Jump to content

ఆంధ్రభాషాభూషణము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక.

ఆంధ్రభాషాభూషణము పద్యరూపమగు తెనుఁగువ్యాకరణము. సుప్రసిద్ధుఁడగు కేతనకవి రచించినది. తిక్కనసోమయాజి కుభయకవిమిత్రుఁడని ప్రసిద్ధి యున్నట్లే కేతనకవికిఁ గవిమిత్రుఁడని ప్రసిద్ధి గలదు. ఆకాలమున నిదియొక బిరుదము వంటిది. సంస్కృతమున దండి గద్యకావ్యముగా రచించిన దశకుమారచరిత్రమును మన కవిమిత్రుఁడు తెనుఁగున బద్యకావ్యముగా రచించి యుభయకవిమిత్రుఁడును భారతకవిమధ్యముఁడు నగు తిక్కన సోమయాజికిఁ గృతియిచ్చి యాతని మెప్పువడసిన ప్రౌఢకవి. దాననే కేతనకవికి నభినవదండి యను బిరుదము గలిగినది. ఈతఁడు సకల కళానిపుణుఁడు, శుభచరిత్రుఁడు, శివభక్తుఁడు, సత్కవి. ఈవిషయము లాంధ్రభాషాభూషణమందలి పద్యములలోఁగలవు.

క. "వివిధకళానిపుణుఁడు నభి
    నవదండి యనంగ బుధజనంబులచేతన్
    భువిఁ బేరు గొనినవాఁడను
    గవిజనమిత్రుండ మూలఘటికాన్వయుఁడన్. 2

క. ఖ్యాతశుభచరిత్రుఁడ వృష
    కేతనపాదద్వయీనికేతనుఁ డనఁగాఁ
    గేతన సత్కవి యనఁగా
    భూతలమున [1]నుతిశతంబుఁ బొందినవాఁడన్. 3

ఆ. కవితఁజెప్పి యుభయకవి మిత్రు మెప్పింప
    నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ
    బరఁగ దశకుమారచరితంబుఁ జెప్పిన
    ప్రోడ నన్ను వేఱె పొగడనేల?" 15

కేతనకవి మూలఘటికాన్వయుఁడు అనఁగా ఈతని యింటిపేరు మూలఘటికవారు. అహోబలపండితీయమును గాళిందీకన్యాపరిణయమును రచించిన గాలి నరసయ్య, గాలి అనుదానికి ప్రభంజనము అనియు, నరసయ్య అనుదానికి అహోబలపతి యనియు సంస్కృతీకరించి, ప్రభంజనము అహోబలపండితుఁడని పేరు పెట్టుకొనియుండెను. అట్లే మూలఘటికానామమునకు మొదటి తెలుఁగుపద మేదో యుండియుండును. లేక వీరఘంటలవారివలె మూలఘంటలవా రుండిరో. ఈతనితండ్రి పేరు మ్రానయ్య తల్లిపేరు అంకమాంబ. ఈతనితండ్రిపేరు మారయ్య యనియుఁ దల్లిపేరు సంకమాంబ యనియుఁ గొంద ఱభిప్రాయపడిరి. వార ట్లభిప్రాయపడుటకుఁ గారణము లేకపోలేదు. ఆంధ్రభాషాభూషణము నందే 189 పద్యమున "మానెఁడు జేనెఁడు ననుక్రియ, మానకెఁడులనొందుమీఁ దమ్రానయకేతా" అనియున్నచోట "మార్నకేతా" అని చెన్నపురి ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమందున్న వ్రాఁతప్రతిలోను, "మారయకేతా" యని యాంధ్రసాహిత్యపరిషద్భాండాగారమందున్న (1859 పుస్తకసంఖ్యగల) తాళపత్రగ్రంథమునను గలదు. ఒకప్రతిలో "మ్రానయకేతా" యనుటకు "మహిలో దండీ" యని గలదు.

అవి యటుండ దశకుమారచరిత్రమందుఁ బీఠికలో 23 పద్యమున "మూలఘటికాన్వవాయ సముద్రపూర్ణ, హిమమయూఖుండు మారయకమలకమల, వదనయగు సంకమాంబకు వరతనూజుఁ, గేతనార్యుని నన్ను విఖ్యాతయశుని" అని గలదు. ఇట్లు మారయ్యయను వ్రాఁతలనుబట్టి వార ట్లభిప్రాయపడి యుందురు. కాని మ్రానయ్య యనియే యనవలయును. కేతనకవిరచించిన విజ్ఞానేశ్వరమునం దీక్రింది పద్యమున మ్రానయ యని నకారము ప్రాపస్థానమునఁ బ్రయోగింపఁబడినది. దాన మ్రానయయని ధ్రువపడినది.

