Jump to content

అళియ రామరాయలు/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

రెండవ ప్రకరణము

కృష్ణరాయలు రామరాయలు

శ్రీకృష్ణదేవరాయలవారు సకలసామ్రాజ్యభోగముల ననుభవించుచు ద్రావిడాంధ్ర కర్ణాటసామ్రాజ్యమును మహావైభవముతో నిరంకుశముగా నేలుచున్నకాలమున నాతనికి లోపడిన సామంతమండలేశ్వరులలో నొక్కడగు మహామండలేశ్వర రామరాజ పెదశ్రీరంగదేవమహారాజు కందనోలుమండలమునకు నధిపతిగా నుండి పరిపాలనము చేయుచుండె నని కంనోలుపురమునందలి యొకశాసనమునుబట్టి దెలిసికొనుచున్నారము.[1] ఇతఁడే అళియరామరాయల తండ్రి. అళియరామరాయల బాల్యచరిత్ర మెంతమాత్రమును దెలియ రాదు. మహమ్మదుకూలీకుతుబ్షా రాజ్యమునకు సరిహద్దున నున్న మండలము కందనోలుమండలమె. ఈ మండలమును అళియరామరాయల తండ్రి మాత్రమె గాదు; తాతయగు బుక్కయరామరాజు గూడఁ బాలించె నని పూర్వ ప్రకరణమునఁ దెలిపియున్నాను. బుక్కయరామరాజు విజాపురసుల్తా నగుఆదిల్షాహ డెబ్బదివేలయాశ్వికసైన్యముతో దండెత్తివచ్చి కందనోలు ముట్టడించినపుడు వానినోడించి తఱిమినట్లుగా పద్యబాలభాగవతమునందును నరపతివిజయమందును వర్ణింపఁబడినవిధమును గూర్చి పూర్వ

ప్రకరణమున వివరించియె యున్నాను. ఇట్లవక్రపరాక్రమంబున దండ్రితాతలు పరిపాలించిన మండలము నలియరామరాయలుగూడ బరిపాలించుట పితృపారంపర్యపుసత్వముగా సంభవించినదేగాని యొకయనామకచరిత్రకారుడు దెల్పినటులు మహమ్మదుకూలీకుతుబ్షా విజయనగరసామ్రాజ్యముపై దండెత్తివచ్చి కృష్ణదేవరాయలను జయించి తనహిందూసామంత కుటుంబములోనివాడయిన రామరాజు నధికారిగానియమించిన సత్వమువలన సంభవించినది గాదు. ఇతనికి బూర్వముననే అలియరామరాయలతండ్రి యామండలమును బరిపాలించుచున్నట్టు కందనోలుపురశాసనము దెలుపుచుండెను గదా. మహమ్మదుకూలీకుతుబ్షా కందనోలుమండలమును కృష్ణరాయల సామ్రాజ్యము నుండి గైకొనినమాటవాస్తవమని విశ్వసింతమన్నను తనవారినెవ్వరిని తురకసైన్యములతో నచటనధికారిగ నుంచుట కిష్టపడక కృష్ణరాయలకు మంత్రిగనుండినవానికుమారు డగు రామరాయల నధికారిగ నియమించుట కిష్టపడెనని యెట్లువిశ్వసింప దగును? ఒకవేళ నితడు కృష్ణరాయలకు ద్రోహియై మహమ్మదుకూలీకుతుబ్షాకు లోపడినవాడై యాయనామక చరిత్రకారుడు వక్కాణించినట్లు తనదేశమును ఆదిల్‌షాహ చూఱగొని తన్ను దఱిమివేసి స్వాధీనపఱచుకొనినప్పు డేమియు జేయంజాలక తన ప్రభువుతో మొఱవెట్టుకొనగా నాతడు 'చీ! పాఱుబోతా!' నారాజ్యముననుండ దగవనివెడలనడచిన మాట వాస్తవమని విశ్వసింతుమన్నను, తనకు ద్రోహియై శత్రుపక్షమునజేరి తనశత్రువుచే దర్బారున బరిభవింపబడి వెడలగొట్టబడినపిఱికిపందను జూచి సంతోషించి శ్రీకృష్ణదేవరాయలవంటిశూరచక్రవర్తి తనయేకపుత్రికనిచ్చి వివాహము చేసెనన్న నెట్లు విశ్వసింప దగును? రామరాయలయెడ గల యసూయ యాయనామక చరిత్రకారునిగాని, చరిత్రకారుడగు ఫెరిస్తానుగాని యిట్టియసత్యకల్పనమునకు బురికొల్పిన బురికొల్పవచ్చునుగాని యదియొక వింతగాదు. ఇరువదవశతాబ్దిలోనుండిన హీరానుఫాదిరి వంటి చరిత్రకారుడు రామరాయలతండ్రి శ్రీరంగరాజు కృష్ణదేవరాయనిమంత్రియని యొక ప్రక్కనొప్పుకొనుచు తానువ్రాసిన యారవీటివంశచరిత్రము నందు నాయనామక చరిత్రకారునియొక్కయు ఫెరిస్తాయొక్కయు నసత్యకల్పనములను సత్యాంశములనుగా విశ్వసించి వ్రాయుట యాశ్చర్యకరముగా నుండకమానదు. రామరాయల మంత్రులలో నొకడుగానుండి యాతనిచే నొకప్పుడు కొండవీడురాజ్యమునకు బ్రతినిధి పాలకుడుగా నియమింపబడిన రామయామాత్య తోడరమల్లనునాతడు రామరాయలతమ్ముడగు వేంకటాద్రి ప్రేరేపణచే రచియించి రామరాయని కంకితముగావించిన 'స్వరమేళకళానిధి' య్నుగ్రంథమున నీక్రింది భావముగలశ్లోకములను వ్రాసి యున్నాడు.[2] చంద్రవంశమున జనించి యనేకరాజన్యులను జయించియు బ్రకటసాత్తికుడై సదాచారతత్పరుడై రాజర్షిభావముతో నొప్పుచుండెడి శ్రీరంగరాజు సకలసద్గుణగణంబులచేతను యశోదావినతానసూయాసుదక్షిణాసత్యవతీ సుభద్రలకు సాటియైన తిమ్మాంబికను వివాహము చేసికొనియెను. ఆదంపతుల తపోవిశేషముచేత వారలకు రామరాజు జనియించెను. అట్టిరామరాజునకు కృష్ణరాయలు తనకూతునిచ్చి వివాహముగావించి మహానుభావుడైన రామరాజునకు భార్యగా నుండదగినకన్యకు దానుతండ్రియై యున్నందులకు గర్వపడుచుండెను.

ఇతడు కృష్ణరాయల కల్లుడగుటచేతనే ఇతనినామమునకు మొదట 'అళియ' శబ్దము చేర్పబడి 'అళియరామరాయ' లని సామ్రాజ్యప్రజలతో వ్యవహరింపబడుట సంభవించినది. ఆరవీటివంశములో రామరాయనామములు పెక్కండ్రుండుటచే సామ్రాజ్యాధిపతి కల్లుడయిన కారణమున 'అళియరామరాయ' లనునామము సామ్రాజ్యమున బ్రాముఖ్యతను గాంచినది. కృష్ణరాయనికల్లుడయ్యును, కందనోలుమండలమును బాలించుమాండలిక ప్రభువయ్యును, కృష్ణరాయనికాలమున జరిగిన యేప్రసిద్ధదండయాత్రలయందును నితడు పాల్గొన్నట్లు చరిత్రమునం దితనినామము వినంబడకుండుటయే చిత్రముగానున్నది. ఈవివాహ మేసంవత్సరమున జరిగినదో యావివరముగూడ దెలియరాదు. కృష్ణరాయలకొమర్తె యగుతిరు మలాంబికను వివాహమాడినవిషయ మొక్కటియే పేర్కొన బడియున్నది.

అలియరామరాయలు కృష్ణరాయలసైన్యములో నొక గొప్పసేనాధిపతిగ నుండి యొకతెలుగుమండలమునకు బాలకుడై పరిపాలించుచుండె నని 'కోయుటో' (Couts) అను చరిత్రకారుడు వ్రాసియున్నా డని హీరానుఫాదిరిగారి యారవీటివంశచరిత్రమునందు దెలుపబడినది. కృష్ణదేవరాయల వారు తనయవసానకాలమునకు బూర్వము రాజ్యపరిపాలనాభారము నలియరామరాయల చేతులయందును, సైన్యాధికారిభారము నంతను రామరాయలతమ్ముడగు తిరుమలదేవరాయల చేతులయందును బెట్టె ననియు, తాను మరణించునపుడు తనసామ్రాజ్యమున కచ్యుతదేవరాయలను బట్టాభిషిక్తునిగా జేయవలసిన దని 'అలియరామరాయల' కాజ్ఞాపించె ననియు, అతనియభిమతముననుసరించి రామరాయలు కృష్ణరాయనిమరణానంతరము నటుగావించె నని 'క్వెరోజు' అను చరిత్రకారుడు వ్రాసియుండె ననిపై యారవీటి వంశచరిత్రమునందు వక్కాణింపబడినది.


