Jump to content

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఎనిమిదవ ప్రకరణము.

గోతమిపుత్ర శాతకర్ణ శాతవాహనుడు.

(క్రీ.శ. 133 మొదలుకొని 154 వఱకు.)

- - -

ఇతడు శివస్వాతికి దరువాత నాంధ్రరాజ్యలక్ష్మిని వరించి పట్టము గట్టుకొన్న మహనీయుడు. ఇంతకు బూర్వము రాజ్యము చేసిన శాతకర్ణులవలెగాక "గోతమిపుత్ర"యని తన పేరునకు బూర్వమున నొక విశేషణమును జేర్చి వాడుకొనుచుండుటచేత నిందొక విశేషము గన్పట్టుచున్నది. పూర్వమునందుండిన వారెవ్వరును తల్లుల పేరులతో దమ పేరులను జేర్చి వాడుకొని యుండకపోవుటచేత నీతడు గోతమిపుత్రుడని తల్లిపేరు చెప్పుకొనుటచేత నితడు శాతవాహనవంశములో నిదివఱకు రాజ్యము చేయుచుండిన శాఖలోనివాడు గాక మఱియొక శాఖలోని వాడైయున్నట్లుగ గన్పట్టుచున్నది. ఏ శాఖలోనివాడైనను నితడు శాతవాహన వంశములోనివాడేగాని యన్యుడుగాడు. మఱియు సామాన్యుడుగాడు. ఇతడు పార్థునివంటి మేటియోధుడు; పరాక్రమంబున విక్రమార్కుని మించినవాడు; ప్రజ్ఞయందు గృష్ణదేవరాయసదృశుడు; బుద్ధదేవుని ప్రియభక్తుడయినను పరమతసహనము గలవాడు. పూర్వుల కీర్తి నిలుపగోరువాడు. ఇతడు కృష్ణదేవరాయని వలె దిగ్విజయము జేసి బహుదేశములను జయించి బహుభూములు పాలించి యపజయమన్నమాట యెఱుంగక శత్రువులకజేయుడై యాతనివలెనె యిరువదియొక్క సంవత్సరములు మాత్రమె పరిపాలనము చేసి శాసనములు నెలకొల్పి జయస్తంభములునాటి లోకవిఖ్యాతి గాంచిన మేటి పరాక్రమవంతుడగుటచేత నితని చరిత్రము మనోహరమైనదనుటకు సందియములేదు. ఇతడు ధాన్యకటక నగరములో సింహాసనారూఢుడై రాజ్యపాలనము ప్రారంభించినతోడనే తన జ్యేష్ఠకుమారుడగు పులమాయి యువరాజును గోదావరీ తీరమునం దలి ప్రతిష్ఠాన పురమునుండ నియమించి తన పూర్వులు గోల్పోయిన దేశములను మరల స్వాధీనము జేసికొనుట వీరపురుషోచిత ధర్మమని భావించి క్షాత్రపులపై దండెత్తుటకు సన్నద్ధుడయ్యెను. వీని పరాక్రమమునకు వెఱచి యవనశకపహ్లవాదులనేకులు వశులై రాజభక్తిని జూపుచు మ్లేచ్ఛత్వమును విడిచిపెట్టి జైనబౌద్ధమతముల నవలంబించి సర్వవిధముల నాతనికే దోడ్పడుచుండిరి. గోతమిపుత్రుడు తనకు బ్రతిఘటించి నిలిచిన యవనశకపహ్లవాదులను దఱుముచు శాత్రవులదేశముపై దాడివెడలి యనేక దినములు వారలతో ఘోరయుద్ధములు సేయుచు విజయమును గాంచుచుండెను. ఈ యుద్ధములయందు దండ్రికి యువరాజుగానుండిన పులమాయి కూడ నుండి తోడ్పడుచుండెను. ఇట్లు యుగాంతకాలరుద్రుడై గన్నులకు దేఱిచూడరాకయుండిన యీ మహాశూరవరాగ్రగణ్యుని బాఱింబడి జావలేక యా మ్లేచ్ఛులనేకులు యుద్ధములు మానుకొని శరణుజొచ్చిరి. సౌరాష్ట్రమునకు దండెత్తి పోయి సహపానుని వంశమును నిర్మూలము గావించెను. ఈ దండయాత్రను గూర్చి చరిత్రము శాసనములవలన ధ్రువపడుచున్నది.

గోతమిపుత్రుని శాసనములు.

నాసికపట్టణములోని కొండయొక్క కట్టకడనున్న గుహాలయమునందలి నాలుగుశాసనములలో బొడవయిన దానిలో నీక్రింది వృత్తాంతములు గన్పట్టుచున్నవి. వాసిష్ఠపుత్రుడయిన పులమాయి రాజుయొక్క పందొమ్మిదల పరిపాలన సంవత్సరమున గోతమిపుత్ర శాతకర్ణియొక్క తల్లి గోతమి ప్రేరేపణమున నీ గుహాలయము నిర్మింపబడి భద్రాయనీయ శాఖలోని బౌద్ధభిక్షవులకు నర్పణచేయబడియెను. ఈ శాసనమునందు గోతమి మహారాజుయొక్క తల్లియనియు, మహారాజుయొక్క ముత్తవతల్లి (నాయనమ్మ) యనియుంగూడ పేర్కొనంబడియెను. గోతమిపుత్ర శాతకర్ణి రాజాధిరాజనియు, ఆస్మిక, అసిక, మూలక, సురాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప విదర్భ, అకరావంతి దేశములకు బాలకుడనియు బేఱ్కొనపడియెను. అతడు వింధ్యావతము, పారియాత్రము, సహ్యము, కృష్ణగిరి, మలయము, మహేంద్రము, శ్రేష్ఠగిరి, చకోరము మొదలగు పర్వతముల కధినాథుడుగనుండెను; అతనియాజ్ఞలను రాజన్యవరులనేకులు విధేయులై శిర సావహించి పాదపూజ లర్పించుచుండిరి; అతని సామగ్రిని మోచుజంతువులు మూడు సముద్రములనుండి జలమును త్రాగుచుండినవి; శరణుచొచ్చినవారిని సంరక్షించెను; తన ప్రజల సుఖదుఃఖములను దనవిగా భావించుకొనియెను; మానవప్రకృతికి ననుగుణములగు ధర్మార్ధకామములనెట్టి కాలముననెట్టి ప్రదేశముల నేరీతి ననుభవింపవలయునో వానింగూర్చి చక్కగ నాలోచించెను. అతడు విద్యానిధి; సజ్జనులకాశ్రయుడు; కీర్తికిరవైనవాడు; సదాచారసంపన్నుడు, సద్వర్తనకుబెట్టినపేరు; అతడొక్కడే ప్రజ్ఞావంతుడు; అతడొక్కడే బ్రాహ్మణసంరక్షుకుడు. అతడు బ్రాహ్మణజాతి వర్ధిల్లుటకు మార్గముకలుగజేసెను; వర్ణసంకరాభివృద్ధిని నడ్డగించెను; అతని శూరకృత్యములు రామకేశవార్జునభీమసేనాదుల శూరకృత్యములను మించియుండెను; అతని పరాక్రమము నాభాగ నహుష జనమేజయ నగర యయాతి రామాం బరీషాదులను మించియుండెను; అసంఖ్యేయములయిన యుద్ధములలో శాత్రవసమూహంబులను నిర్మూలముచేసెను; క్షత్రియుల గర్వభంగమునుగావించెను; యవనశకపహ్లవుల నాశముగావించెను; ఖగారాట వంశమును కూకటివ్రేళ్ళతో బెఱికివేసి యూరుపేరులేకుండ ధ్వంసముచేసెను. శాతవాహన వంశముయొక్క కీర్తిని పునస్థాపితముగావించెను; ఇంతియగాక యీ గుహలోని బౌద్ధాలయముయొక్క సంరక్షణకై యొక గ్రామమునుగూడ దానముచేసెను. [1] ఈ శాసనముక్రిం ద గోతమపుత్రశాతకర్ణి ధాన్యకటకాధీశ్వరుండని తెలిపెడి చిన్నశాసనమొకటి కలదు. నవనరాధీశ్వరుండయిన వాసిష్ఠపుత్ర శ్రీపులమావి గోవర్ధనమునందుండెడి తన సైన్యాధికారియగు సర్వాక్షదళనునకు ధాన్యకటకాధీశ్వరునిచే (గోతమిపుత్రుడు) దానము చేయబడిన గ్రామమును (పై శాసనములో జెప్పినది) భద్రాయనీయులచేత నంగీకరింపబడనందున మఱియొక గ్రామము దానము చేయబడినదిగా దెలిసికోవలసినదని చెప్పెడి శాసనముగానున్నది.[2] ఆ గుహయొక్క వసారాకు నెడమ ప్రక్కనున్న గోడమీదను మఱియొక శాసనముగలదు. అయ్యది ధాన్యకటకాధీశ్వరుడయిన గోతమిపుత్ర్త శాతకర్ణి జయముగాంచిన తన సేనయొక్క నివేశనస్థానమునుండి గోవర్థనములోని తన సైన్యాధికారియైన విష్ణుపాలితుడనువానికి దెలియజేసిన యుత్తరువు యొక్క భావమును దెల్పునదిగనున్నది. అప్పటివఱకు ఋషభదత్తుని స్వాధీనములోనుండిన రెండునూఱుల నివర్తనముల పరిమాణముగల పొలమును సాధులయుపయోగార్థము దానముచేసెను. ఇచ్చట లిఖింపబడిన శాసనము 18వ సంవత్సరమున అనగా గుహ పూర్ణముగా నిర్మింపబడి సమర్పింపబడిన పూర్వసంవత్సరమున మొట్టమొదట ప్రకటింపబడినదిగా జెప్పబడినది. దీని దిగువను గోతమిపుత్ర శాతకర్ణియొక్క పట్టమహిషిచేత గోవర్థనమునకు పాలకుడుగా నేర్పఱుపబడిన శ్రావకుడను వానికి జేసిన యాజ్ఞరూపముగానుండెడు మఱియొక శాసనముగలదు. ఈమెకూడ రాజమాతయని పిలువబడుచున్నది. ఇదివఱకు దానముచేసిన పొలమునుగూర్చి ప్రశంసింపుచు నది నూఱునివర్తనముల పరిమాణముగలదనియు చెప్పి రాజ్యములోనిదియు, తన పిత్రార్జితమునగు మఱి నూఱునివర్తనముల భూమిని నీ శాసనము మూలముగ నామె దానము చేసెను. మొదటి శాసనము ప్రకారము రెండు వందల నివర్తనముల పొలమును దానము చేసినను అది నూఱు నివర్తనములు మాత్రమే యున్నందున కొదువ నూఱు నివర్తనముల భూమి మఱియొక పొలమునుండి యామె యిచ్చినట్లు గానుపించుచున్నది. ఈ దానముచేసిన సంవత్సరము 24 అగుటచేత మొదటిదాని తరువాత 6 సంవత్సరములకీదానము చేయబడినది. [3] ఈ పైజెప్పిన శాసనములలో మహారాజుయొక్క తల్లియనియు, మహారాజుయొక్క పితామహియనియు గోతమి పేర్కొనబడుటచేతను, గోతమిపుత్ర్త శాతకర్ణి యొక్క రాణి మహారాజుయొక్క తల్లియని పేర్కొనబడుటచేతను శాతకర్ణి గాక యా శాసనములలో బేర్కొనబడిన మఱియొక రాజు పులమాయిగా గన్పట్టుచుండుటచేత నతడు గోతమికి మనుమడుగను, శాతకర్ణి రాణియగు వాసిష్టికి బుత్రుడుగను గన్పట్టుచున్నాడు. శాతకర్ణి రెండవ శాసనములోని యధికారపత్రికను పులమాయియొక్క 18వ పాలన సంవత్సరమున నిచ్చినదగుటచేతను, ఆతని పాలనమును బేర్కొనియెడి తేదులుగల, శాసనములు, నాసిక, కార్లి పట్టణములలో మాత్రమె గాన్పించుటచేతను, అయ్యవి గోతమిపుత్రునికి సంబంధించిన తేదులు గాకపోవుటచేత తప్పక పులమాయి పాలనముయొక్క తేదులుగనున్నవి. గోతమిపుత్త్రుని మహత్కార్యములను నుదాహరించెడు పెద్ద శాసనముకూడ పులమాయి పాలన సంవత్సరమును బేర్కొనుచున్నది. ధాన్యకటకాధీశ్వరుడు గ్రామమునొకదాని భద్రాయనులకు దానము చేసినను అది వారలను దృప్తిపఱచనందున తాము మఱియొక గ్రామమును దానము చేయుచుంటినని పులమాయి చెప్పియుండుటచేత ధాన్యకటకాధీశ్వరుండు గోతమిపుత్రుడై యుండెను. గుహను సమర్పించుచున్నదని వర్తమాన కాలము దెలుపుచున్నందునప్పటికి గోతమికూడ బ్రదికియుండెననియె చెప్పవలసియున్నది. వీనినన్నిటిని పరిశోధించి చూడగా గోతమిపుత్త్ర శాతకర్ణుడు ప్రధాన రాజధానీ నగరమగు ధాన్యకటకమున పరిపాలనము సేయుచుండగా నా కాలమునందే యాతని కుమారుడును యువరాజునగు వాసిష్ఠీపుత్ర శ్రీ పులమాయి ప్రతిష్ఠాననగరమున (Paithan) రాజప్రతినిధిగానుండి పశ్చిమాంధ్రదేశమును (మహారాష్ట్రాది దేశములను) బరిపాలించుచుండెనని స్పష్టముగా బోధపడుచున్నది.