క. "మ్రానయకు నంకమాంబకు
   సూనుఁడ మితసత్యహితవచోవిభుఁడను వి

     జ్ఞానారూఢమనస్కుఁడ
     నానాశాస్త్రజ్ఞుఁడను వినయభూషణుఁడన్." 3

1925 సం. మున వావిళ్లవారు ప్రకటించిన దశకుమారచరిత్రమునకు మొదటఁజేర్చిన తొలిపలుకునఁ గేతనకవినిగుఱించి వ్రాయుచు నక్షత్రచిహ్నముంచి పుటకుఁ గ్రిందిభాగమున గీఁతక్రింద "ఈకేతన కాదంబరి పద్యకావ్యము చేసెనని కొందఱందురు. ప్రబంధరత్నాకరమున కాదంబరి రచించినది మ్రానయ కేతన యని గలదు గాన నతఁ డింకొకఁడు" అని తొలిపలుకు వ్రాసినవారు వ్రాసిరి. దశకుమారచరిత్రాదులు రచించిన కేతన మారయ కేతన యని భ్రాంతిపడుటచేత వా రట్లు వ్రాసియుందురు. మ్రానయ కేతన యన మన యభినవదండియే. వారు వ్రాసినకారణమునుబట్టి వారి యుద్దేశమునకు వ్యతిరేకముగాఁ గాదంబరి యభినవదండి బిరుదాంకితుఁడగు కేతన రచించినట్లే ధ్రువపడుచున్నది. రంగరాట్ఛందంబునందుఁ గేతన కాదంబరిలోనివని కొన్నిపద్యము లుదాహరింపఁబడినవి. వానిలో నొకపద్యముక్రింద భాస్కరుని కేతన యని యుండుటచేత ఆకేతన యితరుఁ డేమోయని యూహింపవలసి యున్నది. కాని మ్రానయ కేతన యనుటచే నాతఁ డింకొఁకడనుట యుక్తముగాదు.

కేతనకవి తల్లిపేరు సంకమాంబయో, అంకమాంబయో ధ్రువపఱచుప్రయోగము గనఁబడలేదు గాని, "మారయకు, నంకమాంబకు" అని యనేకస్థలములలో నుండుటచేత అంకమాంబ యంటిని. నకారసకారములకుఁ దాళపత్రగ్రంథములలో భేదము గనిపట్టుట గష్టము. అంకాలమ్మ, అక్కమ్మ యనుపేళ్లు ప్రాయికముగాఁ గలవు. మహాంకాళమ్మ, అంకాళమ్మ, అంకాలమ్మ, అంకమ్మ అను రూపములు మహాకాళమ్మ శబ్దమున కపభ్రంశములయి యుండును. సంకమ్మ యనుపేరు శ్రుతచరము గాదు. తాళపత్రగ్రంథముల వ్రాఁతనుబట్టియును అంకమాంబ యనుటయే యుచితమని తోఁచినది.

దశకుమారచరిత్రము గృతినందిన తిక్కన సోమయాజితోపాటు తత్కృతికర్తయగుకేతన పదుమూఁడవశతాబ్దికి నడిమనున్న వాఁడనుట నిర్వివాదము. ఆంధ్రభాషాభూషణ గ్రంథాంతమందు "ఇది శ్రీమదభినవదండివిరచితంబైన యాంధ్రభాషాభూషణంబునందు సర్వంబు నేకాశ్వాస"మని కొన్ని ప్రతులలోఁ గలదు. ఆంధ్రసాహిత్యపరిషద్భాండాగారమందు 552 సంఖ్యగల తాళపత్రగ్రంథమున "శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజివరప్రసాదకవితాది విలాసవేదశాస్త్రపురాణేతిహాసకళావినోదమానస... ఖ్యాత కేతనామాత్యప్రణీతంబైన యాంధ్రభాషాభూషణం బనుశబ్దశాస్త్రంబునందు నేకాశ్వాసము" అని కలదు. దీనినిబట్టి కేతనకవికిఁ దిక్కనసోమయాజి కవితాగురువని తేలుచున్నది. కేతన తిక్కనసోమయాజికంటెఁ జిన్నవాఁడని యూహింపవచ్చును.

కేతనకవి, దశకుమారచరిత్రము, విజ్ఞానేశ్వరము (ఇది యాజ్ఞవల్క్యస్మృతికిఁదెలుఁగు. ఐదు యాజ్ఞవల్క్యస్మృతికి వ్యాఖ్యయగు విజ్ఞానేశ్వరీయములోని విశేషవిషయములుగూడ నాంధ్రీకరింపఁబడినవి. కావుననే యా నామకరణము చేయఁబడియుండును) ఆంధ్రభాషాభూషణమును రచించెను. కాదంబరి పద్యకావ్య మాతఁడు రచించినదగునో కాదో సందేహము. ఇతరోదాహృత పద్యములనుబట్టి యూహించిన యూహలేగానిగ్రంథ మింతవఱకు లభింపలేదు. వానిలోఁ బ్రకృతమగు నాంధ్రభాషాభూషణము తెనుఁగువ్యాకరణములలో మొట్టమొదటిదని ఈక్రింద నుదాహరించిన యాంధ్రభాషాభూషణపద్యములు తెలుపుచున్నవి.

