దేశపుభాషనుగాని పరిశోధింపవచ్చునుగదా. లాటినువలన నేదయిన ప్రయోజనము కలుగునని కాని, అందు మూలమున నాధ్యాత్మిక విజ్ఞానము కలుగుననికాని, యప్పటివా రాభాష నభ్యసింపలేదు. అట్టియభిప్రాయమే యుండిన బూర్వకాలపు లాటినువాఙ్మయమును గాని, తర్వాతికాలపు మత వాఙ్మయమునుగాని యా కాలమువారు పఠించియుందురు. లాటిను ప్రయోజనము పండితు లొకరితోనొకరు మాట్లాడుకొనుటమాత్రమే. లాటినుభాషను కొలదిగానో గొప్పగానో యభ్యసింపని వా డానాటి పండితకోటిలో గాని, చర్చిలోగాని చేరుట కర్హుడు కాకుండెను. అందుచేత వ్యాకరణమనిన శబ్దముల ప్రకృతి ప్రత్యయవిభజనమును చెప్పుశాస్త్రముకాదు. అదియొక కళ. పదముల నామక్రియా విభక్తులను వర్ణించి వానిని సంభాషణలోను, వ్రాతలలోను, నుపయోగించుటయే యాభాషాసంపాదమువలని ప్రయోజనము. 'నీ విట్లే యనవలెను, ఇట్లనకూడదు' అనిమాత్రమే పాఠశాలలో బోధించుచుందిరి. శబ్దములను వల్లెవేయుట, సూత్రములను రుక్కువేయుట, వానిప్రకారము వ్రాయను మాట్లాడను, నేర్చుకొనుట, ఇవే వ్యాకరణముయోక్క యుపయోగములు. భాషావిషయములను స్వయముగా పరిశీలించుట వ్యాకరణమునకు విరుద్ధము. ఇందుమూలమున వ్యాకరణ మాజ్ఞాపించుశాస్త్ర మయినదికాని, భాషా మర్యాదను వర్ణించుశాస్త్రమయినది కాదు. ఈ ప్రకారముగా వ్యాకరణము ప్రయోజనములు సుశబ్దము నుపయోగించుట, యపశబ్దమును పరిహరించుట యనునవి. తరువాతికాలములో దేశభాషలకు వ్యాకరణములు పుట్టినప్పుడుగూడ వాని ప్రయోజనమును నిట్టిదే యయి యుండినది.
శబ్దజాలము విషయమై కూడ నాకాలపువారి దృష్టి యీ మార్గమునే త్రొక్కినది. ఆకాలపు ఫ్రెంచి, ఇటాలియను సాహిత్యపరిషత్తులు ప్రకటించిన నిఘంటువులలో నుత్తమ వాఙ్మయమున వాడుట కర్హమని యా పరిషత్తులు తలంచిన శబ్దములు మాత్రమే చేరినవి. ఇప్పటి నిఘంటుకారులవలె వా రాయా భాషలలో దమదృష్టిపధమున బడిన పదముల నన్నిటిని చేర్చియుండ లేదు. అందుచేత నా నిఘంటువులలో నప్పటి వాడుకలోని శబ్దముల యర్థములను వివరింపక వానిని వ్రాసినవా రుండవలసినదని యుద్దేశించిన ప్రకార మర్థములను వివరించుచుండెడివారు.
భాష నిట్లే వాడవలెను అని ఆజ్ఞాపించుటవలన చాల ననర్థములున్నవి. భాషల చారిత్రకపరిణామము, భాషకుసంబంధించిన మానసికశాస్త్రము, వీనిని గుఱించి తెలిసిననాజ్ఞాపించువిధానము పోవును. ఆరీతిగా జేయకున్న సుశబ్దాపశబ్దపరిజ్ఞానము వైయాకరణుల యిచ్ఛాధీనమగును. అందుచేత నొకప్పుడు వాడుకప్రకారము సుశబ్దమయినది నిషేధింపబడవచ్చును. ఒక శబ్దమునకు వైయాకరణులు రూపాంతరమును గూడ నిచ్చినప్పుడు రెండింటికిని లేనిపోని భేదములను కల్పించుచుండెడివారు. ఆభేద మెంత యముఖ్యమయిన దయినను నావ్యాకరణములను చదువుకొనువారు చెమటలుకార్చుకొని వల్లెవేయవలసినదే. ఇట్టి సూక్ష్మభేదములను కల్పించినవారిలో ఫ్రెంచిసాహిత్యపరిషత్తు, వారు ముఖ్యులు; ఇంగ్లాండువారు పరిషత్తును స్థాపించుకొనలేదు; లేనిపోని సూక్ష్మపరీక్షలను చేయను లేదు. వారు తమభాషను సహజముగా పెరుగనిచ్చినారు. అయినను ఇంగ్లీషు బడులలోను, వార్తాపత్రికాలయములలోను నప్పుడప్పుడు సుశబ్దాపశబ్దపరిజ్ఞానమునుగుఱించి సంకుచితాభిప్రాయములు బయలు వెడలుచునే యున్నవి. ఇప్పటికిని నిట్టి యభిప్రాయము లింగ్లాండులోనే యుండగా పదియెనిమిదో శతాబ్దమున నట్టి వున్నవనుట యొక యాశ్చర్యము కాదు.
లాటిను భాషాభ్యాసమువలన దేశభాషలకు గొన్నియెడల గీడు కలిగినది. లాటినుభాషామర్యాదకు విరుద్ధముగా నున్నను దేశభాషలు లాటిను వ్యాకరణసూత్రములనే యనుసరింపవలసియుండెను. మనుష్యుడు స్వభావముచేత పూర్వాచారపరాయణు డగుటచేతను, బడిపంతు లట్టివారిలో నగ్రేసరు డగుటచేతను, భాషలకు సహజాభివృద్ధి కలుగక కొంత నిరోధము కలిగినది.
పదునెనిమిదో శతాబ్దమునాటి గొప్ప వైయాకరణులు భాష సహజముగా ఉత్పత్తి యయినదా, కాదా, అను విషయమునుగుఱించి యెక్కువగా నాలోచించినారు. ఆదిమ మనుష్యు లందఱును నొకచోట జేరి యీవస్తువులకును నీ భావములకును నీ మాటలను వాడుకొందుమని పరస్పరము నేర్పాటుచేసికొన్నారను సిద్ధాంతమును రూసో పండితుడు ప్రతిపాదించినాడు. ఈవాదమునకు బ్రబలమైన యాక్షేపణ లున్నవి. అంతకుబూర్వము భాషలేకుండ కాలక్షేపముచేసికో గలిగిన మనుష్యులకు భాషను వాడుకొనవలెనను నక్కఱ యెట్లు కలిగినది? వారి కంతకుముందే యభిప్రాయ ప్రకటనమున కొక సాధనము లేకున్న నీ భావమున కీమాట యని యెట్లే యేర్పాటుచేసికో గలిగినారు? రూసో యభిప్రాయము భాషాచరిత్ర నిర్మాణమునకు ప్రయోజనకారి కాదు.