చెంకుడ్డువాన్ గోతమిపుత్ర శాతకర్ణుల మైత్రి.

ఇల్లంగో అడికాల్ అను దమిళకవి విరచితమగు చీలప్పదికారమను కావ్యమున విజయసేన కనకసేనలతో చెంకుడ్డువాన్ చేరరాజునకు గలిగిన పోరాటమునందు చేరరాజునకు దోడ్పడియెనని చెప్పబడిన మగధాధీశ్వరుండగు శాతకర్ణి యీ గోతమిపుత్ర్త శాతకర్ణుడనియె గన్పట్టుచున్నది. ఆ కాలమున నాంధ్రరాజులు మగధరాజులుగా బరిగణింపబడుచుండిరనుటకు నీ తమిళకావ్యమునందలి కథ ప్రబలసాక్ష్యముగా గన్పట్టుచున్నది. తమిలకమునకు మగధరాజ్యముత్తరపు సరిహద్దుగా బేర్కొనబడినది. ఉత్తరమున గంగాన ది మొదలుకొని దక్షిణమున గాంచీపురము వఱకునుగల దేశమంతయు నాంధ్రరాజుల వశముననున్నట్టు గన్పట్టుచున్నది. ఆంధ్రులకాలమున మగధరాజ్యమునకు రాజధాని ధాన్యకటకనగరముగానుండెను. ఆ కాలమునందు సింహళరాజగు గజబాహువునకును చేరరాజగు చెంకుడ్డువానునకును మగధరాజగు శాతకర్ణికిని విశేషమైత్రి గలిగియుండెను. అదియేమి చిత్రమోగాని యేమి సంబంధబాంధవ్యములచేతనో గాని సింహళరాజులును పాండ్యచోళచేర రాజులును ఆంధ్రరాజులును బహుశతాబ్దముల వఱకన్యోన్య మైత్రి గలిగియుండిరి. ఈ మైత్రి శివస్కందవర్ముని పరిపాలనమున భగ్నమైనట్లుగ గన్పట్టుచున్నది. ఆంధ్రరాజులు మిత్రులుగ నుండుటచేత చెంకుడ్డువాన్ చేరరాజు మృతభర్తృకయగు తన తల్లి శోణయను నామెకు గంగాస్నానమును లభింపజేయ నామెను వెంటబెట్టుకొని యాంధ్రదేశము మీదుగా బోయి కృతకృత్యుడయ్యెనని పై కావ్యమునందు వర్ణింపబడినది. కొన్ని సంవత్సరములయిన తరువాత నొకనాడు చేరరాజు తన రాణియగు వేణుమాలతో వనవిహారమునకు బోయి పెరియార్ నదిలోని యిసుకతిన్నెలపై నివసించు కాలమున పార్వతీయులు కొందఱువచ్చి "దేవా! ఎవ్వతయో యొక్క వనిత యేకస్తనయై వెంకై చెట్టునీడన విగతప్రాణియై పడియున్నది. ఆమె యుదంతమింతయు దెలియరాదు" అని విన్నవింపగా రాజు పరివారములోనుండిన "చాతాన్" అను సరసకవియా కథనెఱింగినవాడు కావున రాజునకును రాణికినిట్లు శ్రుతపఱిచెను. ఆమె కావీరిపద్దినములోని యొక వర్తకుని భార్యగానుండెను. ఆ వర్తకుడొక యాటకత్తె మోహములో జిక్కుకొని తన యైశ్వర్యమునంతను గోలుపోయి పశ్చాత్తప్తుడై పతివ్రతయగు భార్యతో మధురాపురమునకు వచ్చి భార్యకడ విలువగల యందెల జతమాత్రముండుట జూచి యొక దాని విక్రయించి యా సొమ్ముతో మరల వర్తకము ప్రారంభింపబూని భార్యకు దెలియజెప్పగా నామె సంతోషపూర్వకముగా దానినొసంగిన నదిగైకొని తన దురదృష్టముచేత నంతకుబూర్వము మధురాపుర రాజ్ఞియొక్క యందెను దొంగిలించిన స్వర్ణకారునికడకు బట్టుకొనిపోయెను. వాడు రాణియొక్క యందెను తస్కరించిన దొంగ వీడేయని వెంటనె రాజభటులకు నొప్పగించెను. అంతట వర్తకుడు నిచ్చేష్ఠితుడై వారలకు నేమియు బ్రత్యుత్తరము చెప్పలేక కొయ్యవలె నిలువంబడెను. వీనిని నిజముగా దొంగయని యనుమానించి రాజభటులు వెంటనే తలనఱికివైచి యా యందెను రాజభవనమునకు గొనిపోయిరి. ఒక గొల్లవానియింట నివసించియుండిన యామె తన భర్త రాజభటులవలన నఱికివేయబడెనని దుఃఖాబ్ధిని మునింగి కంటికి నేలకు నేకధారగా నేడ్చుచు భర్త రాణియొక్క యందెను దొంగిలించిన కారణమున నిట్లు తల నరికివేయబడెనని విని కోపోద్రేకముతో రాజసభకు బోయి తన భర్త కడనుండిన యందె తనదికాని రాణిదికాదని సహేతుకముగ ఋజువుచేసెను. నిరపరాధియైనవానికి మరణశిక్ష సంభవించెనుగదాయని మూర్ఛితుడై రాజు పడిపోయి యట్లె దీర్ఘనిద్రపోయెను. రాజు మరణమునకు జింతించుచు రాణి భర్తతో సహగమనము చేసెను. అంతట మహాపతివ్రత తన స్తనము నొకదాని కోసివేసి మధురాపురమును, రాజు భవనమును మండిపోవును గాక యని శపించి మన రాజ్యమునకు వచ్చి విగతప్రాణయై పడిపోయినది. అచ్చట మధురాపురము రాజుభవనముతో మంకిపోయినది. ఈ కథవిని రాజును రాణియు మిక్కిలి వగచి యా మహాపతివ్రతయైన వితంతువు దేవతనుబోలె బూజింపదగినదని తలంచి యేమి చేయదగునని పండితుల సలహాయడిగెను. వారు హిమాలయములోని యొక శిలతో నామె విగ్రహమును జేయించి గంగాస్నానము గావించి కొనివచ్చి యిక్కడ ప్రతిష్ఠ చేయించి పూజించుట సర్వోత్తమమైన కార్యమని సలహాచెప్పిరి. వాని మంత్రి విల్లవాన్ కొదైయనువాడు "దేవా మహాశూరుడవు; ఆర్యరాజులు నీకు శత్రువులయినను మగధరాజులయిన శాతకర్ణులు నీకు మిత్రులు కావున నీకొక దుస్సాధ్య కార్యము కానేరదు" అని ప్రోత్సాహపఱిచెను. అంతట రాజు "ఆర్యరాజులు ద్రమిళరాజులనుజూచి యపహాస్యము చేయుచుందురని యాత్రికుల వలన వినియుంటిని. వారికి గర్వభంగము కలుగునట్లుగా మనము దండెత్తిపోయి యుద్ధములో వారలనోడించి వారిచేత మన మా శిలను మోయించుకొని మన దేశమునకు దీసికొనివచ్చినప్పుడుగదా ఘనకీర్తిప్రతాపములు వెల్లడియగునది" యని పలికెను. పిమ్మట వారు తమ రాజధానియైన వంజీపురము బ్రవేశించిన తరువాత బహుసేనలంగూర్చుకొని యోడలమీద బ్రయాణముచేసి యుత్కలదేశములోని యొక రేవుపట్టణమున దిగి నీలగిరులచెంత మజిలీ యేర్పఱచుకొని నివసించియుండగా శాతకర్ణి సేనాధిపతులలోనొక్కడగు సంజయుడనువాడు నూఱుమంది యాటకత్తెలతోను రెండు వందల యెనుబదిమంది పాటకులతోడను, నూఱు రథములతోడను, పదివేల యశ్వములతోడను, ఇరువదివేల బండ్లతోడను, వేయిమంది సంరక్షక భటులతోడను వచ్చి చేరరాజును గలిసికొని వందనమాచరించి "యోరాజా! మీ మిత్రుడయిన శాతకర్ణి మహారాజు నన్ను మీ కడకు బంపెను. హిమాలయమునుండి శిలగొనివచ్చుట మీ యభిమతమేనిమేము మీకు సహాయముచేసి దానింగొని గంగాభిషేకమును గావించి తీసికొనివచ్చెదము" అని చెప్పెను. అది విని చేరరాజు సంజయునితో నిట్లనియె. "సంజయా! ద్రమిళరాజుల సత్తువ యెఱుంగలేక బాలకుమారుని కొడుకులు కనకసేన విజయసేనలను వారు నిందించుచున్నవారు. ఆ పగ దీర్చుకొనుటకై యీ సేన నడిపింపబడుచున్నది. ఈ సమాచారమును మీ శాతకర్ణునకు దెలియజేసి మహానదియగు గంగానదిమీదుగా నా సేనను గొనిపోవుటకై పడవలను పోగుచేయవలసినదిగా శ్రుతిపఱపుము" అని చెప్పి వాని సైన్యమును గొని వానిని శాతకర్ణుని కడకు బంపెను. తరువాత గొన్ని దినములకు గంగాతీరమునకు బోయి శాతకర్ణి పంపిన పడవల మీద గంగానదిని దాటి యావలియొడ్డునకు బోయినతోడనే శాతకర్ణులు స్వాగతమొసంగిరి.

ద్రమిళార్య రాజులకు యుద్ధము.

