ఆంధ్ర గుహాలయాలు/పరిచయం

వికీసోర్స్ నుండి

పరిచయం

Preface

భారత దేశ గుహాలయాలు, ఆలయాలు మరియు ఆంధ్ర ఆలయాల చారిత్రక, వాస్తు, శిల్ప వివరాలగూర్చి అనేక గ్రంథాలు ప్రచురించబడినాయి. కానీ ఆంధ్రలోని హిందూ గుహాలయాలపై సమగ్రమైన, విమర్శనాత్మక గ్రంథము ఇంతవరకు రచింపబడలేదు. కావుననే ఈ "ఆంధ్ర గుహాలయాలు" గ్రంథ రచన చేపట్టబడినది.

ఇందు ఎనిమిది ప్రధాన విభాగాలు గలవు. మొదటి విభాగము గుహాలయాలపై ఉపోధ్ఘాతమును కలిగియున్నది. ఈ భాగముననే కొయ్య, ఇటుక, సున్నము, మట్టి, శిల. శిలాఖండములు ఆలయ నిర్మాణాలకు వస్తువుగా వాడబడిన పరిణామ దశలగూర్చి చర్చించ బడియున్నది. అంతేగాక బౌద్ధ గుహాలయాలు హైందవ గుహాలయాల నిర్మాణానికి మార్గదర్శకమయిన రీతిని ఉదాహరణలతో అశోకుని కాలమునుండి చాళుక్య, పల్లవ, చోళ, పాండ్య కాలముల వరకు చర్చించుట జరిగినది. మరియు ఒక ప్రాంత నిర్మాణాలపై పడిన మరొక ప్రాంత నిర్మాణాల ప్రభావము గూడ చర్చించబడినది.

రెండవ విభాగాన ఆంధ్రలోని గుహాలయాల పరిణామదశలు, వాటిపై ఇతర ప్రాంతాల నిర్మాణాల ప్రభావము, ఆయా గుహాలయాల నిర్మాతలు, నిర్మాణ కాలాలు చర్చించబడినది.

మూడవ విభాగమునందు ఆంధ్రలోని విజయవాడవద్ద గల అక్కన్న మాదన్న గుహాలయము, మొగల్‌రాజపురంవద్ద గల గుహాలయాలు. ఉండవల్లివద్ద గల గుహాలయాల వివరాలు తెలుపబడినవి.

నాల్గవ భాగమున ఈ గ్రంథమున ప్రముఖముగా చర్చించబడిన నెల్లూరు జిల్లాలోని భైరవకోనయందలి ఎనిమిది గుహాలయాల వాస్తు, శిల్ప వివరాలతో బాటు వాటి నిర్మాతలగూర్చి వివరణాత్మకముగా, విమర్శనాత్మకముగా చర్చించబడియున్నది.

ఐదవ భాగమున భైరవకోనయందలి శిల్పసంపదగూర్చి వివరముగా తెలుపబడియున్నది. ఆరవ విభాగాన భైరవకోన గుహాలయాలపై అభిప్రాయాలు ఇవ్వబడియున్నవి. ఏడవ విభాగమున గ్రంథ విషయ గ్రహింపు కొరకు గుహలు, శిల్పాలు, ప్లాన్‌లు మేప్‌లు మొదలగువాటి చిత్రపటాలు ముప్పది ఆరు ముద్రింపబడియున్నవి. ఎనిమిదవ విభాగమున ఈ గ్రంథ రచనకు ఉపకరించిన ముఖ్య అధారగ్రంథాల పట్టీ ఇవ్వబడియున్నది. అంతేగాక గ్రంథ ప్రారంభమున "ముందు మాట", కృతజ్ఞతలు "పరిచయం చిత్రపటాల పట్టీ మొదలగు అంశాలు గలవు.

చరిత్ర శాఖ
జవహర్ భారతి
కావలి. 524 202,
నెల్లూరు జిల్లా. ఎ.పి.

దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి.