అళియ రామరాయలు/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవ ప్రకరణము

రాయలగూర్చిన యపనిందలు.

అళియరామరాయలు సార్వభౌము డైనసదాశివరాయలపట్ల సగౌరవముగా బ్రవర్తింపక పదమూడుసంవత్సరము లాతని జెఱసాల యందుంచి తరువాతను దానే పట్టాభిషిక్తుడై చక్రవర్తి ననిప్రకటించుకొని విజయనగరసామ్రాజ్యభాగ్యము నంతయు దానే చూఱగొని పరిపాలనముచేసెనని యొకగొప్పయపనిందకు 'ఆరవీటివంశచరిత్రమును' వ్రాసిన హీరాసుఫాదిరి గుఱిచేసి యాతనియశమున కొకకళంకము నాపాదించుచున్నాడు. ఈయనవిమర్శజ్ఞానము స్థూలమైనది. గాని సూక్ష్మమైనది కాదు. సదాశివదేవరాయల శాశనములు 1542 మొదలు 1570 వఱకు సామ్రాజ్యమునందు గన్పట్టుచుండుటచేత నిరువదియెనిమిదిసంవత్సరములు పరిపాలనముచేసినట్టు యొప్పుకొనక తప్పదు. అళియరామరాయలు 1565 సంవత్సరములో దల్లికోటప్రాంతమున దక్కనుసుల్తానులతో జరిగిన మహాఘోరయుద్ధమున వీరమరణము నొందినవిషయము సుప్రసిద్ధమైనచరిత్రాంశము. ఇట్లుండ దేశీయుల (హిందువుల) వచనరచనాసంప్రదాయరీతుల నెఱుంగనిఖాండాంతరవాసులయిన తనజాతివారివ్రాతలయం దెక్కుడువిశ్వాసము గలవాడగుట చేత వారివ్రాతలతో హిందూరాజులకు బ్రతిపక్షు లయిన దక్కనుసుల్తానుల దర్బారులలోనుండి యెప్పుడును రామరాయనిపట్ల సౌమనస్యత జూపజాలనిచరిత్రకారుల స్వవచనావ్యాఘాతములను జతపఱచి హిందూరాజుల శాసనములలోని భావములతోను హిందూకవుల కవితారచనములలోని భావములతోను సమన్వయింప బ్రయత్నించి హీరాసుఫాదిరి స్వచ్ఛములయిన భావములకు విరుద్ధములయినట్టియు, అపార్ధముల నిచ్చునట్టియు వ్యాఖ్యానములనుగావించి యాభాస సిద్ధాంతములను జేసి యిమ్మహాపురుషవర్యుని జీవితమును యశమును గళంకపఱచుటకు సాహసించెను. సదాశివరాయలమరణానంతరము నూఱు సంవత్సరములవెనుక నీదేశమున సంచారముసలుపు చున్న పోర్చుగీసుబాటసారి యగు "ఆంక్విటిల్ - డు - ఫెర్రాన్" అను నాతడు "సదాశివరాయల మరణానంతరము రామరాయలు రాజుగా బేర్కొనబడియె" ననివ్రాసినా డట ! ఫ్రెడరిక్కనునాతడు రామరాయలు రాజసింహాసన మధిష్ఠించినాడనియు రాజని వ్యవహరింపబడినా డనియు వ్రాసినా డట ! అందువలన రామరాయలు రాజధానీనగరమున బట్టాభిషిక్తుడైనట్టు గన్పట్టుచున్న దని 'హీరాసు' వ్రాయుచున్నాడు. [1] మొదటిబాటసారి యీదేశమునసంచారము సలిపినకాలముననే అనగా గొంచెమించుమించుగా 1687 మొదలు 1704 వఱకు గల నడిమికాలమున నున్నమైసూరుప్రభు వగుచిక్క దేవరాయని కంకితముగావింపబడిన చిక్కదేవరాయవంశావళి యనుగ్రంథమున దిరుమలార్యు డనుకన్నడకవి.

"తుళవకుళదీశ్వరనరసవీర నరసింగకృష్ణాచ్యుతంబరాయ దృవరతఱువాయిం ముదదోళిళయం పూఱిది సదాశివరాయంగె సేనానియెనిసిదఆంధ్రకులదరామరాజం, నిజరాజంగెద్రనిడాంధ్రకర్ణాట సామ్రాజ్యమం, సౌర్జ్య పతికార్యదోళర్పితప్రాణననిసి, ఒర్మయుత్తరదిగ్విజయదోళుద్వృత్త యవనసేనాచక్రమ నోక్కలిక్కి యశశ్శేషనప్పిను,........."