అచ్యుతదేవరాయలు - రామరాయలు


అచ్యుతదేవరాయలవారు క్రీ. శ. 1530 మొదలు క్రీ. శ. 1542 వఱకు బండ్రెండు సంవత్సరములమాత్రమే విజయనగరసామ్రాజ్యమును బరిపాలించెను. ఇతని పరిపాల నాకాలమున గూడ 'అళియరామరాయ' లెట్టిసితి యందుండియెట్లు గౌరవింపబడియెనో సత్యచరిత్రము తేటపడకున్నది. కాని 'నన్నీజు' ధనాశాపీడుతు లయినయూధులగు నీ సోదర ద్వయముచేతులలో బరిపాలనాభారము నంతయునుంచి వారేమిచేయుమన్న నదిచేయుచుండె ననియచ్యుత దేవరాయలను నిందించి యున్నవాడు. ఈవాక్యములను విశ్వసించి న్యూయలుగారు తమవిస్మృతసామ్రాజ్యమునందు నన్నీజు వ్రాసినట్లేవ్రాసి యున్నారు. వీనినివిశ్వసించి హిరానుఫాదిరి పైనుడివిన 'క్వెరోజు' వాక్యములను దామువ్రాసిన చరిత్రమునందుదాహరించి యున్నారుగాని యచ్యుత రాయాభ్యుదయమునగాని వరదాంబికా పరిణయమునగాని మరియేగ్రంథమువలన గాని తదితరము లయిన శాసనాదులలో గాని, అచ్యుత దేవరాయల దక్షిణదేశ దండయాత్రల సందర్భమున గాని యీసోదరుల నామములు గాని వాగు చేసిన ఘనకార్యములు గాని వినరావు. సామ్రాజ్యమున వీరికెట్టిపలుకుబడిగలదో యేతద్విషయము గూడ నెందును గానరాదు. అచ్యుతదేవరాయలను నిందించుసందర్భమున 'నన్నీజు' వ్రాసిన వాక్యములలో నుదాహరింపబడినసోదరు లిర్వురును వీరుగారనియును అచ్యుతదేవరాయల భార్యయగు వరదాంబికతోబుట్టువు లగు సలకము పెదతిమ్మరాజు, చినతిమ్మరాజు నై యుండవలయు ననినాయభిప్రాయము. ఎందుకన, అచ్యుతదేవరాయలు మరణించునపుడు పులికాటి (తూర్పు సముద్రతీరమునందలిప్రళయకావేరి) నుండి యచట బరిపాలనము సేయుచున్నమాండలిక ప్రభువురామరాయలు విద్యానగరమునకు బయలుదేఱి వచ్చెనని 'కోఱియా' యనునాతడు వ్రాసి నట్లుగ నారవీటివంశచరిత్రమునందు వక్కాణింపబడినదికావున సామ్రాజ్యభారమునంతయు వహించిన రామరాయలంతటివాడు దూరదేశమున బ్రళయకావేరి యందొకపాలకుడుగా నుండి సామ్రాజ్యధిపతిమరణకాలమునకుమాత్రమె విద్యానగరమునకు వచ్చుటసంభవించి యుండదు. ఈయచ్యుత దేవరాయలమరణానంతరము సంభవించినచరిత్ర విషయములను బట్టి కూడ నీకాలమున నీసోదరద్వయ మంతగా బ్రాముఖ్యత వహించి యున్నట్లు గన్పట్టదు. వారెట్లో మౌనముతో దూరముననుండి కాలము గడుపుకొన్నటుల గనంబడుచున్నదిగాని యచ్యుతదేవరాయల పలుకుబడిగలిగి సామ్రాజ్యవ్యవహారముల జోక్యముకలిగించుకొని యంతగా వ్యవహరించినటుల గనుపట్టదు. తిరుమలాంబ విరచితమైన 'వరదాంబికా పరిణయ' మను గ్రంథమున దుళువనరసింహరాయలు దివసకర కులోత్తంసు డయినరాచిరాజునకు శ్రీరామాంబిక గర్భమున జనించినయౌబమాంబను వివాహము చేసికొనగా నామెవలన నాతనికచ్యుతరాయలనుకుమారుడు కలిగె ననియు, ఆకుమారునకు సలకరాజుపుత్రులగు తిరుమలరాజను నామములుగలిగి యచ్యుతదేవరాయలకు మంత్రులుగ నున్న యిర్వురసోదరులకు చెల్లెలుగ నున్నవరదాంబిక వివాహముగావింపబడె ననియు, వారలకు తిరుపతివెంకటాద్రీశుని కృపాతిశయముచే కుమారుడుపుట్టిన నతనికి వేంకటాద్రి యనిపేరుపెట్టి యచ్యుతదేవరాయలు తాను పట్టాభిషిక్తు డయినవెనుక నాతనియువరాజుగ జేసె ననియు వ్రాయబడి యున్నది. దీనినిబట్టి అచ్యుతదేవరాయలకు మంత్రులుగనున్నవారు సలకరాజుపుత్త్రులును మఱదులు నగుపెదతిమ్మరాజు, చినతిమ్మరాజు ననుసోదరులని స్పష్టముగా జెప్పబడియున్నది.[3] విదేశీయు లయినచరిత్రకారుల కీభేదము తెలిసికొన సాధ్యముగాక యీమంత్రిపదవులను రామరాయలకును నాతనితమ్ము డగుతిరుమలరాయనికిని ముడివెట్టి యేమో వ్రాసి యున్నారు. వారివ్రాతలు విశ్వాసపాత్రములు గావు. కాబట్టి యచ్యుతదేవరాయలకాలమునగూడ నంతప్రాముఖ్యలుగ నున్నటుల గనుపట్టదు.

చిన్నవేంకటాద్రిపట్టాభిషేకము

అచ్యుతదేవరాయలు విద్యానగరమున బట్టాభిషిక్తుడయినపుడే యతడు సలకరాజపుత్త్రిక యగువరదాంబికను బట్టమహిషిగను, ఆమెపుత్రు డగుకుమార వేంకటాద్రిని యువరాజుగను జేసె నని రాజనాథకవి విరచిత మగునచ్యుతరాయాభ్యుదయ మనుగ్రంథమున దెలుపబడియున్నది. ఈగ్రంథమున నచ్యుతరాయల పట్టాభిషేకకాలమునకు వానితండ్రి నరసరాయలుకూడ బ్రదికియున్నట్టు దెలుపబడియున్నది. ఇదెంతవఱకు సత్యమో దెలియరాదు. అచ్యుతరాయల పరిపాలనకాలమున వానిమఱిదియగు సలకము చినతిమ్మరాజు ప్రధానమంత్రిగనుండి రాజ్యభారము నంతయు దానేవహించి యారవీటి వంశమువారికి నెవ్విధమైనప్రాముఖ్యత కలుగకుండ బహుజాగరూకతతో వ్యవహరించి నటులు గనుపట్టుచున్నది. సామ్రాజ్యములోని మాండలికప్రభువులును రాజబంధువులు నీతని నంతగా బ్రేమించినవారుగా గనుపట్టరు. విదేశీయులయిన చరిత్రకారులు గూడ ననుకూలముగా వ్రాసియుండలేదు. అచ్యుతదేవరాయల మరణానంతరము సలకము చినతిమ్మరాజు తనమేనల్లు డగుచిన్నవేంకాటాద్రీంద్రుని క్రీ. శ. 1541 సంవత్సరములో బట్టాభిషిక్తుని గావించెను. ఈచిన్న వేంకటాద్రి రాజు పట్టాభిషేకకాలమునకు బదునెనిమిది సంవత్సరములయిన గడవనిబాలు డని చెప్ప దగును. ఇతనికినప్పటికి వయస్సెంతయుండెనో యెవరును సరిగాజెప్ప జాలకున్నను బాలుడని యైకకంఠ్యముగా నెల్లవారు నంగీకరించి యున్నారు. కనుక సామ్రాజ్యసార్వభౌముడు నిర్వహింపవలసినకార్యభార మంతయు సలకముచినతిమ్మరాజుపై బడియెను. అతడు సమర్థుడు గాడు; బుద్ధిమంతుడు గాడు; అదియునుంగాక విశేషించి దురాశకలవాడుగను, ఒక్కొక్కప్పుడవివేకపుం బనులొనర్చువాడుగను నుండెను. ఈకాలము నందలి సామ్రాజ్యవైభవ మింతయంత యని చెప్ప నలవికాదు. సామ్రాజ్యమునందు నత్యల్పకాలములో నతివేగమున బదిపదునైదులక్షల సైన్యమును సమకూర్ప వచ్చును. ఈసామ్రాజ్యమున నప్పటికి మూడువేలయేనుగులతో గూడిన గజసైన్యమును, అరాబియా, పారశీకములనుండి రప్పించిన నలువదివేల గుఱ్ఱములతో గూడిన యాశ్విక సైన్యమును గలదు. ధనికులయిన సామంతమాండలికు లైనప్రభువులు పెక్కండ్రు గప్పములు చెల్లించువారు గలరు. సమీపస్థులయిన పెక్కండ్రుమహారాజులు సామ్రాజ్యమునకు లోబడినవారుగా నుండిరి. ఇదిగాక యీసామ్రాజ్యమునందలి నదులలో బంగారమును, కనుమలలో వజ్రములు మొదలగు నవరత్నములు లభించుచుండెను. ఎన్నివిధములచేత బరిశీలించి చూచినను నాకాలమున విజయనగర సామ్రాజ్యము మహోచ్చస్థితియందుండి శత్రువులకు గన్నెఱ్ఱ సలుపు చుండెనన్న నతిశయోక్తియెంతమాత్రమును గా జాలదు. ఇట్టిసామ్రాజ్యమునకు నొకబాలు డధిపతికావలసి వచ్చెను. తత్సామ్రాజ్యభారనిర్వాహకకర్త దురాశాపీడితుడు దుర్మార్గుడు నయ్యెను.

