Jump to content

ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము/ఆర్యభాషలు

వికీసోర్స్ నుండి

రంగ్:- మీ యవ్వ్ యాతడ్ ఒస్తా-----------------ద్దర్. అంద్ ఆట్ ఒళేబారక్ --------------- చలుదు? నాను అవడీ పోతుడత అగితె --------------- నద్ ఒదర్" అంటు నివ్వు మొన్నా శెప్పిరాదడి -------------- ఒస్తి? నీకి ఒనంద్ మవసా ల్యాకుడెన్ నా ---- పోతాను."

గోవింద్:- "రంగా, నివ్వు హిళ్ళ్ కే సంది చెలువా? జరా 'నిచ్‌', మా యావ్వ ఇవుౝ ఒసన్."

రంగ్:- "మీ యవ్వ్ ఎంద్ పాడాయి? ".

గోవింద్:- "మా సినవ్వ్ కూత్రమెయనాన్ చలూలేదు? దాత్ మాడాడస్ పోడాయి."

రంగ్:- "హళగితేన్ ఆదేమ్ లగ్గ్ ఒస్తాయి? అందునాల్ గళగలా కుసర్బడి, దన్ వైని వసన్? దన్నుటి నివ్వు కుసర్బడు, నాను పోతాను. ఈపొద్ద్ ఆట్ ఒళె చమత్ అగతాయి."

____________

ఆర్యభాషలు.

____________

1. ఇండో యూరోపియను భాష లీ క్రిందివిధముగఁ బాశ్చాత్య పండితులచే విభజింపఁ బడియున్నవి.

1. ఇండో ఐరేనియను శాఖ.
2. ఆర్మేనిక్ శాఖ.
3. బాల్టిక్ - స్లావిక్ శాఖ
4. ఆల్బేనియన్ శాఖ.5. హెల్లెనిక్ శాఖ.
6. ఇటాలిక్ శాఖ.
7. కెల్టిక్ శాఖ.
8. జర్మానిక్ లేక ట్యూటోనిక్ శాఖ.

ఈ శాఖలలో మొదటిదగు ఇండో - ఐరేనియను, లేక ఆర్యశాఖకు సంబంధించిన భాషలు మనకు ముఖ్యములైనవి. ద్రావిడభాష ఆర్యభాషలతో సంబంధ----------ప్రాయమును విమర్శింపవలసి యున్నది. కావున వానిని గూర్చి యిచట ముచ్చటించుట యావశ్యకమగుచున్నది.

2. ఆర్యభాషల శాఖోపశాఖల నీ క్రిందివిధముగా బండితులు నిరూపించి యున్నారు.

i. ఇండికు, ఇండియను, లేక ఇండో - ఆర్యభాషలు:- వేదభాష, సంస్కృతము, ప్రాచీన ప్రాకృత శాసనములలోని ప్రాకృతభాషలు, పాలి, పూర్వవాఙ్మయ గ్రధితములైన ప్రాకృతభాషలు, అపభ్రంశభాషలు, నేటి యార్యభాషలు, ఎళు, లేక, ప్రాచీన సింహళభాష, ఆధునిక సింహళభాష, ఆర్మీనియా, సిరియా, తుర్కీ, యూరోపు దేశములలోని జస్సీభాషలు, ఈ వర్గములలో చేఇనవి.

ii. దర్దికు, లేక పిశాచభాషలు, (అ) కాఫిర్-భాష్గలీ, వై - కలా; వసీ - వెరి, లేక, ప్రేసున్; కలష, గవల్‌బతీ; పషై. (ఆ) ఖో-వార్. లేక, చిత్రాలీ. (ఇ) షిణ; కోహిస్తాని, కాశ్మీరీ; - యనుభాష లీ వర్గములోనివి.

iii. ఐరేనియను భాషలు; ఇవి యీ క్రిందిపట్టికలో చూపబడినవి.

3. దర్దికుభాష లిండో - ఆర్యవర్గమునకు జెందినవి కావుకాని యివి పైశాచీభాష లగుటచే ద్రావిడభాషాచరిత్ర సంబంధమగు వీనిని స్మరింపక తప్పదు. ఇవి కాశ్మీర దేశమునందును, కాశ్మీరమున కుత్తర, వాయువ్య భాగములం దనగా దర్దిస్థానము, చిత్రాల్, కాఫీరస్థానములందు వాడుకలో నున్నవి. ఈభాషల మూలమున ఇండో - ఆర్యభాషలగు లహండీ, సింధీ, మున్నగుభాషలు కొంత వికారమును పొందినవి. ఈ భాషల నిప్పుడిరువదిలక్షల జనులుమాత్రము మాట్లాడుచున్నారు. అందు కాశ్మీర భాషను మాట్లాడువారి సంఖ్యయే పదిలక్షలున్నది. కాశ్మీరీభాషతప్ప తక్కిన దర్దికు భాషలందు వాఙ్మయములేదు. పందొమ్మిదవ శతాబ్దము వఱకునుగూడ నీభాషలు లిఖితరూపము నొందలేదు. కావున ని భాషల ప్రాచీనరూపము దెలిసికొన వీలుకాకున్నది. ప్రాచీనకాలమునుండియు రాజకీయవిషయములందును విజ్ఞానవిషయమునను కాశ్మీరమునకును నార్యప్రదేశములకును పరస్పర సంబంధమున్నది. కాని తక్కిన దర్దికుభాషలుగల ప్రదేశములు పర్వతాక్రాంతములయి, చేర వీలులేకుండుటచే నందలి వారి భాషలు సంస్కృతముతోడను ప్రాకృతభాషలతోడను సంబంధము లేక నిలిచినవి. ప్రాచీన కాశ్మీరభాషయందు గ్రంధములు వెలువడినవి. గుణాడ్యుడు రచించిన బృహత్కథ ప్రాచీన కాశ్మీరీభాషయందు రచింపబడిన దేమోయని యొక రూహించుచున్నారు. ఈగ్రంధ మాంధ్రరాజగు శాతవాహనుని యాస్థానమున వెలువడినదను ప్రతీతి యుండుటచే నీ యూహ సరియైనదిగా దోపదు.
4. పైశాచ భాషలనుగూర్చి యెక్కువగా డాక్టరు గ్రియర్‌సన్ గారు పరిశోధనములు గావించిరి. వారి యభిప్రాయములు "ది పిశాచ లాంగ్వేజెస్ ఆఫ్ నార్త్ వెస్టెర్న్ ఇండియా "(The Pisaca Languages Of North-Western India)" అను గ్రంధమున వివరింప బడియున్నవి. వాని సారాంశముమాత్ర మీక్రింద నీయబడినది.

రషియాదేశమునకు దక్షిణమునున్న మైదానములలో నిండో-యూరోపియను భాషలను మాట్లాడువారి పూర్వికు లార్యులనుండి విడబడిన ప్రదేశము 'ఖివ' యను పచ్చిక బయలని పరిశోధకులు విశ్వసించుచున్నారు. ఇచ్చట ఐరేనియనులకును, ఇండో-ఆర్యులకును పూర్వికులగు జాతివా రార్యభాషయను నొకభాషను చరిత్రకాలమునకు బూర్వము మాట్లాడుచుండిరి వా రక్కడ నుండి బయలువెడలి, ఆక్ససు, జక్సార్టెసు నదులమార్గము ననుసరించి భోఖందు, బదఖ్షను పీఠభూముల జేరిరి. అచ్చట వారిలో గొందఱు తక్కినవారినుండి విడబడి, దక్షిణమార్గమునుబట్టి, హిందూకుష్పర్వతముల పడమటి కనుమల మీదుగా గాబూలు నదీప్రదేశమును జొచ్చిరి. అటనుండి వారు ఇండియా దేశపు మైదానములలోనికి వ్యాపించిరి. వీరే నేటి ఇండో-ఆర్యుల పూర్వికులు. ఆ కాలమున వారికి సామాన్యమగు నార్యభాషకు గొన్ని ప్రత్యేక లక్షణములుండెను. కాలక్రమమున నవి నేటి ఇండో-ఆర్యభాషా లక్షణములుగ బరిణమించెను.

హిందూకుష్పర్వతముల కుత్తరమున నిలిచిపోయి, కాబూలునకీ ప్రాంతములకు వలసపోవని యార్యులు తూర్పునకును పడమటికిని వ్యాపించిరి. తూర్పునకు బోయినవారు నామీరు పర్వతము నాక్రమించిరి. వీ రిప్పుడు ఘలహ్ భాషలను మాట్లాడుచున్నారు. పశ్చిమముగ బోయినవారు మెర్వ్, పెర్షియా, బెలూచిస్థానముల నాక్రమించిరి. నేడు వారి సంతతివారు ఘలహ్ భాషలతో సంబంధించిన ఐరేనియను భాషలను మాట్లాడుచున్నారు. వీరు విడిపోవుచు, ఇండియావంకకు బయలుదేరునప్పు డార్యులందఱు నొక్కటే భాషను మాట్లాడుచుండిరి. కాని ఐరేనియనులభాష తఱువాతి కాలమున వేరు మార్గమున పరిణామము నొందెను. కావుననే పామీరు పర్వతములందును పెర్షియాదేశమునందును మాట్లాడు భాషలకును, ఇండియాదేశపు ఆర్యభాషలకును జాల వ్యత్యాసము గలిగినది. ఐరేనియను భాషలు ప్రాచీనార్య భాషనుండి తిన్నగ బరిణమించినవిగను, ఇండో- ఆర్యభాషలు వానినుండి విడబడి ప్రత్యేక పరిణామము నొందిన శాఖగను తలంపవచ్చును.

ఈ దర్దికు, లేక పిశాచ భాషలకుజాల ప్రత్యేక లక్షణములున్నవి. కొన్ని విషయములం దవి ఇండో-ఆర్యభాషలను బోలియున్నవి. తకారము రేఫముగను, త్మయను సంయుక్తాక్షరము తకారముగను మాఱుటయు, సంయుక్తాక్షరము దాని సంయుక్తతను బాపినపిదప దాని వెనుకనున్న హ్రస్వాచ్చు అట్లే నిలచి యుండుటయు వాని ప్రత్యేక లక్షణములలో జేరినవి. ఐరేనియను భాషలలో 'స్మ' యనునది 'హ్మ' గా మాఱగా నార్యభాషలయందు 'స్మ' గానే నిలచి పోయినది. ఈపిశాచభాషలం ఐరేనియను భాషయొక్కగాని ఇండో-ఆర్యభాషల యొక్కగాని సంపూర్ణ లక్షణములులేవు. కావున నవి ప్రాచీనార్య భాషనుండి విడబడునాటి కిండో-ఆర్యభాషలు ప్రత్యేకముగ విడి యుండెననియు, బ్రాచీ నార్యభాష యప్పటికే యైరేనియను భాషామార్గమున బరిణామము నొందెననియు గాని యా పరిణామ మైరేనియను భాషా లక్షణములన్నియు గలుగు నంతవఱకు జరుగలేదనియు నిండో-ఆర్యులు కాబూలు నదీ ప్రాంతములకు బయలుదేరునప్పుడుండిన భాషాలక్షణముల గొన్నిటిని నిలుపుకొని యుండవనియు నూహింపవలసి యున్నది. అనగా దొల్లింటి యార్యభాషనుండి ఇండో-ఆర్యభాషలు విడబడినవి. మఱి కొంతకాలమునకు దర్దిరుభాషలు ప్రత్యేకమైనవి. తొల్లిటి యార్యభాషయే తిన్నగ బరిణామము నొందుచు వైరేనియను భాషయైనది.

ఇండో-ఆర్యులు హిందూకుష్పర్వతములను పడుమటి కనుమలద్వారా దాటిరి. కాబూలు నదీమార్గమున వా రిండియా లోనికి బ్రవేశించునప్పుడిప్పటి చిత్రాల్, గిల్గిత్ అనుదేశములు, అనగా దర్గిస్థానము వారికెడమ ప్రక్క నుండిపోయెను. హిందూకుష్పర్వతముల మీదుగ జిత్రాలుదేశమునకు సరిగ నుత్తరమున నామీరు పర్వతము లున్నవి. ఈ ప్రాంతమునందే ఘల్యహ్ భాషలున్నవి. దర్దిక్ భాషలకన్న ఐరేనియను లక్షణములన్నియు ఘల్యహ్ భాషలకును గలవు. ఈ ఐరేనియను ఘల్యహ్ భాషలకును ఇండో-ఆర్యభాషలకును సమానములగు లక్షణములు కొన్ని ఐరేనియను భాషయందు గానరావు, కావున దర్దిక్ జాతులవారి పూర్వికులు 'దోర' మొదలగు కనుమలద్వారా నేటి తమ వాసస్థానమున జేరిన ట్లూహింపవలసియున్నది.

