ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మల్లికార్జున పండితుఁడు

వికీసోర్స్ నుండి

మల్లికార్జున పండితుఁడు

శైవమతవ్యాప్తి నొనర్చిన శ్రీపతి, మంచెన, మల్లి కార్డున పండితులు మువ్వరికిని పండితత్రయమని పేరు. ఆ పండితులలో నితఁడు మూఁడవ వాఁడు. గొప్ప మతసంస్కర్త ఆంధ్రదేశమునందలి లింగధారుల మత సంప్రదాయముల కీతఁడే మూలపురుషుడు. ఈ మల్లికౌర్జనపండితుని చరిత్రను దెలిసికొనుటకు-ఈతని వెనుక 40 ఏండ్లనాఁడుండిన పాల్గురికిసోమనాధుఁడు రచించిన 'పండితారాధ్యచరిత్ర" మను ద్విపదకావ్యమే యాధారము ఈ "పండితారాధ్యచరిత్రము”నే శ్రీనాధ మహాకవి క్రి శ. 14వ శతాబ్దిలో పద్యకావ్యముగా రచించినట్లు తెలియుచున్నది

మల్లికార్డునుఁడు గోదావరిమండలములోని దాక్షారామ భీమేశ్వరుని యర్చకుc డగు భీమనపండితునకును, గౌరాంబకును పుత్రుఁడు. ఇతఁడు బుగ్వేది యనియు, గౌతమ గోత్రజుఁడనియు "చతుర్మరనిర్ణయ" మను నొక సంస్కృతగ్రంధమునందుఁ జెప్పఁబడినదఁట ! (చూ. తెనుఁగు కవుల చరిత్ర పుట 251 ) వానసవంశీయుఁడని పండితారాధ్యచరిత్రమున నున్నది. కోటిపల్లిలో నివసించుచుండిన "ఆరాధ్యదేవర" ఈతని గురుపు. ఇతఁడు గురువునొద్ద శైవదీక్షఁ గైకొని, శైవమతరహాస్యములను సాకల్యముగా గుర్తెఱిగి, శ్రుతిపురాణోక్తిసహితముగ శైవమత మహత్త్వమును ప్రచారము చేసెడివాఁడు. తాను శివపూజానియమమున నున్నను, జంగములు వచ్చినచో వెంటనే వారిని పూజించెడివాఁడు :

మల్లికార్డున పండితుఁడు సనదవోలు (చందవోలు) రాజగు వెలనాటి చోడుని సభలో మతాంతరుల వాదములను ఖండించి శైవమతమును నిల్పెనఁట! ఇతడు కల్యాణపురమున నున్న బసవేశ్వరునిఁ జూచుటకు కుటుంబముతోను, శిష్యులతోను బయలుదేరి దారిలో 'నిడుగుము" లనుచోటఁ దనశిష్యుఁడు దోనయ్యగారికి అన్నమైన వీరచాకి రాజయ్యగారిచే గౌరవింపఁబడి పానుగంటికిఁ బోయెను. ఆ యూరి నపుడు 'ఉదయనుఁడు' పాలించుచుండెను. పింగళి గోవింద ప్రధాని యాతని మంత్రి. పండిత భక్తుఁడగు గోవిందుఁ డితనిని మిక్కిలి గౌరవించెను. ధవళేశు నామయ్య యను భక్తుఁ డీతని సేవలో మగ్నుఁడయి రాజసేవయందుఁ బ్రమత్తుఁడై తుదకాత్మహత్య చేసి కొనెనఁట !

వనిపురములో శంకరయ్య యను పూజ లందు గొని ప్రయాణము కానుండఁగా అంతకు ముందెనిమిది దినముల క్రిందటనే బసవేశ్వరుడు లింగైక్యము చెందెనని మిగుల దుఃఖించి పండితుడు శ్రీశైలమునకు ప్రయాణమయ్యె. తాను వెల్లటూరిలో నిలిచి తన శిష్యుడైన దోనయ్యను గిరిప్రయాణముచేసి, శివరాత్రికి శ్రీశైలమునకేఁగి,తన పరిసమాప్తి నొందించవలెనని కోరెను ఆతఁడు తిరిగి వచ్చిన తర్వాత పండితారాధ్యుడు భార్యాపుత్రుదులతో లింగైక్యముఁ చెందెను.

ఈతని "శివతత్త్వసారము" నకు విపులముగ నుపోద్ఘాతమును వ్రాసిన కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారేయీ కాలమును నిర్ణయించిరి. క్రీ. శ. 1163-1180 నడుమనున్న వెలనాఁటి చోడుఁడు, 1162 ప్రాంతమున నున్న ఉదయావనీశుడు, 1171 ప్రాంతమున నుండిన బుద్దరాజు నితని సమకాలికులు. కావున నితఁడు 1120-1190 ల మధ్యకాలమున నుండవలెను.

