అళియ రామరాయలు/ప్రథమ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అళియ రామరాయలు

ప్రథమ ప్రకరణము

"సీ. పట్టాభిషేకవిపర్యయంబునఁ బ్రోలు
         వెడలి ప్రియానుజు ల్వెంటఁ గొలువఁ
    జిత్రకూటాభిఖ్యఁ జెలఁగు పెన్గొండ సాం
         ద్రహరిద్విపేంద్ర నాదవనిఁ జెంది
    ఖలజనస్థానవాసులఁ బల్వుర వధించి
         మహిమ సలకఖరన్మయ మడంచి
    వారివీరభటమహోద్ధతి నబ్ధి గంపింప
         దురమున గదిసి తద్ద్రోహిఁ దునిమి

తే. యనఘతరపార్ధివేందిర నధిగ మించి
    సాధుకర్ణాటవిభవసంస్థాపనం బు
    పూని శరణాగతుల నెల్లఁ బ్రోచె రాముఁ
    డతఁడు నిజచరితంబు రామాయణముగ."

"సీ. ఖలు నతిద్రోహి నల్కయతిమ్మని హరించి
             సకలకర్ణాటదేశంబునిలిపె
    నతుని వర్ధితుని దత్సుతునిఁ బట్టముఁ గట్టి
             కుతువనమల్కన క్షోణి నిలిపెఁ
    బదిలుఁడై రాచూరు ముదిగల్లు గప్పంబు
             సేయఁ గాంచ నపాదు సీమ నిలిపె
    శరణన్నమల్కనిజామున కభయంబొ
             సంగి తదీయరాజ్యంబు నిలిపె

గీ. నవని యంతయు రామరాజ్యంబు సేసెఁ
    దనగుణమ్ములు కవికల్పితములు గాఁగ
    నలవియె రచింప సత్కావ్యములను వెలయ
    భూమి నొక రాజమాత్రుఁడే రామవిభుఁడు."

అని యేమహారాజు తనవిద్యాపరిషదంబున భూషణప్రాయుఁడుగా నుండి 'రామరాజభూషణుం' డనఁ బ్రఖ్యాతి వహించి మించినమహాకవిభట్టుమూర్తిచే పొగడ్తలఁ గాంచెనో అట్టి వీరశ్రీరామరాజును 'పెరిస్తా' యను నొకచరిత్రకారుఁడొకయనామకుఁ డగుచరిత్రకారుని వాక్యములను బురస్కరించుకొని తానువ్రాసిన యొకచరిత్ర గ్రంథమునం దొకపిఱికిపందనుగాఁ బ్రవేశపెట్టినవిధము సత్యాన్వేషణపరాయణు లగుచరిత్రకారు లెల్లరును బరిశోధించి విమర్శించి సత్యమును బ్రకటించుట మఱువఁ దగదు. ఒకప్పుడు గోల్కొండనబా బగు 'సుల్తాను కూలీకుతుబ్షాహ' విజయనగరసామ్రాజ్యముపై దండయాత్రవెడలి సరిహద్దుల నున్నమండలముల గొన్నిటిని వశపఱచుకొని తురక సైన్యముల నచట నిలుపుట కిష్టపడక హిందూ సామంతకుటుంబములోనివాడయిన రామరాజును నధికారిగా నియమించెనట! అటుపిమ్మట మూడుసంవత్సరములకు బిమ్మట విజాపురసుల్తానగు 'ఆదిల్‌షాహ' సైన్యములు కేవలము దోపిడికొనగోరి వచ్చి పైబడి రామరాజును వెడలగొట్టి దేశమునంతయు గొల్లగొనగా రామరాజు పాఱిపోయి సుల్తానుకూలీకుతుబ్షాకు తనపరాభవమును విన్నపించుకొనెనట! అంతట సుల్తానుకూలీకుతుబ్షాహ రామరాజునుగాంచి 'ఛీ! పాఱుబోతా! నీవు నాదర్బారులో నుండదగవు; పొమ్ము;' అని దేశమునుండి వెడలగొట్టె నట! అంతట రామరాజు విజయనగరమార్గముబట్టి కృష్ణదేవరాయలకడ నుద్యోగమును సంపాదించె నట! ఈవాక్యములు గోల్కొండపట్టణములో నుండెడునొక యనామకు డైనచరిత్రకారుడు వ్రాసిన నని ఫెరిస్తా తాను వ్రాసిన చరిత్రమునం దెక్కించి యున్నవాడు.[1] విజయనగరసామ్రాజ్యమును బరిపాలించినకడపటివంశమగు నారవీటివంశమును గూర్చినచరిత్రమును వ్రాయుచు హీరానుఫాదిరి యీయనామకుడయినచతిత్రకారు డనుభవముతో వ్రాసినదియగుటచేత దీనిని చులకనగా ద్రోసివేయజాలమని వ్రాయుచున్నాడు.[2] ఇదియెంతమాత్రము విశ్వాసపాత్రముగా గన్పట్టదని రామరాయల యొక్క పూర్వోత్తరచరిత్రమును నిష్పక్షపాతబుద్ధితో బరిశీలించినవారికి బొడగట్టక మానదు. కనుక రామరాయల యొక్కపూర్వులచరిత్రమును ముందుగ దెలిసికొను టత్యావశ్యకముగనుక వారిచరిత్రమునుగూడ సంగ్రహముగా నిట దెలుపుచున్నాడను.

రామరాయలపూర్వులు

దక్షిణహిందూదేశచరిత్రమునందు గడు బ్రఖ్యాతి గాంచినవంశమునకు జెందినవాడు రామరాజు. ఇతడాంధ్రుడు. కర్ణాటభాషలో గన్నడకవి యగుతిరుమలార్యుడు గన్నడప్రభువయిన చిక్కదేవరాయల దగువంశావళి 'చిక్కదేవరాయవంశావళి' యనుపేరిట వ్రాసినగ్రంథములో 'ఆంధ్రకులదరామరాజం' అని రామరాజును ఆంధ్రునిగా జెప్పియున్నాడు. ఇతనివంశము 'రామరాజీయ' మనునామాంతరమును వహించిన 'నరపతివిజయ' మనుగ్రంథములో పౌరాణికచంద్రవంశముతో ముడిపెట్ట బడినది. ఇతని దాత్రేయసగోత్ర మని వర్ణింప బడినది. ఇతనివంశమున చారిత్రకపురుషు లగునందరాజును, చళుక్యరాజును, బిజ్జలరాజును పేర్కొనబడియుండుట చరిత్రమునకు విరుద్ధముగ నుండుటచేత విశ్వాసపాత్రముగ గన్పట్టుచుండలేదు. శిశునాగవంశము, శృంగవంశము, చళుక్యవంశము, కలచుఱివంశము, చరిత్రమునుబట్టి వేఱ్వేఱు వంశము లనిస్పష్టపడుచుండగా వీనినన్నిటిని నేకవంశముగా వర్ణించుట చూడగా విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన పూర్వవంశముల వారివలెనె వీరివంశముయొక్క ప్రాశస్థ్యమును ప్రకటించుటకై కవి ప్రయత్నించినట్లు గన్పట్టుచున్నది.

కాని, పండ్రెండవ శతాబ్దిమధ్యమున బసవేశ్వరుని వీరశైవమతము నెదుర్కొని ప్రాణముల గోల్పోయిన బిజ్జలుని వంశమువాడయిన గావచ్చునని యూహించుటకుగూడ ప్రతిబంధక ప్రమాణము లగపడుచున్నవి. హైహయాన్వయ మని శాసనములలో వక్కాణింపబడిన కలచుఱి వంశములోనివాడు బిజ్జులుడని పెక్కుశాసనములు దెలుపుచున్నవి. ఈబిజ్జలరాజు 1150 మొదలు 1162 వ సంవత్సరమువఱకు రాజ్యపరిపాలనము చేసిన చాళుక్యత్రైలోక్యమల్లుని సేనాధిపతిగా నుండి, 1162 వ సంవత్సరమున కళ్యాణపురాధీశ్వ రత్వమును దానే యపహరించి 1167 వ సంవత్సరమున జంపబడుట సుప్రసిద్ధమైన చరిత్రాంశమై యున్నది. వీనితరువాత సోమేశ్వరుడు, సంకాముడు, అహవమల్లుడు ననుమూవురు కాలచుర్యరాజులు 1182 వ సంవత్సరము వఱకు బరిపాలించిరి. తరువాత నీరాజ్యమును చాళుక్య నృపతి యగు నాల్గవ సోమేశ్వరుడు జయించి పరిపాలించె ననుటకూడ సుప్రసిద్ధమైన చరిత్రాంశమె. ఇట్లుండ, నరపతివిజయ మనుగ్రంథమున బిజ్జులునికి వెనుక వానికుమారుని విడిచి 'వీరహొమ్మాళిరాయని' వానిమనుమనిగాజెప్పి అతిశయోక్తులతో నాతని ప్రతాపమును వర్ణించి యున్నాడు కాని చరిత్రాంశముల వేనిని పేర్కొని యుండలేదు. అందువలన వీనియాధార్ధ్య మెట్టిదో గ్రహింపసాధ్యము గాదు.

రామరాయల బిరుదుగద్యములో 'కళ్యాణపుర పరాధీశ్వర' అనుబిరుద మొకటి గనంబడుచున్నది. ఆబిరుదముక్రిందనే మఱియొకచోట 'కళ్యాణపురసాధక' అనుబిరుదముగూడ గనంబడుచున్నది. మొదటిది పూర్వులనుబట్టి వంశపారంపర్యముగ వచ్చుచున్నదిగను, రెండవది స్వవ్యక్తికి సంబంధించినదిగను మన మూహింప వచ్చును. రామరాజునకు 'కల్యాణపురసాధక' యన్న బిరుద మెట్టువచ్చినదియు రాబోవు ప్రకరణమున వివరింప బడును.

ఆనెగొంది సంస్థానమునందు 'రాయవంశావళి' యను నొకగ్రంథము కలదు. ఆరాయవంశావళియు నీరాయవంశావళియు నొకేవంశావళికి సంబంధించిన వని మనము గ్రహింపవచ్చును.

ఆగ్రంథమునుబట్టి చూడగా నందుడనురాజు కిష్కింధలో (ఆనెగొంది) 1014 మొదలు 1076 వఱకును, అతని కుమారుడు చాళుక్యరాజు 1076 మొదలు 1117 వఱకు పరిపాలనము చేసి రనియు, వీనికిమువ్వురు పుత్త్రులు గలరనియు అందగ్రజు డయిన బిజ్జలు డనునాతడు కళ్యాణపురమునకు రాజయ్యె ననియు, విజయధ్వజు డను రెండవకొడుకు 1117 మొదలు 1156 వఱకును ప్రభుత్వము చేసె ననియు, మూడవవాడు విష్ణువర్ధను డనియు దెలియ వచ్చుచున్నది. విష్ణువర్ధను డనుమూడవవానిం గూర్చి యేమియుం దెలియరాదు. విజయధ్వజుడే తుంగభద్రాతీరమున దనపేరిట విజయ నగరమును నిర్మింపగా దానిని మాధవ విద్యారణ్యుల వారిప్రోత్సాహముచే సంగమరాజపుత్రుడగు హరిహరరాయ లతివిశాల మగుపట్టణముగా జేసి విద్యానగర మని పేరుపెట్టి ప్రఖ్యాతికి దెచ్చె ననియు, విజయనగర మను పూర్వపునామమె బహుజనవ్యాప్తిని బొంది చరిత్రమున నిలిచి యున్నదనియు గొందరు వ్రాయుచున్నారు [3] దీనిని బట్టి కూడ బిజ్జలునివంశమువారు కళ్యాణపురము నందును, విజయధ్వజుని వంశమువా రానెగొందిపురమునను గొంతకాలము పరిపాలించి డిల్లీచక్రవర్తి యగుమహమ్మదు బీన్‌తుగ్‌లఖ్ దక్షిణహిందూస్థానముపై పలుతడవలు దండయాత్రలు సాగించిన సంక్షోభకాలమున దమరాజ్యములను బోగొట్టుకొని యుందురు. వీనిపూర్వులు కళ్యాణపురమును విడిచిపెట్టవలసివచ్చినను 'కళ్యాణపురవరాధీశ్వర' అనిబిరుదమును మాత్రము విడిచిపెట్టి యుండలేదు. దక్షిణహిందూదేశమును బరిపాలించిన రాజవంశములలోని రాజులు తమపూర్వులు గడించినబిరుదములను విడువక వంశపారంపర్యముగా జెప్పుకొనుచు వచ్చుచుండుటచే నాయావంశసంప్రదాయ చరిత్రములకు గొంతవఱకు నైనదోడ్పడుట కవకాశ మిచ్చుచున్నవి.