సలకముతిమ్మరాజు - రామరాయలు

అంత:పురములోని రాణులకును మాండలికులయిన ప్రభువులకును, పెక్కండ్రుజనులకు గూడ సామ్రాజ్యభారము సలకము చినతిమ్మరాజు వహించుట సమ్మతముగా లేకుండెను. అందుముఖ్యముగా గృష్ణదేవరాయలభార్య లగు తిరుమల్దేవికిని, చిన్నాదేవికిని సామ్రాజ్యభారము నలియరామరాయలును, వానిసోదరులును వహింపవలయు ననిపెద్దకోరిక గలదు. సామ్రాజ్యపరిపాలనా భారము నలియరామరాయలకును వానిసోదరులకును విడిచిపెట్టి కోశాధికారభారమునుమాత్రము వహింపవలసిన దని సలకముచినతిమ్మరాజునకు మాండలికప్రభువులు తెలియ జేసిరికాని యాత డందుల కంగీకరింప డయ్యెను. ఇతనిపరిపాలనము సామ్రాజ్యమునకు గొప్పముప్పు తేగల దనుగట్టినమ్మకము గలవా రగుటచేత రామరాయలును వానిసోదరులును విద్యానగరమును విడిచిపోవ నిష్టపడలేదు. అభిప్రాయభేదము లుదయించుటచేతను, సామ్రాజ్య మపహరింపవలె ననిదురాశతో గూడియున్నవా డగుటచేతను, విద్యానగరమున వారలయునికి తన సంకల్పమును విచ్ఛిన్నముచేయు నట్టిదిగ నుండుటచేతను, సలకము చిన్నతిమ్మరాజు దురాలోచనమునకు లోనయి యాసోదరులను చెరపట్టి యుంచవలె ననిప్రయత్నించెను. వీరినిమాత్రమెగాదు. తనప్రయత్నముల కడ్డముతగులువారని తనకు దోచినవారినెల్లరను బంధింప గుట్రలు చేయ మొదలుపెట్టెను. వీనిదుష్ప్రయత్నములను కుట్రలను దెలిసికొని యనేక మాండలికప్రభువులు విద్యానగరమును విడిచిపెట్టి స్వస్థానములకు బోయిరి. అట్లుపోయి కొందఱు విద్యానగరముతో సంబంధమునువీడి స్వతంత్రు లగుటకు బ్రయత్నింపు చుండి రని కోరియాయనునాతడు వ్రాసి యున్నాడు. అప్పు డళియరామరాయలుగూడ తనసోదరు లిర్వురుతోను విద్యానగరమును విడిచి పోయెను. వీరికిద్వేషము ప్రభువయిన చిన్నవేంకటాద్రిపై యెంతమాత్రము లేదు. వానికార్యకర్త యైనసలకము చినతిమ్మరాజు పయినమాత్రమెగలదు. వారు సేనలను సమకూర్చుకొనివచ్చి యాదుర్మార్గుని శిక్షింప జూచుచుండిరి. ఇంతలో సలకముచిన్నతిమ్మరాజు చేయుదుష్పరిపాలనము బహుక్రూరముగా బరిణమించుచుండెను. రాజభండారములోనిధనము నంతయు గుట్రచారుల లంచముల క్రిందను, దుష్కార్య నిర్వహణము కొరకును దుర్వ్యయము సలుపు చుండెను.

సలకముతిమ్మరాజుద్రోహకృత్యములు

ఇతడు మాయోపాయముచే దనకు బ్రతిపక్షులుగా నున్న ప్రభువుల రప్పించి వారలను జంప బ్రయత్నించెను. వీనిమాయలో దగుల్కొని మొదటవచ్చిన కొందఱగ్రుడ్లు పెఱికించెను. ఈసమాచారమును విని వెనుకవచ్చినవారు మరలిపోయి పగదీర్చుకొన బ్రయత్నములు సలుపుచుండిరి. సామాన్యప్రజలు వాని నెదుర్కొన జాలరైరి. హిందూసామ్రాజ్యరాజధాని యగువిజయనగరమున సంభవింపనున్న విప్లవమునకు గోలకొండవిజాపురసుల్తాను లత్యంతసంతోషముతో నేరీతిగ బరిణమించునో యని వీక్షింపుచుండిరి. ఇట్టి సమయమున సార్వభౌముని తల్లియగు వరదాంబికా దేవియు గూడ సోదరుని దుర్నయమును జూచి భరింప జాలక తన కుమారుని, వానిసామ్రాజ్యమును గాపాడినయెడల విశేషముగా ధనమునొసంగుచున్నా ననివిజాపుర సుల్తా నగుఇబ్రహీమ్ ఆదిల్‌షాహాకు రాయభార మంపెననియు, ఆరాయబారమును మన్నించి యాతడు తనసైన్యముతో విద్యానగరమునకు వచ్చుచుండుటను విని సలకముతిమ్మయ విశేషధనముతో రాయబారులను నాతనికడకు బంపి వెనుకకు మరలించెననియు 'కోరియా' యనునొక విదేశీయుడు వ్రాసియున్నాడు. రాణి దిక్కులేనిపక్షివలె వానిచేతిలో జిక్కెను. అంత నీద్రోహి తనపదవిని బలపఱచుకొనుటకును, తనమేనల్లునిపక్షమును బూని సామ్రాజ్యములోపలగాని వెల్పలగాని తనతో నెవ్వరును యుద్ధముచేయ సాహసింప కుండుటకును, తనమేనల్లుడును సార్వభౌముడు నగుచిన్నవేంకటాద్రిని వాని పినతండ్రులిర్వురను వానిదాయాదితోసహా నల్వురను సంహరించెనని 'కోరియా' యనునాతడు వ్రాసియున్నాడు.

అచ్యుత దేవరాయల తమ్ముడు రంగరాయలు వీనిచేతంబడి మ్రగ్గెనుగాని వానికుమారుడు సదాశివరాయలు మాత్ర మీద్రోహి పాలంబడి మడియకుండుట వానియదృష్టమని భావింపవలయును. రాణి వరదాంబికాదేవిగతి యేమయ్యెనో యిటుపై యెంతమాత్రము వినంబడదయ్యెను. ఆహా! రాజ్యకాంక్ష యీదురాత్ముని యెంతటిదౌష్ట్యమునకు బురి కొల్పినది? ఇంక నీతడు విజయనగర సామ్రాజ్యమున దాను బట్టాభిషిక్తు డగుటకు నడ్డుపడ సామర్థ్యముగల వారెవ్వరు లేరని తలంచెను. అంత ధైర్యసాహసములు ముప్పిరిగొన సామ్రాజ్యవజ్రసింహాసనము నాక్రమించి యధిష్టింప జూచెనుగాని తనకు రాబోవుముప్పు నెఱుంగడయ్యెను. అతనిస్వామిద్రోహమున కెంతయు దు:ఖపడుచున్నవారయినను, కొందఱు ప్రభువు లతనియధికారమునకు లోపడియు, నతడుగావించు దౌష్ట్యములకు మనస్సు విఱిగిపోయిన వారయి విజాపురసుల్తాను ఇబ్రహీముతో గుట్రలుచేయ నారంభించి సలకముతిమ్మయ నధికారపదవినుండి తొలగించినయడల విజయనగరసామ్రాజ్యకిరీటము నాతని కొసంగి శతవిధముల తోడ్పడ గల వారమని వాగ్దత్తము చేసిరనియు, దీనినంతయు దెలిసికొన్న వాడయి యాద్రోహి తనకిష్టు డైనవాని నొకరాయబారిని సిద్ధముచేసి వానిపరముగా నాఱులక్షల హొన్నులద్రవ్యము నొసగి యీధనము విజాపురసుల్తా నగుఇబ్రహీమున కిచ్చి తనకు తోడ్పడవలసిన దనియు, నట్లుతోడ్పడిన యెడల తానతనికి సామంతుడ నైయుండుటయెగాక యీయుపకారమునకు బదులుగా దారిబత్తెములకుగాను దినమునకు మూడులక్షలహొన్నుల నదనముగా నిచ్చుటకు సంసిద్ధుడనై యున్నాననియు, నాపక్షమున నచ్చజెప్పి వానిదోడ్కొని రావలసినదని ప్రోత్సహించి యారాయబారిని విజాపురమునకు బంపించెననియు, అనాయసముగా లభించెడు నీలక్ష్మీ పదవికి పొంగిపోయిన మనస్సంతోషము గలవాడై వృద్ధసేనానియగు అసాదుఖాను ప్రేరేపింప నతడు వెంటనే బయలుదేరి యేవిధమైన యడ్డంకులునులేక స్వేచ్ఛగా విజయనగరమునకు విచ్చేసె ననియు, స్వామి ద్రోహియైన సలకముతిమ్మయ తనమిత్రులగు ప్రభుపుంగవులతో నెదురుగా బోయి వానిసింహాసనము పయి కూరుచుండ బెట్టియేడుదినములు నగరమునం దంతట వేడుకలు జరిపించి రనియు 'కోరియా, ఫెరిస్తా' లను చరిత్రకారులు వ్రాసి యున్నారు. వీరియుభయులవ్రాతలకు ముఖ్యవిషయమున నేకభావమున్నను వివరములలో నేకభావము గన్పట్టదు. వీరిలో 'కోఱియా' విదేశీయుడు. రెండవవా డయినఫెరిస్తా రామరాయలకు గర్భశత్రువు. విజయనగరసామ్రాజ్యమునెడ ననురాగము లేనిచరిత్రకారుడు, అహమ్మదునగరసుల్తా నగునిజాముషాహ కొల్వుకూటమున నున్నమహమ్మదు మతస్థుడు. దేశీయులును, సమకారికులును విజయనగరసామ్రాజ్యమునందున్నవారును వ్రాసిన వ్రాతలలో వీరివ్రాతలను సమన్వయింప జేసి సత్యసంశోధన జేసినగాని సత్యచరిత్రము బయలపడదు. ఆకాలమునందు విజయనగరసామ్రాజ్యమునకు నారవీటివంశము పెట్టనికోటగ నుండెను. సలకముతిమ్మయగావించిన ద్రోహకృత్యముల మూలమున విజయనగరరాజధాని మహావిప్లవముపాలయి హిందూసామ్రాజ్యము వినాశము జెందనున్నకాలమున నీయుపద్రవము నడంచి సంరక్షింప గలమహాసమర్ధు డగువీరాగ్రగణ్యు నొకనిబ్ర సాదింపు మనిసామ్రాజ్యములోనిప్రజ లనుదినము నిష్టదేవతలను బ్రార్థించుచుండిరి. సామ్రాజ్యములోని ప్రభుపుంగవులలో నధికసంఖ్యాకులదృష్టులు రాజబంధువులలో బ్రముఖుడై యుధిష్ఠిరునకు భీమార్జునులలవలె చేదోడు వాదోడుగా నుండి బక్తితాత్పర్యములతో తిరుమలరాయవేంకటాద్రులనుసోదర ద్వితయముచే సేవింపబడు చున్నయళియరామరాయలపై ప్రసరింపసాగినవి. ఈద్రోహి బాఱిపడక విజయనగరరాజధాని నుండి తప్పించుకొనిపోయిననాటనుండి పిఱికిబంటులై మౌనముతో నొకచోట నొదిగి కూరుచుండినవారుకారు.

