ఆంధ్రకామందకము
పంచమాశ్వాసము
క. |
శ్రీవినుతాలోక జగ
త్పావన రఘురామపాదపంకజయుగళీ
సేవాధురీణ శాంత
ప్రావృత కొండ్రాజువెంకటాద్రి నరేంద్రా.
| 1
|
మంత్రవికల్పప్రకరణము
గీ. |
నృపతి షడ్గుణతత్త్వంబు నిశ్చయించి
గూఢ మగుచర్యఁ దగ మంత్రకుశలుఁ డగుచు
మంత్రివర్యులతోఁ గూడి మంత్రరీతు
లమర నూహింపఁదగు రహస్యంబు గాఁగ.
| 3
|
క. |
తన కాప్తుండై తగుప్రా
జ్ఞునితో మంత్రం బొనర్పఁ జొప్పడుఁ బతికిన్
దన కాప్తుండౌ మూర్ఖునిఁ
దన కాప్తుఁడు గానిప్రాజ్ఞుఁ దా విడువఁదగున్.
| 4
|
క. |
ధర యెల్ల ననుభవించును
నరనాథుఁడు మంత్ర మెఱిఁగినం గాకున్నన్
బరిభవ మొందు స్వతంత్రతఁ
బరగియు మంత్రంబు నెఱుఁగు ప్రాజ్ఞులచేతన్.
| 5
|
క. |
పగతులచే దుర్మంత్రుం
డగుదొర చెడు దుష్టమంత్ర మగుయజ్ఞము దై
త్యగణముచే బలెఁ గావున
జగతిన్ సన్మంత్రమునఁ బొసంగఁగవలయున్.
| 6
|
చ. |
అనిశము ధర్మమార్గములయందె చరించినవారు సిద్ధమై
యొనరినయట్టి కార్యముల నూర్జితులై తగువారు పెద్దలై
తనరినవారు నై నగుణధన్యులు చెందినశాస్త్రమార్గ మెం
దును వదలంగ రాదు నయధుర్యులకున్ నిజకార్యసిద్ధికిన్.
| 7
|
క. |
జనపతి శాస్త్రముతో నెడ
సినచర్యల వేగిరమునఁ జెంది మెలఁగినన్
దనశత్రునిచే ఖడ్గం
బునకున్ గ్రాసంబు గాకపోవం గలఁడే.
| 8
|
క. |
బలిమిఁ ద్రిశక్తులలోపల
నల మంత్రము మంత్రశక్తి ననువొందక కే
వలము ప్రభావోత్సాహ
మ్ములఁ గల్గియు శుక్రుఁ డోడె మును గురువునకున్.
| 9
|
ఉ. |
నీతి యొకింతయుం దెలియనేరని సింగము బల్మిచేతఁ దా
నేతఱియందు నేనుఁగుల నెల్ల వధింపుచు నుండు బుద్ధియున్
నీతియుఁ గల్గినట్టిపతి నేర్పున సింగపుగుంపులం గరి
వ్రాతము నుక్కునం గెలిచి వర్ధిలకున్నె ధరాతలంబునన్.
| 10
|
గీ. |
మునుపు సామాద్యుపాయముల్ మొనపవలయు
కాల మెఱుఁగుచు వైరిపైఁ గదియవలయుఁ
గాక మఱి కేవలంబు విక్రమముఁ బూని
మెలఁగువాఁ డెందు వగఁ జెంది కలఁగకున్నె.
| 11
|
చ. |
చల మెడలించి భూవిభుఁడు శక్య మశక్యమునౌ పనుల్ గడుం
జెలఁగెడిబుద్ధిచే నెఱిఁగి చేసిన మే లగు నట్లు గానిచో
నలవునఁ గొండ డీకొనిన యమ్మదదంతికి దంతభంగమౌ
పొలుపున హాస్యరీతులను బొందక యెందు శుభంబుఁ జెందునే.
| 12
|
క. |
తొడరి యశక్యపుఁబనికై
బడలినచోఁ గీడ కాక ఫల మొందునె యె
య్యెడ విన్ను సవిఁ గొనంగాఁ
గడఁగెడి పెనువెఱ్ఱికందు కడిఁ గొనఁగలదే.
| 13
|
ఆ. |
మిడుత యగ్నిలోనఁ బడునటు నాశంబు
వచ్చుపనులఁ బూన వలవ దెపుడు
తగినపనులె పూనఁదగు నగ్నిలోఁబడు
మిడుత కేమి కలదు చెడుటకంటె.
| 14
|
క. |
ఇలలో దుర్లభమగుపని
బలియుఁడు మోహమునుఁ జెంది పదరిన నందున్
గలిగినయాపద లతనిం
గలకాలముఁ దాప మొందఁగాఁ జేయుఁ దుదిన్.
| 15
|
క. |
అనుపమమతిచే సిరులను
జనపతి దా నాక్రమింపఁ జను నేర్పున మె
ట్టనువుగ మెట్టెడునాతఁడు
ఘనమగుగిరిశిఖర మెక్కుకైవడి మెఱయున్.
| 16
|
ఉ. |
అందగ దుర్లభం బగుచు నందఱు మ్రొక్కులు మ్రొక్క నిక్కి పెం
పొందినయట్టిరాచఱిక మొక్కడ నించుక దుష్టవర్తనం
జెందినయేని నాశనముఁ జెందడె యెం దపచార మింత దాఁ
జెందినబ్రాహ్మణత్వము గృశింపుచు నిందల నొందుకైవడిన్.