ఇట్లు దర్దిక్ జాతులవారు నేటి తమపర్వత వాసస్థానమును జేరిన తఱువాత వారిభాష సొంత మార్గమున మాఱుచు నిండో-ఆర్య, ఐరేనియను భాషలకు విలక్షణమైన రూపమును బొందెను. వారిదేశము పర్వతాక్రాంతమై ఫలవంతము కాకపోవుటచే దానినెవ్వరునుజొరకయుండిరి. క్రీస్తు పూర్వము 327 వ సంవత్సరమున నలెగ్జాండరు, క్రీస్తుశకము 1398 వ సంవత్సరమున తైమూరును తమసైన్యములతో నాదేశము మీదుగ నిండియాకు బోయినప్పుడు తప్ప మఱి యెన్నడును వీరిజోలికి పోయినవారు లేకుండిరి. ఇండియా దేశములోని ప్రాకృతభాషలు శీఘ్రముగ మాఱుచు గ్రొత్త రూపములను బొందుచుండ బైశాచీభాష తన లక్షణముల వీడకుండుట యాశ్చర్యకరముగ నున్నది. వేదములలో దప్ప నిండియాదేశములో మఱి యెచ్చటను గానరాని కొన్నిశబ్దములు నేటి పైశాచీ భాషలయందు చెక్కు చెదరక నిలిచి యున్నవి.

పిశాచజాతులవారు సింధునదీమార్గమున నేటి సింధుదేశము వఱకును వ్యాపించినట్లు తెలియు చున్నది. అశోకచక్రవర్తి వ్రాయించిన శిలా శాసనము లాయాప్రాంతముల వ్యవహారము నందున్న భాషయందున్నవి. నేటి యూసుఫ్ జాయి దేశము నందలి షాబాజుగడీ యొద్దనున్న యశోకుని శాసనములందలి భాష పైశాచీభాషా రూపమును బ్రకటించు చున్నది.

5. ఇక నిండియాదేశమును బ్రవేశించిన ఇండో-ఆర్యభాషల చరిత్రమును గమనింతుము. ఈ భాషాస్వరూపము మనకు వేదములనుండి స్పష్టపడు చున్నది. వేదమంత్రము లన్నియు నొక్కటే ప్రదేశమున రచింప బడినవి కావు. ఆఫ్‌ఘనిస్థానము నుండి యమునానదీ తీరమువఱకును గల ప్రదేశము నందవి రచింప బడుచు వచ్చినవని పరిశోధకుల యభిప్రాయము.

ఆర్యులందఱు నొక్కసారిగ భరతవర్షమున బ్రవేశింపక తెర తెరలుగా వచ్చినట్లు తెలియుచున్నది. వీరిలో మధ్యదేశము నందలి యార్యులు వింధ్య పర్వతమువఱకును వ్యాపించిరి. ఈ మధ్యదేశమునందలి యార్యభాషలన్నియు నొక్కటే లక్షణమును గలిగి యున్నవి. ఈ మధ్యదేశము చుట్టును మఱికొన్ని ప్రాకృతభాష లావరించుకొని యున్నవి. మధ్యదేశ భాషలకును వానిని చుట్టుకొనియున్న భాషలకును కొన్నిముఖ్యములగు భేదము లున్నవి. మధ్యదేశ భాషలయందు శషస లు, సకారముగా మాఱినవి. చుట్టునున్న భాషలను మాట్లాడువారు సకారమును బలుకలేరు. సకార మీ భాషలలో గొన్నిటియందు షకారముగను, గొన్నిటియందు హకారముగను మాఱినది. మధ్యదేశీయ భాషలలో సంస్కృతములోని నుప్పులు లోపించి, ఆ ప్రత్యయముల స్థానమున వేరుశబ్దములే యుపయోగింప బడుచున్నవి. ఈ శబ్దములు తమప్రత్యేక శబ్దత్వమును విడనాడి కేవల ప్రత్యయములుగ మాఱలేదు. చుట్టునున్న భాషలయందుగూడ నిట్లే సుప్ర్పత్యయములు లోపించి, వాని స్థానమున బ్రత్యేక శబ్దములు వాడుకలోనికి వచ్చినను, ఆశబ్దములు తిరిగి ప్రత్యయములుగ బరిణమించుట సంభవించినది.

తిజ్ విషయమునగూడ నీరెండు వర్గముల భాషలకును ముఖ్యము లయిన భేదములు గలవు. ప్రాచీన సంస్కృతము లోని లజ్‌రూపములు లోపించినవి. సాధారణముగ క్రియల లడ్రూపములు వేర్వేరుభాషలయం దర్ధభేదమును బొందినను నిలచియున్నవి. పూర్వకాలపు లుట్ లృట్ రూపములు కొన్నికొన్ని భాషలయందు మాత్రము మిగిలినవి. భవిష్యతి అనుటకు గొన్ని భాషలలో 'భవితవ్యం' అను రూపము రూడిగ నిలిచినది. అట్లె 'అగచ్ఛత్‌' అను లజ్ రూపమునకు బదులు 'గత:' అను రూపమే వాడుకలోనికి వచ్చినది. 'అహం అగచ్ఛం' అనుటకు బదులు 'మయాగతం' అని వాడవచ్చును. అప్పుడు 'గతం' అనుదానితో నెట్టి తృతీయా రూపమును వాడినను అదిమాత్రము మాఱదు. 'తేనగతం' 'తయాగతం' 'జనైర్గతం' అని యీరీతిగా వాడుకొనవచ్చును. లేదా 'మే' మొదలగు ప్రత్యయములనైన నీసందర్భమున వాడుకొన వచ్చును. ఇట్టి ప్రత్యయములు పూర్వశబ్దములతో సమసించి ప్రత్యేకింప వీలు లేక యుండును. అందుచేత మూడు పురుషము లందును వేర్వేరు క్రియా రూపము లేర్పడును. మధ్యదేశీయ ప్రాకృతభాషలలో గ్రియారూపములకు మాఱుగ క్రియాజన్య విశేషణములే మూడు పురుషములందును నెట్టిమార్పులును లేక వాడబడుచుండ వానికి చుట్టునుండు ప్రాకృతభాషలలో పురుషమును బట్టియు వచనమును బట్టియు గ్రియారూపములు మాఱుచుండును.

ఈ లక్షణభేదముల ననుసరించి ఉత్తరహిందూస్థానభాష లీ క్రిందిరీతిగా వర్గీకరింప బడినవి.

(అ) బయటి అంతశ్శాఖ.

I. వాయవ్య వర్గము.

1. లహందా

2. సింధి.

II. దాక్షిణాత్య వర్గము.

3. మరాఠీ

III. ప్రాచ్యవర్గము.

4. ఒఱియా

5. బిహారీ

6. బంగాలీ

7. అస్సామీ

(ఆ) మధ్యాంతశ్శాఖ.

IV. మధ్యదేశీయ వర్గము.

8. తూర్పుహిందీ (ఇ) లోపలి యంతశ్శాఖ.

V. మధ్య వర్గము.

9. పడమటి హిందీ

10. పంజాబీ

11. గుజరాతి

12. భీలీ

13. ఖాన్‌దేశీ

14. రాజస్థానీ

VI. పహాఱీ వర్గము.

15. తూర్పు పహాఱీ లేక నైపాలీ

16. మధ్యపహాఱీ

17. పడమటి పహాఱీ.

6. ఋగ్వేదభాష వాడుకభాషగా నుండెను. అదియును దానికిసంబంధించిన తక్కిన వాడుకభాషలును బరిణామము నొందుచువచ్చెను. అందొకటి సంస్కృతభాషగ వైయాకరణులచే స్థిరత్వమునొందెను. తక్కినభాషలు మాఱుచునేయుండెను. ఆభాషలు ప్రాకృతమనుపేర వ్యవహరింపబడుచుండెను. వైదికప్రాకృతములకు , బ్రాధమిక ప్రాకృతములనియు, వీనినుండి తఱువాత నేర్పడిన ప్రాకృతములకు ద్వైతీయ ప్రాకృతములనియు, వాని నుండి పరిణమించిన నేటి యార్యభాషలకు దార్తీయ ప్రాకృతములనియు సంజ్ఞలను పరిశోధకు లిచ్చియున్నారు. ప్రాధమిక ప్రాకృతములందు సుప్తిజ్ విధానము సంపూర్ణముగనుండెను. ఉచ్చారణకాఠిన్యముగల సంయుక్తాక్షరములు ప్రచారములోనుండెను. ద్వైతీయావస్థలో సుప్తిజ్‌ విధానము నిలిచియున్నను ఐ జౌలును కఠినసంయుక్తాక్షరములును లోపించినవి. పదమధ్యములందు హల్లులే లోపించి కేవలమచ్చులే నిలిచియుండుట సంభవించినది ఇందు వలన తార్తీయావస్థయం దీయచ్చులు కలిసి వేఱురూపములను బొందుటయో, వానిమధ్యమున గ్రొత్తహల్లులు చేరుటయో సంభవించినది. సుప్తిజ్ ప్రత్యయములు లోపించినవి. క్రొత్తసంయుక్తాక్షరము లేర్పడినవి.

పాలిభాష ద్వైతీయావస్థకు జెందినది. బౌద్ధమతగ్రంధము లీభాష యందు వ్రాయబడినవి. ఈభాష గ్రాంధికము కాగానే స్థిరరూపమును బొందెను. కాని వ్యావహారిక ప్రాకృతము లింకను మాఱుచునే వచ్చెను. ఈ ప్రాకృతములుకూడ కొలదికాలములో గ్రంధస్థములయ్యెను. కాని పండితుల చేతులలోబడి యీప్రాకృతములు సంస్కారమునుబొంద నారంభిం చెను. కావున గ్రంధస్థ ప్రాకృతము లెంతవఱకు వ్యవహారరూపక భాష కుదాహరణములో జెప్పవీలులేదు. కాని అశొకుని శాసనములవలనను నితరాధారములవలనను నీప్రాకృతములందు ప్రాచ్యప్రతీచ్య భేదములు రెండుండెనని చెప్పనగును శౌరసేనీభాష ప్రతీచ్యప్రాకృతము. మాగధీభాష ప్రాచ్యప్రాకృతము. ఈరెండింటికిని మధ్యమున నుభయలక్షణసహితమయిన యర్ధ మాగధీభాష యొకటియుండెను. జైనమతకర్తయగు మహావీరు డుపయోగించిన భాష యిదియే. జైనగ్రంధము లీభాషయందే వ్రాయబడియున్నవి. ఈ యర్ధమాగధీభాషకు సంబంధించి ప్రతీచ్యభాషాలక్షణములకంటె ప్రాచ్యభాషాలక్షణములనే యెక్కువగా గలిగియుండినభాష మాహారాష్ట్రీ భాష. ప్రాకృతకవిత్వ మీభాషలో నెక్కువగ వెలువడినది.

సంస్కృతము వైయాకరణుల మూలమున స్థిరపడినట్లే, ప్రాకృతములు గూడ గ్రంధస్థములును లక్షణనిబద్ధములునై స్థిరత్వమునుబొందెను. కాని, వ్యావహారిక ప్రాకృతములు పరిణామము నొందుచునే యుండెను. ఈప్రాకృతములందాయా దేశముల శబ్దజాలము చేరుచు దేశ్యపదములసంఖ్య నానాటికిని భ్రాకృతములందు హెచ్చు కాజొచ్చెను. ఈరీతిగ గొన్ని యపభ్రంశ భాష లేర్పడెను. ఈ భాషలలో నాగరాపభ్రంశమను భాషయందు గ్రంథములు వెలువడజొచ్చెను. ఇట్లపభ్రంశభాషలయందే గ్రాంథిక వ్యావహారిక భేదములుకలిగెను. వ్యావహారికాపభ్రంశములు మాఱుచు వేర్వేఱు ప్రాకృతములుగ నేర్పడెను. సింధునదీ దక్షిణప్రాంతముల వాడుకలోనుండిన యపభ్రంశమునకు 'వ్రాచడ' మనిపేరు. దీనినుండియే నేటి సింధీ, లహందా భాషలు పుట్టినవి. వీనితో బైశాచభాషాసంపర్కముగూడ గలిగెను. నర్మదానదికి దక్షిణమున నరేబియాసముద్రమునుండి యొరిస్సావఱకును వైదర్భ లేక దాక్షిణాత్యాపభ్రంశభాష యుండెను ఈదేశమునకు మహారాష్ట్రమనిపేరు. ఈ దేశమందలి యపభ్రంశమును నితరాపభ్రంశమును నేటి మరాఠీభాషకు మూలములు దాక్షిణాత్యాపభ్రంశమునకు దూర్పుగా బంగాళాఖాతమువఱకును నౌత్కల లేక యౌడ్రాపభ్రంశముండెను. దాని నుండియే నేటి ఒఱియాభాష జనించినది. ఔడ్రభాష కుత్తరముగ కాశివఱకును మగథాపభ్రంశముండెను. దీనినుండియే నేటి బిహారీభాష పుట్టినది. బిహారీభాషాంతర్భేదమైన 'మగహ' భాష పూర్వపు మాగధీభాషను స్మరింపజేయుచున్నది. మాగధీభాషకు దూర్పుగ బ్రాచ్యాపభ్రంశముండెను. ఇది నేటి బంగాలీభాషకు మూలము. ఈభాషయే యుత్తరముగ వ్యాపించి నేటి యస్సామీభాషగా బరిణమించినది. అర్థమాగధికి సంబంధించిన యపభ్రంశమునుండి నేటి తూర్పుహిందీభాష కలిగినది ఇంతకుముందు పేర్కొనిన నాగరాపభ్రంశమునుండి గుజరాతీభాష యేర్పడినది. ఈ యపభ్రంశభాషయే యింకను వ్యాపించి శౌరసేనా పభ్రంశముగ బరిణమించి నేటి పశ్చిమ హిందీభాష యయినది. దీనితో సంబంధించినదే 'ఠాక్క'యను నపభ్రంశమును నుప-నాగరాపభ్రంశమును నయియున్నవి. ఇవి పంజాబు దేశము లోని మాండలిక భాషలకు మాతృకలయినవి. ఆవంత్యా పభ్రంశము దీనివికారమే. దీనినుండియే నేటి రాజస్థానీభాష కలిగినది.