వీరహొమ్మాళిరాయడు

ఈవంశమునకు మూలపురుషు డయినవీరహొమ్మాళి రాయడనునాతడు పశ్చిమచాళుక్య సామ్రాజ్యభాను డస్తమించుకాలమున నొకసామంతమాండలికుడుగాను సైన్యాధ్యక్షుడుగాను నుండినవాడయి యుండవచ్చు నని యూహించుటలో బ్రమాద మేమియును గానరాదు. పండ్రెండవశతాబ్ది తుదను హొయిసలరాజయిన వీరబల్లాలుడు గాంగవాడి, నోలంబవాడి, బవవాసిరాజ్యముల నాక్రమించుకొని పరాక్రమవంతుడై పరిపాలనముసేయుచు కళ్యాణపురముపై దండెత్తివచ్చి చాళుక్యనృపతి యగునాల్గవసోమేశ్వరుని సైన్యాధ్యక్షు డగు బొమ్మరాజు నెదుర్కొని యాతని గదనరంగమున నోడించి బిజ్జలునియొద్దనుండి గైకొన్నరాజ్యము నాక్రమించుకొనియెను. కర్ణాటభాషలో వ. బ. అనునక్షరములు 'హా' అనునక్షరముగ మాఱి యుచ్చరింపబడుట సాంప్రదాయసిద్ధమయిన విషయముగనుక 'బొమ్మ' శబ్దము 'హొమ్మ' గావచ్చును. అట్లగుటచే వీరుడైన బొమ్మరాజును వీరహొమ్మాళిరాయ డని కవి ప్రశంసించుట వింతవిషయము గాదు. కనుక పైబొమ్మరాజుసంతతివా డయినమఱియొక బొమ్మరాజు హొయిసలయాదవులను పదుమూడవ శతాబ్ద్యంతమున కళ్యాణనగరము నుండి పాఱద్రోలి స్వతంత్రుడై పరిపాలనము చేసి యుండును. అతడే యీవంశమునకు మూలపురుషు డయినవీరహొమ్మాళిరాయనిగా గ్రహింపవచ్చును. ఈవీరహొమ్మాళిరాయడు వైష్ణవమత సంప్రదాయాచారములుగలవా డనియు, దేవబ్రాహ్మణభక్తి గలవా డనియు, మాయాపురం బనునామాంతరముగలిగి యుండిన గంగాపురమున 'చెన్నకేశవస్వామిని' ప్రతిష్ఠాపించె ననియును, వీరనారాయణదేవచరణాంభోరుహా రాధనానుసంప్రాపితసకలసామ్రాజ్యవిశేషభోగంబులును, పరముభాగవత సఖిత్వంబును, గల్గి పెద్దకాలము ధాత్రి బరిపాలించు చుండె ననియు నరపతివిజయమునందు గవి వర్ణించి యున్నాడు.

తాతపిన్నమరాజు - కొటిగంటిరాఘవరాజు

ఈవీరహొమ్మాళిరాయనిపుత్త్రుడు తాతపిన్నమరాజని నరపతివిజయమునందు మాత్రమెగాక 'ద్విపదబాలభాగవతము' పీఠికలో నారవీటివంశమును వర్ణించుఘట్టమున దోనూరి కోనేరునాథు డనుకవి:

      "సమితిలో జెఱకురాచనరేంద్రు గెలిచి
       అలవుగా సప్తాంగహరణం బొనర్చి
       పొలుపొందె భువిమన్నెపులి యనుపేర
       బిరుదాంచితుడు తాతపిన్నభూవరుడు."

అని తాతపిన్నమరాజును గూర్చి వక్కాణించి యటు పిమ్మట -

      "హరికాంత బోలు నూరాంబిక యందు
       ఘనశౌర్యు డౌకొటిగంటిరాఘవుని
       గనియె నతండు సంగ్రామంబు నందు
       రాజిల్లుకంపిలిరాయసైన్యముల
       దేజంబు మెరయంగ దెగువమై గెలిచి
       గరిమ గైకొనియె నగ్గండరగూళి
       బిరుదంబు నరినృపుల్ పేర్కొని పొగడ."

అని యతని ప్రథమభార్యాపుత్త్రు డయిన కొటిగంటి రాఘవరాజు వీరకృత్యములను వర్ణించియున్నాడు. నరపతివిజయమను గ్రంథమున వెంకయకవి తాత పిన్నమరాజు ప్రథమ భార్యనుగాని యామెకుమారు డగుకొటిగంటి రాఘవరాజును గాని ప్రశంసించినవాడుకాడు. తాతపిన్నమరాజు జయించిన చెఱకురాచనరేంద్రు డెవ్వడో యింతవఱకు చరిత్రమున కందియుండ లేదు. కాని వానికుమారుడు కొటిగంటి రాఘవరాజు యుద్ధమున గంపిలిరాయ సైన్యములను గెలిచి గండర గూళి' యనుబిరుదమును వహించినవాడని కవిచెప్పిన దానినిబట్టి కొంతచరిత్రమును దెలిసికొనుట సాధ్యముకాగలదు.

నరపతివిజయమునందు వక్కాణింప బడిన తాతపిన్నమరాజు బిరుదగద్యములో 'సమస్తదురాచార చెఱుకురాచనాయక రాజ్యసప్తాఙ్గహరణ' అని చెఱుకు రాచనాయకుని ప్రశంసగన్పట్టుచున్నది గాని కంపిలిరాయనిగెల్చి 'గండరగూళి' యనుబిరుదము గైకొన్నవిషయము ప్రశంశింపబడియుండలేదు. అయిన నియ్యవి నిజమగు చరిత్రమును సూచించునవిగా నున్నవనుట కనుమానింప బనిలేదు.

ఇందు బేర్కొనబడినకంపిలిరాయ డెవ్వడో మనము ముందుగ దెలిసి కొనవలసియున్నది. కంపిలి కృష్ణానది కుపశాఖ యగు తుంగభద్రానది యొక్క దక్షిణపుటొడ్డున యానెగొందికి నెదురుగ నున్నది. శివకవులలో గంగాధరు డనునొక కవి 'కుమారరామనచరితె' యను కన్నడభాషా కావ్యము నొక దాని రచించి యందు కంపిలి రాజులచరిత్ర మభి వర్ణించియున్నాడు. ఈకావ్యమున కుమారరామనతండ్రి కంపిలిరాయ డనివక్కాణింపబడి యుండెను. కంపిలిరాయని తండ్రి ముమ్మడి సింగనయనియు, ఇతడు దేవగిరి రాజధానిగా మహారాష్ట్రదేశమును బరిపాలించిన సేవణవంశీయు డగు రామదేవరాయని కొల్వున నొకదుర్గాధిపతిగ నుండి, యాతని మరణానంతరమున నతనిమేనల్లు డగు మల్లదేవుడు రాజ్యమాక్రమించుకొన నందున కియ్యకొనక, ముమ్మడిసింగన వాని నెదుర్కొని కదనరంగమున వానిసంహరించి, రాజ్తముతా నాక్రమించుకొని, తురకల యొత్తిడివలన దేవగిరిని విడిచివచ్చి, కంపిలి రాజధానిగ జేసికొని, కొంతకాలము పరిపాలనచేసి మరణించెననియు, అటుపిమ్మట వానిమంత్రియగు బైచప్ప యను నాతడు వానికుమారు డయిన కంపిలిరాయనికి బట్టము గట్టెననియు, నాగ్రంథమున వర్ణింప బడియుండెను. మఱియు నాగ్రంథమున కంపిలిపురమున బ్రతిష్ఠాపింప బడియున్న సోమేశ్వరదేవుని వరప్రసాదమున జనించిన వా డగుటచేత దమకుమారుని గంపిలిరాయ డనిపేరు పెట్టిరనికూడ వక్కాణించి యున్నవాడు. కనుక బాలభాగవతమున బేర్కొనబడిన కంపిలిరాయ డను నామమొక వ్యక్తినామమే యైనయెడల కొటిగంటి రాఘవరాజు వీనిసైన్యములనేజయించి 'గండరగూళి' యనుబిరుదము గైకొన్నవాడని చెప్పవలసి యుండును. కంపిలిరాయ డనునది వ్యక్తినామముగాక కంపిలిప్రభు వనియర్ధము చేసికొన్నపక్షమున మఱియొకవిధముగా జెప్పవలసియుండును.

ఈవంశములోని రెండవశాఖకు సంబంధించిన విజయధ్వజునివంశము లోనివాడగు జంబుకేశ్వరరాయ లానెగొంది పురమున కధీశ్వరుడై యున్నకాలమున డిల్లీచక్రవర్తి పక్షమున బ్రతినిధిపాలకుడుగా ఘూర్జరదేశమును బాలించుచున్న 'బహఉద్దీ' ననువాడు చక్రవర్తిని నలక్ష్యము చేసి స్వతంత్రపరిపాలనముచేయ నారంభించినపుడు వానిజయించి పట్టుకొని వచ్చుటకై చక్రవర్తి 'ఖాజాజెహాన్‌' అనువానికి గొంతసైన్యము నిచ్చి పంపగా నతడు 'బహఉద్దీన్‌' సైన్యములను దలపడి యుద్ధమున జయించి వానిం బట్టుకొన బ్రయత్నించెను గాని వాడు తప్పించుకొని పాఱివచ్చి ఆనెగొందెపురాధీశ్వరు డైన జంబుకేశ్వరరాయలను శరణువేడగా నత డభయదాన మొసంగెను. జంబుకేశ్వరుడు 'బహఉద్దీ' నునకు రక్షణ యొసంగె నను సమాచారమును చక్రవర్తివిని కోపోద్దీపితుడై ప్రఖ్యాతిగాంచిన చెందేరి, బుదావూను, మాళవసైన్యముల నసంఖ్యాకముగా జేర్చుకొని దండెత్తివచ్చి యానెగొందికి సమీపమున నున్నకంపిలిదుర్గమును ముట్టడించి హిందూసైన్యము నోడించి యాదుర్గమును తొలుత స్వాధీనపఱచుకొని 'మల్లికునాయబు' అనువానిని దనకుబ్రతినిధి పాలకునిగా నియమించి కొంతసైన్యముతో వానినచట నిలిపి యానెగొంది ముట్టడింప బోయెను. ఈభయంకరమైనవార్త విని జంబుకేశ్వరరాయలు తనసేనల నన్నిటిని సమకూర్చుకొని తాను ముందుగా నెదురువచ్చి మారుకొని ఘోరసంగ్రామము గావించెనుగాని తనకు జయముకలుగు నన్నధైర్యము లేకపోవుటచేతను, శరణాగతుడైన బహఉద్దీనుని వానికి వశ్యపరచి తానావిపత్తునుండి తప్పించుకొనుట ద్రోహమని తలపోయుట చేతను, తెంపరితనము వహించి తనస్త్రీల నెల్లర నగ్నిప్రవేశ మగునటులు గావించి శత్రువుల మార్కొని ప్రాణములున్నంతవఱకు బోరాడి తుదకు వీరస్వర్గమును గావించెను. మహమ్మదు బీన్‌ తుఘ్‌లఖ్ ఆనెగొందిని బట్టుకొనియెను. ఇతనికి దాయాదు లయిన కొటిగంటి రాఘవరాజును, వీనికి సవతిసోదరుడయిన సోమదేవరాజు లీసమాచారము దెలియరాగా నన్నదమ్ము లిరువురును విశేషసైన్యముల సమకూర్చుకొని కొటిగంటిరాఘవుడు కంపిలిదుర్గమును, మల్లికునాయబు సైన్యములను, సోమదేవుడు మహమ్మదుబీన్‌తుఘ్‌లఖ్ సైన్యములను ముట్టడించి ఘోరసంగ్రామము సలిపియుందురు.