అనగా దుళువకులములోనివారయిన యచ్యుతరాయాదులకు బిమ్మటసదాశివరాయలు రాజ్యమునకు వచ్చెననియు వానిసేనాధ్యక్షుడును, ఆంధ్రకులము వాడయినరామరాజు ద్రవిడాంధ్ర కర్ణాటసామ్రాజ్యమును బరిపాలింపుచు బతికార్యముకొరకు బ్రాణము లర్పించి యుత్తరదిగ్విజయసందర్భమున మహమ్మదీయులతో జరిగినయుద్ధములో మృతి జెంది యశశ్శేషు డయ్యెననియు వ్రాసియున్నవాడు. ఈతిరుమలార్యకవి చిక్కదేవరాయనికి బ్రధానమంత్రి. ఆరవీటివంశమునకు బ్రతిస్పర్ధులుగా నుండి తద్వంశీయు డైనమూడవ శ్రీరంగరాయలతో యుద్ధముచేసి జయించి స్వాతంత్ర్యమును బొందినవాడు. [2] సదాశివరాయలను త్రోసిరాజని పరిపాలనచేసినవాడు రామరాయలుగాక వానితమ్ము డయినయెఱతిమ్మరా రాజని (తిరుమలదేవరాయలు) కూడ వ్రాసియున్నవాడు. ఈయభిప్రాయముకూడ సత్యముగా గనుపట్టదు. ఎందుకన 1568 సంవత్సరములో సదాశివరాయలు తనసామ్రాజ్యములోని దక్షిణభాగమున సంచారముచేసి యనేకసామంత నృపతులవలన కట్నములను కానుకలను బొందినవాడు. వారిలో ముఖ్యుడు మధురమండాలాధీశ్వరు డయినకృష్ణప్పనాయకుడు. పవిత్రమైన కావేరీతీరమున శ్రీరంగనాథస్వామివారి సన్నిధిని అనేకసామంతనృపతులతోడను, విద్వజ్జన పరివారజనంబులతోడను, మంత్రులతోడను, గురుజనంబులతోడను సదాశివదేవరాయలు గొలువుదీర్చియుండ గృష్ణప్పనాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి కైంకర్యములకొఱకు కృష్ణాపురమును వానిసమీపమున నుండుమఱితొమ్మిది గ్రామములతోగూడ సమర్పింపవలసినదిగా బ్రార్థింప నతడంగీకరించి యట్లుగావించె నని కృష్ణాపురశాసనమువలన స్పష్టముగా దెలియుచున్నది. [3] దీనిని గుర్తించియు దనగ్రంథమున నుదాహరించియు, హీరాసుఫాదిరి యిందునకొకవిపరీతమైన వ్యాఖ్యానము చేయుచున్నాడు. విజయనగరసామ్రాజ్యనిర్వహణ ప్రచారమునకై యనేకసంవత్సరములక్రిందట ఖైదుగావింపబడినచక్రవర్తి విగ్రహమునుసామ్రాజ్యప్రజలకు జూపింపవలసివచ్చినదట ! ఇయ్యది తిరుమలదేవరాయల రాజనీతినైపుణ్యతను మాత్రమే దెలుపు నట ! 1568 సంవత్సరములో తిన్నెవెళ్లిమండలమున మరియొక్కటియు, 1569 లో కోయంబత్తూరుమండలమున నొకటియు, 1570 లో మధురమండలములో నొకటియు, నెల్లూరు మండలములో నొకటియు, సదాశివదేవరాయలు చక్రవర్తిగా నున్నట్టుగ నాతనిపేరిటశాసనములు గన్పట్టుచున్న వటగాని దురదృష్టవంతు డయినయాచక్రవర్తి యంతకుబూర్వమే మరణము జెందియుండెననియు, అప్పటి కాతనిమరణవార్త యాదూరప్రదేశములకు జేరియుండలే దనిహీరాసు వ్రాయుచున్నాడు. ఇరువదిఎనిమిది సంవత్సరములపరిపాలనానంతరము సదాశివరాయలెట్టిమరణము జెందె ననిప్రశ్నింపుచు తనకుదానె యిట్లు ప్రత్యుత్తరము నిచ్చుచున్నాడు. మనకాలముననున్న సూయల్‌దొరగారు సదాశివరాయలను సంహరించి తిరుమలదేవరాయల సామ్రాజ్యమాక్రమించి పరిపాలించినాడనివ్రాసినా డట ! వెంకయ్యకృష్ణశాస్త్రిగా ర్లంగీకరించినారట! కాని