ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదవప్రకరణము

పునర్విమర్శనము

- - -:o:- - -

ఆంధ్రసామ్రాజ్య విస్తీర్ణము

ఆంధ్రరాజులు మగధసామ్రాజ్యమును గైకొని పాలించిరని పురాణములు బలిద్వీపవాసులును, యవద్వీపవాసులును, వీరిని ఇండియా చక్రవర్తులని పేర్కొని యుండుటయును, పాండ్యచోళ కేరళములను బాలించిరన రాజులు వీరిని మగధ రాజులని పేర్కొనియుండుటయు ఆంధ్రసామ్రాజ్యమున మగధ రాజ్యము చేరియున్నదని చెప్పుటకు ప్రబలసాక్ష్యములుగానున్నవి. మధ్యదేశము, కళింగదేశము, దక్షిణకోసలము, విదర్భదేశము, కొంకణదేశము, మహారాష్ట్రదేశము, దక్షిణకుంతలదేశము, ఇంతయేల, పాండ్య చోళ కేరళ దేశములు దక్క తక్కిన దక్షిణాపథ దేశములన్నియు నాంధ్రసామ్రాజ్యమున జేరియున్నవని చెప్పవచ్చును. వనవాసి రాజధానిగ జేసికొని యాంధ్రరాజులు రాజప్రతినిధిగ నుండి దక్షిణకుంతల దేశమును బాలించిన హరితపుత్ర శాతకర్ణ పేరుగల దానశాసనములు మైసూరునందు రైసుదొరగారి వలన నూతనముగా గనిపెట్టబడినవి. కనుక నాంధ్రరాజులగు శాతకర్ణులు మైసూరును కూడా పాలించినట్లు స్పష్టపడున్నది. అసిక, అస్మక, మూలక, మహారాష్ట్ర, కుకుర, అచిరాంత, అనూప, విదర్భ, అకరావంతి దేశములను గోతమిపుత్ర శాతకర్ణి జయించెనని నాసికశాసనములో నొకదానిలో నుదహరింపబడి యుండెను. అస్మక మౌలికదేశములు దక్షిణాపథ దేశములోనివివని పురాణములు చెప్పుచున్నవి. [1] దక్షిణకత్తివాడి దేశమునకు సురాష్ట్రమను పేరుగలదు. కుకురదేశము రాజపుత్రస్థానములో నొకభాగమై ఉన్నది. ఉత్తరకొంకణదేశమే అపరాంతమనబడుచున్నది. అనూపదేశము వింధ్యకు సమీపమున నున్నదని పురాణములు చాటుచున్నవి. అయ్యది నర్మదకు నెగువుననున్నదనియు రఘువంశమునందు చెప్పబడినది. అకరావంతియనునది మాళవదేశముయొక్క తూర్పుభాగముననున్నది. కాబట్టి యాంధ్రసామ్రాజ్యము దక్షిణమున మైసూరు మొదలుకొని యుత్తరమున గంగానది వరకును విస్తరించి ఉండవచ్చని చెప్పవచ్చును. మాళవము, కన్యాకుబ్జదేశము, సింధుసౌవీరదేశములు, పాంచాలకాశ్మీరదేశములు, ఉత్తరకోసల కాశీదేశములును, నేపాలభూపాలదేశములును, కామరూపబ్రహ్మదేశములును, పాండ్యచోళకేరళదేశములును మాత్ర మీయాంధ్ర సామ్రాజ్యమున జేరియుండలేదు. పైజెప్పినదేశములలో బశ్చిమోత్తరదేశములు విజాతీయుయిన శకరాజుల పాలనమునం దుండినవి.

బౌద్ధమతము

అకాలమునందలి మతములలో బుద్ధుని మతమే బహుజనానురాగమును బడసి దేశమంతటను వ్యాపించి సర్వోత్కృష్టమైనదిగా నెంచబడుచు నగ్రస్థానమును వహించియుండెను. శాలివాహనరాజులమని చెప్పుకొనియెడి యాంధ్రరాజులును, మహాభోజులమని,మహారాఠులమని చెప్పుకొనియెడి మండలాధిపతులును, బౌద్ధమతము నవలంబించి యాంధ్ర చక్రవర్తులకు నూడిగము సేయుచుండిన యవనశకపహ్లవాది నాయకులును, నైగములును(వర్తకులు), స్వర్ణకారులును, వర్ధకులు(వడ్రంగులు), ధాన్యకశ్రేణులును (ధాన్యపు వ్యాపారము చేయువారు), గాంధీకులు (ఓషధులు మొదలుగువానిని విక్రయించువారు), సామాన్య గృహస్థులును బౌద్ధమతావలంబీకుల యుపయోగార్ధ మేకశిలామయమైన కొండలను దొలిపించి గుహలను మఠములను, చైత్యములను నిర్మించుచు వచ్చిరి. ఈ యాంధ్రరాజుల పరిపాలనా కాలమున మొదట విజాతీయులును విదేశస్థులునగు యువనుల (Bactrian Greeks) శకనులు (indo Scythians) పహ్లవులు (Persians) గుంపులు గుంపులుగా వచ్చి దేశమునజొరబడి కల్లోలము గావించిరి. తుదకు నాంధ్రుల పరిపాలనమునకు లోబడి దేశమున స్థిరనివాసములేర్పరచుకొని దేశమతమును దేశాచారములను బూని దేశీయులలో గలిసిపోయిరని యిదివరకే పూర్వప్రకరణముల దెలుపబడియెను. పైజెప్పినగుహలలోని శాసనములలో బుద్ధధర్మప్రచారమునకై దానముచేసిన వారిలో యువకులయొక్కయు శకనుల యొక్కయు నామములు కూడా లిఖింపబడి యుండుటయే యిందుకు ప్రబలసాక్ష్యముగానుండెను. బౌద్ధభిక్షువులు నిచసించుటకొరకు శిలామఠములలో గదులేర్పరుపబడినవి. ఈ బౌద్ధసన్యాసులు సాధారణముగా దేశాటనము చేయుచు వర్ష కాలముల యందు నీకొండగుహలలో నివసించుచుండిరి. శ్రావణమాసములో బౌద్ధసన్యాసులు ప్రాతదుస్తులను విడిచి క్రొత్త దుస్తులను ధరించుచుండిరి. పరోపకార బుద్ధి కలవారు వీరికి దుస్తులను బహుమానముగా చేయుటకు గొంతధనమును గ్రామసంఘముల కడ నిలువజేయుచుండిరి. ఆసంఘములవారు మూలధనమును వెచ్చింపక వాని వడ్డి మాత్రమీ ధర్మకార్యముల కొరకు వినియోగించుచుండిరి. ఇటువంటి మతకార్యముల నిర్వాహముకొరకు రాజులును రాజకీయోద్యోగస్థులును గ్రామముల నిచ్చి వేయుచుండిరి. మతబోధకులయిన సన్యాసులు తరచుగా సముద్రయానము సలుపుచుండిరి. కాబట్టి డాబోల్, బాంకోట్, రాజపురి కయ్యలకడ వరుసగా చిప్లన్, మహాడ్, కూడం అనుప్రదేశముల కడ నట్టి గుహలు కలవు. ఘోడ్బందరు కడ దిగువారికి కంహేరిగుహలు కలవు. ఇంతియగాక యాంధ్రదేశమునందును బెజవాడ, అరుగొలను, గుంటుపల్లి, శ్రీశైలము, మొగలరాజపురము, మొదలగు తావులను కొండగుహలు తొలువబడియుండినవి. ఆంధ్రరాజుల పరిపాలనమున సమస్త విధముల చేత బౌద్ధమతమౌన్నత్యదశ ననుభవించెననుటకు లేశమాత్రమును సందియము లేదు.

బౌద్ధమత భేదములు.

బౌద్ధమతాచార్యులు స్వల్పవిషయములలో భేదాభి ప్రాయముగలిగి యుండి మహాసాంఘికు లనియు, మహాస్థావీరులయు రెండుతెగలుగావిడిపో యిరి. మహాసాంఘికులన మహాసంఘము యొక్క విద్యాలయమునకు సంబంధించిన వారని యర్ధము. మహాస్థానీరులన మహాధ్యక్షుని విద్యాలయముకు సంబంధించిన వారని యర్ధము. మరల మహాసాంఘీకులు "చైత్యులు (పూర్వశైలులు) అపరశైలులు హైమవతులు, లోకోత్తరవాడినులు, ప్రజ్ఞాప్తివాదినులు అని యైదు తరగతులుగా వేరుపడిపడిరి. చైత్యక పర్వతము మీద నుండు సన్యాసి బోధనము అవలంబించినవారు. చైత్యకులనం బడుచుండిరి. హౌనుత్సాంగు పూర్వ శైలసంహరామమని చెప్పినది. యీచైత్యకులకు సంబంధించినదిగ నేల చెప్పరాదని డాక్టరు బర్మెస్సుగారు ప్రశ్నించుచున్నారు. [2] పూర్వశైలులులో భేధించినవారపర శైలు లనంబడుచున్నారు.