వారలకడ సెలవుగైకొని యుత్తరదేశమునకు దండెత్తిపోయి కుయిలాలువమనుచోట నార్యసోదరులగు కనకసేన, విజయసేనులను వారలకు దొడ్పడవచ్చిన ఉత్తరుడు, విచిత్రుడు, రుద్రుడు, భైరవుడు, చిత్రుడు, సింహుడు, ధానుత్తరుడు, శ్వేతుడు మొదలగు రాజుల నెదుర్కొనియెను. అచ్చట నుభయసైన్యములకు ఘోరయుద్ధముజరిగెనె. ఆ యుద్ధమునందార్యులోడిపోయిరి. కనక విజయులను సోదరులిరువురు చెంకుడ్డువానుచే బట్టుకొనబడిరి. వీరలకుండు రాజవేషములను దొలగించి సన్న్యాసులు ధరించు దుస్తుల నొసంగి కొంతసైన్యమును, మంత్రియగు విల్లవాన్ కొడైయనువానిని, వీరలతోడ హిమాలయమునకు బంపి, కావలసిన శిలను వీరలచే దెప్పించుకొని, దండయాత్రను ముగించి, గంగాతీరమునకు వచ్చి, శాతకర్ణి రాజబంధువులు సేనానులు గావించిన విందులను గుడిచి, అర్హమర్యాదలను బొంది, సంతుష్టుడై, మరలిపోయి, ముప్పది రెండు మాసములకు చేరరాజధానియగు వంజిపురమును జేరుకొనియెను. తరువాత నితడు రాజసూయయాగమును జేసెనట. [4] ఈ వృత్తాంతమును దన కావ్యమునందు జొనిపిన యిల్లంకో అడికాలను కవిని గ్రంథసన్యాసియనియు, చెంకుడ్డువానుననకు సోదరుడనియు నిదివఱకే దెలిపియుంటిమి. సమకాలీనుడగు నీ కవి వ్రాసిన యీ విషయములను బలపఱచుటకు శాసనాదులుగాని మఱియే గ్రంథ దృష్టాంతములుగాని గానరాకున్నయవి. వీనిచే జెప్పబడిన వృత్తాంతమునందతిశయోక్తులును భ్రమప్రమాద జనిత దోషములు గొన్ని కలవని యొప్పుకొన్నను ఈ విషయములన్నియు, గేవలము కల్పితములని త్రోసివేయుటకు మాత్రము ప్రబల హేతువులేవియు గన్పట్టకున్నవి. కాబట్టి గోతమిపుత్ర్త శాతకర్ణి కాలమున నాంధ్రరాజ్యము గంగాతీరము మొదలుకొని కాంచీపురము వఱకు వ్యాపించియుండెనని విశ్వసించుచున్నారు.

చస్తనుడు.

శాతకర్ణి యవనశకపహ్లవుల నిర్జించి సహపానవంశమును నిర్మూలించిన కాలమునందు చస్తనుడను క్షాత్రవుడు ఉజ్జయిని రాజధానిగ మాళవదేశమును బరిపాలింపుచుండుటను జూచి యాతడు (చస్తనుడు) శాతకర్ణిచే మాళవదేశమునకు రాజప్రతినిధిగ జేయబడెనని విన్సెంటుస్మిత్తుగారు వ్రాసియున్నారుగాని విశ్వసింపదగినదికాదు. యవనశకపహ్లవాదులను దఱిమి తఱిమి గొట్టి క్షహరాటసహపానుని వంశమునంత నిర్మూలము చేసినవాడు మరల నా సమూహములోని విదేశస్థునే పాలకుని జేసెననుట నమ్మదగినది కాదు. కోల్హాపురమునందు గన్పట్టిన నాణెములలో గొన్నిట గోతమిపుత్త్ర విలివాయకురుడను పేరు గాన్పించుటచేత నతడే గోతమిపుత్ర్త శాతకర్ణియని స్మిత్తుగారు చెప్పుచున్నారు. విలినాయకురుని పేరు పురాణములలో నుదాహరించిన యాంధ్రరాజుల నామములలో నెచ్చటను గానరాదు. ఈ విలినాయకురుడు గోతమిపుత్ర యజ్ఞశ్రీశాతకర్ణియొక్కయు, శ్రీ పులమాయి యొక్కయు ప్రతినిధియై "హిప్పోకురో" (కోల్హాపురము) మండలమును బాలించినవాడు. "బలియోకురోసు" హిప్పోకురోలో నున్నవాడని టాలెమీ యను చరిత్రకారుడు వ్రాసియున్నాడు. ఈ బలియోకురోనే విలినాయకురుడని డాక్టరు భాండార్కరు గారు చెప్పిన దానిని స్మిత్తుగారు సహా చరిత్రకారులెల్లరు నంగీకరించినారు. [5] పైఠన్ (ప్రతిష్ఠానము)లో నున్నవాడని టాలెమిచే బేర్కొనబడిన సిరోపోలిమియోసే (Siro Polimios) శ్రీ పులమాయిగా నుండెను. మఱియు నాకాలమున టియాస్తనీ (Tiasrenes)ననువాడు ఉజ్జయినిలో పాలనము సేయుచుండెనని చెప్పెను. ఈ టాలెమీ యను చరిత్రకారుడు క్రీ.శ.163వ సంవత్సరమున మరణమునొందెను. ఇతడు తన భూగోళమును 151వ సంవత్సరము తరువాత రచించెనని చెప్పుదురు. కాబట్టి టాలెమీ చెప్పిన బలియోకురోసు (Baleokuros)సిరోపోలిమియోసు తియాస్తనీసు మూవురును 151వ సంవత్సరమునకు బూర్వమువారయి యుండవలయును. ఈ బలియోకురోసు, సిరోపోలిమియోసు తండ్రియై తండ్రి హిప్పోకురోలోను తనయుడు పైఠణ్ లోను రాజ్యము చేయుచున్నవారని స్మిత్తుగారి వాదము నంగీకరించిన పక్షమున ప్రధాన రాజధానియగు ధాన్యకటకనగర మెవరిపాలు చేయవలసియుండునో బోధపడకనున్నది. సత్యమేమనగా గోతమిపుత్ర్త శాతకర్ణి ధాన్యకటకమునే రాజధానిగ జేసికొని పరిపాలించుచుండెను. వాని కాలమున బశ్చిమభాగమున పైఠణ్ (ప్రతిష్ఠానపురము) అనబడు పట్టణమునను హిప్పోకురో అని టాలెమీచే బిలువంబడిన పట్టణమునను రాజప్రతినిధులుగలరు. శాతకర్ణి కుమారుడు శ్రీపులమాయి ప్రతిష్ఠాన పురియందు రాజప్రతినిధిగనుండి మహరాష్ట్ర దేశమును బాలించుచుండెను. బలియోకురోసని టాలెమీచే బిలువంబడిన విలివాయకురుడు పులమాయి కాలమున దక్షిణమహారాష్ట్రముకు రాజప్రతినిధిగ హిప్పోకురోయనియెడి కోల్హాపురమునందుండి రాజ్యము సేయుచుండెను. టాలెమీచే బేర్కొనబడిన తియాస్తనీసు ఉజ్జయిని పాలించు చస్తనుడని భాండార్కరు, స్మిత్తు మొదలగు వారెల్లరునంగీకరించిరి.

గోతమిపుత్రుడు పన్నులు తీసివేయుట.

శకరాజులు దండెత్తి వచ్చినప్పుడు స్వదేశస్థులలో గలిసిపోయిన విదేశస్థులు కొందఱు సమయము తటస్థమైనప్పుడు తమ స్వాతంత్ర్యమును ప్రకటింప వేచియుండి స్వదేశస్థులకు బురికొల్పుకొని రాజద్రోహము తలపకుండుటకై కాబోలు శాస్త్రీయముగా విధించిన సుంకములనుగూడ గోతమిపుత్ర్త శాతకర్ణి తీసివేసెనని నాసికలోని శాసనము చాటుచున్నది. ఈతడు సహపానుని జయించి వాని రాజ్యమును స్వాధీనముజేసికొన్న తరువాత నహపానుని నాణెముల మీదనే తన నామమునుగూడ ముద్రింపించెను. మహారాష్ట్ర దేశములో దొరకిన పదునాలుగువేల నహపానుని నాణెములలోను తొమ్మిదివేల నాణెములపైన వెనుకప్రక్కను "రాణ్ణోగోతమి పుతాస సిరిశాతకానీనో" అని గోతమిపుత్త్రర శాతకర్ణి పేరు ముద్రింపబడినవిగానున్నవి. ఇతడు క్రీ.శ.154వ ప్రాంతమున మరణమునొందియుండును.

వాసిష్ఠిపుత్ర శ్రీ పులమాయి.

(క్రీ.శ.130 మొదలుకొని క్రీ.శ.154 వఱకు)
ప్రతిష్టానమునను.
(క్రీ.శ. 154 మొదలుకొని క్రీ.శ.158 వఱకు)
ధాన్యకటకమునను.

ఇతడు గోతమిపుత్ర్త శాతకర్ణికిని వాసిష్ఠిరాణికిని జనించినవాడు. శాతకర్ణి ధాన్యకటమున బరిపాలనము సేయుచుండ నీతడు యువరాజుగను రాజప్రతినిధిగను ప్రతిష్టానపట్టణము నుండి పరిపాలనము సేయుచు క్షాత్రవులతో దండ్రికి జరిగిన యుద్ధములో తండ్రితో గూడ నుండి యుద్ధములను జేసి జయధ్వజములెత్తుచు వచ్చినవాడు. తండ్రివలెనే యితడును మిక్కిలి పరాక్రమవంతుడుగానున్నాడు. ఇతనికి శాతకర్ణియను పేరులేదు. జనకుని మరణానంతరమున నితడు ధాన్యకటకమున బట్టాభిషేకము పొందినటుల గన్పట్టుచున్నది. ఇతని పేరుగల శాసనమొకటి ధాన్యకటక స్తూపమున గానంబడుచున్నది. వాసిష్ఠీపుత్రుడయిన శ్రీ పులమాయి రాజ్యము చేయుచుండగా చైత్యకీయ శాఖవారి స్వాధీనమునందుండిన బుద్ధునియొక్క మహాచైత్యమునకు గృహస్తుడయిన కహుతారయు, ఋషిలుడును, వాని భార్య నాగనికయు, వాని కొడుకులును, గలిపి ధర్మచక్రమును దానము చేసిరని చెప్పబడినది. [6] శాతవాహనులలో పులమాయియను పేరుగలవారిలో నీతడు రెండవవాడు గావున రెండవ పులమాయి యని పిలువబడుచున్నాడు.

క్షాత్రవస్వామి జయదాముని దండయాత్ర.

సౌరాష్ట్ర క్షాత్రవుల వంశము నిర్మూలము చేసి శాలివాహనులు విజృంభించి యాంధ్ర సామ్రాజ్యము నానాముఖముల విస్తరింపజేయుటకు సహింపంజాలక శాలివాహనుల విజృంభణము మాన్పినగాని తమ రాజ్యమునకు క్షేమములేదని నిశ్చయించుకొని ఉజ్జయినీపురవరాధీశ్వరుండును, మహాక్షాత్రవుడను అగు చస్తనుని కుమారుడు క్షాత్రపస్వామి జయదాముడను వాడు బహుసేనలంగూర్చుకొని ప్రతిష్ఠానముపై దండెత్తివచ్చి యా పట్టణమును ముట్టడించెను. అప్పుడు శాలివాహనులకును క్షాత్రవులకును ఘోరసంగ్రామము జరిగెను. ఆ మహాఘోర సంగ్రామమునందు నుజ్జయినీపురాధీశ్వరుండు మృతినొందినట్లు గానంబడుచున్నది. ఇట్లు శాలివాహనులు క్షాత్రవుల రణరంగమున నోడించుటయేగాక క్షాత్రప సైన్యమును మాళవదేశములోనికి దఱుముకొనిపోయి మాళవదేశములోని విశేష భాగమాక్రమించుకొనిరి. ఇట్లు కొంతకాలము చస్తనుని రాజ్యమాంధ్రుల వశమైయుండినటుల గాన్పించుచున్నది.
శాలివాహన విక్రమార్కుల గాథ.