| 17
|
క. |
విమలమతు లెంచి శాస్త్ర
క్రమమున నొనరించునట్టికార్యంబులు వే
గమె మంచిఫలము లిడుఁ దా
నమరంగాఁ బ్రోదిఁ గనిన యల వన మనఁగన్.
| 18
|
క. |
అనువుగ నొనరించినపను
లనిశము ఫలియింపుచుండు నది కాకున్నన్
మనమునకుఁ దాప మొసఁగవు
మును దెలియక సేయుకార్యములుబలెఁ బతికిన్.
| 19
|
గీ. |
నేర్పు మీఱంగ లెస్స యొనర్పఁబూని
కార్య మొకరీతి సఫలంబు గానివేళ
వాఁడు నిందకుం దగినట్టివాఁడు గాడు
దానె దైవంబు కడుఁదోడు గానికతన.
| 20
|
క. |
ఫలములకై నిర్మలమతి
గలవాఁ డుద్యోగశాలి గావలె నెందున్
ఫలవిఘ్న మడరకుండన్
బలవద్దైవంబు నెఱిఁగి ప్రార్థింపఁదగున్.
| 21
|
క. |
తనబలిమి నెదిరిబలిమిం
గనుగొని యరిమీఁద గదలఁగాఁదగు నెదురుం
దను నెఱుఁగుటెద్ది యదివో
జనపతులకు నెఱుక నీతిచాతుర్యంబుల్.
| 22
|
క. |
ఆర్యులు విడుదురు నిష్ఫల
కార్యము నిశ్చితఫలంబు గలుగక యెడరౌ
కార్యము బహువైరముఁ గల
కార్యము కడుగ్లేశ మడరు కార్యముఁ బుడమిన్.
| 23
|
క. |
తగుకార్యములె విహితమునఁ
దగిలినయవి యెపుడు మీఁదఁ దా మంచివియై
తగు నవి తొలుతన్ సజ్జను
లగువారిక్రమాగతంబు లైనవి పతికిన్.
| 24
|
గీ. |
ఎట్టికార్యంబు దనకును హిత వొనర్చు
నెట్టికార్యంబుచే నింద లెనయకుండు
నట్టికార్యంబె పూని చేయంగవలయు
నప్పు డించుకకఠినమై యడరెనేని.
| 25
|
క. |
సులభమునఁ గార్యసిద్ధులు
గలుగుటకై బుద్ధిచేతఁ గార్యము బూనన్
వలయుఁ బతి మంచిమిత్రులఁ
గలిగినచో సింహవృత్తి కడు మేలొకటన్.
| 26
|
చ. |
తొడిఁబడ మించి పై కుఱికి దుష్టవిరోధుల వంచి సంపదల్
వడయుట లెంచ దుష్కర ముపాయబలమ్మున నేదియైన చొ
ప్పడి తగుమావటీఁడు బలభద్రగజంబుశిరంబుమీఁదటన్
దొడరియు వాయుమార్గములతోడఁ బదం బిడు టెందుఁ జూడమే.
| 27
|
ఆ. |
చతురమతి కుపాయసరణిచే సాధ్యంబు
గానివస్తు నించుకయును గలదె
యినుపముద్ద యైన నిలలోన నీరుగా
కఱఁపఁ బడును చెఱిపి విఱుపఁబడును.
| 28
|
క. |
జల మింగలంబు నార్చుట
యిలమీఁదటఁ గడుఁబ్రసిద్ధి యీ యింగలమే
బలువగు నుపాయశక్తిని
జలచలచలఁ దెరలఁజేసి జల మిగిరించున్.
| 29
|
వ. |
మఱియు మంత్రంబునకు జ్ఞానంబును, రక్షణంబునుఁ, బ్రకా
శంబునుఁ బ్రశస్తియు నంగంబులును వ్యాపారంబు నుత్పత్తి
క్రమంబునుఁ బరిశుద్ధియు ఫలసిద్ధియు నావర్తనంబును, ధారణం
బును, మొదలయిన యవస్థాభేదంబులు గల వందు విధుండు
సాక్షాత్కారంబునం దెలియనియర్ధంబు లెల్లం దెలియుట యనెడి
యవిజ్ఞాతవిజ్ఞానంబును దెలిసినయర్ధంబు కక్ష్యాపూర్వకంబుగా
నిర్ణయంబుఁ గావించుట యనెడి విజ్ఞాతనిశ్చయంబును నందు
రెండుకార్యంబులు బ్రసక్తంబులైన నొకటి గాదనుట యనెడి
సందేహభేదనంబును, వెండియు సంధివిగ్రహంబులలోన వృద్ధ
సమ్మతంబున సంధియ మంచిదగుటఁ దెలిసి యదియును భేద
పూర్వకంబైన లెస్సయని తెలిసికొనుట యనెడి శేషదర్శనంబును
నను నిట్టి చతుర్విధభేదంబులుగల జ్ఞానంబు మంత్రులవలననె
సంభవించుం గావున.