బ్రాహ్మణమతము.

ఆంధ్రులు ఆంద్ర్హరాజులును, బౌద్ధమతాభిమానులును. బౌద్ధమతావలంబకులు నైనను ఆంధ్రరాజుల పాలనమున బౌద్ధమతముతో బాటు బ్రాహ్మణ మతమును వర్ధిల్లుచుండెను. బౌద్ధులయిన యాంధ్రరాజు లెప్పుడును బ్రాహ్మణమతము పట్ల ద్వేషమును జూపినట్లెక్కడను గానరాదు. మరియు గోతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణజాతిని సాంకర్యము నుండి సంరక్షించెనని నాశికశాసనము నందు జెప్పబడియుండుట చేత గోతమీ పుత్రుడు బ్రాహ్మణమతాభిమానియని కొందరు తలంపవచ్చును గాని నిజముగా నాతడు మతసహన బుద్ధికలవాడె గాని బ్రాహ్మణమతాభిమాని గాడు. యవనశక పహ్లవాదులు మొదలగు విజాతీయులు పెక్కండ్రు బ్రాహ్మణమతావలంబీకులై కొందరు బ్రాహ్మణులమనియు కొందరు క్షత్రియులమనియు జెప్పుకొనుచు బ్రాహ్మణ సంఘమును సాంకర్యమునొందించు నప్పుడట్టి సందర్భముల గోతమీ పుత్రుడు కలుగజేసుకొని బ్రాహ్మణజాతికి భంగము కలుగకుండ వచ్చెననుటకును సందియముండదు. కాబట్టి యాకాలమందు బ్రాహ్మణ బౌద్ధమతముల రెంటికిని శత్రుత్వం లేక పోవుటయే గాక యన్యోన్యమైత్రి కూడా కలదని చెప్పుటకు సంశయించవలసిన పని లేదు. ఈ విషయమును బ్రాహ్మణమతాభిమాని ఋషభదత్తుని యొక్కయు, బౌద్ధమతాభిమానియగు గోతమీ పుత్రుని యొక్కయు దానశాసనములే వేనోళ్ళ జాటుచున్నవి.

వర్ణాశ్రమ ధర్మములు.

ఒక్క యార్యజాతి వారిచే మాత్రమే యీవర్ణాశ్రమ భేదములు గల్పించబడినవి గాని యనార్యులైన నాగులలోనూ మిశ్రమ జాతుల వారయిన బౌద్ధులలోనూ గల్పింపబడి యుండలేదు. ఆర్యులలో నైన ఇప్పటి రీతి వర్ణభేదములు గానరావు. ఆకాలమునందు వృత్తులను బట్టి కులభేదము లేర్పడినవిగాని కులభేదము బట్టి వృత్తులేర్పడి యుండలేదు. ఆకాలమునందు భోజన ప్రతిభోజనములకు ప్రతిబంధకము లేవియు నేర్పడి యుండలేదు. బ్రాహ్మణుడు చాతుర్వర్ణములలోని స్త్రీలను వివాహమాడడానికి నధికారము కలిగియుండెను. ఇట్టి అధికారము బ్రాహ్మణులు కలిగియుండుటకు గారణము లేక పోలేదు. ఆకాలమునందు బ్రాహ్మణులు దక్షిణాపథమున మిక్కిలి తక్కువ సంఖ్య కలవారుగా నుండిరి. ఇతర జాతులలోని స్త్రీలను వివాహమాడకుండినచో వారి సంఘము మభివృద్ధి గాంచనేరదు. శీఘ్రకాలములోనే యంతరించి పోవచ్చును గనుక స్వరక్షణార్ధమై వారు బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులగుటకు మార్గములేర్పరచి బ్రాహ్మణేతరజాతి కన్యలను వివాహముజేసి కొనుచుండిరి. అప్పటికింకా బ్రాహ్మణులు మాంసభక్షకులుగా యున్నందున శూద్రాదులు చేసిన వంటకమును భుజించుటకు సంకోచింపకుండిరి. కాని బౌద్ధమతాచార్యుల యొక్కయు, జైనమతాచార్యుల యొక్కయు బోధనల చేత ఆచరణ విధానముల చేతను, సంపర్కము చేతను ఆచరణ విధానముల చేతను బౌద్ధులును జైనులును పెక్కండ్రు మాంసభోజనమును విసర్జించిరి. వీరితోడి మతచర్చల చేతను, సంపర్కము చేతను తరువాత పితృకార్యములలో సహితము మాంసభోజనమును వర్జింపవలసిన వారయిరి. ఈ గౌరవము విశేషముగా జైనమతమునకు జెందవలసి యున్నది. అహింసయే పరమధర్మమని బుద్ధుడు బోధించినదానిని అశోకవర్ధనుడు ప్రకాశింపజేసెను. అశోకుని సందేశమును ఆంధ్రులు శిరసావహించిరి. వీరి ప్రేరణముల చేతను జైనబౌద్ధమతాచార్యుల బోధనలచేతను బ్రాహ్మణు లెల్ల రును క్రమక్రమముగా మాంసభోజనము వర్జించిరి. నేడు పంచద్రావిడ బ్రాహ్మణుడు మాంసమును ముట్టరు. వీరు దాక్షిణాత్యులు. పంచగౌడబ్రాహ్మణులు మాత్రము వర్జింపలేదు. వీరౌత్తరాహులు. ఇప్పటి బ్రాహ్మ్ణోత్తములగు దమపూర్వు లొక కాలమున మాంసభోజనము చేయుచుండిరను మాటయే తెలియదు. అట్టిమాటయే వారికి గర్ణకఠోరముగా నుండకమానదు. బహుశతాబ్ధముల క్రిందటనే యాదురభ్యాసమును విడిచి పెట్టిన వారు కనుక వారికట్లుండుట సహజగుణమె గాని యందు విరుద్ధగుణమేమి లేదు. ఆర్యులాకాలమున బరిపాలనము చేయు నాంధ్రులను కేవలమును శూద్రులుగా జూచి యుండ లేదు. వారిని క్షత్రియులని పైకి చెప్పుచూ వచ్చిరిగాని కర్మాధికారమును గలిగింపక లోపల ద్వేషభావమును గలిగియుండిరి. మొదట నామమాత్రముగా నేర్పడిన వర్ణాశ్రమ బంధనములు సడలియున్నవి గాని కాలముగడచిన కొలదిగట్టిగా బిగింపబడుచు వచ్చినవి. మనుస్మృతి యందు జెప్పబడిన భేదకారణములు కేవలము కల్పితములు కాని స్వాభావికములు గావుగనుకనవి యెంతమాత్రము విశ్వసింప దగినవి కావు.

ఇతర మతములు.

ఆకాలమునందు శైవమతమును జైనమతమునుగూడ వర్ధిల్లు చుండెను. రాజప్రతినిధిగ నుండి నవకాశి రాజధానిగా జేసికొని దక్షిణ కొంకణమును, కర్ణాటమును బాలించిన హరితపుత్ర శాతకర్ణి కర్ణాటకము (మైసూరు) లోని స్థావకందూరువద్దనున్న శివాలయమునకేదో దానధర్మము చేసెనని కుజ్జుడను కర్ణాట కవిప్రాశస్తియను కావ్యమందు వ్రాసి యుండునట్టి యాంధ్రరాజుల పోషకత్వమున శైవమతము కూడ వర్ధిల్లు చుండెనని చెప్పవచ్చును. ఆర్యులలోను బౌద్ధులలోను మొదట విగ్రహారాధనములేదు. విగ్రహారాధనము మొదట ననార్యులలో నాగులలోను విశేషముగా వ్యాపించి యుండెను. తరువాత బౌద్ధులచేతను, అటుపిమ్మట ఆర్యుల చేతను అవలంబింపబడినది.

దేశభాషాభివృద్ధి.

