ఆంధ్రుల చరిత్రము - ద్వితీయ భాగము/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రుల చరిత్రము

----

మధ్య యుగము

----

మొదటి ప్రకరణము.

----

పండ్రెండవ శతాబ్ద స్థితి.

దక్షిణ హిందూస్థానమున మహారాష్ట్ర కర్ణాట ద్రావిడాంధ్ర కాళింగులు సుస్థిర మైన యేక సామ్రాజ్యమును నెలకొలుప వలయునన్న సంకల్పముతో దమతమ యావచ్ఛక్తులను వినియోగించి దక్షిణాపథము నంతయు భయంకరమైన యుద్ధరంగముగ జేసికొని వీరాధివీరులై పోరాడుచున్న రాజకీయవాతావరణమును; రాజ్యాధిపత్యములను వహించిన చక్రవర్తులు మహారాజులు సామాన్యముగ శైవమతాభిమానులుగ నున్నను, మాండలికరాజులు సేనాధిపతులు మొదలగు నున్నత రాజకీయోద్యోగీయు లనేకులు జైనమతావలంబకులై జైనమతాచార్యులకు బోషకులైనందను జైనమతము జనసామాన్యమతమై విజృంభించుచుండుటయు, జైనమతావలంబకు లయిన మాండలిక రాజులు సేనాధిపతులు సామ్రాజ్యాధిపత్యము నాక్రమించుట ప్రయత్నించుచుండుటయి జూచి సహింపజాలక శైవవైష్ణవ బ్రాహ్మణమతాచార్యుల నేకులు దక్షిణహిందూస్థానమున దమతమ మతసామ్రాజ్యములను స్థాపించుటకై అభినివేశముతో మతబోధనులు గావించు సమయమున జైనబౌద్ధ మతప్రళయకారకులో యన సంస్కర్తలనేకులు బయులువెడలి మతసాంఘీకవాతావరణమును; అల్లకల్లోలము గావించిన కాలమగుటంజేసి పండ్రెండవ శతాబ్దస్థితి అతిభయంకరముగ నుండెను. పండ్రెండవ శతాబ్ద ప్రారంభమున గర్ణాట మహారాష్ట్ర దేశములు పశ్చిమచాళుక్య సామ్రాజ్యమున? 2 ఆంధ్రులచరిత్రము.

ద్రావిడాంధ్ర దేశములు పూర్వచాళుక్య చోడ సామ్రాజ్యమునకును, కళింగోత్కలములు కళింగగాంగ సామ్రాజ్యమునకును లోబడియుండినవి. ఆంధ్రభారత కృతిపతినగు మొదటి కులోత్తుంగచోడదేవుని చరిత్రమాంధ్రదేశమునకు సంబంధించినంత వరకు నాంధ్రులచరిత్రములోని బ్రథమభాగమున సవిస్తరముగా దెలిపియున్నాడను. [1]

ఇతడు క్రీ.శ.1070 మొదలుకొని 1118వ సంవత్సరము వరకు బరిపాలనము చేసెను. ఇతడు శివభక్తుడై శైవమతాభినివేశ పరవశుడై శివాలయములను బెక్కింటిని నిర్మించి ప్రఖ్యాతినొందినను, పరమత సహనము లేనివాడని చెప్పుదురు. ఆ కాలమునందలి బ్రాహ్మణులప్పటికే శివుని దైవముగానంగీకరించనవారగుటచేత ఇతడు బ్రాహ్మణద్వేషిగాక యుండెను. ఆ కారణముచేత నీతనికాలమున బ్రాహ్మణమతము వర్థిల్లుచుండెనని చెప్పవచ్చును. ఆ కాలముననే ఆర్యబ్రాహ్మణమతమనేక సంస్కారములనుబొందెను. దక్షిణాపథమునకు వచ్చిన యార్యబ్రాహ్మణులు ద్రావిడులతో సంపర్కమువలన శివారాధనమవలంబించినవారయినను వారికి ప్రధానమైన వైదికమతమే ప్రధానమతముగనుండెను. ఈ మతమును బ్రకాశింపజేసినవాడు కుమారిలభట్టు. ఈ వైదికమతోద్ధారకుని చరిత్రమును సంగరహముగా నాంధ్రులచరిత్రములోని ప్రథమభాగమున దెలిపియున్నాను గావున, నిచ్చట మరల దెలుపలేదు. [2] కుమారిలభట్టుచే బ్రకాశింపబడిన కర్మప్రధానమైన వైదికమతము నానాట వర్థిల్లుచుండినను, కుమారిలభట్టుయొక్క ప్రతిపక్షులయిన జైనబౌద్ధమతాచార్యులతో వాగ్వాదము సలిపి విజయము గాంచినను, ప్రజాపాలనము సేయు మహారాజులను వశులనుగ జేసికొని యెన్ని విధములుగా జైనులను బాధించి హింసించినను, అతనిచే బోధింపబడిన మతము ప్రజారంజకముగ నుండకపోయెను.

మొదటి ప్రకరణము.

వైష్ణవ మతము.

దక్షిణ హిందూస్థానమునందు భక్తి ప్రధానమైన వైష్ణవమతము శఠకోపుడు, నాధముని, పుండరీ కాక్షుడు, రామమిశ్రుడు, యామునాచార్యుడు మొదలగు పరమ భాగవతోత్తములచే బోధింపబడుచుండుటచేత తక్కువ జాతివారనేకులు వైష్ణవ భక్తాగ్రేసరులై యున్నతస్థితికి వచ్చి భాగవతులచే బూజింపబడుచుండిరి. అయినను వైష్ణవమతము కూడ రామానుజులవతరించువరకు కర్మప్రదానమైన వైదికమతమునుగాని, వైరాగ్యప్రధానమైన శైవమతమునుగాని, మించి విశేషవ్యాప్తి జెందియుండలేదు.

శంకరమతము.

గౌతమబుద్ధుని తరువాత మతసంస్కర్తలలో జగత్ర్పఖ్యాతినొందిన శంకరుడెనిమిదవ శతాబ్దాంతమున మలయాళ దేశములోని కాలడి యను గ్రామంబుననొక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబమును నవతరించి బాల్యముననే వేదవేదాంతాది విద్యలనెల్ల గ్రహించి బ్రహ్మచర్యమునుండియే సన్న్యాసియై మహాతత్త్వవేత్తయై వ్యాసకృత వేదాంత సూత్రములకును, దశోపనిషత్తులకును, భగవద్గీతలకును మహాభాష్యములను వ్రాసి, ఆసేతుహిమాచల పర్యంతమును సంచారముచేసి, అద్వైతసిద్ధాంతమును బోధించుచు, పరమతఖండనమును స్వమతమండనమును జేయుచు, ధర్మవ్యవస్థకై భరతఖండంబున నుత్తర హిందూస్థానమున బదరీకేదారములోను, దక్షిణహిందూస్థానమున శృంగేరిలోను, పూర్వహిందూస్థానమున జగన్నాథములోను, పశ్చిమహిందూస్థానంబున ద్వారవతిలోను, నాలుగు ప్రధానమఠములనేర్పరిచి శంకరపీఠములను స్థాపించి, జగద్విఖ్యాతిగాంచెను. ఇతనిచే రచియింపబడిన సూత్రభాష్యమును, ఉపనిషద్భాష్యమును, గీతాభాష్యమును ప్రస్థానత్రయమందురు. హేతువాదమున నీగ్రంథమును మించినది మరియొక్కటి గానరాదని కొందరి తత్త్వవేత్తల యభిప్రాయము. ఇతడు బౌద్ధదర్శనములోని సిద్ధాంతములను బెక్కింటిని సంగ్రహించియు, బుద్ధుడు విష్ణువుయొక్క యవతార 4

              ఆంధ్రులచరిత్రము.

మని వచించియు, బౌద్ధులను బెక్కండ్రను పౌరాణిక హిందూమతావలంబకులనుగ జేసెనని చెప్పుదురు. ఇతడు పౌరాణికమతముతో జాలవరకు సమాధానపడి తన మతమును మెల్లమెల్లగ వ్యాపింపజేసి కృతకృత్యుడయ్యెను. ఇతడు రాజాధిరాజులను వశులనుగ జేసికొని బౌద్ధులను హింసించెనని చెప్పెడి కథలెంతవరకు విశ్వసనీయములో మనమిప్పుడు నిర్ధారణ చేయజాలముగాని, హిందూదేశనమున బౌద్ధమత వినాశనమునకు గొంతవరకీతడు కారణభూతుడై యుండవచ్చునని మాత్రము మనమూహింపవచ్చును. ఇతడు కుమారిలభట్టు బోధించిన వైదికమతమునుగూడ నిరసించినవాడు. ఈ మహాసంస్కర్త ముప్పదిరెండు సంవత్సరములు జీవించి బదరీకేదారములో ముక్తిగాంచెనని చెప్పుదురు. ఇతడు బోధించిన యద్వైత తత్త్వమును వైదికమతావలంబకులయిన బ్రాహ్మణులనేకు లంగీకరించిరి. పదునొకండవ శతాబ్దాంతమునను పండ్రెడవ శతాబ్ద ప్రారంభమునను యాదవ ప్రకాశులను నద్వైతసన్న్యాసి యొకడు కాంచీనగరమునందు నద్వైత మతబోధనలను గావించుచు మహాప్రఖ్యాతి గాంచుచుండెను.

కాంచీనగరము.