కంపిలిరాయ డయినమల్లిక్‌నాయబుని సైన్యముల నెదుర్కొని యుద్ధముచేసి యపారవిజయమును గాంచి వానిని దేశమునుండి తరుమగొట్టి 'గండరగూళి' యనుబిరుదమును బొందినవీరయువకుడు కొటిగంటిరాఘవరాజేగాని యన్యుడు గాడని తలంపవలసి యుండును. రాఘవరాజు కొటిగల్లుదుర్గమును స్వాధీనపఱచుకొని నద్దుర్గాక్షుడుగ నుండుటచేతనే కొటిగంటిరాఘవరా జనిద్విపదబాలభాగవతమున బేర్కొన బడుట సంభవించెను. ఇతడువహించిన 'గండరగూళి' యను బిరుదమునే వీనితరువాత నళియరామరాజు పెదతండ్రియగు నవుకుతిమ్మరాజువహించియున్నటుల "సంగరాంగణ చర్యకంపిలిరాయ సప్తాంగగండరగూళి నద్బిరుదాది సంగ్రహ్రణోజ్జ్వలా" యనుపద్య బాలభాగవతములోని వాక్యమువలన గన్పట్టుచున్నది. ఈతిమ్మరాజుకాలమున కంపిలిరాజ్యము లేదు. కావున నిత డారాజ్యమును జయించి సాధించినబిరుదము గాదు. అయినను పూర్వులువహించినబిరుదముల గూడవంశపారంపర్యముగ దత్సంతతులవారు వహించుట గలదనిసమన్వయించు కొనవలయును.

సోమదేవరాజు

తాతపిన్నమరాజునగు ద్వితీయభార్యయైన గొంకలదేవియందుసోమదేవు డనుమఱియొకకుమారుడు పుట్టెను. ఈసోమదేవరాజు సల్పినవీరకృత్యము లత్యద్భుతములుగా నున్నవి. ఈవీరయోధునికాలము దెలిసికొనుట కొక్కనామముతోగూడుకొన్నచరిత్రాంశ మొకింత సూచింప బడుచున్నది. ద్విపదబాల భాగవతమునందు:-

      "మఱియు నతండాజి మహమదుమలక
       గరకరియలిగి యగ్గలిక బుట్టించి
       బెలుకురి యాతండు బిడ్డపే రిడిన
       దలకెల్ల దొలగించి దయచేసి కాంచె
       తెలివి నర్వదినూరు తేజీల నచట
       గలుగునర్థులకు దానంబుగా నొసగె."

       అనియును, మఱియు నరపతివిజయమునందు.

   "సీ. కదనరంగంబున గరితురంగమవీర
              వితతితో బలుమాఱు విఱుగదోలి
       యమితోగ్రశౌర్యు మహమ్మదు బట్టి నీ
              పేరు పెట్టెదన గుమారున కది
       గాక భవత్పాదకమలంబు నుదు రంట
              దండంబు బెట్టెద దన్ను గాచి

      విడువు మన్నను గాచి విడిచి యర్ధులకును
               షష్టిశతంబుల నశ్వముల వాని

  తే. చేత నిప్పించి శరణన్న బ్రీతి గాచు
     బిరుదుతగునీతనికె యని ధరణిపతులు
     సన్నుతింపగ నాదిరాజన్య చర్య
     దేజరిలె సోమదేవ ధాత్రివరుడు."

అని వర్ణింపబడుటవలన నీసోమదేవరాజు తనకుశత్రువును మహాపరాక్రమవంతుడు నగుమహమ్మదుమలకను పలుమాఱు యుద్ధములలో జయించుటయెగాక యొకప్పుడు వానిని పట్టుకొని బంధించి నప్పుడాతడు 'రాజన్యా! నీపాదములను బట్టుకొని నమస్కరించుచున్నాను; నాకుమారునకు నీపేరుపెట్టెదను; నన్నుగాచి రక్షించు' మనివేడుకొనగా దయతో వానిని విడిచిపెట్టి వానిచేత నర్ధులకు నాఱువేల యశ్వముల దానమిప్పించెనని దెలియుచున్నది! ఇందుపేర్కొన బడిన మహమ్మదుమలక క్రీ. శ. 1358 మొదలు 1375 వఱకు బదునేడుసంవత్సరములుకలుబరగి పట్టణము రాజధానిగాబరిపాలనము చేసినబహమనీసుల్తా నగుమొదటి మహమ్మదుషాహ యని రంగస్వామి సరస్వతిగారు గుర్తింపగా డాక్టరుకృష్ణస్వామి అయ్యంగా రామోదించినారు. ఇంతటితోవిరమించిన జక్కగానుండెడిది. అట్లుగాక సోమదేవరాజు విజయనగరచక్రవర్తులలో మొదటివారఅయిన హరిహర, బుక్క, రెండవ హరిహరుల సేనానులలో నొక్క డయియుండవలయు ననిగూడ రంగ స్వామిసరస్వతిగారు వ్రాయుచున్నారు.[4] మహమ్మదుమలకబహమనీసుల్తా నగుమొదటి మహమ్మదుషాహ యని సంశయ మావంతయు లేక యూహించి నపుడింతకన్న నెక్కువయూహ కవకాశమిచ్చు టసంభవము.

ద్విపద బాలభాగవతమున గాని, నరపతివిజయమున గాని వర్ణింపబడిన సోమదేవుని వీరకృత్యములుగాని, బిరుదు గద్యములుగాని తదితరచర్యలుగాని వీరియూహలను బలపఱచునవి గావు. ఏమన సోమదేవునివీరకృత్యము లన్నియు బహమనీరాజ్యము దక్కనులో స్థాపింపబడుటకు బూర్వమె జరిగిన వనియాగ్రంథములలోని వర్ణన లవకాశ మిచ్చుచున్నవి గాని యటుపిమ్మట జరిగినవిగా నవకాశ మిచ్చుచుండలేదు

      "నయవిశారదుడు పిన్నయసోమ విభుడు
       జయశాలి భూపాల సార్వభౌముండు."