మాటలురాని స్త్రీ పురుషులు సహజములయిన ధ్వనులతోను నభినయముతోను, బలమైన భావములచేత ప్రేరితులై సహజముగానే యొకరీతి భాషను సంపాదించినారని కాండిలాక్ పండితుని యభిప్రాయము. అట్టి ధ్వనులు సామాన్య భావములకు సంకేతము లవుననియు, క్రొత్త భావము లుదయించిన కొలది నభినయముతో బాటు క్రొత్త ధ్వను లుత్పన్నములయి, మాట్లాడువారు కోరిన వస్తువులను భావములకును గుఱుతు లవుననియు నాతని యభిప్రాయము. ఈ యాదిమ స్త్రీ పురుషులకు గ్రొత్తధ్వనులను పుట్టించు శక్తి యుండకున్నను వారిపిల్లల నాలుక లింకను బాగుగా దిరిగి క్రొత్త ధ్వనులను పుట్టింతురు. ఆ ధ్వనులనుబట్టియు, వారి యభినయమును బట్టియు వారి తలిదంద్రులాక్రొత్తధ్వనుల కర్థముల నూహించి, యాధ్వనులను తాముగూడ జేయుటకు బ్రయత్నింతురు. ఈరీతిగా నంతకంతకు దరములు గడచినకొలదిని క్రొత్త మాటలు పుట్టుచుండును. చాల తరములవారు శ్రమపడి సాధించిన ధ్వనిసముదాయ మొక భాషగా నేర్పడును అని కాండిలాకు నభిప్రాయము.
పదియెనిమిదో శతాబ్దమున నీ భాషాప్రశ్నములనుగుఱించి యెక్కువగా నాలోచించినవాడు జొహన్ గాట్‌ప్రీడ్ హెర్డరు అను విద్వాంసుడు. ఈతడు శాస్త్రీయమైన పరిశోధన మేమియు జేయకపోయినను భాషాశాస్త్రోదయమునకు గారణ మయినాడు. ఆతడు 1772 సం. రమున "భాషోత్పత్తి" అను వ్యాసమును వ్రాసి, దానికి బహుమానమును పొందినాడు. ఆవ్యాసమున నతడు భాష మనుష్యుకల్పితమైనది కాదు; దైవదత్తము, అను నభిప్రాయమును ఖండించినాడు. దేవుడే భాషను నిర్మించి, మనుష్యుని మనస్సులోనికి జొప్పించియున్న, నది యిప్పు డున్నదానికంటె సంపూర్ణముగాను తర్కశాస్త్రానుసారిగాను నుండియుండును. మనుష్యుల భాషలో నిప్పు డెంతో భాగము గందరగోళముగాను, క్రమరహితముగాను నున్నది. అందుచేత నది దైవనిర్మితము కాదు. మనుష్యకల్పితమే. మనుష్యుడు భాషల నిచ్ఛాపూర్వకముగా గూర్చుండి సృష్టింపను లేదు. అది యతని యంత:ప్రకృతినుండి యావశ్యకమగుటచేత నుద్భవించినది. గర్భస్థ శిశువు భూమిపై బడుట కుబలాటము పడునట్లు, భాషకూడ మనస్సులో నుండి బయటికి వచ్చినది. తక్కిన జంతువులవలెనే మనుష్యుడుకూడ దన భావములను ధ్వనులమూలముగా వ్యక్తముచేయును; కాని, భావ ప్రేరితమయిన ధ్వనుల మూలముననే భాషయంతయు నుత్పత్తియయినదని చెప్ప వీలులేదు. ఆ ధ్వను లెంతస్థిరముగా కుదురుకొనియున్నను, మనుష్యుడు తానయి కోరి యాయా ధ్వనుల నాయాయర్థములలో వాడకున్న నది మనుష్య భాష కానేరదు. జంతువులకంటె నొకమెట్టుపైగా నుండి, క్రొత్త శక్తులను సంపాదించుటవలన మనుష్యు డధికుడు కాలేదు. తన సర్వశక్తులను వేఱుమార్గమున నభివృద్ధిపొందించుకొనుటచేత నతని కా యాధిక్యమువచ్చినది. మనుష్యుడు జంతువులకంటె బలములోను, నంత:కరణము (instinct) లోను తక్కువవాడే; అయినను నతని కన్నియెడలను జంతువులకంటె శ్రద్ధ యెక్కువ. అతని సంపూర్ణ మనస్తత్వ మతనిని జంతువులనుండి వేఱుచేయుచున్నది. ఈ మనస్తత్వ మిట్టిదియని విభజించి తెలియజేయ వీలులేదు. మనుష్యుడు తన మనస్సులోనికి సర్వేంద్రియములద్వారా చొరబడు వేదనలలో నుండి యొకదానిని వేఱుచేసి, దానిపై, దానిపై శ్రద్ధనిలుపగలడు. ఒక మేకపిల్లను, చూచి, దానికి ముఖ్యమైన గుఱుతు 'మే' అని యార్చుటయని యేర్పాటుచేసికొని తరువాత మేకపిల్లను చూచునప్పుడు 'మే' అని ధ్వనిచేసి, దాని కాధ్వనినే పేరుగా నతడుకల్పించుకొనును. కనుక మేక 'మే' అని యఱచు జంతు వనునర్థము కలుగును. విశేష్యములు క్రియలనుండి పుట్టును. భాష దైవదత్తమేయైనచో మొదట విశేష్యములును దరువాత క్రియలును పుట్టియుండును. అనేకవిధములయిన భావములు మనస్సులో మెలగి యొకదానిలోని కింకొటి సంక్రమించుచుండును. అందువలన మాటలకు సూక్ష్మమైన యర్థభేదములు కలిగి, యుత్ప్రేక్షలమూలముగా గ్రొత్తశబ్దములు పుట్టుచుండును. ఇందు మూలమున నాకారము కనబడకుండ పులిమిన రంగులుగల యొకపట మేర్పడును. ఇదే తొల్లింటి భాషల స్వభావము. "భాషోత్పత్తికి మనుష్యుని హీన మనస్సంపదయును, వివిధభావము లొకదానిలోని కొకటి, సంక్రమించుటయు గారణము." ఇందువలన నాదిమ భాషలలో పర్యాయపదము లెక్కువగా నుండును. మనోదారిద్ర్యముతోబా టనావశ్యవకపద సమృద్ధికూడ యాదిమ భాషల కొక లక్షణముగా నున్నది.
పైని తెలిపిన యాదిమభాషలు హెర్డరు నుదేశమున బ్రాచ్యభాషలు, వానిలో హీబ్రూభాష ముఖ్యమైనది. హీబ్రూభాషయును, హోమరునాటి గ్రీకుభాషయును, నాదిమభాషకు దగ్గఱగా నున్నవని హెర్డరు నభిప్రాయము. కాని, ఇప్పుడు మన మాదిమభాషోత్పత్తియై నాగరకత యభివృద్ధియగుటకు లక్షలు, కోట్లు, సంవత్సరములు పట్టియుండవలెనని యనుకొనుచున్నాము. హెర్డరు తలంచినట్లు భాష హీబ్రూభాషాస్థితికి వచ్చుట కత డూహించిన రెండు, మూడువేల యేండ్ల కాలము చాలదు.
