ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/బైచరాజు వేంకటనాథకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10. బైచరాజు వేంకటనాథకవి

ఇతడు పంచతంత్రమును పద్యకావ్యమునుగా రచియించెను. ఈకవి క్షత్రియుడు. ఈతని తాతయైన బైచరాజునుబట్టి యీకవి కీయింటిపేరు కలిగినట్లు తోచుచున్నది. కవి తనవంశకర్తయైన బైచరాజునిట్లు వర్ణించియున్నాడు:-

ఉ. ధీరత రాజవంశజలధిం బ్రభవించె మహావిరోధిసం
హారవిహారి సాళ్వబిరుదాంకుడు బైచనృపాలు డద్ధరి
త్రీరమణీమనోహరునితీవ్రయశస్సృతికిన్ హరాద్రినీ
హారవసుంధరాధరము లయ్యె సమగ్రవిహారశైలముల్.

ఈ కవికాలమును సరిగా నిర్ణయించుటకు దగిన యాధారము లేవియు దొరికినవికావు. తమనిఘంటువునందు బ్రౌన్‌దొరవా రితడు 1500 వ సంవత్సరప్రాంతముల యందుండినట్లు వ్రాసియున్నారు. ఇందుకు విరుద్ధములైన ప్రమాణములు కనబడు వఱకును మన మాకాలమునే సిద్ధాంతముగా గ్రహింపవచ్చును. ఈ వేంకటనాధుడు పూర్వకవి వర్ణనము నీ క్రిందిపద్యమును జేసియున్నాడు-


మ. హృదయబ్రహ్మరధం బతిప్రియతమం బెక్కింతు జేతోమరు

త్సదనాస్థానికి దెత్తు మానసనభస్సంచారి గావింతు హృ

ద్విదితక్షీరసముద్రఖేలనమునం దేలింతు నుత్కష్టవ

స్తుదులం బ్రాజ్ఞల దిక్కయజ్వ నమరేశున్ సోము శ్రీనాధునిన్.


ఇందు శ్రీనాథుడు పేర్కొనబడియుండుటచేత గవి 1450 వ సంవత్సరమునకు బూర్వపువాడు కాడనుట నిశ్చయము. కవి కత పెదతండ్రినిగూర్చి "లింగక్షోణిపాలుండు యవనసైంధవకాననానలుండు" అని వ్రాసియున్నందున నతడు మహమ్మదీయులకును హిందువులకును దక్షిణహిందూస్థానములో యుద్ధములు జరుగుచున్న కాలములో నుండి యుండవలెను. ఇతడు తన గ్రంథమును హరిహరనాథున కంకితముచేసి, ఆ విషయమున నిట్లు వ్రాసికొనియున్నాడు-


క. ఏచనువు గలదు హరిహర|సాచివ్యము నొంద నన్యజనులకు మది నా

లోచింప దిక్కయజ్వకు|నాచనసోమునకు మఱియు నాకుందక్కన్.


హరిహరనాథునకు గృతియిచ్చుటచే నితడు నెల్లూరిమండలములోనివాడని తోచుచున్నది. అప్పకవిగాని మఱి యే యితర లక్షణ కర్తగాని యీతనిపద్యములను లక్ష్యములనుగా జేకొనియుండలేదు. ఆ హేతువునుబట్టి యితడాధునికుడని యూహించుటకంటె నీతని గ్రంథమునందు లక్షణవిరుద్దములయిన ప్రయోగము లుండుటచేత నుదహ రింప మానిరని తలచుట మేలు. ఇతడు కవిత్వ మెట్లుండవలెనో యీ క్రిందిపద్యమున దెలిపియున్నాడు-


చ. ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూడముగాక ద్రావిడీ

స్తనగతి దేటగాక యరచాటగునాంధ్రవధూటిచొక్కపుం

జనుగవబోలి తేటయును జాటుదనంబును గాక యుండ జె

ప్పినయదెపో కవిత్వ మనిపించు నగిం చటుగాకయుండినన్.


వ్యాకరణదోషము లనేకము లున్నను మొత్తముమీద నీతని కవిత్వము పయినిజెప్పినట్లే యుండి ప్రౌడమయి హృదయాహ్లాదజనకముగా నున్నది. పర్వతరాజపుత్రుడయిన యీ వేంకటనాథకవి పంచ తంత్రములోని కొన్ని పద్యములను నిందుదాహరించు చున్నాను-


చ. పలికినమాట నిల్వ డెడపందడపం జెడనాదు వచ్చుమె

చ్చుల దిగమ్రింగు దొల్తొలుత జూచినచూపుల జూడ డేర్పడం

జులకదనం బొనర్చు నెరసుల్ఘటియించు నదల్చివైచు గే

వలనృపసంశ్రయంబు పగవారలకు స్వల దివ్వనుంధరన్- [మిత్రభేధము]


చ. ఇట ననుడించి యేమిగత మేగెను చెప్పగదన్న యెట్టులె

క్కటిని జరింతు నన్న తృటికాలము ని న్నెడబాసియున్కి దు

ర్ఘటముగదన్న నాకడను గల్గిన యీధృతి యెందు బోయె ని

ప్పటికి విచిత్ర మన్న విధి భద్రవిరోధిగదన్న యెన్నగన్- [సుహృల్లాభము]


చ. సురియ కరంబునం గొనక శూరుడు నీతికళావిలాసభా

సురుడు వధించు వైరి విరసున్ దవుదవ్వుల జెంత నుండియున్

సురియ ధరించియున్ మగువచొప్పున నేమియు జేయలేడు త

న్గెరలగజేయ మానవ నికృష్ణుడు మాటలు వేయునేటికిన్- [సం.విగ్ర] ఉ. చెప్పిన నంతరంగమున సింగడుబూరడునై స్రియంబు సాం

పుప్పతిలంగ బల్కెనది యోయి కృతఘ్నుడ నీవు కావె య

ప్ప్పప్ప సుహృత్తముం డయినయాయన నింటికి దెచ్చి వెల్పు నే

చొప్పున గొల్తు రట్లు పరిశుద్ధసపర్యల గొల్చు టొప్పదే- [లబ్ధనాశము]


ఉ. నావిని బ్రాహ్మణుండనియె నన్ను బ్రయత్న మెలర్ప బట్టికిం

గావలిపెట్టి పుట్టినిలు గాల్పగ నీ వటుపోవ నేను నా

లో వివరంబుమాలి మృగలోచన ముంగిస నే కిశోరర

క్షావిధి కొప్ప నేర్పఱచి జాఱితి మందిర బాహ్యభూమికిన్- [అసంప్రేక్ష్యకార్వితము]

             ________