అని కోనేరునాధకవి ద్విపదబాలభాగవతమున జెప్పియుండినవిషయము కవివర్ణ నాంశ మైనయతిశయోక్తిగ భావింపరాదు. అట్లుభావించుట సత్యచరిత్రమునకు వెల్తి కల్పించినవార మగుదుము. ఇక్కాలమున మనము సోమదేవుడుసార్వభౌము డయినది లేనిదియు గుర్తింప జాలనంతటి దౌర్భాగ్యస్థితియందున్నను, ఇంచుక జాగరూకతతో నాకాలరాజకీయపరిస్థితులను బరిశీలించితి మేని సత్యము గోచరింపక మా నదు. ఆకాలముననొక స్వతంత్రసామ్రాజ్యమును నిర్మాణముజేయసంకల్పించిన హరిహరబుక్కరాయాదుల వలె జాళుక్యసామ్రాజ్యమువంటి యొకస్వతంత్రసామ్రాజ్యమును నిర్మాణముజేయసంకల్పించి సార్వభౌమ బిరుదము వహించి కృషిచేసిన యొకస్వతంత్రప్రభు వనియె మనము నిశ్చయింపవలసియుండును గాని కర్ణాట సామ్రాజ్యాధీశ్వరు లగుహరిహరబుక్కరా యాదులకు లోబడి పరిపాలనముచేయుచు బహమనీసుల్తా నను మొదటిమహమ్మదుషాహతో బోరాడినవా డనియూహింపరాదు. ఇతనిబిరుదములలో "మాళవరాజేంద్రమస్తకశూల" యనియు 'హొసబిరుదురగండ' యనియు, రెండుబిరుదము లున్నట్టు బాలభాగవతమునందును, నరపతివిజయమునందును బేర్కొనబడి యున్నవి. ఈరెండుబిరుదములు నీతడు హరిహరబుక్కరాయాదులకు సామంతుడు గాడని విశ్వసించుటకు దోడ్పడుచున్నవి. ఎట్లన మాళవరాజేంద్రుడు డిల్లీసుల్తా నగు 'మహమ్మదు-బీన్-తుఘ్‌లఖు' నకు గప్పము గట్టుసామంతుడుగాని బహమనిసుల్తా నగుమహమ్మదుషాహకు సామంతుడు గాడు. ఈబిరుదములనుబట్టి యితడు క్రీ. శ. 1310-1347 సంవత్సరముల మధ్యకాలమున నున్నట్టు మనము నిశ్చయింపవలసి యుండును. ఈకాలమున డిల్లీచక్రవర్తు లగు మహమ్మదుమతస్తులు విజృంభించి మూడుహిందూస్వతంత్ర సామ్రాజ్యములను నాశనము గావించి దక్షిణహిందూస్థానము నంతటను గల్లోలము గావించిరి. క్రీ. శ. 1318లో దేవగిరి రాజధానిగా గలమహారాష్ట్రసామ్రాజ్య మడుగంటినది. 1324 లో నోరగల్లు (ఏకశిలానగరము) రాజధానిగా గల యాంధ్రసామ్రాజ్యము విచ్ఛిన్నమైపోయినది. 1327 లో హాలెవీడు (ద్వారసముద్రము) రాజధానిగా గలప్రాచీనకర్ణాట సామ్రాజ్యముభగ్నమైపోయినది. అంతటితో నిరుస్సాహము జెంది పాతశేషు లగుమహారాష్ట్రాంధ్ర కర్ణాటవీరులూరకయుండ లేదు. నూతన స్వతంత్రసామ్రాజ్యములను స్థాపింపవలయు నని విశ్వప్రయత్నములను గావించి హిందూసంఘమతసంరక్షణమే ప్రధానాదర్శముగా బెట్టుకొని నూతనశత్రువు లగుమహమ్మదుమతస్థులు దక్షిణహిందూస్థానమున స్థావర మేర్పఱచుకొన కుండజేయవలె నని వీరాగ్రగణ్యులై ప్రవర్తించి తమజీవితముల ధారపోసిరి. అట్టి మహావీరులలోనివాడు సోమదేవుడు. వీనికాలమున మనము గుర్తించుటకు మూవురుమలకలు గొప్పవారు గాన్పించు చున్నారు. వారిలో నిరువుర సమాన పరాక్రమవంతులు. వారిరువురే దక్షిణహిందూదేశముపై పెక్కు దండయాత్రలు సాగించి దక్షిణదేశమునంతయు సంక్షోభము జెందించినవారు. 'అల్లాఉద్ధీన్‌ఖిల్జీ' అను డిల్లీచక్రవర్తి బానిసవాడయిన 'మలిక్‌కాపుర్‌' అనువాడు మొదటివాడు; డిల్లీ చక్రవర్తియై 'మహమ్మద్-బీన్-తుఘ్‌లఖ్‌' అనుబిరుదమును బొందిన 'మలిక్‌ఫకీరుద్దీన్‌జూనా' అనువాడు రెండవవాడు. ఈరెండవవాడు క్రీ. శ. 1325 వ సంవత్సరమున డిల్లిసిం హాసనము నధిష్ఠించుటకు బూర్వము 'అలూఫ్‌ఖాన్‌' అను నామాంతరము గూడ గలిగి యుండెను. 'మలిక్, ముల్‌క్,' శబ్దములను 'మల్కి, మలక, ముల్కి, ములక' యనుశబ్దములనుగా మార్చి తెలుగుకవులు తమతమప్రబంధములలోను, శాసనములలోను ప్రయోగించి వ్యవహరించుట గలదు. కనుక బాలభాగవతమున 'మహమ్మదుమలక' యని చెప్పబడినవాడు మహమ్మదుబీన్‌ తుఘ్‌లఖ్‌ అని బిరుదము బొందినమలిక్‌ ఫకీరుద్దీన్‌జూనా యనురెండవవా డనినాయభిప్రాయము. ఇతడు క్రీ. శ. 1334 సంవత్సరమున దనకు శత్రువగు 'బహఉద్దీను' నకు రక్షణ మొసంగినా డనుకారణముచే జంబుకేశ్వరరాయలపై దండెత్తివచ్చినా డనియు నాయుద్ధములో జంబుకేశ్వరుడు వీరమరణము నొందగా నీదుర్వార్త విని బహుళసైన్యముతో వచ్చి కళ్యాణపురాధీశ్వరుడయినసోమదేవరాజు మహమ్మదు బీన్‌తుఘ్‌లఖ్ సైన్యముల దలపడి కదనరంగమున వానినోడించి పరిభవించిపంపిన విషయమును రాఘవరాజును గూర్చి వ్రాయుసందర్భమున సూచించియున్నాను. ఈసంవత్సరమునాటికి బహమనీరాజ్యముగాని విజయనగరరాజ్యముగాని యేర్పడి యుండలేదు. ఈయుద్ధమునుగూర్చి మహమ్మదీయ చరిత్రకారులు వేఱువిధముగా వ్రాసినారు. ఈయుద్ధములో జక్రవర్తికే జయముగలిగె ననియు, ఆనెగొంది వానివశమయ్యెననియు, బహఉద్దీనునితో బాటు మఱియార్గురు మంత్రి వర్గములో జేరినవారిని చెఱపట్టె ననియు, వారిలో జంబు కేశ్వరునిమంత్రి హరిహరరాజును, కోశాధ్యక్షుడగు బుక్కరాజు గూడ నుండె ననియు, డిల్లీచక్రవర్తి రాజ్యమును వశపఱచుకొని యాప్రదేశమునకు 'మలిక్‌నాయబ్‌' అనువాని నధికారినిగా నేర్పఱచి చెఱపట్టి యుంచినయార్గురిని వెంట దీసికొని డిల్లీనగరమునకు వెడలిపోయె ననియు, ఎప్పుడు చక్రవర్తి వానిసైన్యములతో దమదేశమును విడిచిపెట్టి వెడలిపోయెనో యానాటనుండియు 'మలిక్‌నాయబు' నకు ప్రజలు వశ్యులు గాక దిక్కరించి పోరాడుచున్నందున వారిశౌర్యోత్సాహములను స్వాతంత్రప్రీతిని మెచ్చుకొని యచట రాజ్యముచేయుట తనకుసాధ్యము కాదని తలంచి చక్రవర్తికి దేశస్థితి నంతయు దెలియ జేయగా నాత డట్లేయూహించి తనకడ బందెలో నున్న హరిహరునకు రాజ్యము నొసంగి బుక్కరాజును వానికి మంత్రిగా నియమించి తమకుసామంతులుగనుండు నట్లొప్పించుకొని వారలను కారాగారమునుండి విముక్తులను గావించి వారిదేశమునకు బంపినతరువాత 'మలిక్‌నాయబు' ను దనకడకు రప్పించుకొనె' ననియు మహమ్మదీయ చరిత్రకారులు వ్రాసి యున్నారు. ఇవి సత్యములు కావు. ఈదండయాత్రలో మహమ్మదుబీన్‌తుఘ్‌లఖ్ గొప్పదెబ్బ తిన్నాడు. ఆదెబ్బతీసినవాడు సోమదేవరాజు. ఈదెబ్బతో మహమ్మదు బీన్‌తుఘ్‌లఖ్ దక్షిణహిందూదేశ దండయాత్రలు సాగించుట నిలిచి పోయినది. చక్రవర్తియంతటివాని నోడించి కదనరంగమున జెఱపట్టుటయు, అతడు 'మహాప్రభూ! నాకుమారునకు నీపేరు పెట్టుకొందును; నన్ను రక్షించివిడువు మనిపాదములను బట్టుకొని వేడుకొన్నందున శరణాగతరక్షణము వీరపురుషధర్మము గావున దాని బాటించి వానివిడిచిపుచ్చి తనసర్ధారులు కోరగా నాఱువేల యశ్వములను వానిచేత వారల కిప్పించుటయు దటస్థించి నపుడు కలిగిన నవమానముకంటె నెక్కువ యవమానమేముండును? దీనిని గప్పిపుచ్చగోరి మహమ్మదీయచరిత్రకారులు పైవిధముగా గథ మార్చి వ్రాయుట సంభవించినదిగా దోచుచున్నది. ఈపరిభవమును చక్రవర్తి భరియింప జాలక పిచ్చిపట్టిపోయి తనరాజధాని డిల్లీనగరమునుండి దేవగిరికి మార్చవలె నని ప్రతత్నించెను. డిల్లీ పురవాసులను బెక్కండ్రు ధనికులను డిల్లీ విడిచి రావలసిన దని నిర్భంధపఱచెను. అనేక వేలసంఖ్యలవారిని డిల్లీనుండి బయలుదేఱ దీయ గలిగెనుగాని వారెవ్వరును ప్రాణములతో దేవగిరి చేరియుండలేదని ఇబూబచూతా' యనుచరిత్రకారుడు వ్రాసి యుండెను. ఇతడు చక్రవర్తికి సమకాలికుడు గావున గొంత నిజముచెప్పి యుండు నని విశ్వసింపవచ్చును. ఆనెగొందిపై సాగించినదండయాత్రలో గూడ ప్రఖ్యాతములయిన మాళవసైన్యము లుండి వానిపక్షమున హిందూరాజులతో బోరాడియుండిరి గావున దత్సైన్యముల కధికారిగనున్న సేనాని తురకసర్దారుని జయించియుండుటచేతనే సోమదేవరాజును 'మాళవరాజేంద్రమస్తకశూల' యనుబిరుదముగలవానిగా బాలబాగవతగ్రంథకర్త వక్కాణించుట సంభవించెను. ఇతడు వహించిన 'ఆకులపాటివీరక్షేత్రభారతీమల్ల; ముదిగంటి భారతీక్షేత్రమల్ల; ఆనెగొంది వీరక్షేత్ర భారతీమల్ల; కుంతివీరక్షేత్రభారతీమల్ల; ఆకులపాటిముదుగంట్యానెగొంది కుంతిసరవిజయలక్ష్మీ సమక్షీకరణలక్షిత; వీరక్షేత్రభారతీమల్లబిరుదభరితానుభావ;' అనుబిరుదమును సోమదేవునకును డిల్లీచక్రవర్తి యగుమహమ్మదుబీన్‌తుఘ్‌లఖునను జరిగిన యుద్ధములందు బై చెప్పినయానెగొంది సమీపదేశమంతయును వీరక్షేత్రముగా (యుద్ధరంగము) నుండె నని దెలుపుచున్నది. మఱియు నితడు సర్వతంత్రస్వతంత్రుడై విజృంభించె నని చాటుచున్నది. ఇంతియగాదు, 'హొసబిరుదురగండ' రాయరణరంగభీభత్స రాయరాహుత్తరగండ' బిరుదములను వహించుట కర్ణాటసామ్రాజ్యాధీశ్వరునకు సామంతుడు గాడనియు స్వతంత్రుడనియు, వారలకు బ్రతిస్పర్థిగాను శత్రువుగాను, నుండె నని దెలుపుచున్నవి. అట్లు ప్రతిస్పర్థవహించి పోరాడినవారు వీనికి సమకాలికు లయినకంపిలిరాయడును, వానిమంత్రులును వాని తరువాత రాజ్యపరిపాలనమునందు డిల్లీచక్రవర్తిచేత నెలకొల్పబడినవారును నగుహరిహరరాయలును, బుక్కరాయలు నై యున్నారు. పయిబిరుదము లన్నియును సోమదేవరాజు హరిహరరాయ లనువానితమ్ముని బుక్కరాయలను తుంగభద్రానది కుత్తరభాగమునుండి దక్షిణభాగమునకు దఱిమినచరిత్రభాగమును దెల్పుబిరుదములుగాని యన్యములు గావు. హొసబిరుదుగలవారు హొసపట్టణవాసు లగువీరులకుగాని తత్పాలకులకు గాని వర్తింప గలదు. వారికి మృత్యుప్రచు డనునర్థముననే 'హొసబిరుదురగండ' బిరుదము వర్తించు ననిస్ఫురింపను. రాయరణరంగమును భీభత్సముచేయువానికే 'రాయరణరంగభీభత్స' యనుబిరుదమును, రాయనిరాహుత్తులకు మృత్యుప్రదుడగువానికే 'రాయరాహుత్తురగండ' బిరుదమును వర్తింపగలవు. మఱియు, 'సకలనరదేవచూడామణి' యనుబిరుదము స్వతంత్రు డైనరాజునకు వర్తించునదిగాని యొకసామంతప్రభువునకు వర్తింపరానిది. అట్టిబిరుదము సోమదేవునకు గలదు. క్రీ. శ. 1347 వ సంవత్సరమున 'హసన్‌గంగూ' బహమనీరాజ్యమును స్థాపించుటకు బూర్వము సోమదేవరాజు కళ్యాణపురమును గాని, ఆనెగొంది రాజధానిగా నొకమహాసామ్రాజ్యమును నిర్మాణము జేయవలయు ననిసంకల్పించి వీరాగ్రగణ్యుడై కృష్ణాతుంగభద్రానదీ మధ్యస్థభూభాగము వీరక్షేత్రముగా జేసికొని విహరించినది సత్యమని యొప్పుకొనక తప్పదు.

క్రీ. శ. 1336వ సంవత్సరమున విద్యానగరమునిర్మింపబడినట్లును, దానిని రాజధానిగా జేసికొని మొదటిహరిహరరాయలు పరిపాలనము చేసినట్టును, మొదటిహరిహర, బుక్కరాజుల కాపలూరు, ఎరగుడిపాడు శాసనములవలన దెలియుచున్నది. తుంగభద్రానది కుత్తరభాగము నందలి దేశమును సోమదేవరాజును, దక్షిణభాగమును మొదటిహరిహరరాయలును నేకకాలమున బరిపాలించుచుండిరి. సోమదేవరాజు తుంగభద్రకు దక్షిణమున నుండుదేశమును బరిపాలించి యుండలేదు. ఇతనిబిరుదగద్యములో "ఏకదివసఘటికైకధాటీహఠావృతకోట రాచూరుసాతానికోట కందనవోలు యాతగిరికలువకొల్లు మొసలిమడుగుగంగినేనికొండాభిధానసప్తదుర్గవర్తి" యనునద్భుతబిరు దమున్నట్టు గన్పట్టుచున్నది. [5]

ఒక్కదినములోపలనే కోటరాచూరు, సాతనికోట, కందనవోలు, యాతగిరి, కలువకొల్లు, మొసలిమడుగు, గంగినేనికొండ దుర్గముల నీతడు స్వాధీనపఱచుకొనియె నని పైబిరుదము దెలుపుచున్నది.

ఈయేడుదుర్గములను 'వరుసతోసాధించి' యని నరపతివిజయమునందుండి ఒక్కనాడే లగ్గల గొన్న ప్రస్తావము లేనికతన మామిత్రులగు రంగస్వామిసరస్వతిగారు నరపతివిజయమునం దట్లుగానరాదనియు నియ్యది తరువాతి కాలమున కడపటిసామ్రాజ్య దర్బారులచే గల్పింప బడినదనియు నభిప్రాయపడిరి. కాని నరపతివిజయము కన్నను బూర్వము క్రీ. శ. 1469 సంవత్సరమున రచింపబడిన బాలభాగవతమునందు "ఒక్కనాడు లగ్గలుగొన్నవాడు" అని వ్రాయబడిన విషయము వారెఱింగి యుండరు. పైబిరుదు గద్యముగూడ రామరాజీయములోనిదని యెత్తి తమగ్రంథమున బ్రకటించియు దిన్నగ చూడకవ్రాసినది. బాలభాగవతమునందు:-

      "నరులకసాధ్యమైన మొసలిమడుగు
       ధరనెన్న దగినసాతానికోటయును
       కడునుతింపగ జాలు కందనవోలు
       కడిమి విశేషంబు గలకల్వకొలను
       అరుదైనరాచూరు నల యాతగిరియు
       నిరుపమంబగు గంగినేని కొండయును
       ననగ నొప్పారు నేడైన దుర్గముల
       వినుత ధాటీమహావేశంబు నెఱపి
       సురపతియోగి యాశుభ్రాంశవంశ
       కరు డొక్కనాడు లగ్గలు గొన్నవాడు"

ఒక్కనా డెట్లుసాధ్యమగునని రంగస్వామిసరస్వతిగారి తలంపు సోమదేవభూపాలుడు తనసైన్యములనేడు భాగములుగ విభజించి యాసైన్యములొక్కదినముననే యాయేడుదుర్గములను ముట్టడించి స్వాధీనపఱచు కొనుటకు నసాధ్యమేమిగలదు? శత్రు పక్షము నవలంభించి తనయధికారమును పాలనమును దిరస్కరించిన, సాహసికులును, పౌరుషవంతులునైన, అడబాలనాయకుని, వీరినేడును రుద్రప్పనాయని, గౌరారెడ్డిని, గంగినాయకుని సింగంబు మత్తమతంగజములను బట్టుకొనుకైవడి సంగ్రామరంగంబున సంహరించి కిన్కచే నసహుండు నై రిపులెల్ల గగ్గోలుపడునట్లు చట్టలుచీరించి గంగినేనికొండ ప్రాగ్ద్వారసీమను గంబముల బాతించి తోరణగా గట్టించినా డని,

      "దండిమీరంగ నాతడు గంగినేని
       కొండలగ్గలచేత గొని యందుపరుల
       సుడియంగనీని గుజ్జులవీరినేని
       నడబాలయన్న రుద్రప్పనాయకుని
       ఘనుని గౌరారెడ్డి గంగినాయకుని
       గినిసినరిపులెల్ల గగ్గోలుపడగ
       చట్టలుచీరించి సంరంభ మెసగ
       గట్టించె దూరపుగవని కంబముల" అనియును,

       నరపతివిజయమునందును,

   "సీ. బలవంతుడగు నడబాలనాయకునిని
              శూరుడౌ గుజ్జుల వీరినేని
       రౌద్రరసోన్నిద్రు రుద్రపాధిపు మహా
              శౌర్యు గౌరారెడ్డి సాహసాంకు

       గంగినాయకుని సంగ్రామరంగంబున
             సింగంబు మత్తమతంగజముల
       బట్టుకైవడిబట్టి చట్టలెత్తించి కి
             న్కను నసహుండునై గంగినేని

    గీ. కొండ ప్రగ్ద్వారసీమ నుద్దండవృత్తి
       గంబముల బాతి తోరణగాగ గట్టి
       వినుతికెక్కెను సకలభూజనులచేత
       సోమదేవనృపాల సుత్రాము డెలమి"

అనియును భయంకరములయిన వీరకృత్యములు వర్ణింపబడియెను. ఇట్లేబాలభాగవతమునందు,

     "మణిగిళ్లదుర్లంబు మదిలోన గలుగు
      కణకదాడిగనేడి కైకొనినిలిచి
      గోనంగిమన్నేని గుపితాన్యనృపతి
      శాసకుం డగుట మస్తకము గొట్టించి
      ఆరసి తత్పట్టణాగ్రతటాక
      భైరవుముంగల బలి యొసగించె."