అంతకుబూర్వము జైనబౌద్ధమతాచార్యులకు సయితము ప్రధాన స్థలముగా నుండిన యీ కాంచీనగరము, పదనొకండవ శతాబ్దమునాటికి బ్రాహ్మణాధీనమై వైదిక విద్యాబోధక స్థానమై, బ్రాహ్మణ మతములకు బట్టుకొమ్మయై, దక్షిణ హిందూదేశమున విద్యాధికార స్థానమును వహించిన నగరములనన్నింటి నతిశయించి యొప్పారుచుండుటచేత నెక్కడెక్కడనుండియో బ్రాహ్మణవిద్యార్థులనేకులు విచ్చేసి ప్రసిద్ధులయిన యపాధ్యాయుల కడ విద్యాభ్యాసమును జేయుచు వేదవేదాంతాది విద్యారహస్యముల నేర్చుకొనుచుండిరి. మతబోధకులనేకులా మహానగరమునకు నేతెంచి నేర్పుమీర మతబోధనలు గావించుచుండిరి. అట్టివారిలో యాదవ ప్రకాశులను సన్న్యాసియునొకడు. ఇతని ప్రసిద్ధి విని దూరస్థలములనుండి విద్యార్థులనేకులు వచ్చి 5

              మొదటిప్రకరణము

శుశ్రూష చేయుచు విద్యాభ్యాసమొనర్చుచునుండిరి. అట్టివారిలో వైష్ణవ మతోద్ధారకుడును మహాసంస్కర్తయునగు రామానుజాచార్యుడొకడు.

రామానుజాచార్యుడు.

___________

శ్రీవైష్ణవమతము.

ఇతడు ద్రావిడదేశములోని భూతపురి యనునామాంతరముగల శ్రీపెరుంబూదూరను గ్రామమున ఆసూరి కేశవసోమయాజి యను బ్రాహ్మణునకును, కాంతిమతియను భార్యకును, శాలివాహన శకము 940 [3] వ సంవత్సరమగు పింగళ సంవత్సర చైత్రశుద్ధ పంచమీ గురువారమున ఆర్ధ్రా నక్షత్రయుక్త శుభలగ్నమునందు జనించెను. ఆళవందారను నామాంతరముగల సుప్రసిద్ధ వైష్ణవమతాచార్యుడగు యామునాచార్యుని శిష్యవర్గములోని వాడగు శ్రీశైల పూర్ణుడీతని మేనమామ. రామానుజుడు తన పినతల్లియగు ద్యుతిమికిని కమలాక్షభట్టునకును జనించిన గోవిందభట్టుతోడ గాంచీపురమునకు బోయి యాదవప్రకాశునికడ జేరి తన ప్రజ్ఞావిశేషముచేతను, మేధాసంపత్తి చేతను, అత్యల్ప కాలములోనే వేదాంత విద్యారహస్యములనన్నింటిని గ్రహించి గురుబోధమును ధిక్కరించి శంకరుని యద్వైతసిద్ధాంతమును నిరాకరించి విశిష్టాద్వైతసిద్ధాతబోధము మొదలుపెట్టి గురువుతో మతసిద్ధాంతవాదములు గావించి యాతని వైష్ణవ భక్తాగ్రేసరునిగా జేసి తుతకు గురువునకే తాను గురువై యతనిచే బూజింపబడెనని వైష్ణవ మత గ్రంథములు ఘోషించుచున్నవి. ఇట్టు రామానుజుడు శంకరుని మతమును భక్తిప్రపత్తులు లేని వట్టి జ్ఞానమువలన ముక్తిలేదనియు, ప్రపంచము మిథ్యకాదనియు, ముక్తి సమయమున జీవుడీశ్వర స్వరూపము కలవాడయినను బూర్ణముగ నీశ్వరస్వరూ పము సంభవింపదనియును, ఖండించుచు భక్తివిధానమున శంఖచక్రగదాధారియు గరుడ వాహనారూఢుడునగు లక్ష్మీపతియే సర్వేశ్వరుడని బోధించుచు వచ్చెను. చోడచక్రవర్తి శంకరమతావలంబకుడగుట వలన రామానుజుని మతబోధము సరిపడకుండెను. ఈ చోడచక్రవర్తి యాంధ్రభారత కృతిపతియైన రాజరాజనరేంద్రుని కుమారుడగు కులోత్తుంగచోడదేవుడేగాని యన్యుడుగాడు. ఇతడు శైవభక్తుడగుటవలన దన రాజ్యమునందలి ప్రజలెల్లరును శివునే దైవముగా నంగీకరింపవలసినదని ప్రకటింపించెను. అందులకు రామానుజుని శిష్యులునిరాకరించిరి. అందుపై జక్రవర్తికాగ్రహము జనించి రామానుజునిబట్టి తనయొద్దకు గొనిరమ్మని భటులకుత్తరవు చేసెను. పరమ మాహేశ్వరాచార భక్తిపరుడైన చక్రవర్తియాజ్ఞను శిష్యవర్గముచే రామానుజుడు విని మారువేషముతో వెంటనే కాంచీపురమును విడనాడి హోసలరాజుచే బరిపాలింపబడు గాంగవాడిదేశమునకు బారిపోయెను.

విఠలదేవరాయలు.

అప్పుడు విఠలదేవరాయలు గాంగవాడిదేశమును బరిపానము చేయుచుండెను. ఇతడు క్రీ.శ.1106వ సంవత్సమున రాజ్యాధిపత్యము వహించినటుల గన్పట్టుచున్నది. [4]ద్వారసముద్రము లేక హాలెవీడు రాజధానిగ హోసలబల్లాలరాజులు గాంగవాడి దేశమును బరిపాలించుచుండిరి. వీరు మొదట జైనమతావలంబకులుగనుండిరి. ఈ బల్లాలరాజైన విఠలదేవరాయలు పశ్చిమచాళుక్య చక్రవర్తియగు యారవ విక్రమాదిత్యునికి సామంతులుగనుండిన మహామండలేశ్వరులలో బరాక్రమవంతుడుగను బ్రసిద్ధుడుగనుండెను. రామానుజుడు తన శిష్యవర్గముతో నీతని రాజ్యమున బ్రవేశించి జనులకు మతోపదేశమును జేయుచు రాజధానీనగరమునకు వచ్చి కొంతకాలమచ్చటనే నివసించియుండెను. అప్పుడాదేశపు రాజు కొమార్తెను బ్రహ్మరాక్షసుడు పట్టుకొని వేధించుచుండెను. అందువలన నారాజపుత్రిక దిగంబరయై పిచ్చిపట్టినదానివలె దిరుగుచుండెనట. జైనమతగురువులెందరో చికిత్సలు చేసినను ఆబ్రమ్మరాక్షసుడు విడడయ్యెను.

రామానుజుడు బ్రహ్మరాక్షసుని పారద్రోలుట.

రామానుజుని మహాత్మ్యమును తన శిష్యుడగు తొండనూరునండి వలన రాజు భార్య శాంతలదేవి విన, రాజుతో జెప్పగా నతడు "మన పుత్త్రికి మనస్స్వాస్థమును గలిగించి యెప్పటి స్థితికి రామానుజుడు గొనివచ్చెనేని యతడే మనకు దైవము, అతడే ప్రభువు, అతడే గురువు” అని చెప్పి రామానుజునికి వార్తనంపించెను. రాజులయాశ్రయము మొదట రామానుజునికంతగా నిష్టము లేకపోయెనటగాని, మతవ్యాపనమునకు రాజుయొక్క సాహాయ్యమత్యావశ్యకమని శిష్యులు ప్రార్థించుటచేత నంగీకరించి రామానుజుడు రాజాంతఃపురమునకు బోయెను. అంతట రాజు తన రాణితో బ్రత్యుత్థానము చేసి యతనికి నమస్కరించి లోనికిగొనిపోయి కూతును జూపెను. దిగంబరయైయున్న రాజపుత్రికపై రామానుజుని పాదతీర్థమును గుర్వాజ్ఞ శిరసావహించిన శిష్యుడొకడు ప్రోక్షింపనామెనుబట్టియున్న బ్రహ్మరాక్షసుడు విడిచిపోయెనట. అంతట నామె మగవాండ్రయెదుట దానాస్థితిలోనుండుటకు సిగ్గుపడి చివాలునలేచిపోయి వస్త్రాలంకరణభూషితురాలయి వచ్చి వారలకు నమస్కరించి నిలువంబడెనట. తల్లితండ్రులు కొమార్తెనుజూచి పరమానందమునొంది రామానుజుడు నిజముగా నాదిశేషుడయిన యనంతునియొక్క యపరావతారమేయని విశ్వసించి యాతని మతమును స్వీకరించిరి. అంతట రామానుజుడు వారలనాశీర్వదించి విఠలదేవరాయనికి విష్ణువర్ధనుడని నామకరణము జేసెను. ఇట్లు విఠలుడు నూత్న మతకవచమును దొడిగి నూత్ననామమును స్వీకరించి జైనులయెడ ననురాగమును విడిచి వర్తించుచుండ జైనులకు రామానుజునియెడ ద్వేషమగ్గలమయ్యెను.

జైనబౌద్ధమతముల నిర్మూలనము.