హెర్డరు తన 'భాషోత్పత్తి' అను గ్రంథము మూలముననే భాషాశాస్త్ర జనకుడు కాలేదు. అతడు తన జీవితమంతయు నాశాస్త్ర చర్చలను చేయుచు, నితరులను తన యభిప్రాయమునకు మార్చుకొన్నాడు. సహజమగు పరిణామ మన్నివిషయములలోను కలుగుచున్నదన్న యతని సిద్ధాంతమునే యాధారముగా జేసికొని తరువాతికాలపు :రొమాంటిసిస్టు" లను సాహిత్యపరు లతనిదేశమున నానావిధములైన విషయములను తమ భాషలోనికి పరివర్తనము చేసికొనిరి. వారనేకదేశములవారి, అంతకుపూర్వ ముపేక్షింప బడిన పామరజనుల కవిత్వమును తమ భాషలోనికి భాషాంతరీకరించిరి. మధ్య యుగమునాటి జర్మనువాఙ్మయమును జర్మనుపామరకధలును జాల ముఖ్యములని హెర్డరు తలంచియుండెను. అందుచేత నతడు తరువాతికాలపు గ్రీకు పండితుల కాధ్యాత్మిక గురువని చెప్పవచ్చును. భాషకును మానవజాతి యాదిమ కవిత్వమునకును గల సంబంధము నాతడు గుర్తించెను. మానవజాతి శైశవా నస్థయందలి సంగీతమునకును, తరువాతి కృత్రిమకవిత్వమునకును గల భేదము నాతడు వెల్లడించినాడు. అతనిదృష్టిలో భాషయనునది వాఙ్మయమునకు సాధనము మాత్రము కాదు; భాషయే వాఙ్మయము. భాషయే కవిత్వము. ఒక జాతియొక్క ఆత్మ వా రుపయోగించు మాటలలో వ్యక్తమవును. హెర్డరు తన మాతృభాష నెక్కువగా పొగడుకొన్నాడు. అది గ్రీకుకంటె కొంచెము హీనమయిన దయినను, తక్కిన భాషలకంటె గొప్పది. తన జర్మనుభాషలోని సంయుక్తవ్యంజనములు దానికొక ధీరగమనమును కల్పించును. తన భాష పరుగులువారక, జర్మనీదేశస్థునివలె గంభీరముగా నడచును. తన భాషలోని యచ్చులు వ్యంజనములు కాఠిన్యమును మృదువు పఱుచును; అందులోని యవిరామవ్యంజనములు భాషను శ్రుతిరంజకముగాను, మనోహరముగాను, చేయును. దానిలోని మాత్రలు నిండుగను స్థిరముగాను నుండును; మాటలు ఠీవిగలిగి యుండును. జాతీయములు స్పష్టముగా నుండును. అయినను, అధునాతన జర్మనుభాష లూధరునాటిదానికంటెను, సుఏబియను చక్రవర్తులనాటిదానికంటె నింక నెక్కువగను హీనముగా పరిణమించినది. అందుచేత దానిని పునరుజ్జీవింపజేసి, శక్తిమత్పదభూయిషముగా జేయవలెను. ఇట్టి యభిప్రాయములను ప్రకటించి, హెర్డరు గెటీ యను కవీశ్వరుని, రొమాంటిసిస్టులను తన దృక్పధమునకు మార్చుటయేకాక, పిన్నవారికి ప్రాచీనకావ్యముల శుష్కపఠనమునుండి పరిశోధనమార్గములోనికి దింపినాడు. ఈ పేజీ వ్రాయబడియున్నది. ఈ పేజీ వ్రాయబడియున్నది. శుద్ధమయిన భాష యేది? ప్రమాణ భాష యేది? ఆయాభాషలలో మిక్కిలి సమర్థమయిన దేది? అందమయిన దేది? - ఇట్టి ప్రశ్నలు సాధారణముగా సనాలోచితములుగా పుట్టుచుండును. ఇట్టివి శాస్త్రీయ ప్రశ్నలు కావు. అట్టి ప్రశ్నలమీదనే దృష్టినుంచువా రుత్తమమైన, సంపూర్ణమైన భాష యెట్లుండును, అను విషయమునుకూడ చర్చించుచుండురు. శాస్త్రపరిషత్తేదియు నిట్టి ప్రశ్న నాదరింపదు. అయినను బెర్లినుసాహిత్యపరిషత్తు వారు 1794 సం. రమున నుత్తమభాషాలక్షణ మేమి? యూరోపియను భాషలలో ముఖ్యమయినవానిలో దేని కీ లక్షణము పట్టును? అను విషయమునుగుఱించి పోటీ వ్యాసములను వ్రాయించినారు. అందులో డి. జెనిష్ అను బెర్లిను నగరములోని యొక మతగురువు బహుమానమును పొందెను. ఈ వ్యాసమునుగుఱించి నాటనుండి నేటివఱకు విద్వాంసులు తలంపనైనను దలంపలేదుగాని, యది తప్పక చదువవలసిన వ్యాసము. "మనుష్యుని బుద్ధియొక్కయు నీతియొక్కయు సారము భాషలో వ్యక్తమవును. మాటతీరులోనే మనుష్యుని స్వభావము తెలియునని ప్రాచ్యులు చెప్పుమాట సత్యము. అనాగరకుని మాట మోటుగాను, మొద్దుగాను నుండును; నాగరకునిభాష లలితముగా నుండును. గ్రీకువారి భావన సున్నితముగాను, ఆలోచన సరసముగాను నుండును. రోమనులు తాత్త్విక బుద్ధి కలవారుకారు; వారు కార్యసాధనపరులు. ఫ్రెంచివారు జన సమ్మనపాత్రులు; స్నేహభావము కలవారు. బ్రిటిషువారు గంభీరస్వభావము గలవారు. జర్మనులు తత్వైక దృక్కులు వై జాతుల స్వభావమెట్టిదో, వారి భాషకూడ నట్టిదే యని జెనిషు తన బహుమాన వ్యాసముయొక్క పీఠికలో వ్రాసిన వాక్యము లతని ననుసరించినవారు కాకపోయినను హంబోల్టు, సైన్థాలు, పిన్కు, బిర్ను, మొదలయిన భాషాతత్త్వవేత్తల గ్రంథములకు మేలుబంతులుగా నుండదగినవి.
భాషయనునది మనభావముల నితరులకు తెలియజేయు నొకసాధనము; ఆక్షణమున కలిగిన భావము నప్పటికి దెలియజేసిన దాని యుపయోగము తీరి పోవును.