ప్రతిష్ఠానమును బాలించుచుండిన శ్రీపులమాయి శాలివాహనుపైని, ఉజ్జయినీ పురాధీశ్వరుండయిన క్షాత్రపరాజు జయదాముడు దండెత్తి వచ్చి యుద్ధముచేసి మడిసిన చరిత్రాంశమును బురస్కరించుకొని యిటీవలివారు దెలియక క్రీస్తుశకమునకు బూర్వము రెండు శతాబ్దముల క్రిందటనున్న శాతవాహన వంశమునకు మూలపురుషుడైన శాతవాహనుడను శాలివాహనునకును, క్రీస్తు శకము 6వ శతాబ్దమునందుండి ఉజ్జయినీ నగరమును బరిపాలించుచుండిన యశోవర్మయను విక్రమార్కునకును ప్రతిష్ఠానపుర సమీపమున యుద్ధము జరిగెననియు శాలివాహనుడు యుద్ధములో విక్రమార్కుని తలద్రుంచెననియు నొకగాథను గల్పించి వారికి ముడిపెట్టిరి. ఈ గాథయే దేశదేశములందు బలురీతుల జెప్పుకొనబడుచున్నది. కథాసరిత్సాగరమున శాలివాహనుని మంత్రియగు గుణాఢ్యపండితుని జీవన వృత్తాంతము శాలివాహన జననమునకు ముడిపెట్టి గాథలు గల్పించిరి. ప్రతిష్టానమునందొక బ్రాహ్మణకన్య తన యిరువురి సోదరులతో నొక కుమ్మరివాని యింట నివసించుచుండి యొకనాడు గోదావరికి స్నానమునకు బోవుచుండగా శేషుడు చూచి యామెను మోహించి మానవరూపమునుదాల్చి యామెను కౌగిలించుకొనియెను. తరువాత కొంతకాలమున కామెకు గర్బముగలిగి శాలివాహనుడు జనించెను. వీడు కుమ్మరివానియుంట బెరుగుచుండెను. ఒకనాడు కాలికాదేవి విక్రమార్కునకు ప్రత్యక్షమై రెండేండ్ల బాలికకు జనించిన కుమారునిచే జంపబడుదువని జోస్యముచెప్పెనట! అట్టి వాడెక్కడనున్నాడోయని విక్రమార్కుడు పిశాచరాజగు బేతాళుని బంపి వెదకించెను. బేతాళుడు బాలికయైన తల్లితో నాడుకొనుచున్న శాలివాహనుని ప్రతిష్ఠానపురమునందుజూచి విక్రమార్కునికి దెలియజేసెను. అంతట విక్రమార్కుడు ప్రతిష్ఠానముపై దండెత్తి వచ్చెను. శాలివాహనుడు తన తండ్రి నాగరాజగు శేషుడు తనకుపదేశించిన మంత్రప్రభావముచేత మట్టి గుఱ్ఱములను, మట్టి యేనుగులను, మట్టి మనుష్యులనుజేసి వానికి బ్రాణప్రతిష్ఠజేసి యా సైన్యములతో విక్రమార్కుని నె దుర్కొని వానినోడించి వాని తల నఱికివైచెను. ఈ గాథలోని శాలివాహనుడే శ్రీపులమాయియనియు, విక్రమార్కుడే శ్రీ జయదాముడనియు నెఱుంగ వలయును.

ఈ పై జెప్పబడిన జయదాముని కుమారుడు రుద్రదాముడను మమాక్షాత్రపుని కూతురు దక్షమిత్రయనునామె శ్రీ పులమాయి శాలివాహనునికిచ్చి వివాహము చేయబడినదనియు, రుద్రదాముడు రెండుసారులు పులమాయిని యుద్ధములోనోడించినను అల్లుడగుటచేత వాని దేశమునాక్రమింపక విడిచిపెట్టెననియు విన్సెంటుస్మిత్తుగారు వ్రాసియున్నారు. ఇది శాసనములలో జెప్పినదానికి మఱికొన్ని చరిత్రాంశములకును విరుద్ధముగా గానంబడుచున్నది. [7]
చస్తనవంశము.

గోతమిపుత్ర శాతకర్ణుని కాలమునను అతని కుమారుడగు శ్రీపులమాయి కాలమునను ఉజ్జయినీ పురము రాజధానిగా మాళవదేశమును చస్తనుడను ఓఆత్రపుడు పరిపాలించుచుండెనని శాసనములచేతను, నాణెముల చేతను, టాలెమీయను చరిత్రకారుని వ్రాతేతను ధ్రువపడుచున్నది. చస్తనుడు స్మిత్తుగారు భావించినట్లు క్షహరాట వహపానుడను క్షాత్రపుని వంశములోని వాడుగాడు; గోతమిపుత్త్ర శాతకర్ణుడు నహపానునుండి గెల్చిన రాజ్యమునకు రాజప్రతినిధిగ జేయబడినవాడునుగాదు. ఉజ్జయినినేలు స్వతంత్రుడయిన మఱియొక క్షాత్రపరాజు. వీని కుమారుడు జయదాముడు. ఇతడే ప్రతిష్ఠానముపై దండెత్తి శ్రీపులమాయి శాలివాహనునితో యుద్ధముచేసి యోడిపోయినవాడు. వీనికొడుకు రుద్రదాముడను వాడు. వీని శాసనమొకటి జనగడలో గాన్పించుచున్నది. శక కాలము 72వ సంవత్సరమున మార్గశీర్ష బహుళ చతుర్థి నాడు సుదర్శన సరస్సుయొక్క గట్టు తెగిపోవుట మొదలగు విషయములనేకములీశాసనమునగలవు. ఈ గట్టు చంద్రగుప్త చక్రవర్తి మౌర్యుని కాలమున పుష్పగుప్తునిచేతను, అశోకవర్ధన చక్రవర్తి మౌర్యుని కాలమున తుషాష్పుడను యవనరాజు చేతను బాగుచేయించబడినదని కూడ పై శాసనమున జెప్పబడియెను. [8] "సర్వర్ణైరభిగమ్య రక్షణార్థంపతి త్వేవృతేహ" అని చెప్పియుండుటచేత మాళవదేశమునందలి సర్వవర్ణముల వారును రుద్రదాముని కడకుబోయి తమ సంరక్షణకొఱకు నాతని రాజుగ జేసిరనియు, "భ్రష్టరాజ్య ప్రతిష్ఠాపకేన" యని చెప్పియుండుటచేత భ్రష్ట (పోయిన) రాజ్యమును ప్రతిష్ఠాపించినవాడనియు, [9] మహాక్షాత్రప బిరుదమును వహించిన వాడనియు, అకరావంతి, అపరాంత, అనూప, సురాష్ట్ర మొదలగు దేశములను జయించిన వాడనియు, దక్షిణాపథ రాజగు శాతకర్ణిని రెండుమాఱులు జయించిన వాడయినను సమీప బంధుత్వము కలిగి [10] యుండుటచేతవానిని నాశముచేయలేదనియు మొదలుగాగల సంగతులెన్నియో చెప్పబడినవి. ఈ రుద్రదామునికొడుకు రుద్రసింహుడనువాడు. ఈ రుద్రసింహునికొడుకు రుద్రసేనుడనువాడు. వీని శాసనమొకటి "జాస్ దన్, అను ప్రదేశమున గానంబడుచున్నది. శకకాలము 127వ సంవత్సరము భాద్రపద బహుళ సప్తమినాడు మహాక్షాత్రప చస్తన మహారాజుయొక్క మనుమని మనుమడును, క్షాత్రపస్వామి జయదామ మహారాజుయొక్క కుమారుని మనుమడును, మహాక్షాత్రప రుద్రదామ మహారాజుయొక్క మనమడును, మహాక్షాత్రప భద్రముఖస్వామి రుద్రమహారాజుయొక్క కుమారుడునగు మహాక్షాత్రప భద్రముఖస్వామి రుద్రసేన మహారాజుయొక్క యీ చెఱువు" మొదలుగాగల విషయములు గలవు. [11]

శాలివాహనులకు క్షాత్రపులకు గల సంబంధము.

సాల్సెట్టి దీపములోని కన్హేరిస్తూపములోని 11వ శాసనమున చెలమనుగూర్చిన దానము గూర్చి భగవన్ లాల్ ఇంద్రాజీ పండితుడు "మహాక్షాత్రపుడయిన రుద్ర ×+× యొక్క కూతురును, కర్దమక రాజవంశమునందు జనించి వాసిష్టీపుత్ర శాతకర్ణి యొక్క రాణియునగు ×+× యొక్క" అని శాసనములోని కొన్ని పంక్తులను చదువుచున్నాడు. దీనింబట్టి డాక్టరు బూలరుగారు వాసిష్ఠీపుత్ర శాతకర్ణి యొక యాంధ్రరాజనియు, వాని రాణి క్షాత్రపుని కూతురనియు, కన్హేరి శాసనములోనుండిన వాసిష్ఠీపుత్ర శాతకర్ణియు, చతురపాన (చతుష్పర్ణ) వాసిష్ఠీపుత్ర శాతకర్ణియు నొక్కడేయనియు, వాని భార్య మహాక్షాత్రపుడు రుద్రునియొక్క కూతురనియు, ఆ మెయె యజ్ఞశ్రీశాతకర్ణి యొక్క తల్లియగు గోతమియనియు, కాబట్టి రుద్రదామునకు దక్షిణాపథపతితో గల సంబంధము పై జెప్పిన ప్రకారము తన యల్లుడైన చతురపానుని బట్టిగాని మనమడయిన యజ్ఞశ్రీ బట్టిగాని, యజ్ఞశ్రీ తల్లి రుద్రదామునికి సమీపబంధుత్వము కలిగియుండుటబట్టిగాని యేర్పడియుండవచ్చునని సారాంశమును దేల్చిరి. పైజెప్పిన శాసనమునుబట్టి మహాక్షాత్రపుడయిన రుద్రదామునియొక్క యల్లుడు వాసిష్టీపుత్ర శాతకర్ణియని స్పష్టమగుచుండగా వాసిష్ఠీపుత్ర పులమాయి రుద్రదాముని యల్లుడని స్మిత్తుగారు చెప్పుటకు గారణముగానరాదు. దక్షమిత్ర నహపానుని కొమార్తెయనియు, ఋషభదత్తుని భార్యయనియు నాసిక శాసనములలో గన్పట్టుచుండగా స్మిత్తుగారు దక్షమిత్ర రుద్రదాముని కూతురనియు, శ్రీ పులమాయి పట్టమహిషియని చెప్పుటకు గారణముగానరాదు. రుద్రదాముడు జయించిన దక్షిణా పథపతి శాతకర్ణిగాని మఱియొకడుగాడు. శ్రీ పులమాయికి శాతకర్ణియను పేరులేదు. రుద్రదాముని యల్లుడు గూడ శాతకర్ణియను పేరు గలిగియుండెను. అదియునుగాక శ్రీపులమాయికి రుద్రదాముని తాతయగు చస్తనుడు సమకాలీనుడని టాలెమి వ్రాయుచున్నాడుగాని రుద్రదాముడు సమకాలీనుడని వ్రాసియుండలేదు. రుద్రదాముని జనగడ శాసనములో శకనృపకాలము 72వ సంవత్సరముననని చెప్పినను ఆ సంవత్సరము చెఱువుగట్టు తెగిపోయెనని చెప్పెనేకాని తానాసంవత్సరము గుహతొలిపించి శాసనము వ్రాయించినట్లు చెప్పియుండలేదు. కాబట్టి రుద్రదాముడు శ్రీ పులమాయితోగాక వాసిష్ఠీపుత్ర చతుష్పర్ణ శాతకర్ణికిని, గోతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణికిని మాత్రము సమకాలీనుడుగానున్నవాడు. ఒకవేళ శ్రీపులమాయి వృద్ధదశలో నుండినను నుండవచ్చును. కనుక శ్రీపులమాయి రుద్రదాముని యల్లుడనియు, రుద్రదాముడు శ్రీ పులమాయిని రెండుసారులోడించెననియు, దక్షమిత్ర రుద్రదాముని కూతురనియు విన్సెంటుస్మిత్తుగారు వ్రాసినది విశ్వసింపదగినదిగా గన్పట్టదు. ఇందుకు శాసనములే ప్రబలసాక్ష్యములిచ్చుచున్నవి. శ్రీ పులమాయి కాలమున కో ల్హాపురమునందు వాసిష్టీపుత్ర విలివాయకురుడు రాజప్రతినిధిగనుండెను, వీనిపేరిటి నాణెములు కోల్హాపురమునందు గాన్పించినవి.