ఇక నుత్తరదేశీయ భాషావర్గమునకు సంబంధించిన ప్రాకృతా పభ్రంశ భాషలు పేర్కొనదగిన వెవ్వియులేవు. ఇక్కడి జనుల పూర్వికులు టిబెటో-బర్మను జాతులవారు. వీరికిని నార్యజాతుల వారికిని సమ్మేళనము కలిగెను. అటుపిమ్మట పిశాచ లేక దర్దికు జాతులవా రాదేశమున బ్రవేశించిరి. మధ్యాసియానుండి గూర్జరులొక యార్యభాషతో బ్రవేశించిరి. అటుపిమ్మట రాజపుత్ర స్థానమునుండి కొందఱందుచేరిరి. కావున నిచ్చటి భాషలు మిక్కిలి సంకరములై యుండుట సంభవించినది. రాజపుత్రస్థానమునుండి వచ్చినవారి భాషాలక్షణము లెక్కువగా నుండుటచే నిచ్చటి భాష కావంత్యాపభ్రంశము మూలమని చెప్పవచ్చును.

పైని వివరించిన ప్రాకృతభాషలయొక్కయు నేడార్యభాషలుగా గ్రహింపబడుచున్న వానియొక్కయు సంబంధ మీప్రక్కపట్టికయందు చూపబడినది.

ద్రావిడభాషలు.

దక్షిణ యిండియాదేశమందలి ముఖ్యభాషలన్నియు ద్రావిడభాషా కుటుంబమున జేరినవి. ఈ భాషలను మాట్లాడువారిసంఖ్య యించుమించు 570 లక్షలు.

ద్రవిడమనునది సంస్కృతపదమనియు దానినుండి ద్రమిడ, తిరమడ, ద్రమిళ, దమిళ, తమిఱ్, తమిళ్, శబ్దములు పుట్టినవనియు గొందఱభిప్రాయ పడుచున్నారు. మఱికొందఱు పాలిభాషయందు వ్రాయబడిన మహావంశమను గ్రంధమునందు దమిళశబ్దము కాన్పించుటచే దానిని సంస్కృతీకరించి ద్రమిళ, ద్రవిడ శబ్దములుగా మార్చిరనియు దమిళశబ్దమునుండియే తమిళము అను పదముకలిగినది కాని యది ద్రవిడశబ్దభవము కాదనియు దెలుపుచున్నారు. ప్రాకృతవాఙ్మయమున దమిళ, దవిడ, యనురూపములు గాన్పించుచున్నను, దమిళయనునదే యతిప్రాచీనరూపము. దమిళ, దవిడ శబ్దములే ద్రమిల, ద్రమిడ, ద్రవిడ యను రూపములను దాల్చియుండునని వీరి యభిప్రాయము. భాగవతపురాణమున ద్రమిళశబ్దము వాడబడియున్నది. వరాహమిహురుడు బృహత్సంహితయందు ద్రమిడశబ్దమును వాడియున్నాడు, ప్రాచీన మళయాళభాషలో రచింపబడిన పురాణములందును మహాకూటమునొద్ద మంగళేశుడనురాజు స్థాపించిన శిలాశాసనమునందును (597-608), ద్రమిళశబ్దము కాన్పించుచున్నది. గ్రీకుచరిత్రకారుల గ్రంథములలో దరిమిచె, దమిరిచ యను రూపములు కానవచ్చుచున్నవి.

ఈ క్రిందివి ద్రావిడభాషలుగ నే డెంచబడుచున్నవి. 1. తమిళము. 2. మళయాళము. 3. తుళు. 4. కొడగు. 5. తొద. 6. కోత. 7. కన్నడము. 8. కురుఖు. 9. మల్తొ. 10. గోంది. 11. కుఇ. 12. కోలామీ. 13. తెలుగు. 14. బ్రాహూఇ. ఇవిగాక మఱికొన్ని చిన్నమాండలికభాషలును ద్రావిడభాషావర్గములో జేరినవి. ఈ భాషల పరస్పర సంబంధము ప్రక్కపుటలో నివ్వబడినది.

ద్రవిడశబ్దము జాతిపరముగ మనుస్మృతియందును, వరాహమిహురుని బృహజ్జాతకము నందును, మహాభారతము నందును, ఇతర సంస్కృత వాఙ్మయము నందును స్మరింపబడి యున్నది. శత్రుంజయమాహాత్మ్యమను గ్రంథమున ద్రావిడ జాతివారు వ్రాత్యులయిన క్షత్రియులనియు, వృషభస్వామి పుత్రుడగు ద్రవిడుని తనయులనియు దెలుపబడియున్నది. పంచ ద్రావిడులనియు పంచగౌడులనియు నొక వ్యవహారమున్నది. పంచద్రావిడు లనగ నంధ్రులు, కర్నాటకులు, గుర్జరులు, తైలంగులు, మహారాష్ట్రులు నని చెప్పుదురు. కుమారిలభట్టురచించిన తాంత్రవార్తికమున నాంధ్రద్రావిడ భాషయనునది పేర్కొనబడెనని బర్నెలు పండితుడు తానురచించిన దాక్షిణాత్యలిపి చరిత్ర (South Indian Paleography) మను గ్రంధమున వ్రాసియున్నాడు. ఇది సరికాదనియు "అథద్రావిడభాషాయాం" అని గ్రంథముననున్నదానిని "ఆంధ్రగ్రావిడభాషాయాం" అనిచదివి బర్నెలు భ్రమపడెననియు పి.టి. శ్రీనివాసఅయ్యంగారు తెలిపియున్నారు.

ద్రావిడభాషల పరస్పర సంబంధమునుగూర్చియు ద్రావిడభాషా కుటుంబమునకును నితరభాషా కుటుంబములకును గల సంబంధమును గూర్చియు వివరించుచు గాల్డ్‌వెల్ పండితుడొక యుత్కృష్టగ్రంథమును రచించియున్నాడు. అత డాగ్రంథమున ద్రావిడభాషల సమాన లక్షణముల నేర్పఱిచి వాని యేకత్వమును జక్కగ నిరూపించి యున్నాడు. ద్రావిడ భాషా కుటుంబమునకును నితర భాషాకుటుంబములకును గల సంబంధమును గూర్చి యెక్కువగా జర్చించి ద్రావిడభాషలకును ఇండోయూరపియను భాషలకును దగ్గఱ సంబంధము లేదనియు, సిథి యనుభాషాకుటుంబముతో వానికి సన్నిహిత సంబంధముగలదనియు దెలిపియున్నాడు. అతనికాలముననే
పోవు మున్నగు పండితు లాతనియుహ సరికాదని యాక్షేపించి యుండిరి. కాల్డ్‌వెల్‌గారి సిద్ధాంతము పరిశోధక లోకము నందుకొలది కాలము క్రిందటి వఱకును ప్రమాణముగ దలంపబడు చుండెను. కాని యిటీవల నాతనిసిద్ధాంతము విషయమై వివిధాభిప్రాయములు వెలువడినవి. ఈ విషయమై గ్రియర్‌సన్ పండితుడిట్లు వ్రాయుచున్నాడు. - "సిధియనుపద మంతసమంజసముగ లేదు. గ్రీకుగ్రంధకర్తల గ్రంధములలో గనబడు సిథియనుపదములు స్పష్టముగ నై రేనియను భాషలలోనివి, అనగా నవి ఇండోయూరోపియను కుటుంబమునకు జెందినవి. అయినను నాపద మాసియా యూరోపుఖండములలోని ఇండోయూరోపియను సెమిటికు కుటుంబములకు జెందనిభాషల కన్నిటికిని సామాన్యమగు పదముగ నుపయోగింపబడినది. ఇదిగాక యీభాషల నేవిధమునను నేక భాషాకుటుంబము లోనికి జేర్ప వీలులేదు. చీనాదేశము తత్ప్రాంతదేశములలోని యేకమాత్రాకములగు భాష లిండో-యూరోపియను కుటుంబమునుండి యెంత భేధించు చున్నవో, కాకసన్ ప్రాంతములందలి ఫిన్నులు, మాగ్యారులు మాట్లాడుభాషలనుండియు నంత భేధించుచున్నవి. ఆ భాషలయందు కాన్పించు సామాన్యలక్షణములు సాధారణముగ నన్ని భాషలయందును గాన్పించునవియే. వీని సామాన్యలక్షణములకంటె వీని యందుగల మహత్తరములగు మూలలక్షణములందలి భేదములే యెక్కువగ నున్నవి. ద్రావిడభాషల నిండియాదేశమునకు వెలుపలనున్న భాషాకుటుంబములతో గలుపుటకు జేసినప్రయత్నములు విఫలములయ్యెనని సాధారణముగ దలంపబడుచున్నది. కావున మనము వానిని ప్రత్యేకభాషా కుటుంబముగనే యెంచవలెను. ముండాభాషలతో ద్రావిడభాషలకు సంబంధమున్నట్లు పైకి కనబడును గాని యట్టిసంబంధములేదు. ఇండోయూరోపియను కుటుంబముతో దగ్గఱ సంబంధమును జూపుటకు జేసినప్రయత్నములుగూడ నట్లే విఫలములయినవి. ఇటీవల ద్రావిడభాషాకుటుంబమునకును బర్మాదేశమునందలి ఛిన్నులభాషకును గల సంబంధమునుగూర్చి యొకరు ముచ్చటించిరి గాని యా వాచము పండితులదృష్టి నాకర్షించినట్లు కనబడదు. ఆస్ట్రేలియా భాషలకును ద్రావిడభాషలకును సంబంధమున్నదని ఫ్రీడ్రికు మిల్లరుగారు ప్రతిపాదించిరిగాని యది సమర్థింపబడినదని యూహింపవీలులేదు" అని.