| 30
|
సీ. |
మంత్రులుఁ దానును మతులందు లెస్సగాఁ
బరిశుద్ధి సేయు టుత్పత్తి యండ్రు
తనరు నుత్పత్తిచేఁ దనమంత్ర మది లెస్స
తెలిసి రక్షించుట స్థితి యటండ్రు
చాల దానినిఁ బ్రకాశంబుగాఁ జేయుటే
మఱి లయ మని యండ్రు మంత్రమునకు
నిన్నియు నెఱుఁగుచు నిది దేశ మిది కాల
మిది యాయ మిది వ్రయం బిది బలంబు
|
|
గీ. |
దీని కిది యుక్త మంచును దెలివితోడ
మంత్రవిదులను గూడి నెమ్మదిఁ జెలంగి
శాస్త్రమార్గంబు వదలక చతురుఁ డగుచు
మంత్ర మూహింపవలయును మనుజవిభుఁడు.
| 31
|
క. |
జనపతి తనమంత్రులయా
జ్ఞనె మెలఁగుచు నుండి యెట్టిజనులను దాఁ గా
దనక మఱి యన్నిపలుకులు
వినవలయును మంచిమాట వెదకెడికొఱకై.
| 32
|
క. |
తనమది మదించి పనియెడఁ
దనమంత్రుల మీఱుపతి వృధామంత్రుఁడు వీ
డని నింద నొందు నతనిని
గనుఁగొని రిపు లాక్రమింపఁ గడఁగుదు రెపుడున్.
| 33
|
క. |
మంత్రము రక్షింపఁగవలె
మంత్రము మూలంబు మిగుల మనుజేంద్రునకున్
మంత్రము నెడఁ దాఁ జెడుఁ ద
న్మంత్రము రక్షింప రక్షణముఁ గనుఁ దానున్.
| 34
|
క. |
చతురుఁడయి కాల మెఱుఁగుచు
నతులితగతి సింహవృత్తి నడరెడుధరణీ
పతి కార్యము సేయుతఱిన్
హితులును నది యైన నహితు లెఱుఁగఁగవలయున్.
| 35
|
క. |
ఫల మెవ్వేళ నొసంగన్
గలుగుచుఁ గడువేగఁ గోర్కి ఘటియింపంగాఁ
గలుగుచుఁ బశ్చాత్తాపము
గలిగించనియట్టిమంత్రిగతి మంచిదగున్.
| 36
|
మంత్రాంగములు
ఆ. |
దేశకాలగతులు దెలియుట, సాధనో
పాయచింతయును, సహాయవితతి,
నాపదలకుఁ బ్రతిక్రియయుఁ, గార్యసిద్ధియు
నైదు మంత్రమునకు నంగము లగు.
| 37
|
క. |
పూనినపనిఁ జేయవలెన్
బూనినపను లెల్లఁ దొడరి పూనఁగవలయున్
బూని యొనరించునాపని
దా ననువుగ విరివికొనఁగఁదగు నాయమునన్.
| 38
|
క. |
ప్రారంభింపక యుండుట
పూరుషునకుఁ బ్రథమబుద్ధి పూనికతోడం
బ్రారంభించినపని యీ
డేరుచుట ద్వితీయబుద్ది యీధరలోనన్.
| 39
|
క. |
సారెకు బహుమంత్రులతో
భూరమణుఁడు కార్యమార్గములు దలఁపఁదగున్
వారలకును సమ్మతమగు
సారపుఁగార్యంబుఁ బూనఁ జను నేర్పొనరన్.
| 40
|
గీ. |
ఎందు సజ్జనులగువారు నింద సేయ
రెందుఁ దనమది సందేహ మందకుండు
నెందు మంత్రులు సమ్మతిఁ జెంది యుంద్రు
తలఁప నటువంటిపనిఁ బూనవలయు విభుఁడు.
| 41
|
క. |
మంత్రులచే నిశ్చితమగు
మంత్రముఁ జింతింపవలయు మదిఁ బలుమారున్
మంత్రజ్ఞుఁ డగుచుఁ బతిఁ దన
మంత్రముచేఁ దనదుపనులు మఱి చెడకుండన్.
| 42
|
క. |
వారలు మొగియక యుండన్
దా రొనరింపుదురు మంత్రితతి దడవడరన్
బోరులు మొగియక యుండన
సారపుభోగములు దమకు సమకొనుకతనన్.
| 43
|
కార్యసిద్ధిసూచకములు
గీ. |
పౌరుషంబు సహాయసంపద మనఃప్ర
సన్నతయు దేహదార్ఢ్యంబు సమకొనుటయు
బుద్ధి విశ్వాసమును జాలఁ బొడముటయును
గార్యసిద్ధికి గుఱుతులై కానుపించు.
| 44
|
క. |
సులభములగు యత్నంబులు
గలుగుట, తగుసాధనములు గలుగుట, విఘ్నం
బులు లేకుండుట, కార్యం
బులకున్ ఫలసూచకములు భువి నివి తెలియన్.
| 45
|
క. |
పలుమరు మదిలోఁ దలఁపఁగ
వలయున్ మంత్రము ధరింపవలయును యత్నం
బలరఁగ నటుగాని యెడం
జలియింపుచు నగ్నిలీలఁ జాల దహించున్.