అంతట జైనులకును వైష్ణవులకును ఘోరకలహము ప్రారంభమై మత చర్చలతి భయంకరములయ్యెను. మహారాజగు విష్ణువర్ధనుడు వైష్ణవుల పక్షముజేరినందునజైనుల బలముడిగిపోయెను. రామానుజుడు జైనమతాచార్యులను వాదమున గెలిచెనట. వైష్ణవపక్షపాతియై విష్ణువర్ధనుడు 790 జైన దేవాలయములను నాశనము చేసి అదివరకా దేవాలయముల పోషణార్తము దానము చేసిన మడులు, మాన్యములూడ బెరికికొని వైష్ణవ దేవాలయముల కైంకర్యాదుల కొసంగెను. విష్ణువర్ధనుడు బేలూరిలో చెన్నిగి నారాయణుని, తలక్కాడులో కీర్తినారాయణుని, గడగులో విజయనారాయణుని, హరదనహల్లిలో [5]లక్ష్మీనారాయణుని, మరియొకచోట మరియొక నారాయణుని ప్రతిష్ఠింపించి, తొండనూరిలో తిరుమలసాగర మను పేర నొక చెరువు త్రవ్వించి జైని దేవాలయముల రాలతో చీడీలు గట్టించి చెరువుగట్టు క్రింద రామానుజ కూటమును నెలకొల్పి భక్తుల పోషణార్థ మొక సత్రమును గూడ నిర్మించెను. దొడ్డగురునహల్లి గ్రామమునకు మేలుకోటయనియు, తిరునారాయణపురమనియు నామకరణము చేసెను. ఇయ్యది క్రీ.శ.1197వ సంవత్సరమున జరిగినదని శ్రావణబెలగోల స్థలపురాణము వలన దేటపడుచున్నది. వైష్ణవమతమవలంబింపని జైనమతాచార్యులనేకులు రాతి గానుగలలో బెట్టి చంపబడిరి. పద్మగిరిలో దిరుగబడిన జైనులనేకులు పై రీతిగానే సంహరింపబడిరి. [6]ఈ ఘోరప్రళమునకు భయపడి జైనమతావలంబకులనేకులు తప్తముద్రాధారణమును గైకొని వైష్ణవులయిరి. ఈ విషయములు స్థలపురాణములలోను, వైష్ణవమతగ్రంథములలోను వ్రాయబడినవి. ఇట్లని పై గ్రంథములలో జెప్పబడియున్న విష్ణువర్ధనుడు జైనుల సంబంధమును విడచిపెట్టినట్లు శాసనముల వలన దెలియలేదు. వైష్ణవమతావలంబకుడని చెప్పబడిన విష్ణువర్ధనుడు హాలెవీడులోని జయంగొండేశ్వర శివాలయమునకు క్రీ.శ.1121వ సంవత్సరములో భూదానము చేసినట్లుగ విరూపాక్షపురములోని యొక శాసనమువలన దెలియవచ్చుచున్నది. కేతమల్లుడను వర్తకుడొకడు 1121వ సంవత్సరమున విష్ణువర్ధన హోసలేశ్వరుడను పేర నొక శివాలయమును గట్టించెను. మరియు నీతని పంచప్రధానులలో గొందరు జైనమతాభినివేశ పరవశులుగ గన్పట్టుచున్నారు. ఇంతియగాక 1123వ సంవత్సరమున జైన మతావలంబిని యగు తన భార్యకు నొక గ్రామమునీయగా నామె దానిని 200 బ్రాహ్మణులకు విభాగించియిచ్చెనట!ఆ సంవత్సరముననే యతని భార్య శాంతలదేవి శ్రావణబెలగోల గ్రామములో గంధవారణమను బస్తిని గట్టించెను. మరియు 1125వ సంవత్సరమున మహోపాధ్యాయుడును తార్కిక చక్రవర్తియు జైనుడునగు శ్రీపాలుడను వానికి భూదానము చేసెను. 1128వ సంవత్సరమున యాదవపుర మను మేలుకోటలో చాముండికొండపై నుండి మర్బలతీర్థమునకు (శివాలయములోని యొక భాగము కాబోలు) దానశాసనము వ్రాయించెను. విష్ణువర్ధనుని కుమారుండును, జ్యేష్ఠపుత్రికయగు హరియలెయను నామెయు, ఆమె చెల్లెండ్రును జైనులనియే చెప్పబడుచున్నారు. మరియు దలకాడు ముట్టడించి వశపరచుకొని శైవులయిన చోడచక్రవర్తులచే నాశనముచేయబడిన జైనదేవాలయములు పెక్కింటిని పునర్నిర్మాణము చేసినవాడును విష్ణువర్ధనుని సైన్యాధ్యక్షుడును, మహాయోధుడునగు గంగరాజు జైనులకు జైనమతమునకు మ్రాతమేగాక రాజునకును గొప్పప్రాపుగ నుండెనని చెప్పబడియున్నది. 1133వ సంవత్సరమున సైన్యాధిపతియగు గంగరాజు మరణమునొందగా వాని కొమారుడు బొప్పరాజు హాలెవీడులో తండ్రి జ్ఞాపకార్థము ద్రోహఘరట్టమను జినాలయమును నిర్మించెను. ఈ ప్రతిష్ఠాపన కాలమునందు నయకీర్తియను జినాచార్యుడు దివ్య ప్రసాదమును రాజునకుబంపగా వెంగాపురమునేలు మాసన్నపై దండెత్తిపోయి వానినోడించి విష్ణువర్ధనుడు మరలివచ్చు కాలమున నడిత్రోవలో వాని రాణి లక్ష్మీదేవి ప్రసవించి కుమారుని గన్న సమయమున బ్రసాదమం దెను. కాబట్టి రాజు సంతోషపూర్వకముగా జైనమత గురువులనాదరించి ప్రసాదమును స్వీకరించెను. జైనమతాచార్యుల శుభాగమనమును మిక్కిలి సంతోషించి తన కుమారునకు విజయనరసింహుడని పేరుపెట్టి నూతన జైనాలయములోని దేవుని విజయపార్శ్వనాధుడనవలసినదిగా నుత్తరువు చేసెను. హోసలేశ్వరుని మహాలయమునకు నెదురుగనన్నూత నలువది గజముల దూరములోనున్న ఈ జైనాలయమిప్పటికిని జైనయాత్రికులచే దర్శింపబడుచున్నది. ఇట్టి చరిత్రాంశములు విష్ణువర్ధనుడు జైనులను వధించెనని చెప్పెడు స్థలపురాణగాధలను వైష్ణవమత గాథలను బూర్వపక్షము చేయుచున్నవి. క్రీ.శ.1117వ సంవత్సరమున విష్ణువర్ధనుడు వైష్ణవమతమును స్వీకరించెనని హాలెవీడులోని యొక శాసనము దెలుపుచున్నది. ఈ విషయములన్నిటిని సమన్వయించుకొనుట కష్టసాధ్యముగనుండును. ఏదియెట్టులున్నను ఆకాలమున జైనులనేకులువైష్ణవమతములో జేర్చుకొనబడిరనుమాట సత్యము. జైనులను బౌద్ధులను మాత్రమేగాక, తక్కువ జాతి వారలనేకులను వైష్ణవులను గావించెను.

రామానుజుడు _ తిరునారాయణపురము _ మాలమాదిగలు.

బౌద్ధులు వాదములందు గెలువలేక క్రోధోన్మదులై విష్ణ్వాలయంబుల కపాయంబులాపాదింప నుద్యుక్తుయినప్పుడు రామానుజుడు మాలమాదిగలచే వారలంబట్టి రాతిగనులలో బెట్టించి నిశ్శేషముగా నురుమాడించి తనకుపకారము చేసిన యాపంచములయెడ బ్రసన్నుడై ప్రతివత్సరంబునందును శ్రీనారాయణదేవుని మహోత్సవకాలమున నేడవదినంబు మొదలుకొని తొమ్మిదవ దినంబు పర్యంతంబు దినత్రయంబును వారలు దేవాలయములోని బలిపీఠము వరకరుదెంచి కైంకర్యాదులొనర్చి సేవించునట్లాజ్ఞాపించెనని ఆచార్య రత్నహారము మొదలగు గ్రంథములలో వ్రాయబడినవి. రామానుజుడు తన కుమారుడైన సంపత్కుమారునితో ఢిల్లీనగరమునుండి వచ్చునప్పుడు దారిదోపిడీగాంద్రచే ముట్టడింపబడి చిక్కువడియున్న కాలమున మాలలసాహాయ్యముచే దానపాయమునుండి తప్పించుకొన్నందుకు ప్రత్యుపకారముగా మాలలకీ స్వాతంత్ర్యమునొసంగెనని ప్రసన్నామృతమను గ్రంథమునందు వ్రాయబడినది. ఇట్టి స్వాతంత్ర్యము మేలుకోటలో మాత్రమేగాక బేలూరుశ్రీరంగ దేవాలయములలో గూడ సంవత్సరమునకొకమారు కలుగజేయబడినది. ఆ కాలమున బంచములు బ్రామ్మణులను దాకినను బ్రాహ్మణులపవిత్రతయని తలంపరట! [7]

రామానుజుని గ్రంథరచనము _ మతవ్యాప్తి

రామానుజుడు గూడ శంకరాచార్యునివలెనే వ్యాసవిరచిత బ్రహ్మసూత్రములకును, ఉపనిషత్తులకును, భగవద్గీతలకును, భాష్యములను వ్రాసెను. ఈ సంస్కర్తచే విరచింపబడిన బ్రహ్మసూత్ర భాష్యమును శ్రీభాష్యమనెదరు. ఇతడు నయమునను భయమునను తన మతమును వ్యాపింపచేసెను. ఇంతకు బూర్వము శివస్థలముగానుండిన తిరుమత దేవాలయమునాక్రమించుకొని విష్ణ్వాలయముగమార్చెను. చోడచక్రవర్తి మరణమునొందిన తరువాత శ్రీరంగము మొదలగు వైష్ణవక్షేత్రములకు జని మతబోధ గావించుచుండెను. కలోత్తుంగ చోడచక్రవర్తి కుమారుడు విక్రమచోడుడే తండ్రి మరణానంతరము రామానుజుని తన దేశమునకు రప్పించియాదరించెను. ఈతని సంప్రదాయమును విశిష్టాదైవ్తమనియెదరు. ఈ సంప్రదాయమువారిని శ్రీవైష్ణవులని చెప్పుదురు. ఈతడు బౌద్ధమతాచారములను బెక్కింటిని గ్రహించి తన వైష్ణవమతమునందు జొప్పించి మతవ్యాపనము గావించెను. ఇతడు 128 సంవత్సరములు జీవించి వైకుంఠ పదవికేగెనని చెప్పుదురు.