క. "మున్ను తెనుఁగునకు లక్షణ
   మెన్నఁడు నెవ్వరును జెప్పరేఁ జెప్పెద వి

     ద్వన్నికరము మదిమెచ్చఁగ
     నన్నయభట్టాదికవిజనంబులకరుణన్. 6

తే. సంస్కృతప్రాకృతాదిలక్షణముఁ జెప్పి
    తెనుఁగునకు లక్షణముఁ జెప్పకునికియెల్లఁ
    గవిజనంబులనేరమిగాదు నన్ను
    ధన్యుఁ గావింపఁదలఁచిన తలఁపుగాని." 7

ఈతఁడు వ్యాకరణము క్రొత్త రచింపబూనుటయా యని యధిక్షేపించుచు మూతివిఱుచుకొన్నవారు కొంద ఱాతనికాలమున నుండిరి. కావుననే యట్టివారి కాతఁ డొకమ్రొక్కు మ్రొక్కినాఁడు.

ఉ. "క్రొత్తగ నాంధ్రభాషకును గొండొకలక్షణ మిట్లుచెప్పెనే
    యుత్తమబుద్ధి వీఁడయని యోరలువోవక విన్న మేలు మీ
    రొత్తిన మీకుమాఱు కొని యుత్తరమిచ్చుట చాలవ్రేఁగుమీ
    చిత్తమునందు నన్నెరవుసేయకుఁడీ కవులార మ్రొక్కెదన్."

ఇందు "నన్నురవసేయకుఁడీ" అనిపాఠాంతరము గలదు. పైపద్యములలో మున్నెవ్వరును దెనుఁగునకు లక్షణము చెప్పలేదనియుఁ గ్రొత్తగ లక్షణము చెప్పుచున్నాననియుఁ గంఠోక్తిగాఁ గేతనకవి చెప్పెను. ఇట్లున్నను "నన్నయభట్టాదికవిజనంబులకరుణన్" అనుటచేత నన్నయభట్టు రచించినఁ దనఁబడు నాంధ్రశబ్దచింతామణి చూచి దాని ననుసరించియే కేతన వ్యాకరణము రచించినట్లు సూచింపఁబడుచున్నదని కొంద ఱందురు. అది సుసంగతము కాదు. ఏలయన "నన్నయభట్టాది కవిజనంబులకరుణన్" అనుటవలన ఆంధ్రభాషాభూషణ మనులక్షణగ్రంథము రచించుటకు నన్నయభట్టాదికవుల భారతాదిగ్రంథములు లక్ష్యములుగాఁ గేతన గ్రహించెనని గ్రహింపఁదగును. కేవలము నన్నయభట్టకృతమనఁబడు వ్యాకరణమని గ్రహించినచో నన్నయభట్టాది కవిజనంబులనుచోట అదిశబ్దకవిశబ్దములు వ్యర్థము లగును. అది కవ్యుద్దేశమునకు వ్యతిరేకమనక తప్పదు. వ్యాకరణమునే కవి యుద్దేశించినచో స్పష్టముగా నేల చెప్పఁడు. పై పెచ్చు వ్యాకరణమెన్నఁడు నెవ్వరుఁ జెప్పలేదని కంఠోక్తిగాఁ జెప్పునా?

ఆంధ్రశబ్దచింతామణి సంస్కృతభాషలో రచింపఁబడియుండుటచేత దానిని స్మరింపలేదనియుఁ, దెనుఁగున నెవ్వరును రచింపకపోవుటచేత నెవ్వరును వ్యాకరణము రచింపలేదని చెప్పెననియుఁ గొంద ఱందురు. పద్యములలో వ్యాకరణము రచించుటకే మొదటివాఁడని మరికొంద ఱందురు. అది యాపాతమధురము. కేతనకు నన్నయభట్టునం దాదరము గలదని "నన్నయభట్టాది కవిజనంబులకరుణన్" అనుదానివలనఁ దెల్లమగుచున్నదిగదా. నన్నయభట్టునం దంతగౌరవమున్నపుఁ డాతనివ్యాకరణమున్న