| 46
|
క. |
వెలివడు మంత్రం బాప్తుల
వలనన్ రక్షింపకున్న వసుధాపతికిన్
దెలిసి యటుగాన నాప్తుల
వలనను మంత్రంబుఁ బ్రోవవలె యత్నమునన్.
| 47
|
ఆ. |
కలువరింతపలుకువలనఁ గామమువల్ల
మదమువలన మఱి ప్రమాదములను
గదిసి గుట్టుఁదెలియుఁ గామినీవితతుల
వలన మంత్ర మదియు వసుధలోన.
| 48
|
గీ. |
కంబములు లేక సోరణగండ్లు లేక
నడుమ గోడలు లేక పెంపడరుచోట
మేడపైఁ గానలో నైన మెలఁకు వలర
మంత్ర మూహింపవలయును మనుజవిభుఁడు.
| 49
|
మంత్రిమండలవృత్తము
సీ. |
తొలుదొల్త మంత్రిమండలముతో మంత్ర మూ
హింపఁగాఁ దగు నభివృద్ధికొఱకు
నది యెట్టు లన్న దేవాచార్యమతము వా
రఖిలసమ్మతిఁ బదియార్వు రండ్రు
మనువు పన్నిద్ద రైనను జాలు నని పల్కు
మఱియు శుక్రాచార్యమతమువార
లిరువదియగుసంఖ్య నెంతు రీమంత్రుల
నితరమతంబువా రెటులనైనఁ
|
|
గీ. |
గలిగినందఱె చాలు మంత్రు లని యందు
రిటుల మంత్రులసంఖ్యఁ దా నెఱుఁగ నేర్చి
వారిఁ దెలియంగఁదగు వేఱు వేఱ సారె
శాస్త్రమార్గంబు వదలక జనవిభుండు.
| 50
|
చ. |
హితుఁడయి మంచిపక్షమున నెన్నిక కెక్కుచు నీతిశాస్త్రసం
గతముగఁ గార్యచర్యలఁ దగం జరియించినవాఁడు నాత్మస
మ్మతుఁ డగువాఁడునైన తనమంత్రిశిఖామణి పల్కునట్టి యా
మతమె యొనర్పఁగా నగును మానవనాథున కెట్టివేళలన్.
| 51
|
క. |
మును మంత్రనిశ్చయంబున
నెనసి నృపుల్ కార్యకాల మెఱిఁగి మెలంగన్
జనుఁ గాలము మీఱినచో
ననువుగఁ గల్పింపవలయు నది మగుడంగన్.
| 52
|
క. |
అదను మదిఁ గోరుచుం దగు
నద నొక్కొకవేళ దొరకునపుడు దనపనుల్
కొదవ యిడికొనినఁ గ్రమ్మఱ
నద నబ్బుట దుర్లభం బటండ్రు నయజ్ఞుల్.
| 53
|
క. |
మతిమంతుఁడు సన్మార్గము
గతిచే నద నెఱిఁగి సేయఁగా దగుఁ గార్యం
బతినియతి నెటులనైనన్
క్షితిలోపల మంచిఫలమె చేకొనుచుండున్.
| 54
|
మ. |
ఇది యీరీతిది దీని కిట్లనుచుఁ దా నెంతే విశుదాత్ముఁడై
యదనన్ దేశమునందు భూపతి సహాయశ్రేణితోఁ గూడి స
మ్మద మొప్పన్ బరిశుద్ధపార్శ్వుఁ డగుచున్ మత్తారివీరావళిం
జదుపంగాఁ దగుఁ గాక చాపలగుణేచ్ఛన్ వర్తిలంజెల్లునే.
| 55
|
చ. |
అహితములైనఁ గార్యములయందు హితంబును బుద్ధి నేర్చి యీ
మహిపయి మూఢుఁ డౌనతఁడు మంత్రులమాటఁ దిరస్కరించి తా
నహితులమీఁదటం జపలుఁడై కడువేగమె పోయి వారునున్
మహితకరాసులెత్తి పరిమాఱినచోఁ దెలియు న్మనంబునన్.
| 56
|
చ. |
ఎదిటిబలాబలంబు లొకయింత యెఱుంగక మంచిసాహసం
బొదవ మదించి మించి బలియుండను నేనె యటంచుఁ గొంచమౌ
మదిఁ దమకించుభూపతి సమంచితచంచలవృత్తి శత్రుపైఁ
గదలి దురంబులోనఁ బడుఁగాక సుఖస్థితి నుండ నేర్చునే.
| 57
|
మ. |
అమితోద్యోగముఁ గల్గినట్టిరిపురాజానీకముం గ్రూరస
ర్పములం బోలె నయప్రవర్తనలచే భాసిల్లుభూపాలకుం
డమర న్మంత్రబలంబుచేఁ దనకు లోనై యుండఁగాఁ జేయు ట
ర్హమగున్ ధారుణి నట్లొనర్చిన న్సపాలాగ్రేసరుండై తగున్.
| 58
|
వ. |
ఇది మంత్రస్వరూపం బింక దూతచారులప్రకారం బెట్లన్నను.
| 59
|
చ. |
అనువుగ మంత్రముం దెలిసి యందలి యర్థము లాచరించురా
జనిశము దూతకృత్యములయం దభిమానముఁ గల్గి మంత్రులౌ
జనులకు నెల్ల మంత్రమున సమ్మతుఁడై తగుదూతఁ బంపఁగాఁ
జను సమయంబుఁ ద్రొబ్బుటకు శాత్రవమర్మవిభేదశాలియై.