తిరుమలదేవరాయలకాలమున నున్నఫ్రెడరిక్కను పోర్చుగీసుబాటసారి సదాశివరాయలను సంహరించినవాడు తిరుమలదేవరాయనికొడు కనివ్రాసినా డట! ఈరాజహత్య గావించినవాడు తిరుమలరాయలే యనిచెప్పుటకు సమకాలీనమగు ప్రత్యక్షప్రమాణ మేదియేలేకపోయినను, ఈహత్య కాతనినొకప్రోత్సాహకునిగా నేవిధ మయినసందేహములేకుండ నిశ్చయముగా జెప్పవచ్చు నట! ఎందుకన: ఆంక్విటిల్ - డు - ఫ్రెర్రాన్ అనునాతడు తిరుమలరాయనికొడుకు సదాశివరాయని వానికుమారుని జెరలో నుంచి సదాశివరాయని కుమారుని జంపినా డనివ్రాసినా డట ! చంపబడినవాడు కుమారుడో తండ్రియో తెలియరా దట! హీరాసునకు మరియొక చిక్కు గన్పట్టినది. తిరుమల దేవరాయలకు నల్వురుకొమాళ్లు గలరు. ఏకుమారునిపై నేరమారోపించవలయునో బాగుగా నాలోచింపవలసివచ్చినది. తిరుమలదేవరాయని కుమారులలో నెవనిపై యీరాజహత్య మోపవలసియుండునో సరిగా నిర్ణయించి చెప్పుట సులభసాధ్యము కాదట! వానినల్వురుకొమాళ్లలోను బెద్దవాడయిన రఘునాథరాయలపేరు రక్షస్త్స గిడి (తల్లికోటసమీపమున రక్షస్సు - తగిడియను రెండుగ్రామములు గలవు) యుద్ధానంతరము వినంబడ కున్నందునను, ఆయుద్ధమున నాతడు గాయపడినందునను తిరుమలదేవరాయలకు బూర్వమె యాతడు మృతినొంది యుండు నని యూహింపవచ్చునట. రంగరాయలు రామరాయలు, వేంకటపతిరాయలు మూవురు మాత్రముబ్రదికియుండి రట! సదాశివదేవరాయలను ఖైదుగానుంచిన చెరసాల చంద్రగిరిదుర్గమే యైనయెడల నాచెఱసాలకు వేంకటపతిరాయలే జైలరుగా (కారాగృహాధికారి) నుండుటచేత భావికాలమున నారవీటివంశీయుడై మహాప్రఖ్యాతితో బరిపాలనముచేసిన రెండవవేంకటపతి దేవరాయలనే కడపటరాజ్యముచేసిన తుళువకుల ప్రతినిధి యగుసదాశివదేవరాయల మరణమునకు నుత్తరవాదిగా జేయవచ్చునట! ఎందుకన, నూరేండ్లతరువాత నున్నఆంక్విటిల్ - డు - ఫెర్రాన్ రెండవ వేంకటపతిరాయలే సదాశివరాయనికుమారుని జంపించుటకును హక్కుదారుడైనరాజును సింహాసనభ్రష్టునిజేయుటకును కారకు డనివ్రాయుటచేత తమయూహను స్థిరపఱచుచున్నట్టు గన్పట్టుచున్న దట. తుంటిమీద గొట్టిన మూతిపండ్లురాలిన వన్న ట్లున్నది. సదాశివరాయనికుమారుని జంపినవాడనివ్రాసినవ్రాత వీరివాదమున కనగాసదాశివరాయలను జంపినవా డనినిర్ధారించుటకు పరమప్రమాణముగా గైకొనుట యెట్లు? ఇవన్నియు వట్టిదుర్ర్భమతో గూడినయూహాకల్పనలే గాని నిజముగా సదాశివరాయ లెట్లుమరణము జెందెనో సత్యమైనట్టియు, లిఖితమూలక మైనట్టియు బ్రమాణముగా గైకొనదగినసాక్ష్య మేమియు లేకున్నప్పుడు విదేశీయులు పరస్పరము బొందికలేకుండ వ్రాసినవ్రాతలను విశ్వసింపరాదు. ఏదియెట్లున్నను 1570 సంవత్సరమువఱకు సదాశివరాయలు బ్రదికియున్నట్టు శాసనములవలన స్పష్టముగా దెలియుచున్నది. దీని నెందుకువిశ్వసింపరాదో బోధపడ కున్నది. ఈవిషయ మటుండనిచ్చి రామరాయలు సదాశివదేవరాయలను నిజముగా ఖైదుచేసియుండెనా యనువిషయమును విమర్శింపవలసి యున్నది.

సామ్రాజ్యభారమువహించి పరిపాలనము చేయుటకు యుక్తవయస్సువచ్చినవెనుక రామరాయలు సదాశివదేవరాయలను ఖైదులోనుంచెనట! ఇటాలియాదేశస్థు డయినఫ్రెడరిక్కు రామరాయలును వానిసోదరులిర్వురు నిందులకు నుత్తరవాదు లని యనుచుండగా 'కోటో' యనునాతడు రామరాయలొక్కడేకారకు డనివ్రాయుచున్నాడట. కోటోవ్రాసినదేనిజము కావచ్చునని హీరాసు వ్రాయుచున్నాడు. ఎందుచేత నన దమయన్నగా రిట్లుచేయుటకిష్టపడక యాతనిపై తిరుగుబాటుచేసి యుద్ధముచేసి రట. ఇందెంతసత్యము గలదో వెనుక విమర్శించి చూతముగాక! సురక్షితమై, బలాడ్యమై యినుపతల్పులచే నొప్పెడునొకదుర్గములో నుంచి కావలివాండ్రను గాపుంచెనట. కాని యతడాదుర్గ మెక్కడనున్నదో వ్రాసియుండలే దట. ఇట్టిపని 1550 - 1552 సంవత్సరములనడుమ నెప్పుడో జరిగియుండె ననిఆంక్విటిల్ - డు - ఫెరాన్ తెలుపుచు దరువాత నిట్టిఖైదులో 13 సంవత్సరము లుంచబడె ననివ్రాసి యున్నాడట! సదాశివదేవరాయల మరణానంతరము రామరాయలాక్రమించి రాజ్యము పరిపాలించెననివ్రాసినవా డితడే ఇతనిమాటలను నమ్మిహీరాసుఫాదిరి 1550 మొదలు 1563 వఱకు సదాశివదేవరాయలు రామరాయలచే ఖైదుగావింపబడి యుండె నని వ్రాయుచున్నాడు. ఈదురదృష్టవంతు డయినరాజు సంవత్సరమున కొకతూరి మాత్రము రత్నసింహాసనము పై గూర్చుండ బెట్టబడి ప్రజలకు బ్రదర్శింప బడుచుండెనని ఫ్రెడరిక్కు వ్రాసి యున్నా డట! [4] అట్లు చక్రవర్తిని ప్రదర్శించుపద్ధతి 1563 వ సంవత్సరము తరువాత విరమింపబడిన దట! కాని సంవత్సరమునకొకసారి మూవురుసోదరు లాతనిచక్రవర్తినిగా శిరసావహించి పరిపాలనచేయుచున్నట్టు దెలుపుటకుగాను నాతనిసందర్శించి నమస్కరించు చుండిరని 'కోటో' వ్రాయుచున్నాడట ! 1565 లో జరిగినతల్లికోట యుద్ధములో రామరాయలు మరణముజెందెనుగదా. ఇంక నడుమనున్న దొక్కసంవత్సరము, 1564 మాత్రమె గదా. అట్లు మూవురుసోదరులు చక్రవర్తిని సందర్శించి పాదాక్రాంతులయిన దీయొక్కసంవత్సరమె కాబోలు ! ఈహీరాసు ఫాదిరియె మఱియొకచోట "తల్లికోటయుద్ధములో రామరాయలు మరణము నొందుటయు దమకు నపజయము గలుగుటయు విని పాఱివచ్చి తిరుమలదేవరాయలు తనయొక్కయు, తనసోదరులయొక్కయు భార్యలను పుత్త్రికాపుత్త్ర సంతానమును, మంత్రివర్గమును, సామ్రాజ్యములోని సామంతప్రభువర్గమును సేనానులను, సైన్యములను, అదివఱకు 6 సంవత్సరములనుండి కఠినకారాగారశిక్ష ననుభవించుచు నదియె ప్రథమపర్యాయము ప్రజలకు గన్పఱచబడిన చక్రవర్తి సదాశివదేవరాయలను వెంటగొని విజయనగరమునుండి తరలించుకొనిపోయినట్లు ఫ్రెడరిక్కు దెలిపి యున్నా"డని వ్రాసియున్నాడు. [5] ఎవరివ్రాతనమ్మవలసినది?