చో, దానిని బ్రశంసించి యది సంస్కృతమున నుండుటచే సర్వజన సుబోధముగాదని తాను తెనుఁగున వ్యాకరణము రచింపఁబూనినట్లు చెప్పుట కవిజనసహజము గదా. నన్నయభట్టవ్యాకరణము నెఱిఁగియు నెఱుఁగనట్లు నటించుటకుఁ గేతనకవికేమి యావశ్యకత గలదు? నన్నయభట్టవ్యాకరణమునం దనాదరమో, యసూయయో గలిగియుండునని యూహించినయెడల, నన్నయభట్ట వ్యాకరణము సంస్కృతమున నుండుటచే నాంధ్రజనోపయోగశూన్యమనియో, లోపభూయిష్ఠమనియో, లక్ష్యరహితమనియో యేదియో యొకదోషమెంచి దానిని నిరసించి తనగ్రంథమునకుఁ బ్రాశస్త్యము ప్రకటించుకొనుట సహజము. తానీ చిన్నవ్యాకరణము రచించినంతమాత్రముననే వ్యాకరణరచనలోఁ గుమారపాణినులతో సరియగువాఁడని జను లెంచవలయు నన్నంత స్వప్రాశస్త్యాభిలాషిగదా కేతనకవి. ఈవిషయ మీక్రిందిపద్యమునఁ దానే స్పష్టముగాఁ దెలిపి యుండెను.

క. "భాషావేదులు నను విని
   యాషణ్ముఖపాణినులకు నగు నెనయని సం
   తోషింప నాంధ్రభాషా
   భూషణమను శబ్దశాస్త్రమున్ రచియింతున్." 8

మరికొందఱు చింతామణియందుఁ దత్సమపదవిషయవ్యాకరణ మెక్కువగలదనియు, గేతన గ్రంథమునఁ దత్సమేతరపదవిషయవ్యాకరణ మెక్కువగలదనియు, ఆకారణముననే తెనుఁగుభాగమునకు ము న్నెవ్వరును వ్యాకరణము చెప్పలేదని కేతన యనెననియుఁ గొన్నికల్పనలు కల్పింతురు. అవి విమర్శసహములు గావు. కొంచెము తారతమ్యమున్నను రెండుగ్రంథములు రెండువిషయములను స్పృశించియే యున్నవి. కొన్నివిషయములలో వేఱువేఱుమార్గముల వ్యాకృతి గావించినవి. అంతమాత్రమునఁ గంఠోక్తిగాఁ జెప్పినవిషయము కొట్టివేయ వీలులేదు. కావున నన్నయభట్టాది కవిజనులగ్రంథములు ప్రమాణములుగాఁ గేతన గ్రహించెననుట యుక్తము.

ఇంతకును ఆంధ్రశబ్దచింతామణి యను పేరుగలిగి సంస్కృతభాషలోనున్న తెనుఁగు వ్యాకరణము నన్నయభట్టకృతమగునా? కాదా? యనునంశము వివాదగ్రస్తము. నన్నయభట్టకృతమనుట కనేక విప్రతిపత్తులు లేకపోలేదు. దానినిగుఱించి వ్రాయఁబూనినచో నొకపెద్దగ్రంథ మగును. అప్పటికిని ఇదమిత్థమనితేల్పఁ గొన్నిచోట్ల నవకాశము గల విషయము గాదు. మొట్టమొదటి పాఠములుగల గ్రంథము లభింపక కల్పితపాఠసహితములు లభించుటచేతఁ బ్రాచీనగ్రంథముల కీపాట్లు గలిగినవి.

ఒకవేళఁ జింతామణి నన్నయభట్టకృతమని సిద్ధాంత మొప్పుకొన్నను ఆగ్రంథము కేతనదృష్టికి గోచరమయినదన నవకాశము లేదు. కేతనకవి యాంధ్రశబ్దచింతామణి చూచియున్నచో దాని ప్రశంస చేసియుండునుగదా. అంతేకాక "ఆంధ్రభాషాభూషణ మనుశబ్దశాస్త్రమున్ రచియింతున్" అని పెద్దప్రతిజ్ఞ చేసిన కేతన చింతామణిలోని విషయములును వ్యాకరణరచనాపద్ధతియును గ్రహించియుండును లేదా దానికంటెను శాస్త్రప్రక్రియానుకూలముగాఁ దాను వ్యాకరణము రచించియుండును. విమర్శించినచోఁ గేతనగ్రంథముకంటెఁ జింతామణి వ్యాకరణసంప్రదాయానుసారముగా నున్నది. ప్రక్రియావిషయమునఁ జింతామణియే సయుక్తికముగను, శాస్త్రీయముగను నున్నది. కేతనకవికిది మొట్టమొదటిప్రయత్న మనుటకు నిదియుఁ దోడ్పడుచున్నది. అది కేతన చూచియున్నచో నాంధ్రభాషాభూషణము నింతకంటె విపులముగను వ్యాకరణసంప్రదాయయుక్తముగను జేసియుండును. ఒకవేళ దానియం దనాదరము గలిగెనేని అందలివిషయములు ఖండించి, నిరసించి యుండును. చింతామణిప్రక్రియకుఁ గేవలము వ్యతిరేక ముగా నున్నస్థలములలోనయినఁ జింతామణిప్రక్రియను ఆదరమున్నచో మతాంతరముగాను లేనిచోఁ బ్రతికూలమతముగాను జూపుట వ్యాకరణరచనాపద్ధతి. కేతన వ్యాకరణమున నట్టివిషయ మెక్కడను గనఁబడదు. ఆవిషయములు ధ్రువపఱుప నొండు రెండుస్థలములు దిక్ప్రదర్శనముగా జూపెదను.