| 60
|
క. |
తలఁచుకొనుశక్తి ఫ్రౌఢిమ
పలుకులనేర్పులును శాస్త్రపరిచితిఁ గార్య
మ్ములయధ్యాసము నాయుధ
ముల తెలివియుఁ గలుగువాఁడు భువి దూత యగున్.
| 61
|
దూతభేదములు
సీ. |
కార్య మెంతయు హత్తఁగాఁ జేయఁజాలిన
యతఁడు నిసృష్టార్థుఁ డనఁగఁ బరగుఁ
జెప్పినట్లే పోయి సేయఁగా నేర్చిన
యతఁ డరయ మితార్థుఁ డనఁగఁ బరగు
నేమియు నెఱుఁగక యేలినాతనికమ్మ
లందించ శాసనహారకుండు
జగతిలో నీరీతిఁ దగి మూఁడుదెఱఁగులై
చరియింతు రీదూతజనులు వరుసఁ
|
|
ఆ. వె. |
బరజనంబు లిటులఁ బలికినఁ దా నిట్లు
పలుకవలయు ననుచుఁ దలఁచికొనుచుఁ
బోవఁదగినయెడకుఁ బోవఁగా వలయును
క్షితిపవరుననుజ్ఞచేత దూత.
| 62
|
క. |
అలజడివారల నాటవి
కులఁ దనకున్ లోనుజేసికొనఁదగు మఱియున్
జలముల పెక్కులు త్రోవలు
దెలియఁగఁదగు దనదు సేనఁదెచ్చుట కొఱకై.
| 63
|
క. |
అరిపురము నతనిసభయుం
జొరవలయుఁ బ్రకాశరీతిఁ జొప్పడ నరిచే
బరికింప ననుమతుండై
యిరవుకొనం జనఁగ నొప్పు నిల దూతలకున్.
| 64
|
ఆ. |
శత్రు నతనిరాష్ట్రసారంబు నతని దు
ర్గంబు దుర్గరక్షణంబు మిత్ర
వితతి యతనికినియువేళ భండారంబు
లెస్సఁ దెలియవలయు లీల దూత.
| 65
|
చ. |
తనవిభుఁ డెట్లు పల్కు మన దా నరితోడుత నట్ల పల్కఁగాఁ
జనుఁ దనమీఁదఁ గైదువలు సాఁచిన నించుక భీతి లేక చూ
పున ముఖచేష్టవల్లఁ దలపోయుచు రాగవిరాగభావముం
గనుఁగొనఁగాఁ దగున్ మఱియుఁ గార్య మెఱుంగఁగ దూత చాతురిన్.
| 66
|
చ. |
తనకు ననిష్టవాక్యములు దాళుకొనన్ జనుఁ గామమున్ మదం
బును మఱి క్రోధము న్విడిచి పోఁ దఱుమం దగు నిద్రవోవగాఁ
జన దొరుతోడఁ గూడుకొని చాలఁబరేంగితముల్ గనుంగొనన్
జనుఁ దనభావ మెయ్యడఁ బ్రచారము సేయఁగ రాదు దూతకున్.
| 67
|
గీ. |
వైరులందు నమాత్యాదివర్గ మనెడి
ప్రకృతులకుఁ గల్గురాగాపరాగములకుఁ
దెలియఁ దగు మఱి భేదింపవలయు వారి
నరసి భేదింపఁ దగు రహస్యంబు గాఁగ.
| 68
|
క. |
తనపతిగుణములఁ బ్రకృతులఁ
దను నడిగినఁ బలుకవలదు ధరణీశులతో
దను సర్వము మీ రెఱుఁగరె
యని పల్కఁగ వలయు మంచివగుపల్కులచేన్.
| 69
|
క. |
కులమునుఁ గడుఁ బేరెన్నిక
గలుగుట ఘనమైనయట్టి కార్యపుసేతల్
కలిమి యన నాల్గుదెఱఁగులఁ
గల వినుతులఁ బతిని రిపుని గణుతింపఁ దగున్.
| 70
|
ఉ. |
జీతము రెండుదిక్కులను జెందెడివారలచేత శిల్పముల్
చాతురి గల్గువిద్యలు విచారము సేయునెపంబుతోడఁ దా
నేతఱి శత్రురాజు ఘటియించినకార్యము భేద్యకోటి ధా
త్రీతలభర్త సేయఁదగురీతులు దూత యెఱుంగఁగాఁ దగున్.
| 71
|
గీ. |
తీర్థముల నాశ్రమంబుల దేవతాల
యములయందుఁ దపస్వివేషముల మెలఁగు
నట్టిచారులతో మాటలాడవలయు
శాస్త్రరీతులు దెలియువ్యాజంబుచేత.
| 72
|
క. |
తనవిభుఘనత ప్రతాపం
బును మంచితనమ్ము సత్యమును గరిమి కులం
బును దానము నుత్సాహముఁ
బెనుపొందఁగఁ బలుకవలయు భేద్యులతోడన్.
| 73
|
క. |
ఇల నిదురపోతు మత్తుఁడు
గలభావమె బలుకుచుండుఁ గన దూత యొరుం
గలయక నిద్దురపోఁ దగు
వల దెప్పుడు బోనములను వనితలఁ దగులన్.