వాసిష్ఠీపుత్ర్త చతుష్పర్ణ శాతకర్ణి.

ఇత డే కాలమునందుండినవాడో నిశ్చయముగా దెలియరాదు. ఇతడు గోతమిపుత్త్రశాతకర్ణి యొక్క పుత్రులలో నొకడై యుండవచ్చును. ఇతడు గోతమిపుత్త్రశాతకర్ణి యొక్క పుత్రులలో నొకడై యుండవచ్చును. ఇతడు మాధారిపుత్రశకసేనుని కొడుకనియు క్రీ.శ.185 దవ సంవత్సరప్రాంతమున దక్షిణమహారాష్ట్ర దేశమును బరిపాలించుచుండెనని డాక్టరు భాండార్కరు గారు వ్రాయుచున్నారు. [12] ఈతడే మొదటి విలినాయకురు డనియు, ఈతడాఱుమాసములు మాత్రమే రాజ్యము చేసెననియు క్రీ.శ. 84 5 సంవత్సర ప్రాంతమున నుండెననియు విన్సెంటుస్మిత్తుగారు వ్రాయుచున్నారు. [13] ఇతడు రుద్రదాముని యల్లుడనియు, గోతమిపుత్త్రయజ్ఞశ్రీశాతకర్ణియొక్క తండ్రియనియు డాక్టరు బూలరుగారు వ్రాయుచున్నారు.[14] నానాఘట్టముబాటమీదను ఈ నడుమ నూతనముగా గనిపెట్టబడిన నీటితొట్టిమీద నొకశాసనము గన్పట్టెను. దానిపైన "చతరపానశాతకానివాసతి" వాసిష్ఠీపుత్త్రచతుష్పర్ణశాతకర్ణియనుపేరు యజ్ఞశ్రీశాతకర్ణునిపేరును నుదాహరింపబడియున్నవి. ఇతడు ధాన్యకటకము నందుండి యాంధ్రరాజ్యమునంతయు బరిపాలించినవాడో లేక మఱియే భాగమునకైన రాజప్రతినిధిగనుండి పరిపాలించినవాడో స్పష్టముగా దెలియరాదు.

శివశ్రీశాతకర్ణి.

(క్రీ.త 158 మొదలుకొని క్రీ.త 165 వరకు)

ఇతడును గోతమీపుత్ర శాతకర్ణికిని వాసిష్ఠి రాణికిని జనించిన వాడు . శ్రీపులమాయి సోదరుడుగ నున్నాడు. పులమాయి మరణానంతరం రాజ్యభారం వహించినట్లు గాన్పించుచున్నది. వీనిపేరిట నాణెములు కొన్ని ధరణికోట సమీపమున దొరికినవని రివరెండు థామస్సనువారు వర్ణించి యున్నారు. [15]ఇతడత్యల్ప కాలము మాత్రమే రాజ్యపాలన చేసెను. వాసిష్టీ పుత్ర చతుష్పర్ణ శాతకర్ణియె శివశ్రీ శాతకర్ణియై యుండు నేమోయని సందియము కలుగుచున్నది. భగవాన్ లాల్ పండితుడు మాధారి పుత్రశకనుడే శకసేనుడే శివశ్రీ కావచ్చునని తలంచిరి. భండార్కరు పండితుడు గూడా మొదట నట్లే తలంచిరి గాని యిటీవల నంగీకరించిన వారు కారు. థామసు గారికి ధరణి కోట సమీపమున దొరికిన నాణెములలో "శక సేనన" యని యుండక "శకశకాన" యనియుండుట చేత శివశ్రీశాతకర్ణి మాధారిపుత్ర శకసేనుడు కాజాలడని భాండార్కరు గారు వ్రాసిరి. ఇతడు శైవమతాధిక్యతను గలిగియుండిన బ్రాహ్మణమతమవలంబించినవాడుగ నుండినను బౌద్ధులను బ్రాహ్మణులను తండ్రివలెనే సమాన దృష్టితో జూచినవాడు. ఈ యాంధ్రరాజుల తల్లులు బ్రాహ్మణమత మవలంబించిన శకరాజుల యొక్కయు, పహ్లవరాజుల యొక్కయు పుత్రికలగుటచేత నాంధ్రరాజులు కూడా గడపటివారు బ్రాహ్మణ మతాభిమాను లగుచువచ్చినట్లు గన్పట్టుచున్నది.

శివస్కందుడు.

(క్రీ.త 165 మొదలుకొని క్రీ.త 172వరకు)

శివశ్రీ మరణానంతరము రాజ్యభారమును వహించినవాడు శివస్కందుడని మత్స్య విష్ణు భాగవత పురాణములు మూడును పేర్కొనుచున్నవి గాని వాయు పురాణము మాత్రము శివస్కందుని పేరు విడిచిపెట్టినది. శివస్కందుని పేరు మాత్రమెగాదు. శివశ్రీ పేరుగూడ వాయుపురాణము పేర్కొనియుండలేదు. వాయుపురాణము పేర్కొనక పోయినను శివశ్రీయును, శివస్కందుడును ధాన్యకటకము రాజధానిగా నాంధ్రరాజ్యమును బరిపాలించినది వాస్తవమేగాని శివస్కందుడు మాత్రము ధాన్యకటకమును విడిచి కాంచీపురమునుగూడ రాజధానిగ జేసికొని పరిపాలన చేసినట్లు గానంబడుచున్నది. శివస్కందుడు బ్రాహ్మణ మతమవలంబించినవాడుగ గానంబడుచున్నాడు. ఇతడు శివశ్రీయొక్క కుమారుడేమోయని సందియము కలుగుచున్నది. శివశ్రీ పేరు భాగవత పురాణము వేదశ్రీయని పేర్కొనుచున్నది. వేదశ్రీ యను పేరు నానాఘట్టము గుహలోనొక శాసనమున గానంబడుచున్నది. శివశ్రీ యనునతడే వైదిక మతమవలంబించి వేదశ్రీయను పేరుపెట్టుకొనెనేమో యోజింపవలసియున్నది. ఆ శాసనమునందు వేదశ్రీయనువాడు పవిత్రములయిన యాహుతుల గొన్నిటిని సమర్పించెనని చెప్పబడియున్నది. [16] ఈశాసనమును బరిశోధించినవారు దానిని బూర్ణముగ దెలిపియుండలేదు. విశేషభాగము శిథిలమైయున్నది. కాబట్టి వేదశ్రీయను వాడు యజ్ఞయాగాది కర్మలనాచరించెనని చెప్పదగును. శివస్కందుడు బ్రాహ్మణ మత అవలంబించుట చూడగా వేదశ్రీయొక్క తనయుడేమోనని సందియము గలుగుచున్నది. అయినను కాకపోయినను శివస్కందుడు మాత్రము మిక్కిలి బ్రాహ్మణమతాభిమానము గలవాడనుటకు సందియములేదు. ఆ కాలమునందలి శకరాజులును పహ్లవరాజులును బ్రాహ్మణమత మవలంబించుట చేతను, ప్రజాపరిపాలకులుగ నుండుట చేతను బ్రాహ్మణులు వారిని క్షత్రియులనుగా నంగీకరించి వారిని తమ స్వాధీనము జేసికొన బ్రయత్నించుచున్న కాలమగుటచేత నీరాజులందఱును బ్రాహ్మణులకు శర్మ వలెనె తమ నామములకు వర్మ యనుదానిని జేర్చుకొని యార్యక్షత్రియులమని లోకమునకు విశదపఱచుటకో యన బ్రాహ్మణమతము పట్ల విశేషాభిమానముంజూపుచు, బ్రాహ్మణ మతమును విజృంభింపజేయుచుండిరి. అటువంటి వారిలో శివస్కందుడొకడుగ గన్పట్టుచున్నాడు. ఇతడు బ్రాహ్మణులకు భూములు మొదలగునవి యొసంగి యనేక బ్రాహ్మణులను ఆంధ్రదేశమునకు రప్పించినట్లు గానంబడుచున్నది. ఇతడు మతసంస్కరణమున గ్రొత్తత్రోవను తొక్కినవాడని చెప్పవలసియున్నది. వీని మాతామహుడును, మాతులుడును, తల్లియును మొదల పహ్లవజాతికి సంబంధించినవారయి యాంధ్రులలో గలసిపోయి పల్లవులని పిలువంబడుచుండెడివారని తోచుచున్నది. ఆ కాలమునందు పల్లవనాయకు లనేకులాంధ్రులకడ దండనాధులుగను, రాజప్రతినిధులుగను, మంత్రులుగను నుండి వారలతో సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరని యాకాలపు చరిత్రమునుబట్టి మనము సులభముగా దెలిసికొనవచ్చును. ఈ కడపటి యాంధ్రరాజులలో గొందఱు పల్లవులతోడి సంబంధముచేత దాము పల్లవ వంశజులమని డంబముతో జెప్పుకొనుచుండిరి. ఆ పల్లవ వంశమునకు గౌరవము కలుగుటకై యే భరద్వాజ ఋషికో, ఏ యిక్ష్వాకునకో, ఏ సూర్యచంద్రులనో ముడిపెట్టుచుండిరి. ఆంధ్రరాజుగనుండిన శివస్కందుని గూర్చి యిచ్చట చెప్పవలసినదింతకన్న నేమియు లేదు. పల్లవరాజుగనుండిన శివస్కందునిగూర్చి మాత్రము పల్లవ వంశమును గూర్చి వ్రాయు ప్రకరణమున జర్చింపదలచి ప్రస్తుతమిట విరమించుచున్నారము.

గోతమిపుత్రయజ్ఞశ్రీశాతకర్ణుడు.

