Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/కవిరాక్షసుడు

వికీసోర్స్ నుండి

కవిరాక్షసుడు


ఇతఁడును దాక్షారామ నివాసుఁడే. ఇతఁడు కవిభల్లటునివలెనే నన్నయభట్టునకును తిక్కన సోమయాజి
కిని నడిమికాలమునం దుండినవాఁడు. ఇతఁడే వేములవాడ భీమకవి యని కొందఱనిరి గాని యిత డాతఁడు గాక కవిరాక్షసీయమును రచించిన వేఱొకకవియయి యున్నాఁడు. ఈతని గూర్చి యప్పకవి యీ క్రిందికధను వ్రాసెను.

       ఉ. ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పినభారతంబులో
           నేది వచింపఁగాఁబడియె నెందును దానినె కాని సూత్రసం
           పాదనలేమిచేఁ దెలుఁగుఁబల్కు మఱొక్కటి కూర్చి చెప్పఁగా
           రా దని దాక్షవాటికవిరాక్షసుఁడే నియమంబు చేసినన్
       
        క. ఆ మూడు పర్వములలో
           సామాన్యుఁడు నుడువుతెనుఁగు లరసికొని కృతుల్
           తాము రచించిరీ తిక్కసు
           ధీమణి మొదలైనతొంటి తెలుఁగు కవీంద్రుల్.

కవి రాక్షసుని యాదినారాయణచరిత్రములోని దని యొకానొక లక్షణ గ్రంథములో నీ క్రింది పద్య ముదాహరింపఁబడినది.

       ఉ. శ్రీయుతలోచనోజ్జ్వలమరీచులు భానుమరీచివిస్పుర
           త్తోయజకాంతితోడ దులఁ దూఁగెడుపచ్చనిపట్టు గట్టియ
           త్యాయతశంఖచక్రరుచిరాసిగదాధరుఁ డేఁగుఁదెంచె నా
           రాయణుఁ డార్తరక్షణపరాయణుఁ డాకరిరాజుపాలికిన్.

[కవిరాక్షసుఁడనునది బిరుదమువలెఁ గానవచ్చుచున్నది. ఆంధ్రమునందే కాక సంస్కృతమున నొక కవిరాక్షసుఁడున్నాడు. అతఁడు 'షదర్ధ నిర్ణయ'

మను సంస్కృత నిఘంటువు నొకదానిని వ్రాసి యున్నాఁడు, ఆంధ్రకవి కంటె నిఁతడు భిన్నుఁడు.

రంగరాట్ఛందములో 'కవిరాక్షసీయము' లోనిదిగాఁ జెప్పఁబడిన పద్యము అనంతుని ఛందము (ఛందోదర్పణము) లో ననంతునిదిగాఁ గాన వచ్చుచున్నది. ఇతని గ్రంథములు లభ్యములు కానందున నెట్లు నిశ్చయించుటకు వలనుకాకున్నది.

వెన్నెలకంటి జన్నయ్య రచనగాఁ బ్రసిద్ధమై 'దేవకీ నందన శతకము' లోని యొక పద్యమునుబట్టి యది 'కవిరక్షః శ్రేష్ఠ ప్రణీత' మనియు పదివేల పద్యములలో నేర్చి నూటపది పద్యములీశతకముగా నర్పించెననియుఁ దెలియు చున్నది. కానీ పద్యము ప్రక్షిప్తమని తలఁపఁబడుచున్నది.]