| 74
|
క. |
తనకార్యసిద్ధికొఱకై
ఘనముగఁ దడవైనయపుడు గడువెతఁ బడఁగాఁ
జన దెపుడు దూతవర్యుఁడు
తనకార్యము పొసఁగువిధమె తలఁపఁగ వలయున్.
| 75
|
వ. |
మఱియు రాయబారి యగునతండు శత్రురాజు లనుసరింపుచు
నుండునెడఁ దమయేలికరాకయును నొడంబడిక యాలస్యంబైన
యెడఁ గ్రమంబున మంచిదనంబు మించ వంచనావాక్య
ప్రపంచంబులఁ గాలంబుఁ గడపుతెఱఁ గెట్లన్నను, దనవిభునకు
|
|
|
నొకయించుక వ్యసనంబుఁ గలిగియున్నకతనను, నొరులతో
నొకయించుక వ్యాజ్యంబు గలుగుకతనను దమబంధువులలోనఁ
గలహంబుఁ బుట్టిన నీతిపరుండు గావున నివియు వారించు
కతనను ఫలకాలంబు గాన ధాన్యాదిసంగ్రహంబు సేయుచుండు
కతనను దుర్గంబునకు సవరణలు సేయించుకతననుఁ దన
సైన్యంబులకు క్షేమంబుఁ గోరువాఁడై వర్షాదికాలదేశవిష
యంబులవలనఁ దా రాకయున్నకతనను దానధనాదికంబు
పట్టించుకొని వచ్చువాఁ డై యున్నకతనను, వెలిగుడారంబులు
వేసి పయనంబునకు సామగ్రి యొనఁగూర్చుకొనుచుండుకతనను,
నాలస్యం బయ్యెనని యుచితరీతులఁ గాలంబు గడుపుచు నుండి,
శత్రువునకుఁ గార్యకాలంబు లొనఁగూడకయుండుట లెస్సఁ దెలిసి
మగుడివచ్చి యైనను రాకయుండి యైనను శత్రువార్తలన్నియు
లెస్సగాఁ దనయేలికకు నెఱింగించవలయు మఱియును.
| 76
|
సీ. |
పగఱసామర్థ్యంబు బలమును దుర్గంబు
భండారమును మిత్రబంధుతతుల
నతఁడు పూనుచునుండు నట్టికార్యంబుల
తెఱఁగులు లెస్సగాఁ దెలియుటయును
గడలఁగావలివారి నడవులకడవారిఁ
దనవారిగాఁ జేసికొనుట మఱియుఁ
దమ కని సేయఁగాఁ దగుచోట మగుడి పో
ననువైనచోటుల నరయుటయును
|
|
గీ. |
దూత యొనరించుపను లండ్రు దూతజనుని
వలన నెఱుఁగంగ వలయును వైరిచర్యఁ
దనజనమ్ములయందును ధరణినాథుఁ
డరివరులదూతచేష్టల నరయ వలయు.
| 77
|
దూతచరవికల్పప్రకరణము — దూతలక్షణము
చ. |
తలఁపున మించి క్లేశములు దాశి ప్రయాసము నోర్చి దక్షుఁడై
చెలఁగుచుఁ బోవ రాఁ గలిగి శీలముఁ జెంది పరేంగితంబు నూ
హలు దనలో నెఱింగి కఠినాత్ముఁడు గా కటు యుక్తిపెంపునున్
గలిగినవాఁడు దూత యనఁగా నుతికెక్కుచునుండు నెచ్చటన్.
| 78
|
వ. |
ఇది దూతలక్షణం బగు నింకఁ జారలక్షణంబు వివరించెద.
| 79
|
చారలక్షణము
క. |
మునులును జారులు శిల్పులు
ననఁ దగి దిశలందు ధూర్తులై తిరుగంగాఁ
జను వేగువారు వార్తల
ననువుగఁ దెలియుచును బతికి నవి తెల్పుటకై.
| 80
|
చ. |
ఇలఁ గల దూరకార్యముల నెల్లఁ గనుంగొనఁ జాలునట్టి క
న్నులు పతి కెందు నెంచఁగ వినూతనచాతురిఁ బొల్చువేగువా
రలె కద కాన వారలు ధరాతలమందుఁ జరించుచు సర్వవా
ర్తలు దెలుపం జనున్ బతిహితంబుగ వచ్చుచుఁ బోవుచుండఁగన్.
| 81
|
చ. |
చెలఁగెడు సూక్ష్మసూత్రములచేత బలెం దనవేగువారిచే
నిలఁ గల సర్వవార్తలు మహీపతి దా నెఱుఁగంగ నొప్పు ని
ట్లలవునఁ జారచక్షుఁడయు యందము నొందినరాజు నిద్రచే
నలరినవేళ మేల్కనినయట్టివిధంబున మించు నెంచఁగన్.
| 82
|
గీ. |
కదలుటలచేత వ్యాపించు గాలిలీలఁ
గిరణములచేత వ్యాపించు తరణికరణి
నరపతికి లోకసమ్మతులైన వేగు
వారిచేతనె వ్యాపించవలయు జగము.