(1)శబ్దసంపద (2) శక్తి (3) స్పష్టత (4) శ్రావ్యత - అను నాలుగును భాషల ముఖ్యలక్షణములు. శబ్దసంపద విషయమై యాలోచించునప్పుడు, ఈ భాషలో వస్తువులకును భావములకును శబ్దము లెంతవఱకు నున్నవి అను విషయమేకాక యున్నశబ్దములనుండి క్రొత్త శబ్దముల నెంతవఱకు కల్పించుకోవచ్చును అను దానినికూడ నాలోచింపవలెను. భాషయొకా శక్తి నిఘంటువులలోను, వ్యాకరణములలోను వ్యక్తమగును. వ్యాకరణమెంత సులభమయిన ఆ భాష యంతశక్తి కలిగియుండును; భాషాశక్తి జాతిశక్తిని, ఆ జాతిలో స్వతంత్ర గ్రంథములను వ్రాయగలిగినవారిని ననుసరించి యుండును. స్పష్టత శబ్దజాలము వ్యాకరణములమీద నాధారపడి యుండును. ముఖ్యముగా నది కారకము ననుసరించి యుండును. శ్రావ్యత స్వరవ్యంజనముల వలననే కాక, వాని సంయోజనమువలన గూడ దెలియును. శ్రావ్యతా విషయమున సూక్ష్మవిషయములను కాక, మొత్తముమీద భాష చెవి కెట్లు గోచరించునో యాలోచింపవలెను.
ఈ లక్షణములనుబట్టి జెనిషు తన జర్మనుభాషను ఫ్రెంచిభాషతో సరిపోల్చి తనభాషకంటె ఫ్రెంచిభాషయే యుత్తమమయినదని నిష్పాక్షికముగ తెలిపినాడు. హెర్డరునకును, జెనిషునకును మాతృభాషయొక్కటే యయినను ఒక డభిమానప్రేరితుడై తనభాషను పొగడుకొన్నాడు. ఇంకొకడు తాన్పేరఱిచిన లక్షణములనుబట్టి తనభాషను నిరసించుకొని, శాస్త్రదృష్టిని ప్రకటించినాడు.
పందొమ్మిదో శతాబ్దారంభమున భాషాశాస్త్రనిర్మాణ విషయమున గ్రొత్త దృక్పధ మేర్పడినది. పూర్వపరిశోధకులు కొన్నిభాషలనుగూర్చి మాత్రమే యాలోచించు చుండెడివారు. ఇపుడు ప్రపంచమందలి యనేకభాషల పరస్పర సంబంధమునుగూర్చియేకాక, యాయా ప్రత్యేకభాషల నిర్మాణమును గూర్చియు, నాయాభాషల యందలి వ్యాకరణ రూపముల చరిత్రమును గూర్చియు సూక్ష్మపరిశోధనము లారంభమయినవి. ఐరోపాఖండమున భాషలవిషయమున నీచారిత్రక దృష్టికి గారణ మచటి శాస్త్రజ్ఞులకు గ్రొత్తగా సంస్కృతభాషాపరిచయము కలుగుటయే. ఇంగ్లీషువారును ఫ్రెంచివారును నిండియాలో బ్రభుత్వముకొఱకు బెనగులాడుచుండిన కాలమున నింగ్లీషు విద్వాంసులును ఫ్రెంచివిద్వాంసులును నీ దేశపు నాగరకతనుగూర్చియు, భాషనుగూర్చియు వాఙ్మయమునుగూర్చియు దెలిసికొన బ్రయత్నించిరి. ఫ్రెంచి మిషనరీ యగు కోర్డో (Coeurdoux) సంస్కృతపదములకును లాటినుపదములకును గల సంబంధమును దెలుపుచు నొక వ్యాసమువ్రాసెను ఇంగ్లీషువిద్వాంసుడగు సర్ విలియమ్ జోన్సు భాషాశాస్త్రమున సంస్కృతము ప్రాధాన్యమునుగూర్చి వ్రాయుచు "సంస్కృతభాషా ప్రాచీనత విషయమై భేదాభిప్రాయము లుండవచ్చును; కాని, దాని నిర్మాణ మద్భుతమైనది. అది గ్రీకు భాషకంటె సంపూర్ణమైనది; లాటినుకంటె శబ్దసంపదయందు విశాలమయినది; గ్రీకు లాటిను భాషల రెంటికంటె నెక్కువ సంస్కారము నొందినది. దానికిని నీ రెండుభాషలకును క్రియాధాతువుల విషయమునను, వ్యాకరణ రూపముల విషయమునను దగ్గఱ సంబంధము గలదు. ఈ సంబంధము యాదృ ఈ పేజివ్రాయబడియున్నది. ఈ పేజివ్రాయబడియున్నది. చ్ఛికము గాదు. భాషాశాస్త్రజ్ఞు డీ మూడుభాషలను సరిపోల్చునపు డవియన్నియు నేకమాతృకనుండి యుత్పన్నములైనవని తలంపకపోడు. ఆమాతృక నేడు లేకపోవచ్చును. ఇట్లే గాథికు, కెల్టికుభాషలును సంస్కృతముతో సాజాత్యము గలిగినవని యూహింపవచ్చును. ప్రాచీన పెర్షియను భాషయు నీ కుటుంబమునకు జేరినదనియే చెప్పవచ్చును" అని తెలిపెను; కాని, యాతడు తన వాదమును సమర్థించుట కాయాభాషలయందు తగిన కృషిని జేయలేదు.
సంస్కృతభాషా పరిచయమువలన భాషాశాస్త్రమునకు గ్రొత్త మార్గము ననుసంధింప గృషిచేసినవారిలో 'స్ల్కెగెల్' (Schlegel) అను నాతడు ప్రథముడు. కాని, యీతడు తత్తద్భాషలయందలి పదము లేధ్వని పరిణామ సూత్రములచే వేర్వేఱు రూపముల దాల్చినవో యను విషయమును గూర్చి కృషిచేయక, పైకి స్పష్టముగ గానవచ్చు కొన్ని పోలికలను మాత్రము గుర్తించితృ ప్తినొందెను. అతడు చేసిన సిద్ధాంతములలో ముఖ్యమయినది ప్రపంచమందలి భాషలను (1) సంస్కృతముతో సంబంధించిన భాషలు (2) తక్కినవి, అను రెండు వర్గములుగా నేర్పఱుచుట.
స్ల్కెగెలు తరువాత నాతని మార్గమున గృషిచేసిన వారిలో బాప్ (Bopp), గ్రిమ్ (Grimm), రాస్క్ (Rask) అనువారు మువ్వురును ననేక భాషలతో బరిచయము గలుగజేసికొని, వానిలో గొన్నిటికి బ్రత్యేకముగ వ్యాకరణములను వ్రాసి యాయాభాషలకు గల సూక్ష్మ సంబంధములను గుర్తించి భాషాశాస్త్రమున ధ్వనిపరిణామ సూత్రముల నేర్పఱుప బ్రయత్నించిరి.