ఆకాలమున నార్యబ్రాహ్మణులు సంస్కృతప్రాకృత ములను వాడుకొను చుండిరి. రాజకీయ భాష ప్రాకృతము. వ్యవహారిక భాష మగధము. ప్రాచీన మహారాష్ట్రము, పైశాచి, అపభ్రంశము, మొదలగు ప్రాకృత భేదములు దేశభాషలుగా నుండినవి. ఆకాలమున వాడబడుచుండిన లిపి మౌర్యలిపిగా నుండెను. శాసనములన్నియు పాలి భాషలో నున్నవి. ప్రాచీన ద్రావిడభాషయె పైశాచి యనంబడుచుండెను. ఆర్యులు దీనిని పైశాచియని యపహాస్యము చేయుచుండిరి. అయినను ఆంధ్రరాజులీ భాషలో గ్రంథములను వ్రాసియు, వ్రాయించియు దేశభాషను ప్రోత్సాహపరచిరి. శాలివాహనుని మంత్రియగు గుణాఢ్యపండితుడీ భాషలోనే బృహత్కథను రచించెనని యిదివరకె తెలిపియుంటిమి. శర్వవర్మయను మరియొక మంత్రి కాతంత్ర వ్యాకరణము నా భాషలోనే రచించి శాలివాహనునకు జెప్పెను. హాలశాతవాహనుడు ప్రాచీన మహారాష్ట్ర భాషలో సప్తశతి యనుగ్రంథమును రచించియున్నాడు. వీనిని బట్టి యాంధ్రరాజుల పరిపాలనమున దేశభాషలు పోషించబడి వర్ధిల్లెనని యూహింపవచ్చును. ఈ పైశాచభాషలో నుండియే అరవము, తెలుగు, కన్నడము, మళయాళము, తులు మొదలగు భాషలు జనించినవి. అనేక భాషల సాంకర్యమె తెలుగు బాస కబ్బుట చేత దక్కిన పైశాచీ పుత్రికలకంటె భిన్నమైనదిగ గాన్పించు చున్నది.

శిల్పశాస్త్రము-చిత్రవిద్య.

ఆంధ్రరాజుల పరిపాలన కాలమున శిపశాస్త్రము చిత్ర విద్యలు మిగుల నభివృద్ధికి దేబడినవి. ఈ యాంధ్రరాజు లనేక చైత్యములను స్తూపములను, విహారములను, రాజభవనములను, నిర్మించినందున శిల్పులకు దమతమ విద్యానైపుణ్యములను జూపుటకు మంచియవకాశము కలిగెను. మందిరము లెట్లు నిర్మింప వలయునో విగ్రహము లెట్లు చెక్కవలయునో, చిత్రపటములెట్లు వ్రాయవలయునో తెలుపునట్టి శాస్త్రములనేకము లంతకు బూర్వమె బౌద్ధులచే వ్రాయబడి యున్నవి. అట్టి శిల్పశాస్త్రజ్ఞులలో నాగ్నజిత్తుడను వాడు ముఖ్యుడు. ప్రత్యేకశిలలతో బట్టబయలున గట్టబడక పర్వతములను గుట్టలను దొలచి నిర్మింపబడిన బౌద్ధదేవాలయము లాకాలమునందలి యద్వితీయ శిల్పకలానైపుణ్యమును నేటికిని బ్రకాశింప జేయచుండుట ప్రశంసనీయముగదా. ఈ బౌద్ధదే‌వాలయములకు వెలుపల నంతయు గొండయైనందున బైకి శోభాయమానముగ గన్పట్టక పోయినను లోనికి బోయి చూచిన పక్షమున మహేంద్ర భవనములను బోలియుండును. ఇవిగాక అమరావతీస్తూపమువలె బయలున నిర్మింపబడిన స్తూపములు సహితము నిరుపమానమైన శిల్ప విద్యామహిమచే బ్రశంసనీయములుగ నున్నవి. వానిలో ముఖ్యముగా గుంటూరుమండలములోని అమరావతి స్తూపమునందు గానం బడియెడు శిల్పవిద్యానైపుణ్యమును గన్నులార గాంచి యానందింపవలసినదయె గాని యిట్టిదని నిరూపించి వర్ణించుటకు బదములు గానరావు; ఈ గ్రంథమును జాలదు. ఈ యమరావతీ స్తూపమును గూర్చి వివరముగా దెలిపెడి రెండు గొప్పగ్రంథము లాంగ్లేయభాషయందు విరచింపబడియున్నవి. అందొకటి డాక్టరు ఫర్యూసను(Dr. Fergus on) గారిచేతను మఱియొకటి డాక్టరు బర్గెస్సు(Dr. Burgess) గారిచేతను వ్రాయబడినవి. ఈ యమరావతీ స్తూపముచుట్టును శిలా స్తంభములతో వెలుపలను లోపలను గ్రాదులు (కంచెలు) కట్టబడనవి. ఆ స్తంభముల మీద శిల్పకులు చూపిన పనితన మంతింత యని వర్ణింప నలవికాదు. వానిలో బెద్దదియు వెలుపలదియునగు గ్రాదివలయముయొక్క నడిమికొలత 195 యడుగులును, లోపల గ్రాదివలయము యొక్క నడిమికొలత 125యడుగులునుగలిగి ఈ రెంటికి నడుమ యాత్రికుల ప్రదక్షిణ మార్గమును గూడగలిగియుండెను. పెద్ద గ్రాదివెలుపల14 అడుగులును, లోపల 12 అడుగులును, లోపల గ్రాది 6 అడుగులయొత్తును మాత్ర మండెను. పెద్దగ్రాదియొక్క క్రింది భాగము జంతువుల యొక్కయు బాలురయొక్కయు విగ్రహములతో నలంకరింపబడియెను. స్తంభములు యథాప్రకారముగ నష్టకోణాకృతులు గలిగి చక్రమువలె గుండ్రముగ నుండు బిళ్లలతో నలంకరింపబడియున్నవి. ఈ పెద్దగ్రాదియొక్క వెలుపలి భాగముకంటె లోపలిభాగమంతయు నెక్కువచిత్రముగానుండు చిత్తరువులతో జిత్రింపబడియున్నది. వెలుపలి గ్రాదికంటె లోపలి గ్రాది మీద బుద్ధుని చరిత్రము లోనివియు గాధలలోనివియునగు స్త్రీపురుషుల యొక్క చిత్రపటములాచరిత్రమును గాథలు బోధపడురీతిగ మిక్కిలి సొగసుగాజిత్రింపబడినవి. డాక్టరు ఫర్యూసనుగారు ప్రకటించిన గ్రంధములోని చిత్రపటములలో రెండు మిక్కిలి మనోహరములుగానున్నవి. అందొకటి వెలుపలి పెద్ద గ్రాది నుండియు, మరియొకటి లోపలిగ్రాది నుండియు దీయబడినవి. తనముంగటి సైన్యము గోడలను గాపాడు చుండగా రాజు సింహాసనమున గూరుచుండి యప్పుడే యేతెంచిన యొక దూత చెప్పెడి సమాచారమును వినుచుండినట్లును, దిగువను కాల్బలము నశ్వసైన్యము దంతాఖరములు, యుద్ధమునకు బ్రయాణోన్ముఖులై నడచుచున్నట్లును శత్రుకోటిలో నొకడొవచ్చి సంధిని కోరుచున్నట్లును మొదటిదానిలో నత్యద్భుతంగా జిత్రించబడినది. అయ్యది నిన్న మొన్నను జిత్రింపబడినట్లుగా నుండి యాకాలపు శిల్పకారుల నైపుణ్యమును బుద్ధి వైభవమును నాగరికతను వేనోళ్ళ జాటుచున్నది. డాక్టర్ ఫర్యూసనుగారును, డాక్టరు బర్గెస్సుగారును ఆపటమును నెక్కువగ మెచ్చుకొని యున్నారు.

రెండవపటము మూడు పూజార్హములయిన వస్తువులను దెలుపుచున్నది. అందొకటి గ్రాదులతోటి స్తూపము, మరియొకటి, మతచక్రము, వేరొకటి పవిత్రమైన వృక్షముగాని (బోధివృక్షం) బుద్ధుని దంతమునుగాని పూజించుచున్న సంఘము. ఈ స్తూపముపైని బుద్ధునికి సంబంధించిన విగ్రహములు మాత్రమె గాక నాగరికతయందు వెనుక బడియున్న ప్రాచీన నాగులయొక్క యు నాగరాజులయొక్కయు, నాగకన్యల యొక్కయు, విగ్రహములు కూడ పెక్కులు చిత్రించబడియున్నవి. ఇట్టి స్తూపము అమరావతివి గాక జగ్గయ్య పేట, గుడివాడ, భట్టిప్రోలు, ఘంటశాల మొదలగు స్థలములలో గూడ మరికొన్ని గలవు. గుడివాడ, భట్టిప్రోలు, ఘంటశాలలోని ఇటుకలతోను సున్నముతోడను గట్టబడినవిగా నున్నవి. మరియును బౌద్ధభిక్షువుల కొరకు బర్వతములలో దొలుపంబడిన విహారములలోను చైత్యములలోను కార్లీ పర్వతములోని చైత్యమును ఆజంటావిహారమును గొప్పవి. కార్లీ చైత్యము బొంబాయి పుమహానగరములకు నడుమనున్నది. ఈ చైత్యము వెలుపలి నుండి చూచునపుడు శోభాయమానముగ గాన్పింపక పోయిననులోపలికి బోయి చూచునపుడు దేవేంద్ర భవనమును బోలియుండును.

