ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/నంది మల్లయ్య, ఘంట సింగయ్య

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నంది మల్లయ్య, ఘంట సింగయ్య


ఈ యిరువురు కవులును కలిసియే గ్రంథములను జేయుచు వచ్చిరి. వీరు చేసిన గ్రంథములలో ప్రధానములైనవి ప్రబోధచంద్రోదయమును, వరాహ పురాణమును. వీనిలో ప్రబోధచంద్రోదయము ననంతామాత్యుని పుత్రుఁడైన గంగయ్యమంత్రికిని, వరాహాపురాణమును కృష్ణదేవరాయల తండ్రి యైన నృసింహరాజునకును, వీ రంకితము చేసిరి. ఈ యిరువురు కవులలో మొదటివాడయిన నంది మల్లయ్యకు రెండవ కవియైన ఘంట సింగయ్య మేనల్లుడు. ఘంటసింగయ్యకు మలయమారుతకవి యని బిరుదాంకము గలదు. వీరిరువురకును గల బంధుత్వాదులు ప్రబోధచంద్రోదయములోని యీ క్రింది పద్యమువలనఁ దెలియ వచ్చుచున్నవి.

        సీ. కలరు కౌశికగోత్రకలశౌంబురాశిమం
                         దారంబు సంగీతనంది నంది
            సింగమంత్రికిఁ పుణ్యశీల పోతమ్మకు
                         నాత్మసంభవుఁడు మల్లయమనీషి
            యతని మేనల్లుఁ డంచితభరద్వాజగో
                         త్రారామచైత్రోదయంబు ఘంట
            నాగధీమణికిఁ బుణ్యచరిత్ర యమ్మలాం
                         బకుఁ గూర్మితనయుండు మలయమారు

            తాహ్వయుఁడు సింగనార్యుడు నమృతవాక్కు
            లీశ్వరారాధకులు శాంతు లిలఁ బ్రసిద్దు
            లుభయభాషల నేర్పరు లుపమరులు స
            మర్ధు లీ కృతిరాజనిర్మాణమునకు.

వీరు తమ యాశ్వాసాంతగద్యములలోఁ గూడ నుభయనామములను జేర్చుకొని

“ఇది శ్రీమదుమామహేశ్వర వరప్రసాదలబ్దసారస్వతాభినంది నంది సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్ల జ మలయమారుతాభిధాన ఘంట నాగయప్రధానతనూభవ సింగయకవిపుంగవ ప్రణీతంబయిన" అని వ్రాసికొని యున్నారు. వీరిరువురును షట్సహస్రనియోగి బ్రాహ్మణులు. వీరిలో
మొదటివాఁడయిన నందిమల్ల య్య కౌశికగోత్రుఁడు; అపస్తంభసూత్రుఁడు; దక్షిణామూర్తి గురుశిష్యుఁడు. రెండవవాడయిన ఘంట సింగయ్య భరద్వాజగోత్రుఁడు; ఆపస్తంభసూత్రుఁడు; ఆఘోర శివశిష్యుఁడు. ఈ యంశములనే కవులు తమ వరాహపురాణమునం దిట్లు చెప్పుకొనిరి.

       సీ. అపుడు సభా వేదికాగ్రస్థితులమైన
                         మమ్ము వాగీశ్వరీమంత్ర రాజ
           సిద్దిపారగులఁ గౌశి భరద్వాజగో
                         త్రుల మహాదేవాంఘ్రిజలజభక్తి
           పరతంత్రమతుల నాపస్తంభసూత్రుల
                          గురుదక్షిణామూర్త్య ఘోరశివుల
           శిష్యుల నతిశాంతచిత్తులఁ దనకు నా
                         శ్రితుల భాషాద్వయకృతినిరూఢ

           శేముషీభూషణుల నందిసింగనార్య
           తనయుమల్లయకవికులోత్తముని ఘంట
           నాగధీమణికూర్మినందనుని మలయ
           మారుతాంకితు సింగయమంత్రిఁ జూచి.

ప్రబోధచంద్రోదయకృతిపతి యైన యనంతామాత్యగంగయ్య తమ్మరాజ పుత్త్రుడయిన వీరబసవనృపాలునకు మంత్రియయి మన్ననలఁ బొందినట్లీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.

      సీ. మాధవవర్మభూమండలేశ్వరవంశ
                       జలధికి నే రాజు చందమామ
          యే రాజుదయశైల మెలమి విభేదించె

              గపటాహితమదాంధకార మదఁగ
      గజపతిసురధాణిగడిదుర్గముల కెల్ల
              నే రాజు వజ్రంపుబోరుతలుపు
      మహిమచే నే రాజు మఱపించె నలభగీ
              రధపృధుమాంధాతృరఘురమణుల

      నట్టి గుణశాలి తమ్మరాయనికుమార
      వీరబసవపక్షమాచక్రవిభునిచేత
      మన్ననలఁ గాంచి మించిన మహితుఁ డితఁడు
      మనుజమాత్రుండె గంగయామాత్యవరుఁడు.