అళియరామరాయల దండయాత్ర

అళియరామరాయ లట్లుసోదరు లయినతిరుమలరాయ వేంకటాద్రులతో విద్యానగరమును విడిచిపెట్టిపోయి మున్ముందుగా గుత్తి, పెనుగొండ, గండికోట, యాదవాని, కందనోలు దుర్గముల కధిపతులయినవారిని స్వాధీనపఱచుకొని యాయా సీమలసైన్యముల నసంఖ్యముగా సమకూర్చుకొని అచ్యుతదేవరాయల తమ్ముడును, సలకముతిమ్మయచే జంపబడినవాడును నగురంగరాయలకొడుకు సదాసివదేవరాయ లేగిరిదుర్గముననో దాగొని యున్నవా డనితెలిసికొని తొలుతవానినిరప్పించుకొని యాతనికభయప్రదాన మొసంగి, తమకులదైవమైనతిరుమల వేంకటేశ్వరులసన్నిధానమున మఱదియు, బాలుడు నగునాతని విజయనగరసామ్రాజ్యమునకు బట్టాభిషిక్తునిగావించి యట నుండి బయలు వెడలివచ్చి గుత్తిదుర్గమున బ్రవేశించి కొంతరక్షణసైన్యముతో సదాశివరాయని నచటనిలిపి, తనపెద్దతండ్రి యగునౌకుతిమ్మరాజు వానిపుత్రులుమొదలుగా బంధువర్గముతోడను, సొన్నలాపురముహండేహనుమప్పనాయడు, పెమ్మసానిపెదతిమ్మప్పనాయడు, మెసాపెద్దప్పనాయడు మొదలుగా సామంతవీరవర్గముతోడను గూడి యసంఖ్యాకసైన్యములతో తిరుమలరాయవేంకటాద్రులు తనకంగరక్షకులుగా నుండి సేవింపుచు వెంటరా రణభేరి మ్రోగించుచు మహారభసముతో సలకముతిమ్మరాజుపై దండయాత్ర సాగించి వెడలి విద్యానగరమును సమీపించుచుండెను.

ఈదండయాత్ర మొదలుపెట్టుటకు బూర్వమె "మీరు చేసినద్రోహమునకు మేమెంతయుదు:ఖపడుచున్న వారమైనను, దీనినంతనువిధివశమయినకార్యముగా భావించి మేము మీకు వినయవిధేయులమై మీయధికారపాలనమునకు లోపడి యనువర్తింప గలవారముకాని యీసామ్రాజ్యమున కపాయకరులును శత్రువులు నగుతురకప్రభువులనుమాత్రము మున్ముందుగా విజయనగరమునుండి పంపివేయవలసినదిగా బ్రార్థించుచున్నార" మనియొకజాబు వ్రాసి గుత్తిదుర్గమునుండి సలకము తిమ్మయక బంపించెననియు, అత డందుల కెంతయు సంతోషించి యాసమాచారమును విజాపురసుల్తానునకు దెలియజేసి తాముచేసికొన్న యొడంబడిక ప్రకార మేబదిలక్షల హొన్నుల నాతనికొసంగి యతని వానిరాజ్యమునకు బంపి వేసె ననియు, 'కోఱియా, ఫెరిస్తా' లు వ్రాసియున్నా రని యారవీటివంశ చరిత్రమునందు దెలుపబడినది. వీరివ్రాతలంతగా విశ్వాసపాత్రములు గావు. ఈవిప్లవ సందర్భమున విజాపురసుల్తాను దురాశతో జేసిన దురాలోచనలను పొందినయమిత పరిభవమును గప్పిపెట్టుటకును, అళియరామరాయలప్రజ్ఞాప్రతిష్టలను గొంచెపరచుటకును వ్రాసినవ్రాతలుగాని యన్యములుగావు. "ఆలీఇబూ అజీజుఅల్లాతబతాబాయి" అనుచరిత్రకారుడు తానువ్రాసిన 'బురహాన్; ఈ. మా అసిర్‌' అనుగ్రంథమున విజాపురసుల్తాను తానెవ్వరివలన నాహూతుడుగాక తనంతతానే విజయనగరమునకు వచ్చె ననియు, సలకముతిమ్మయ సుల్తానుకు ద్రవ్యము నొసంగ లేదనియు, సుల్తానురాక విని సలకముతిమ్మయ విజయనగరమును విడిచి పాఱిపోయెననియు, విజాపురసుల్తానుసేనాని యగు అసాదుఖాను విజయనగరమునకు రావలసినదని సలకముతిమ్మయకు జాబుకూడ వ్రాసె ననిదెలిపి యున్నా డనియారవీటివంశ చరిత్రమునందే వక్కాణింపబడి యున్నది. అహమ్మదు నగరమున నైజాంషాహా దర్బారుననుండి వ్రాసిన 'మహమ్మదుఖాసిం ఫెరిస్తా' వ్రాతలనమ్మవలయునా? 'ఆలీఇబూఅజీజు అల్లాతబతాబాయి' వ్రాతలునమ్మవలయునా? మఱియు 'బసాతిన్ - ఉన్ - సలాతిన్‌' అనుఫారసీభాషాగ్రంథమున సలకముతిమ్మయ విజాపురసుల్తానుకు 44 లక్షల హొన్నులద్రవ్యము నొసంగెనని వ్రాయుచు మఱియొక సమాచారము వలన 80 లక్షల హొన్నులద్రవ్యము నొసగ బడినట్టు దెలియుచున్న దనిగూడ లిఖింపబడి యుండెను. ఇంతద్రవ్యమును విచ్చలవిడిగా వెచ్చపెట్ట గలిగిన భాగ్యశాలియగు సలకముతిమ్మయమిత్రులగుమంత్రులకు నళీయరామరాయలులంచములనిచ్చి వశ్యులనుగావించుకొనుటచేత రామరాయలు స్వపరివారముతో విజయనగరద్వారమును సమీపించినంతనే యామంత్రులెల్లరు నగరద్వారములనుదెఱచివేసి రనిమహమ్మదుఖాశిం ఫెరిస్తా వ్రాసియున్నాడు. ఇంతియగాదు సలకముతిమ్మయకును రామరాయలకును యుద్ధము జరిగినట్లే చెప్పడు. సలకముతిమ్మయ యుద్ధములో మరణించి నట్లు ప్రశంసింపడు. ఆత్మహత్యచేసికొని సలకముతిమ్మయ చచ్చె నట! హీరానుఫాదిరిగారి విశ్వాసమునకు బాత్రములైన మహమ్మదుఖాసింఫెరిస్తావాక్యము లిట్లున్నవి. "తానువంచింపబడిన విషయమును దెలిసికొని యంత:పుర రాజమందిరమున దల్పులుబిగించుకొని నిరుత్సాహమూలమున పిచ్చిపట్టిపోయి రాజుగారియేనుగులు, గుఱ్ఱములు, మొదలగువానిగ్రుడ్లు పెరికించియు, తోకలుగోయించియు, తనశత్రువులకు నిరుపయోగములగునటులు గావించె నట. అనేకయుగములనుండి వంశ పరంపరగా సంపాదింపబడిన వజ్రములు, కెంపులు, పచ్చలు మొదలుగా నవరత్న రాసులను, అమూల్యములగు మౌక్తిక రాసులను బెద్దపెద్దతిరుగటి రాళ్లలో బోయించి విసిరించి పొడుము గావించి భూమిపై చల్లించెనట! అంతనతడు తన గదిలోని యొకస్తంభమునకు వాడిగలకత్తి నొకదానిమొనపైకుండునటులు బిగింపజేసి యది తనవక్షస్థలమును భేదించుకొని వెన్నుపైకి వచ్చునట్లుగా గొప్పపఱ్వున వచ్చి దానిపైబడి ప్రాణముల గోల్పోయెనట! అంత నగరద్వారముతలుపులు తెఱువ బడిన వట! ఈఫెరిస్తా వ్రాసిన దానితో 'కోరియా' యనుపోర్చుగీసు చరిత్రకారు డేకీభవించుటయె గాక 'సలకముతిమ్మయ' విజయనగర సామ్రాజ్యాధిపతిగ జావవలెనను కోరికతో నట్లుచచ్చె ననికూడ వక్కాణించెనని యారవీటివంశచరిత్రము నందు హీరాసుఫాదిరి నుడువుచున్నాడు.

