Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/ఎలకూచి బాలసరస్వతి

వికీసోర్స్ నుండి

44. ఎలకూచి బాలసరస్వతి


ఈకవి పదునేడవశతాబ్దారంభమునం దుండి మహామహోపాధ్యాయ బిరుదము నందినవాడయి పాండిత్యముచేత మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవాడు.



క. ఆలోక నుతుడు మొన్నటి
   కీలకసమ నామతంగగిరికడ నొసగెన్
   బాలసరస్వతులకు నత
   డోలి దెనుగూటీక దాని కొప్పుగ జేసెన్.


అని యప్పకవి చెప్పుటనుబట్టి యిత డాంధ్రశబ్దచింతామణికి తెనుగుటీకను 1608 వ సంవత్సరమునందు చేసినట్టు కనబడుచున్నది. ఈకవి కట్టకడపట రచించిన రాఘవయాదవ పాండవీయమునందు తాను చేసినగ్రంథములనుగూర్చియు తన్నుగూర్చియు నిట్లు చెప్పుకొను చున్నాడు.



సీ. కవిసమీహితరంగ కౌముదీనామనాటకవిధానప్రతిష్ఠాఘనుండ
   సారసారస్యసచ్చంద్రికాపరిణయప్రముఖశతాగ్రప్రబంధకర్త
   నంధ్రచింతామణివ్యాఖ్యానభాషావివరణాదిబహుతంత్రకరణచణుడ
   వేదశాస్త్రపురాణవివిధసంగీతసాహిత్యాదివిద్యోసబృంహణుండ


   ననఘకౌండిన్యగోత్రుడ హరిపదాబ్జ
   భక్తిశీలుడ నెలకూచి భైరవార్య
   కృష్ణదేవతనూజుడ నేవిచిత్ర
   కావ్య మొక్కటి నిర్మింపగా దొడంగ.


శా. మెండై నట్టి విచిత్రవైఖరులచే మీ దౌమహాకావ్యముల్
   దండిం దొల్లియె చేసి రాదిములు తత్కావ్యాధికశ్లాఘమై

   నుండ న్రాఘవకృష్ణపాండవకథాయుక్తప్రబంధంబు వా
   క్పాండిత్యం బలరార శ్లేషరచనైకప్రౌడి నే జేసెదన్.

ఇతడు రచియించిన యీరాఘవయాదవపాండవీయము మూడర్థములు గలది. ఇట్లు త్ర్యర్థికావ్యములను రచియించినవారిలో నితడే మొదటివాడు. పూర్వోదాహృతమయినసీసపద్యమువలన నితడు రంగకౌముదియనునాటకమును, చంద్రికాపరిణయమను ప్రబంధమును, ఆంధ్రశబ్దచింతామణి వ్యాఖ్యానము, భాషావివరణము నను లక్షణగ్రంథములను రాఘవయాదవపాండవీయ మనుత్ర్యర్థికావ్యమును రచియించినట్టు కనబడుచున్నది. ఇత డాంధ్రశబ్దచింతామణికి వ్యాఖ్యానము మాత్రమే చేసినట్టు పయిపద్యమున జెప్పబడినను మూలగ్రంథమునుగూడ నితడే చేసి గౌరవము కలుగుటకయి దానికర్తృత్వమును నన్నయభట్టున కారోపణచేసినట్లనేక హేతువులచేత నిశ్చయింప దగియున్నది. ఈవిషయమునుగూర్చి నన్నయభట్టారకునిచరిత్రమునందు గొంత వివరముగా వ్రాసి యున్నాను. నన్నయభట్టునకు శబ్దశాసను డన్నబిరు దీశబ్దశాస్త్ర నిర్మాణముచేత గలిగినదని కొందఱు భ్రమపడుచున్నారుగాని యది సరి కాదు. నన్నయభట్టారకుడు మొట్టమొదట లక్షణప్రాయమైన సత్కావ్యమును రచియించి యితరకవులకు కావ్యరచనకు దారిచూపుటచేత నాతనికి వాగనుశాసను డన్న బిరుదము వచ్చినదేకాని వ్యాకరణనిర్మాణముచేత రాలేదు.

"భట్టార బాలసరస్వతికవి మహోపాధ్యాయుడు" తానురచియించిన చంద్రికాపరిణయమును పర్తియాల జమీన్ దారుడగు జూపల్లి వేంకటాద్రి కంకితముచేసెను. ఈపర్తియాల బెజవాడకు రెండామడల దూరమున నిజామురాష్ట్రములో నున్నది. ఈకవిని కాకునూర్యప్పకవి చూచియుండవచ్చును. చంద్రికాపరిణయము కృతినాయకునితండ్రి. జూపల్లి లింగన్న. ఈలింగన్నను రంగరాజు లింగన్నగూఢముగా దిట్టిన యీక్రిందిచాటుపద్యము నప్పకవి యుదాహరించియున్నాడు-



క. రవికోటిధామమయమై
   నవకాంచనయుతము నగుచు నానాటి కొగిన్
   భువిని శివాన్విత మగు నీ
   భవనము జూపల్లి లింగ భవగుణసంగా.

చంద్రికాపరిణయమునందు కాశిరాజుకూతురైన చంద్రికను భీముడు వివాహమాడినకథ వర్ణింపబడినది. ఇతడు పదునేడవశతాబ్దారంభమునుండి 1630-40 సంవత్సరములవఱకును పండితకవిగా పేరుపడి యుండవచ్చును. ఈతని రెండు తెలుగుకావ్యములనుండియు రెండేసిపద్యముల నిం దుదాహరించుచున్నాను.


                చంద్రికాపరిణయము

ఉ. జంగమరోహణాద్రిసదృశంబులు తత్పురి గల్గుభద్రపా
   రంగవరేణ్యము ల్పయికి హస్తము లించుకసాచి యవ్వియ
   ద్గాంగఝురంబు పీల్చి మరి తద్వమధుప్రకరంబు దప్పిసా
   యంగ నొసంగు రంగుగ నిజాఖ్యవహించినచాతకాలికిన్.


ఉ. అంతట రుక్మబాహువసుధాధిపనందన యొక్కనాడు శు
   ద్ధాంతగృహంబు వెల్వడివిహారగతిం జనుదెంచె నెచ్చెలుల్
   చెంతల గొల్వ జంచదళిశింజితరంజితకుంజమంజుల
   ప్రాంతగిళత్ఫలానవరతాంగజఘోటికి బుష్పవాటికిన్.


                 రాఘవ యాదవ పాండవీయము

ఉ. బోరన సద్దునంగడచి పో నెడయీక చరించుమంచు న
   వ్వారిధిగా దలంచి పురివాడలకుం దిగబోలు గేహసం
   స్కారకధూపధూమముమిషంబున మబ్బు దివాంతవేళల
   న్వారవధూటు లందు గలవాలు మెఱుంగులువో గణింపగన్.