కార్లీ చైత్యము.

కార్లీ పర్వతములోని చైత్యము యొక్క పొడవు ముఖద్వారము మొదలుకొని వెనుక ప్రక్కనుండెడు గోడవఱకు 126 అడుగులుండును. వెడల్పు 45 అడుగుల 7 అంగుళములుండును. ఈ చావడిలోని ప్రక్కభాగములు క్రైస్తవాలయములలోని ప్రక్కభాగములంత విశాలములుగలేవు. వానిలో నడిమిభాగము మాత్రము 25 అడుగుల 7 అంగుళములు వెడల్పుకలిగి యున్నది గాని త్రక్కినవన్నియు స్తంభములసాంద్రతను గలుపుకొని పదియడుగులు మాత్రమె గలిగియున్నవి. శిల్పకారులహస్తనైపుణ్యమును బుద్ధిచాతుర్యమును దెలుపునట్టి చెక్కడపుంబనులచే శోభించుచుండిన ముప్పదితొమ్మిది స్తంభములుగలవు. ఈ విహారమున కంతకు వెలుతురు కలుగుటకై పైన ననుకూలకోణముగల తావుననొక రంధ్రముంచబడినది. అజంటాలో నాలుగు చైత్యములుగలవు. తరువాతి కాలమున నిర్మింపబడిన చైత్యములలో బుద్ధునిరూపపటములుగాను పించుచున్నవి. ఈ కడపటి చైత్యము లలో నిరూపింపబడిన బౌద్ధమతమారవ శతాబ్ధములోని హిందూమతమును సమీపించియున్నది. అజంటావిహారములలో నొకదానిపటమీ క్రింద జూపుచున్నారము. ఇది మిక్కిలి సొగసుగానుండునది. ఈ విహారము 94 అడుగుల పరిమాణము గలిగి 24 స్థంభములతో నొప్పాఱుచున్నది.

అజంటావిహారములో శిల్ప చాతుర్యము.

అజంటావిహారములో శిల్ప చాతుర్యము.
అజంటావిహారములో శిల్ప చాతుర్యము.

బౌద్ధ భిక్షువులు నివసించుటకై రెండు ప్రక్కలను 16 గదులు గలవు. నడుమ నొక్క గొప్పచావడియు ముంగటనొకవసారయు వెనుక పవిత్రమైన గర్భగృ హమును గలవు. కుడ్యములపైన బుద్ధుని జీవితములోని చర్యలును దెలుపు ప్రదర్శనములు చిత్రింపబడినవి. స్తంభములును కప్పును చిత్రవిచిత్రములయిన నగిషీ పనులచే వెలుగొందుచున్నవి. వీనినన్నిటిని గన్నులార వీక్షించునప్పుడు గలుగునట్టి యానందము వర్ణనాతీతమై యుండును. అందలి స్త్రీపురుషుల విగ్రహములుసొగసుగను స్వభావసిద్ధములుగను ముఖవికాసములు సత్వవృత్తిని సూచించునవిగను నాహ్లాదకరములుగను నున్నవి. అలంకారములు పరిశుద్ధములయినవిగను క్రమపద్ధతికలవిగను నున్నవి.

ఆకాలపు స్తూపములయొక్కయు, చైత్యములయొక్కయు, విహారములయొక్కయు, విగ్రహములయొక్కయు, రూపపటములను ముద్రింపవలయునన్న విశేషవ్యయప్రయాససాధ్యమైనది కావున శిల్పకారుల బుద్ధికుశలతను, చిత్రవిద్యలతీరును జూపుటకు నీయొకటి రెండుపటములను మాత్రము ముద్రింపగలిగితిమి.

మతసంఘములు-పౌరసభలు.

ఆ కాలమునందు మతకార్యములను ధర్మకార్యములను నిర్వహించుటకై యీకాలపు దేవస్థానసంఘములవలెనె మతసంఘములును పౌరజనోపయోగకరములయిన కార్యములను నిర్వహించుటకై యీకాలపు పౌరసభల (Corporations) వలెనె పౌరసభలు నేర్పడియుండినవి. అట్టి సభలు రెండు పేర్లతో భట్టిప్రోలు శాసనములలో గన్పట్టు చున్నవి.

ధర్మకార్యనిర్వాహక సంఘములోని సభ్యులు:- హిరణ్యవ్యాఘ్రపాద(డు);ఉగలక (ఉద్గారకుడు), కలహ(డు)[3], విసాక (విశాఖుడు), స్థౌలశీర్షి, శ్రామణ (డు), ఒదల (ఔదరుడు), అపక (డు), సముద్ర (డు), అనుగ్రహ(డు), కూర (డు), శత్రుఘ్న(డు), పోతక (డు), పోత (డు) అలినాక (అలినాగడు), వరుణ(డు), పింగళక(డు), కౌశిక(డు), సూత (సూత్రు డు), పాప (డు), కుబీరక (కుంభీరకుడు - ఇతడొక రాజు), గాలిక (డు), శ్రామణదాస (డు), భారద (భారతుడు), ఒదల (ఔదరుడు), స్థౌలతిష్య(డు), తిష (తిష్యుడు), గిలన (జ్ఞానుడు), జంభ (డు).....ఋవ (ఋవుడు), ... జనక (డు), గోపాలక (డు), ఉపసాదునికొడుకుకూర (డు), కరహునికొడుక ఉత్తర (డు).

పౌరసభాసభ్యుల నామములు:- వచ్చ(వత్సుడు), చఘ(జఘన్యుడు), జెటా (జెటుడు), జంభ(డు), తివ(త్రిష్యుడు), రేత (రైవతుడు), అచిన (అచీర్ణుడు), సభిక (డు), అఖఘ(అక్షఘ్నుడు), కేల (డు), కేశ(డు), మాహా (మాఘుడు) నేత (స్వైత్రుడు), చడిక (చండికుడు), ఓఖబల, ఓఘబలుడు, సోనుతర (సోనుత్తురుడు), సుసర్ణోత్తర (డు), సామన (శ్రామణుడు), సామనదాస (శ్రామణదాసుడు), సామక (శ్యామకుడు), కాముక (డు), చితక (చిత్రకుడు).

వర్తక సంఘములు.

ఆ కాలమున వాణిజ్యము చేయుచుండిన వణిక్కులు విశేషభాగ్యమును సంపాదించినట్టు గానంబడుచున్నది. కార్లీలోని గొప్ప చైత్యగుహను జయంతీనగరములోని యొక సేఠ్ వలన నిర్మింపబడియె నని చెప్పబడినది. ధాన్యకటకము, కన్హేరి మొదలగు స్థలములలో గూడను వారి దానములు మిక్కిలి విలువగలిగినవిగా నున్నవి. సేఠ్ అనుశబ్దము శ్రేష్ఠియనుదాని ప్రాకృత రూపము. సేఠ్ యొక్క వికృతియె తెలుగులో సెట్టియగుచున్నది. సెట్టియనగా వర్తకుడు. ఆ కాలములో వర్తకసభలు పెక్కులుండినవి. నేతగాండ్రకు, గాంధికులకు ధాన్యక శ్రేణులకు, నూనె మొదలగువానిని తయారు చేయవారలకు బ్రత్యేక వర్తకసభలు గలవు. ఈ సభలన్నియు గ్రమమైన యేర్పాటులను నిబంధనములను కలిగి యోగ్యస్థితి యందున్నట్లుగ గానంబడుచున్నవి. ప్రజలు తమ సొమ్మును శాశ్వతముగా నీ సభలవద్ద భద్రముగా నుంచుకొనుటయు, వారలు వీరలకు తరతరములవఱకు వడ్డి నిచ్చుచుండుటయు గూడగలదు. ఈ సభల మూలమున [4] స్వపరి పాలనము చేసికొనుచుండుట అప్పటి రాజ్యాంగపద్ధతిలో ప్రధానమైన విషయముగా నుండెను. పైనుదాహరించిన భట్టిప్రోలు శాసనములోని నిగమసభ మాత్రమే గాక ఋషభవత్తుని నాసిక శాసనములో గోవర్థనములోని నిగమ సభ యొకటి పేర్కొనబడి యుండెను. దేశములో నెట్టెట్టి విక్రాంతులు సంభవించినను, పరిపాలనచేయు రాజు లెట్టివారయినను నిరాఘాటముగ రాజ్యపాలనమునడుచుటకు నిట్టి సభలు తోడ్పడుచుండియనుటకు సందియములేదు. ఆ కాలమునందు నూటి కైదుమొదలుకొని యేడున్నర వఱకు మాత్రమే వడ్డి గైకొనబడుచుండెను గాని యీ కాలమునందువలె నధికమైన వడ్డి గైకొనబడుచుండలేదు.