రాస్కు నభిప్రాయమున లిఖితాధారములులేని యా యా జాతుల చరిత్రమును భాషమూలముననే తెలిసికొన సాధ్యమగును. మతము, ఆచారములు, రాజశాసనములు, సంస్థలు, అన్నియును మాఱిపోవచ్చును; కాని, సాధారణముగ భాషమాత్రము స్థిరముగ నిలుచును. దాని స్వరూపము కొంతవఱకు మాఱవచ్చును; అయినను, కొన్నివేల సంవత్సరములు గతించినను నా స్వరూపము గుర్తిపరానంత యెక్కువగ మాఱదు. ఒక భాష కితరభాషలతోడి సంబంధమును దెలిసికొనుటకు దాని నిర్మాణమును గూర్చి యాలోచింపవలయును గాని, ప్రత్యేక పదములనుగూర్చి యాలోచింపగూడదు. పదముల నొక భాషనుండి మఱియొక భాష యెరవు తెచ్చుకొనవచ్చును; కాని, వ్యాకరణరూపముల నెరవు తెచ్చికొనదు. మిక్కిలియు జిక్కయిన వ్యాకరణ నిర్మాణముగల భాష మాతృకకు దగ్గఱగ నుండును. భాష యెంత సంకీర్ణమైన దైనను నందలి యత్యావశ్యకములగు పదము లితరభాషల పదములతో సంబంధించి యుండినయెడల నా యా భాషలు పరస్పరసంబంధము గలవని చెప్పవచ్చును. ఈవిషయమున సర్వనామములును, సంఖ్యావాచకపదములును ముఖ్యములు. రెండుభాషల యక్షరములందు (ధ్వనులయందు) సామాన్య పరిణామము కాన్పించుచున్నయెడల, నా భాషల నిర్మాణవిషయమున సాదృశ్యము కాన్పించు చున్నయెడల, నా భాషలకు బరస్పరసంబంధము గలదని నిశ్చయముగ జెప్పవచ్చును.
ఈయభిప్రాయము ననుసరించి రాస్కు ఆర్యభాషా కుటుంబమున నంతర్భాగముల నేర్పఱిచెను. ద్రావిడభాషలకును సంస్కృతమునకును సంబంధములేదని మొదట తెల్పిన యాత డీతడే. గ్రిమ్ (Grimm), బాప్ (Bopp) లాయాభాషల విషయమున సూక్ష్మ విమర్శనములుచేసి, కొన్ని ధ్వని పరిణామ సూత్రముల నేర్పఱిచిరి. బాప్ (Bopp) భాషల నన్నిటిని మూడు వర్గములుగ నేర్పఱిచెను. (1) ధాతువులుగాని ప్రత్యయములుగాని లేని భాషలు: ఉదా. చీనాభాష. ఇట్టిభాషలయం దాయాపదములు వాక్యమునందున్న స్థానమునుబట్టి యర్థస్ఫూర్తి కలుగును. (2) ఏకాక్షర ధాతువులుగల భాషలు: ధాతువు లితర ధాతువులతో జేరి వివిధ వికారములను బొందుటచేత వివిధ వ్యాకరణ రూపము లేర్పడును: ఉదా. సంస్కృతము, మొద. (3) ద్వివర్ణక ధాతువులు గల భాషలు, లేక మూడు వ్యంజనములుగల ధాతువులు మూలముగా గల భాషలు: ఉదా. అరబ్బీ, హీబ్రూ, మొదలయిన సెమిటికు భాషలు. ఇం దాయా వ్యంజనముల యంతరమున వివిధాచ్చులుచేరి వ్యాకరణరూపము లేర్పడుచుండును. ఈ విభాగమును గూర్చి తరువాతి కాలమున నభిప్రాయ భేదము లేర్పడెను.
పై వారితరువాత భాషాశాస్త్రమున బేరుగడించినవాడు హుంబోల్టు (Wilhelm von Humboldt). ఇతని యభిప్రాయము ప్రకారము భాష యొక వస్తువుకాదు; అది పరిపూర్ణత నొందినదికాదు. అది చైతన్యము. అది యూహలను దెలుపుటకు వాగింద్రియ మూలమున మనస్సు చేయుచుండు నిరంతరకృషి...భాష యేకము; ప్రత్యేకపదములును వాక్యములును భాష కా జాలదు. భాషను పదములుగ విభజించి సూత్రముల నేర్పఱుచుట యది మృతదేహ మనుకొని యిచ్చవచ్చునట్లు దానిని భేధించుటవంటిది. భాషలో నేదియు నిలుకడ గాంచియుండదు; అది చైతన్యవంతమై చలనాత్మకమై యుండును. భాష యొకచో నిలుకడ గాంచుటకు దావులేదు. అది వ్రాత యందును నిలువ జాలదు. అందు నశించిన భాగమును మనస్సునందు పున:స్సృష్టి చేసికొనుచుండవలెను. భాషయనునది భాషింపబడవలెను; ఇతరులకు బోధపడవలెను. లేకున్న దానికి వ్యక్తిత్వము లేకుండును. ఎంత యనాగరిక ఈ పేజీ వ్రాయబడియున్నది. ఈ పేజి వ్రాయబడియున్నది. భాషయైనను సంపూర్ణ చైతన్యముగల వ్యక్తియే. దానిని మాట్లాడువారి మన:పరిణతి నది తెలియ జేయును. భాషను మాట్లాడువారి మన:పరిణామము ననుసరించి యా భాషయందును బరిణామము గలుగుచునే యుండును. ఈ పరిణామమునందు నూతనసృష్టి గలుగుచుండు నవస్థయు, నా సృష్టి మందగించి నిలుకడ కలిగిన యవస్థయు నను రెండవస్థ లుండును. మొదటి యవస్థయందు భాషాప్రయోజనమునుగూర్చికంటె భాషను గూర్చియే శ్రద్ధ యెక్కువగ నుండును. అందుచేత గ్రొత్త వ్యాకరణరూపము లేర్పడుచుండును. రెండవ యవస్థయం దా సంపూర్ణవ్యాకరణరూపములు శిధిలములయి యంతకంతకు నంతరించుచుండును. మనస్సు విషయ ప్రకటనమును గూర్చి యెక్కువగ నాలోచించునప్పుడు భాషనుగూర్చి యంత శ్రద్ధ వహింపదు. కావున, నీ యవస్థయందు భాష యెక్కువ మార్పులకు లోనగును. అభిప్రాయ ప్రకటనమే ముఖ్యమని తలంచి, వ్యాకరణరూపములందలి సూక్ష్మభేదముల నీ యవస్థయందు లక్ష్యపెట్టరు.
పందొమ్మిదవు శతాబ్దారంభమున నైరోపాయందలి భాషా శాస్త్రజ్ఞుల వ్రాతలయందు కొన్ని ముఖ్య విషయములను గమనింప వచ్చును. (1) సంస్కృతభాషకు బ్రాధాన్యము వచ్చెను. ఏ భాషయందలి రూపము చరిత్రమును దెలుపవలసినను మొదట సంస్కృతరూపము నెత్తుకొనవలెను. 'సంస్కృత భాషా పరిచయములేని భాషాశాస్త్రజ్ఞుడు గణితశాస్త్రము తెలియని జ్యోతిష్కుని వంటివా' డని మాక్సుమ్యూల రనెను. (2) ఈ కాలమున శాస్త్రజ్ఞు లా యా భాషలయందలి పోలికలను మాత్రము గుర్తించుచుండిరిగాని, భేదములను గూర్చి శ్రద్ధ వహింపలేదు. (3) ఆ కాలపు శాస్త్రజ్ఞులు సాధారణముగ వ్యవహారభ్రష్టములగు భాషలను గూర్చియే యెక్కువ కృషిచేయుచుండిరి. వ్యవహారమునందున్న భాషలనుగూర్చి యాలోచించు నపుడైనను, వారు వానియందలి పురాతన రూపములను గుర్తించుటయందే యెక్కువ శ్రద్ధవహించుచుండిరి.