ద్రావిడభాషలకును నితరభాషా కుటుంబములకును గల సంబంధము గూర్చి కాల్డ్‌వెల్ చర్చించినంత విపులముగ మఱియెవ్వరును జర్చించియుండ లేదు. ఆతడు ద్రావిడమునకును నిండో-యూరోపియను భాషలకును గల సంబంధమును గుర్తించియుండకపోలేదు. కాని యాసంబంధము చాల ప్రాచీనమైనదనియు, ఆర్యభాషలతోడి సంబంధముకంటె సిథియనుభాషలతోడిసంబం ధము మిక్కిలి సన్నిహితమైన దనియు నాతని యభిప్రాయము. ఇండోయూరోపియను భాషలతో సంబంధము లేదని యాతడు చూపిన వివరములతో దఱువాతి పరిశోధకు లేకీభవించి యా సిద్ధాంతమునందు స్థిరమగు విశ్వాసమును గలిగియున్నారు. కాని, సిధియనుభాషా కుటుంబముతో గూడ ద్రావిడమునకు సంబంధములేదని వారు కాల్డ్‌వెల్ సిద్ధాంతమును త్రోసిపుచ్చి యున్నారు. కాల్డ్‌వెలును దక్కిన పండితులును ద్రావిడభాషలు మిక్కిలి ప్రబలమయినవనియు, వానిమూలమున భారతీ యార్యభాషలలో గొప్పమార్పులు గలిగినవనియు, నా మార్పుల మూలమున నాయా యార్యభాషల ప్రాచీనస్వరూపమే మాఱినదనియు దలంచుచున్నారు. ద్రావిడభాషాప్రబల్య మార్యభాషలపై గలిగిన సందర్భములని తనకు దోచినన వానిని సునీత్‌కుమార్ ఛాటర్జీ యను బంగాళీ పండితుడు తాను రచియించిన "బంగాళీ భాషోత్పత్తి తత్పరిణామము" (The Origm and Development of the Bengali Language.) అను గ్రంధమున నిట్లు వివరించియున్నాడు:-

1. ఉచ్చారణము

1. ఈ రెండుకుటుంబములలోను ద్వ్యచ్ సంయోగముగల యచ్చులు చాల కొంచెముగా నున్నవి. ఉద్వృత్తాచ్చుల నడుమ య, వ, లను చేర్చి వైదిక భాషయందును, సంస్కృత భాషయందును ప్రకృతిభావము లేకుండ జేసియుందురు. అచ్చులనడుమనుండు హల్లులు లోపించినప్పుడు ప్రాచీన ప్రాకృతభాషావస్థనుండి నేటివఱకును నిట్లే జరుగుచున్నది. జైన అర్థమాగధీభాషలో నుద్వృత్తాచ్చుల నదుమ యకారమును వ్రాయుచుండెడివారు. తక్కిన ప్రాకృతభాషలలో నాహల్లును వ్రాయకుండినను నుచ్చారణములో నది వినబడియుండవలెను. తాలవ్య, ఓష్ఠ్యాచ్చులనడుమ య, వ, లును నకారమును జేరుట ద్రావిడభాషలయందును గలదు

2. జారుడు ధ్వనులు నేటి ఇండో-ఆర్యభాషల యందును గూడ నెక్కువగా లేవు. ఇండో-ఐరేనియనులోని 'ౙ', ౙ=Z, Zh, ధ్వని జ, ఝలుగ మాఱుట ద్రావిడభాషాసంపర్కమువలన గలిగియుండును కాని ఘ, ఝ, ధ, భ, యను హల్లులు హకారముగా మాఱుట ఋగ్వేద భాషకు మూల భాషయగు నై రేనియనుభాషకు దగ్గఱగానుండిన యొక ప్రతీచీభాషకు లక్షణముగానుండెను. ఐరేనియను భాషలో జారుడు ధ్వను లెక్కువగా నుండెను.

3. రెండు కుటుంబములందును మూర్ధన్యాక్షరము లున్నవి. ట, డ, ణ, ళ, ఱ యనునవి ద్రావిడభాషాధ్వనులు . ఇవి వేద, సంస్కృతభాషలయందు తప్ప మఱి యే ఇండోయూరోపియను భాషయందును లేవు. ఆధునిక ఇండోయూరోపియను భాషలలో స్వీడిషుభాషయందు రేఫదకారముల సంయోగమున డకారమేర్పడినది. ఇట్టి మూర్ధన్యీకరణమే ప్రాచీనమాగధీ భాషయందునుగలదు, మాగధియందు రేఫమునుండి లకారమును, రేఫదంత్యాక్షర సంయోగమువలన మూర్ధన్యధ్వనియు గలుగుచుండెను. రేఫము లకారముగ మాఱి దానితో దంత్యవర్గీయహల్లు చేరి, మూర్థన్యవర్గీయ హల్లుగా బ్రాచీన ఇండో-ఆర్యభాషలలో సహజముగనే మాఱి యుండును. ఇట్లే ఇండో-ఆర్యభాషలలో మూర్ధన్యాక్షరములు సహజముగ బ్రాచీనకాలము నుండియు నుత్పత్తియగుచుండుట కుదాహరణములు గాన వచ్చును. రెండచ్చుల నడుమనుండు డ,ఢ, లను టి, టి, లుగ నాధుని కార్యభాషల యందును బ్రాకృత భాషలయందును ద్రావిడ భాషయందు వలెనే కాననగును.

4. ద్రావిడభాషలయందువలెనే యాధునికార్యభాషలందును బ్రాకృతభాషలందును స్వరభక్తి, లేక విప్రకర్షముచేత సంయుక్తాక్షరములు విడబడుట సంభవించెను.

ఉదాహరణములు:- ప్రాకృతము-కిలేశ (క్లేశ); సినేహ (స్నేహ); హరిస (హర్ష); రతన (రత్న); సుమిణ (స్మరణ); పరాణ (ప్రాణ); బరామ్హణ (బ్రాహ్మణ); మొ.

తమిళము- పిరామ్మణన్ (బ్రాహ్మణ); శినేగమ్ (స్నేహం); మిత్తిరన్ (మిత్రమ్); తిరు (శ్రీ); కిరుట్టినన్ (కృష్ణ); శందిరన్ (చంద్ర); మొ.

ద్రావిడభాషలలో బదాదియందు సంయుక్తాక్షరము లుండవనియు, బదమధ్యమందు ద్విత్వాక్షరములుండుననియు, నీలక్షణము ప్రాకృతభాషలకు ద్రావిడమునుండి కలిగినదని సాధారణముగా నొకయభిప్రాయము గలదు. కాని యతిప్రాచీనకాలమున ననగా గ్రీస్తుపూర్వము చాలశతాబ్దముల క్రిందట నిండో-ఆర్యభాషలయందువలె ద్రావిడమునందును త్ర, ద్ర, వంటి సంయుక్తాక్షరము లుండెననియు పదాదియందు ద్ర యను సంయుక్తాక్షరమును గలిగిన ద్రమిడ, ద్రవిడ శబ్దములు ప్రాచీన ద్రావిడశబ్దములే యనియు నా శబ్దములనుండి తమిఱ్ అనుపదము దమిఱ అనుపదము ద్వారా తమిళభాషలో గ్రీస్తుతఱువాత గలిగినదనియు దమిఱశబ్దమును పాలి, ప్రాచీన సింహళభాషలు దమిళ యను రూపముతో నెరవు తీసికొనినవనియు, నిట్లే దమిఱకం అనుపదము గ్రీకుభాషలో దమిరికేయనియు, లాటిన్‌భాషలో దమిరిచెయనియు వ్రాయబడెననియు బ్లాకు పండితు డభిప్రాయపడి యున్నాడు. కావున సంయుక్తాక్షరములు విడబడుట ఇండో-ఆర్య భాషలయందును ద్రావిడభాషలయందును నొక్కటేవిధముగ గలిగి యుండెను. ప్రాచీన ఇండో-ఆర్య భాషలయందలి సంయుక్త హల్లులు హల్తైత్రి (Assimilation) వలన నేక స్వరూపమును బ్రాకృతభాషల యందు పొందుట ప్రాకృత భాషలయందే కలిగియుండవలెను. ఇట్లగుట ఇటాలికు భాషయందును మఱికొన్ని ఇండో-యూరోపియను భాషలయందునుగూడ గలిగెను. కాని ఈ మార్పు ద్రావిడభాషల యందుకంటె నిండో-ఆర్యభాషలలో వేయు సంవత్సరములకు బూర్వమే సంభవించెను. ఇండో-ఆర్యభాషల చరిత్రమున ద్రావిడు లార్యభాషను చాల ప్రాచీనకాలముననే యవలంబించుటయు నార్యభాషలతో ద్రావిడమునకు సంబంధము గలుగుటయు దీనికి కారణమై యుండును.

చ, జ, లు, ౘ, ౙ లుగను, సకారము హకారముగను నచ్చులమధ్యనుండు పరుషాక్షరములు సరళాక్షరములుగను మాఱుటయును, నంత్యాచ్చులు లోపింపక నిలుచుటయును, మొదలగు విషయములందు ప్రాకృతభాషలకు ద్రావిడాభాషా సంపర్కము కారణమని గ్రియర్సన్ పండితుడు చెప్పియున్నాడు. కకారతకారములు గకార దకారములుగ నచ్చులమధ్యమున మాఱుట ప్రాకృతభాషలయందే సహజముగ గలిగియుండును. కొన్నిప్రదేశములలో ద్రావిడభాషాసంపర్కము గూడ నుండియుండవచ్చును.

శబ్దనిర్మాణము.

1. ఉపసర్గలు నానాటికి నిండో-ఆర్యభాషలయందు లోపించినవి. తక్కిన ఇండో-యూరోపియను భాషలలో నుపసర్గలు నుప్తిజ్‌విధానమున దోడ్పడినవి. నుప్తిజ్ ప్రత్యయము లంతరించినపిమ్మట నింగ్లీషు, పెర్షియను, ఫ్రెంచి, బల్గేరియను, భాషలయందువలె నుపసర్గలు వానిస్థానము నాక్రమించును. దాతువులకర్థభేదము గలిగించు నుపసర్గలు పై భాషలలో నింకను నున్నవి. ప్రాచీన ఇండో యూరోపియనుభాషలలో నుపసర్గలు తొలుత సవ్యయములుగానుండి క్రియకుముందుగ గాని వెనుకనుగాని చేరుచుండును. ఇండో-ఆర్యభాషలలో నుపసర్గము సంపూర్ణముగ నంతరింప లేదుగాని యది క్రియకు దరువాతనే వచ్చుటను గమనింపవచ్చును. ఇట్లే ప్రాకృతము లందును నాధునికార్యభాషలయందును విశేష్యముల నుండియు గ్రియలనుండియు బుట్టిన కొన్నిసహాయక పదము లుపసర్గల స్థానమున జేరుటయు గమనింపదగును.

ఆధునికార్యభాషలలో నుబ్విదానము ద్రావిడభాషలందలి దాని నెక్కువగ బోలియున్నది. బహువచనమున గణ, గులా (కులా), సబ్ (సర్వా), మాన (మానవ), లోగ్ (లోక), సకల, మొదలగుశబ్దములు చేరుటయు మే, మా (మధ్య), కో (కక్ష), ఠాయ్ (స్థామ),పాస్ (పార్శ్వ), సే (సహిత), దా (దిత), కా (కృత), మొదలగునవి విభక్తి ప్రితిరూప కావ్యయములుగ ద్రావిడభాషలయందువలె కానబడుచున్నవి. ఇట్లే బంగాళీ భాషలో హైతే, లాగియా, ధాకియా, దియా, యనునవియు నాధునికార్యభాషలలోని యిట్టిరూపములను క్రియా విశేషణములును త్వార్థకములునైన ప్రత్యయములుగ వాడబడుట ద్రావిడాభాషా సంప్రదాయము ననుసరించి యున్నది తమిళములో, కత్తియైకొణ్డు (కత్తిగొని), అవనోడు (వానితోడ), ఇన్ఱు, నిన్ఱు (నిలిచి), మొదలగు రూపముల నీ సందర్భమున నుదాహరింప వచ్చును.

అమహద్వాచకములకు జతుర్థీ-ద్వితీయా ప్రత్యయమగు నాధునిక ఇండో-ఆర్యభాషలలోని కో, కే, కు, ప్రత్యయములును ద్రావిడభాషలలోని కుప్రత్యయమును జేరకుండుట రెండు కుటుంబములయందును గాన్పించు చున్నది.

పైని వివరించిన విషయములు దాధుని కార్యభాషలకు ద్రావిడ సంపర్కము నూహించుటకు వీలున్నది. కాని యిట్టిమార్పులు ద్రావిడభాషా మూలముననే గలిగినవని చెప్ప వీలులేదు. ఆధుని కార్యభాషలలో బశ్చిమ హిందీ భాషయందు 'కో', బంగాళీభాష యందు 'కే', ఒఱియా భాషయందు 'కు' అను ప్రత్యయములు ప్రాకృత భాషావస్థయందును నాధుని కార్యభాషలయందును 'కక్ష' యను సంస్కృత పదమునుండి యేర్పడుటకును ద్రావిడ భాషలలోని కుప్రత్యమునకును నెట్టి సంబంధమును లేదు. ఈ ప్రత్యయములు రెండుకుటుంబముల యందును బోలియుండుట కాకతాలీయన్యాయమున గలిగినది గాని వేఱుగాదు. ఇట్లే బంగాళీభాషలో బదనాల్గవ శతాబ్దమున వాడుకలోనికి వచ్చిన రా, గులా, (గులి) అను బహువచన ప్రత్యయములకును ద్రావిడభాషలలోని ఆర్, గళ్, ప్రత్యయములకును సంబంధమున్నదని చెప్పుట మిక్కిలి సాహసము. బంగాలీభాషలో (రా) ప్రత్యయమును ద్రావిడ భాషలలో (ఆర్) ప్రత్యయమును గూడ మహద్వాచకముల తోడనే చేరినను నీరెంటికిని సంబంధమున్నదని చెప్పగూడదు.