నని మఱియొకవీరకృత్యము వర్ణింప బడినది. ఈరీతిగా నన్యనృపతిశాసకు లయినదుర్గాధిపతుల నెల్లరనుజయించి కళ్యాణపురమునకును కంపిలికి నడుమనుండుదేశమును బరిపాలించిన యాంధ్రరాజీసోమదేవుడని దెలియ నగును. ఇతడు పెక్కు యజ్ఞము లాచరించి నట్లు బాలభాగవతమునందును నరపతివిజయమునందును దెలుప బడియెనుగాని నమ్మనర్హమైనదిగాదు. బాలభాగవతము తెలుగుభాషయందు వ్రాయబడినగ్రంథమగుటచేత విజయనగరసామ్రాజ్యచరిత్రమును రచించినవిదేశీయులైన గ్రంథకర్తలు కేవలము ఫెరిస్తా మొదలగుమహమ్మదీయచరిత్రకారుల వ్రాతల నాధారముచేసుకొని హిందూపక్షమును విస్మరించి వ్రాతవలసినవా రయిరి. కాని సోమదేవునిచే బలుమాఱులు కదనరంగమున నోడింపబడి తుదకు బరిభవింపబడినమహమ్మదుమలక బహమనీసుల్తానగు మహమ్మదుషాహ కాడని నాయభిప్రాయము.

రాఘవరాజు

సోమదేవరాజునకు గామలదేవియందు బుట్టినకుమారుడు రాఘవరాజని దెలియుచున్నది. వీనిగుఱించి ద్విపద బాలభాగవతమున నేమియు దెలుపబడి యుండలేదుగాని పద్యబాలభాగవతమున గురుశౌర్యధైర్యభాసురుడు రాఘవదేవవసుధేశు డనియు, సరసభూపాలీయమున 'ఘనభుజాశౌర్యరాఘవుడు రాఘవదేవధరణీశు' డనియు మాత్రము వక్కాణింప బడెను. నరపతివిజయమునందు

      "చ. పరబలవేది రాఘవనృపాలుడు పంకజనాభుంగూర్చియ
          ధ్వరములు నగ్రహారము లుదాత్తమతిన్ దగ జేసిధారుణీ
          సురుల కొసంగె బర్వముల శుద్ధసువర్ణగవాదిదానముల్
          గరిమను బిన్నశౌరినిజగద్విసుతున్‌ఘనుగాంచెవేడుకన్."

ఇతడు విష్ణువునుగూర్చి జన్నములను గావించి భూసురులకు నగ్రహారములు మొదలగుదానములను బెక్కింటిని జేసెననిమాత్రము దెలుపుచున్నది. 'వాసుదేవచరణకమలసేవాసక్తచిత్త' అన్నబిరుద మీతని కున్నట్లు దెలిపియుండుటజూడ నీతడు విష్ణుభక్తు డయినవైష్ణవు డనిదెలుప గలదు. మఱియు, "యవనబలమర్దనోత్సాహ" యన్నబిరుద మీతడు తురష్కులతోడను తుళువబలసంహారవీర" యన్న బిరుదము కర్ణాటకులతోడను బోరాడుచున్నట్టు దెలుప గలవు. 'శబరకులబలనిహసనవినోద' యన్నబిరుద మిత డాటవికులయినమన్నెదొరల నిర్జించె నని తేటపఱచు చున్నది.

ఈరాఘవదేవనృపతి యొకప్రక్కను బహమనీసుల్తానులతోడను మరియొకప్రక్క బుక్కరాయలతోడను బోరాడుచుండి తుదకు నేయుద్ధముననో మరణము జెందియుండును. వీనియవసానకాలమున వీనిరాజ్యముయొక్క యుత్తరభాగము బహమనీసుల్తానులును దక్షిణభాగమును బుక్కరాయలును దమతమ సామ్రాజ్యములలో జేర్చుకొని యుందురు. అందుచేతనే పైగ్రంథములలో నేమియు వక్కాణింప బడియుండలేదు. ఇతనికి బాచలదేవియందు బిన్నభూపాలుడు జనించెను.

పిన్నభూపాలుడు

బాలభాగవతమునందు,

 
      అతనికి "బిన్నభూపాగ్రణి యొదవె
      సతతసౌభాగ్యబాచల దేవియందు

        ఆపిన్నభూపాలు డారెవీ డనగ
        నేపారుపురి దన కిరవుగా నిలిచి
        సకలమహీపాల జాలంబు గొలువ
        ప్రకటితతేజుడై రాజ్యంబు జేసె"

అనిమాత్రము చెప్పియుండెనేగాని యతడు స్వతంత్రపరిపాలనము సాగించెనో బుక్కరాయలకు సామంతుడై యుండెనో దెలిపి యుండలేదు. కాని కాలమునుబట్టి విచారించిచూడ గర్ణాటసామ్రాజ్యాధీశ్వరు డగుదేవరాయ మహారాయలకు సామంతుడుగ నుండెనని యూహింప దగును. వీనింగూర్చియు విశేషవిషయములు గానరావు. ఆరెవీడుసోమదేవరాజునకె రాజధానిగ నుండె నని నరపతి విజయమునందు జెప్పియుండిన విషయము సరియైనది కాదని విశ్వసింపవలసియుండును. బాలభాగవతమునందు సోమదేవుని ప్రతాపము నెక్కువగావర్ణించి యుండియు నావిషయము నెంతమాత్రము సూచించి యుండలేదు. సంగతిసందర్భములను బట్టి చూడ సోమదేవునకు నారెవీటికి సంబంధము లేదనియె తలంప నగును. కావున బాలభాగవతమునందు జెప్పినరీతిని సోమదేవుని మనుమనికాలమున నతనిచే నారెవీడు రాజధానిగ జేసికొనబడియె ననుటయే వాస్తవమని గ్రహింప దగును. ఇతనికి నౌబలదేవియందు బుక్కరాజు జనించెను.

ఆరెవీటిబుక్కరాజు

ఆరెవీటి వంశావళియందు,
   
     "ప్రభవించె నతని కౌబళదేవియందు
      ప్రభుమణి బుక్కభూపాల చంద్రుడు
      యెక్కువగుణముల నియ్యారెవీటి
      బుక్కనరేంద్రుడు భువి బుట్టినంత
      వారిజాప్తోదయ వర్ణితవేళ
      దారలగతియయ్యె దక్కురాజులకు
      సరనాధమణి సాళ్వ నరసింగరాయ
      వరసఖుం డయిబుక్క వసుధేశు డమరె
      బుక్కభూపాలుండు బుధులకు నెల్ల
      దిక్కితండె యనంగ దేజంబు నందె."

అని యభివర్ణింప బడియుండెను. ఇతడు నరవాధమణి యైనసాళ్వనరశింగరాయ భూపాలునకు పరసఖుండుగా నుండెనని చెప్పుటవలన నితనికాలమున మనము సరిగాగుర్తించుటకు సాధ్యమగుచున్నది. సాళ్వనరశింహరాయలు క్రీ. శ. 1447 మొదలుకొని 1465 వఱకును కర్ణాట సామ్రాజ్యమును బరిపాలించిన మల్లికార్జునరాయలకును 1465 మొదలుకొని 1478 వఱకు బరిపాలనము చేసిన విరూపాక్షరాయలకును సమకాలికుడై వారలకు సామంతుడై యుండి కర్ణాటసామ్రాజ్యములోని చంద్రగిరి రాజ్యమును బరిపాలనము సేయుచు దరువాతసామ్రాజ్యము క్షీణించి దురవస్థపాలయి యున్నకాలమున స్వతంత్రుడై క్రీ. శ. 1487 వ సంవత్సరప్రాంతమున సామ్రాజ్యము నంతయు దానేయాక్రమించుకొని శత్రుల నడంచి పట్టాభిషిక్తుడై బలిమిచే 1493 వఱకు బరిపాలించిన వాడగుటచేత నాతని విజయయాత్రలందు నార్వీటిబుక్కరాజు పాలుగొనియుండె ననివిశ్వసింప వచ్చును. ఇంతియగాక యితనిబిరుదుగద్యమున 'సాళువనరసింహ రాయరాజ్య ప్రతిష్ఠాపనాచార్య' అనుబిరుదము గన్పట్టుచుండుట చేతను, బాలభాగవతమునందు పరసఖుం డనిపేర్కొన బడియుండుటచేతను రాజ్యప్రతిష్ఠాపనమునం దీతని ముఖ్యసేనానియగు నీశ్వరనారసింహునివలె నీబుక్కరాయని సాహాయ్యమును సాళ్వనరసింహరాయలు పొందియుండె ననుట కెంతమాత్రమును సందియము లేదు. కనుకనే పద్యబాలభాగవతమునందు,

      "అతడు దను మన్నెపులి యని యఖిలదిశల,
       జెలగి పొగడ సాళువనరసింగరాయ
       రాజ్యసంస్థాపకుం డయ్యె బ్రౌడినారె
       వీటిబుక్కనరేంద్రు డుద్ఘాటితారి."

అని యభివర్ణించి యుండెను. ఇతనిబిరుదుగద్య మిట్లున్నది. "జయజయ, స్వస్తిశ్రీసంతత వేంకటాచలపతి చరణారవిందసేవాకందళితసామ్రాజ్యసుఖోవభోగ, సాళువనరసింహరాయరాజ్య ప్రతిష్ఠాపనాచార్య, శౌర్యగరిష్ఠ, సకలకళావిశారద, దైనందినవితరణ నానాదిగంతరాగతవనీపకజాల పరిపాలనాగుణవి శేష, అసహాయశౌర్య, సుమేరుధైర్య, అష్టాదశవిద్యాప్రజ్ఞాప్రవీణ, రాజకులాభరణ, రాజరాజేశ్వర, పిన్నశౌరిరాజతనూజ, బుక్కరాజ విజయీభవ, దిగ్విజయీభవ."

ఇతడు మిక్కిలివృద్ధుడగువరకు దీర్ఘకాలము జీవించి మునిమనుమలజూచు నంతవఱకు, అనగా శ్రీకృష్ణదేవరాయలవారిపట్టాభిషేకమువఱకు జీవించి యుండె నని,

       "చక్కెరవిలుకాని చక్కందనము గల్గి
        చొక్కమౌ నార్వీటి బుక్కరాజు"

అనికుమారధూర్జటికవి తనకృష్ణరాయవిజయమునందు కృష్ణరాయలపట్టాభిషేకకాలమున నీవృద్ధనృపతి రాజాస్థానము నలంకరించియున్నవా డని యభివర్ణించియుండుటచేత విశ్వసింపవలసి వచ్చుచున్నది. ఇతనిసంతతియెతామంతంపరయై దక్షిణహిందూదేశచరిత్రమునందు బహుప్రఖ్యాతి కెక్కినచరిత్రవంశముగా నున్నది. ఈవంశమె కొంచెమించుమించుగా మున్నూఱువత్సరములు మహమ్మదీయమతస్థులకు స్థావరము గలుగకుండ బోరాడుచుండిన యాంధ్రహిందూరాజవంశమని నిస్సంశయముగ జెప్పవచ్చును. దక్షిణహిందూదేశసంరక్షణార్థ మీరాజవంశము తనకుమారులను బెక్కండ్రను రణభూమికి బలిపెట్టి యసమానకీర్తిని సంపాదించుకొనియెను.