పందొమ్మిదవు శతాబ్దమధ్యమున శాస్త్రజ్ఞుల దృక్పధమున గొంత మార్పు కలిగెను. ఒక మూలభాష వివిధమార్గముల బరిణామమునొంది వివిధభాషలుగ నేర్పడియుండెనని వారు గ్రహించినను, భాష లేలమాఱును? సజాతీయములయిన యొకభాషకును మఱియొక భాషకును నంతటి భేదము గలుగుటకు గారణమేమి? యను ముఖ్య విషయములనుగూర్చి వా రాలోచింపలేదు. బ్రెడ్స్ డార్ఫ్ (J.H. Bredsdorff) అనునతడు పదముల యందలి మార్పులకు (1) తప్పుగా వినుట, తప్పుగా నర్థముచేసికొనుట (2) ఒకమాట యథాస్వరూపమున స్మృతికి రాకుండుట (3) వాగింద్రియము లందలి దోషము (4) అలసత:- భాషయందలి మార్పులకు పదికి తొమ్మిదివంతున నిదియే కారణమని యాతని యభిప్రాయము (5) స్వరసామ్యమునుబట్టి క్రొత్త పదముల నేర్పఱుచుట (6) స్పష్టోచ్చారణమునకై ప్రయత్నము (7) నూతన భావప్రకట నావశ్యకత, అనునవి కారణములుగ నిరూపించి యున్నాడు. ఈ కారణములలో గొన్నిటిని దరువాతివా రంగీకరింపలేదు.
ఈ కాలమున భాషాశాస్త్రమున గలిగిన క్రొత్త పద్ధతి యా శాస్త్రము భాష యేరీతిగా నుండవలెను, ఎట్టి భావ యుత్తమభాష యను విషయములను నిర్ణయించుట గాక, వృక్షశాస్త్రము మొదలగు శాస్త్రములందువలె భాషయందు కానవచ్చు వివిధ విషయములను క్రోడీకరించి, వర్గీకరించి, వాని స్వరూపము నున్నదున్నట్లు చెప్పుట. ఈ పద్ధతి ననుసరించి పందొమ్మిదవు శతాబ్దము మధ్యమున ననేక భాషల స్వరూపము నిర్ణయింప బ్రయత్నములు జరిగెను. ఆయా భాషల యథార్థస్వరూపములనుబట్టి మ్యాక్స్ మ్యూలరు (Max Muller) మొదలగువారు ప్రపంచభాషల నన్నిటిని వాని వాని లక్షణముల ననుసరించి వివిధభాషాకుటుంబములుగ నేర్పఱిచిరి. ఇట్లేర్పడిన యనేక కుటుంబములందలి ప్రత్యేక భాషల లక్షణములను, నొక భాషయందలి ధ్వనులు మఱియొక భాషయందు పరిణమించిన తీరును, ననుసరించి యా కుటుంబములోని భాషలన్నిటికిని నొకమాతృక యుండవలెనని యూహించి, యా మాతృభాష స్వరూపమును నిర్మింప విద్వాంసులు పూనిరి. అందు ప్రాచీన ఇండో - జెర్మానికు మాతృభాషా నిర్మాణమును గూర్చి యెక్కువ కృషి జరిగెను. ఇందుకొఱకు 'స్వరశాస్త్రము' (Phonetics) నెక్కువగ నభివృద్ధి చేసికొనసాగిరి. కాని, యీ మూలభాషానిర్మాణ విషయమున ననేక కారణములచే శాస్త్రజ్ఞులు కృతార్థులు కాలేదు. వా రీవిషయమున నవలంబించిన పద్ధతి తీవ్రమగు విమర్శకు గుఱియైనది.
పందొమ్మిదవు శతాబ్దము నంతమువఱకును బాశ్చాత్యపండితులు భాషాశాస్త్రమున జేసిన కృషినిగూర్చి యింతవఱకును సంగ్రహముగా దెలుపబడినది. ఆ తరువాత నీ శాస్త్రమును గూర్చి నిరంతరకృషి జరుగుచునే యున్నది. నేడు భాషాశాస్త్రమున మఱియొక యుగ మారంభమయినదని చెప్పవచ్చును. ఈ క్రొత్తయుగమును గూర్చి విట్నీ (Whitney) "పూర్వకాలమున నశాస్త్రీయముగ పదముల వ్యుత్పత్తులను నిర్వచించుటకును నేటి పద్ధతికిని జాల భేధము గలదు. పూర్వు లేర్పఱిచిన వ్యుత్పత్తుల నిప్పటివారు కొన్నియెడల శాస్త్రసాధ్యము లని యొప్పుకొన్నను దగినంత ప్రమాణములేక, వానిని పరిగ్రహింపరు. ఎంత చిన్నవిషయమైనను దానికి సంబంధించిన యితర విషయములనన్నిటిని నేటివారొకచో, జేర్చుకొందురు. అనేక విషయముల ఈ పేజీ వ్రాయబడియున్నది. ఈ పేజివ్రాయబడియున్నది. పరిశీలనము చేసినగాని నేడెవ్వరును సిద్ధాంతముచేయరు. భాషాశాస్త్రజ్ఞుడు నేడు శబ్దరూపముల నన్నిటిని జేర్చి ప్రతిశబ్దము చరిత్రమును బ్రత్యేకముగ శాస్త్రపద్ధతి ననుసరించి యేర్పఱుచు కొనును" అని చెప్పియున్నాడు. నేటి శాస్త్రజ్ఞు లెన్నో స్వరపరిణామ సూత్రముల నేర్పఱుచుకొని క్రొత్త సిద్ధాంతములను చేయుచున్నారు. నేడు వ్యవహారభ్రష్ట భాషలుకాక, జన వ్యవహారమందున్న జీవద్భాషలు పరిశోధనమునకు గుఱియగుచున్నవి. సంధి, స్వరము, అర్థపరిణామము, మొదలగు ననేకవిషయములను గూర్చి విద్వాంసులు సూక్ష్మచర్చల జేయుచున్నారు.
పాశ్చాత్య విద్వాంసులు భాషాశాస్త్ర విషయమున జేసిన కృషి యమితముగ నున్నది. కాని, ద్రావిడభాషలను గూర్చిన పరిశోధనము చాల తక్కువ యనియే చెప్పవలెను. తమిళభాషను గూర్చి 'పోపు (Pope), మలయాళ భాషనుగూర్చి గండర్టు (Gundert), కన్నడమునుగూర్చి రైసు (Rice), కిట్టెలు (Kittel), తెనుగున బ్రౌను (Brown), మొదలగువా రాదియందు కొంత కృషిచేసియుండిరి. వారి తరువాత నీ ప్రత్యేకభాషల విషయమునను, నీ భాషల పరస్పర సంబంధము విషయమునను, ద్రావిడభాషా వర్గమునకును నితర భాషావర్గములకును గల సంబంధము విషయమునను నెక్కువ కృషి జరుగలేదు. కాల్డువెల్లు 1856 సం. ర ప్రాంతమున వ్రాసిన 'కంపేరెటివ్ గ్రామర్ ఆఫ్ ది డ్రెవిడియన్ లాంగ్వేజస్' అను గ్రంథమే ద్రావిడభాషల పరస్పర సంబంధమును గూర్చియు, వానికిని నితర భాషావర్గములకును గల సంబంధమును గూర్చియు, చర్చలుగల గ్రంథముగా నున్నది. దానినే నేటివారు పరమప్రమాణముగా నంగీకరించుచున్నారు. కాని, కాల్డువెల్లు తనకు తమిళముతో మాత్ర మెక్కువ పరిచయము కలదనియు, తక్కిన ద్రావిడ భాషలను బాగుగ నభ్యసించినవారు, తమతమ భాషలను ప్రధానముగ జేసికొని యాలోచించినయెడల వేఱు సిద్ధాంతముల జేయుట కవకాశమున్నదనియు, అట్టి కృషిచేయుటకు దగినవా రీదేశపు పండితులే యనియు, ప్రత్యేక ద్రావిడభాషలనుగూర్చి యెక్కువ కృషి జరిగినగాని యీ విషయమున నిదమిత్థమని చెప్ప వీలులేదనియు తెలిపియుండెను. కాని, యాత డాశించినట్లీ విషయమున దేశీయపండితు లెక్కువ కృషిచేసి యుండలేదు. ఇకముందు ఒకొక్క ద్రావిడభాషయొక్క చరిత్రమును దెలిసికొన బ్రయత్నములు జరుగవలసి యున్నవి.
ఆధునిక భారతీయ భాషలలో బాంగ్లా (Bengali) భాషకు సునీత్ కుమార్ ఛాటర్జీ చరిత్రమును వ్రాసెను. మఱియే భారతీయ భాషకును నట్టి చరిత్రము బయలువెడలినట్లు కాన్పింపదు. ఆంధ్రభాష కట్టి చరిత్రమును వ్రాయుటకు నాకు జాలకాలమునుండియు గోరిక యుండినది. వ్యావహారికాంధ్రభాషోద్యమ మట్టి చరిత్రను వ్రాయుటకు సహకారియైనది. ఈగ్రంథ మా యుద్యమమున కొక ఫలమని చెప్పవచ్చును. వ్యావహారికభాష నేటివారి వ్రాతలయం దెట్లు వ్యాపించుచున్నదియు దెలుపుట యప్రస్తుతము.
ఆ యుద్యమము నారంభించునపుడు గ్రామ్య లనియు సలాక్షణికములనియు పండితులు నిషేధించు చుండిన శబ్దములకును వ్యాకరణ రూపములకును కవుల గ్రంధముల నుండి ప్రయోగముల నెత్తిచూపవలసి వచ్చినది. దానికొఱకు కృషి యమితముగా జరిగినది. వ్యావహారికాంధ్రభాషా ప్రవర్తకు లట్టి పూర్వకవుల ప్రయోగముల జూపుటయేకాక నేటిగ్రంథకర్తలు తమ గ్రంథములందు నేటి వ్యవహారము నెట్లతిక్రమింప జాలకున్నారో, పూర్వకాలపు భాషతో సరియగు పరిచయము లేకపోవుటచేత పూర్వకావ్యభాష ననుకరింపబోయి యెట్టి భ్రమ ప్రమాదములకు లోనై యెట్టి కృతకభాషను గల్పించి, భాషాభివృద్ధిని తన్మూలమున జ్ఞానాభివృద్ధిని లక్ష్యమునం దుంచుకొనక, యొకరితప్పుల నొకరెంచుకొనుటతోడనే కాలక్షేపము చేయుచున్నారో వివరింపవలసివచ్చినది. ఆ యుద్యమమువలన బూర్వ కాలపుభాషయందు వ్రాయుటవలన నెట్టి ప్రయోజనమును లేదనియు, భాషకు ముఖ్యప్రయోజనమగు నభిప్రాయ ప్రకటనమును, జనులయందెల్ల విద్యావ్యాప్తియు సిద్ధింపవనియు కొందఱికి నచ్చి, వ్యావహారిక భాషయందే గ్రంథములను వ్రాయజొచ్చిరి. వ్యావహారిక భాషావాదుల కృషి మూలమున నేడు క్రొత్తరీతి భాషారచన బయలుదేరినది. ఆరచనలయందు లోపములు లేకపోలేదు. ఆలోపముల నెట్లు సవరించుట యను విషయమును గూర్చి ప్రసంగించుట కిది తావుగాదు.
పూర్వకవుల ప్రయోగములే సాధువులనియు నర్వాచీన కవులప్రయోగములు దుష్టములనియు గ్రాంధికవాదులందురు. కాని, పూర్వకవులభాష స్వరూపము నెవ్వరు నేర్పఱించి యుండలేదు. అట్లేర్పఱుచుటకు బూర్వకావ్యముల నన్నిటిని పూర్వభాషా సంప్రదాయ సూచకములగు పూర్వకాలపు శాసనముల మూలమునను పూర్వకాలపు వ్రాతప్రతులమూలమునను సరిచేసి, వానిలోని భాషను వ్యాకరింపవలయును. ఆంధ్రభాషాచరిత్ర నిర్మాణమునకుబూర్వ మిట్టికృషి యెంతయో జరుగవలసియున్నది. ఇప్పటి ముద్రిత గ్రంధములలో గొన్ని పండిత పరిష్కృతము లయినను నాపరిష్కరణము శాస్త్రీయముగ జరుగలేదు. కావున, నాయా వ్యాకరణ రూపముల వివిధ కాలావస్థలను గూర్చి యిదియే సిద్ధాంతమని చెప్పుట సాహసమే. కాని, యీ గ్రంధమున నాంధ్రభాషాచరిత్ర నిర్మాణమునకు దారితీయ బ్రయత్నించితిని. అందుకు నన్నయ భారతభాగము భాష నానాటి శాసనముల మూలమునను, ఇంచుమించు నూఱు వ్రాత ప్రతుల సహాయమునను నిరూపింప బ్రయత్నించితిని. ఈ గ్రంధమందలి 'పదునొకండవు శతాబ్దమునాటి తెనుగుభాష'యను నధ్యాయ మాకృషికి ఫలము. అటుపిమ్మట ననేకాంధ్ర కావ్యముల భాషయందు గానవచ్చిన వ్యాకరణ విశేషములను సాధ్యమయినంత వఱకును గుర్తించి, వానిని వర్గీకరించి యాయా విషయముల ననుసరించి యేర్పఱిచితిని. నేటికి బ్రకటింపబడిన శాసనముల నన్నిటిని బరిశీలించి యందలి ప్రయోగముల నాయాప్రకరణములందు చేర్చితిని. వ్యావహారికభాష యేయే కాలములందు గ్రంథస్థమగుచు వచ్చినదో నిరూపించితిని. కావ్యములందు చేరని వ్యావహారిక రూపములను నచ్చటచ్చట నుదాహరించితిని. పూర్వ వైయాకరణులు వ్యాకరణ విషయమున జేసిన కృషి నంతటి నుపయోగించికొంటిని. ఆంధ్రభాషకును దక్కిన ద్రావిడ భాషలకును, ద్రావిడభాషా వర్గమునకును నార్య భాషా వర్గమునకును గల సంబంధమును నాకు దోచినట్లు వివరించితిని.