నాణెములు.

ఆంధ్రరాజుల కాలమున నాణెములు సీసముతోడను, రాగితోడను వెండితోడను చేయబడినవిగా నున్నవి. దీనిలో పెక్కువేల నాణెములు ధరణి కోటలోను, గుడివాడ ప్రాంతమునను దొరకినవి. కొన్ని నాణెములను రాబర్టు స్యూయలు గారు సంపాదించి జనరల్ కన్నిహ్యామ్ గారికి బంపగా నయ్యవి గోతమీపుత్రశాతకర్ణి యజ్ఞశ్రీశాతకర్ణి, చంద్రశ్రీశాతకర్ణి కాలమునాటి వై యున్నవని వారు కనుకొనిరి.పశ్చిమ భాగమున ననగా నిప్పటి మహారాష్ట్ర దేశమునందును భగవనా లాలా ఇంద్రాజి పండితునిచేతను గిబ్బుగారి చేతను కనుగొనబడినవి.అవియును గోతమీపుత్రునియొక్కయు, యజ్ఞశ్రీయొక్కయు, పులమావియొక్కయు, వారి ప్రతినిధి పరిపాలకులయొక్కయు నాణెములుగా నున్నవి. పశ్చిమదేశమున దొరకిన యాంధ్రనాణెములపైన విల్లునంబులు చిత్రింపబడినవిగానున్నవి.

స్యూయలు గారు గుడివాడలో గనుగొనిన కొన్ని నాణెములు చిత్రములుగా నున్నవి. రోమనులయొక్కయు, యవనులయొక్కయు ఓడలనుబోలిన యోడయొకటి అర్థచంద్రాకృతిగల టాపుతోడను రెండు తెఱచాపలతోడను, తెడ్డువలెనుండు నొక పెద్దలంగరు (చుక్కాను) తోడను జిత్రింపబడినవిగా నున్నవి. ఇయ్యవి యజ్ఞ శ్రీకాలమునాటినవిగా నున్నవి. ఈ నాణెమునుబట్టియె యా కాలపు నాటి యాంధ్రులకు నోడలనుగూర్చియు, నావికాయాత్రలనుగూర్చియు, జ్ఞానము కలదనియు, ఆ విషయములందు వారాఱితేఱిన వాఱేయనియు స్పష్టముగా జెప్పుటకు సంశయింపం బనిలేదు. ఈ నాణెములుగాక యాకాలము నందు గవ్వలు మొదలగునవి కూడ వ్యవహారమునం దుపయోగింపబడుచుండినవి.

విశేషానుభవముగల మణికారకులు.

విశేషానుభవముగల మణికారకులని (రత్నవర్తకులు, పూసలవర్తకులు, రత్నములు సానపట్టువారు మణికారకు లనంబడుదురు) రాబర్టు స్యూయలు గారాంధ్రులను గూర్చి వ్రాసియున్నారు. ఈ విషయమున రాబర్టు స్యూయలు గారాంధ్రులకిచ్చిన యోగ్యతా పత్రిక చదువరుల కాహ్లాదకరముగా నుండునని దాని నీ క్రింద నుదాహరించుచున్నారము.

"నాకు దొరకిన పూసలు రేగడిమట్టితో జేయబడి యెండ బెట్టబడినవిగను, బంకమట్టితో జేసి కాల్చినవిగను, ఎముకతోడను, స్ఫటికముతో డను, గాజుతోడను, తృణమణితోడను, కెంపులతోడను, వివిధములయిన ఱాళ్లతోడను జేయబడినవిగను నున్నవి. కొన్ని చిన్నవిగను కొన్ని పెద్దవిగను పెక్కుతరహాలుగ నున్నవి. వానిలో ముఖ్యముగా ఱాళ్లతోడను జేయబడినవి సొగసయిన పనివానితనమును దెలుపునవి గా నున్నవి. స్ఫటికముతో జేయబడిన గిన్నెయొక్క చిన్న భాగమును ఎముకతో జేయబడిన హస్తకంకణములయొక్క యొకటి రెండు ముక్కలును, నునుపు చేయబడిన యొకటి రెండు చిన్న ఱాళ్లును, అటువంటివస్తువులె మఱికొన్ని యునుగూడ దొరకినవి. ఇవియన్నియు నాకాలపునాటి మనుష్యులు విశేషానుభవముగల మణికారకులని ఋజువు చేయుచున్నవి. ఈ వస్తువులన్నియును వీరిచే కృష్ణామండలములోని గుడివాడవద్ద గనుగొనబడినవేగావున నీయోగ్యతాపత్రిక యాంధ్రులకె చెందునదిగాని మఱియొకరికి గాదు. [5]

కుమ్మర పనులు.

ఆ కాలపునాటి యిటుకలను మఱికొన్ని కుమ్మరపనులను పరిశోధించిన స్యూయలు గారె మరల నిట్లు వ్రాయుచున్నారు.


"ఆ కాలపు నాటి కుమ్మరులీ కాలపు నాటి వారికన్న నధిక చాతుర్యము కలవారని నాకు దొరకిన పగిలిపోయిన కుండముక్కలు మొదలగునవి తేట పఱచుచున్నవి. అయ్యది నిస్సంశయముగా నిర్వివాదాంశమని నేననుకొనుచున్నాను. కొన్ని కుండలయొక్క మూతులు మూడనాలు గడుగులు నడిమి కొలత గలిగి మిక్కిలి పెద్దవిగానుండి ధాన్యము మొదలగునవి నిలువజేసుకొనుట కనుకూలముగా నుండి యుండబోలు. కొన్ని మిక్కిలి సొగసుగా నగిషీ చేయబడినవిగా నున్నవి "

సముద్ర మార్గములు - రేవు పట్టణములు.

