ఆంధ్రుల చరిత్రము - ద్వితీయ భాగము/సంపాదకీయ భూమిక

వికీసోర్స్ నుండి

సంపాదకీయభూమిక


ఇది యాంధ్రులచరిత్రయందు ద్వితీయభాగము. గ్రంథకర్తగారు మా చదువరులకు చిరపరిచితులు గావున వారిని గురించి మేమేమియు విశేషించి వ్రాయబనిలేదు.

చరిత్రలు వ్రాయుట సులభసాధ్యముగాదు. అందును నిదివరకు మార్గమేర్పడని పట్టులను సాధించుట కష్టతరము. ఆంధ్రజాతి చరిత్రమునకు రాచబాటవైన మొదట పూనినవారు గ్రంథకర్తలగు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు అని నుడువుటలో సాహసంబేమియును లేదు. దుర్గమప్రదేశములకు మార్గమేర్పరుప బూనువారు అనేక తరులతాదుల భేదింపవలసియుండును. అందొకకొన్ని నైజముగ మిక్కిలియుపయోగకారులయి యుండవచ్చును. అట్టివానిని మహత్తరోపయోగకారమునకయి త్యజింపవలసియుండును. మార్గనిర్మాత ప్రమాదవశంబుననొక్కొక్కెడ నుపయోగపరిమితి నిర్ణయించుకొనలేకపోవచ్చును. పరిస్థితి వైపరీత్యంబువలన నుపయుక్తంబగు పదార్థంబు విషమంబుగ గాన్పించుటగూడ గలదు.

బొసగు లోపములన్నింటికి ప్రథమమార్గనిర్మాత యుత్తరవాది యనుట లెస్సయగునే? అట్లే ఆంధ్రచిత్రప్రపంచంబునంగూడ ప్రాథమికోద్యమం బగునీగ్రంథరాజంబున నెరనులుండినయెడల నవ్వానిని బుధులు సంస్కరించిన నాంధ్రదేశంబునకు గ్రంథకర్తతోబాటు లాభము కలుగజేసినవారే యగుదురు. ఆ నమ్మకము మాకుగలదగుటను జేసి మేమీ మహాకార్యంబునకు గడగియున్నారము. ఆంధ్రచరిత్రాధ్యయన పరలెల్లరును మాకు సాయపడ బ్రార్థితులు. గ్రంథకర్తగారు పీఠికలో దమ కీ సంపుటము రచించుటయందు గలిగిన ప్రోత్సాహనిరుత్సాహ కారణంబులను వ్రాసికొనియున్నారు. అవి యెల్లను ప్రస్తుతరచనకు సంబంధించిన వారి స్వవిషయంబులు. వీరు ఆంధ్రులచరిత్రమును వ్రాయుటయందు బ్రథములగుట వలన వీరి యభిప్రాయములు గొందరకు సమ్మతములు గాకపోవచ్చును. కొన్ని సందర్భములనయ్యవి ప్రమాద జనితంబులయినను గావచ్చును. కాని ఏ విషయమును గురించియైనను, నుపక్రమించువారు సంపూర్ణముగ దమ హృదయంబును విప్పి చెప్పినంగాని చర్చనీయాంశంబులు వెల్లడియగుటలేదు. అందువలన వారికి గొంత స్వాతంత్ర్యంబిచ్చుట ధర్మమని తలచి మేము ఈ గ్రంథకర్తగారి యభిప్రాయములు విషయ మున జోక్యము గలుగ జేసికొనినవారము గాము. సహృదయులగు జదువరులిందు సంస్కారంబులవశ్యములని తోచినచో మాకును గ్రంథకర్తగారికిని తెలిపిన గృతజ్ఞులమయి యుండగలము.
విజ్ఞానచంద్రికా కార్యస్థానము
మే నెల 30 -1912
సంపాదకుడు.