సలకముతిమ్మయ యుద్ధముచేసి మడియుట

హీరాసుఫాదిరి కోరియాఫెరిస్తాలు శాస్త్రోక్తముగ నిష్పక్షపాతమైనచరిత్రను వ్రాసిరని నమ్మి వారివ్రాతల నాధారముగా జేసికొని అళియరామరాయల చరిత్రములోని మూలసత్యమును గ్రహింపజాలక దుర్ర్భమపాలయి చరిత్రమునంతయు దాఱుమాఱుచేసి వ్రాయుటెంతయు శోచనీయము. వీరు తామువ్రాసినచరిత్రమునం దొకచోట "రామరాయలువచ్చు వఱకు విజయనగరమునందు విజాపురసుల్తాను నిలిచియుండెననియు, వీనివలనె బరీదుషాహా, నిజాముషాహా, కుతుబ్షాహా లాతనికి (సలకముతిమ్మయకు) దోడ్పడు చుండిరనియు హండేవారి అనంతపురచరిత్రము దెలుపుచున్నది. సలకముతిమ్మయాతో మైత్రిచేసికొన్న యీప్రభువులందఱితోను యుద్ధము చేయుటకు సాహసించిన రామరాయల పరాక్రమమును వినుతించుట కుద్దేశింపబడినట్లు గన్పట్టుచున్నది కాని యీమైత్రానుబంధమునుగూర్చి ఫెరిస్తాయొకపలుకైన బలికియుండలే" దని వ్రాసి యున్నారు. [4] మఱియొకచోట "పైనుదాహరింపబడిన తెలుగుకావ్యములు రామరాయల పరాక్రమశక్తిని వానిగుణములను ప్రసిద్ధపఱచుటకుగాను నతడు తనప్రతిస్పర్థికి వినాశకుడైనట్లుగా దెలుపుచున్నారు; కాని యిదికవులెల్లరు ననుశ్రుతముగా నవలంబించెడి మార్గ" మని వ్రాసియున్నారు. [5]ఈపైయభిప్రాయములవలన రామరాయలయెడ వీరికెట్టి భావముగలదో యయ్యది విస్పష్టముగా దెలియుచున్నది. అనగా రామరాయలు తిమ్మయను బ్రతిఘటించి స్వశక్తిచే సేనలను సమకూర్చుకొని తిమ్మయపై దండయాత్ర సాగించి యాతనితో గాని యాతనికి సాహాయ్యముజేయ వచ్చిన విజాపుర సుల్తానుతో గాని తదితర సుల్తానులతో గాని యుద్ధముచేయకయే, తిమ్మయయనుచరవరమునకు లంచముల నొసగియు, సలకముతిమ్మయ తనకుదోడ్పడవచ్చిన విజాపురసుల్తానుకు నసంఖ్యాకముగా ద్రవ్యమునొసంగి వానిస్వస్థానమునకు బంపివేయునట్లుగా మోసబుజాబును వ్రాసియు, వారల సాహాయ్యము లభింపకుండజేయ రామరాయలుచేసినమోస మును దెలిసికొని యాద్రోహి తెంపరియై విద్యానగరమును వైభవశూన్యముగా జేసి తుదకు దారుణమైన యాత్మహత్య చేసికొని చావగా గృష్ణరాయనిరాణుల యాజ్ఞశిరసావహించి హతశేషులు ద్వారములు తెఱచి యామహానగరమును రామరాయలచేతబెట్టి రనివీరియభిప్రాయము. ఇదియెంతమాత్రము విశ్వాసపాత్రమయిన సత్యము గాదు. అచ్యుతదేవరాయనిభార్య వరదాంబికాదేవి సామ్రాజ్యము తనకొడుకునకు నిలుచునట్లుగా దనకు దోడ్పడినయెడల విశేషద్రవ్యము నొసింగెద నని యాహూయముచేయ, విజాపురసుల్తాను స్వసైన్యముతో బయలుదేఱివచ్చుచుండ, సలకముతిమ్మయ దెలిసికొని, తనరాయబారులమూలమున విశేషద్రవ్యమునొసంగి, యాతడుమరలితనరాజధానికి బోవునటుల చేసెనని మొదటవ్రాసిన 'కోఱియా' మఱియొకచోట సలకముతిమ్మయను బ్రతిఘటించి తొలగిపోయినయాతని ప్రతిపక్షమువారు (రామరాయలపక్షమువారు కాబోలు) విద్యానగరము స్వాధీనముజేసి యాతనిపరిపాలనమునకు లోపడివ్యవహరింతుముగాన దమకు దోడ్పడి సలకముతిమ్మయను రాజ్యభ్రష్ఠుని గావింప వలసినదని ప్రార్థింప, నాతడు సమ్మతించి రాదలంచియుండ, సలకముతిమ్మయ తెలిసికొని రాయబారులద్వారా యాఱులక్షలహొన్నులనుబంపించి, విద్యానగరమునకువచ్చి తనకుదోడ్పడినయెడల దారిబత్తెములక్రిందను దినమునకు మూడులక్షల హొన్నులచొప్పున నిచ్చుటయేగాక తనకుసామంతుడనై కప్ప ముచెల్లించుచుందు ననియు వారిచే జెప్పించి, వానిసైన్యములతోసహా వానిని రప్పించి, విద్యానగరసింహాసనమున వానిని గూరుచుండ బెట్టియేడుదినములు మహావైభవముతో వేడుకలు జరిపియుండె ననియుకొందఱుప్రభువులుగూడ నాతనిసామ్రాజ్యాధిపతిగా నొప్పుకొనిరనియు, రెండవమాఱు వ్రాసియున్నట్లుగా హీరాసుఫాదిరి తాను, వ్రాసినయారవీటివంశచరిత్రమునందే దెలిపి యున్నాడు.[6] మొదటవ్రాసినదిసత్యమో, రెండవమారువ్రాసినది సత్యమో, హీరాసుఫాదిరి నిర్థారణచేసి యుండలేదు. రెండువిధములుగూడ సత్యమై యుండు నని వీరియభిప్రాయమై యుండవచ్చును. సామ్రాజ్యధనాగారమంతయు సలకముతిమ్మయచేతిలో నుండెనుగాని యళియరామరాయలచేతిలో లేదనివారే యొప్పుకొనుచున్నారు. లక్షలకొలదిహొన్నుల ద్రవ్యమును విజాపురసుల్తానునకు సమర్పింపగలిగినసలకముతిమ్మయ ధనాశాపీడితులయిన తనయనుచరవర్గమునకు దృప్తికలుగునట్లు ధనమునొసంగి తనప్రక్కనుంచుకొనుట కేలసాధ్యపడ దయ్యెను? వీరలకు లంచముల నొసంగుటకు నాకస్మికముగారాజధానివిడిచి సోదర ద్వయముతో బాఱిపోయినరామరాయల కీప్రభువులకందఱకు లంచముల నొసంగి తనప్రక్కకు ద్రిప్పుకొనుటకు వారలకు ధనమెక్కడనుండి యొక్కమాఱుగాలభించినదియు నిర్ధారణము చేసి యుండలేదు. సలకముతిమ్మయస్వాధీనములో నున్నప్రభువు లెల్లరురామరాయలవలన లంచములు తిన్నవారే యైనయెడల సామ్రాజ్యమునకు ప్రబలశత్రువయిన విజాపురసుల్తానుని రప్పించి విజయనగరరత్నసింహాసనమున గూరుచుండ బెట్టుట కెట్లుసహింప గలిగిరోహీరాసుఫాదిరి తెలిపి యుండలేదు. మఱియు విజాపురసుల్తానువంటిగడుసరిప్రభువు తనశత్రురాజధానిలో సామ్రాజ్య సింహాసనమున దన్ను గూర్చుండ బెట్టి తన్ను సామ్రాజ్యాధిపతినిగా జేసి, సామంతులై తన్ను గొల్చుట కంగీకారముదెలిపియున్నప్పుడు, పిఱికిపందయై రాజధానివిడిచిపెట్టి పాఱిపోయినవాడు వంచనతో వ్రాసినజాబును నమ్మి సలకముతిమ్మయప్రార్థించినమాత్రమున దనకు నప్రయత్నపూర్వకముగా లభించినయీశత్రుసామ్రాజ్యమును, సింహాసనమును విడిచిపెట్టి ద్రవ్యమునుమాత్రము గ్రహించి వెడలిపోవు నంతటియవివేకి యనిగ్రహింప నగునా? రామరాయలపక్షమువారు విజాపురసుల్తానునకు సామంతులమై వానిని సామ్రాజ్యాధిపతినిగా గావించివానికణకువతో గప్పములు చెల్లించుచుందు మని దురాలోచనచేయుచున్నవా రనియేగదా వారిపక్షమున నుండకుండ విశేషద్రవ్యము లంచముగా నిచ్చి యాతనిదనకు సహాయార్థము రప్పించుకొన్న సలకముతిమ్మయ వారినిద్రోహులనియు వారినిజేర్చక మరలవారిని వారిస్థానములకు బంపివేయవలసిన దనిజాబువ్రాసినపు డయ్యదిమోసమని తెలిసికొనజాలక యేలయెనుబదిలక్షలహొన్నులసమర్పించు కొని పంపివేయవలసివచ్చెనో యారయరైరి? రామరాయనిచే లంచములుతినినప్రభువులు నిస్సహాయుడై యున్నవానిని రామరాయలకు నప్పగించక, సలకముతిమ్మయసామ్రాజ్యములోనిరత్నరాసులను నుగ్గునూచముగావించునపుడును, ఏనుగులు గుఱ్ఱములుమొదలగువానితోకలుకోయించునపుడును మౌనము వహించి యేలయూరకొనవలసివచ్చెనో యదియును విచారింపరైరి? అనేక సందర్భములలో 'ఫెరిస్తా, కోరియా, కోయుటో'లు వ్రాసినవ్రాతలలో శుద్ధాబద్ధములగు విషయములు పెక్కులు గలవని యొకప్రక్క నొప్పుకొనుచు నీప్రాధాన్యవిషయమున దదితరు లైకకంఠ్యముగా వ్రాసిన వానికి భిన్నములుగా గన్పట్టినను వీరివ్రాతలయందే సత్యముగల దని విశ్వసించుటకు బ్రభలహేతువు లేవిగలవో వానిని వివరింప నక్కరలేదా? చరిత్రకారులు మున్ముందుగా సమకాలికులై సమీపముననుండి వ్రాసినవిషయముల కెక్కువప్రాధాన్యమీయవలసి యుండును. పిమ్మట సమకాలికులు కానివారివ్రాతలను సమకాలికులు వ్రాసిన వ్రాతలతో బోల్చుకొని సత్యచరిత్రమును దీయుటకు బ్రయత్నింపవలయును. అట్లుగాక సమకాలికులయినవారు కవులయినంత మాత్రముచేత వారు చెప్పినవిషయముల నమ్మరాదని త్రోసిపుచ్చి సమకాలికులుకాని వారొకరికొకరికి బొందికలేక పరస్పరవిరుద్ధముగా వ్రాసిన వ్రాతలనమ్మి చరిత్ర మల్లబోయిన బరిహాసమాత్రులగుట నిశ్చయము. అచ్యుతదేవరాయని యాస్థానము నున్న రాజనాథ డిండిమకవి రచియించిన యచ్యుతరాయాభ్యుదయమను గ్రంథమునను, ఆతనియాస్థాన కనయిత్రియగు తిరుమలాంబ రచియించిన వరదాంబికాపరిణయ మనుగ్రంథమునను సలకముతిమ్మయ యచ్యుతదేవరాయల భార్యయగు వరదాంబికతోడబుట్టినవా డనితెలుపబడియుండ నేతద్గ్రంథకర్తలు కవులయినమాత్రముచేత వానినివిశ్వసింపక 'సలకముతిమ్మయ యచ్యుతదేవరాయల తోబుట్టువుపెనిమిటి' యని 'కోరియా' వ్రాసిన దానిని విశ్వసించినయెడల యెంత హాస్యాస్పదముగనుండును? సమకాలికులైనకవులు వ్రాసినవర్ణనాంశములలో నతిశయోక్తు లుండిన నుండవచ్చునుగాని వారుసత్యమునే వ్రాయలేదని నిరాకరించుట సత్యచరిత్ర నిర్మాణమునకు దోడ్పడుమార్గ మగునా?