విక్రమాదిత్యుడు.

క్రీ.శ.1118వ సంవత్సరమున చోడచక్రవర్తియగు కులోత్తుంగ చోడదేవుడు మరణమునొందెను. వేగిదేశమునకు రాజప్రతినిధిగా నుండిన విక్రమచోడుడు ద్రావిడదేశమునకుబోయి సింహాసనమెక్కెను. విక్రమచోడుడు వేంగిదేశమును విడిచిపెట్టిన తరువాత నాతనికి దక్షిణమున బల్లాలరాజువలన జిక్కులెక్కువైనందున వేగిదేశము విషయమై శ్రద్ధలేకయుండెను. 1121వ సంవత్సరమున పశ్చిమచాళుక్యుడగు విక్రమాదిత్యుడు వేంగిదేశమునపై దండెత్తివచ్చి వశపరచుకొనియెనని యాంధ్రులచరిత్రము ప్రథమభాగమున జెప్పియున్నాడను. ఇతడాంధ్రదేశమును జయించి నాలుగయిదు సంవత్సరములు పరిపాలనము చేసెను. ఆ కాలమునందు విక్రమాదిత్యుడు, వెలనాటిచోడుని కుమారుడును మహామండలేశ్వరుడునగు వెలనాటి రెండవ గొంకరాజును రాజప్రతినిధిగ నియమించెను. ఈ పశ్చిమ చాళుక్య చక్రవర్తి 1126వ సంవత్సరమున మృతినొందెను. చోడచక్రవర్తియగు కులోత్తుంగుని మరణముతో చోడసామ్రాజ్యముయొక్కయు, విక్రమాదిత్యుని మరణముతో చాళుక్యసామ్రాజ్యముయొక్కయు, వైభవము క్షీణింపనారంభించెను. విక్రమాదిత్యునికి బిమ్మట భూలోకమల్లుడు సింహాసనమునకు వచ్చెను. విక్రమాదిత్యుని మరణానంతరము వానికి సామంతులుగనున్న మహామండలేశ్వరులలో నొక్కడగు కాకతీయ ప్రోలరాజు ఆంధ్రసామ్రాజ్య భవన నిర్మాణమునకై పునాదినుంప బ్రయత్నించుచుండెను. ఇతని చరిత్రము మరియొక ప్రకరణమునందు దెలుపబడును; గావుననిచ్చట వివరింపలేదు. క్రీ.శ.1127వ సంవత్సరముననే విక్రమచోడుడు వెలనాటిని మరల స్వాధీనముజేసికొన్నట్లు విక్రమచోడునిచే బ్రోలుశాసనము వలన దెలియుచున్నది. అయినను ఆంధ్రదేశములోని పశ్చిమభాగమునున్న మహామండలేశ్వరులందరును పశ్చిమచాళుక్య చక్రవర్తులకే కప్పముగట్టుచుండిరి.


భద్రపాలుడు.

భువనైకమల్లునకు గప్పముగట్టుచుండిన సామంతప్రభువులలోనొక్కడగు భద్రపాలుడు, షట్సహస్రదేశమనియెడు నారువేల నాటిని బరిపాలనము చేయుచుండెను. వీనికి రాజరాజమనోజుడనియు, దశదిశాభరణాంకుడనియు, నరేంద్రచతురాననుడనియు, రాజబిరుదములు గలవు. ఇతడు రవికుల శేఖరుండని చెప్పబడుటచేత దెలుగుచోడులలోని వాడై యుండవచ్చును. ఇతడు తెనుగున బద్యకావ్యములు వ్రాసి కవిరాజశిఖామణి, కవిబ్రహ్మ అని పొగడ్తగాంచినవాడు. ఇతడు వ్రాసిన గ్రంథములలో నీతిశాస్త్రముక్తావళియును, సుమతీశతకమును మాత్రము గానిపించుచున్నది. కం. శ్రీవిభుడ గర్వితారి
క్ష్మా వరదళనోపలబ్ధ జయలక్ష్మీ సం
భావితుడ సుమతిశతకము
గావించిన ప్రోడగావ్యకమలాసనుడన్.
అని తన నీతిశాస్త్రముక్తావళిని ప్రారంభించెను. ఇతని కవిత కుమారసంభవమువలె గఠినముగాక ద్రాక్షాపాకముగ నతిసరళముగానుండుననియు, భావములు నూతనములై హృదయంగమములుగా నుండుననియు నుడువుచు, బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణయ్య ఎం.ఏ., గారు రెండు పద్యములను ఆంధ్రపత్రికయందు నుదాహరించియున్నారు. [8]

ఉ. ఎత్తినకాలెకాని సిరికెన్నడు నిల్చినకాలనిల్వగా
జిత్తములేదుగాన సిరి జెందినవాడ పరోపకారమా
[9] యత్తతజేయు మెవరైన బదంపడివేడ గొందమన్
చిత్తమకానియిత్త మను చిత్తము వుట్టునె యెట్టివారికిన్.
చ. అలుక ప్రతాపమీగి యలవాలము బుద్ధిపరాపవాదముల్
పలుకుల ప్రొద్దుపోక ప్రజాబాధదలంపమి పెద్దప్రల్లదం
బలవు వికారమొప్పు వినయంబు మహత్త్వము చేటుబొంకువా
గ్బలము జఘన్యులైన నరపాలురకుం బరపక్షభైరవా.

చాగి బేటరాజు.

బిరుదాంక రుద్రుడను నామాంతరము గల చాగి బేటరాజు పల్నాటికి ప్రభువై భూలోకమల్లునకు గప్పము గట్టుచుండెను. ఇతడు హైహయవంశజుడు. ఈ రాజు కామనూరు గ్రామవాస్తవ్యుడును ఋగ్వేదపద పాఠియునగు నొక బ్రాహ్మణునిచే మాధవి [10] పట్టణమున బ్రతిష్ఠింపబడిన త్రిమూర్తి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) దేవాలయమునకు శాలివాహనశకము 1051 సౌమ్యసంవత్సరమున (క్రీ.శ.1129_30) దానశాసనము వ్రాయించెను. ఈ శాసనము వ్రాయబడిన నాగస్తంభము కూడ నా కాలమునందే ప్రతిష్ఠింపబడినది. ఈ శాసనములోని మొదటి రెండు శ్లోకములలో 'శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, అబ్జుడు, మహాంబుజుడు, శంఖధరుడు, కుళికుడు' అనెడుఅష్టనాగములంగూర్చిన ప్రార్థనగలదు. పల్నాటిలోని మాచర్ల గ్రామము (మాధవిపట్టణము)లోని చెన్నకేశవస్వామి దేవాలయములో మరియొక నాగస్తంభముపై నింకొక శాసనము పండ్రెండవ శతాబ్ద ప్రారంభము నాటిది కలదు. ఆ శాసనమునందును అష్టనాగములను గూర్చిన ప్రార్థనగలదు. పల్నాటికి రాజధానియగు మహాదేవితటాకము [11]నందునొకానొక యాదిత్యునిచే నాదిత్యేశ్వర దేవాలయము నిర్మింపబడినది. చంద్రకులమున జనించిన కార్తవీర్యార్జునుని వంశమునందు బుట్టిన చాగిబేటరాజు నలువురు కుమారులలోను రెండవ వాడగు వీరకాముని కొమారుడు బేటరాజు దీనికి భూదానము చేసియుండెను. ఈ యాదిత్యేశ్వరాలయమునకు దాన శాసనములను వ్రాయించినవారిలో నొకానొక కన్నడ నాగిమయ్య కలడు. ఈ శాసనములలోని లిపిన వ్రాసినవారు కూడా కన్నడము వారే. శాసనము దిగువ వారి నామములు కన్నడభాషలో వ్రాయబడినవి. ఈ విషయములు పశ్చిమ చాళుక్యుల యధికారము కొంతకాల మీ దేశమున వ్యాపించెనని చాటుచున్నవి.

విశ్వబ్రాహ్మణులు.

మరియు నీ మాచెర్ల శాసనమునందు నింకొక విశేషవిషయముగలదు. ఆదిత్యేశ్వర దేవాలయమును నాగస్తంభమును నిర్మించిన శిల్పకారులు కొనియాడబడియున్నారు. బ్రహ్మకుమారుడయిన విశ్వకర్మ యీ శిల్పకారులకు మూలపురుషుడనియు, సూర్యుని మామగారనియు, విశ్వకర్మ తనయుడైన సూర్యునికి కిరణములను విష్ణుచక్రము మొదలగు దివ్యాయుధములుగా మార్చెననియు జెప్పబడినది. విశ్వకర్మ వంశస్థులయిన ప్రసిద్ధాచార్యులు కొందరు పేర్కొనబడి, వారు శివలింగములను విగ్రహములను చేయుటయందును, వానివాని స్థానములను గుర్తెరుగుటయందును, చతుర్విధములయిన ప్రాసాదములను నిర్మించుటయందును, వాస్తుశాస్త్రములో నొక భాగమగు క్షేత్రగణిత జ్ఞానమునందును, వారల వృత్తికి సంబంధించిన పెక్కు విషయములయందును నేర్పరులనియు బ్రజ్ఞావంతులనియు చెప్పబడియున్నారు.