ఆధుని కార్యభాషల యందును ద్రావిడభాషల యందును విశేష్యములు విశేషణములుగ నుపయోగింప వీలగుట యీ రెండు కుటుంబములకును సామాన్యలక్షణముగ గొందఱు చెప్పుదురు.

ఉదాహరణము:- బంగాలీ; సోనార్ - బాటీ; తమిళ్: పొన్నిన్ - కుడమ్=బంగారుగిన్నె. కాని యిట్టి వాడుక యింక ననేకభాషలలోగూడ నుండుటచే నది కేవల ద్రావిడభాషా లక్షణమేయని చెప్పగూడదు. 2. ఆధుని కార్యభాషల యందును ద్రావిడభాషల యందును గూడ విశేషణములకు దరతమ భావము దెలుపు ప్రత్యయములు లేవు. ప్రాచీన ఇండో-ఆర్యప్రత్యయములగు ఈయన్, ఇష్ఠ ; తర, తమ, అనునవి లోపించినవి. ఈ భావము, విశేష్యమును చతుర్థీ, పంచమీ, లేక సప్తమీ విభక్తుల యందుంచి దానితో విశేష్యజమైనట్టి కాని, క్రియా సంబంధమైనట్టికాని యొక మాటను చేర్చుటవలన దెలుపబడుచున్నది.

ఉదాహరణములు:- బంగాలీ: ఏర్ చేయే-ఖాలో=దీనిని చూచిన మేలు; సబార్ మాఝే ఖాలో=అన్నిటి మధ్యను మంచిది, మొ. ద్రావిడభాషలలో గూడ తర-తమభావమిట్లే తెలుపబడును. నేటి యిండో యూరోపియను భాషలలో గొన్ని యెడల నీ భావము ప్రత్యయముల మూలముననే తెలుపబడుచున్నది.

ఉదాహరణము:- పెర్షియను: తర్, తరీన్; ఆర్మీనియను: కుఇన్ = గొఇన్ ; ఆధునిక గ్రీకు: తెరొస్, తతొస్ ; రషియను: జెఇశిఇ, జీ ; ఇంగ్లీషు: ఎర్, ఎష్ట్. కొన్నియెడల తరతమ భావమును దెలుపు ప్రత్యేకశబ్దములు వాడబడు చున్నవి.

ఉదాహరణము:- ఇంగ్లీషు: మోర్, మోస్ట్; ఫ్రెంచి: ప్లుస్, లేప్లుస్; ఆధునిక గ్రీకు: ప్లెబస్, ఒ ప్లెబస్.

3. ధాతువులం దర్థభేదముల గలిగించుట కుపసర్గలు లోపించినందున నాధునికార్యభాషలయందును ద్రావిడభాషలయందును నొక్కటే తీరున త్వార్థకములును క్రియా విశేషణములును నవ్యయార్థములందు దాతువులతో జేరి ధాతుపల్లవము లేర్పడినవి.

ఉదాహరణములు:- సంస్కృతము: నిషద్; ఇంగ్లీషు: సిట్ డౌన్; బంగాలీ: బసియా పఱా; హిందీ:బైఠ్‌జానా; ఇంగ్లీషు: రబ్‌ఆఫ్, బంగాలీ: ముచియా ఫేలా. ఇట్టి వాడుక ద్రావిడభాషలయందును గలదు.

4. ప్రాచీ నార్యభాషలలోని దశవిధ లకారములందు చాలమట్టుకు లోపములు కలిగినవి. అట్లే యైరేనియను భాషలలోగూడ జాలవఱకు లకారము లంతరించినవి. వైదికభాషలో సోగమత్, సోగచ్ఛత్, సజగామ అను రూపములకు బ్రాకృతములందు స గత: అను రూపమువికారము లగు సో గదో, సో గఓ, శే గడే, శి గయిల్ల, సు గఉ, సొ గఅఉ, మొదలగు రూపములు గలిగెను. వానినుండియే యాధుని కార్యభాషలయందు పశ్చిమ హిందీ సో గయవ్, గయా: బంగాలీ: సే గేల, మొదలగు రూపములు కలిగెను. ఈమార్పు ద్రావిడభాషా సంపర్కమువలన గలిగియుండును. ద్రావి డములో గ్రియ విశేష్యతుల్యమై యున్నది. ద్రావిడభాషలలోని లకారములు క్రియావిశేషణము నుండి జనించినవి. ఆర్యభాషా వికాసమునం దిండో-యూరోపియను సంపూర్ణక్రియారూపము లంతకంతకును లోపించి వానిస్థానమున క్రియావిశేషణ రూపములుచేరుట కాననగును. సంస్కృతములో కరిష్యతి యనుటకు కర్తా అనుటయు, కరిష్యామి అనుటకు కర్తాస్మి యనుటయు ద్రావిడభాషా వ్యవహారము ననుసరించి యున్నది. వైదికభాషలో సకృత్తుగా గాన్పించు తవన్త్ ప్రత్యయము ద్రావిడభాషలలోని దవన్ ప్రత్యయమును బోలియున్నది.

ఉదాహరణము:- సంస్కృతము: కృత, కృతవంత్; తమిళము: శెయ్‌దు, శైదవన్. ఆధునిక మగధభాషలగు బంగాలీ, ఒఱియా, మైథిలీ, మగహీ, భోజపురియా, భాషలయందు క్రియల లజ్, లుట్, రూపము 'ధాతువు + భూత, లేక, భవిష్యత్క్రియాజన్య విశేషణము + సర్వనామప్రత్యయము'గా నుండుట ద్రావిడభాషలయందువలె నున్నది. క్రియల క్త్వార్థకరూపములతో సంపూర్ణక్రియలనుచేర్చి వాడుట యాధునికార్య ద్రావిడభాషలకు సామాన్య లక్షణము.

ఉదాహరణములు:- తమిళము: కొండువా; బంగాళీ: వైయా ఆఇ స=నీఏ ఏసో; హిందీ: లాఓ = లే + ఆఓ. ఈ నుడికార మార్యభాషలకు ద్రావిడమునుండి సంక్రమించియుండును.

ప్రాచీనార్యభాషలలోని కర్మణి ప్రయోగమాధునికార్యభాషలలో జాలవఱకు నంతరించినది. దానికిబదులుగ నేటి యార్యభాషలలో ద్రావిడమునందువలె 'పోవు, పడు, పట్టు, పెట్టు, తిను' అను నర్థములనిచ్చు ప్రత్యేక ధాతువు లుపయోగమున నున్నవి.

(5) ఆధుని కార్యభాషలయందును ద్రావిడభాషలయందును ధ్వన్య నుకరణశబ్దము లనేకములున్నవి. వైదికభాషయం దిట్టివి చాలనరుదు. ఇవి ప్రాకృతావస్థనుండియు నానాటికి నధికమగుచు వచ్చినవి. ధ్వన్యనుకరణ శబ్దములు కోలుభాషలయందును నెక్కువగనున్నవి. బహుశ: ఈ విషయమున కోలుభాషల సంపర్కమును నార్యభాషలకు గలిగియుండును.

(6) రెండుకుటుంబముల యందును 'ప్రతిధ్వనిశబ్దము' లెక్కువగ వాడుకలో నున్నవి. శబ్దమునకు బాక్షికముగ బునరుక్తికలుగును.పునరుక్త పదము నాద్యక్షరములు నియతముగనుండును. పునరుక్తపదమర్థరహితమైన దైనను మొదటిపదమునకు 'మొదలగు', 'పోలిన', 'సంబంధించిన' అను మొదలగునర్థముల గలుగ జేయుచుండును. ఉదాహరణములు:- బంగాలీ: ఘోరాటోరో; మైథిలీ: ఘోరా-తోరా; హిందోస్థానీ: ఘోఱా-ఉఱా; గుజరాతీ: ఘోఱో-బోకో; మరాఠీ: ఘోఱా-బీఱా; సింహళీ: అశ్వయా-బశ్వయా; తమిళము: కుదిరెయ్-కిదిరెయ్; కన్నడము: కుదిరె-గిదిరె; తెలుగు:గుఱ్ఱము-గిఱ్ఱము.

ఇట్టి రూపములకును గుడ్డ-గుడును; పెట్టె-పేడ; కుండ-మండ; మొదలగు సమాసములకును భేదమున్నది. ఇట్టి సమాసములలో రెండవ మాట మొదటి పదమునర్థమునే కలిగిన ప్రాచీనపుమాట; మీద దెలిపిన వానిలో రెండవపద మర్థరహితము. ఇట్టి సమాసము లాధుని కార్యభాషల యందును గలవు.

ఉదాహరణములు:- కాపఱ్-చోపఱ్; చాఱీ-బాఱీ; మొ.

III. వాక్యనిర్మాణము.

ఉచ్చారణ, శబ్దనిర్మాణములకంటె, వాక్యనిర్మాణము భాషల సంబంధమును నిర్ణయించుట కెక్కువగ నుపయోగించును. వాక్యనిర్మాణ విధానము పరంపరాగతమై, చాలవఱకు మాఱక యుండును. క్రొత్తయుచ్చారణమును, శబ్దములందలి మార్పులును నితర భాషాసంపర్కము వలన సులభముగ గలుగ వచ్చును. వాక్యనిర్మాణవిషయమున ఆధునిక ఇండో-ఆర్యభాషలును ద్రావిడ భాషలును నైక్యమును వహించియున్నవి. శబ్దముల క్రమమును మార్చకుండ పదములకు పదములనుంచి తమిళువాక్యమును బంగాళీవాక్యముగనో, హిందీ వాక్యముగనో మార్చవచ్చును. కాని, పెర్షియను, ఇంగ్లీషువాక్యముల నట్లు మార్ప వీలులేదు. ఈ వాక్యనిర్మాణమునందలి యైక్య మీరెండు కుటుంబములకును బ్రాకృతముల కాలమునుండియు గలుగుచువచ్చినది. పాలి ప్రాకృతభాషల వాక్యనిర్మాణమును గమనించినయెడల నీవిషయము బోధపడగలదు. ఈ రెండు కుటుంబముల వాక్యములందును మొదట విశేషణములతోడి కర్తయును, తరువాత విశేషణములతోడి కర్మమును, పిదప క్రియార్థమును వివరించు పదములును, దుదను సంపూర్ణ క్రియా పదమును వచ్చును.

రెండు కుటుంబములందును కర్తృకర్మములను గలుపు అస్త్యర్థక ధాతువు లేకుండును.

ఉదాహరణము:- బంగాళీ: ఏ-టా ఆమాదేర్ బాఱీ; కన్నడము: ఇదు నమ్మమనె; తమిళము: ఇదు ఎంగలుడైయ వీడు; తెలుగు: ఇది మాఇల్లు; బంగాళీ: మానుష్-టీ భాల; తమిళము: మనిదన్ నల్లవన్; కన్నడము: మనుష్యను ఒళ్లేయవను; తెలుగు: మనుష్యుడు మంచివాడు.

నుడికారములో రెండు కుటుంబములకును మిక్కిలి దగ్గఱ పోలికలున్నవి.

(i) 'అని' అను క్త్వార్థక శబ్దముల యుపయోగము:- బంగాళీ: బొలియా; తూర్పుహిందీ: బోల్-కే; మరాఠీ: మ్హణూన్; సింహళీ: కియా; తమిళము: ఎన్ఱు; కన్నడము: ఎందు; తెనుగు: అని.

(ii) క్రియల లోట్ రూపములకు మాఱుగ తుమున్నంతాది రూపములను వాడుట:- పశ్చిమహిందీ: యహ్‌కామ్ కర్నా; కన్నడము: ఈకెలస మాడువుదు; తెనుగు: ఈపని చేయునది.

(iii) క్రియల లోడ్రూపమున కొకయర్థమున 'నిచ్చు' ధాతువు రూపములకు వాడుట:- సంస్కృతము: వదాని; బంగాళీ: ఆమాకే బొలితే దేఓ; హిందోస్థానీ: ముఝే బోల్నేదో; తెనుగు: నన్ను చెప్పనిమ్ము, చెప్పనీ.

ఇండో-ఆర్యభాషల కీపోలిక లిండియాకు వెలుపలనున్న యిండో-యూరోపియను భాషలతోలేవు. ఈ విషయమున నార్యభాషలపై ద్రావిడ భాషల ప్రోద్బలమున్నదని చెప్పక తప్పదు.

IV. శబ్దజాలము.

ఆర్యభాషలు భరతవర్షమును జొచ్చిననాటినుండియు నందు ద్రావిడభాషాపదములు గలియుచునే యున్నవి. బ్రాహూఈ జాతివా రిండియాకు వెలుపలనున్న ద్రావిడజాతివారే. ఐరానుదేశములో నితరద్రావిడభాషల వారుండుట యసంబవముగాదు. వారితో నార్యులకు సంపర్కము కలిగి యుండును.