ఆంధ్రరాజుల పరిపాలనములో విదేశముతోడి వర్తకవ్యాపారము సముద్రమార్గముల నడుపబడుచుండె ననుటకు దృష్టాంతము లనేకములు గలవు. అరేబియా, ఈజిప్టు, రోము, గ్రీసు, పారశీకము మొదలగు పశ్చిమ దేశముల నుండి యోడలు పశ్చిమ సముద్రతీరమందలి భరుకచ్చము, సింహపురము, శూర్పరూగము మొదలగు రేవు పట్టణములకు వచ్చుచుండెను. భరుకచ్చము నేడు బ్రోచి (Broach) యని పిలువబడుచున్నది. ఇచ్చటినుండి సింహళమునకును సింహళమునుండి గంగానదీ ముఖద్వారము నందుండిన తామ్రలిప్తి నగరమునకు సముద్రమార్గము కలదు. ఈ మార్గమున నోడలు రాకపోకలు సలుపుచుండెను. తామ్రలిప్తి నగరమున బయలువెడలిన యోడ తూర్పుతీరము వెంబడిని వచ్చి కళింగదేశములోని రెండురేవు పట్టణములను ఆంధ్రదేశములోని రెండు రేవుపట్టణములను జూచుకొని చోళదేశపు తీరము ప్రక్కనే సింహళద్వీపమునకు బోవుచుండెను. కళింగదేశములోని ప్రధానమైన రేవుపట్టణము అడ్జిటాయనునది గానున్నది. ఈ పేరు బర్మా దేశపుగాథలలో గానుపించుచున్నది గాని కళింగ దేశము లోని యేపట్టణమునకు వర్తించునో దెలియరాకున్నయది. బర్మాదేశమునుండి "తా పూసా, పాలికాట్"అనువర్తకులిరువురు తమసరకులను అడ్జిటా రేవున దింపుకొని మగధ దేశములోని సువర్ణపురికి బోయిరని చెప్పబడినది. [6] కళింగదేశము లోని రెండవరేవు పట్టణము పేరు తెలియరాదు. కృష్ణానదీ ముఖద్వారమునందొక రేవు పట్టణ ముండినట్లనేక గాథలవలన దెలియుచున్నది. కొన్ని గాథలనైదవ ప్రకరణమున దెలిపియే యుంటిమి. ఈ పట్టణము పేరేమియని గ్రంథములను బరిశోధింపగ విదేశస్థులు వ్రాసిన గ్రంథములలో "మసాలియా" యని పేర్కొనబడియెను. టాలెమియను చరిత్రకారుడు, తన భూగోళమునందు మైసాలియా యని పేర్కొనియున్నాడు. ఈ గ్రంథకర్తలిరువురు రెండవశతాబ్దములోని వారుగా నున్నారు. ఈ పట్టణములపేరుతోనే మండలమునుగూడ వాడియున్నారు. [7]. మసాలియా యనగా మోసలపురమని యొకరు వ్రాసియున్నారు. ఈ మోసల లేక మోసలపురము కృష్ణా మండలములోని మసూలాయను మచిలీపట్టణమునకో లేక యరువది డెబ్బది మైళ్ల దిగువన గుంటూరు మండలము బాపట్ల తాలూకాలోని మోటుపల్లి గ్రామమునకో సంబంధించి యుండునని తోచుచున్నది. ఈ మండలము రవిసెల్లాలకు (సన్నని నూలు బట్టలకు) విఖ్యాతి గాంచిన దని పై గ్రంథకారులు పేర్కొనియున్నారు. ఇటీవలి చరిత్రకారులు వ్రాసిన విషయములను బట్టికూడ నీ యంశము ధ్రువపడుచున్నది. పదునొకండవ శతాబ్ద ప్రారంభమున "అబూరహాన్" అను అరాబియే దేశస్థుడొకడు "దనక" యను దేశము కొంకణమను పేరుగల కృష్ణానదీ తీరము నందలి పల్లపు ప్రదేశములలో నున్నదని పేర్కొనియున్నాడు. అబూరిహాను యొక్క యుద్దేశము ప్రకారము దనకదేశము ఖడ్గమృగముల దేశముగానున్నది. ఈ యభిప్రాయమునే సూలిమామ్ అను వర్తకుడు దెలుపుచు నట్టి దేశము దక్షిణ హిందూదేశములోని "రూమి" (Ruhmi) యని పేర్కొని ఒక యుంగరములో దూరిపోగల ట్టి సొగసయిన రవసెల్లాలకు (fine muslins) విఖ్యాతి కెక్కినదని కూడ చెప్పియున్నాడు. ఈ దేశమునే మసుడియను(Masudi)యనునాతడు 'రహమా'(Rahama)యనియు, ఇద్రిసి (Idrisi) యనునాతడు డుమి (Dumi)యనియు, పేర్కొని యున్నారు. ఈ దేశము సముద్రతీరము వెంబడి నున్నదని కూడ మసుడి చెప్పుచున్నాడు.

ఇంతియగాక పదునాలుగవ శతాబ్దమునం దీదేశమును జూడవచ్చిన మార్కోపోలో (Marco polo) అనునతడు, మాబారు దేశమున కుత్తరమున మచిలీపట్టణ మండలములో ముటఫిలి(Mutafili)యనురేవుపట్టణమును బేర్కొనుచు వజ్రములకును , సాలెపట్టును బోలె మిక్కిలి పలచనైన సన్నని బట్టలకును ప్రసిద్ధి కెక్కినదని పేర్కొనియున్నాడు. ఈ ముటఫిలి మచిలీపట్టణమునకు సంబంధించినదని కొందఱునను. మోటుపల్లికి సంబంధించి యుండునని కొందఱును జెప్పుచున్నారు. ఇంకననేకులీ దేశము వజ్రములకును మంచిరవసెల్లాలకును విఖ్యాతి కెక్కినదని పేర్కొనియున్నారు. కాబట్టి టాలెమీ మొదలగువారు రెండవశతాబ్దమున బేర్కొనిన మసాలియా దేశమును, అరబ్బీదేశస్థులు పేర్కొనిన రహామీ లేక డుమి మండలమును అబుదిహాన్ పేర్కొనిన దనకదేశమును ధాన్యకటకమును నాంధ్ర దేశమునకు సంబంధించినవి కాని వేఱొకదేశమునకు సంబంధించినవికావు.[8]

చీనా, జపాను, బర్మా దేశములనుండియు సుమత్రా, జావా, బార్నియో దీవులనుండియును, సింహళమునుండియు, వంగదేశమునుండియు, సీమసాలియా రేవుపట్టణమునకు నోడలు సరకులను గొనివచ్చి మరల సరకులను గొనిపోవుచుండును. ఇంతియగాక నెల్లూరునకు సమీపమున పినాకినీ నదీముఖద్వారమున మఱియొక రేవుపట్టణముకలదు గాని పేరు దెలియరాకున్నది. ఈ దేశమునందలి బట్టలు మొదలగునవి ధాన్యకటకము నుండి ప్రతిష్టానపురము మీదుగా మెట్టదారిని భరుఖచ్చము రేవునకుంబోయి యచ్చట నుండి పశ్చిమ మండలముకుం బంపబడుచుండినవి. పశ్చిమ ఖండములనుండి వచ్చు సరకులుగూడ భరుఖచ్చమునుండి మెట్టదారిని ప్రతిష్టానపురము మీదుగానే ఈ దేశమునకు గొనిరాబడుచుండినవి.

రోము మొదలగు ఖండాంతరదేశములతోడ వ్యాపారము జరుగుచుండినందులకు దృష్టాంతము రోమచక్రవర్తుల నాణెము లీతీరమునందు చెల్లుబడి యగుచుండుటం గన్న మరియేమి కావయును. అట్టి రోమకనాణెములు రెండవ శతాబ్దములోనివి నెల్లూరుకు సమీపమున భూమిలోనుండి పెళ్ళగింపబడినవి.

నెల్లూరునకు సమీపమున నొక కాపు రాళ్ళ రప్పలతోగూ యయెక్కుటకసాధ్యముగా నుండిన యొక కొండ ప్రక్కను పొలము దున్నుచుండగా ఇటుకకట్టడమొకటి యడ్డము వచ్చినందున నతడు దానిని త్రవ్వి చూడగా యొకచిన్న దేవాలయమును బయల్పడెను. దానిలో యొక చిన్న మట్టి ముంత గానంబడియెను. ఆముంతలో రెండవ శతాబ్దములోని కొన్ని రోమకనాణెములును, బిరుదు బిళ్ళలును గానవచ్చెను. అతడు వానింగైకొని పాతబంగారము కింద వాని నమ్మెను. పెక్కునాణెములు కరిగింపబడినవి. కాని అమీరు-అల్-ఉమ్రా అనునవాబు వాని ముప్పదింటివరకును స్వాధీనము చేసికొని1783వ సంవత్సరము జూలయి నెలలో చెన్నపురి గవర్నరుగా నుండిన అలెగ్జాండరు డేవిడ్సన్ దొరగారికి బంపించెను. వారు దానిలో అడ్రినా పౌష్టియను రోమన్ చక్రవర్తుల పేరులుగల రెండునాణెములు మాత్రము తీసికొనిరి. వానిలో ట్రజానుల నాణెములు మాత్రము సురక్షితములనియు, అవియన్నియు మేలిమిబంగారముతో పోతబోయబడినవనియు, కొన్నియాభరణములుగా నుపయోగించుకొనం బడుటచేత కాబోలు రూపములు చెడిపోయి యున్నవనియు వ్రాసియున్నారు. ఈ రోమకనాణెములు మనదేశములో దొరకుట చేత ఖండాంతర దేశములతో గూడ వర్తకము జరుగుచుండెనని మనము నిశ్చయింపవచ్చును. [9] మరియును ఆంధ్రదేశమునకును సుమాత్రాజావా ద్వీపములకును విశేషసంబంధముగలదని కొన్ని హేతువులచే నిశ్చయింపబడుచున్నది. ఈ యాంధ్రరాజులును మగధ రాజులనియు, మహాకర్ణులనియు విదేశస్థులు పేర్కొనుచుండెను. ఒక కర్ణ మహారాజును గూర్చి యాదేశమునందొక కావ్యముకలదట ఆ కావ్యమేదియో తెలిసికొన్నయెడల వీరుల చరిత్రము కొంతవరకు దెలియబడ వచ్చును. ఈ యాంధ్రరాజుల కాలముననే బౌద్ధమతమాదీవులకు వ్యాపించినది. ఈ దేశము నుండి బౌద్ధభిక్షువులును వర్తకులు ననేకులా దేశమునకుబోయి వచ్చు చుండిరని కూడా తేటబడుచున్నది.