ఆరెవీటిరామరాజు

ఆరవీటిబుక్కరాజునకు అబ్బలదేవి, బల్లాంబిక యనునిర్వురు భార్యలు గలరు. వీరిలో అబ్బలదేవియందు సింగరాజు మొదలగుకొడుకులు జనించిరి. సింగరాజునంద్యాలపట్టణమున కధీశ్వరుడుగ నియమింపబడి పరిపాలించుటవలన నీతనివంశము వారికి నంద్యాలవారనియింటిపేరు గలిగినది. బుక్కరాజు రెండవభార్యయగుబల్లాంబికయందు ప్రకటగుణాడ్యు డగురామరాజు జనించెనని నరపతివిజయము నందు దెలుపబడినది. బాలభాగవతమునందు,

      "ఆమహీపతికి బల్లాంబిక యందు
       రామనృపాలుండు రాజేంద్రు డొదవె
       హరిపాదతీర్థంబునందు బాంధవులు
       గరళంబు వెట్టినగతి యెఱింగియును
       తెఱగొప్ప తత్తీర్థంబు నాని
       యరిగించుకొనియె రామావనివిభుడు."

       అనియును, నరపతివిజయమునందును,

  "చ. మగటిమి కోర్వలేక దయమా లటుజ్ఞాతినియుక్తబుద్ధిచే
      సగరత గన్నతీర్థ మిడజాలక యర్భకు డున్నజూచి శ్రీ
      నగధర నీవె దిక్కని జనంబులు గన్గొన నంత గ్రోలి యా
      సగరుని బోలి రామనృపచంద్రుడు చెందడు తద్వికారమున్."

అనియును రామరాజు మాహాత్మ్యము గొనియాడ బడియుండెను. ఇతనికి విషము బెట్టినజ్ఞాతులగుబంధువు లెవ్వరో ఎందుకు వారు విషము బెట్టవలసివచ్చెనో యావివరము నేకవియును దెలిపియుండ లేదు. ఆరెవీటిబుక్కరాజు రామరాజును గందనోలుపట్టణమున కధీశ్వరునిగ జేసెను. ఈరామరాజు కందనోలుపట్టణమున నుండ విజాపురసుల్తా నగుఆలీఆదిల్‌షాహ డెబ్బదివేలయాశ్వికసైన్యముతో వచ్చి ముట్టడించె ననియు, వానితో బోరాడి విజయము గాంచె నని బాలభాగవతములోని,


      "ఎందు నెన్నగ జాలు నిద్ధశౌర్యమున
       గందనవోలిదుర్గంబులోనుండి
       బుక్కయరామభూభుజు డెలనృపుల
       నెక్కువ యిదియని యెన్నంగ జాలి
       వీరులు డెబ్బదినేవు రాశ్వికులు
       చేరి కొల్వంగవచ్చినసవానెదిరి
       కలనంది పంచబంగాళంబు సేసి
       గెలిచె దచ్చరితంబు గీర్తింప దరమె.

     అనుపంక్తులవలనను, పద్యబాలభాగవతములోని,

  "గబ్బుల్ డెబ్బదివేవు రాశ్వికులు వేడ్కన్‌గొల్వగాగిన్కబె
   న్మబ్బుల్ గప్పగగందనోలుగొనువేడ్కన్‌జుట్టుముట్టన్‌సవా
   బిబ్బీ నుబ్బణగించి తోలె నరిరాడ్భీముండు లంకాసర
   ణ్యబృంద్రాభుడు బుక్కభూవిభుని రామాధీశుం డాహాయనన్."

అనుపద్యమువలనను విస్పష్టమగు చున్నది. ఇతని కెంత సైన్యముగలదో యావివరము నరపతివిజయమునం దిట్లు చెప్పబడినది.

      "సీ. మదకరి కొకటి కిర్వదిగుఱ్ఱములు గుఱ్ఱ
                మునకును విలుకాండ్రు ముగురు విచ్చు
          కత్తులవా రీటెకాం డ్రట్ల వర్థిల్ల
                నిట్టి యేనుగులను జుట్టు మూడు
          వేల యేనూరు నుద్యృత్తితో నడవంగ
                గందనో ల్సాధింపగా దలంచి
          మొన ద్రుంచి గట్టిగా ముట్టడి దిగిన నా
                బిబ్బిని మిక్కిలి యు బ్బణంచి

       గీ. ప్రకట సప్తాంగముల గొని రామవిభుడు
          కందనో ల్రాజధానిగాగ వసుమ
          తియును నేలి మహాహవదీక్ష బూనె
          బలిమి కలిమి నాశావనీపకుల బెనుప."

అనగ రామరాజుసైన్యము 3,500 ఏనుగులు, 70,000 గుఱ్ఱములు, 6,30,000 కాల్బలము గలదిగ నుండెనట. ఇట్టిమహాభయంకర మైనసైన్యముతోనుండి, డెబ్బదివేల యాశ్వికసైన్యముతో దండెత్తివచ్చి కందనవోలును ముట్టడించిన సవాబిబ్బీని (విజాపుర సుల్తానగు అదిల్‌షాహ) నోడించి తరుమ గొట్టి యుబ్బణగించిన దర్పోన్నతు డయినరణశూరునిగ వర్ణించి యున్నాడు. ఇతనిబిరుదుగద్య మిట్లున్నది.

"జయజయ, స్వస్తిసమసుప్తిసమరసమయబలరజోమి ళితసప్తసాగరఘంఘుమితకల్లోలజాల, శరణాగతపాల, హల్లీసుసేనోల్లాసితసప్తశతసైంధవ గ్రహణపరాక్రమధుర్య, రత్నసాను ధైర్య, దుర్వారతరసవాయిసైనికహరణ, నవాబిబ్బిరాజసప్తాఙ్గహరణమార్గచరణ, రణభయానక ఙయానకారవముఖరీకృతకుల గిరిదరీనికర, పోషితావనిసురకరప్రకర, నిరావాపాదవనీదుర్గనివాసి కాశవొడయదుర్మదఖలనిర్మధన, ధర్మధౌరేయ, దానరాధేయ, వీరరమానమారోహణారంభ సోపానదోస్తంబ, వాక్కుంభీనససార్వభౌమారంభ, పరిపంధినృపపుండరీకాధిపరాజ మండలకబళనవ్య గ్రిమోదగ్రమండలాగ్ర, సింహికాతనూజ, రామరాజ, విజయీభవ."

పైబిరుదగద్యములో 'దుర్వారతర సవాయిసైనికహరణ, సవాబిబ్బిరాజసప్తాఙ్గహరణమార్గశరణ' అనుబిరుదముల వహించుటకు గారణము విజాపురసుల్తానగుఆదిల్‌షాహాను జయించుటయని మనము తెలిసికొన గలుగుచున్నాము. 'నివాపాదవనీదుర్గనివాసి కానవొడయదుర్మదఖిలనిర్మధన' యన్న బిరుదము వచ్చినవిధమును, 'హల్లీసుసేనోల్లాసితసప్తశతసైంధవగ్రహణపరాక్రమధుర్య' యను బిరుదమును వహించుటకు గలకారణమును దెలిసికొనవలిసి యుండును. మొదటిదానిగూర్చి ద్విపదబాలభాగవతమునందు,

       "వినుతింప దగునాదవేనిదుర్గమున
        ననతుడై యుండుకాచాధీశు గెలిచి
        అరుదుగా సప్తాఙ్గహరణంబు సేసె
        గరిమోన్నతుండు బుక్కయ రామవిభుడు."

      అని యాదవేనిదుర్గాధీశు డయినకాచాధీశుని జయించి

వానిసప్తాఙ్గములను హరించె నని దెలుపబడి యుండెను. ఆదివేనిదుర్గము మిక్కిలి బలాడ్యమైనది ఈదుర్గాధిపతి యైనకాచాధీశునిపై రామరాజేల దండెత్తివలసివచ్చె ననిసంశయము పుట్టగలదు. కాని రామరాజు కాలమునుబట్టి విచారించిన దగునట్టికారణ మగుపించక పోదు. కాచయొడయడు విజయనగరసామ్రాజ్యమును మొదట బరిపాలించిన సంగమవంశీయుల పక్షమువాడయి క్రీ. శ. 1487 వ సంవత్సరప్రాంతమున సాళ్వనరసింహరాయలు విజయనగరసామ్రాజ్య మాక్రమించుకొన్నప్పు డాతనికి వ్యతిరేకముగ బ్రవర్తించి యుండును. ఆరెవీటిరామరాజు సాళ్వనరసింహరాయని పక్షమున వహించి యాదవేనిపై దండయాత్ర సాగించి యాతనిసప్తాంగములను హరించి యాదుర్గమునకు దనరెండవ కుమారుడైనకొండ్రాజును నధికారిగ నియమించి యుండును. ఇంక రెండవబిరుదమును గుఱించి విమర్శింతము. ఈబిరుదములోని హల్లీసుసేనుని గూర్చి శ్రీనేలటూరివేంకటరమణయ్యంగా రిట్లు వ్రాసియున్నారు.[6]

"క్రీ. శ. 1492 మొదలుకొని 1528 వఱకు కళింగ దేశముపై ప్రభుత్వముసల్పిన ప్రతాపరుద్రగజపతి తన 'సరస్వతీవిలాసము'లో జమునాపురాధీశ్వరు డగు 'హుసేనసాహి' యనుతురుష్కుడు శరణాగతుడు కాగా శత్రువుల నుండి వానినిరక్షించితి ననిచెప్పుకొని యున్నాడు....... ప్రతాపరుద్రగజపతి క్రీ. శ. 1492 లోసింహాసనము నధి ష్ఠించి 1500 లలో దక్షిణదిగ్విజయయాత్రకు బయలు వెడలెను. పైదానివలన ఆరెవీటిరామరాజుచే నిర్జితు డైనహల్లీసుసేనుడును, ప్రతాపరుద్రగజపతికి శరణాగతుడై సంరక్షింపబడిన 'హుసేనసాహి'యు నేకకాలమువారగుట నిజము."

అయినను 'వీరొక్కరా భిన్నపురుషులా యనునది చింతింప దగినవిషయ' మని వేంకటరమణయ్యగా రనుచున్నారు గాని వీరుభిన్నపురుషులు కారనియే నాయభిప్రాయము. క్రీ. శ. 1500 లలో ప్రతాపరుద్రగజపతి దక్షిణదిగ్విజయయాత్రకు బయలువెడలిన వాడగుటచే నాదండయాత్ర సందర్భమున నావిషయము జరిగియుండును. బిరుదుగద్యములో వేంకటరమణయ్యగారు వ్రాసినట్లు 'సప్తదశసైంధవగ్రహణ' గాక రంగస్వామిసరస్వతిగారి పాఠమున వక్కాణింపబడినట్లు 'సప్తశతసైంధవగ్రహణ' మనియె గ్రహింపదగి యుండును. రామరాజు హల్లీసుసేనుని జయించి 700 గుఱ్ఱములను గైకొన్నవాడు.

ఆరెవీటిరామరాజునకు నల్వురు భార్యలు గలరని బాలభాగవతమునందు,


      "ఆరామభూపతి కంగనామణులు
       పేరైన యౌబళాంబిక లక్కమమ్మ
       యంబుజనేత్రరంగమ్మయు నమల
       మాంబయు నల్గు రై రందులోన"

అని ఔబిళాంబ, లక్కమాంబ, రంగమాంబ, అమలాంబ, యనుభార్యలు గల రనియు, వారిలో లక్కమాంబకు

       'ఆ రామనృపులక్కమాంబపుణ్యమున
        ధీరత హేమాద్రి తిమ్మభూవరుని
        వరకీర్తి కొండభూవరుని శ్రీరంగ
        ధరణీశు మువ్వురు తనయుల గాంచె.'

     నని ద్విపదబాలభాగవతము నందును,

       "ఆరామనృపతికి మహో
        దారు డగుతిమ్మరాజు ధన్యుడుకొండ
        క్ష్మారమణుడు బుధసుతస
        చ్చారిత్రుడురంగవిభుడు జనియించి రొగిన్."

అని నరపతివిజయమునందును, రామరాజువలన తిమ్మరాజు, కొండరాజు, శ్రీరంగరాజు జనించిరని దెలుప బడినది. భట్టుమూర్తికూడ తనవసుచరిత్రమునం దీమువ్వుర నిట్లభివర్ణించి యున్నాడు.

    "శా. ఆరామక్షితభర్తకుం బ్రధితసత్యాలాపధర్మోద్భవ
         శ్రీరమ్యుండగుతిమ్మరాజు బలలక్ష్మీధామభీమప్రదా
         పారీణుండగుకొండశౌరి విజయప్రఖ్యాతచారిత్రుడౌ
         శ్రీరంగేంద్రుడు గల్గి రైందవకులుక్షేమంకరాకారులై."

