Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/యాదవామాత్యకవి

వికీసోర్స్ నుండి

42. యాదవామాత్యకవి

ఇతడు చంద్రహాసవిలాస మను కావ్యమును పూర్వోత్తర భాగములుగా రచియించెను. ఈతనికాల మెప్పుడో తెలియలేదుగాని లక్షణ శిరోమణి యనునామాంతరము గల యాదవామాత్యఛందములోని,

సీ. రగణము శంఖమనగనొప్పుమూడవజామునబవడపు జాయకుజుడు
   గ్రహముగావేల్పు హిరణ్యరేతుడుగాగ దార కృత్తికగాగ దగరురాశి
   గా మేషయోనిగా గణమాసురంబుగా శృంగారరసముగా స్థిరఫలంబు
   భయముగా గౌశికభద్రగోత్రమున నెఱ్ఱనిమేన నృపకులమున జనించె


   బంధుజనగేయ సత్కవిభాగధేయ
   రమ్యచారిత్ర వేంకటరాజపౌత్ర
   వర్ణితోదార బాపన్నవరకుమార
   మదనసౌందర్య యాదవామాత్యవర్య.

ఇత్యాదిపద్యములనేకములు సులక్షణసారములో నుదాహరింపబడి యుండుటచేత నీయాదవామాత్యకవి 1620 వ సంవత్సరమునకు బూర్వపువాడనిమాత్రము నిశ్చయముగా జెప్పవచ్చును. ఇష్టదైవము తన్నుద్దేశించి పలికినట్లుగా గవి చంద్రహాసవిలాసములో నిట్లు వ్రాసి కొనియున్నాడు. <poem>

సీ. ఇట్లనిపల్కె మహీసురాన్వయమున వాసి కెక్కినభరద్వాజమౌని

  గోత్రసంభవులందు గొమరొప్పుభానప్పవంశంబునకు జాలవన్నె తెచ్చి
  నట్టి తిమ్మకవీంద్రు నన్వయంబునబుట్టి మహి మించు నారపమంత్రి పుత్రుం
డగువేంకటాద్రి కిల్లాలైన కొండాంబతనయు డాబాపన్న తమ్ములైన

ఘనులు కృష్ణయ వీరసల్ కవియె జెన్న
మాంబ యనుసాధ్వియందు ని న్నాదరమున
దలప రామన్న నీపినతండ్రికొడుకు
మదనసౌందర్య యాదవామాత్యవర్య.

ఈకవియొక్క వినయశౌశీల్యాదులు కవిస్తుతి మొదలైన యీ కృత్యాదిపద్యములవలన దేటపడుచున్నవి-


సీ. వాల్మీకి ముఖ్యగీర్వాణకవీంద్రులకును నన్నపార్యాదితెలుగుకవుల
కును శుభంబు లొసంగు మని భద్రగిరిరామభద్రుని గడుభక్తి బ్రస్తుతించి
కవివరు ల్నామీద గలదయచేతను గబ్బంబు చెప్పగాగలనటంచు
భావించి నే నీప్రబంధంబు గల్పింపదలచివాడను సతతంబు నియతి


శారదాదేవి బ్రార్థించి గారవమున
వరము గైకొని మీ రంప వచ్చి వాణి
నాదుజిహ్వాంచలంబున బాదుకొనిన
ధైర్యమున బల్కెదను గవివర్యులార!


గీ.పెంపుమీఱ వేల్పు బెద్దలు పూజింప | బాలుడట్లు చేయుభంగిగాను
మీరు కవిత జెప్పినారని నే నిట్టి | చర్య కొనరితి గవివరులార !


క. కదళీపాకముగా బెం | పొదవగ నీ ప్రబంధ మొగి రచియింతున్
గొదవలు మిక్కిలి గల్గిన |సదయత దగ దిద్దవలయు సత్కవివర్యుల్.

గీ. లేకయుండిన జదు వేమిలేనివాని
కిట్టి సద్బుద్ధి జనియించు టెందు గలదు
నిచ్చనిచ్చలు మీరంప వచ్చి వాణి
పొసగ నన్నిట్లు పలికింప బూనె గాక.


గీ. నన్ను బోలినకవి గల్గకున్న ధాత్రి
వరకవీంద్రులన్ పే రెట్లు వచ్చు మీకు

   బిన్న లుండుటచేగాదె పెద్ద లనుచు
   దెలియగలుగుట యార్యులు తెలిసికొనుట.


ఉ. నేరిచి యాడుపుత్రులును నేరక పల్కిననందనుండునున్
   గూరుమితల్లి కొక్కటియగుం దలపోయగ వాగ్వధూటికిన్
   మీరలు నేను నొక్కటియె మీరువచించినకావ్యమండలిం
   జేరి మదీయవాక్యముల జేరకపోవునె యంచు నెంచుచున్.


పై పద్యములలో భద్రాద్రిరాముని బేర్కొని యుండుటవలన గవి గోదావరీమండలములోనివాడని తేటపడుచున్నది. ఈకవి యాఱు వేల నియోగిబ్రాహ్మణుడు; భారద్వాజగోత్రుడు; వేంకటరాజ పౌత్రుడు; బాపనార్యపుత్రుడు. ఇతడు కృతు లందుట మొదలైన వానినిబట్టి చూడగా నిత డున్నతపదమునం దుండినట్లు తోచుచున్నది. ఇతడు గ్రంథాదిని కేవలాంధ్రపద్యము చెప్పక నన్నయాదుల వలె సంస్కృతభాషతో నీక్రిందిపద్యమును వేసియున్నాడు-


చ. శ్రితజనరక్షణాయ సరసీరుహపత్రవిలోచనాయ వి
   శ్రుతశుభకీర్తనాయ రవిసూనుసఖాయ మఖావనాయ సం
   తతసుగుణాకరాయ వసుధాతనయాపరితోషణాయ నే
   వితపవనాత్మజాయ రఘువీరపరాయ నమోనమోనమ:

ఈతనికవిత్వము కవి తాను జెప్పుకొనినట్లు కదళీపాకముతో దేనె లొలుకుముద్దుపలుకులతో వినువారి చెవులకు జవులు గొలుపుచు హృదయంగమముగానున్నది. కవనభంగిని జూపుటకయి చంద్రహాసవిలాసములోని నాలుగుపద్యముల నిం దుదాహరించుచున్నాను-


ఉ. బంగరుమేడలం జలువసందిరులన్ నెలరాతితిన్నెలన్
   రంగగుమేలిమిద్దియల రచ్చలనంతుల నాట్యశాలలన్
   సింగపుమోము లొక్కయెడ జెక్కినచక్కనిగోపురంబులన్
   బొంగుచు నప్పురీవరము పొల్పు వహించు ధరాతలంబునన్. పూర్వభా.