కాల్డ్వెల్, గండర్ట్, కిట్టెల్, మున్నగువారు ద్రావిడభాషలనుండి యార్యభాష లెరవుతీసికొన్న పదముల పట్టికల నిచ్చియున్నారు. ఇండో-యూరోపియను భాషలలో సమానపదములులేని యార్య భాషలలోని దేశీయ పదములన్నియు ద్రావిడపదములై యుండును. కొన్ని కోల్‌ భాషాపదములునై యుండును. కొన్ని ద్రావిడ, కోల్‌భాషలకు పూర్వదేశమందుండిన భాషలలోని పదములునునై యుండును."

కాల్డ్వెల్‌పండితుడు ద్రావిడభాషలకును నిండో-యూరోపియను భాషలకును గల సంబంధమును గూర్చి విపులముగ జర్చించి యా రెండు కుటుంబములకును నెట్టిసంబంధమును లేదనియు సిథియను భాషలతోడనే ద్రావిడభాషల కెక్కువసంబంధ మున్నదనియు నిర్ధారణము చేసెను. తనకు సిథియను సంబంధములు కనబడిన చోట్లనెల్ల నిండో యూరోపియను సంబంధములుగూడ బొడగట్టుచునే యుండెను. ఆతడు వానినిగుర్తించి యుండక పోలేదు. కాని యాతని యభిప్రాయమంతయును సిథియను సిద్ధాంతము ప్రక్క కొరగి యుండుటచే నాత డిండో-యూరోపియను సంబంధముల నంగీకరింప లేకుండెనని యాతని గ్రంధమును చదివినవారికి స్ఫురింపక పోదు. విశేష్యముల బహువచన ప్రత్యయమగు నకారము, పదప్రత్యయ సంయోజన విధానము, ద్వితీయావిభక్తి ప్రత్యయములగు మకార నకారములు, చతుర్థీవిభక్తి ప్రత్యయము, ఇన్ అను షష్ఠీవిభక్తిప్రత్యయము, అ, ఇంద్రె అను షష్ఠీవిభక్తి ప్రత్యయములు, ఇల్ అను సప్తమీవిభక్తి ప్రత్యయము, ఒందు, అంజు, ఎట్టు అను సంఖ్యా వాచకములు, ఉత్తమ మధ్యమ పురుష సర్వనామములు ఆత్మార్థక సర్వనామము, సర్వనామముల బహువచన ప్రత్యయములు, నిర్దేశార్థక సర్వనామ విశేషణములు గౌరవార్థక సర్వనామములు, భూతార్థక తప్ప్రత్యయము, భూతార్థక్రియలయం దామ్రేడితము, భూతార్థకములగు ఇ, ద, ప్రత్యయములు, భవిష్యదర్థ బోధక ప్రత్యయములు, శబ్దజాలము,- ఈ విషయముల జర్చించిన సందర్భములనెల్ల నాతని కిండో యూరోపియను సంబంధములు కనబడుచునే వచ్చినవి. కాని యాతడు వాని నన్నిటిని నిరాకరించెను.

ఇటీవల జరిగిన పరిశోధనముల ఫలితముల మూలమున గ్రియర్ సన్ పండితుడు కాల్డ్వెల్ చేసిన సిధియను సిద్ధాంతము నెట్లు నిరాకరించెనో యింతకుముందు తెలుపబడియున్నది. సిధియను జాతిగాని, సిధియను భాషా కుటుంబముగాని, లేనప్పుడు సిధియను సిద్ధాంతము నిలుచుట కవకాశము లేదు కదా.

కాల్డ్వెల్ కాలమునకు బ్రాకృత భాషలనుగూర్చికాని, ఆధునికార్య భాషలను గూర్చికాని పరిశోధనము లెక్కువగా జరిగియుండలేదు. ఇటీవల జరిగిన పరిశోధనముల ఫలితములను సునీత్ కుమార్ ఛాటర్జీ పైన వివరించి నట్లుగా నొక్కచోట జేర్చియున్నాడు. ఆతడు చూపిన సంబంధములే కాక యింక నెన్నిటినో చూపవచ్చును. ద్రావిడభాషలు ప్రాకృతములుకావను కొనుటచే నార్యభాషలు వేఱనియు, ద్రావిడభాషల ప్రోద్బలమువలన నార్యభాషలు ప్రాకృతములుగాను, నేటి యార్యభాషలుగాను బరిణమించినవనియు చెప్పుట సంభవించినది. ప్రాచీన ఇండో_ఆర్యభాషలు నేటి యార్యభాషలుగా మాఱుట యవి సహజముగ సొంతమార్గమున బరిణమించుటచేతనైనను, ఇతరభాషల ప్రోద్బలము చేతనైనను కలిగియుండ వచ్చును. నేటి పరిశోధకులు రెండవ కారణమును దెలుపుచు ద్రావిడభాషల నార్యభాషలనుండి ప్రత్యే కించుచున్నారు. వా రట్లు చెప్పుటకుబ్రాచీన ప్రాకృతభాషలు ప్రచారమునం దున్నకాలమునకే ద్రావిడభాషలు నేటిరూపమునగాని తత్తుల్యమైన రూపమునగాని యుండెనని నిరూపింపవలసి యున్నది. ప్రాచీనప్రాకృత భాషల కాలమునకు నేటిరూపమున ద్రావిడభాష లుండెననిచూపుట కెట్టి నిదర్శనములు లేవు. ఆనాడు దక్షిణదేశపు భాషలకు దాక్షిణాత్య యను పేరుండెను. మృచ్ఛకటికమున చందనకుడు పలికిన "కణ్ణాడకలహప్పఓఅం కరేమి" అనువాక్యము దాక్షిణాత్యభాష కుదాహరణముగ గనపడుచున్నది. మార్కండేయు డీభాషలకు లక్షణా కరణత్వమును దెలిపి దానిని ర్చివివరింపలేదు. ఈ భాష శౌరసేనీభవమైన యావంతికి సంబంధించినట్లు లాక్షణికులు తెలుపుచున్నారు. ఇదిగాక దక్షిణదేశభాషలయందలి ప్రాకృతములలో ద్రావిడప్రాకృత మొకటి యుపభాషగా దెలుపబడి యున్నది. దాక్షిణాత్యయను ప్రాకృతమును ద్రావిడీప్రాకృతమును పైశాచీ భాషావికారములని కొందఱి యభిప్రాయము. ఎట్లైనను నీవిషయమై ప్రాకృత లాక్షిణికులుగాని ద్రావిడభాషలకు వ్యాకరణముల వ్రాసిన వైయాకరణులు గాని ద్రావిడభాషల ప్రాకృతత్వమునుగూర్చి విచారింపలేదు. ఇండియా దేశపుభాషలలో లిఖితరూపమున నున్నవానిలో సంస్కృతముతఱువాత ప్రాకృతములు మొదటివి. ఆ తఱువాత లిఖితములయినభాషలు ద్రావిడభాషలు: తమిళములో 5 లేక 6 వ శతాబ్దమునుండియు గ్రంథములుకాన్పించుచున్నవి. అంతకు బూర్వమే యా భాషయందు గ్రంథము లున్నవని కొందఱందురు గాని తగిన నిదర్శనములు లేకపోవుటచే నాయూహ నేడు విడనాడ బడుచున్నది. తమిళము తఱువాత లిఖితమైనభాష కన్నడము (7 వ శతాబ్దము.) తఱువాత లిఖితమైనది తెనుగు (9 వ శతాబ్దము.) తక్కిన భారతవర్షీయ భాషలన్నియు బదునొకండవ శతాబ్దమున కీవల గ్రంధస్థములైనవే. వానిలో బశ్చిమహిందీభాషాభాషాభేదములగు బుందేలీ (12 వ శతాబ్దము); బ్రజ్ భాష (1192); మరాఠీ (13 వ శతాభ్దముమధ్యమము); మళయాళము (13 లేక 14 వ శతాబ్దము); బంగాళీ (14 వ శతాబ్దము); కాశ్మీరి (14 వ శతాభ్దము); పంజాబీ (15 వ శతాబ్దము); గుజరాతి (15 వ శతాబ్దము); మైథిలీ (15 వ శతాబ్దము); అస్సామి, అవధీ లేక కోసలీ (16 వ శతాబ్దము); బఘేలీ (1563); ఒఱియా (17 వ శతాభ్దము); ఖస్కుర లేక నేపాళీ (17 వ శతాబ్దము); కనౌజీ (17 వ శతాబ్దము); సింధీ (18 వ శతాబ్దము); కుమౌనీ (1790); గఱ్ఱ్వాలీ (1876); ఆయా భాషలలో నాయాకాలములందు ప్రథమగ్రంథములు వెలువడినట్లు తెలియవచ్చుచున్నది. అంతకు బూర్వము వానిస్వరూప మెట్లుండెనో తెలిసికొనుట కాధారములు లేవు. క్రీస్తుపూర్వము 3 వ శతాబ్దమునుండి క్రీస్తుశకము 5 వ శతాబ్దము వఱకును భారతడేశమందంతటను బ్రాకృతభాషలు ప్రచార మందుండినట్లు మనకు దెలియును. నాటనుండి 6, 7 వ శతాబ్దములవఱకు దక్షిణహిందూదేశము నందును, 12 వ సతాబ్దమువఱకును తక్కిన భారత వర్షమునందును ప్రచారమునం దుండినభాషల స్వరూపమెట్లుండెనో తెలిసికొనుట కాధారములులేవు. అట్టిసందర్భమున ద్రావిడ భాషల మూలమున బ్రాకృతభాషలను నేటి యార్యభాషలును కలిగినవని యూహించుట సమంజసము కాదని తోచుచున్నది. కావున నా యభిప్రాయమునకు దగినయాధారములు నిరూపింపబడు వఱకును బూర్వలాక్షణికులతో నేకీభవించి ద్రావిడభాషలుగూడ బ్రాకృతభాషలే యనియు దక్కిన ప్రాకృతభాషలెట్లు గలిగినవో ద్రావిడ భాషలును నట్లే గలిగినవనియు బ్రాకృతభాషలపై ద్రావిడీ ప్రాకృతమున కెంతటి ప్రోద్బలము కలిగెనో ద్రావిడభాషలపై గూడ దక్కిన ప్రాకృతభాషల వలన నంతప్రోద్బలము గలిగెననియు బ్రాచీనార్యభాషలనుండి తక్కిన ప్రాకృతములవలె ద్రావిడభాషలును వికాసము నొందినవనియు దలంచుచు నాదృష్టితో బరిశోధనముల సాగించినచో ద్రావిడభాషా తత్త్వము తేలగలదని చెప్పుట సాహసము కానేరదు.

కాల్డ్వెల్ సిద్ధాంతమును గూర్చి విచారించుట యిచ్చట నప్రస్తుతము కానేరదు. ఆత డేయే విషయములందు సంస్కృతమునకును ద్రావిడ భాషలకును సంబంధము లేదని తెలిపెనో యావిషయములందెల్ల ద్రావిడ భాషలకును బ్రాకృతములకును సంబంధము కానవచ్చుచున్నది. కాల్డ్వెల్ తన సిద్ధాంతమునకు బోషకములుగ జూపిన యుపపత్తులును వానికి సమాధానములును నీక్రింద చూపబడుచున్నవి.

1. "ద్రావిడభాషలలోని శబ్దజాలమునందు సంస్కృతేతరభాగము సంస్కృతభాగముకంటె నెక్కువగానున్నది."

సమాధానము.

కాల్డ్వెల్ సంస్కృతేతరభాగమనుకొన్నది నిజముగ బ్రాకృత భాగము. కేవల దేశ్యమని తలంపబడు ద్రావిడ శబ్దజాలము ప్రాకృతమార్గమున నెక్కువగ వికారము నొందినదై యున్నది. నిజముగ దేశ్యమైన భాగము కొలదిగనే యున్నదని పరిశోధనము వలన దేలగలదు.

2. "ద్రావిడభాషలలోని సర్వనామ సంఖ్యావాచక శబ్దములును సుప్తిజ్ ప్రత్యయములును వాక్యనిర్మాణమును - అనగా భాషకు జీవమన దగినదంతయు - మొదటినుండియు సంస్కృతమునకును ద్రావిడభాషలకును వేర్వేరుగనున్నది."

సమాధానము.