వీరలలో జ్యేష్ఠు డగుతిమ్మరాజు, తనవారిలో నసమా నబలపరాక్రమధుర్యుడై బహుప్రసిద్ధిని గాంచినవాడుగ నున్నాడు.

అవుకుతిమ్మరాజు

రామరాజునకు లక్కమాంబ యందుజనించినమూవురు పుత్రులలో బెద్దవాడయినతిమ్మరాజు 'అవుకు' పురము నేలు చుండినవా డగుటవలన దరువాత నతనిసంతతివారు చరిత్రము నందును, ప్రబంధములలోను నౌకువా రని వ్యవహరింప బడిరని నరపతివిజయములోని:-


      "కం. ఆతిమ్మనృపతిభూకాం
           తాతిలకం బైనయవుకు దానేలుచు వి
           ఖ్యాతిగ నప్పురిపేరం
           బ్రీతిని దనకులము వెలయ బెంపొందె మహిన్."

అనుపద్యమువలన విదిత మగుచున్నది. కనుక నీత డవుకువంశమునకు మూలపురుషు డయ్యెను. దోనేరు నాధకవివిరచిత మగుద్విపదబాలభాగవతమును గృతి నొందిన చినతిమ్మరాజు ప్రేరణచే నేతద్గ్రంథకర్త యగుకోనేరునాథకవి పద్యబాలభాగవతమును రచించి యతనితండ్రియగు నీతిమ్మరాజునకు నంకితము గావించెను. ఈకృతియందునితనికిసంబంధించిన పెక్కుచారిత్ర కాంశములు దెలుప బడి యున్నవి. ఇతడు క్రీ. శ. 1505 మొదలుకొని క్రీ. శ. 1542 వఱ కును తరువాతనుగూడ విజయనగరసామ్రాజ్యాధిపులపక్షమున నుండి పెక్కుయుద్ధములలో బాల్గొని యున్నవాడు. ఇతని చరిత్రమునం దొకవింతమాహాత్మ్యము వర్ణింప బడినది. ద్విపదబాలభాగవతమున:-

      "అందగ్రజుండైన యాతిమ్మనృపతి
       యిందువంశవతంసు డితడస వెలసె
       రాజశిరోమణి రాజులరాజు
       రాజచంద్రుడు రామరాజు తిమ్మయ్య
       అపదృష్టి యగునొక్కయాభీరునకును
       నిపుణుండు వేంకటనిలయుండు చక్రి
       యొకకంటిచూపు తానొసగి స్వప్నమున
       బ్రకటుడై తిమ్మభూపాలు మన్నించి
       ఓకృతకృత్య నీ కుర్వీశు లెనయె?
       నీ కహోబలపుణ్యనిధి మోక్షమిత్తు
       గరుణ గోపాలునికడమచూ పిమ్ము,
       నరనాథయనుచు నానతి యిచ్చుటయును
       గొలువులో నగ్గోపకునకునుచూ పొసంగె."

       అని యున్నది. పద్యబాలభాగవతమునగూడ,

      "వేంకటేశ్వరు నాజ్ఞ విగతదృష్టికి దృష్టి
       దయమీఱ నిచ్చె నేధర్మమూర్తి"

అనియు గలదు. కన్నులులేని యొకగోపకునకు వేంకటేశ్వరుడుకరుణించి యొకకన్నుమాత్రము నిచ్చె ననియు, ఆస్వామియె తిమ్మరాజు స్వప్నమున సాక్షాత్కరించి కడమకన్ను నీ వొసంగవలసినదనియాజ్ఞ నిచ్చె ననియు, అంతట నాతడు దయతో నతనికి జూపొసగె ననియు గని తెలిపియున్నాడు.

మండువేసవికాలమున నొకప్పుడు తిమ్మరాజు దండుతో బ్రయాణము సేయుచున్నప్పుడు సైనికులకు దప్పిచే నోళ్లెండుకొనిపోవుట నాతని కెఱిగింప నాతడు నిండుమనంబుతోడ విష్ణుమూర్తినిబ్రార్థించి 'దోని సిరంగరాజు కొండనెత్తమున' తక్షణమె యొకనీటిబుగ్గను బుట్టింపగా రెండుఘటికల కాలమందు నీరముండెననియు, దీనినెల్లవారు చూచి రనియు గవి:-

       "ధన్యుండు రామభూధవుతిమ్మనృపతి
        సైన్యసమేతుడై చెత్రమాసమున
        దండు వోవుచు నుండి తనభటుల్ త్రోవ
        నెండిననోళ్ల దప్పెఱిగించుటయును
        నిండుచిత్తమున దోని సిరంగరాజు
        కొండనెత్తమున వైకుంఠుని దలచి
        గోవిందు వేడి గ్రక్కున నొక్కబుగ్గ
        భూవినుతంబుగా బొడమంగ జేసె
        నందఱుజూడగానన్నీర మచట
        గ్రందుగా విలసిల్లె ఘటికాద్వయంబు."


అనుపంక్తులలో దెలుపుటయెగాక పద్యబాలభాగవతమునగూడ, "కరుణమీగాములగట్టుపై వేసవి బుట్టించె జలము లేభూసుతుండు" అని చెప్పి యున్నాడు. ఈతిమ్మరాజు మాహాత్మ్యమెట్టి దైనను ఇతడసమానయోధాగ్రేసరు డనియొప్పుకొనక దప్పదు. దోనిసిరంగరాకు కొండనెత్తమునకే మీగాములగట్టని నామాంతరము గలదని తెలిసికొనవలయును. రెండునామములనుబేర్కొన్న కవియొక్కడే యగుటవలన నట్లూహింప నగును. అయ్యవి వేఱ్వేఱుప్రదేశము లయి యున్నయెడల నొక్కకవియె యట్లుచెప్పుట సంభవింపదు. అట్లు చెప్పినది సత్యమేయగునేని యసలు విషయముయొక్కసత్యను గూర్చి శంకింప వలసివచ్చును.

ఈతిమ్మరాజునకు

      " గండరగూళికి గండర,
        గండని కుద్దండరాయగణవారణస్త్రీ
        గండాంకున కెంతెంబర
        గండనికిన్ బట్టవాడ గజసింహునకున్."

అని వక్కాణింపబడిన బిరుదములలో 'గండరగూళి' యనుబిరుద మతనిపూర్వు డగుకొటికంటి రాఘవరాజు సంపాదించినదిగాని యితడు సంపాదించినది కాదు.

మఱియు,


        'చాళుక్యచక్రవర్తికి
         మాళవమదభంజనునకున్ మర్దితశకనే
         పాళునకు బిరుదుమన్నెవి
         భాళునకున్ మన్నెపులికి భాసురమణికిన్.

       మన్నెదళధూమకేతువ
       మన్నియమృగబేటకార మాళవరాయా
       త్యున్నతమస్తకశూలా
       మన్నెరసురత్రాణబిరుద మన్నెవిభాళా'


అనుపద్యములలో 'మాళవ రాయాత్యున్నత మస్తక శూలా' యనుబిరుద మితనిపూర్వు డగుసోమదేవరాజు కదనరంగమున మాళవరాజునుజయించి సంపాదించినదిగాని యితడు సంపాదించినది కాదు. కావున వీనిపూర్వులు వహించినబిరుదములు కొన్నియీతనికిని జేర్చ బడినది. ఇతడు పట్టవాడ రాజును, ఉద్దండరాయ డనువానిని జయొంచినట్లు పై పద్యములవలన దెలియుచున్నది.ఇతడు కళింగదేశాధీశ్వరుడగునొడ్డియరాయని, జయించుటయెగాక మహమదమలకకు బ్రాణదాన మొసగినట్టు కూడ నీక్రిందిపద్యమున సూచింపబడినది.


      "కదనధనంజయునకు మహ
       మదమల్కప్రాణదాన మతికొడ్డియరా
       యదిశాపట్టున కరిరా
       యదళవిభాళునకు పాండవాన్వయపతికిన్."

ఇతడు శ్రీకృష్ణదేవరాయలవారి పట్టాభిషేకసమయమున రాజసభయందుండి తరువాత కృష్ణరాయల పూర్వదిగ్విజయయాత్రలో పాల్గొన్నట్టు కుమారధూర్జటి తనకృష్ణరాయవిజయమునందు "సాకల్యముగ గీర్తిసర్వదిక్తటు లందు బ్రాకటస్థితి నిల్చు నౌకువారు" అనియును, 'ఠీవిగ నౌకువారును కడింది రహిన్ వెలుగోటివారలా రావెలవారు గూడుకొని' అనియును జెప్పియుండుట వలన ధ్రువపడు చున్నది. అచ్యుత దేవరాయలవారి కాలమునను సామ్రాజ్య సామంతులలో బ్రముఖులై ఇతడును, ఇతని కుమారులును నాతనికి దోడునీడగనుండి సర్వవిధముల దోడ్పడు చుండిరి. మఱియునీతని తమ్మునికుమారు డగునళియరామరాజునకు సామ్రాజ్యద్రోహి యగుసలకముమ్మయను సంహరించిన సందర్భమున నాతనిప్రక్కనుండి యప్పటియుద్దములో బాల్గొన్నట్టు,

      "సలకయతిమ్మాసురదు
       ర్విలసితవిలయాబ్ధిలగన విహ్వలవసుధా
       వలయస్థితికృతివివృతో
       జ్వలతర ధరణీవరాహ వరబిరు దాంకా"

అనుపద్య బాలభాగవతములోని పద్యమువలన వేద్యమగుచున్నది. ఇంతియగాదు,

      'కడిమిమై మానువకడ రణక్షోణి
       గడుసరి నేదులఖాను జయించె'


ననిద్విపదబాలభాగవతమునందును, 'మానువకడ సవాబూని పోరను బరాజయము నొందించె నేశౌర్యశాలి' యనిపద్యబాలభాగవతమునందును జెప్పియుండుటచేత నితడువిజాపురసుల్తా నగునాలీఅదిల్‌షాహాను మానువదుర్గముకడ జయించెనని నిశ్చయింప వలసి యున్నది. ఇదియు క్రీ. శ. 1542 సంవత్సరప్రాంతముననో తరువాతనో జరిగియుండును. ఇతడు వీరనృసింహ రాయలవారిచే "స్వామిద్రోహరగండ నూపురమును" బహుమానము గాంచి నట్లుగ నీక్రిందిపద్యము వలన దెలియుచున్నది.

    "శా. శ్రీమద్వీరనృసింహరాయనృపతిశ్రేయోదయాసాధిత
        స్వామిద్రోహరగండనూపురవిరాజద్రామరాట్తిమ్మభూ
        పామిత్యర్జితపుణ్య సత్ఫలసమస్తాశాంతవిశ్రాంతని
        స్సీమోర్యిప్రతిపాదనప్రతయశా శీతాంశువంశోనిధీ."


ఆదవేనికొండరాజు

పైపద్యమున వీరనృసింహరాయనిపట్ల ద్రోహబుద్ధితో బ్రవర్తించినవా డెవ్వడో చెప్పకపోయినను, ద్విపదబాల భాగవతమున:-

      "విక్రమంబున నాదవేనిదుర్గంబు
       విక్రాంతు లెన్న వేవేగ సాధించి
       సిరులతో వీరనృసింహరాయలకు
       బరుషాత్ము దుర్గాధిపతి నొప్పగించి
       గరిమ స్వామిద్రోహగండపెండార
       మరిభీకరముగ రాయ లొసంగ నొందె
       లాలితకీర్తి విలాసుండు పద్య
       బాలభాగవతప్రబంధనాయకుండు."

అని ద్విపదపంక్తులలో నుదాహరించినందువలన నాద్రోహి యాదవేనిదుర్గాధిపతి యని దెలియుచున్నది. కాని నరపతివిజయమునందు:-

      "క. దీనావసు డౌకొండమ
          హీనాధుం డాదవేని నేలుచు బరగెన్
          దానును సుతులును దత్సం
          తానం బాయాదవేని ధామము పేరన్."