విజయనగరములో క్రీ. శ. 1542 వ సంవత్సరప్రారంభమున విప్లవము పుట్టినది. 1547 లో దోనూరుకోనేరునాథకవి ద్విపదబాలభాగవతమును రచియించి యళియరామరాయల పెదతండ్రికుమారులలో నొక్కడగుచిన్నతిమ్మరాజునకును, తరువాత పద్యప్రబంధముగారచించి యతనితండ్రికి నంకితముచేసిన యాగ్రంథములపీఠికలలో నారవీటివంశమును వర్ణించుచు నళియరామరాయలను గూర్చియిట్లుప్రశంసించి యున్నాడు.

         "శ్రీసదాశివరాయ శేషరమణికి
          భాసురసామ్రాజ్యపదవి నొసంగి

             అమితకర్ణాటరాజ్యస్థాపనాంక
             రమణియ్యు డగునట్టి రామభూపతియు"
                               (ద్విపదబాలభాగవతము)

      "ఉ. ఏపునద్రోహిభావమువహించినసల్కయతిమ్మరాజు ద
          త్పాపసహాయు సల్కయయుతంబుగ శౌర్యము మీఱద్రుంచి వి
          ద్యాపురియందు చాలఘను డయ్యె సదాశివరాయ రాజ్య సం
          స్థాపకు డైసిరంగవసుధావర రామనరేంద్రు డున్నతిన్."
                               (పద్యబాలభాగవతము)

ఆరవీటి శ్రీరంగరాజుపుత్త్రుడగురామరాజు ద్రోహియైన సలకముతిమ్మరాజును నాపాపికిసహాయుడుగా నుండిన సలకరాజును సంహరించికర్ణాటసామ్రాజ్యమునకు సదాశివరాయని బట్టాభిషిక్తుని జేయుటచేతనే సదాశివరాజ్యసంస్థాపకు డనిప్రఖ్యాతి గాంచి విద్యాపురమునందు మిక్కిలి ఘనుడయ్యె నని దెలిపి యున్నాడు. కృష్ణదేవరాయని కల్లుడైనను వానికాలమునగాని, అచ్యుతదేవరాయల కాలమునగాని రామరాయలు విద్యానగరమునం దొకప్రముఖుడుగా నున్నట్టు ప్రమాణము గానరాదు. ఈఘనకార్యమును జయప్రదముగా నిర్వహించిన కారణముచేతనే బాలభాగవత గ్రంథకర్త వ్రాసినరీతిని విద్యాపురియందు గొప్పఘనుడుగా బరిగణింపబడినది వాస్తవమని చెప్పదగును. ఇదియునుంగాక రామరాయనిపక్షము వారికిని సలకముతిమ్మయపక్షమువారికి మాత్రమెగాక రామరాయనిపక్షమువారికిని సలకముతిమ్మయపక్షము వహించివచ్చిన విజాపుర విదర్భసుల్తానులకు గూడ యుద్ధము జరిగినటుల దెలుపు నొకటి రెండు విషయములను ద్విపదబాలభాగవత గ్రంథముల బేర్కొని యున్నవాడు. ద్విపదబాలభాగవతమును నంకితము నొందినట్టి యారవీటిచినతిమ్మరాజు క్రీ. శ. 1542 వ సంవత్సరములో చంద్రగిరిరాజ్యమును పరిపాలించుచున్నట్లు తిండివన శాసనము దెలుపుచున్నది. [7] అచ్యుతదేవరాయలు 1541 లో మరణించెను. వానివెనుక వానికుమారుడు చిన్నవేంకటాద్రి 6 మాసములు పరిపాలనముచేసినవెనుక వానిమేనమామ సలకముతిమ్మయ వానిసంహరించి సామ్రాజ్య మాక్రమించుకొన్నవిషయ మిదివరకె తెలుపబడినది. ఇట్లుండగా ద్విపదబాలభాగవతమునందు దత్కృతిభర్త యైనయారవీటి చినతిమ్మరాజు.

           "సరినృపుల్ ప్రజలును జయవెట్ట చంద్ర
            గిరిముఖ్యదుర్గముల్ గినిసి కైకొంటి"

అని తనతోడిరాజులును ప్రజలును జయఘోషసలుపుచుండ చంద్రగిరిమొదలుగా ముఖ్యదుర్గములను కోపముతో స్వాధీనపఱచు కొన్నట్టు వ్రాయబడి యున్నది. అనాదిగా చంద్రగిరిదుర్గమును, తద్రాజ్యమును విజయనగరసామ్రాజ్య ప్రభుత్వమునకు వశములై యున్నవి. అచ్యుత దేవరాయని కాలమున చంద్రగిరిదుర్గమును, రాజ్యమును విజయనగరసింహానమును ప్రతిఘటించి యుండ లేదు. చిన్నవేంకటాద్రి మరణానంతరము సలకముతిమ్మయ పక్షముననుండ నతనిప్రతిస్పర్థి యైనయళియ రామరాయల పెదతండ్రికుమారు డైన యీయారవీటి చినతిమ్మరాజు రామరాయలపక్షమున నుండి సలకముతిమ్మయపక్షమువారితో బోరాడి గైకొని, యళియరామరాయనిచే బట్టాభిషిక్తుడుగా గావింపబడిన సదాశివదేవరాయలరాజ్య ప్రారంభకాల మనగానా 1542 వ సంవత్సరము నుండియు జంద్రగిరి రాజ్యమునకు బ్రభువుగా నుండెనని నిర్ధారణము సేయవచ్చును. కావున నారవీటి చినతిమ్మరాజు చంద్రగిరిదుర్గమును వశ్యపఱచుకొన్నవా డన తప్పక సలకముతిమ్మరాజు పక్షమువారితో బోరాడి గెల్చుకొన్నవా డనిచెప్పవలయునేగాని మఱియొకవిధముగా జెప్పుటకు సాధ్యముగాదు. ఈయారవీటి చినతిమ్మరాజు తండ్రియగు నౌకుతిమ్మరాజు గూడ సలకముతిమ్మయగావించిన యీ మహావిప్లవము నడంచుటయందు దనతమ్మునికుమారుడయిన యళియరామరాయలకు దోడ్పడినట్లుగా పద్యబాలభాగవతమునందలి యీక్రింది పద్యమువలన విదితము కాగలదు.

పద్యబాలభాగవతము:-

          "సలకముతిమ్మాసురదు
           ర్విలసితవిలయాబ్ధిలగనవిహ్వలవసుధా
           వలయస్థితికృతివివృతో
           జ్వలతరధరణీవరాహవరబిరుదాంకా!"

మఱియు నింకొకవిషయమునుగూడ బేర్కొని యున్న వాడు. ఈయారవీటి చినతిమ్మరాజునకు సవతియన్న యగు అప్పలరా జనునాతండు (అనగా ఔకుతిమ్మరాజునకు మఱియొక భార్యవలన బుట్టినవాడు) కూరకచెర్లయొద్ద సవాబరీదుల యుద్ధములో జయించియు మృతినొందినటులగూడ ద్విపదబాలభాగవతములోని యీక్రిందిద్విపదలవలన దెలియుచున్నది. చూడుడు.

           "అమితవైభవుడైన యప్పలరాజు
            రమణీయమైనకూరకచేర్లయొద్ద
            కడుమించు సాజిరంగంబున గడిమి
            దొడరినసవాబరీదుల నిర్జయించి
            తరణిమండలవిభేదనపూర్వకముగ
            సురలోకములకు రాజులు మెచ్చ నరిగె."