ఇంతియగాక యాంధ్రరాజులను గూర్చి చీనాదేశమునందలి చరిత్రములలో బ్రశంసింప బడియుండెను. చీనాదేశపు, చరిత్రకారులు "యజ్ఞాయ్"(Yagnai) అని యజ్ఞ శ్రీశాతకర్ణిని పేర్కొని వానిని హిందూదేశపు చక్రవర్తి యని చెప్పియున్నారు. ఆంధ్రరాజులలో గడపటి వాడయిన పుల్హమాయిని "పౌలోమీన్" (Powlomein)హౌలోమిన్ (Howlomein). హౌలోమిన్ తో(Howlomeinto), అని యా దేశపు చరిత్రకారులు పేర్కొని యున్నారు. ఇండియాదేశమును వారు పులిమాను దేశమని యర్ధము మిచ్చునట్టి పౌలోమిన్ కోనె(Poulomien kove) యని పిలిచి యున్నారు. కడపటి వాడయిన యీ పులమాయి మరణానంతరము దేశమల్లకల్లోలమయ్యేనని "డీ గైన్సు ఓలో నాచెన్" (Diegiunes Olonachen)వ్రాసియున్నాడు. ఈ పులమాయి క్రింది యధికారులలో నొకడు గంగానదీప్రాంతభూముల నాక్రమించుకుని చీనాచక్రవర్తియగు టెయిట్ సాంగ్ (Taitsong) వద్ద నుండి హ్యూంట్జి (Hiuntse)యనువాండు కొందరు రాయబారులతో వచ్చుచున్నాడని విని వారలను బట్టికొనుటకై సేనలను బంపెననియు, బహుకష్టముతో [10] [11] హ్యూంట్జి తప్పించుకుని టిబెట్ దేశమునకు బారిపోయెననియు, ఆదేశపురాజయిన "యెంత్సోగ్లాన్ స్తాన్"(Yetsongloustan)అను నాతడు వారికి గొంతసైన్యము నిచ్చెననియు, అతడాసైన్యముతో మరల వచ్చి పులమాయి శత్రువుని నోడించి వానిని జెర బట్టెననియు వ్రాసియున్నాడు. వీటినన్నింటినిబట్టి చూడగా వీరలకును చీన చక్రవర్తులకు విశేషమైత్రి కలదనియు, ఈ రెండు దేశములకును వర్తక వ్యాపారము జరుగుచుండెననియు దేటపడక మానదు.

పట్టణములు-పల్లెలు.

ఆకాలమున నాంధ్రదేశమందుండిన పట్టణములు పల్లెలు కొన్ని ధాన్యకటక శాసనములలో గానంబడుచున్నవి. "రాజగిరి, కేపూరూరు, మందర, విజయపురము.(బెజవాడ?), ధాన్యకటకము (ధరణికోట), కుట్టపరవేన, మహావనశాల, కూడూరు(బందరు తాలూకాలోని గూడూరు లేక కృష్ణా మండలములోని గుడివాడై యుండవలయును), ఒడి పరివేపన(ఒద్ది పర్రు), సాధుగ, రాజశైలము, కట్కశాల(ఘంటశాల),నడతూరు, మహాకాండూరూరు, మేగిరి" అనునవి మాత్రము పేర్కొనబడినవి. " నందపురము. గిలకేర, నగిరి" అనునవి భట్టిప్రోలు శాసనములలో బేర్కొనబడినవి.

ఆంధ్రులవర్ణనము.

ఆంధ్రులు నాగరికతయందు పెక్కుతరగతులుగ వేరుపడియుండిరి. అనార్యాంధ్రులు నాగరికతయందు వెనుకబడియున్నవారగుట చేత వారు కేవలము దిగంబరులుగా నుండిరని చెప్పవచ్చును. నాగరికులైన నాగులు కొంచెము వస్తాదికము గలిగియుండిరి. వారు ధరించుకొను దుస్తులను, అలాంకరించుకొను నాభరణములు వారి వారి స్థితుల ననుసరించి భేదించి యుండినవి. సాంచి, నాసిక, కార్లి, అమరావతి మొదలగు ప్రదేశములలోని విగ్రహములను జూచిననియెడల వారలంకరించుకొను యాభరణముల వైఖరులు తేటపడగలవు. అంధ్ర స్త్రీ అలంకరించుకొను నాభరణములలో పెద్దవిగను దీర్ఘచతురస్రములుగనుండిన ల్లలతో గూర్పబడి బరువుగను వెడల్పుగనుండు మెడసరము ప్రాముఖ్య మును గాంచియుండినది. చెవులపోగులు పెద్దవిగా నుండినవి. ఒకొక్కప్పుడు దీర్ఘ చతుస్రములుగా నుండి భుజములపై వ్రేలాడుచున్నవి. చేతులకు మణికట్టులకడ బరువైన యందెలు కడియములు నుండినవి. పచ్చనిబొట్టు స్త్రీలమోము నలంకరించియుండెను. ముంగటి భాగము గుబురుగా నుండి ఎత్తైన ఒక తలపాగా పురుషులచే నలంకరించబడుచుండెను. స్త్రీలును పురుషులును కటిప్రదేశమునకు పైభాగమున నగలు తక్క విశేష వస్త్రాధికము ధరించి యుండలేదు. స్త్రీల నడుములకు నొడ్డాణములు గలవు. రణశూరులయిన యాంధ్రులు విల్లంబులును (ధనురస్త్రములు), కుంతములను(ఈటెలను), ఖడ్గములను ధరించుకొని యుండిరి. ఇత్తడి, రాగి, దంతము, మొదలగువానితో జేయబడిన నగలను బీదవారు ధరించి యుండగా భాగ్యవంతులు బంగారు నగలను ధరించి యుండిరి. ఆ కాలమున లోహములలో వెండి మిక్కిలి స్వల్పముగా నుండుట చేత వెండినగలనెవ్వరును ధరించి యుండ లేదు. భాగ్యవంతులు కాళ్ళకు గూడా బంగారు అందియలను బంగారు కడియములను ధరించి యుండిరి. ఈ కాలమునందు గొన్ని తెగలలో వలె దమ స్త్రీలకు ముసుగులు వేసి సూర్యరశ్మినైన గానరాకుండ మూల గూర్చుండబెట్టు విపరీతాచారములు వారెరుంగరు. ఆంధ్రరాణులు సహితము రాజసభలలో దమ భర్తల పక్కన కూరుచుండుచు వచ్చిరి. ఉన్నత స్థితియందుండుండిన స్త్రీలు సహితము విధ్యాభ్యాసమును జేయుచుండిరి. ఆకాలమునందు పురుషులు స్త్రీలను మిక్కిలి మర్యాదతో జూచుచుండిరనుటకు బెక్కు దృష్టాంతములు గలవు. మతకార్యములలోను స్త్రీలే ప్రాముఖ్యరాండ్రుగ నుండుచువచ్చిరి. ఏమతమవలంబించినను స్త్రీలే మార్గదర్శనులుగా నుండిరి. పురుషులకన్నను స్త్రీలకే మతాభినివేశమధికముగా నుండెను. సర్వసామాన్యముగా పురుషులే స్త్రీలకు వశులై వర్తించుచుండిరి.

విశేషాంశములు

ధాన్యకటక బౌద్ధ స్థూపములలోని దానశాసనములలో రెండు విచిత్రములయిన సంబంధమును దెలుపునవిగా నున్నవి. తోళ్ళపనిచేయువాడును నాగమ రుని కుమారుడును నగు విధికుడను వాడు తనతల్లితోడను, తనభార్యతోడను, తనసహోదరులతోడను, తనకుమారుడగు నాగునితోడను, తనపుత్రికలతోడను, తనబంధువులతోడను, తనమిత్రులతోడను గలిసివచ్చి వ్రాయించిన దానశాసనమొకటియు, ముకుందశర్మ యనువాని కుమారుడు కూతుండ్రతోడను కోడండ్రతోడను మనమలతోడను గలిసివచ్చి వ్రాయించిన దానశాసనమొకటియు గలవు. [12] శర్మయనునది బ్రాహ్మణులపట్టపుపేరు. పై ముకుందశర్మ వైదికమతమునకు సంబంధించిన బ్రాహ్మణుడుగ గన్పట్టుచున్నాడు. విధికుడు తోళ్లపనిచేయువాడని చెప్పబడినది. వాస్తవమయినేని నాతడు హైన్యజాతివాడయి యుండవలయనుగదా. పూర్వమున సాధారణముగా మాదిగవాండ్రు మాత్రమే తోళ్లపని చేయుచుండిరి. అప్పటికి మాలమాదిగలు లేకపోయినను వాండ్రపూర్వులెవ్వరో యొకరుండి యుండక తప్పదుగదా. ఆ కాలమునందు బుద్ధుని పూజించువారిలో బ్రాహ్మణులు కూడ గలరనియు మఱియు బ్రాహ్మణుడయినను, చండాలుడయినను వర్ణ భేదము లేకుండి సమస్తమతములవారును బౌద్ధాలయములం బ్రవేశించుటకు నర్చనలు సలుపుటకు సమాన హక్కునే గలిగియున్నారనియును పై దానశాసనములు రెండును దెలుపుచున్నవి. ఆ కాలమునందు యవనపహ్లవాది మ్లేచ్ఛులే హిందూనామములను ధరించి బౌద్ధమతము నవలంబించి బౌద్ధాలయములకు వచ్చి బుద్ధుని సేవించి దానధర్మములుగావించి శాసనముల జెక్కించినవారు పెక్కండ్రుగలరు.

