Jump to content

ఆంధ్రపదనిధానము/అవతారిక

వికీసోర్స్ నుండి

శ్రీమతేరామానుజాయనమః,

ఆంధ్రపదనిధానము

శా.

శ్రీమించన్ గరిరాజుకై మకరమున్ శిక్షించి తద్వైభవో
ద్దామం బిచ్చటఁజూపుదంచు రమ నత్యంతంబు లాలించి త
ద్భామాద్విస్తనమధ్య నొక్కమకరిన్ వాలెంబుఁ జిత్రించి లీ
లామర్షంబును మాన్పుశౌరి గొలుతున్ లావణ్య మొప్పారఁగన్.

1


చ.

కలుములపట్టు శౌరిగుణగాథలబిట్టు మునీంద్రకోటిహృ
జ్జలరుహపాళినట్టు జలజాతకదంబక మాటపట్టు లే
ములతడకట్టు శక్రసతిమోసలపాలిటి పెట్టుఁజెట్టు ము
క్తులతలకట్టునౌ రమను గోరికలూర భజింతు నెప్పుడున్.

2


సీ.

సకలకల్మషఘోరశర్వీశపటలత్వి
                      షాంపతియగు సుదర్శనము నెంతు
సరితతిడెందంబు లవియంగ రొద సేయు
                      పాంచజన్యంబును బ్రస్తుతింతు
హరిపదంబుల కసురాళియౌదలలకు
                      ఘటకత్వమగు నందకము భజింతు
దైవతావనితాళితాళికి నభయప్ర
                      దాయియౌ శాఙ్గంబుఁ దలతుఁ నెపుడు

గీ.

మదము పొదలఁగ మెదలు బెట్టిదుల పొదల
యెదల దరిబెడిఁదపుఁ బదనెదుగుకుదిరి
చదలుకాపుల మదియెద సెదరఁద్రోలి
ముద మొదవు బల్లిదపుగద నెదఁ దలంతు.

3


క.

మురవైరిశయ్యయౌ ఫణి
వరునిపదాంబురుహములను బక్షీంద్రునిప
త్సరసిజముల సూత్రవతీ
శ్వరునిచరణకమలములను వర్ణింతు మదిన్.

4


సీ.

హరిగుణామృతసంగ్రహము నాథమునిగిరి
                      వర్షించు శఠకోపవారిదమును
గురుపఙ్క్తిమౌక్తికసురుచిరహారశో
                      భితతరళంబగు యతిపతులను
వచనభూషణ గోప్యవాక్సుధారస విశ
                      దీకరవరయోగి దేశికులను
ప్రణవాంతరవిహారవాధూలగోత్రదు
                      గ్ధాబ్ధీందులగు సింగరార్యమణులఁ


గీ.

దలఁచి స్తుతియించి భజియించి కొలిచి వినుతి
జేసి రంగార్యులకు వేడ్క దోసిలొగ్గి
సకలభాగవతాంఘ్రికంజాతజాత
రసమిళిందాయమానమానసుఁడనయ్యు.

5

సీ.

ఆంధ్రభాషాపటి మాభ్యాస మొనరించు
                      బాలుర కతిసులభంబు గాఁగ
అఖిలాంధ్రమిళితవాక్యస్వరూపంబగు
                      శబ్దరత్నాకరసఖ్యమునను
బ్రతిశబ్దమును గూర్చి పదములురాసుల
                      నమరించి నామలింగానుశాస
నముగతి వర్గాళి నామాళి సమకూర్చి
                      తనరార తెలుఁగువృత్తములఁ గూర్చి


గీ.

యాంధ్రపదనిధాన మనియెడు నొకనిఘం
టువు రచింతు పెళ్ల చివరలందు
జాడఁ దెల్పనిడుదు సంస్కృతపదములఁ
జిత్తగింపు మౌనిచిత్తహారి.

6


సీ.

స్వర్గవర్గును వ్యోమవర్గు దిక్కాలధీ
                      వాక్ఛబ్దముఖనాట్యవర్గులు బలి
వాసవర్గును భోగివర్గు నారకవారి
                      వర్గులు భూపురవర్గులు గిరి
వర్గు వనౌషధివర్గు సింహాదినృ
                      వర్గులు బ్రాహ్మణవర్గు భుజజ
వైశ్యవర్గులు శూద్రవర్గు విశేష్యని
                      ఘ్నాఖ్యసంకీర్ణనానార్థవర్గు

గీ.

లవ్యయముగూడ నిరువదియారు నివియు
బారపది తిగ పంచగాఁ బంచి మూఁడు
కాండములఁ జేసి నీ కిత్తు కట్టనంబు
వేడ్కతో బాలనగరీశ వేంకటేశ.

7


వ.

అందు స్వర్గాదిప్రథమకాండం బెట్టులనిన.

8


క.

హితపుర హరనత సురవర
హతసురపర సుతకరివర యతివరవరదా
శతఖరకరజితసురుచిర
ధృతవరధర జితమురశర స్థితగరుడరథా.

9


క.

ధరఁ దూముకులవనధిశశ
ధరుడఁగు సర్వేశదాసతనయుండ భవ
చ్చరణాంబుజాతరసహృ
ద్భరితోన్మత్తుఁడను రామదాసాహ్వయుఁడన్.

10


చ.

సుకవుల వేఁడుకొందు నొకచో నొకటం గలతప్పు లెన్న కే
వికటము మాని యొప్పులను వే గ్రహియింపను రాజహంసముల్
నికమగుపాలు గైకొనుచు నీళ్లను మానినభంగి యంచుఁ నేఁ
గుకవు లవాతరట్టు లయి కూసెడువారిఁ దలంప నేటికిన్.

11


ఉ.

ఏను వచించు పల్కులను హృష్టిగతి న్మది తప్పు లెన్న కీ
పూని గ్రహింప నొప్పులని పుత్రుఁడు కందువమాట లాడినన్

మానుగఁ దేనె లూఱ బలుమత్తిలి తద్రసపంక్తిజాతస
న్మానసుఁ డైనతండ్రి కొనుమాదిరిఁ గైకొనవే రమావరా.

12


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా భవదీయపాదారవిందనిస్స్రు
తమరిందబిందుసందోహతుందిలేందిందిరాయమాసమాన
సుండనై రచియింపంబూనిన యాంధ్రపదనిధానం బను
నిఘంటువుక్రమం బెట్టిదనిన.

————