| 83
|
చ. |
కనుఁగొన వేగువా రనెడి కన్నులు గల్గినవాఁడు గాఁదగున్
జనపతి వారిచేతనె దిశాతతియందుఁ జరింపుచుండఁగాఁ
జను నటు గాక మూఢుఁ డయి చారులచే నిల సంచరించకుం
డినఁ బడు నంధుఁడో యన వడిన్ సమమై తగునట్టి పట్టునన్.
| 84
|
క. |
వైరులకుఁ గలుగుసంపద
వైరులవర్తనలతెఱఁగు వైరులయవి యౌ
ధారుణి జనములకోరికె
సారెకుఁ బతి దెలియవలయుఁ జారులచేతన్.
| 85
|
వ. |
ఇట్టి చారులు బ్రకాశుం డప్రకాశుండు నన రెండుదెఱంగులై
యుండుదు రందుఁ బ్రకాశుండు దొలుతఁ జెప్పంబడిన దూత
యనం బరంగుచుండు, నప్రకాశుండై గూఢచారి యనం బరంగు
నండ్రు, యజ్ఞంబునందు ఋత్విజుండు సూత్రంబుచేతనే మెలఁగు
చందంబున నరవరుండును జారులచేతనే ధరాతలంబునందెల్ల
సంచరింపవలయు, నందుఁ దొలుతఁ జెప్పంబడినదూతచేతనే
శత్రురాజుల సంధికార్యంబులు మొదలైన రహస్యప్రచారంబు
లెల్లను దెలియవలయును. గూడచారులచేతనే శత్రురాజుల
బాహ్యప్రచారంబులెల్లను దెలియవలయు నిట్టి గూఢచారులు
సంస్థులు సంచారులు నన రెండుదెఱంగులై యుండుదురు. అది
యెట్లనఁ గ్రమంబున వివరించెద.
| 86
|
సంస్థగూఢచారలక్షణము
సీ. |
ఒకరివారై వేఱె యొకరివారగువారు
దాసళ్లరూపునఁ దనరువారు
సన్యాసులై కడు శాంతిఁ జెందినవారు
వేదముల్ సెప్పెడి విప్రవరులు
|
|
|
బహువేషదారులై పరగెడివారలు
మంత్రముల్ మంత్రించు మంత్రవిదులు
గుత్తకోర్లకు దున్నికొనియెడివారలు
కోమటులై యమ్మికొనెడివారు
|
|
గీ. |
నగుచు వైరులపురములయందు నిలిచి
విభునిచేతను ధన మొంది వేగువారు
చాలసుఖలీలచేఁ దమచరుల కెల్ల
నొరిమ నాధారరీతుల నుండవలయు.
| 87
|
గీ. |
ఇటుల శత్రుపురంబులం దెపుడు నిలిచి
యుండు సంస్థులయొద్దకు నొక్కచరుఁడు
పరులదేశంబునందుఁ గొందఱను దఱుమ
వలయు విభునకు నవ్వార్తఁ దెలుపుటకును.
| 88
|
వ. |
ఇట్లు దేశవార్త లరయం దిరిగెడివారు, సంచారులు, తీక్ష్ణులు,
ప్రవ్రజితులు, శస్త్రులు, రసదులు, ననం బరగుచుండుదురు.
దత్ప్రకారం బెట్లన్నను.
| 89
|
సంచారగూఢచారలక్షణము
సీ. |
అడ్డఁబెట్టుచు నూళ్ళయందు గ్రాసముఁ జెంది
తీక్ష్ణులు జోగులై తిరుగుచుండ్రు
ప్రవ్రజితులపేరఁ బరగెడిచరులు స
న్యాసివేషాదుల నంది యుండ్రు
శస్త్రవైద్యముఁ జేసి చరియింపుదురు కొంద
ఱఖిలభూముల శస్త్రు లనెడివారు
రసవైద్యములు చేసి రసికులై తగుచుండ్రు
రసదుల పేరింటఁ బొసఁగువార
|
|
గీ. |
లవనిపతి యిట్లు తిరిగెడియట్టిచారు
నొక్కొరొక్కరిగుఱుతులు నొక్కొరొకరు
దెలియకుండఁగఁ బంపఁగా వలయు నెపుడుఁ
బదరుకొని యంద ఱొకరీతిఁ బలుకకుండ.
| 90
|
చ. |
తనయెడ శత్రునందు నవధానముతోడుతఁ బూని వేయఁగా
ననువగు యత్నముల్ మనసునందు నెఱుంగని యట్టిమందరా
జనిశము నిద్రఁబోనియతఁ డైనను నిద్దురఁ జెందువాఁడె యై
కనఁ దగు మేల్కనన్ బొరయఁ గానడు దా మఱి ద్రమ్మఱన్ ధరన్.
| 91
|
సీ. |
కారణం బేమియుఁ గలుగక కోపించు
వారల దండింపవలయు నెపుడు
కారణంబులఁ గోపగతిఁ జెందువారలఁ
దనవారిగాఁ జేసికొనఁగవలయు
నరికిఁ బ్రవేశింప నది సందు గావునఁ
దనయందుఁ గలుగు ఛిద్రమును దెలిసి
దానమానములచేఁ దా మాన్పఁగాఁ దగు
నల రాజ్యకంటకులైనవారి
|
|
గీ. |
మొగము లెంతయుఁ జెదరఁగా మొత్తవలయు
జనవిభుం డిట్లు మిగుల నెచ్చరిక గల్గి
యమరికై నట్టి సామదానముల సందు
పడి చెడినభూమి నిండింపఁ బాడి యండ్రు.