అప్పలరాజు కూరకచెర్లకడ ఆదిల్‌షాహా, బరీదుషాహాలతో జరిగినయుద్ధమున జయముపొందియు మరణించె ననివ్రాసి యున్నాడు. కృష్ణదేవరాయలకాలమున బరీదుషాహాతో యుద్ధము జరుగలేదు. అదియునుంగాక ఆదిల్ షాహాకు బరీదుషాహాకు మైత్రియున్నట్టు తోచదు. మఱియు నచ్యుతరాయలకాలమున గూడ బరీదుషాహాకు విజయనగరసామ్రాజ్యముతో యుద్ధముపొసగి యుండలేదు. కనుకకూరకచెర్లకడ నప్పలరాజునకు నాదిల్‌షాహాబరీదుషాహలకు జరిగినయుద్ధము 1542 లో పైసుల్తానులు సలకముతిమ్మయపక్షము నవలంబించి వచ్చినప్పుడే జరిగియుండు ననియు, ఆయుద్ధముననే యౌకు తిమ్మరాజుకుమారు డప్పలరాజుమరణించినవాడనినిశ్చయింప వచ్చును. అప్పలరాజుతండ్రియగు నౌకుతిమ్మరాజునుగూర్చి వ్రాయునపుడుద్విపదబాలభాగవతమునందు,

         "కడిమిమై మానునకడ రణక్షోణి
          గడుసరి నేదులఖాను జయించె"ననియు,

పద్యబాలభాగవతమునందు:-

         "మానునకడ సవాబూని పోరను బరా
          జయము నొందించె నేశౌర్యశాలి"

అనియు వ్రాసియుండుటచేత సలకముతిమ్మయపక్షము వహించి వచ్చినవిజాపుర సుల్తానాదులతో నళియరామరాయల పక్షమువారు యుద్ధము చేసియోడించినారని యీబాలభాగవతములలో బేర్కొనబడినవిషయములే వేనోళ్ల జాటుచున్నది. మఱియు దోనూరికోనేరునాథుడు 1542 లో వ్రాసిన దానిని 1549 లో రామరాయల మంత్రులలో నొక్కడును కొండవీడు రాజ్యాధిపతిగా నియమింపబడిన రామయామాత్యతోడర మల్లనునాతడు తానురచియించిన 'సర్వమేళకళానిధి' యను గ్రంథమున 'రామరాయలు' తనయిర్వురుతమ్ములతోను విద్యాపురమును విడిచి గుత్తిదుర్గమునకు బోయి నిస్సహాయుడుగా నున్నసదాశివమహీపాలుని గొనివచ్చి స్వామిద్రోహకృతులయినప్రతీపనృపతులను జయించి కర్ణాటసింహాసనమునందు గూరుచుండ బెట్టి కీర్తిస్థాపకు డయ్యెననివ్రాసి బలపఱచు చున్నాడు. [8] ఇతడొక్కడేకాదు; రామరాయలయాస్థానికవిగనుండి యాతనిచే రామరాజభూషణు డనుబిరుదము గాంచినభట్టుమూర్తి తాను రచియించిన నరసభూపాలీయము నందును, వసుచరిత్రమునందును నీవిప్లవప్రశంసను గావించి రామరాయలను వినుతించియున్నాడు.

       "సీ. ఖలునతిద్రోహి సల్కయ తిమ్మనిహరించి
           సకలకర్ణాటరాజ్యంబు నిలిపె"
                         (నరసభూపాలీయము)

          "సీ. పట్టాభిషేకవిపర్యయంబున బ్రోలు
                    వెడలి ప్రియానుజ ల్వెంట గొలువ
              జిత్రకూటాభిఖ్య జెలగు పెన్గొండ సా
                    ద్రహరిద్విపేంద్ర నాదవని జేరి,
              ఖలజనస్థానవాసుల బల్వుర వధించి
                    మహిమసలకఖరస్మయ మడంచి,
              హరివీరభటమహోద్ధతినబ్ధి గంపింప
                    దురమున గదిసి తద్ద్రోహి దునిమి,

              యనఘతరపార్థివేందిర నధిగమించి
              సాధుకర్ణాటవిభవసంస్థాపనంబు
              పూని శరణాగతుల నెల్ల బ్రోచె రాము
              డతడు నిజచరితంబు రామాయణముగ."
                                (వసుచరిత్రము)

పయిపద్యములలో వివరించినరీతినిబట్టి యళియరామరాయలు సలకముతిమ్మయ సైన్యములతో బోరాడి యుద్ధములో నాతని సంహరించి సకలకర్ణాటరాజ్యము సుస్థిరముగా నిలుచు నట్లుచేసి శరణాగతుల నెల్లరను రక్షించి ప్రోచి కీర్తిగాంచె ననిబట్టుమూర్తి (రామరాజభూషణకవి) స్పష్టముగా దెలుపుచున్నాడు. ఇంతియగాదు; సలకముతిమ్మయకు దోడ్పడవచ్చిన నిజాముషాహ, కుతుబ్షాహ, ఏదిల్‌షాహ తమ తమసైన్యములతో, బలాయనులై యడవులకు బారిపోవ రామరాయ లనుజద్వయముతోడను, తదితరసైన్యములతోడను వారిని వెంటాడించి పోరి యోడింప వారువిధేయులై యణకువను జూపిరనికూడ నీక్రిందివిధమున వర్ణించియున్నాడు.

      "మ. హరిశౌర్యుం డగురామభూవిభుని తీవ్రాటోపవద్వాహినీ
           శరవేగంబున నాత్మమూలబలము ల్జారం దలాడంబరం
           బరుగం గొమ్మలువోవ లావరినిజమాదు ల్వజీరుల్భజిం
           తురు నమ్రత్వము గానలో ముసలిమానుల్గా వితర్కింపగన్."

       "గీ. అనుచు శిరములు దాల్తు రెవ్వనిసమగ్ర
           సైన్యధుతధూళి చకితులై చనునపాద
           కుతుబశాహినిజామాదికుతలపతు ల
           తండు నృపమాత్రుడే రామ ధరణివిభుడు."

తన 'స్వరమేళకళానిధి' యందు రామయామాత్యతోడరమల్లుగూడ రామరాయలు భీమార్జునలం బోలినసోదరద్వితయము యొక్కసాహాయ్యముతో సర్వపారశీకులను (మహమ్మదుమతస్థులయినవారిని) జయించి భూమియందు గొప్ప కీర్తిని ప్రతిస్టాపించెనని చెప్పియున్నాడు.[9]

ఇట్లే యందుగులవెంకయ్య యనునాతడు గూడ తాను రచించి యారవీటికోదండరామరాజున కంకితము గావించిన 'రామరాజీయ' మనునామాంతరము గలనరపతివిజయ మను గ్రంథమున,

          "సలకవిభుతిమ్మరాజుసేనలను ద్రుంచి
           గుత్తి, పెనుగొండ, మఱిగండికోటకంద
           నోలుపుర మాదవే నవలీల గెలిచి
           తొలుదొలుత రామనృపతి దోర్బలము మెరసె."

అనిస్పష్టముగావివరించివ్రాసినవాడు. అళియరామరాయలకు బ్రత్యర్థిగానుండి విజయనగరంబున నీమహాభయంకరమైన విప్లవమును గల్గించి సంక్షోభపెట్టిన 'సలకముతిమ్మయ' అచ్యుతదేవరాయల మరదులిర్వురలోను రెండవవా డయిన చినతిమ్మరాజుగాని "విజయనగరచరిత్రమునకుమూల ప్రమాణము" లను గ్రంథములో పీఠికాకారులు వారియుపోద్ఘాతములో దెలిపి నట్లుపెదతిమ్మరాజుగాడు రంగపరాజవిరచితమైనసాంబోపాఖ్యాన పీఠికలో నళియరామరాయలకు బ్రతిస్పర్థిగ నుండి వ్యవహరించి సంహరింపబడినవాడు సలకముచినతిమ్మరా జనియె స్పష్టముగా దెలుపబడినది.[10] ఆకాలమున బుట్టినయీగ్రంథములన్నియు నళియరామరాయలు సలకము చినతిమ్మరాజు సైన్యములతో యుద్ధముచేసి యోడించి యుద్ధములో నాతనిసంహరించి సదాశివరాయని సామ్రాజ్యమునకు బట్టాభిషిక్తునిగాజేసి జగత్ర్పఖ్యాతి గాంచినట్లు దెలుపుచున్నవి. ఇవిమాత్రమే గావు; ఇటీవల కర్నలుమెకంజీదొరగారిచే సేకరింపబడి సంపుటీకరింప బడిన స్థానికచరిత్రములుగూడ పయిగ్రంథములలో వక్కాణింప బడినవిషయములను బలపఱచుటయెగాక మఱికొన్ని నూత్న విషయములనుగూడ దెలుపుచున్నవి. సొన్నలాపురముహండే హనుమప్పనాయు డీవిప్లవకాలమున నొకప్రధానపాత్రమును గైకొని యళియరామరాయలకు దోడ్పడినట్లు హండేవారిఅనంతపుర చరిత్రమునందును, అట్లే పెమ్మసాని యెఱ్ఱతిమ్మానాయడు తోడ్పడి నట్లు తాడిపర్తి కయఫియత్తునందును, అట్లే మెసాపెద్దానాయడు, పెమ్మసానియెఱ్ఱతిమ్మానాయడు, హండే హనుమప్పనాయడు తోడ్పడినట్లు నడిమిదొడ్డిపాలెగాండ్లకయఫియత్తునందును వివరింపబడియుండెను.[11]

ఈకడపటికయఫియతులోవివరము లెంతమనోహరములుగా వ్రాయబడినవో చదువరులు తెలిసికొనుటకై యాభాగ మిచట నుదాహరించెదను.