సర్వనామములు సంస్కృతమునకును బ్రాకృతములకును సమానమూలమగు నిండో-ఐరేనియను భాషలనుండి వేర్వేరు మార్గముల బరిణామముల నొందివచ్చి యుండుటచే భేదముగలిగినది. సంఖ్యావాచకముల విషయమున నిండో యూరోపియను భాషలందును నేటి యార్యభాషల యందును జాలపోలికలను జూపవచ్చును. వీనినిగూర్చిన ప్రశంస మఱియొకచోట జేయబడును. సుప్తిజ్ ప్రత్యయములు ప్రాకృత భాషలోనే లోపించినవి. విభక్తి రూపములన్నియు సామాన్యముగ నేకరూపమును దాల్చుటచే నావిభక్తి సంబంధమును దెలుపుటకు గ్రొత్తమాటలు చేర్పబడుచు వచ్చినవి. ఈమార్పు ద్రావిడ భాషల యందువలె దక్కిననేటి యార్య భాషలయన్నిటి యందును గాననగుచున్నది. వాక్యనిర్మాణవిషయమున సంస్కృతమునందు పదప్రత్యయ సంయోజనము సంపూర్ణముగ నుండుటచే వాక్యము లోని శబ్దముల స్థానము విషయమున నొకనియతిలేకుండెను. కాని ప్రాకృత భాషలయందును వాని పరిణామ రూపములగు నేటి భారతీయ భాషలయందును బ్రత్యయములు లోపించుటచే వాక్యములోని శబ్దములస్థానము విషయమున నొకనిర్ణయ మేర్పడ వలసివచ్చెను.

3. "ద్రావిడనిఘంటువులలో సంస్కృత పదజాలమెక్కువగ నున్నదని ద్రావిడభాషలు సంస్కృత భాషాజన్యములని తలంపగూడదు. ఆనిఘంటువులలో దేశభాషాపండితులు దేశ్యములను బ్రత్యేకించియే యున్నారు."

సమాధానము.

శబ్దజాలమును తత్సమ, తద్భవ, దేశ్య, భాగములుగా విభజించుట ద్రావిడ భాషలలోనే కాక ప్రాకృతము లందును నున్నది. తత్సమములనునవి సంస్కృతమునుండి క్రొత్తగా నెరవు తెచ్చుకొన్నట్టివి. అవి నిత్యజీవనమున సమస్తజనులకు సమస్త విషయములందును నుపయోగపడు నట్టివి కావు. అవి మతము, విజ్ఞానము, శాస్త్రములకు సంబంధించినవి. కావున నవి సాధారణ జనులనోటిలో బడి చివికిపోక నిలచియున్నవి. తక్కిన ప్రాకృతములనుండి వచ్చిన శబ్దజాలములో గొంత మార్పుచెందక యట్లేనిలచినది. కాని సాధా రణజనుల వ్యవహార ప్రవాహమున బడి కొన్ని సంస్కృత ప్రాకృత శబ్దములు వర్ణలోప, వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణవ్యత్యయముల మూలమున గొతవికారమును బొందినవి. వీనికే తద్భవములని పేరు. వీనికిని వీనిమాతృకలకును నింకను గొంతపోలిక నిలచియున్నది. కాని యీతద్భవములలో గొన్నియింకను మార్పుల నొందుచు దొల్లింటి మూలరూపములతో నెట్టిపోలికయు లేకుండ మాఱినవి. ఇట్టిపోలికలు గుర్తింపరాని శబ్దములనే వైయాకరణులును నిఘంటుకారులును దేశ్యములనిరి. ప్రాకృత భాషలలోని దేశ్యశబ్దములకును నేటి యార్యభాషలలోని దేశ్య శబ్దములకును నిటీవల భాషాశాస్త్రమున గలిగిన యభివృద్ధి మూలమున మాతృకలు కనుగొనబడుచున్నవి. ద్రావిడ భాషల విషయమున నిట్టిపరిశోధన మింకను జరిగియుండలేదు. కాల్డ్వెల్ నాటనుండియు ద్రావిడ భాషలకును నార్యభాషలకును సంబంధము లేదను నభిప్రాయము స్థిరముగ నిలుచుటచే బరిశోధకు లీవంకకు దమదృష్టిని ద్రిప్పరయిరి. తక్కిన ద్రావిడభాషల మాట యెట్లున్నను నాంధ్రభాషను గూర్చి యీ విషయమై నేనుచేసిన పరిశోధనముల ఫలితమును మఱియొక యధ్యాయమున జూపుచున్నాను. కాల్డ్వెల్ పండితు డీసందర్భమున సంస్కృతముతో సంబంధింపవని యిచ్చిన పదముల పట్టికను గూర్చి మాత్రమిచ్చట ముచ్చటించుట యుక్తము. అత డాయాపదములకు సంబంధింపని సంస్కృత శబ్దముల నిచ్చుటచే బోలికలు సరిగ గానరాకున్నవి. కాని యాపదములకన్నిటికి దగిన సంస్కృత శబ్దములను నిరూపింప వచ్చును. ఈక్రింది పట్టికలో కాల్డ్వెల్ ఇచ్చిన తమిళపదములు, ఆతడిచ్చిన సంస్కృతపదములు, వానికి సరియైన సంస్కృత పదములును వరుసగా జూపబడుచున్నవి.

తమిళము కాల్డ్వెల్ ఇచ్చిన సంస్కృతపదము సరియైన సంస్కృత పదము.
అప్పన్ పితృ అంబ:
ఆయి మాతృ మాయి (హిందీ)
తాయి మాతృ ధాత్రీ
మగన్ నూమ మహాన్
మగళ్ దుహితృ మహతీ
తలెయ్ సిరస్ తల
శెవి కర్ణ శ్రవన్
వాయ్ ముఖ వక్త్ర
మయిర్ కేశ శ్మశ్రు
తమిళము కాల్డ్వెల్ ఇచ్చిన సంస్కృతపదము సరియైన సంస్కృత పదము.
కెయ్ హస్త కర
వాన్ దివ్ వ్యోమన్
నాళ్ దివస నాళీ
ఇరవు నక్ రాత్రి
ఞయిరు సూర్య ప్రాణేసర్
తీ అగ్ని తేజస్
నీర్ అప్ నీర, నార,
మీన్ మత్స్య మీన
మలెయ్ పర్వత మలయ
కల్ అశ్మన్ గ్రావన్
ఇల్ వేశ్మన్ నిలయ
ఊర్ గ్రామ పూర్
ఆనెయ్ హస్తిన్ అనేకప
కుదిరెయ్ అశ్వ ఘోట
నాయి శ్వాన శ్వాన
పఱ సూకర పోత్రిన్
పరవెయ్ పయస్ పారావత
కఱు కాల కృష్ణ
వెళ్ శుక్ల శ్వేత
శె రక్త శోణ
పెరు మహత్ పృథు
శిఱు అల్ప శ్రథ్
ఇన్ మధుర ఇక్షు
తిను భక్ష్ తృణ్
నిల్ స్థా నిష్ఠా
ఏగు చర్
కొల్ హన్ క్రూ(ర)

మొదలయినవి.

4. "ద్రావిడభాషలలో గ్రంథస్థలములుగాని వనేకములున్నవి. వీనిలో సంస్కృతపదములు లేనేలేవని చెప్పవచ్చును. సంస్కృతపదముల నుపయోగించు గొన్నిభాషలలో నవి యంత యావశ్యకములు కావు. వానిని విడనాడినను నాభాషలకు లోపములేదు."

సమాధానము.

గ్రంధస్థములుగాని ద్రావిడభాషలనుగూర్చి యెక్కువగా బరిశోధనము జరుగలేదు. వీనిలో సంస్కృతపదము లెక్కువగా లేకుండుటకు గారణము తఱువాతికాలపు ఆర్య విజ్ఞాన మీభాషలను మాట్లాడు జాతులకు జేరకుండుటయే. సంస్కృతపదములుగాక తక్కిన శబ్దజాలమునకును, గ్రంధస్థములయిన భాషలలోని తద్భవ, దేశ్యశబ్దజాలమునకును సంబంధము పరిశోధకులు గుర్తించియే యున్నారు. సంస్కృత ప్రాకృతభవములైన శబ్దములను ద్రావిడభాషలు విడనాడ గలవనుట సరికాదు. గంజి, నీరు, అంబలి, కూడు; గరిటె, తెడ్డు, గిన్నె; కట్టెలు, విసనకఱ్ఱ, మంచము, చాప, గొడ్డలి, కత్తి; ఇల్లు, కొట్టు, అంగడి, అటక; మేక, గొఱ్ఱె, గుఱ్ఱము, గాడిద; అప్ప, అమ్మ, మామ, అత్త, బావ, అక్క:- ఇట్టి వందలకొలది సంస్కృత ప్రాకృతభవములను తెలుగువారు విడనాడ జాలరు.

5. "భాషానిర్మాణము:- శబ్దజాలముమాట యెట్లున్నను భాషానిర్మాణ విషయమున సంస్కృతమునకును ద్రావిడభాషలకును నెట్టి సంబంధమును లేదని చెప్పుచు కాల్డ్వెలు ఈక్రింది విషయములను వివరించి యున్నాడు.

1. "సంస్కృతములోని లింగమునకును ద్రావిడభాషలలోని లింగమునకును సంబంధమేలేదు. సంస్కృతములో లింగము శబ్దముల యంతములను బట్టియుండును. ద్రావిడభాషలలో నిది సహజలింగము. ఇందు శబ్దముల యంతములతో బనిలేదు."

సమాధానము.

సంస్కృతములోగూడ సంపూర్ణముగ శబ్దముల యంతముల ననుసరించి లింగమేర్పడునని తలంపవీలులేదు. అకారాంత శబ్దములలో దారా: వంటి శబ్దములు కొన్ని పుంలింగములు. ఇకారాంతములలో పుంలింగములును స్త్రీలింగములును గూడ గలవు. అ, ఇ, ఉ, ఋ, లు అంతమందుగల శబ్దములు మూడు లింగములందును గలవు. ఇట్లే హలంతశబ్దము లందుగూడ నొక నిర్ణయములేదు. కాని శబ్దముల లింగము ననుసరించి వానితో జేరు విభక్తి ప్రత్యయములు మాఱుచుండు ననుట నిజము. ప్రాకృతభాషలలో శబ్దముల యంతములు వివిధముగ మార్పుల నొందుటచే నేశబ్ద మేలింగమో నిర్ణయించుట కవకాసము లేకపోయినది. రానురాను నేటి యార్యభాషలయందు గొన్నిటిలో దప్ప శబ్దములనుబట్టి తెలియదగిన లింగజ్ఞాన మంతరించినది. ఈ లింగజ్ఞాన మున్నకొలది యార్యభాషలలోగూడ నెన్నియో తబ్బిబ్బులు గానవచ్చుచున్నవి. ద్రావిడభాషలలో లింగముల యవస్థయు నిట్లే యున్నది. ఆర్యభాషలలో లింగజ్ఞానము మిగిలియున్నంత మట్టుకు ద్రావిడభాషలలో గూడ లేకపోలేదు. శబ్దమును వినినంతనే దాని యంతమునుబట్టి కొన్నిమాటల లింగమును ద్రావిడభాషలలో దెలిసికొనవచ్చును. తెనుగులో తొయ్యలి, వైదలి, కలికి, ముండమోపి, నంగనాచి, మారి, ఆలి, ఉగ్మలి, మొదలగు శబ్దములలోని ఇకారమును, మించుబోడి, వన్నెలాడి మొదలగు శబ్దములలోని ఇప్రత్యయమును, ఎఱుకత, కొఱవత, బోయత, మెలత, చాకిత, మాలెత మొదలగువాని లోని తప్రత్యయమును, పొలతి, పడతి, నాతి, గోతి, మొదలగు వానిలో తిప్రత్యయమును, వెలది, మాలది, మొదలగువానిలోని ది ప్రత్యయమును స్త్రీలింగద్యోతకములుగ నున్నవి. బుడ్డ, బుడ్డి; టింప, టింపి; పిచిక, పిచికి, మొదలగు జంటలలో మొదటిది శబ్దరూపమునుబట్టియే పుంలింగమనియు రెండవది స్త్రీలింగమనియు ద్యోతకమగుచున్నది. ఇట్లే స్త్రీలపేళ్లను హ్రస్వము చేసి పిలుచు నప్పుడు పాపి, సూరి, గురివి, వెంకి, మొదలగురీతుల ఇకారమును స్త్రీలింగ ప్రత్యయముగ వాడుట సర్వసాధారణము. ఇట్లే యితర ద్రావిడ భాషలయందును గలదు.

2, 4. "సంస్కృతములోవలె ద్రావిడభాషలలో విభక్తి ప్రత్యయములు లేవు. విభక్తి ప్రతిరూపకావ్యయములు మాత్రము ప్రాతిపదికములకు జేర్పబడును. ఏకవచనములో విభక్తుల కేప్రత్యయములు చేరునో బహువచనమునందును నవియేచేరును. ఏకవచనమున బ్రాతిపదికమునకును, బహువచనమున బహువచన ప్రత్యయమునకును నివి చేర్పబడును. సంస్కృతములో మూడు వచనములందును మూడు ప్రత్యయములు చేరును."