| 92
|
క. |
ఇంచుక సం దొనఁగూడిన
మించిన రిపురాజ్య మాక్రమించఁగఁ దగు రా
ణించుక సం దొనఁగూడిన
మించి జలము కలము నాక్రమించినరీతిన్.
| 93
|
వ. |
మఱియు నందులలోనిభేదంబు లెనయం దగి శత్రురాజుల
యంతఃపురవార్త లెఱుంగఁజేయు వేగులవారివిధం బెట్లన్నను.
| 94
|
సీ. |
కాననివారలకైవడి వినకుండు
వానిరీతుల మూఁగవానికరణి
మెలఁగువారు నపుంసకులు జడవేషులు
గూనుబోయినవారు గుఱుచవార
లటువంటిరీతుల యాకారములు గల్గు
కాయలు పం డ్లమ్ముబోయవారు
చాకలవారు బిచ్చాలవారలు నట్టు
వలు మఱి శిల్పముల్ గలుగువార
|
|
గీ. |
లింటిబిడ్డలు బూదండ లిచ్చువారు
విమతరాజులయంతఃపురములలోని
వార్త లెల్లను దెలియంగ వలయు నెపుడు
వేగువారలు గుఱిఁగానివిధముతోడ.
| 95
|
గీ. |
గొడుగులును గిండ్లు సురటులు గుఱ్ఱములును
బట్టువారలు పల్లకీ ల్వట్టువారు
నగుచు వేగులవారలు పొగడవార్త
వెలినిఁ గలవార్తఁ దెలుపఁగా వలయుఁ బతికి.
| 96
|
సీ. |
వంటలవారలు వైద్యులు తపసులు
జ్యౌతిషికుల్ వ్రతుల్ హాస్యపరులు
నాండ్రవారలు నీళ్ల నందించువారలు
జెట్టులు భుజియింపఁ బెట్టువారు
|
|
|
వీడెముల్ సొమ్ములు విరు లొసంగెడివారు
కలపముల్ గూరిచి యలఁదువారు
సింగారములు సేయు సంగడికాండ్రును
నామతీర్థమువారు సామువారు
|
|
గీ. |
నాదియగువారి శత్రులయంద నిలిపి
యింగితాదుల నితరు లెఱుంగనీక
దాయ కెందును రస మిడఁజేయవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 97
|
చ. |
పనుపడ నింగితాకృతుల భాషల నన్యు లెఱుంగకుండ నే
ర్పున మును బందుకట్టినలిపుల్గల కమ్మలచేత శత్రువ
ర్తనముల నొండొరుల్ గడుఁ దిరంబగురీతి నెఱింగి వేగువా
రనువుగఁ దెల్పఁగాఁ దగు ధరాదిపవర్యున కాప్తులై తగన్.
| 98
|
చ. |
రవికిరణంబు లెల్లెడల రాజిలి నీరముఁ బీల్చుకైవడిన్
భువిఁ గల వార్త లెల్లఁ దమబుద్ధిబలంబున సంగ్రహింపుచున్
వివరముతో రహస్యగతి వేగులవారు చరింపఁగాఁ దగున్
వివిధములైన వేషములు విద్యలు శిల్పములుం బొసంగఁగన్.
| 99
|
క. |
ఏరీతి సిరులకొఱకై
వైరులఁ దా నాక్రమించు వారు నటులనే
చేరి యొనర్చు నుపాయ ము
దారగతిం దెలియవలయు ధరణీపతికిన్.
| 100
|
శా. |
లక్ష్మీసంయుతనీతివిక్రమకళాలంకార లంకారణా
సూక్ష్మప్రాభావ రామభద్రసుగుణస్తోత్రోల్లసన్మంత్ర మం
త్రక్ష్మారక్షణదక్ష దక్షవిమతప్రఖ్యాతశౌర్యక్రియా
లక్ష్మప్రస్తుతచార చారవరజాలజ్ఞాతవార్తోజ్వలా!
| 101
|
క. |
శ్రీకర్ణాటాధిపద
త్తాకలితనవీనచామరాదికనృపచి
హ్నాకల్పవరశుభాంకా!
శ్రీకరమహనీయరూపజితమకరాంకా!
| 102
|
తరలము. |
వినయహార! సనయచార విదిత ధీరమండలీ
వినుతిహార కీర్తిపూర విజిత తారకా శర
ద్వనదవార! మథిత ఘోరవైరి వీరశౌర్య ఖే
లన గభీర గుణవిహార లలితశూర సేవితా.
| 103
|
గద్యము. |
ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత భార
ద్వాజసగోత్ర జక్కరాజు ఎఱ్ఱనామాత్యపుత్ర సుకవిజనవిధేయ
శ్రీరామకృష్ణభక్తివైభవబాగధేయ వెంకటనామధేయప్రణీతం
బైన కామందక నీతిశాస్త్రంబను మహాప్రబంధంబునందు మంత్ర
ప్రభావంబును, దూతచారస్వభావంబు నున్నది పంచమాశ్వాసము.
|
|