ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/పిడుపర్తి బసవకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ద్రుండు దురత్యయోరుభవదోషవిదూర మన:ప్రచారుడై


మండగి మాదిరాజు గుణమండితవందితు డొప్పు నప్పురిన్- [ఆ.1]

ఉ. పట్టకు పట్ట కింక వృషభం బది మాటలు చెల్లినప్పుడే

పెట్టితి లింగముద్ర యదె బీరము తప్పగ బట్టి తేనియున్

గొట్టుదునీశిరంబు ధర గూలగ మాబసవన్న యాన చే

పట్టుల గాచుటెల్ల శివభక్తులకున్ బిరుదంబుగావునన్- [అ.5]


శా. ఆనందాశ్రుపయోధి నిట్టవొడువన్ హర్షోత్థరోమాంచస

శ్రీ నెమ్మేనికి భూషణంబుగ లసద్గ్రీవోద్గమద్గద్గద

ధ్వానమ్ముల్ గురుకర్ణసత్వములుగా దాత్సర్యమున్ భక్తియున్

లోనన్ గీల్కొనియున్న యాత్మసుతు నాలోకించి మై పెంచుచున్- [ఆ.7]


                _______


15. పిడుపర్తి బసవకవి


ఇతడు శైవబ్రాహ్మణుడు. బసవపురాణమును పద్య కావ్యముగా రచియించిన సోమనాధుని తమ్ముడయిన పాలనార్యుని పుత్రుడు. కాబట్టి యీకవియు నించుమించుగా సోమనాధుని కాలమునందే యున్నవా డగుటచేత 1520 -వ సంవత్సర ప్రాంతమునం దున్నవాడని చెప్పవచ్చును. ఇతడు పాల్కురికి సోమనాథుడు రచియించిన ప్రభు లింగలీలను తెనుగున నైదాశ్వాసముల పద్యకావ్యముగా రచించెను. ఈ బ్రభు లింగలీలయందు బసవేశ్వరునికిని బసవేశ్వరుని మేనల్లుడయిన చెన్న బసవన్నకును గురువయిన యల్లమప్రభుడను జంగమదేవరయొక్క కథ చెప్పబడియున్నది. పిడుపర్తి బసవకవియొక్క కవనవిధము తెలియుటకై ప్రభులింగలీలనుండి రెండుమూడు పద్యముల నుదాహరించు చున్నాను.ఉ. ఊరును నిల్లు బల్లియలు నొల్లక సల్లలితాంతరంగులై

ఘోరతరాటవిన్ ఘననికుంజములన్ సెలయేళ్ళ చెంత శృం

గారవంబులన్ భయదగహ్వరసీమ దపంబు జేసి పెం

పారుమహామునీశ్వరులయాత్మలు దత్తఱ మందె నత్తఱిన్. [ఆ.1]


ఉ. చిత్తసరోజ మిష్టమున జేరిచి చూపులు ప్రాణలింగమున్

హత్తగ జేసి భావమున కంచితతృప్తి యొసంగి సంగముల్

రిత్తలు చేసి యెందును జరింపగ నేరిచి తేని నీవ య

త్యుత్తమలింగమూర్తి వివి యొప్పుగ జేకొను సిద్ధరామనా. [ఆ.3]


మ. బసవయ్యా భవదీయమందిరమునన్ భక్తిన్ సదాభోజనం

బసలారంగ నొనర్చుజంగమము లాత్యాసక్తి నాకటించే

విసునంగా నికనేల తామసము ఠీవిన్ వారి దోడ్తెచ్చి మీ

రసమానస్థితి నారగింప గదరయ్యా హాయిగా నేటికిన్. [ఆ.5]

             __________

16. కోట శివరామయ్య

ఈకవి సానందోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు శూద్రుడు; కౌశికగోత్రుడు; కోట బాపనయ్య పుత్రుడు; కాళహస్తిపుర నివాసుడు. ఇతడు తాను కృష్ణదేవరాయలకాలములో నున్నధూర్జటికవి శిష్యుడ నని గ్రంథములో జెప్పుకొని యుండుటచేత 1525 - 1550 వ సంవత్సరములకు మధ్యనుండియుండును. సానందొపాఖ్యానమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగములు కొన్ని కానబడుచున్నవి. కవిత్వము మృదువుగానే యున్నది. ఈ గ్రంథము నందలి రెండు మూడు పద్యముల నిందుదాహరించుచున్నాను