(క్రీ.శ. 172 మొదలుకొని క్రీ.శ.205 వఱకు)

బహుకాలము పరిపాలనము చేసి విశేషకీర్తిని సంపాదించిన యాంధ్రరాజులలో గోతమిపుత్ర్త యజ్ఞశ్రీ శాతకర్ణుడొకడు. వీని తల్లి గోతమి. ఈమె యుజ్జయినీ క్షాత్రపుల యింటియాడపడచు. మహాక్షాత్రపుడు రుద్రదాముని కూతురయినంగావచ్చును. అట్లయిన పక్షమున వాసిష్ఠీపుత్త్ర చతుష్పర్ణ శాతకర్ణుడు యజ్ఞశ్రీ శాతకర్ణునకు దండ్రికావలయును. ఇతడు పులమాయి, శివశ్రీ, శివస్కందుడు వరుసగా రాజలై పరిపాలనము సేయునపుడు యువరాజుగను, రాజప్రతినిధిగను ప్రతిష్ఠానముననుండి క్రీ.శ.154వ సంవత్సరము మొదలుకొని క్రీ.శ.172వ సంవత్సరము వఱకును మహారాష్ట్ర దేశమును బరిపాలించి 172వ సంవత్సరము మొదలుకొని క్రీ.శ.205వఱకును ఆంధ్రరాజ్యమునకభిషిక్తుడై పరి పాలనము చేసినట్లు గానవచ్చుచున్నది. వీని కాలమున మాళవదేశము తన స్వాతంత్ర్యమును బ్రకటించినటుల గానంబడుచున్నది. ఉజ్జయినీ క్షాత్రపులదగు అవంతిదేశమాంధ్రరాజుల పాలనము నందుండిన కాలమున రుద్రదాముడను వాడు తన పూర్వులు గోల్పోయిన రాజ్యమును మరల స్వాధీనము చేసికొనెనని విని గోతమిపుత్త్ర యజ్ఞశ్రీశాతకర్ణి వాని పైకి దండెత్తి పోయి రెండు పర్యాయములు యుద్ధము చేసియు విజయము పొందలేక స్వరాజ్యమునకు మరలిపోవలసి వచ్చెను. ఇందునుగూర్చియె రుద్రదాముడు జనగడ శాసనములో దక్షిణా పథపతియైన శాతకర్ణిని రెండుమాఱు లోడించితిననియు, దూరముచేతను, బంధుత్వముచేతను వాని దేశములోనికి దఱుముకొని పోవక నాశము చేయక విడిచిపెట్టవలసిన వాడనైతినని చెప్పుకొనియెను. ఈ బంధుత్వము కూతురు బిడ్డయగుటచేతనే యని తోచుచున్నది. రుద్రదాముని కాలము నిర్ణయించునపుడు పాశ్చాత్యపండితులు భిన్నాభిప్రాయులై యెవరికి దోచిన రీతిని వారు చెప్పియుండిరి. కాబట్టి శాతకర్ణికిని రుద్రదామునకును జరిగిన యుద్ధముల కాలమును దెలిసికొనుట మిక్కిలి కష్టసాధ్యముగనున్నది. క్రీ.పూ.89వ సంవత్సరమున జరిగియుండునని లాసన్ గారు చెప్పుచున్నారు. [17] అది యిదియని నిశ్చయపఱచలేక సంకోచముతో ప్రిన్సెప్ గారు క్రీ.పూ.189వ సంవత్సరమయి యుండునని యూహించుచున్నారు. డాక్టరు భావుదాజీ గారు క్రీ.శ. 200లని భావించుచున్నారు. [18] క్షాత్రపరాజుల నాణెములను గూర్చి వ్రాయుచు న్యూటనుగారు రుద్రదాముని క్రీ.శ.40-45 సంవత్సరములలో నిలిపినారు. [19] ఈ కాలమును రివరెండు థామస్సనువారామోదించుచున్నారు.[20] ఈ శాసనమును ప్రిన్సెప్, విల్సన్, ఎజిలింగ్, భగవన్ లాల్ ఇంద్రాజి, డాక్టరు బూలరు మొదలగువారనేకులు భాషాంతరీకరించి, ప్రకటించియున్నారు. [21] రుద్రదాముడు 72వ సంవ త్సరమున సుదర్శన సరస్సుయొక్క గట్టు తెగిపోయెనని తన శాసనమునందు జెప్పియుండుటచేత నా సంవత్సరము శకకాల సంవత్సరమయి యుండును. కనుక నయ్యది క్రీస్తు శక కాలము 150దవ సంవత్సరముగా నుండెననియు, అయ్యది చెఱువు కట్ట తెగిపోయిన సంవత్సరమని మాత్రమె చెప్పియుండుటచేత నా శాసనమాసంవత్సరము వ్రాయబడినది కాదనియు, అందలి విషయములంతకు బూర్వము జరిగినవి కావనియు, డాక్టరు భాండార్కరుగారు చెప్పెడు హేతువులే సరియైనవయిన పక్షమున రుద్రదాముడు జయించినది గోతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణియనియె చెప్పదగునుగాని లేనియెడ రుద్రదామునిచే జయింపబడినవాడు వాసిష్ఠిపుత్త్ర చతుష్పర్ణ శాతకర్ణియై యుండవచ్చునని భావించుచున్నారము. ఈ గోతమి పుత్త్ర యజ్ఞ శ్రీ శాతకర్ణి పేరుగల శాసనములు నాసిక, కార్లి, చినగంజాము మొదలగు ప్రదేశములందు గానంబడుటచేత నీతనికాలమున గూడ నాంధ్రరాజ్యము బహుదూరము వ్యాపించియున్నదని విశ్వసింపవచ్చును. ఈతడును మొదటి గోతమిపుత్త్రుని వలెనె మిక్కిలి పరాక్రమముగలవాడుగా నుండెను. అతని వలెనె యీతడును బౌద్ధబ్రాహ్మణ మతముల రెంటియందును సమానాదరము గలవాడుగ నుండి విఖ్యాతి గాంచినవాడుగ గన్పట్టుచున్నాడు. బుద్ధుని తరువాత బౌద్ధమతాచార్యులలో సుప్రసిద్ధుడయిన నాగార్జునాచార్యులీ యజ్ఞశ్రీశాతకర్ణి కాలముననున్నట్లు గాన్పించుచున్నది.

శ్రీశైల బౌద్ధసంఘారామ నిర్మాణము.

ఏడవ శతాబ్ద మధ్యమున హిందూదేశమునందలి బౌద్ధ మతస్థితిని దెలిసికొనగోరి చీనాదేశపు యాత్రికుడగు హౌనుత్సాంగు హిందూదేశమును జూడవచ్చి కొంతకాలము దేశయాత్రలు చేసి వెడలిపోయి వ్రాసిన హిందూదేశ యాత్రా చరిత్రమునందు దక్షిణ కోసల వృత్తాంతమును దెలిపిన వెనుక కోసలము నకు నాగ్నేయమూల నరువది మైళ్ళ దూరమున పో -లో-మో-లో-కీ-లీ. (Po-lo-mo-lo-ki-li)పర్వతము మీద బూర్వకాలమున బౌద్ధమతాచార్యుడగు నాగార్జునాచార్యుని కొఱకు సో,తో, ఫో, హో (So-to-pho-ho) అను రాజు బౌద్ధసంఘారామము నొకదాని నిర్మించెనని చెప్పియుండెను. ఏకాంత ప్రదేశమున నుండిన యీ పర్వత శిఖరము తక్కిన వానికంటె మిక్కిలి యున్నతమైనదిగను, నడుమ నడుమ గనుమ లేవియును లేక యొక్కటే ఱాయితో గూడుకొని మిక్కిలి యేటవాలుగ నుండు గట్లను గలిగియున్నది. ఏ వింత వృత్తాంతము దెలియవచ్చినను తాను స్వయముగా బోయి చూడకయె సులభముగా విశ్వసించునట్టివాడగుటచేత నీ యాత్రికుడు చెప్పినమాటలను బట్టి వ్రాసినదానియందతిశయోక్తి మెండుగా గన్పట్టక మానదు. రాజు పెద్ద ఱాతి బండ నడుమనుండి సొరంగమును త్రవ్వించి త్రోవగల్పించెననియు, దాని క్రిందనుండి మేము చూచినపుడు నిట్రముగానుండి యెత్తైన యా కొండ పొడవునను సొరంగములను జూచితిమనియు, క్రింది నడుచుట కనుకూలముగ గుహలతో గూడిన వసారాలును పైన గోపురములను గలిగి, యైదంతస్తుల కట్టడము గలదనియు, ఒక్కొక్క యంతస్తులో విహారములతో జుట్టుకొనబడిన నాలుగేసి పడసాలలు (చావళ్ళు) గలవనియు జెప్పుచున్నాడు. మఱియును పేరు నల్లని శిఖరమని దెలుపుచున్నదని కూడ తెలియజేయుచున్నాడు. అయిదవ శతాబ్దారంబమునందుండిన ఫాహియాన్ అను చీనా దేశస్థుడయిన యాత్రికుడు కాశీ నగరము నందుండినపుడీ ప్రదేశమునుగూర్చి విని యింతకంటెను వింతయైన వృత్తాంతమును దెలుపుచున్నాడు. అతడు దానిని పో-లో-యు (po-lo-yu) అని పిలుచుచు పారావతమఠమని యర్థము చెప్పుచున్నాడు. హౌనుత్సాంగు వాడిన "పో-లో-మో-లో-కి-లి" అను పేరు జూలియన్ చెప్పిన ప్రకారము పరమాలగిరి లేక పరబరాగిరియని గాని బీల్ చెప్పిన ప్రకారము బ్రహ్మరాగిరియని గాని యర్థమగును గాని యివి యేవియును చీనా యాత్రికులిరువురు చెప్పెడి వర్ణక్రమములతో పారావతమని స్థల నిర్దేశము చేయుటకు దోడ్పడజాలకున్నవి. పారావతమను పేరే నిజమైనదేమో? ఈ పారావతమఠమునకే నాగార్జు నాచార్యులు బౌద్ధభిక్షువులను సన్న్యాసులను దానిలో నివసించుటకు రప్పించి వారి యుపయోగార్థము ధర్మశాస్త్ర గ్రంథములన్నిటిని వ్యాఖ్యానములతో సహా దెప్పించి యొక మహాభాండారము నేర్పాటుచేసెనని చెప్పుదురు. అతడు (నాగార్జునుడు) ద్యాపలగిరి (Dyapalagiri) అనగా శ్రీపర్వతమునందు నిర్వాణముజెందెనని త్రివిష్టపదేశ గ్రంథములు (Tibetan Works)చెప్పుచున్నవి. శ్రీపర్వతము తప్పక యీ శ్రీశైలపర్వతమునకే యన్వయించుచున్నది. అచ్చటి బ్రాహ్మణులకును బౌద్ధులకును గలహములు జనించి కొంతకాలమునకు బ్రాహ్మణులను వెడలగొట్టించి యా బౌద్ధవిహారమును స్వాధీనముజేసికొనిరని గూడ హౌనుత్సాంగు చెప్పియున్నాడు. ఫర్గ్యూసను గారూహించినట్లు కోసలమునకు వైరగడా రాజధానియై హౌనుత్సాంగు చెప్పిన యరువది మైళ్ళ దూరము (30oli) రాజధానినుండియె కొలిచినయెడల నీ మఠముయొక్క ప్రదేశము చాందాకు నాగ్నేయమూలను మాణిక్యదుర్గమునకును, వరదా నదికిని సమీపస్థలమై యుండవలయును. ఫర్గ్యూసనుగారు "భాండక్" అను పట్టణసమీపమునందలి "వింధ్యసాని" పర్వతమే హౌనుత్సాంగు చెప్పిన పర్వతమని చెప్పుచున్నారుగాని యీ పర్వతము ప్రాచీనగుహలను గొన్నిటిని గలిగియున్నను అతడు వర్ణించిన వర్ణనకు సరిపోవుచుండలేదు. కాని శ్రీపర్వతమనునది కృష్ణానదికానుకొని పైని వ్రేలాడుచుండి మల్లికార్జునుడను శివునియాలయముగలిగి ప్రసిద్ధికెక్కిన బ్రాహ్మణ యాత్రాస్థలములలో నొక్కటిగ నుండిన యెత్తైన కొండయెగాని మఱియొకటికాదు. ఈ శ్రీపర్వతమే శ్రీశైలమను మఱియొక పర్యాయపదముతో వాడుకొనబడుచున్నది. శ్రీశైలము ద్వాదశ శివలింగక్షేత్రములలో సుప్రసిద్ధమైనది. ఇది ధాన్యకటకమునకు (ధరణికోట) 102మైళ్ళ దూరమునను, (W.S.W.)కందనోలుకు(Kurnool)82మైళ్ళ దూరమునను(E.N.E)నున్నది. ఇది మాణిక్యదుర్గమునకు దక్షిణముగా 250 మైళ్ళ దూరమునననగా కోసలదేశమునకు బహుదూరమున నున్నమాట వాస్తవమేయైనను హౌనుత్సాంగు స్వయముగా జూడక యితరులు చెప్పిన మాటలనుబట్టి వ్రాసినదిగావున స్థాననిర్ణయమునుజేసి దూరమును జెప్పుటలో నిశ్చయముగా బొరపడి యుండవచ్చును. ఆ చెప్పిన దూరపరిమాణము, స్యెంఠోకియా (కోసలము)(-Sh-yen-toh-kia) యొక్క రాజధానినుండియో, లేక కోసలముయొక్క సరిహద్దు నుండియో నిర్ణయించుటకుగూడ నతని వాక్యము సందిగ్ధముగా గన్పట్టుచున్నది. చీనాయాత్రికులిరువురు వ్రాసిన స్థల చరిత్ర వర్ణనలు శ్రీశైలముమీది శివాలయమున కన్వయించుచున్నవి. శ్రీశైలమునకు శ్రీపర్వతమని సంస్కృతభాషా గ్రంథములయందు దఱచుగా వాడబడియున్నది. శ్రీపర్వతమను పేరు టిబెట్ గ్రంథములయందు గానంబడుచున్నది. శ్రీశైలశివాలయము ప్రాచీనమైనదని చెప్పెడు గాథలనుగూడ దీనిని బలపఱచుచున్నవి. ఎన్నివిధములచేత జూచినను చీనాదేశపు యాత్రికులిరువురి యొక్క వర్ణనలు దీనికేయన్వయించుచున్నవి గనుక మన యజ్ఞశ్రీశాతకర్ణి నాగార్జునునికొఱకు నిర్మించిన బౌద్ధసంఘారామమిదియే యని మఱియొక మాఱు పేర్కొనుచున్నారము.

