ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/పిడుపర్తి నిమ్మనాథుడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పిడుపర్తి నిమ్మనాథుడు


ఇతనికి నిమ్మయార్యుఁడనునది నామాంతరము ఇతని తండ్రి పినసోమయ్య. పద్యబసవపురాణకర్త పిడుపర్తి సోమనాథున కీతఁడు పెదతాత మనుమఁడు. ఇతనిని సోమనాథుఁడు తన పద్యబసవపురాణమునఁ బ్రశంసించి యున్నాఁడు. ఇతని రచనలేమో తెలియలేదు. ఇతఁడు 1390-1440 మధ్య నున్నవాఁడు. 'నిజలింగ చిక్కయ్యకథ' యీతని రచన యని ప్రాచ్యలిఖితపుస్తక భాండాగార పుస్తకపట్టికలోఁ గలదు. కాని యా నిమ్మనాథుఁడు పర్వత లింగయ్య పుత్రుఁడు; కావున నతఁడు వేఱు


ప్రోలుగంటి చెన్నశౌరి


ఇతఁడు ప్రౌఢరాయల వద్ద దండాధికారిగా నుండి తిప్పనకుఁ బ్రపౌత్రుఁడు; నాగశౌరి దేవమాంబలకు బుత్రుఁడు; ఇతని గ్రంథము లేవియు లభింప లేదు. హరిభట్టు రచించిన నృసింహపురాణములో నీతని ప్రశంస కలదు. దానిని బట్టి యీతఁడు నరసింహపురాణమును ద్విపదకావ్యముగను, బాలభారతమును వచనకావ్యముగను, సౌభరిచరిత్రమును యక్షగానముగను రచించినట్లు తెలియుచున్నది. ఈ కవి పదునైదవశతాబ్దియం దుత్తరార్ధమున నుండెనని చెప్పవచ్చును.

[పయి కవులం గూర్చిన చరిత్రములకు ‘ఆంధ్ర కవితరంగిణి' ఆధారము.]