ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/చెన్నమరాజు చెన్నమరాజు
37. చెన్నమరాజు చెన్నమరాజు
ఈకవి చారుచంద్రోదయ మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును జేసెను. ఇతడు నందవరీక నియోగిబ్రాహ్మణుడు; ఆత్రేయగోత్రుడు; శేషయామాత్యపుత్రుడు. ఈకవి తాను పెమ్మసాని తిమ్మరాజున కాశ్రితుడయినట్టు చెప్పి తిమ్మరాజు శ్రీరంగనాయనికిని వేంకటపతిరాయనికిని మంత్రియైన ట్టొకపద్యములో నీక్రింది వాక్యముతో జెప్పియున్నాడు -
సీ. శ్రీరంగరాయ ధాత్రీతలాధ్యక్ష దక్షిణభుజాదండమై చెలగినాడు.
* * * *
రమణ వేంకటపతిరాయేంద్రుడు నుతింప బటుకార్యదక్షుడై ప్రబలినాడు
ఈకవి తనముత్తాతయైనలక్ష్మీపతి శ్రీనాథకవికి శిష్యుడై నట్లీక్రింది పద్యములలో దెలిపియున్నాడు-
క. సన్నుత కవిత్వవిద్యా|భ్యున్నతి శ్రీనాథసుకవిపుంగవుకరుణన్
జెన్నమరున్ లక్ష్మీపతి|చెన్నమరాజప్రధాన శేఖరు డెలమిన్.
కవి శ్రీరంగరాయ వేంకటపతిరాయల కాలములోనున్నవా డగుటచేత క్రీస్తుశకము 1574-1614 సంవత్సరములమధ్యను ప్రబలి యున్నవాడు. కవియొక్క కవిత్వరీతి తెలియుటకై చారుచంద్రోదయములోని పద్యముల రెంటిని నిందుదాహరించుచున్నాను.
ఉ. ఎల్లి యవశ్యమున్ పనికి నేగి మహోగ్రతపం బొనర్చి సం
వల్లలనామనోహరుకృపన్ వరలాభము గాంచివత్తు నీ
యుల్లమునం బ్రమోదము సముల్లసితంబుగ నిందు నిల్వు మో
పల్లవపాణి యంచు బ్రియభాషల భూవిభు డాదరించినన్.
శా. తావు ల్గుల్కెడుమేనుతీవకు బరీతాపంబు గావించునీ
జీవంజీవమనోజ్ఞ మూర్తి యకటా శీతాంశువా కాదు శో
భావై రూప్యమునన్ జనభ్రమదమౌ భస్మానృతానంగతే
జోవై శ్వానరవిస్ఫులింగముసుమీ చూడన్ దిశానాయకా.
38. తెనాలి అన్నయ్య
ఈకవి సుదక్షిణాపరిణయమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు తెనాలి పురనివాసుడు; శైవాచార సంపన్నుడు; రామపండితపుత్రుడు.
శా. శ్రీలీలాహరినీలపీఠరుచిరశ్రీవత్ససంపన్నవ
క్షోలాలిత్యుడు వేంకటేశుడు కృపం గోనేటిరామక్షమా
పాలస్వామిసమస్తరాజ్యభరణోపాయాధికున్ హృద్యవి
ద్యాలోలున్ బులిజాలరామవిభుసోమామాత్యునిం బ్రోచుతన్.
సుదక్షిణాపరిణయములోని యీప్రథమపద్యమునుబట్టియే యీకావ్యము కోనేటి రామరాజు మంత్రియైన పులిజాల సోమామాత్యున కంకితము చేయబడినట్టు తెలిసికోవచ్చును. ఆసోమామాత్యు డొకనాడు సభాసీనుడయి తన్ను రావించి కృతి వేడిన ట్లీక్రిందిపద్యములలో గవి చెప్పుకొనియున్నాడు-
మ. కవులున్ గాణలు జాణ లార్యులు హితుల్ కాంతానమూహంబు లు
త్సవలీలం దను గొల్వ నిండుకొలువై సత్కావ్యగోష్ఠీవిశే
షవినోదై కపరాయణత్వమును రాజ్యశ్రీవిహారంబు బ్రా
జ్యవివేకంబు దనర్ప రామవిభుసోమామాత్యు డత్యున్నతిన్.