నాగార్జునాచార్యుడు.

(క్రీ.శ. 134 మొదలుకొని క్రీ.శ.200 వఱకు)

సింహళ ద్వీపములోని అనూరాధపురమునందలి రాన్వెల్లిదాగాబా ప్రతిష్ఠాపనోత్సవమునకు కాశ్మీరము, కాబూల్, హిందూదేశముయొక్క వివిధభాగములనుండియు 18800 మంది భక్తులు వెళ్ళియుండగా మహదేవమహర్షి పల్లవుల దేశములనుండి 460000 మంది భక్తులను వెంటగొనిపోయియుండెనని యైదవ శతాబ్దమునందు రచింపబడిన మహావంశమను బౌద్ధుల చరిత్రమునందు వ్రాయబడినది. ఇందలి సంఖ్య నమ్మదగినది కాకపోయినను హిందూదేశములో నేభాగముకంటెను హిందు ద్వీపకల్పముయొక్క తూర్పు భాగమునందు బౌద్ధమతము పూర్వకాలమున వర్ధిల్లుచుండెనని విశ్వసించుటకు మాత్రమవకాశమిచ్చుచున్నది. బౌద్ధమతాచార్యుడగు నాగార్జునునకు పోషకుడు (దానపతి) గా నుండి తన రాణియొక్క తంత్రమునకు వశుడైయామె యొక్క కొడుకు సుశక్తియనువానికి సింహాసనమును కట్టబెట్టుటకై ప్రయత్నించి తనయాచార్యుడైన నాగార్జునుడు మరణమునొందిన కాలముననే మరణమునొందిన రాజు సోతో - పో -హా - నా (so-to-pho-hatt-na)అనగా శాద్వహన వంశములోని వాడనియు, స్యెంతోకియాయని (sh-yen-toh-kia)పిలువబడుచుండెననియు, మఱియక చీనాయాత్రికుడగు "ఈచింగ్"అనునతడు నుడువుచున్నాడు. క్రీస్తు శకము 431వ సంవత్సరమునందుండి నాగార్జునాచార్యుని సుహృల్లేఖకు సంస్కృత భాషాంతరీకరణము గావించిన గుణవర్మయను నాతడు వానిని శ్యాంథోకియా యనియె పిలిచెను. చీనాదేశస్థులు సంస్కృతనామములను భాషాంతరీకరించునపుడు వారివారి యిష్టానుసారము పోవుచు వచ్చిరిగాని యొకదారిని పోయియుండలేదు. ఆంధ్రరాజుల వంశము శాద్వహనవంశము కాదనియు శాతవాహన వంశమనియు మనమెఱుగుదుము. విదేశీయుల యుచ్ఛారణలయందిట్టి మార్పులు గానంబడుచుండుట యొక క్రొత్తవిషయముకాదు. మన పేరులను విదేశీయులును విదేశీయుల పేరులను మనమును తప్పుగా నుచ్ఛరించుచునేయున్నారము. శ్యంఠోకియా లేక శాంథోకియా యను నామమునకు భాషాంతరీకరణముగానరాదు. తిబెటీయ గ్రంథములయందతడు "బ్డె-బైడ్"అని పిలువబడుచున్నాడు. అనగా శంకరుడని సంస్కృతభాషాంతరీకరణము చేయబడియెను. సుఖమును గలుగజేయువాడు శంకరుడనియర్థము. ఉదయనుడని యతడు పిలువంబడుచుండెననియు, యౌవనమున నాతడు జేతకుడనికూడ పిలువంబడుచుండెననియు, తారానాథుడు చెప్పుచున్నాడు. ఈ పేరులెంత మాత్రమును శాంథోకియాయను పేరునకు సరిపోయియుండలేదు. శాతవాహన వంశము లేక అంతివాహనవంశమని వాని వంశనామమును తారానాథుడు పేర్కొనుచున్నాడు. ఈ పైనుదాహరింపబడిన దానింబట్టి చూడగా నీతడు కడపటి యాంధ్రరాజులలో వాడైయుండుననియు, నాసిక కన్హేరి శాసనములలోని శ్రీయజ్ఞశాతకర్ణియే యై యుండవచ్చుననియు మనమూహించి నిశ్చయింపవచ్చును. ఇతడు రెండవ శతాబ్దాంతమునను మూడవ శతాబ్ద ప్రారంభమునను ఆంధ్రరాజ్యమును బరిపాలించుచుండెనని మనము దెలిసికొనుచున్నారము. నాగార్జునుడు కూడ నీ కాలమునందే యున్నవాడు. ఇంకొకరీతిగ నాగార్జునుని కాలమును నిర్ణయింపవచ్చును. తిబేటీయ గ్రంథములలో రెండవ బౌద్ధసభను గూర్చి యేమియు వ్రాయబడియుండలేదు. మఱియును అశోకుని కాలమునకు (క్రీ.పూ.240) బూర్వము 100 సంవత్సరముల క్రిందటనే బుద్ధ నిర్వాణము చెప్పబడియున్నది. కనుక శకరాజయిన కనిష్కుని బౌద్ధసభ బుద్ధ నిర్వాణమునకు దరువాత 400 సంవత్సరములకు జరిగినదని పేర్కొనుచున్నది. ఈ కాలనిర్ణయమునే హౌనుత్సాంగు తన గ్రంథమనందనుసరించియున్నవాడు. బుద్ధనిర్వాణమునకు నాలుగు వందల సంవత్సరముల వెనుక జెప్పబడిన కనిష్కుడను రాజు క్రీస్తు శకము 78-100 సంవత్సరముల ప్రాంతముననున్నవాడని సామాన్యముగా నందఱిచేత నంగీకరింపబడియెను. బౌద్ధుల ప్రధాన గురువగు పార్శ్వకుడు బౌద్ధ సభకధ్యక్షుడుగా నున్నందున కనిష్కునకు సమకాలీనుడైయుండెను. పార్శ్వకుని తరువాత నాచార్యపీఠము నెక్కినవా డశ్వఘోషుడు. నాగార్జునుడు నాల్గవ వాడు. దీనింబట్టి నాగార్జునుడు రెండవ శతాబ్దాంతమునున్నట్లు చెప్పవచ్చును. బుద్ధనిర్వాణమునకు 500 సంవత్సరముల వెనుక నాగార్జునుడున్నట్లు కొన్ని చరిత్రములు చాటుచున్నవి. టిబెట్ దేశ చరిత్రమును వ్రాసిన తారానాథుడు క్రీ.శ.180-220లకు నడుమ నాగార్జునుడున్నవాడని కాలనిర్ణయము చేయుచున్నాడు. కాబట్టి గోతమిపుత్ర్త యజ్ఞశ్రీ కాలమున నాగార్జునాచార్యుడున్నవాడని చెప్పవచ్చును. వీని పేరుగల నాణెములయందు "ఓడ " చిత్రింపబడియుండుటచేత నీతని కాలమున నోడలను గూర్చియు సముద్రమును గూర్చియు నావికాయాత్రను గూర్చియు జ్ఞానమును ప్రజలు గలిగియున్నారనియు, సుమత్రా, జావా, బోర్నియో మొదలగు ద్వీపాంతరములతోడను, చీనా, బర్మాదేశములతోడను, సింహళ ద్వీపమ తోడను, విశేష వర్తక వ్యాపారము జరుగుచున్నట్లుగ నూహింపబడుచున్నది. ఆంధ్రరాజులలో విశేషకాలము రాజ్యపాలనము చేసినవారిలో నీతడొకడుగా గన్పట్టుచున్నాడు. వీని వెనుక నాంధ్రరాజ్యము బహుకాలము నిలిచియుండలేదు. రాజవంశము పలుశాఖలుగ జీలిపోవుటవలనను, రాజ్యభారమును వహించినవారు బలహీనులగుట వలనను వీని తరువాత నాంధ్రరాజ్యమంతః కలహములచే నంతరించి పోయినది.

మాధారి పుత్ర శకసేనుడు.

(క్రీ.శ.180)

ఈతడు పశ్చిమాంధ్ర దేశమగు మహారాష్ట్రదేశమును బరిపాలనము చేసినట్లు గనంబడుచున్నది గాని పూర్వాంధ్ర దేశమున బరిపాలనము చేసినట్లుగానరాదు. కోల్హాపుర నాణెములయందును కన్హేరి శాసనము నందును వీని పేరు గానంబడుచున్నది. కొన్ని నాణెములయందొక ప్రక్క గోతమిపుత్రుని పేరును మఱియొక ప్రక్కను మాధారిపుత్త్రుని పేరును గన్పట్టుచుండుటచేత గోతమిపుత్త్ర యజ్ఞశ్రీ శాతకర్ణికంటె ముందుగ మాధారి పుత్తుడె రాజ్యపాలనము చేసెనని రివరెండు థామస్ గారు తలంచుచున్నారు గాని మాధారిపుత్రుడే వెనుకనున్నట్టు నాణెములయొక్క ముద్రణమె చాటుచున్నదని భాండార్కరుగారు నుడువుచున్నారు. మఱియును భాండార్కరుగారు మాధారిపుత్త్రుడు గోతమిపుత్త్రుని శాఖలోని వాడు కాడనియు మఱియొక కల్పితమైన శాఖలోని వాడయియుండుననియుగూడ వ్రాయుచున్నారు. వీని కాలమున కోల్హాపుర మండలమున శివలకురుడను వాడు రాజప్రతినిధిగనుండెను.

విజయశ్రీ శాతకర్ణి.

కలహములచే నంతరించి పోయినది.
(క్రీ.శ.202 మొదలుకొని క్రీ.శ.208 వఱకు)

ఈ విజయశ్రీ శాతకర్ణికాలమున విజయవాడ పట్టణము గట్టబడినదిగ నూహింపబడుచున్నది.

చంద్రశ్రీ శాతకర్ణి.

(క్రీ.శ.208 మొదలుకొని క్రీ.శ.211 వఱకు)

వీని పేరుగల సీసపు నాణెములు గొన్ని గానంబడినవి.

పులమావి.

(క్రీ.శ.211 మొదలుకొని క్రీ.శ.218 వఱకు)

ఈ పై నుదాహరింపబడిన యాంధ్రరాజులనుగూర్చి మన కేమియును దెలియరాదు. వీరు మాత్రము పురాణములలో బేర్కొనబడినవారు. అయినను పెక్కండ్రు రాజుల పేరులు వినవచ్చుచున్నవి గాని వారల చారిత్రము వినబడదు.

పార్వతీయాంధ్రులు.