భూలోకమల్లుడు.

భూలోకమల్లుడనునది బిరుదనామమేకాని నిక్కమైన పేరుగాదు. ఇతని మొదటిపేరు సోమేశ్వరుడు. పశ్చిమచాళుక్య చక్రవర్తులలో సోమేశ్వరనామమును వహించినవారిలో నీతడు మూడవవాడు. ఇతడు 1127వ సంవత్సరము మొదలుకొని పదునొకండు సంవత్సరములు అనగా 1138వ సంవత్సరము వరకు బరిపాలనము చేసియుండెను. ఇతడు ద్రావిడాంధ్ర మగధ నేపాల రాజులను జయించి పొగడ్త గాంచెనని తెలియుచున్నది. [12] ఇతడు సంస్కృతమున మానసోల్లాసము లేక అభిలషితార్థ చింతామణియను మహాగ్రంథమును రచించెను. ఇందు రాజధర్మములను గూర్చియు, ప్రజాధర్మములను గూర్చియు, నానా విధవిషయములను గూర్చియు, వ్రాయబడియున్నది. అనగా _ రాజనీతి, రాజ్యాంగము, జ్యౌతిషము, నవగ్రహఫలములు, భాషలు, శాస్త్రము, కావ్యము, సంగీతము, చిత్రలేఖనము, శిల్పచాతుర్యము, అశ్వశిక్ష, గజశిక్ష, శునకశిక్ష, మల్లయుద్ధము మొదలగు వానింగూర్చిన విశేషాంశములు గలవు. ఇట్టి మహాగ్రంథము నీతడు రచించుటచేతనే, సర్వజ్ఞభూపుడను బిరుదమును గాంచెను. ఇతడు సింహాసనమధిష్ఠించిన నాలుగవ సంవత్సరమున నీ మమాగ్రంథమును రచించెను. ఇతనికి తరువాత నీతని కుమారుడు జగదేకమల్లుడు 1138వ సంవత్సరమున సింహాసనమెక్కెను. ఇతడు పండ్రెండు సంవత్సరములు పరిపాలనము చేసెను గాని, యీతని కాలమునందలి విశేషాంశములేవియు గానరావు.

త్రైలోక్యమల్లుడు.

జగదేకమల్లుని సోదరుడగు త్రైలోక్యమల్లుడు శాలివాహన శకము 1070 యగు ప్రమోదూత సంవత్సరమున సింహాసనమెక్కెను. ఈ సోదరులిరువుర పరిపాలన కాలమున వీరికి లోబడియుండిన మహామండలేశ్వరులు కొందరు నిరంకుశాధికారులై పరాక్రమవంతులై వీరి యధికారమును ధిక్కరించిరి.

బిజ్జలుడు రాజ్యమాక్రమించుకొనుట.

కాలచుర్యుడును హైహయాన్వయుడునగు బిజ్జలుడు చాళుక్యుల బలహీనతను దెలిసికొని, చాళుక్య సామ్రాజ్యము నాక్రమించుకొనగోరి తక్కిన మహామండలేశ్వరులతో మైత్రింబాటించి కృతకృత్యుడయ్యెను. ఇతడు త్రైలోక్యమల్లునియొక్క యుద్ధమంత్రిగను, దండనాయకుడుగను ఉండెను. ఇతని ప్రయత్నమునకు కొల్లాపుర మహామండలేశ్వరుడగు విజయార్కుడును, మహామండలేశ్వరుడును త్రైలింగ్యసామ్రాజ్యస్థాపకుడునగు కాకతీయప్రోల్రాజును, దోడ్పడి, ఇతనికి విజయమును సిద్ధింపజేసిరి. కాకతీయప్రోల్రాజు త్రైలోక్యమల్లుని ఓడించి యతని చెరపట్టి 1157వ సంవత్సరమున విడిచిపుచ్చెను. త్రైలోక్యమల్లుడు కళ్యాణపురమును విడిచిపెట్టి ధార్వాడమండలములోని యన్నిగేరికి బోయి కొంతకాలము వరకు దానినే రాజధానిగ జేసికొనియెను గాని, యాతని రాజ్యము మిక్కిలి క్షీణించినదయ్యెను. క్రీ.శ.1153వ సంవత్సరమున బిజ్జలుడు రాజ్యభారమును వహించినట్టు దెలుపు శాసనమొకటి కలదు గాని, శాలివాహనశకము 1084 (క్రీ.శ.1162) వరకు రాజబిరుదము లేవియును వహింపక మహామండలేశ్వరుండుగనే యున్నట్లు కన్పట్టుచున్నది. ఇతడాసంవత్సరమున త్రైలోక్యమల్లునిపై దండెత్తిపోయి తాను స్వతంత్రరాజని ప్రకటించెను. త్రైలోక్యమల్లుడను రెండవ తైలప్పదేవుడు అన్నిగేరి నుండి మరికొంత దక్షిణముగా వనవాసికిబోయి యచ్చటనే నివసించుచుండెను.[13] ఇతడు క్రీ.శ.1166వ సంవత్సరమువరకు బరిపాలనము చేసినట్లుగ గానిపించుచున్నది.[14]

కాలచుర్యులు.

ఈ కాలచుర్యులు హైహయాన్వయులు. కార్తవీర్యార్జునుని సంతతివారమని చెప్పుకొను నొక తెగ రాజులు. వీరు చేది దేశమును బరిపాలించుచుండిన యొక రాజకుటుంబము వారు. కళ్యాణపురమును స్వాధీనము చేసికొన్న తైలపదేవుని తరుమగొట్టిన బిజ్జలుడీ రాజకుటుంబములోనివాడే. హైహయాన్వయులయిన యీ చేదిరాజులు కాలంజరపుర వరాధీశ్వరులమని బిరుద నామమును వహించుచుండిరి. కనుకనే బిజ్జలుడును ఆ బిరుదమునే ధరించియుండెను. "ఈ బిజ్జలరాజు 1150 మొదలు 1162వ సంవత్సరము వరకు రాజ్యముచేసిన (చాళుక్య) త్రైలోక్యమల్లుని సేనాధిపతిగానుండి 1162వ సంవత్సరమున కళ్యాణపురాధీశ్వరత్వమును తానే యపహరించి, లింగాయతమతమును స్థాపించిన బసవేశ్వరుని తోబుట్టువగు పద్మావతియొక్క చక్కదనమునకు మక్కువగొని యామెను వివాహమాడి తన మంత్రినిగా జేసికొన్న బసవేశ్వరునిచేత చంపబడెను." అని, నెల్లూరి మనుమసిద్ధి రాజుయొక్క పూర్వీకుడయిన బిజ్జనయే యీ బిజ్జలుడని యభిప్రాయపడి శ్రీవీరేశలింగం పంతులుగారు తమ కవులచరిత్రయందట్లు వ్రాసియున్నారు. [15]మనుమసిద్ధి పూర్వీకుడయిన బిజ్జన సూర్యవంశపు రాజు. కళ్యాణపురాధీశ్వరుడయిన బిజ్జలుడు చంద్రవంశపు రాజు. కావున వీరిరువురకు నేవిధమైన సంబంధమును లేదు. ఈ బిజ్జలరాజు చాళుక్యరాజ్యమపహరించిన వాడను మాటయే నిలిచియుండెను. మరియు నితడుగాని, ఈతని తరువాతి వారుగాని, చిరకాలము రాజ్యఫలములనుభవించి సుఖతరంబుగ జీవింపక పోవుట యటుండ, నచిరకాలములోనే స్వకుటుంబపరివార సహితముగా నాశనముకూడ గావలసివచ్చెను.

మతవిప్లవము.

దక్షిణహిందూస్థానమున మున్నెన్నడును గనివినియెరుంగనట్టి మతవిప్లవము సంప్రాప్తమయ్యెను. వైష్ణవము వీరవైష్ణవమై విజృంభించుచుండెనని యిదివరకే తెలిపియున్నాడ. స్మార్తమతమొకప్రక్కను, వైష్ణవమతమొక ప్రక్కను, జైనమతము వేరొక ప్రక్కను అభివృద్ధినొందుచుండ, శైవమతము క్షీణించుటకు బ్రారంభించెను. కాబట్టి శైవమతము గూడ నుద్ధరింపబడుటకు గొప్ప సంస్కరణకర్త యెదురుచూడ బడుచుండెను. అతడే బసవేశ్వరుడు.

శైవమతోద్ధారకుడైన బసవేశ్వరుడు.