మల్లికార్జున పండితుఁడు శివతత్త్వసారము, మహిమ్నస్తవము, మలహణము, పంచగద్యలు, రుద్రమహిమ, శంకరగీతి, రక్షాధ్వరము, దాసాష్టకము, తుమ్మెదపదములు, ఆనందపదములు, శంకరపదములు మున్నగు పెక్కుగ్రంధములను రచించినట్లు సోమనాధుని 'పండిరాధ్యచరిత్రము" వలననే తెలియుచున్నది ఇతఁడు కన్నడమున 'గణసహస్రనామ' మను కావ్యమును రచించెనని కన్నడకవిచరిత్రమునం దున్నది. కాని యిప్పటికి లభించిన దొక్క "శివత త్త్వసారము" మాత్రమే.

ముద్రితమైన "శివతత్త్వసారము"న 489 కందపద్యము లున్నవి. ఇందు వేయి పద్యము లుండియుండవలెనని కొందఱి యభిప్రాయము 'శివతత్త్వ సారము" కన్నడమునను గలదు. ఆందలి కొన్ని పద్యములు మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారము వారు ప్రచురించుచున్న పత్రికలో (Vol 1L No. 1, 2. 1949) ప్రకటింపఁబడినవి [184 నుండి 4911 వఱకు, 715 నుండి 740 వఱుకును ] కన్నడగ్రంథమునకు మూలము తెనుఁగు గ్రంధమని స్పష్టముగాఁ దెలియుచున్నది. ఈ గ్రంధమును బట్టియు తెలుఁగు గ్రంధములోని పద్యసంఖ్య సహసమై యుండవచ్చునని తోఁచుచున్నది.

పాల్కురికి సోమనాధుఁడు తన యనుభవసారములో నీతనింగూర్చి

               ".............. శివత త్త్వ
                  సార గద్య పద్య సమితి శివువి
                  మహిమఁ దెలిపినట్టి మల్లి కార్డున పండి
                  తయ్యగారిఁ దలంతు ననుదినంబు"

అని చెప్పియున్నాఁడు, "ఆంధ్రకవితరంగిణి" కారులు పైయంశము నుటంకించుచు "పండితయ్య రచించిన శివత_త్త్వసారము గద్య పద్యాత్మకమని యీ పద్యమునఁ జెప్పఁబడినది. కాని యాగ్రంధమున పద్యమలేగాని గద్యలు లేవు' (రెండవసంపుటమ-పుట 84] అని వ్రాసిరి. కాని పయి పద్యభాగము 'మల్లిఖార్జునపండితయ్య శివత త్త్వసారమును, గద్యలను, పద్యములను రచించె' ననియే చెప్పచున్నది; కాని శివతత్త్వసారము గద్య పద్యాత్మకమని తెల్పుటలేదు.

"శివత త్త్వసారము" శతకమని కవి స్వయముగాఁ జెప్పకున్నను -దీని లక్షణము లన్నియును శతకలక్షణములే యగుటవలన నిది శతకమే యన దగు నని శ్రీ వేదము వేంకటకృష్ణశర్మగారు తమ 'శతకవాజ్మయ సర్వస్వము" లోఁ జెప్పియున్నారు. 'శతకంబు శివతత్త్వ సారమాదిగను. గద్య పద్యంబు లాకాంక్షఁ జదువుచును"-(దీక్షాప్రకరణము) శతకము శివతత్త్వసారము దీపకళిక, మహా నాటకము నుదాహరణ' (పర్వతప్రకరణము)" అను సోమనాధుని గ్రంధభాగములను దానికిఁ బ్రమాణముగా విచ్చియున్నారు, [పుటలు 11, 12] శ్రీ శర్మగారు "శతక" మనుదానిని 'శివతత్త్వసార' మనుదానికి విశేషణముగా గ్రహించినందున, ఆరీతిఁ దలఁపవలసివచ్చినది. కాని 'శతక' మను నది విశేషణమే యనుటకుఁ బ్రమాణములేదు. నూఱు పద్యములు కలదే శతకము. వేయి పద్యములు గలది శతకమనుట సంప్రదాయసిద్ధముకాదు.సోమనాధుఁడు పేర్కొనిన 'శతకము' శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు (తారణ-ఫాల్గణమాస భారతి ) భావించినట్లు పండితారాధ్యుని ' శ్రీగిరిమల్లి కార్డునశతక' మై యుండవలెను. అందలి పద్యమొకటి "తెనుఁగు కవుల చరిత్ర" ఆనుబంధమునందు (పుట 388) -ఈయcబడినది. మఱియు, తెలుఁగు శతకములకుఁగల మకుటనియమము శివతత్త్వసారమునఁ గాన రాదు.

మల్లి కార్జునపండితుఁడు పెక్కు-గ్రంధములను రచించినను, అవి లభింపకపోవుటయు, లభించిన 'శివతత్త్వసార' మసమగ్రముగా నుండుటయు నాంధ్రుల దురదృష్టము.