ఆంధ్రభృత్యవంశము నశించిన వెనుక నా వంశములోని మఱియొక శాఖ వారయన యేడుగురాంధ్రులు రాజ్యభారమును వహించి పరిపాలింతురని సూచించెడి "ఆంధ్రాణాం సంస్థితా(తే?) రాజ్యేతేషాం భృత్యాన్వయోనృపాః సప్తైనాంధ్రా భవిష్యంతి."అను వాక్యము మత్స్యపురాణమునందు గానంబడుచున్నది. ఇటువంటి శ్లోకము వాయుపురాణమున సహితము గానంబడుచున్నది గాని యా భాసముగానున్నది. మాధారి పుత్త్ర శకసేనుడా శాఖలోనివాడేమో?

మాధారిపుత్ర్త పురుషదత్తుడు.

వీనిపేరుగల శాసనమొకటి కృష్ణామండలములోని జగ్గయ్యపేట స్తూపమునందు గానంబడుచున్నది. [22] ప్రసిద్ధికెక్కిన యిక్ష్వాక వీరుడును మాధారయొక్క పుత్రుడునగు పురుషదత్తునియొక్క 21వ పరిపాలన సంవత్సరమున వర్షఋతువుయొక్క యెనిమిదవ పక్షమున దశమినాడు మహాకాండూర గ్రామనివాసీయును కమ్మకరాఠ విషయమున నడాతూర గ్రామవాసియగు నాగచంద్రునియొక్క కుమారుడును, ఆవేశనియునగు సిద్ధార్థుడు తన తల్లి నాగలానితోడను, తన భార్య సముద్రాణితోడను, కుమారుడు మూలశ్రీతోడను, కుమారిక నాగబంధునిక తోడను, సోదరుడు బుద్ధనికుని తోడను, వాని భార్య తోడను, వారి యిరువురు పుత్త్రులగు నాగశ్రీ, చంద్రశ్రీ తోడను, సిద్థార్థినికయొక్క కూతురితోడను వేలగిరి గ్రామమునందుండిన రక్తబంధువులతోడను, మిత్రులతోడను గలిసి బుద్ధుని చైత్యము యొక్క ప్రాక్ద్వారము సమీపమున ప్రాణికోటి యొక్క క్షేమము నిమిత్తము ఆయకస్తంభముల నైందింటి నిర్మించి దానము చేసెనని చెప్పబడియున్నది. ఈ మాదారిపుత్త్ర పురుషదత్తుడును ఇక్ష్వాకు వంశజుడని చెప్పబడియున్నను సంకర సంతానకోటిలోని వాడేయని చెప్పవచ్చును. ఈ శాసనమునందు కమ్మకరాఠ విషయము పేర్కొనబడినది. రాఠయనగా రాష్ట్రము; కమ్మకరాష్ట్రము-జగ్గయ్యపేటకు బడమట నిజాము రాజ్యములో కమ్మమెట్టు గ్రామము కలదు. దాని చుట్టునుండు ప్రదేశమునకే కమ్మకరాష్ట్రమని పేరు గలిగియుండచ్చును గనుక నీ మాధారిపుత్త్ర పురుషదత్తుడాంధ్ర భృత్యవంశానంతరము స్వతంత్రుడై కొంత భాగమాక్రమించుకొని పాలించుచుండిన పల్లవుడైయుండవచ్చును.

చరిత్రము తెలియంబడని యాంధ్రరాజులు -ఆనందుడు.

గోతమిపుత్త్ర శాతకర్ణి పరిపాలన కాలమున వాసిష్ఠీ కుమారుడయిన యానందుడనువాడు సాంచితోపుయొక్క దక్షిణద్వారము మీదనేదోదానము చేసినట్లుగ వ్రాయబడియున్నది. ఈతడు గోతమిపుత్త్ర శాతకర్ణియొక్క కడగొట్టు కొడుకని జనరల్ కన్నిహ్యామ్ గారు వ్రాయుచున్నారు.

హరితిపుత్త్ర శాతకర్ణి.

వీని పేరు బనవాసిలోని శాసనమునందు గానంబడుచున్నది. వాని వంశము పేరు సందిగ్ధముగనున్నది గాని స్పష్టముగ దెలియుచుండలేదు.[23] [24]
ఆంధ్రభృత్యవంశము
వాయు, మత్స్య. విష్ణు. భాగవత.
నామములు పరిపాలించిన సం.ల సంఖ్య నామములు పరిపాలించిన సం.ల సంఖ్య నామములు నామములు
సింధుకుడు 23 శ్రీశుకుడు 23 శ్రీప్రకుడు పేరుచెప్పలేదు.
కృష్ణుడు 10 కృష్ణుడు 11 కృష్ణుడు కృష్ణుడు
మల్లకర్ణి 10-11 శ్రీశాతకర్ణి శాంతకర్ణుడు
పూర్ణోత్సంగుడు 18 పూర్ణోత్సంగుడు పౌర్ణమాస్యుడు
స్కంద స్తంబి 18
శాతకర్ణి 56 శాతకర్ణి 56
లంబోదరుడు 18 లంబోదరుడు లంబోదరుడు
ఆప్త్లవుడు 12 అపీతకుడు 12 ఇవిలకుడు హివిలకుడు
మేఘస్వాతి 18 మేఘస్వాతి మేఘస్వాతి
స్వాతి 18
స్కందస్వాతి 7
మృగేంద్రస్వాతికర్ణ 3
కుందలస్వాతి 8
స్వాతికర్ణ 1
పతిమావి 14 పులమావి 36 పటుమతి అటమానుడు
నెమికృష్ణుడు 25 గౌరకృష్ణుడు లేక నౌరి కృష్ణుడు 25 అరిష్ఠకర్మ అనిష్ఠకర్మ హాలేయుడు
హాలుడు 1 హాలుడు 5 హాలుడు
సప్తకుడు లేక మండలకుడు 5 మండలకుడు పట్టాలకుడు తాళకుడు
పురీకసేనుడు 21 పురీంద్రసేనుడు 1 ప్రవీలసేనుడు పురుషభీరు
శాతకర్ణి 1 సుందరస్వాతికర్ణుడు 1 సుందరుడు సునందనుడు
చకోరశాతకర్ణి 6 మాస చకోరస్వాతికర్ణుడు 6 మాస చకోర చకోర
శివస్వాతి 28 శివస్వాతి శివస్వాతి శివస్వాతి
గోతుమపుత్రుడు 21 గోతుమపుత్రుడు 21 గోతమిపుత్ర గోతమిపుత్ర
పులమాయి 28 పులిమతి పురిమానుడు
శివశ్రీ 7 శివశ్రీ వేదశ్రీ
శివస్కందుడు 7 శివస్కందుడు శివస్కందుడు
యజ్ఞశ్రీశాతకర్ణి 27 యజ్ఞశ్రీశాతకర్ణి 27 యజ్ఞశ్రీ యజ్ఞశ్రీ
విజయుడు 6 విజయ 6 విజయ విజయ
దండశ్రీశాతకర్ణి 3 'చంద్రశ్రీశాతకర్ణి 10 చంద్రశ్రీ చంద్రవిజ్ఞుడు
పులమావి 7 పులోమవిత్తు పులోమర్చిస్సు సులోమధి
  1. No.26. Nasik Inscriptions Arch Surv W.Ind.No.10.
  2. No.27. Ibid.,
  3. No. 25. Nasik Inscriptions, Arch surv, W.Ind No. 10.
  4. The Tamils : Eighteen Hundred years Ago. pp.91-98.
  5. Dr.Bhandarkar's Early History of Dekhan ., pp.20, 21, 22, 23. The Indian Review, Vol.X., no.6. Dr.Bhandarkar's article, June 1909.
  6. Dr. Burgess; Buddhistic stupas of Amarawati. p.100 plate VLI No.1 (Amarawati inscriptions.)
  7. పురాణములలోనీయబడిన యాంధ్రరాజుల పేరులను వారు పాలించినకాలమును బరస్పర విరుద్ధములుగ నుండుటచేత, పురాణములలోనుదాహరింపబడిన పేరులు కొన్ని శాసనాదులలో గాన్పింపకుండుటచేతను, మఱికొన్ని పేరులు మార్పులతో గన్పట్టుట చేతను, కొన్ని స్థలములందు పురాణములలో నుదాహరించిన కాలమును, శాసనములలోనుదాహరించిన కాలమును సరిపోకపోవుటచేతను, కడపటి యాంధ్ర రాజులు శాతకర్ణియను శబ్దమును సామాన్యముగా దమ నామముల కడను జేర్చుకొనియుండుటచేతను, కొందఱు గోతమి, వాసిష్ఠి, మాధారి, హారితియని తల్లుల నామములను తమ నామములకు ముందుజేర్చుకొని పిలుపించుకొనుచుండిన వారగుటచేతను, కొందఱు తండ్రుల కాలముననే యువరాజులుగను, రాజప్రతినిధులుగను నుండి వేఱ్వేరు దేశములను బాలించినవారుగ నుండి యుండుటచేతను కాలనిర్ణయము జేయుటకు బ్రహ్మముడివలె నుండి పాశ్చాత్యపండితులకు హైందవ పండితులకు గూడ స్వాధీనముగాక నవ్వులపాలు చేయుచుండెను. ఈ బ్రహ్మముడిలోని చిక్కును దీయుటకు మాఱుగా కొందఱు పాశ్చాత్య పండితులు క్రొత్తచిక్కులను గల్పించి మరింత దుస్సాధ్యమగునట్లు గావించిరి. కనుక సరియైన కాలనిర్ణయము చేయుటకిదివఱకు దొరకిన సాధనములబట్టి యెవ్వరికిని సాధ్యపడదు.
  8. Arch Rep 1874-75, p.129. Indian Antiquary, 1878 (Vol.vii) p.26, p.261, 269.
  9. "భ్రష్టరాజ ప్రతిష్ఠాపకేన"యని భగవన్ లాలను పండితుడు 'ఇండియన్ అంటిక్వేరి' యను గ్రంథము 7వ సంపుటమున వ్రాసియున్నాడు గాని ఆ దిగువను జేర్చిన వ్యాఖ్యానములో రాజయనుదానిని రాజ్యయని చదువుట సరియైన పాఠమని డాక్టరు బూలరుగారు చెప్పిరి.
  10. "సంబంధావదూరయ" యనుదానిని "సంబంధావదూరతయ"యని వ్రాయుట మంచిదని చెప్పి శాతకర్ణి దేశము దూరమగుటచేత రుద్రదాముడు విడిచిపెట్టెనని భాండార్కరుగారు తలంచుచున్నారు.
  11. Dr.Bhau Daji Journal, Bombay Branch Roy, As Soc Vol.viii., p.235
  12. Early History of Deckhan, section vi
  13. Early History of India p.197
  14. Burgess reports;Kanheri Inscriptions no.11.Numismata orientalia p.24
  15. The Indian Antiquary Vol.IX., p.64.
  16. J.R.A.S.Vol.V., p.287; Jour, Bom, Branch Roy As soc; Vol.XIII., p.404 and Vol.xiii., pp.310.312.
  17. Muir Sanskrit Texts Vol.ii., p.142, 1st ed.,
  18. Jour, Bom, Branch, Roy, As, Soc. Vol.vii., pp.117-120
  19. Ibid. Vol.ix., p.17.
  20. J.R.A.S.Vol.xiii., N.S.P. 524
  21. Prinsep Translation. J.A.S.B. Vol.viii., pp.334- 348; Prof. H.H. Wilson's. Prinsep's Essays, Vol.ii ., pp. 57-67 Prof.Eggeling. Burgess second Report p. 129. Bhagavaa Lai Indraji & Dr. Buhler. Ind. Ant. Vol Viii.pp. 257-263.
  22. Burgess Amrawati & Jaggayyapeta Stupas., p.III
  23. Bhilsa Tope., pp.264, 272. p.xix no.190 Numismata Orientalia p.12.
  24. Arch, Survey 1881., ins.44, p.100