—: పూర్ణబిందువు, ఖండబిందువు :—

రాముణ్డు, రాముండు, రాముఁడు అనురూపములలో మొదటిది అనఁగా అనునాసికసహితరూపముఁ గనఁబడుచున్నది. ఆధునికులవ్రాఁతలలో నర్ధబిందువు వ్రాయఁబడుచున్నది. శాసనములలోను, తాళపత్రగ్రంథములలోను, గొన్నిచోట్ల హ్రస్వముమీఁద సానునాసికరూపముగాని సబిందుకరూపముగాని వ్రాయఁబడియున్నను అర్ధబిందుసహితరూప మున్నచోట్లవలెఁ దేల్చి పలుకవలయును. లేనిచో ఛందోభంగము గలుగును. ఆవిషయము శాసనపాఠకులకును, తాళపత్రగ్రంథద్రష్టలకును, విమర్శకులకును దెలిసిన సుప్రసిద్ధవిషయమే గాన గ్రంథవిస్తరభీతిచేత నుదాహరణము లీయలేదు. దీర్ఘముమీఁది బిందు వూఁది పలికినను, తేల్చి పలికినను గురుత్వమున సమానమే గాన ఛందో భంగము లేదు. తేల్చి యర్ధబిందువున్నచోటఁ జదివినట్లు చదువవచ్చును. కాని పూర్ణబిందు పూర్వకప్రాసస్థానమున దీర్ఘముమీఁదిబిందువు నూఁది పలుకవలయును. ఇది యాధునికకవుల గ్రంథములలో లేదు. కాని ప్రాచీనకవులగ్రంథములలోఁ గేతనకాలపుఁగవులగ్రంథములలోఁ గొన్నిచోట్లఁ గలదు. క్వాచిత్కమగుటచే రెండుస్థలములు చూపుచున్నాను.

ఉ. "వీంగు నపారసత్యగుణవిస్ఫురణం బరమేశ్వరోరువా
    మాంగమునందు......................................................
   లోంగిన............................................................వే
    దాంగు ననంతు.....................................................".

క. "పోంకనలి నీరజస్వల
   సోంకిన దోషంబువాయ సూర్యుఁడు గవితా
   శంక నపరాంబుధిలోఁ
   గ్రుంకెనొకోయనంగఁ బ్రొద్దు గ్రుంకుడునంతన్."
                                  నన్నెచోడుని కుమారసంభవము.

తర్వాత కవులుగూడ కొంద ఱుపయోగించిరి. "కాంతకుమదిఁ బుట్టెడుతల పోంతలతో..." కాలిందీకన్యాపరిణయము. ఇట్టివి అరుదుగాఁ గలవు. మొత్తముమీఁద సానునాసికరూపము అతిప్రాచీనమనియు, బూర్ణబిందుసహితము తర్వాతిదనియు, నది తేల్చి పలుకుటచే నర్ధబిందురూపము గలిగెననియు నిర్ధారణముచేయుట సయుక్తికము. కావున హ్రస్వముమీది పూర్ణబిందువు అర్ధబిందువగుననుట ప్రాచీనపుఫక్కిగాని, హ్రస్వముమీఁది యర్ధబిందువు పూర్ణబిందువగుననుట ప్రాచీనపుఫక్కిగాదు. ఈవిషయమున నాంధ్రభాషాభూష ణాంధ్రశబ్దచింతామణులపద్ధతి యెట్లున్నదో పరిశీలింతము.

—: ఆంధ్రభాషాభూషణము :—

క. "కుఱుచలతుది హల్లులకున్
   బిఱుఁద న్నెలకొన్నయట్టిబిందువులెల్లన్
   నెఱయఁగ నూఁదుచుఁ దేలుచు
   నొఱపై యిరుదెఱఁగుఁ జెల్లుచుండుం గృతులన్." 56

క. "ననుఁగను నన్నుంగను దా
   ఘనుఁడు ఘనుం డనఁగఁజెల్లుఁ గవ్యనుమతిచేఁ
   దనుబోఁటి లోభివాఁ డితఁ
   డన నిడుపులమీఁదిబిందు లరబిందులగున్." 57

క. "కుఱుచలపై యరబిందులు
   నెఱయఁగ నూఁదినను జెల్లు నిడుపులమీఁదన్
   నెఱయపు గద్యంబులలో
   నెఱబిందువు లూఁదుఁ బద్యనికరములోనన్." 58

చివరపద్యమునఁ బాఠభేదములు గలవు. అవి చూపి పైరీతిని బాఠము సవరణచేయుటకుఁ గారణము తెలిపెదను. తాళపత్రగ్రంథముల నున్నరీతినే వ్రాయఁబడును.