గంగయామాత్యుని ప్రభువయిన బసవనృపాలుఁడు కొండవీటిరాజ్యమును గజపతు లాక్రమించుకొన్న తరువాత వారిగడిదుర్గముల కధ్యక్షుఁడయి పదునైదవ శతాబ్దోత్తరభాగమున నుండిన సామంతరాజు, బసవమహీశుని సచివుఁడై న గంగయామాత్యుఁడు ప్రటోధచంద్రోదయము కృతినందకముందే దగ్గుపల్లి దుగ్గయ్యచేత రచియిఁపఁబడిన నాచికేతూపాఖ్యానమును గృతి నందెను. ప్రబోధచంద్రోదయముయొక్క చతుర్ధాశ్వాసాంతము నందలి కృతిపతిసంబోధనమయిన యీ క్రింది పద్యము వలన నీయంశము తేటపడు చున్నది.


    క. ప్రఖ్యాతనాచికేతూ
       పాఖ్యానమహా ప్రబంధపరిమళితసుధీ
       వ్యాఖ్యానశ్రవణోదిత
       సౌఖ్యా ! సంఘటితచిత్తశంకరసఖ్యా !

1465వ సంవత్సర ప్రాంతమునందు శ్రీనాథుని ముద్దుమఱఁది మైన దుగ్గకవిచేత నాచికేతూపాఖ్యాన మీతని కంకితము చేయఁబడెను. అటు తరువాత 1470-75 సంవత్సరప్రాంతమున నీ జంటకవులు ప్రబోధచంద్రోదయము నీతని కంకిత మొనర్చిరి. [ప్రబోధచంద్రోదయరచనా కాలముం గూర్చి " ఆంధ్రకవి తరంగిణి" (సం, 6 పుట 131) లో నిట్లున్నది.]

కృతిపతియైన గంగనామాత్యుని ప్రభువగు బసవనృపాలుఁడు దూబగుంట నారాయణకవి చేతఁ బంచతంత్రమును కృతినందియుండెను. బసవనృపాలుని కాలమును శాసనసహాయమునఁ దెలిసికొని నారాయణకవి చారిత్రమున నిర్ణయించి యున్నారము. దానినిబట్టి నాచికేతూపాఖ్యాన రచనాకాలము క్రీ. శ.
1460 ప్రాంతమని దుగ్గయకవి చారిత్రమునఁ జెప్పియుంటిని. ఈ ప్రబోధచంద్రోదయముకూడ నించుమించుగ 1480 ప్రాంతమున రచింపఁబడి యుండును. పెసరువాయాన్వయవంశాబ్ది చంద్రుఁడైన మన గంగయా మాత్యుఁడు ముందు జైమినిభారతకృతిపతియైన సాళువ నృసింహనృపాలుని సచివుఁడై యుండినట్టు ప్రబోధచంద్రోదయద్వితీయాశ్వాసాదిపద్యమువలన నెఱుఁగవచ్చును.

         క. శ్రీకరవీక్షణ ! దాన
            శ్రీకర ! నరసింహనృపవశీకర నయవి
            ద్యాకరణ ! చతుర్దశవి
            ద్యాకర ధీరంగమతి ! యనంతయగంగా !

[పయి పద్యమునుబట్టి గంగయామాత్యుఁడు కొంతకాలము సాళువ నృసింహ నృపాలుని సచివుఁడైనట్లు చెప్పుటకు వలనుపడదనియు, 'నరసింహనృపవశీకర నయవిద్యాకరణ' ఆను విశేషణముచే నృసింహరాయలను జీవగ్రాహముగాఁ బట్టించు గంగనామాత్యుని నయవిద్యాకరణ మహత్త్వమే వ్యక్త మగుచున్నదనియు, గంగనామాత్యుఁడుదయగిరి దుర్గాధిపతి యగు పురుషోత్తమ గజపతికి సామంతుఁడగు బసవనృపాలుని మంత్రియై యుండి తన ప్రభువుతోఁబాటు పురుషోత్తమ గజపతికి సాళువ నృసింహనృపాలునిఁ బట్టుకొనుటలో మిక్కిలి సాయపడి యుండుననియును శ్రీచాగంటి శేషయ్య గారి యభిప్రాయము. శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావు గారును, శ్రీ వీరేశలింగము పంతులుగారీ యభిప్రాయముతో నేకీభవించలేదు]

బ్రబోధచంద్రోదయ కర్తలు కొంతకాలము పిల్లలమఱ్ఱి పినవీరభద్ర కవిశిఖామణితో సమకాలీనులు. వీరు తమ ద్వితీయ గ్రంథమైన వరాహ పురాణమును కృష్ణదేవరాయలతండ్రియైన తుళువ నరసింహరాయని కంకిత