ఈ గ్రంధమున గ్రియాప్రకరణము నవ్యయప్రకరణమును స్థలసంకోచముచే ననుకొన్నంత విస్తరించి వ్రాయుటకు వీలు లేకపోయినది. ఈ రెండు ప్రకరణములందును దెలుపవలసిన విశేషము లనేకములు మిగిలిపోయినవి. గ్రంధపునర్ముద్రణమున వానిని జేర్చెదను. శిశువుల భాష, స్త్రీల భాష, మాండలిక భాషలు, సాంకేతిక రహస్యభాషలు, మొదలగు మఱికొన్ని విషయములను గూర్చియు వివరింపక యాంధ్రభాషాచరిత్రము సంపూర్ణము కాజాలదు. వానిని గూర్చి యీ గ్రంధమున దెలుపుటకు దావులేకపోయినందుకు జింతిల్లుచున్నాను.
ఈ గ్రంధరచనమునందు నా గురువుగారగు మహారాజశ్రీ రావుసాహేబు గిడుగు రామమూర్తి పంతులుగారు వాఙ్మయమునుండి గుర్తించికొని యుండిన యనేక ప్రయోగముల నుపయోగించుకొన్నాను. ఆంధ్రభాషను గూర్చి వారికంటె నెక్కువ కృషిచేసిన వారు లేరు. వారే యీ యాంధ్రభాషా చరిత్రమును వ్రాయ నర్హులు. కాని, వారి జీవితములో ముఖ్యభాగ మంతయు బండితులతోడి వాదములతోను, వ్యావహారికభాషా ప్రవర్త నోద్యమముతోడను గడచిపోయినది. మేమిద్దఱమును నొకచోటనుండి పనిచేయు నవకాశములు లభింపలేదు. అట్టిది సందర్భపడియుండిన, వారి యుపదేశాను సారముగ నింకను నెక్కువగ భాషనుగూర్చి పరిశ్రమచేసి యుందును. రామమూర్తి పంతులుగారికిని నాకును బ్రధాన విషయమగు ద్రావిడభాషలకును నార్యభాషలకును గల సంబంధమును గూర్చి యభిప్రాయ భేధము గలదు. నా వాదమును వా రంగీకరింపరని నాకు దెలియును. కాని, యా విషయమున నేను సేకరించిన సాక్ష్యమునంతటి నొకచో జేర్చి చూపియున్నాను. అది సరిపోయిన సరిపోవు గాక; సరిపోకున్న నింకను నా విషయమున నెక్కువ కృషి జరుగవలసి యున్నదని మాత్రము చెప్పవలసియుండును. తమతమ వాదములే గెలువవలె నను పట్టుదల తత్త్వైకదృక్కుల కుండగూడదు. ఉన్న విషయములను పరామర్శింపక విడిచిపెట్టను గూడదు. వారీ విషయమున నేను చూపిన సాహసమునకు హర్షింతురనియే నా నమ్మకము.
ఈ గ్రంధమున వివాదగ్రస్తములగు ననేక విషయములను గూర్చిన చర్చలు గలవు. అనేకులు నా యభిప్రాయములతో నేకీభవింపరని నాకు దెలియును. కాని, యాయా విషయములను గూర్చి వ్యక్తిగతముగ గాక నిష్పక్షపాతముగ విమర్శింతురు గాక యని ప్రార్థించుచు పండితమండలి కంజలి యెత్తుచున్నాను. ఇందు లోపములును దోషములును లేవని తలంచునంతటి వెఱ్ఱినిగాను. లోపములున్నవి. దోషములు నున్నవి. ఆంధ్రభాషా చరిత్ర నిర్మాణమున కిది ప్రథమ ప్రయత్నము. మున్ముం దెవ్వరైన నీ మార్గమున బనిచేసి యింతకంటె బ్రామాణకమును సమగ్రమును నగు గ్రంధమును వ్రాయుట కిది దారియగును గదా యని సంతోషించుటకు మాత్రము నాకు స్వేచ్ఛకలదని మనవి చేసికొనుచున్నాను.
ఆంధ్రభాషాచరిత్రమున దెలుపవలసిన విషయము లింక నెన్నియో యున్నవి. ఇప్పటికే గ్రంధము విస్తరించుటచేత నెన్నియో విషయములను జేర్పజాల నైతిని. గ్రంధములోని కెక్కక మిగిలి పోయిన ప్రయోగసామగ్రిని నితర విషయములను నికముం దెన్నడైన వేఱు సంపుటమున పొందుపఱచుకొందును.
ఈ గ్రంథమును వ్రాయుటకు నాకు దోడ్పడిన గ్రంథము లనేకములు గలవు. వాని నా యా సందర్భములందు తెలిపియే యున్నాను. వానికి వాడిన సంక్షేప సంకేతములు సులభముగనే తెలియును గావున, వాని పట్టికను బ్రత్యేకముగ జేర్పలేదు.
ఈ గ్రంథమును వ్రాయుటకు నన్ను బ్రేరేచినవారు డాక్టరు కట్టమంచి రామలింగారెడ్డి, ఎం. ఏ. (కేంటబ్), డి. లిట్. గారు. ఆంధ్ర విశ్వ ఈ పేజీవ్రాయబడియున్నది. ఈ పేజీవ్రాయబడియున్నది. విద్యాలయ కేంద్రస్థానము బెజవాడలో నున్నపుడు వారికి నే నాంధ్రభాషా విషయమున జేసిన కృషినిగూర్చి కొంత నివేదించితిని. వారును సంతోషించి యీ గ్రంధమును వ్రాయుమని సెలవిచ్చుటయే కాక, దీని నాంధ్ర విశ్వవిద్యాలయము పక్షమున బ్రచురింపించు నవకాశము గల్పించిరి. వారు విశ్వవిద్యాలయోపాధ్యక్షులుగ నుండినప్పుడు వ్రాయ నారంభించిన యీగ్రంథము వారు మఱల నా స్థానమున నున్నపుడే ముద్రణమునంది ప్రకటనము గాంచుట నాకు ముదావహముగ నున్నది.
గ్రంథముద్రణవిషయమున నతిశ్రద్ధవహించి నా కనేక విధముల దోడ్పడిన శ్రీ ఆనంద ముద్రణాలయమువారికి నే నెంతయు గృతజ్ఞుడను. ఇట్టి గ్రంథమును ముద్రించుట కష్ట సాధ్యమయినపని. సాధారణమయిన మఱి యే ముద్రణాలయమువారికయినను నీగ్రంథముద్రణ మసాధ్యమనియే చెప్పవచ్చును.
- చిలుకూరి నారాయణరావు.
అనంతపురము,
1 - 11 - .1936