శైవమతోద్ధారకుడయిన బసవేశ్వరుని చరిత్రము తెలుగు బసవపురాణమునందును, కన్నడ బసవపురాణమునందును, అత్యద్భుతముగా వర్ణింపబడినది. [16]బసవేశ్వరుడు శ్రీశైలమునకు పశ్చిమముననుండు హింగుళేశ్వరాగ్రహారమునందు నివసించుచుండిన శివభక్తుడైన మండంగి మాదిరాజను బ్రాహ్మణునికి జనించెను.[17]ఈ బసవరాజు శివుని వాహనమైన నందియొక్క యంశముచేత భూమిమీద నవతరించెనని వీరశైవులు విశ్వసించుచున్నారు. కళ్యాణపురాధీశ్వరుడైన బిజ్జలరాయని కడ బసవరాజునకు మేనమామయైన బలదేవుడు ప్రధానమంత్రిగనుండెను. బసవరాజు తల్లిదండ్రులగు మదాలాంబికయు, మాదిరాజును చిరకాలము తమకు సంతానము లేమిచే నొకనాడు సంతానార్థమై తమ కులదేవుడగు నందీశ్వరునికి మిక్కిలి భక్తితో ముడుపుగట్టిరట. తమ మతాచరణ విధులప్రకారము పూజార్చనలు ముగించిన తరువాత నందీశ్వరుడు ప్రత్యక్షమై మీ కోరిక ఫలించునని చెప్పి యంతర్థానమొందెనట. మదాలాంబిక గర్భమున నందీశ్వరుడుదయించి మూడు సంవత్సరములు గర్భముననే యుండుటచేత నా సాధ్వీమణికి గర్భవేదనయధికమయ్యెను. ఆ వేదన భరింపజాలక ఆయమ నందినాధుని యాలయమునకు బోయి ప్రార్థించెను. ప్రార్థనాదికము ముగిసిన తరువాత నామె యింటికి మరలిపోయి సుఖనిద్రజెందెను. నిద్రలోనామెకు నందీశ్వరుడు ప్రత్యక్షమై నీ గర్భమున వసించియున్న పుత్రుడు నాయవతారమేయనియు, వీరశైవమత స్థాపనకై పంపబడినవాడనియు, నతనికి బసవ (వృషభశబ్ద భవము బసవ) నామము పెట్టవలసినదనియు చెప్పి యదృశ్యుడయ్యెనట. పిమ్మటనామె పుత్త్రుని బ్రసవించినతోడనే యతడు లింగధారియై కన్పడెనట. ఏలయనగా, గర్భమునందే శివుడతనికి శైవమతముపదేశించుట చేత నీరీతిగా జనించెను. తరువాత బసవేశ్వరుడెనిమిదేండ్ల ప్రాయములోపలనే సమస్త విద్యలను నేర్చి మతజ్ఞానమును సంపూర్ణముగా బడసెను. ఎనిమిదవయేట నతని తల్లిదండ్రులు తమ బంధువులందరను బిలువంబంచి యతని కుపనయనము చేయ బ్రయత్నింపగా నాతడు తండ్రినిజూచి "నాయనా! నేను శివపూజా దురంధరుడను; బ్రహ్మవంశమునకు సంబంధించినవాడను గాను; నేను వర్ణవృక్షచ్చేదనమునకు కుఠారమువంటివాడను నాకు వర్ణబేధముతో నిమిత్తము లేదు"అని నిశ్శంకగా బలికెను. అంత ఉపనయన మహోత్సవమునకు విచ్చేసిన యాతని మేనమాయు బిజ్జలుని మంత్రియునగు బలదేవయ్య మేనల్లుని వర్తనమున కద్భుతపడి మెచ్చుకొని తరువాత తన కొమార్తెను గంగాదేవినిచ్చి వివాహము చేసెను.

వీరశైవసిద్ధాంతములు.

రామానుజునివలెనే బ్రాహ్మణమతమును నిరాకరించి నూతన మత సిద్ధాంతమును బోధించుటచేత బ్రాహ్మణులు బసవేశ్వరుని వేధింపమొదలుపెట్టగా, నతడు స్వగ్రామము విడిచి మరియొక స్థలమునకు బోవలసివచ్చెను. ఒకనాడు బసవేశ్వరుడు సంగమేశ్వరాలయమునకు బోయి పూజ చేయుచున్న కాలమున, శివుడు ప్రత్యక్షమై అద్భుతములును ఆగమ్యములునైన సిద్ధాంతములను బోధించి యిట్లనియెను. "నీకు మాయెడగల భక్తిని దెలిసికొంటిమి; శివవేషధారులయిన జంగములను శివునియవతారములని గ్రహించి సత్యమైన మతము సమష్ఠింపుము; నీవు చేయునట్టి కర్మములయందు వారిననుసరింపుము; వారు నిన్ను తిట్టినను గొట్టినను వారికి సాష్టాంగప్రణామంబులాచరింపుము; వీరశైవులయిన యెడ వారు నీకు శత్రువులయినను వారిపట్ల మిత్త్రులభంగి వర్తింపుము; లింగాయతులను దూషించువారిని శిక్షించుచు నా మతమును వ్యాపింపజేయుటకు బ్రయత్నింపుము; శివుని కర్పింపక యే వస్తువును భుజింపకుము; పరధనపరదారాపేక్షకుడవు గాకుండుము; ఇంద్రియాధీనువడు గాక దృఢమైన హృదయము గలిగియుండుము; జంగముడ నేనేయని యెరుంగుము. లింగాయతులను నీవు గాంచినప్పుడు వారికి నమస్కరింపుము; ఎల్లప్పుడును శివుని స్మరించుచుండుము; సత్యమును వచింపుము; సత్కార్యములాచరింపుము"అని యుపదేశించి, బసవుని కౌగిలించికొని యదృశ్యుడయ్యెనట. శివుడీవిధముగా దనకుపదేశించిన మతసిద్ధాంతములను బ్రజలకు బోధించుచు నితడు వీరశైవమతమును వ్యాపింపజేయుచుండెను. అనేకలీతని మతమునవలంబింపసాగిరి. బ్రాహ్మణులు భయపడి యితని జోలికిబోవుట మానిరి.

బసవేశ్వరుడు మంత్రియగుట.

తరువాత కొంతకాలమునకు బలదేవుడు మృతినొందెను. అప్పుడు రాజగు బిజ్జలుడు బలదేవుని బంధువర్గమును రప్పించి మంత్రిపదవికర్హులెవ్వరని యడుగగా వారా మహాపదవి వహించుటకు బలదేవుని యల్లుడగు బసవరాజు యోగ్యుడని విన్నవించిరి. బిజ్జలుడు దాని నంగీకరించి తన యుద్దేశమును దెలుపుటకు బసవరాజుకడకు కొందరు మంత్రులను బంపెను. వారు కప్పడి గ్రామమునకు విచ్చేసి రాజు సందేశమును బసవేశ్వరునకు దెలియజెప్పగా, నాతడు మొట్టమొదట దనకాపని యక్కరలేదని చెప్పెను. ఆ వచ్చిన వారు ఈ పదవి శైవమతవ్యాప్తికనుకూలముగ నుండునని విన్నవించి కైకొనవలసినదని ప్రార్థిపంగా, నంగీకరించి కళ్యాణపురికి బోయెను. అతని జ్యేష్ఠసోదరి నాగలాంబికయు నతనితో గూడ నుండెను. అతడాపట్టణమునకు బోయినప్పుడు బిజ్జలుడు పౌరజనంబులతో నెదురువచ్చి యేనుగును దిగి స్వాగతమిచ్చి యాస్థానమునకు గొనిపోయి ప్రధానమంత్రి పదమున మాత్రమే గాక, సైన్యాధ్యక్షునిగను, దనాగారాధ్యక్షునిగను నియమించెను. ఇతడు మహారాజునకు దరువాత మహారాజువలె, తన యధికారము రాష్ట్రమునందంతట నెరపుచుండెను.


బిజ్జలునికి బసవేశ్వరునకుగల సంబంధము.

బిజ్జలుడు తన చెల్లెలగు నీలలోచనయనునామెను బసవేశ్వరునకిచ్చి వివాహము చేసెనని బసవ పురాణమునందు జెప్పబడినది. అయినను జైనులు వ్రాసిన బిజ్జలరాయని చరిత్రమునందు మరియొక విధముగా దెలుపబడినది. బసవేశ్వరునకు మిక్కిలియందకత్తె యగు పద్మావతియను చెల్లెలు కలదట. బిజ్జలుడామెను మోహించి వివాహము చేసికొనియెనట. [18]ఇందేది సత్యమైనను బసవేశ్వరునకును బిజ్జలునకును బాంధవ్యము కలదనుట కేయాక్షేపమును లేదు.

బజవేశ్వరునికి బిజ్జలునితోడి విరోధము.

ఇట్టి మహోన్నత పదవికి బసవేశ్వరుడు వచ్చినను తన మతమును, తన దేవుని మరవలేదు. ఇతడనేకాద్భుత కార్యముల నెరవేర్చినట్లుగ బసవపురాణము పేర్కొనుచున్నది. ఇతనికి చెన్నబసవయ్య యను మేనల్లుడు కలడు. ఈ చెన్నబసవయ్య నాగలాంబిక పుత్త్రుడు. ఇతనితోడి గలిసి బసవేశ్వరుడు తన మతమును వ్యాపింపజేయసాగెను. ఇతడు విషయాసక్తులయిన జంగమగురువులను రాజుయొక్క ధనముతో బోషించుచుండెను.[19] ఇట్లు సర్వస్వాతంత్ర్యమును వహించి యక్రమముగా ధనాగారాములోని ధనమునంతయు జంగాలపాలు చేయుచుండుట జూచి బసవేశ్వరునికి విరోధియగు మంచన్న యను మరియొక మంత్రి, బిజ్జలునకీ సంగతిని దెలియజేసెను. కొంతకాలము గడచునప్పటికి బిజ్జలునికిని బసవేశ్వరునికిని విరోధము బలమయ్యెను. బిజ్జలుడు బసవేశ్వరుని బట్టి చెరబెట్ట బ్రయత్నించెను. దీనిని దెలిసికొని బసవేశ్వరుడు తన యనుచరులతో దప్పించుకొని పోయెను. బిజ్జలుడు కొందరు భటులనతని వెంటబంపెను. బసవేశ్వరుడు వారలను దరిమెను. అంతట రాజు స్వయముగా సైన్యమును దీసికొని బసవేశ్వరుని వెంట దరిమెను. వీరశైవులనేకులు బసవేశ్వరుని పక్షమున నిలిచి ఘోరయుద్ధము చేసి రాజు సైన్యమునోడించిరి. తరువాత రాజు బసవేశ్వరునితో సమాధానము చేసికొని యథాప్రకారమతనిని పూర్వ పదవియందుంచెను. [20]కాన యీ మైత్రి చిరకాలము నిలిచియుండలేదు.