కృష్ణుడును వానిసోదరుడు క్షుల్లకృష్ణుడును, వారి సోదరినాభాయను నామెయు, ధాన్యకటకములోని గొప్పచైత్యమునకు నూర్థ్వపట్టమును దానముచేసిరని దెలిపెడి దానశాసనమొకటి కలదు. ఇందు కృష్ణుడు దమిళుడని పేర్కొనబడియున్నది. తమిళమె దమిళముకాగా నయ్యది ద్రమిళముగాను ద్రవిడముగాను సంస్కృత గ్రంథకారులచే బేర్కొనబడినది గావున నాశాసనమునాటికి దమిళులు వేఱుగును నాంధ్రులు వేఱుగనుండిరని తేటపడుచున్నది. తమిళులను బట్టియె ద్రావిడ శబ్దమేర్పడినది గావున దమిళులకు పూర్వమీదేశముననున్న వారిని ద్రావిడులని పిలువరాదని పూర్వప్రకరణలయందు చేసిన వాదము సహేతుకమైనదని తేటపడకమానదు. ఏ భాష నాగులు మొదలగు జాతులవారిచే భాషింపబడుచుండెనో యాభాషనే తమిళజాతులవారీ దక్షిణాపథమునకు రావేగమె యవలంబించిరిగావున నాటనుండియు నాభాషద్రావిడభాషగా బరిగణింపబడుచుండెను. కాబట్టి ద్రావిడ భాషలని చెప్పబడియెడి యిప్పటి యఱవము, కన్నడము, తెలుగు, మలయాళము మొదలగు భాషలకు దల్లి తొంటి నాగజాతులవారి భాషయె కాని తమిళులభాష కాదనియు, కొందఱు తలంచునట్లుగ నిప్పటి తమిళభాషనుండి తెలుగు పుట్టినది కాదనియు నూహింపదగియున్నది.

కర్ణాటము.

కర్ణమనగా కొండలోయ యనియు వానియందు సంచరించువారు కర్ణాటులనియు, కర్ణాటులు నివసించుదేశము కర్ణాటమైనదనియు కొందఱు పండితులు చెప్పునది నాలుగవప్రకరణమునుందు గొంచెముగ బ్రశంసింపబడినది. కర్ణాటమనునది మొదట కొండలోయను బట్టి కాక కర్ణులను బట్టి యేర్పడినదని కొందఱు చరిత్రకారుల యభిప్రాయమై యున్నది. ఆంధ్రదేశమును బాలించినరాజులలో "శాతకర్ణి" అనుపేరును వహించినవారనేకులుండుటచేత సామాన్యముగా నాంధ్రరాజులను కర్ణులని వ్యవహరించుచుండిరి. వీరు బహుశతాబ్దములు దేశమును బాలించినవారగుటచేత వీరికీర్తి సర్వత్ర వ్యాపించినది. తమిళజాతుల వారిచే నివసింపబడుదేశములో గొంతభాగ మాంధ్రరాజులగు కర్ణులచే జయింపబడి వారికి సంచారభూమిగనుండుట చేత నాభాగమునకు కర్ణాటమని పేరు వచ్చినదని చెప్పుచున్నారు. మొట్టమొదట కర్ణాటమని వ్యవహరింపబడిన భాగము మైసూరు దేశము. ఈ భాగము తమిళజాతులవారినుండి యాంధ్రులచే నాక్రమింపబడినదని చెప్పుటకు దృష్టాంతములుగ జారిత్రక విషయములు గలవు. హారితి పుత్త్ర శాతకర్ణి యొక్క శిలాశాసనములు రెండు మైసూరుదేశ మునందు గన్పెట్టబడెనని యిదివఱకె తెలుపబడియెను. శాతకర్ణియను పేరు నాంధ్రభృత్యవంశపురాజులు ధరించుచుండుటచేత నితడుకూడ నావంశములోని వాడే యనినిశ్చయింపదగును. ఇతని కొమార్తె యొక నాగప్రతిమను, ఒక చెఱువును, ఒక బౌద్ధవిహారమును దానముచేసెనని తెలిపెడి దానశాసనమొకటి వనవాసియందు బర్గెస్సు గారివలన గనిపెట్టబడెనది. ఇచడచ్చోటబరిపాలనము చేయుచుండెనని యందు దెలుపంబడియనని యిదివఱకు పేర్కొనంబడియెను. ఈ క్రొత్తశాసనములో నితడొక బ్రాహ్మణునకు గొన్ని గ్రామముల దానము చేసినట్లు చెప్పబడియెను. అందితడు మట్టి పట్టి యనుదేవుని గూర్చిన ప్రార్థనముగూడ వ్రాయించెను. ఇయ్యదిశివుని పేరులలో నొకటి గా గన్పట్టుచున్నది. ఈ శాసనము నాసిక, ధాన్యకటకము మొదలగు స్థలములలోని యాంధ్రశాసనములం బోలియుండుటయె గాక వానివలె ప్రాకృత భాష లోనున్నది.[13] ఇంతియె గాక మఱియొక విశేషముగలదు.

స్థానకుందూరునకు సమీపముననున్న యొక పురాతనశైవదేవాలయము చెంగట నొక కోనేరును నిర్మించుటనుగూర్చి ప్రాశస్తి యనుదానిలో కుబ్జుడను శైవకవియొకడు వర్ణించియున్నాడు. ఆ శివాలయమునకు దానధర్మములు చేసిన వారిలో శాతకర్ణి యొకడని యాకవి పేర్కొనియున్నాడు. ఆతడు హారితపుత్త్ర శాతకర్ణియని పైజెప్పిన యంశములను బట్టి స్పష్టపడక మానదు. ఈహేతువులన్నిటిని బరిశీలించి చూచినప్పుడు శాతకర్ణాభిధానులయిన యాంధ్రరాజులు మొదట ద్రావిడులనుండి యాభాగమునుగైకొని పరిపాలించిరనియు వారిమూలముననే యాభాగమునకు గర్ణాటమను నామము గలిగిననియు జెప్పెడి వారి వాదమునకు బైనుదహరించిన యంశములు బలకరములుగా నున్నవనుటకు సందియములేదు.

- - - <> - - -

  1. 1. The Madras Journal of Literature and Science 1886-87 pp 56 to 62; Archeological Survey of India(New Series) Vol III p.25,28.
  2. 1.Archelogical Survey of Southern India Vol Ip 24.
  3. కలహ (డు) అనుదానిని కలహుడని చదువుకొను రీతిగానే తక్కిన నామములను డు ప్రత్యయమును జేర్చి చదువుకొనవలయును
  4. Epigraphia India, Vol.II. pp. 326. 329.
  5. Archeological Survey of India, New Imperial Series Vol. XV. page 20.
  6. The Deccan in the time of Goutama Buddha by the Rev. Thomas Foulkes, Chaplain of Coimbatore in the ind. Ant., Vol. XVI.
  7. McCrindle's Ptolemy, p. 183,f;The Periplus of the Erythroean Sea and Voyage of Nearchus, translated by William Vincent, D. D.,p. 105,ff.
  8. Mr. Cunningham's Ancient Geography of India.
  9. Asiatic Researches vol. II pages 331,332
  10. William Marsdeu:Asiatic Researches Vol. IV.pages 227.229
  11. Asiatic Researches Vol. IX. p. III
  12. The Buddhist Stupas of Amaravati and Jaggayya-peta. pp. 91 to 103.
  13. The Indian Antiquary Vol. XXV. p.27,