I. క. "కురచలతుది యరబిందులు
      నెరవులు నంద్దంబులతో
      నెరిబిందువు పద్యగద్యనికరంబులకున్."

ఆంధ్రసాహిత్యపరిషద్భాండాగారమందున్న తాళపత్రగ్రంథము. దానిసంఖ్య 552.

II. క. "కురచలపై యరబిందులు
       నెరయఁగ నూఁదిననుజెల్లు నిడపులమీందన్
       నెరయవు పద్యంబులలో
       నెరబింద్దువులందు గద్యనికరంబులలో."

ఆంధ్రసాహిత్యపరిషద్భాండాగారము నందలి తాళపత్రగ్రంథము. దానిసంఖ్య 1869.

క. "కుఱుచులపై యరబిందులు
   నెఱయఁగ నూఁదినను జెల్లు నిడుపులమీఁదన్
   నెఱయవు పద్యంబులలో
   నెఱబిందువులందు గద్యనికరములోనన్."
                                           1923 సం. ముద్రితము.

ఇట నెఱబిందువులందు అనుచోట నెఱబిందువు లూఁదు అని పాఠాంతరము పుట క్రిందిభాగమునఁ జూపఁబడినది. ఇందు నిపుడులమీఁది బిందువులు గద్యములలో నూఁదుననియుఁ బద్యంబులలో నూఁదవనియుఁ గలదు. అది సంగతముగాదు. గద్యములలో నూఁదుట లేదు. పూర్ణబిందుపూర్వకప్రాసమున్నచోటఁ బద్యములలోనే యూఁదుట గలదు. కావున "నెఱయవు గద్యంబులలో, నెఱబిందువు లూఁదుఁ బద్యనికరములోనన్." అని సవరణ చేయఁబడినది.

హ్రస్వములమీఁది బిందువు లూఁదిన నూఁదవచ్చును. తేల్చి పలికినను తేల్చి పలుకవచ్చును. దీర్ఘములమీఁది బిందువు లరబిందువు లగును. అనఁగాఁ దేల్చి పలుకవలయును. హ్రస్వములమీఁది బిందువులు గద్యమునఁగూడ వచనరచనానుకూలముగా నూఁదిన నూఁదవచ్చును. గద్యములలో దీర్ఘములమీఁది బిందువు లూఁదవు. పద్యములలో నూఁదవచ్చును. అని పైదానితాత్పర్యము. కేతనవ్యాకరణమునఁ బూర్ణబిందు వర్ధబిందు వగునని విధింపఁబడినది.

ఇంకఁ జింతామణిపద్ధతి పరిశీలింతము. "సిద్ధస్సాధ్యశ్చానుస్వారః పూర్ణార్థభేదతో ద్వివిధః, హ్రస్వా త్పూర్ణో౽పి భవేద్దీర్ఘా చ్చేత్ఖండ ఏవ స జ్ఞేయః" "సున్న సిద్ధము, సాధ్యము అని ద్వివిధము. ఆబిందువే పూర్ణము, ఖండము అని రెండువిధములు గలది. హ్రస్వముకంటెఁ బరమయిన ఖండబిందువు పూర్ణబిందు వగును. దీర్ఘముకంటె బరమయినది ఖండబిందువే యని తెలియ దగును." అని పయిశ్లోకమునకు భావము. ఇందు హ్రస్వముమీఁది ఖండబిందువు పూర్ణబిందువగుననియు, దీర్ఘముమీఁదిది ఖండబిందువే యనియుఁ జెప్పఁబడినది. ఇంరు అర్ధబిందువు పూర్ణబిందువగుట విధేయవిషయము. కేతనగ్రంథమున దీనికిఁ గేవలము వ్యతిరేకముగాఁ బూర్ణబిందు వర్ధబిందువగుట విధేయము. రెండును బరస్పరవిరుద్ధములు. రెండిటిలోఁ గేతన ప్రక్రియయే ప్రాచీనమతపోషకమును ప్రాచీనతరము ననక తీఱదు. చింతామణిలోనిభావమును బ్రక్రియయుఁ గేతనకాలపుభావముకంటె నవీనమని చెప్పక తప్పదుగదా? అది కేతనకాలమునకు నిన్నూఱుసంవత్సరముల క్రిందటనున్న నన్నయభట్టుకాలములోని భావమనుట కవకాశము గనఁబడదు.

