ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/కృష్ణమాచార్యుడు

వికీసోర్స్ నుండి

కృష్ణమాచార్యుఁడు


వైష్ణవ భక్తాగ్రణ్యుఁడగు నీకవి సింహాచల క్షేత్ర నివాసి; సింహగిరి వరాహ నరసింహస్వామి పేర పెక్కు సంకీర్తములను, వచనముల నీతఁడు రచించెను. ఇతఁడు ప్రథమాంధ్ర వచనకవి. ఇతఁడు రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి కాలమున నుండెనఁట. పదునైదవ శతాబ్దిలో నుండిన శ్రీ తాళ్లపాక అన్నమయ్యగా రీతనిని పేర్కొనియుండుటచే నితఁడు 14వ శతాబ్దిలో నుండెననుట సత్యము. కృష్ణమాచార్యుని సింహగిరి నరహరి వచనములు ప్రసిద్ధములు. ఈ కవిని గూర్చి శ్రీ నిడదవోలు వేంకటరావుగారు పార్థివ భాద్రపద భారతిలో వివరముగాఁ దెల్పియున్నారు. ఈతఁడు రచించిన ప్రసిద్ధమైన 'జో అచ్యుతానంద ! జోజో ! ముకుందా !' అను లాలిపాటను శ్రీ తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారు 1948 సెప్టెబరు 8వ తేదీ ఆంధ్ర వారపత్రికలోఁ బ్రకటించి యున్నారు.

అయ్యలరాజు తిప్పయ్య


ఈ కవి అయ్యలరాజు రామభద్ర కవికిఁ బ్రపితామహుడని యనుచున్నారు. ఇతఁడు (ఒంటిమెట్ట) రఘువీర శతకమును రచించెను. ఈ కవి గృహనామము రాయకవివారై నట్లు తెలియుచున్నది. ఈతఁడు కర్ణాటక మండలాధిపతి యొద్ద ఆస్థానకవిగా నుండినట్లు శతకమునందలి యొక పద్యము వలన దేలుచున్నది. ఆ ప్రభువు సంగమవంశములోనివాఁడైన రెండవ దేవరాయలై యుండునని 'ఆంధ్ర కవితరంగిణి' (సం. 6 పుట. 13) లో గలదు.