సమాధానము.

ఈ విషయమై యింతకుముందే కొంత వివరింపబడినది. సంస్కృతములోని విభక్తిప్రత్యయములన్నియు వికారముల నొందుటయు విభక్తిజ్ఞానమంతరించుటయు దిరిగి విభక్తులను బోధించుటకు బ్రత్యేకావ్యయములను బ్రాకృతములోను నేటి యార్యభాషలలోను నుపయోగింప బడుటయు నింతకుముందు తెలిసికొంటిమి. నేటి యార్యభాషలలో సరిగ ద్రావిడభాషల యందువలెనే విభక్తివిధానము కాన్పించుచున్నది. ఒక్క యుదాహరణము చాలును. హిందీ: రామ్; తెలుగు: రాముడు.

-- ఏక. -- బహు --
-- హిందీ తెనుగు హిందీ తెనుగు
ప్ర రామ్ రాముడు రామ్-లోగ్ రాములు
ద్వి రామ్-కె రాముని రామ్-లోగన్-కె రాములను
తృ రామ్-సే రామునిచే,రామునితో రామన్-లోగ్-సే రాములచే, రాములతో
రామ్-కే రామునికై రామన్-లోగ్-కే రాములకై
రామ్-సే రామునికంటె రామన్-లోగ్-సే రాములకంటె
రామ్-కే రామునికి రామన్-లోగ్-కే రాములకు
రామ్-మే రామునియందు రామన్-లోగ్-మే రాములందు
సం హేరామ్ ఓరామ హేరామన్-లొగ్ ఓరాములారా

3. " ద్రావిడభాషలలో నమహద్వాచక శబ్దములకు బహవచనరూపములులేవు. క్రియలలో నమహద్బహువనము లింకను నరుదుగనున్నవి. సంస్కృతములో నట్లుగాదు."

సమాధానము

తమిళములో బూర్వకాలమున నెట్లున్నను నేటి తమిళమునందును నితర ద్రావిడభాషలయందును నిట్టివాడుక కానరాదు. ప్రాకృతావస్థలో నేక వచన బహువచన రూపములకు భేదము పోయినది. నేటి యార్యభాషలలో గూడ నట్లే యున్నది. బహుత్వమును దెలుపుటకు నేటి యార్యభాషలయందు ప్రత్యేక సమూహవాచక శబ్దములుపయోగింపబడుచున్నది. అట్లే ప్రత్యేక ద్రావిడభాషలయందును గాన్పించుచున్నది.

5. "ఇండో యూరోపియను భాషలలో గ్రియల కుపసర్గములు చేరుచుండును. ద్రావిడభాషలలో నుపసర్గములులేవు. వానికి మాఱుగ బ్రత్యేక శబ్దములు పదముల తఱువాత చేరుచుండును."

సమాధానము

ప్రాకృతభాషలలోనే యుపసర్గలు ధాతువులతో గలసిపోయి వికారమునుబొంది, యవి యుపసర్గలను గుర్తులేకుండ బోయినవి. ఉపసర్గలతో గూడిన సంస్కృతధాతువులు ప్రత్యేకధాతువులుగా బ్రాకృతములో వెలసి నవి. వానికి బ్రత్యేకపదములు చేర్పబడుచు వచ్చినవి. నేటి యార్యభాషలలోను ద్రావిడభాషలలోను గూడ నట్లే జరిగినది.

6. సంస్కృతమునందలి విశేషణములకు విశేష్యములకువలె లింగ విభక్తివచనములనుబట్టి వేర్వేరురూపములు గలుగుచుండును. ద్రావిడభాషలయం దట్లుగాదు.

సమాధానము.

సంస్కృతమునందలి యీ విధానముగూడ బ్రాకృతములందును మార్పుల నొందినది. ఈ విషయమున నేటి యార్యభాషలయందు వైవిధ్యము గాన్పించుచున్నది. సంస్కృతములో విశేషణము వచనమునందును విశేష్యము ననుసరించుచుండ గౌడభాష లన్నిటిలోను ప్రథమేతరవిభక్తి ప్రాతిపదికమే యేక బహువచనములలో నొక్కరూపమున నున్నది. సింధీలో మాత్రము విశేషణముయొక్క స్త్రీలింగ బహువచనము విశేష్యము ననుసరించును. విశేషణములతో జేరు విభక్తిప్రత్యయముల విషయమున గూడ సంస్కృతమునకును నేటి గౌడభాషలకును గొంత భేదమున్నది. విశేష్యముల ప్రధమేతర విభక్త్యేకవచన ప్రాతిపదికము తూర్పు హిందీ, ప్రజభాషలలో 'ఆ', మరారీభాషలో 'యా,'లతో నంతమైయుండగా విశేషణముల 'యా' రూపము 'ఆ' తో నంతమగు చున్నది. ఇంక నిట్టిభేదము లనేకము లున్నవి. ఇట్టి వ్యవహారము గౌడభాషలలో నుండుటకు గారణ మాభాషలలో దీర్ఘాచ్చులతో నంతమగు పదము లుండుటయే. ద్రావిడభాషలలో దీర్ఘములన్నియు హ్రస్వములగుటచే ఏ విధానమం దంతరించినది.

7. ద్రావిడభాషలలో గ్రియాజన్య విశేషణముల నెక్కువగ వాడుదురు. సాధారణ విశేషణముల వాడుక చాల తక్కువ.

సమాధానము.

గౌడభాషలలో గూడ, ముఖ్యముగ బశ్చిమ దక్షిణ గౌడభాషలలో నిట్లే యున్నది.

8. ద్రావిడభాషలలో నుత్తమపురుష బహువచనమున రెండు రూపములున్నవి. అందొకటి మాట్లాడుచున్నవారిని కలిపియు (మనము), మఱి యొకటి మాట్లాడుచున్న వారిని విడిచి పెట్టియు (మేము) ప్రయోగింప బడును. సంస్కృతములో నిట్లులేదు.

సమాధానము.

ఈ విషయమై గ్రియర్‌సన్‌గా రిట్లు చెప్పుచున్నారు. ఉత్తమపురుష బహువచనములో దమిళము, మళయాళము, కురుఖ్, కుఇ, తెలుగు అను ద్రవిడభాషలలోమాత్రము రెండురూపములున్నవి. కురుఖ్, కుఇ, తెలుగు అను భాషలలో నెదుటివారిని విడిచిన రూపమే తమిళ మళయాళములలో వానిని చేర్చునట్టి రూపముగా నున్నది. ఇందువలన మూలద్రావిడభాషలో నుత్తమపురుష బహువచనమున రెండు రూపము లింకను గలుగలేదని యూహింపవలసి యున్నది. కన్నడము, గోండు, బ్రాహూఈ భాషలలో నుత్తమపురుష బహువచనమున నొక్కరూపము మాత్రముండుట యీ యూహను బలపఱుచుచున్నది. కావున నుత్తమ బహువచనమున రెండు రూపము లుండుట మఱియొక భాషాకుటుంబము సంపర్కము వలన గలిగి యుండవలెను. ముండా భాషలయందు బహువచనమున రెండు రూపములున్నవి. ద్రావిడ భాషలయందును రెండురూపము లుండుట యీ ముండా భాషల సంపర్కము మూలముననే యయి యుండును."

ఈ విషయమింకను 'సర్వనామప్రకరణము'న ముందు చర్చింపబడును.

9. ద్రావిడభాషలలో గర్మణిప్రయోగము లేదు. సంస్కృతములో నున్నది. కర్మణిభావము ద్రావిడభాషలలో బ్రత్యేక క్రియలను జేర్చుటవలన దెలుపబడును.

సమాధానము.

నేటి గౌడభాషలలో ద్రావిడభాషల యందువలె కర్మణిప్రయోగము మృగ్యముగా నున్నది.

10. ద్రావిడభాషలలో సముచ్చయార్థమున శత్రర్థకములును, త్వార్థకములును వాడబడును. సంస్కృతములో సముచ్చయచిహ్నము ప్రత్యేకముగ నున్నది.

సమాధానము.

నేటి గౌడభాషలలో ద్రావిడభాషయందువలెనే యున్నది.

11. ద్రావిడభాషలలో నఞర్థక్రియలున్నవి. సంస్కృతములో లేవు.

సమాధానము.

ప్రాకృతములలో నఞర్థకమగు నకారము ధాతువులతో జేరుచు వచ్చినది. నేటి సింధీభాషలో గ్రియారూపములోనే మార్పుగలిగి నఞర్థకము దెలుపబడుచున్నది. 12. ద్రావిడభాషలలో సంబంధార్థక సర్వనామములు లేవు. వాని యర్థమును దెలుపుటకు సంబంధార్థక క్రియాజన్య విశేషణములు వాడుకలో నున్నవి.

సమాధానము.

ద్రావిడభాషలలో సంబంధార్థక సర్వనామములు లేవనుట సరికాదు. యావను, ఎవన్, ఎవడు మొదలగునవి సంబంధార్థక సర్వనామములే. ఇవి సంస్కృతములోని య: అను సంబంధార్థక సర్వనామమునకు వికారములే. ప్రశ్నర్థక సర్వనాముము ద్రావిడభాషలలో లేదనియు సంబంధార్థక సర్వనామమే ప్రశ్నార్థమున నుపయోగింప బడుచున్నదనియు జెప్పుట యుక్తము.

13. ద్రావిడభాషలయందలి నార్య నిర్మాణపద్ధతి సంస్కృతమునకు భిన్నముగా నున్న దీనికి సమాధాన మింతకు ముందీయబడియే యున్నది.

ద్రావిడభాషలయందు తెనుగున కీయదగిన స్థానము.

ద్రావిడభాషల కన్నిటికిని మూలభాష యొకటి యుండవలెను. అట్టి భాషయొక్క లక్షణములు చాలమట్టుకు నేటి తమిళ భాషయందు నిలిచి యున్నవనియు, నందుచే నదియే ప్రాచీనతమ ద్రావిడభాష యనియు కాల్డ్వెల్ మున్నగువారు తలంచియుండిరి కాని యిటీవలి పరిశోధనముల మూలమున బ్రాచీన ద్రావిడభాషా లక్షణములు తెలుగు మొదలగు భాషలయం దెక్కువగ నున్నవని తెలిసినవి.

తమిళ మళయాళము లొక భాషకు ----- శాఖలు. కన్నడము తమిళముతో గొన్ని పోలికలను కలిగియున్నను నెక్కువ విషయములందు తెనుగుతో సంబంధించి యున్నది. తుళు, కొడగు, తొద, కోత భాషలు తమిళకన్నడములకు మధ్యస్థానము నాక్రమించియున్నవి. కురుఖ్, మల్తొ భాషలకును నాస్థానమునే యివ్వవలెను. ఇ, కోందుభాషలు తమిళమును కంటె దెలుగునే యెక్కువ పోలియున్నవి. లోలామీ, నాయకీ, భీలీ భాషలకు గూడ నదియేస్థానము నీయవలయును. తెలుగుభాష తక్కిన ద్రావిడ భాష లన్నిటికంటె స్వతంత్రమగు స్థానము నాక్రమించుచున్నదని గ్రియర్‌సన్ పండితుని యభిప్రాయము.

తెలుగునకు గల యీ ప్రత్యేకత్వమునకు గారణమేమి? ప్రాచీన ప్రాకృతభాషల కిది తక్కిన ద్రావిడభాషలకంటె నెక్కువ దగ్గఱగా నుండుటయే యని యీ గ్రంధమును జదువుచున్నపుడు గోచరింపగలదు. ఆంధ్రభాషా చరిత్రము వ్రాయునప్పు డొకవంక తక్కిన ద్రావిడభాషలకును మఱి యొకవంక ప్రాచీన ప్రాకృతభాషలు, నేటి యార్యభాషలకును గల సంబంధములను పోలికలను జూపుట యావశ్యకమగును. ఈవిషయమై పరిశోధనమును గ్రొత్తగ నారభించి యుండుటచే నిందు గొన్ని స్ఖాలిత్యము లుండవచ్చును. చిన్నచిన్న వివరములలో నభిప్రాయ భేదము లచ్చటచ్చట గలిగినను గ్రంధమును ౙదివిన వెనుక మొత్తముమీద నాంధ్ర భాషయు దానితో సంబంధించిన యితర ద్రావిడభాషలును బ్రాకృత భాషాభేదములే యను నభిప్రాయము పండితుల మనస్సునం దంకురించినదో నదియే నేను చేసిన కృషికి బ్రతిఫలము కాగలదు.