"అళియరామరాయణ్ణి కొట్టివేయవలె నని విజయనగరానకు కూచుదరకూచువేయించి ఫౌజుతో వస్తువుండగా యీ వర్తమానం అళియరామరాయలు వినిమొహరుతీసుకొనిరాతో రాతువచ్చి పెనుగొండకు దాఖలుఅయి అక్కడనుండి పెమ్మసానితిమ్మానాయణ్ణి, హండేవారిని, మెసాపెద్దనాయణ్ణి ఇంకాజహగీరుదార్లకు శిఖాపత్రాలుపంపించి మీమీయావత్ఫౌజులతోకూడా యెకాయెకీవచ్చే దనివ్రాయించి వున్నందున అదేప్రకారముగా సకలమైనవారితో కూడా మెసాపెద్దప్పనాయడు పోయినంతలోగా రామరాయలవారు సలకయతిమ్మని దుర్మార్గాలు అందరికి చెప్పి తరతరాలనుంచీ మీరుస్వామికార్యములో బహుశా మెహన్నతుచేసి కష్టపడి సకలబహుమానాలు బిరుదులు సంపాదించు కొన్నారు. ఇపుడున్న యీకార్యం నిర్వాహకంచేసి శత్రుఖండనచేస్తిరా యనా మీకు విశేషించి బిరుదులు బహుమానాలు యిప్పిస్తున్నా మనిచెప్పి సలకయతిమ్మ యవుండేపూర్వోత్తరము, వాడుయక్కడవుండేది, ఫౌజువుండేరీతి ముందరయేతట్టుసాగివచ్చేసంగతి తెలుసుకొని వచ్చేవారు యెవ్వరు చాతమీతహకీకు వర్తమానం వచ్చేటందుకు చోరు హరకార్లనుపంపించుమనగా అప్పుడు మెసాపెద్దనాయడు ముందుపడి తహకీకు ఖబురు నేను తెప్పిస్తున్నానని తాంబూలంతీసుకొని సలకయతిమ్మయఫౌజులోనికి అంపతగినవారిని పంపించి నిజమానం వర్తమానం తెప్పించి యావత్ఫౌజును వెంటదీసికొని ఘండికోటవారు సొన్నలాపురం హండేహనుమప్ప నాయడు మెసాపెద్దప్పనాయడు తనజమియ్యతుతో ఫౌజు నడిపించి రాతో రాతు ఆదవానికి వచ్చి వుత్తరభాగం తుంగభద్రాతీరమందు సలకంతిమ్మనిఫౌజుమీద చప్పాబడి నరికి హతాహతం చేసినందున హతశేషులయిన ఫౌజుతో సలకయతిమ్మడు పారిపోతూయుండగా పెమ్మసానివారు హండేవారు, మెసావారు యీముగ్గురు ఖాసాగుఱ్ఱాలు వేసికొని పోయి సలకయతిమ్మణ్ణి శిరచ్ఛేదనం చేసి ఝాండాకుకట్టి.........."

ఈరీతిగా నాంధ్రగ్రంథములయందును స్థానికచరిత్రములయందును అళియరామరాయలు సకలకర్ణాటసామ్రాజ్య సముద్ధరణోద్యోగియై, సామ్రాజ్యద్రోహిగ బ్రవర్తించిన సలకముచినతిమ్మరాజును బ్రతిఘటించి యుద్ధము చేసి వానినాశనము గావించి కృష్ణదేవరాయలసోదరపుత్త్రు డయినసదాశివదేవరాయలను బట్టాభిషిక్తుని గావించి మహోన్నత ప్రతిష్టాప్రతిభల గాంచినవా డనిదెలుపుచుండ మహమ్మదుఖాసిం ఫెరిస్తా యళియరామరాయలు యుద్ధమే చేయలే దనియు, సలకముతిమ్మయను మోసపుచ్చగా నతడు పిచ్చబట్టి రాజధనాగారమంతయు గొల్లపెట్టి నాశనముగావించి విద్యానగరము నంతయు వైభవశూన్యముగాజేసి తుదకు విశ్వాసానర్హమై భయంకరమైన యాత్మహత్యజేసికొని చచ్చెనని వ్రాసినదానిని 'హిరాసుఫాదిరి' వంటివిదేశీయుడైన చరిత్రకారుడు విశ్వసించినను దేశీలయిన చరిత్రకారు లెవ్వరును విశ్వసింప జాలరు. తెలుగుగ్రంథములలో నళియరామరాయలు యుద్ధమున సలకముతిమ్మయను సంహరించినవా డనిచెప్పినమాత్రముచేత నాతడు స్వహస్తములతో జంపినవాడని భావింప నక్కరలేదు. ఆతనిపక్షమున నెవ్వనిచే జంపబడినను యుద్ధములో జంపె బడెననుట సత్యమని సందేహింప బనిలేదు.

'కోయుటో' తానువ్రాసిన చరిత్రమునందు 'సలకముచిన్నతిమ్మరాజు తనప్రజలచే జంపబడినవా' డని వ్రాసియున్నాడనియు, మీర్జాఇబ్రహీముజబిరి యనునాతడు తానువ్రాసిన 'బసాతిన్ - ఉస్ - సలాతిన్‌' అనుచరిత్రమున సలకముచిన్నతిమ్మరాజు యుద్ధములోనే చంపబడినట్టు వ్రాసియున్నా డనియు, హీరాసుఫాదిరి తనయారవీటివంశ చరిత్రమునందు బేర్కొనియుండియు వీనినెల్లను విస్మరించి యొక్కఫెరిస్తా వ్రాతలనే యేల విశ్వసింపవలసివచ్చెనో దురూహ్యముగా నున్నది.[12] ఇంక సలకముచినతిమ్మరాజునకు దోడ్పడవచ్చిన దక్కనుసుల్తానులతో నళియరామరాయ లెట్లుయుద్ధములు గావించి విజయము బొందినదియు మూడవప్రకరణమున వివరింతును.



  1. 156 of 1905, E. R.
  2. ఏషాంకులాలంకృతరేష జఝే శ్రీరంగనాధో జితిరాజరాజ:
    తయాసదాచారదృశా వివింతే రాజర్షిభావం రమితక్షమోయ:||
    తిమ్మాంబికా తస్యబభూవదేవీ సాధ్వీ జనానామివయాసమిష్టి:
    సతీయశోదావినతానసూయా సుదక్షిణాసత్యవతీ సుభద్రా||
    తపోవిశేషణ తయోరశేష రాజాధిరాజోజని రామరాజ"
    కన్యాప్రదోస్మై సహి కృష్ణరాయ: కన్యాపితృత్వం బహుమన్య తేస్మ||

    
    
  3. సతతవిరచితానేకదానయో: అసాధారణభుజాపధానయో: అఖిలలోకకృతబహుమానయో: తిరుమలరాజాభిధానయో: ఉభయయో: ప్రధానయో అపరజావరదాంబికాభిదానావర వర్ణినీ..... తపోవనముపగతవతీ
  4. The Aravidu Dynasty of Vizanagar. Page 9 foot note 5
  5. Ibid Page. 11 foot note 7.
  6. A.D.V. Page 6; Correa. Page 247 - 8 Ibid Page 8; Correa, Pages 277 - 278 - 279.
  7. A Topographical list of the Inscriptions by Rangacharya Vol. I. P. 402, 717; 33 of 1905; 250 of 1910; other records of prince china Timma will be found in Rangacharya, 11 p. 915, 60 and 70; p. 976, 608.
  8. స్వరమేళకళానిధి:-

              "య: ఖడ్గైకసఖ: సహానుజయుగో నిర్గత్య విద్యాపురాత్
               లబ్ధ్వా గుత్తిగిరౌ సదాశివమహీపాలం నిరాలమబ నమ్
               స్వామిద్రోహకృత: ప్రతీపనృపతిం నిర్జిత్య భద్రాసనే
               కర్ణాటే భగవానివధ్రువమయం కీర్త్యా సహస్థాపయిత్."

  9. విజిత్యసర్వాన పిపారశీకాన్ రణేషుతత్కీర్తిపటచ్చరాణిఆధూయ భూయోహరితోవధూటీ: విశోభయ త్యేషయశోదుకూలై: (స్వరమేళకళానిధి)
  10. Finding himself unequal to the three brothers, the elder Tirumala, Who is discribed as a madman invited his Mahammadan neighbours to his assistance. According to the annals of Hande Anantapuram the three brothers over powered the madman first and killed him, and marched forward to meet the allied SulTans of Ahmadnagar, Bedar, and Golkonda. Having defeated them in the field the brothers returned to headquarters and installed Sadasiva duly as the emperor. (sources of vijianagara History by Ranganadha Saraswati and edited by Dr. L. Krishnaswami Aiyagar Intriduction. page, 15.)

            "మ. మహినెవ్వారెనసల్కరాజచినతిమ్మక్ష్మాపకంఠారుణాం
                 బుహవిశ్చర్యణతర్పితాసిశిఖికింబుష్పాయుధస్నిగ్ధని
                 గ్రహసౌభాగ్యపరంపరాపరిధికింగర్ణాటకైశ్వర్యని
                 ర్వహణావార్యభుజద్వయాయుఢపరీవారుండు రామప్పకున్."

  11. Sources of Vijianagar, p. 179 - 180; Local Records, Vol 12, p. 213, L. R. Vol. 39. p. 16.
  12. The Aravidu Dynasty of Vijianagar p. 11, F.N. No. 2. Couto O. C. p. 382; F. N. No. 5 Busatin - us - Salatin. p. 52.