కానిండు ప్రాచీనార్వాచీనతలమాట యటుండనిత్తము. మాటవరుసకుఁ జింతామణి కేతనకుఁ బూర్వమే రచితమయినదని యొప్పుకొన్నను కేతన యిది చూచియుండఁడు. చూచియున్నచోఁ దా నామతమునకు వ్యతిరేకముగా నేలచెప్పును? చెప్పినపుడు చింతామణిమతము ఖండించి త్రోసివ్రేయఁడా? అది యొకమార్గమని యొప్పుకొన్నచోఁ బక్షాంతరముగాఁ జెప్పఁడా? అట్లు చెప్పుట వ్యాకరణకర్తల సంప్రదాయము. మనకేతన పాణినీయకౌమారవ్యాకరణాదులసంప్రదాయ మెఱిఁగినవాఁడేగదా. ఆంధ్రశబ్దచింతామణి కేతనకవి చూడనే చూడలేదనుట యుక్తము.

మరియొకవిషయము పరిశీలించి ముగించెదను.

క. "మల్లెయు లంజెయు గద్దెయు
   నొల్లెయు ననుపగిది పలుకులొప్పుగఁ గృతులన్
   మల్లియ లంజియ గద్దియ
   యొల్లియ యని పలికిరేని యొప్పుంగృతులన్." 177
                                     ఆంధ్రభాషాభూషణము.

ఎదంతరూపములకు ఇయాంతరూపము లుండవచ్చును అని కేతనభావము. చింతామణిలో "ఎదంత తాచనామ్నామియాంతానామ్" ఇయాంత రూపములకు ఎదంతరూపము గలుగవచ్చును అని గలదు. ఆంధ్రభాషాభూషణమున "ఎ" కి "ఇయ" చింతామణిలో "ఇయ" కు "ఏ" విధింపఁబడినది. రెండు నన్యోన్యప్రతికూలములు. వ్యాకరణసంప్రదాయము ననుసరించి పరిశీలించినయెడల "లంజికా" "మల్లికా" అను సంస్కృతరూపములకు వరుసగా "లంజిఆ" "మల్లిఆ" అని ప్రాకృతరూపములు గలుగును. వానికిఁ దెనుఁగుసంప్రదాయమున "లంజియ" "మల్లియ" అనురూపము లవతరించినవి. వానికి ఎదంతత్వ మంగీకరింప లంజె, మల్లె అనురూపములు సిద్ధించినవి. ఇది వైయాకరణప్రక్రియ. వానిసామ్యము ననుసరించి మరి కొన్ని శబ్దము లాగణమునఁ జేరినవి. కేతన ప్రక్రియకంటెఁ జింతామణిప్రక్రియ ఈవిషయమున శాస్త్రసంప్రదాయానుసారము. అది కేతన చూచియున్నచో ఈ ప్రక్రియనే యనుసరించియుండును. అది యాతనికి నచ్చనిచో ఖండించి తనమతమునకుఁ బ్రాశస్త్యము స్థాపించియుండును. అది నన్నయభట్టమతమనిగాని నన్నయవ్యాకరణమనిగాని తెలిసినచో నెత్తిమీఁదఁ బెట్టుకొనును. ఇట్టివిషయము లెన్నియోగలవు. విమర్శకులు గ్రహింతురుగాక. చింతామణి చూచియున్నయెడలఁ గేతనకు నంత యతిసంక్షేపముగా వ్యాకరణము రచింప బుద్ధి పుట్టునా? కేతన వ్యాకరణమున మనము గ్రహింపఁదగిన ప్రాచీనసిద్ధాంతము లెన్నియో గలవు. మచ్చున కొకటి చూపెదను. ప్రథమమీఁది కచటతపలకు, గసడదవలు వచ్చుట వికల్పమనియు; తాను, నేను, శబ్దములకుఁ బరమగువానికి రావనియు, సంస్కృతశబ్దముల లోనివానికి రావనియుఁ బ్రస్తుతవ్యాకరణము. ప్రాచీనశాసనములును వ్రాఁతప్రతులును పరిశీలించినయెడలఁ బ్రథమమీఁది కచటతపలకు గసడదవాదేశము నిత్యమనియును, సాంస్కృతికములకుఁగూడఁ గలుగుననియుఁ దేలును. ఈవిషయమునఁ గేతనభావము పరిశీలింపుఁడు.

"క. పొసఁగఁగఁ బల్కెడుచోఁ బొ
    ల్పెసఁగిన ప్రథమాంతములపయిం గదిసి కడున్
    బసనగు క చ ట త ప ల మును
    గ స డ ద వల్ ద్రోచిపుచ్చుఁ గవిజనమిత్రా. 62

తే. సుతుఁడు గడువేగమున వచ్చె సుతుఁడు సనియె
    సుతుఁడు డక్కరితోడఁ దాఁ జుట్టమయ్యె
    సుతుఁడు దండ్రికిఁ బ్రణమిల్లె సుతుఁడు పుట్టె
    ననఁగ నివి యుదాహరణంబులయ్యెఁ గృతుల. 63

ఈవిషయమున నాంధ్రశబ్దచింతామణిలోనిశ్లోక మిట్లున్నది.