బిజ్జలరాయని వధ.

బిజ్జలుడు బ్రతికియున్నంత వరకుదన మత మభివృద్ధి గాంచనేరదని బసవేశ్వరుడు తలపోయుచుండెను. కళ్యాణపురమున బసవేశ్వరునికి బ్రియభక్తులగు నిరువురు శైవులుగలరు. బిజ్జలుడు తన మతస్థులయిన జైనులను ఆ యిరువురు దూషించెడు దూషణవాక్యములకు సహింపనోపక వారి కన్నులనూడబెరికించెను. ఈ ఘోరకృత్యమును బసవేశ్వరుని శిష్యులయిన వీరశైవులందరును విని, బిజ్జలునిపై బగదీర్చుకొను తలంపుతో బసవేశ్వరుని యింట సమావేశమై నిర్ధారణ చేసికొనిరి. అంతట బసవేశ్వరుడు బిజ్జలుని జంపుటకై జగద్దేవునకుత్తరువుచేసి, కళ్యాణపురిని శపించుచు నా పట్టణమును విడిచిపెట్టిపోయెను. జగద్దేవుడీ క్రూరసంహారమునకు మొదట కొంత సంశయించెను గాని, తల్లి ప్రోత్సహించుటచే ధైర్యసాహసములు ముప్పిరిగొన దన మిత్త్రులగు మల్లయ్య, బొమ్మయ్యయను వీరశైవులనిరువురను దోడుచేసికొనగా, వీరావేశము మొలకెత్త దిన్నగా నీ మువ్వురునంతఃపురమునకు జని, రాజపరివారమును ద్రోచికొనిపోయి బిజ్జలునిసమీపించి మహో దగ్రులై హరహరాయని ఖడ్గములుదూసిపై బడి యాతనిని ముక్కలుచెక్కలుగ చెలగిపారవైచిరి. ఈ క్రూరసంహారకులంతట నంతఃపురమున నుండనొల్లక సాహసవృత్తిచే దప్పించుకొనివచ్చి వీధినబడి తాము చేసిన పనికింగారణము చెప్పుచు కత్తులం ద్రిప్పుచు చెలరేగుచుండిరి.

ఘోరమైన మతయుద్ధము.

అంతట జైనులతోడను వీరశైవులతోడను నిండియుండిన యామహాపట్టణమున నీమహాఘోర సంహారవృత్తాంత మంతయు నొక క్షణములో వ్యాపించి సంక్షుభిత మయ్యెను. పౌరజనంబులు, జైనులును వీరశైవులు నను నిరుకక్షలంజేరి, ద్వంద్వయుద్ధము చేయగడంగిరి. ఇట్లు మనుష్యులు మనుష్యులతోను, అశ్వికులాశ్వికులతోను, గజాధిరూఢులు గజాధిరూఢులతోను, రథికులు రథికులతోను బాలురు బాలురతోను, ఘోరముగా బోరాడిరి. పట్టణమంతయు నెమ్ములరాసులతోను, మాంసపిండములతోను, నెత్తురు వరదలతోను, మునిగిపోయి మిగుల భయంకరముగ నుండెను. బసవేశ్వరుడు సంగమేశ్వర క్షేత్రమునకు బోయి శివుని దేహములో గలిసిపోయెను. [21]

చెన్నబసవేశ్వరుడు.

జైనులు వ్రాసిన వృత్తాంతము మరియొక విధముగా గన్పట్టుచున్నది. బిజ్జలుడు శిలాహార రాజగు రెండవ భోజుని వశపరచుకొనుటకై కొల్లాపురముపై దండెత్తిపోయెను. దండయాత్ర ముగించి మరలి రాజధానికి వచ్చునప్పుడు భీమానది యొడ్డున నొకానొక ప్రదేశమున విడిచియున్న కాలమున బసవేశ్వరుడొక జంగమునకు జైనవేషమును ధరింపించి విషపూరితమైన యొక ఫలమునిచ్చి యతనికడకు బంపెనట. బిజ్జలుడు జైనుడగుటవలన ననుమానింపక యామాయవేషధారివలన నా ఫలమును స్వీకరించి వాసన 25

చూచి స్పృహతప్పిపడిపోయెనట. మాయవేషధారి యగునాజంగమ తప్పించుకొని పారిపోయెను. అంతట బిజ్జలునికుమారుడు మొదలగువారెల్లరును వచ్చిరి. బిజ్జలుడు కొంతసేపటికి దెలివినొంది, జరిగిన వృత్తాంతమంతయు దెలిసికొని, తనకుమారుడగు సోమేశ్వరునకు బసవేశ్వరుని జంపనుత్తరువు చేసెనట. తక్షణమే యిమ్మడి బిజ్జలుడు బసవేశ్వరుని బట్టుకొనవలసినదనియు, జంగములెక్కడ గానిపించినను చంపవలసినదనియు, దన పరివారమునకాజ్ఞ చేసెను. ఈ వార్తవిని బసవేశ్వరుడు పారిపోయెను. ఇమ్మడిబిజ్జలుడా పట్టణమును ముట్టడించెనట. బసవేశ్వరుడు తప్పించుకొను వెరవులేక యొక బావిలోపడి మృతనొందగా, నతని భార్యయు విషము గ్రోలి ప్రాణత్యాగము చేసెనట. బిజ్జలుని కుమారుడు శాంతచిత్తుడైన వెనుక బసవేశ్వరుని మేనల్లుడగు చెన్నబసవయ్య తన మేనమామ యాస్తినంతయు వశపరచి యతనికి లోబడి యాతని దయకు బాత్రుడయ్యెనట. [22]ఈ చెన్నబసవేశ్వరుడు లింగాయతులకు నాయకుడై బసవేశ్వరునికంటె నుత్తమస్థితికి వచ్చి చక్కని కట్టుదిట్టములేర్పరిచి వీరశైవమునుద్ధరించెనట. [23] వీరశైవమతమును బోధించుటకై ప్రణవమీతనిలోపల నావిర్భవించెను. చెన్నబసవపురాణమును బట్టి చెన్నబసవడు శివుడనియు, బసవడు నంది యనియు, బిజ్జలుడు ద్వారపాలకుడనియు, కళ్యాణమే కైలాసమనియు వీరశైవులు ప్రమథగణంబులనియు దేటపడుచున్నది. [24]

కాలచుర్యవంశము.

బిజ్జలుడు క్రీ.శ.1167వ సంవత్సరమున జంపబడియెను. అప్పటినుండి బిజ్జలుని సంతతివారు 1172వ సంవత్సరము వరకును కళ్యాణపురమును బరిపాలించిరి. బిజ్జలుని తరువాత సోమేశ్వరుడు, సంకాముడు, ఆహవమల్లుడు నను కాలచుర్యరాజులు మూవురు పరిపాలించినట్లు కన్పట్టుచున్నది. శా.శ.1104(క్రీ.శ.1182)వ సంవత్సమున బశ్చిమ చాళుక్య రాజగు నాలుగవ సోమేశ్వరుడు కాలచుర్యులనుండి తన పూర్వులు గోల్పోయిన భాగములను మరల స్వాధీనముగావించుకొనియెను. మరికొన్ని భాగములను దేవగిరి యాదవులును, కాకతీయాంధ్రులును ఆక్రమించుకొనగా బిజ్జలుని వంశమంతరించినది.

చాళుక్య పరిపాలనము.

ఈ నాలుగవ సోమేశ్వరునితో చాళుక్య పరిపాలనముగూడ నడుగంటెను. ఈ చాళుక్య పరిపాలనమునందచ్చటచ్చట కొందరు వైశ్యులు మొదలగువారు బౌద్ధవిహారముల నిర్మించి దానధర్మములు మొదలగునవి చేయుచున్నను, అచ్చటచ్చట బౌద్ధమత సంబంధము లయిన చిహ్నములు గానంబడుచుండినను, బౌద్ధమతము క్షీణించినదనియే చెప్పవచ్చును. వీరశైవమతోద్ధారణతో జైనమత విజృంభణమణగిపోవుటయేగాక, క్రమక్రమముగా క్షీణింపనారంభించెను. వర్తకులు రాజకీయోద్యోగులు వీరశైవమత మవలంబించుట చేత నా మతము వ్యాపించుచుండెను. జైన విగ్రహముల స్థానముల యందు బ్రాహ్మణుల విగ్రహములు ప్రతిష్ఠింపబడుచుండెను. ఈ కాలమునందే దేశము యొక్క మతసాంఘికస్తితి సంపూర్ణముగా మారిపోవుటకు ప్రారంభమైనది. మరల పౌరాణికమతము విజృంభింపనారంభించినది.

పౌరాణికమతము.

నిబంధన గ్రంథములు.

పురాతనమైన దేవతార్చనము వర్థిల్లుచుండెను. న్యాయధర్మ విషయములు పురాణములలోను స్మృతులలోను వెదజల్లబడి చెదరిపోయియుండుట చేతను, పరస్పర విరుద్ధములుగనుండుట చేతను, వానినన్నిటిని క్రోడీకరించి బ్రాహ్మణులును తదభిమానులగు రాజులును నిబంధన గ్రంథములను వ్రాయింప వలసివచ్చెను. న్యాయ ధర్మ శాస్త్ర విషయములయందు బెక్కుక సందేహములుప్పతిల్లుటచేత నిబంధన గ్రంథములత్యావశ్యకము లయినవి. కాబట్ట యీ కాలమునందే యనేక నిబంధన గ్రంథములు వ్రాయబడినవి. ఈ గ్రంథరచన పదునొకండవ శతాబ్దము మొదలు పదునాలుగవ శతాబ్దాంతము వరకు జరుగుచుండెను. ధారేశ్వరుడు, విజ్ఞానేశ్వరుడు, అపరార్కుడు, హేమాద్రి, సాయనుడు మొదలగు నిబంధనగ్రంథకారులెందరో గలరు.