అనుపద్యమునుబట్టి యాదవేనిదుర్గమున కధీశుడుగ నున్నవాడు బుక్కయరామరాజు మూవురుపుత్త్రులలో రెండవవా డయినకొండరాజనియు, అందువలన నాతడును నాతని సంతతివారును నాదవేనివారని వ్యవహరింపబడి రనియును దెలియుచున్నది. ఈకొండరాజు తిమ్మరాజు తమ్ము డనుట సంశయింప బనిలేదు. ఇతడు వీరనృసింహరాయనికి నేల ద్రోహిగ నుండుట సంభవించినది? అన్నయగుతిమ్మరాజు ద్రోహియగు తమ్ముని కొండరాజు నేలజయించి వీరనృసింహరాయనివలన 'స్వామిద్రోహరగండపెండేరము' నెందుకు బొందవలసి వచ్చినది? మొదట వీరలతండ్రి యగుబుక్కయరామరాజు కాచాధీశునిజయించి యాదవేనిదుర్గమును స్వాధీనపఱచుకొనియె నని ద్విపదబాలభాగవతమున జెప్ప బడియుండుట చేతను, నరపతివిజయమునందు రెండవకుమారు డయినకొండరాజాదుర్గమును బరిపాలించుచున్నవా డనిచెప్పబడియుండుటచేతను, బుక్కయరామరాజు కాచాధీశుని జయించి యాదుర్గమును కొండరాజున కిచ్చె ననిసమన్వింపవలసి యుండును. విజయనగరసామ్రాజ్యము సంగమవంశమునుండి సాళ్వవంశమునకును, సాళ్వవంశము నుండి తుళువ వంశమునకును, తుళువవంశమునుండి యారెవీటివంశమునకును సక్రమించిన దనుట ప్రసిద్ధచరిత్రాంశము గదా. సాళ్వనరసింహరాయని కుమారు డగునిమ్మడి నరసింహరాయని సింహాసనమును దుళువవీరనృశింహరాయ (కృష్ణరాయనితండ్రి నరసరాయలు) తొడిచికొనుటకు గోపించి కొండరాజు వీరనరసింహరాయనిపై దిరుగబడి యుండును. అప్పు డీతనియన్న యగుపైతిమ్మరాజే వీరనృసింహరాయని పక్షము వహించి తిరుగబడినతమ్ముని యుధృతమును మాన్పి పైగండ పెండేరమును బొంది యుండును. వీరనరసింహరాయలు వానిని క్షమించి యాదవేనిదుర్గము నాతనిస్వాధీనముననే యుంచి యుండును.

శ్రీరంగరాజు


బుక్కయరామరాజు మూవురుపుత్త్రులలోను గడపటివాడు శ్రీరంగరాజు. ఇతడె అళియరామరాయలు తండ్రి. వీనిం గూర్చినచరిత్రాంశము లెవ్వియును గానరావు. నరపతి విజయమునందు,


      "క. ఆరాజన్యులతమ్ముడు
          శ్రీరంగాధీశ్వరుండు శ్రితసంరక్షా

        ధౌరంధర్యముచే నా
        శ్రీరంగాధీశుడనగ క్షితిమతి గాంచెన్"

అనివ్రాసెనేకాని యాతనింగూర్చిన చరిత్రాంశము నొక్కదాని నైన నుడివియుండలేదు గాని,

       "కాగనసదృశబాహువిక్రమ నిరూడి
        దనరె గర్ణాటరాజ్యపదస్థు డగుచు
        దుర్జయాహితరాజ విధుంతుదుండు
        రామరాజేంద్ర శ్రీరంగరాజవిభుడు."

అని చెప్పియుండెను. దీనింబట్టి యీశ్రీరంగరాజు విజయనగరరాయల యాసానమున నుండి నట్లూహింప దగియుండెనుగాని యంతకన్నవిశేష మేమియును గానరాదు. మఱియు వసుచరిత్రమును రచించిన రామరాజభూషణకవి (భట్టుమూర్తి) సయితము

   "శా. ఆరాజత్రితయంబులో నసమభాణారాతి విజాతదో
       స్సారుం డాత్తసుభద్రు డర్జునగుణశ్లాఘ్యుండు నై పొల్చునా
       శ్రీరంగేంద్రుడశేష రాజ్యపదవీసింహాసనాక్షీణ ల
       క్ష్మీరాజన్నిజ సంతతిప్రధితుడై మించెన్ ధరామండలిన్"

అని యభివర్ణించెనేగాని యొక్కచరిత్రాంశము నైన బేర్కొనినవాడు గాడు. ఇతడు కృష్ణరాయనికిమంత్రిగ నుండె ననిఫెరిస్తావ్రాసినాడని హీరానుఫాదిరి తనయారెవీటివంశచరిత్రమున వ్రాసినది నప్రమాణముకాదు [7]

శ్రీరంగరాజుభార్య తిమ్మాంబయనియు, ఆమెవలన శ్రీరంగరాజునకు, కోనరాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వేంకటాద్రిరాజు నను నైదుగురుకొమాళ్లు జనించిరనియు వసుచరిత్రలోని యీక్రిందిపద్యములవలన దెలియుచున్నది.

    "కం. ఆమనుజేంద్రునకు బురం
         ధ్రీమణి యగుతిమ్మాంబ శ్రీరామునకున్
         భూమిజసుత్రామునకు బు
         లోమజయునుబలె జగంబులో నుతికెక్కున్."

    "శా. చేతోజాతసమానమూర్తి యగు నాశ్రీరంగధాత్రీధవుం
        డాతిమ్మాంబికయందు గోనవిభు దిమ్మాధీశురామప్రభున్

      ధూతాశేషవిపక్షుశ్రీతిరుమలేంద్రు న్వేంకటాఖ్యానవి
      ఖ్యాతుం గాంచె సురద్రుపంచకము నయ్యంబోధిరాజుంబలెన్."

ఈయైదుగురిలోను మొదటియిర్వురును ద్విపదబాలభాగవతమునందును, వసుచరిత్రమునందును, నరపతివిజయమునం

దును, బేర్కొనఁబడినను ప్రసిద్ధపురుషులునక్కాణింపఁ బడియుండ లేదు. అట్లగుటవలనవీరలు నిస్సంతుగస్వర్గస్థులై యుందురేమో యని సంశయము పొడముచున్నది. శ్రీరంగరాజు మూడవకుమారుఁ డైన రామరాజే అళియరామరాయలు ఈప్రతిభాశాలియైన వీరాగ్రణి చరిత్రమునే నేనిందుఁ తెలుపఁబూనితిని.[8]

  1. Forista Vol. III p.380; Aravidu Dynasty Vol.I p. 25.
  2. The Aravidu Dynasty Vol. I p. 19.
  3. ఈవిషయము 'అవిస్మృతసామ్రాజ్య' మనునర్ధమిచ్చు Never-To-Be-Forgotten Empire (శ్రీయుత బెంగుళూరు సూర్యనారాయణరావు బి. ఎ. గారివిరచితము) అనుగ్రంథమునుండి గ్రహింప బడినది గాని ఆనెగొందిసంస్థానములోని 'రాయవంశావళి' యనుగ్రంథముయొక్క మాతృకను జూచి వ్రాసినది కాదు.
  4. Sources of Vizianagar History Introduction p. 7 no. 28 p. 80.
  5. బిరుదుగద్యము:- "జయజయ, నిఖిల మహాభాగవతముఖ్యవిఖ్యాతకీర్తి, ఏకదివసఘటికైకధాటీహఠావృతకోట రాచూరుసాతనికోట కందనవోలుయాతగిరికలువకొల్లు మొసలిమడుగు గంగినేనికొండాభిధాన సప్తదుర్గవర్తి, స్థలదుర్గగిరి దుర్గజల దుర్గవసదుర్గచౌరాశి దుర్గవిఫాల, సముద్ఘుష్య మానబిరుదాపదాన హళహళికాకర్ణన పులకితకపోల, నాకులపాటి ముదుగంట్యానెగొంది కుంతి సరవిజయలక్ష్మీసమక్షీకరణలక్షిత, ఆకులపాటి వీరక్షేత్రభారతీమల్ల, ముదుగంటివీరక్షేత్రభారతీమల్ల, ఆనెగొంది వీరక్షేత్రభారతీమల్ల, కుంతివీరక్షేత్రభారతీమల్ల, వీరక్షేత్రభారతీ మల్లబిరుద భరితానుభావ, స్వభావగాంభీరాంబోనిధి, సత్వగుణవానుదేవ, సకల నరదేవా చూడామణి, అసిభరణపటిమసహదేవ, ఆదిదేవ, సుపర్వమణీమణిస్తుత, వరద, భయద, హొసబిరుదరగండ, విరప్రతాపబిరుద, బిరుదుమన్నెరగండ, పురిగొలసురత్రాణ, శరణాగతత్రాణబిరుద, రాయరణరంగభీభత్స, రాయరాహుత్తరగండ, యైవరగండ, గండరగండ, తాతపిన్నమరాజతనూజ, సోమదేవరాజ, విజయీభవ, దిగ్విజయీభవ."
  6. భారతి సం. 6 సంచిక 6.
  7. "WE know from Ferishta that he was one of the Ministers of Krishna Deva Raya, and was succeeded in this place by his son Rama Raya." (The Aravidu Dynasty of Vizianagar OH. II. page 19.) ఫెరిస్తావ్రాసిన వాక్యములను బ్రిగ్సు యిట్లు భాషాంతరీకరించెను. "The affairs of Beejanuggur being in confusion owing to the death of Hoeinraju who was newly succeeded by his sona Ramaraju, against whom rebellions had arisen by several Roies, he (the Sultan) met with no interruptions to his arms.(Brigg's Ferista Vol. III p. 81.) "హీమ్రాజుమరణము జెందగా నూతనముగా నాతనిపదవిని బొందిన యాతనికుమారుదు రామరాజుపై ననేకరాజులు తిరుగబడినందున విజయనగరములోని వ్యవహారములు గల్లోలము జెందుటచేత నతని (సుల్తాను) యాయుధముల కడ్డంకులు లేకుండెను" అని యావాక్యముల కర్థము. ఫెరిస్తావ్రాసిన పైవాక్యముల నమ్మి 'విస్మృతసామ్రాజ్యము' (Forgotten Empire p. 81.) అనుపేరుతో విజయనగరసామ్రాజ్య చరిత్రమువ్రాసినగొప్పచరిత్రకారులగు రాబర్టుస్యూయల్‌గారు "Heem' Rajah or, as Briggs renders the name Tim-Rajah-representing the 'Timma' are referring doubtless to saluva Timma, the great Minister of Krishna Deva Raya." అనివ్రాసి హీమ్రాజు కొడుకైన రామరాజు కృష్ణదేవరాయలప్రధానమంత్రిశేఖరు డగు సాళువతిమ్మరుసు కుమారు డని నిర్ధారణ చేసిరి. ఇదెంతవింతగానున్నదో చూడుడు. అళియరామరాజు తండ్రి న్యూయలను కొన్నట్టు సాళువతిమ్మరాజు కాడనియు, శ్రీరంగరాజనియు దేటపడుచుండ లేదా. ఫెరిస్తానిష్పక్షపాతమైనట్టియు సరియైనట్టియు చరిత్రము వ్రాయలేదని యెఱింగియుండియు హిరాసుపాదిరి ఫెరిస్తామాటలనమ్మి శ్రీరంగరాజు కృష్ణదేవరాయలప్రధానమంత్రి యని వ్రాయుట సత్యముకాదు.
  8. రామరాజీయమునందు ఆరవీటిబుక్కరాజుకొడుకు రామరాజునకు లక్కమాంబికయందు తిమ్మరాజు, కొండరాజు, శ్రీరంగరాజు ననుమూవురుపుత్రులు కలరని చెప్పఁబడియుండఁగా హిరాసు ఫారీ The "Aravidu Dynasty of Vijayanagara" అను తన గ్రంథమున రామరాజీయమున బుక్కయరామరాజునకు లక్కమాంబికయందు శ్రీరంగరాజు, చన్నవెంకటపతిరాజు, తిమ్మరాజు, తిరుమలరాజు, వెంకటపతిరాజునను నైదుగురుపుత్రులున్నట్టుగా జెప్పఁబడి యుండెననియు, వీరిలో జ్యేష్ఠుఁ డయిన శ్రీరంగరాజు పుత్రుఁ డయిన రామరాజు (అళియరామరాయలు) సదాశివరాయని రంగరాజు కార్యకర్త యైనరామరాజుఉ లనియు వ్రాయుట పొరబాటు, శ్రీరంగరాజుబుక్కయరామరాజునకు లక్కమాంబికయందుఁబుట్టిన మూవురు పుత్రులలోను గడపటివాఁడుగాని మొదటి కుమారుఁడుగాడని రామరాజీయవలన స్పష్టముగాఁ జెప్పబడియున్నది. "According to the poem mentioned above he had five sons, Sriranga, Channa, Venkatpati, Timma or Tirumala (who distinguished himself in service of Krishna Devaraya), and lastly Venkatapathi. Of these, the first, Sriranga became the father of Ramaraya, the regent of Sadasivaraya." (The Aravidu Dynasty of Vijayanagara p. 19.)