ఆంధ్రదేశము విదేశయాత్రికులు/పీఠిక
పీఠిక
మనభాషయందు,చరిత్ర గ్రంథములు కడుస్వల్పములుగా నున్నవి,స్వల్పములుగాదు,లేవనికూడా చెప్ప సాహ సింతును.జాత్యాభ్యుదయమునకు చరిత్ర ముఖ్యసాధనములగుచుండ, మనకింతవఱకు, చక్కని దేశచరిత్రలు లేకుండుటకడుశోచనీయము. చరిత్రపఠనము వలననే జనులకు, దేశముపై నభిమానమును గౌరవమును జనించును. "నాజన్మభూమియిది!నే నాంధ్రుడనని గర్వించుచున్నాను" అని భావము లుత్పన్నములగును. అంతట జాఱిన దేశగౌరవమును చక్కదిద్దుటకు ప్రయత్నములు లప్రయత్నముగ జరుగుచుండును.కావున నే నిపుడీ చిన్న గ్రంథమును, మన ఆంధ్రయువతీ యువకులకు, ఆంధ్రదేశముపై, నాంధ్రజాతిపై, నభిమానము ను, గౌరవమునుజనింపజేయుటకు వ్రాసి సమర్పించుచున్నాను.
ఈ గ్రంథమునందు, మువ్వురిని వర్ణించినాము.అందొకడు ఏడవశతాబ్దాదిని యేతెంచిన చీనాయత్రికుడు. రెండవ వాడు, కాకతీయాంధ్ర సామ్రాజ్యము మహోచ్ఛదశయండుండిన కాలమున వచ్చిన యిటాలియా వాస్తవ్యుడు. మూడవవాడు విజయనగర సామ్రాజ్యవైభవమును చవిజూచిన పారశీక రాయబారి.
ఏడవశతాబ్దిని హిందూదేశమునంతటను మాహత్తరములయిన పరిణామములు జరుగుచుండెను.ఉత్తర రమునహర్ష సామ్రాజ్య ముచ్ఛస్థితికి వచ్చియుండెను.దక్షిణాపథమున పశ్చిమ చాళుక్య సామ్రాజ్యము సత్యాశ్ర య రెండవ పులకేశి వల్లభునిచే స్థాపింపబడి,ఉఅచిరకాలంలోనే యొక్క వెలుగు వెల్గి మెఱపువలె మామమ య్యెను. తూర్పున చాళుక్యాన్వయ మొకటి రాజ్యముస్థాపించుకొని ఆరు శతాబ్దములకాల మవిచ్ఛిన్నముగ నాంధ్రభూమిని యేలుటకు బునాదులు వేయుచుండెను.దక్షిణమున కాంచీపుర పల్లవులు విజృంభింప నారంభిం చుచుండిరి.ఎక్కడజూచినను అసహ్యకరములయిన మహాయాన సంప్రదాయాచారములుతో నిండిన బౌద్ధమతము జనులచే పరిత్యజింపబడుచుండెను. జైనమతమును అట్లే క్షీణించుచుండెను. కాని దీనికింకను కొంత రాజాశ్రయ ముండెను. అట్టికాలమున,బౌద్ధుడును,విమతద్వేషియునగు యుఁఆ౯చాంగ్ మన యాంధ్రదేశమును సందర్శిం చి, బౌద్ధక్షేత్రములందించుక కాలముగడుపుచు,దేశమునందు రెండేండ్లు సంచారము చేసి వెడలిపోయెను.
పదమూడవ శతాబ్దాంతమున మార్కొపోలో సందర్శింప నేతెంచినపుడును ఆంధ్రదేసమునందు, మత, సాంఘిక రాజకీయ విప్లములు జరుగుచుండెను.అయ్యది చాళుక్యచోళ సామ్రాజ్యమంతరించిన కాలము.అయ్యది వెలనాటి చోడరాజుల ప్రయభణగిపోయి, కాకతీయభూపాలురు విజృంభించిన సమయము.ఆంధ్ర యువతి, పురుషవేష ధారిణియై, వీరవనితయై, యాంధ్రభూమిని,నిరుపప మానమైన ప్రజ్ఞతో నేలిన కాలమది.జైన మతము విధ్వస్తము గావింపబడి, వీరశైవము ప్రతిష్టింపబడిన తరుణ మది. చిల్లర, చిల్లర రాజ్యములు, అణగద్రొక్కబడి, ఆంధ్రదేశమంతయు నేకచ్ఛత్రాధిపత్యము క్రిందకు గొని రాబడిన కాలమది.కులభేదములును, వైషమ్యములును బాటింపక, క్షత్రియ, చతుర్థవంశజులు, నొక్కటిగా కలసిపోయిన కాలమది. ఆంధ్రుల సముద్రవ్యాపారవైభవము, దేశదేశాంతరముల మారుమ్రోగిన కాలమది.
మరి రెండు శతాబ్దములనాటికి దేశమున గలిగిన మార్పులవలన, కాకతీయ సామ్రాజ్యమంతరించిపోయెను. దానిస్థానమున భామినీ రాజవంశము, తురుష్క సామ్రాజ్యమును నెలకొల్పియుండెను.దక్షిణాపథమంతయు, ఇంచుమించుగా, పూర్వాంధ్రదేశము తప్ప, మహమ్మదీయుల వశమయ్యెను.పూర్వాంధ్రదేశము కొంతకాలము రెడ్ల పరిపాలనము క్రిందను, మరికొంతకాలము, ఒడ్దెగజపతిరాజుల క్రిందను పరిపాలింపబడుచుండెను. కృష్ణకు దక్షిణమున గల దేశముపై సర్వాధికారము నెఱపుచు, రెండున్నర శతాబ్దముల కాలము హిందూమతమును, సంఘమును,హిందువుల స్వాతంత్ర్యమును సంరక్షించుకొఱకు విజయనగర సామ్రాజ్యము వెలసియుండెను. ఆ సామ్రాజ్యపు వైభవప్రారంభదశయందు, యిమ్మడి దేవరాయలు చక్రవర్తియై పరిపాలించి యుండెను. అతనితో నెయ్యము నెఱపుటకు, పారశిక సుల్తాను ఖాకాని సయ్యద్ షారుఖ్‌సుల్తాను, అబ్దుర్‌రజాక్‌ను రాయబారిగా పంపియుండెను.
ఈ మువ్వురి చరిత్రలను వ్రాసి, చదువరి కర్పించుట నాముఖ్యోద్దేశము,దేశచరిత్రపఠనమందు అభిరుచి గలిగించుట కన్న మరియొకటికగాదు. ఈ మూడు వృత్తాంతములలో, మొదటిదియు గడపటిదియు, నీవఱకు, శారదా, భారతీ పత్రికయందు వెలువడి యున్నవి.వాటినించుక మార్పులతో నట్లె ముద్రించితిని.రెండవది, మార్కొపోలో, యిటీవల వ్రాసినది.చరిత్ర విషయమున, సంశయాస్పదములును,చర్చనీయాంసములును పెక్కింటిని నావ్యాఖ్యానములందు జొప్పించియునాడను. వాటిని గూర్చిన నాయభిప్రాయములు మార్చు కొనవలసి వచ్చిన మార్చుకొనుటకు సంసిద్ధుడను.
భావరాజు వేంకటకృష్ణరావు