అనంతర రాజకీయ స్థితి.

దక్షిణమున హోసలబల్లాలరాజులును ఉత్తరమున దేవగిరి యాదవ రాజులును, తూర్పున గాకతీయాంధ్రులును బ్రబలియుండుట చేత బశ్చిమ చాళుక్య రాజ్యము, నాల్గవ సోమేశ్వరునితోనే యంతరింప వలసిదయ్యెను. ఈ కాలమునందు హోసలరాజయిన వీరబాల్లాలుడు గాంగవాడి, నలంబవాడి, బనవాసి రాజ్యములనాక్రమించుకొని, పరాక్రమవంతుడై పరిపాలనము సేయుచుండెను. ఇతడు రామానుజుని శిష్యుడగు విష్ణువర్ధనుని మనుమడు. ఈ వీరబల్లాల రాజు కళ్యాణపురముపై దండెత్తివచ్చి నాల్గవ సోమేశ్వరుని సైన్యాధ్యక్షుడగు బొమ్మరాజునెదుర్కొని యాతని గదనరంగమున నోడించి బిజ్జలునియొద్దనుండి గైకొన్న రాజ్యమునాక్రమించుకొనియెను. అటుపిమ్మట శాణదేశమును బాలించుచుండిన భిల్లముడను యాదవరాజు విజృంభించి శాలివాహన శకము 1109 అనగా క్రీ.శ.1187వ సంవత్సరముననంశల భూమీశునిదగు శ్రీవర్ధనమను పట్టణమును ముట్టడించి ప్రత్యండకరాజును భండనముననుక్కడించి, మంగళవేష్టకరాజగు వజ్రుని జిక్కాడి, కళ్యాణరాజ్యమునాక్రమించు హోసలయాదవుని ముందునకు జరగిరానీక హద్దునియమించి, కృష్ణానదికి ఉత్తరభాగమునంతయు నాక్రమించుకొని, దేవగిరిని రాజధానికగ జేసికొని, పరిపాలనము చేయసాగెను. కుంతలము అనగా దక్షిణ మహారాష్ట్రమును కర్ణాటమును విష్ణువర్ధనుని మనుమడు వీరబల్లాలరాజు పరిపాలనము చేయుచుండెను. త్రిలింగరాజ్యమును మొదటి ప్రతాపరుద్రుడు విస్తరింప జేయుచుండెను. కళింగ గాంగజవంశజులుత్కల రాజ్యమును గాంగనదివరకు వ్యాపింపజేయుచుండిరి. వేగిదేశ మంతయు పేరికి మాత్రము చోడచక్రవర్తులకు లోబడియున్నను అనేక మండలములుగా విభాగింపబడి మహామండలేశ్వరులయిన తెలుగు చోడులచేతను, పల్లవులచేతను, చాళుక్యులచేతను, బరిపాలింపబడుచుండి తుదకు కాకతీయాంధ్రసామ్రాజ్యమునకు వశమైపోయెను. పండ్రెండవ శతాబ్దాంతమునందు దక్షిణ హిందూస్థానమున నేకచ్ఛత్రాధిపత్యమును వహింపవలయునని పై మూడు సామ్రాజ్యముల వారును బోరాడుచునేయుండిరి. పండ్రెండవ శతాబ్దస్థితి సంగ్రహముగా దెలిపితిమి గావున, నీ శతాబ్దమునందు మహామండలేశ్వరులుగనుండి కృష్ణానది మొదలుకొని కాంచీపురము వరకు బరిపాలించిన తెలుగు చోడ రాజుల వంశములను గూర్చి రెండవ ప్రకరణమునందు వివరముగా వ్రాయుచున్నాడను.

మధ్వాచార్యులు.

ఈ శతాబ్దమునందే మరియొక సంస్కృతి బయలువెడలెను. ఇతడే ద్వైతమత స్థాపనాచార్యుడగు మధ్వాచార్యుడు. ఈ మతాచార్యుని కనంతతీర్థులని మొట్టమొదట నామకరణము చేసిరి. ఇతడు శాలివాహన శకము 1121కి సరియైన క్రీ.శ.1199వ సంవత్సరమున దక్షిణ కన్నడములోని యుడిపి గ్రామమున జనించెను. ఇతని గురువు పేరు అచ్చుతప్రేక్షుడు. తల్లిపేరు వేదవేది. తండ్రిపేరు మధ్యగేహభట్టు. ఇతడును శంకరరామానుజుల వలెనే ప్రస్థానత్రయమునకు భాష్యములను వ్రాసి ప్రసిద్ధికెక్కెను. జీవేశ్వరులకైక్యమెన్నడును లేదని యితని సిద్ధాంతమైయున్నది. దీనినే ద్వైతసిద్ధాంతమందురు. ఇది శంకరాచార్యుని యద్వైతమతమునకు విరుద్ధమయినది. ఈ మతసాంప్రదాయికులు ద్వైతులనియు, మాధ్వులనియు బేర్కొనబడుచున్నారు. ఉడిపి గ్రామమున వీరికి ప్రదానాచార్య పీఠముగలదు. కర్ణాటకమునందీ మతప్రచారమెక్కువగా నున్నదని చెప్పుదురు. ఈ మతకర్త ప్రస్థానత్రయమునకు భాష్యములను మాత్రమేగాక యనేక ద్వైతమత గ్రంథములనుగూడ విరచించెను.


 1. ఆంధ్రులచరిత్రము; ప్రథమ భాగము. 309_324 పుటలు
 2. ఆంధ్రులచరిత్రము; ప్రథమ భాగము. 248 పుట
 3. క్రీ.శ.1018వ సంవత్సరమగుచున్నది. ఇది సరియైనదిగగన్పట్టదు. ఇది చర్చించదగిన విషయము.
 4. The Making of Mysore by S.Krishnawamy Aiyangar, M.A., p.14
 5. The Indian Antiquary, Vol.II. May. 1873
 6. Life and Teachings of Sri Ramanuja by C.R.Srinivasa Aiyengar B.A., p.215
 7. The Life and Teachings of Sri Ramauja by C.R.Srinivas Aiyangar, p.224
 8. సాధారణ నామ సంవత్సర చైత్రశుద్ధప్రతిపత్ భానువాసరంబున బ్రకటితంబయిన యాంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 199వ పుటలో నీక్రింది రెండుపద్యములుదాహరించియున్నారు.
 9. ఈ పాదమున గణభంగము గానిపించుచున్నది.
 10. మాధవిపట్టణము దెనుగులో గురివింద స్థలమనియు, గురిజాలయనియు జెప్పబడుచున్నది.
 11. మహాదేవితటాకము మాదేవిచెరువు, మాదేవిచర్ల, మాచర్ల యని చెప్పబడుచున్నది.
 12. Jour. B.B.R.A.S., Vol.XI., p.268
 13. Jour R.A.S.Vol.IV., p.16
 14. P.S&O.C.Ins. No. 140.
 15. ఆంధ్రకవుల చరిత్రము, ప్రథమభాగము, పుట.47.
 16. తెలుగు బసవపురాణమును పాలకురికి సోమనాథకవి ద్విపద కావ్యముగా రచించియున్నాడు. ఇతడు రెండవ ప్రతాపరుద్రుని కాలములోనివాడు. కన్నడ బసవపురాణమును రచించినవాడు భీమకవి. ఇతడు దేవరాయల కాలములో నుండుట చేతను, మత గ్రంథమునందు పాలకురికి సోమనాథుని బేర్కొనియుండుట చేతను ఆంధ్రబసవపురాణమే మొదటిదిగానూహింపదగియున్నది.
 17. కన్నడబసవ పురాణమునందు బసవరాజు కాలడిగి జిల్లాలోని భాగెవాడి గ్రామమున జనించినట్లు చెప్పబడినది
 18. Sir W.Elliot's paper, Jour.R.A.S., Vol.IV., p.20.
 19. Jour. B.B.R.A.S., Vol.VIII., pp.78 & 89.
 20. Jour. R.A.S., Vol.IV., p.21; Jour. B.B.R.A.S., Vol.VIII., p.89.
 21. Jour. B.B.R.A.S., Vol.VIII., p.96; Wilson's Mackingie Mss. pp.300-310
 22. Wilson's Mackengie Mss. p. 320.
 23. మొట్టమొదట వీరశైవమతమును సంస్కరించి బోధించినవాడు ఏకాంతాడ రామయ్య యనునాతడనియు, బిజ్జలుడు జైనుడయినను వీరశైవులయెడ విరుద్ధముగా బ్రవర్తింపలేదనియు, కొంతవరకు సమ్మతిని గనబరచుచు వచ్చెననియు, నిజాముమండలములోని నిడుగల్లు శాసనము మొదలగు వాని వలన దెలియుచున్నది. అయిననీవిషయమింకను బరిశోధింపవలసియున్నదని డాక్టరు ఫ్లీటుగారభిప్రాయపడియున్నారు.
 24. చెన్నబసవపురాణమును పిడుపర్తి సోమనాధకవి పద్యకావ్యముగా వ్రాసియున్నాడు