"గసదడవాస్స్యుః ప్రథమామాత్రాదాత్మాష్మదోర్వినై వైతే, న వికృతిశబ్దాత్పరతస్సాంస్కృతికానాం గసడదవాస్స్యుః" తాను, నేను శబ్దములుదక్క మిగిలినవానిలోని ప్రథమమీఁది కచటతపలకు, గసడదవలు వచ్చును. వికృతిపదముమీఁది సంస్కృతపదములకు రావు అని కలదు. గసడదవాదేశము నిత్యమే కాని కొన్ని యపవాదములు విధించెను. కేతన యిచ్చిన యుదాహరణములనుబట్టి సాంస్కృతికములకు రాదను నపవాదసూత్రము విధించియుండునా యని యూహించిన నూహింపవచ్చును.

ఆంధ్రభాషాభూషణ మెంత చిన్నపుస్తకమయినను విపులవ్యాకరణములు లేనికాలమున మహోపకారము చేయుటయేగాక, తర్వాతి వ్యాకరణకర్తలకు మార్గదర్శక మయినది.

కేతన పద్యరూపమున వ్యాకరణము రచించునపుడు సంబుద్ధిరూపముననో, మరియొకవిధముననో తననామము తనబిరుదములు నందుఁజేర్చి శాశ్వతములు గావించుకొన్నాఁడు.

I. "అలవడి యీ క్రియలు చెల్లు నభినవదండీ." 139

II. "ఎలమి నీవు మీరు...నూత్నదండి చెప్పె". 106

III. "మానకెఁడులనొందు మీఁద మ్రానయకేతా" 189

Iv. "గసడదవల్ ద్రోచినిల్చుఁ గవిజనమిత్రా". 62

కేవల వ్యాకరణవిషయ మిందుఁ బ్రతిపాద్యాంశ మయినను కేతనకు, సహజమయిన చక్కని కవితా శైలి గలదు. మచ్చునకుఁ గొన్ని పద్యము లుదాహరింతును.

I. క. "నేరములు కాళిదాస మ
      యూరాదులకైనఁ గలుగ నొరులకు లేవే
      సారమతు లైనసుకవుల
      కారుణ్యము కలిమి నేర్చు కవిజనములకున్." 12

II. తే. "పెక్కు సంస్కృతశబ్దంబు లొక్కపదము
        క్రిందఁ దద్విశేషణము లింపొందఁ గూర్చి
       తెలుఁగు తత్సమాసముక్రిందఁ గలుపునప్పు
      డగ్రపదముతో నిలనగు నర్థఘటన." 130

III. తే. "తనవిశిష్టకులాచారధర్మ మనఁగఁ
         దనజగద్గీతసాధువర్తన మనంగఁ
         దనదిగంతరవర్తిప్రతాప మనఁగ
         నివి యుదాహరణంబులై యెందుఁ జెల్లు." 131

సంస్కృతాంధ్రాదిగ్రంథప్రకాశకులయిన మ - రా - శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రుల వారు ఆంధ్రభాషాభూషణము నాచేతికిచ్చి యొకమాఱు చదివి దీనికిఁ జిన్నపీఠిక వ్రాసియిమ్మని చెప్పఁగాఁ జిన్నపీఠిక వ్రాయనెంచితినిగాని వ్రాయఁబూనినపు డనుకొన్నదానికంటె మిగులఁ బెద్దది యయినది. తాళపత్రగ్రంథ ములు చూచినఁగాని కొన్నివిషయములు నిర్ణయింప వీలులేకపోయినది. చెన్నపురిలో నున్న ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమునను, కాకినాడలోనున్న యాంధ్రసాహిత్య పరిషద్భాండాగారమునను గల తాళపత్రగ్రంథములును కాకితపుఁబ్రతులును ముఖ్యమగువిషయములకై పరిశీలించితిని. పుస్తక మంతయును ఆప్రతులతో సరిచూడ నవకాశము గుదురలేదు. ఇదివఱకును ముద్రించినప్రతి వ్రాఁతప్రతులతో సరిచూచినదే గాన మరలఁజూచుట యావశ్యకము గాదనియుఁ దోఁచినది. ఆంధ్రగ్రంథప్రకాశకులగు వావిళ్ల వారియెడ నాంధ్రలోకమెంతయో కృతజ్ఞత చూపఁదగును.

రామచంద్రపురము,

ఆంగీరసశయనైకాదశి.

ఇట్లు, భాషాసేవకుఁడు,

శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి.

  1. నతిశయంబు.