ఇట్లుపరస్పరముపొందికలేక విదేశస్థులువ్రాసినవ్రాతలను సరిగావిమర్శింపక తనకిష్టమువచ్చినట్లుగా జతపరచి దుర్ర్భమలపాలయి రామరాయల శీలమును గుఱించి దురభిప్రాయము గలుగునటులుచేయ బ్రయత్నించుట మిక్కిలిశోచనీయముగా నున్నది. తాము స్వయముగా నెఱిగియుండి వ్రాసినవిగాక యెవ్వియో లోకప్రవాదముల నార్వీటివంశప్రభువుల నసూయతో జూచువారినుండిగాని సామ్రాజ్యవైరులుగ నుండిన విమతస్థులగు హైందవేతరజాతివారలనుండిగాని విని పరస్పరవిరుద్ధము లగువ్రాతలువ్రాసిన విదేశస్థులవ్రాతలను నమ్ము విదేశస్థుడైనయీచరిత్ర కారునకు సదాశివదేవరాయని కాలమున వ్రాయబడిన శిలాతామ్రశాసనములలోని వాక్యములసత్యత్వమెట్లు బోధపడ గలదు ? అందుచేతనే హీరాసుఫాదిరి యిట్లు వ్రాయసాహసించెను. [6]

"తనపరిపాలనకాలములో రెండవభాగమున, అనగా దానుఖైదులోనున్నప్పుడుసయితము కేవలము తనమంత్రిచేతనేగాక సదాశివరాయలతాను స్వయముగనే యాదేవాలయాదులలో వ్రాయించిన దానశాసనము లనేకములుగల వనుటకు యెంతమాత్రము సందేహములేదు........ ఈమతధర్మములకై లిఖింపబడిన శాసనములలో నధికసంఖ్యాకములు సదాశివరాయలపక్షమున జేయబడిన వైనను బహుశ: రామరాయల యుత్తరువునే పురస్కరించుకొని చేయబడి యుండును."

సదాశివదేవరాయలవారు వజ్రసింహాసనా రూడులై భూమిని పరిపాలించుచుండగా నళియరామరాయలవారి ధర్మ పరిపాలనమున విఠలేశ్వరుని దేవాలయమున బ్రతిష్ఠాపింపబడిన యొకశిలాశాసనము యొక్క ప్రతినితెప్పించి యందు 1519 సంవత్సరములో కృష్ణదేవమహారాయలవారు కొన్ని గ్రామములలో కైంకర్యములకుగాను గొన్నిసుంకములవసూలుచేయుట కనుజ్ఞ నిచ్చియుండుటనుగాంచి యవి చాలకకైంకర్యములు వెనుకబడి నిలిచిపోయినందున భైరవదేవుని కైంకర్యములకుగాను సుంకములకై సదాశివరాయలవారు దానశాసనము వ్రాయించెనని 1557 సంవత్సరములోని యొకశాసనము దెలుపుచున్నది. [7]

ఇట్టిదానశాసనము వ్రాయించినచక్రవర్తి ఖైదులో నుండి యీశాసనమును వ్రాయించె ననిమనము విశ్వసింపవలయునా ? ఎంతవిపరీతవిషయము ? ఇట్టి శాసనములు పెక్కులు గలవని 'హీరాసుఫాదిరి' యొప్పుకొనుచునే యున్నవాడుగావున గ్రంథవిస్తరభీతిచే వాని నిచటనుదాహరింప విరమించుచున్నాను. ఇతడు 1550 లో సదాశివరాయలు ఖైదులోనుంచబడి నట్లును, ఇతనిఖైదుచేసి నందులకై రామరాయలసోదరు లయినతిరుమలరాయలును వేంకటాద్రియు రామరాయల యధికారమును ధిక్కరించి 1551 సంవత్సరమున దిరుగుబాటుచేసి యుద్ధముచేసి రట ! ఈసత్య విషయమును గోల్కొండదర్భారులో నుండునొకయనామధేయ చరిత్రకారుడు వ్రాసినా డట ! కీర్తిశేషు లయినకృష్ణశాస్త్రిగారు సత్యవిరుద్ధ మయినదిగావున విశ్వాసపాత్రము కాదనిత్రోసిపుచ్చినా రట ! కాని మనమదుసత్యముకలదని యొప్పుకొనక తప్పదని హీరాసుఫాదిరి నొక్కి వక్కాణించుచున్నాడు.

"అహమ్మదునగరసుల్తానుతో బోరాడుచున్న విజాపురసుల్తానుకు దోడ్పడుటకై రామరాయలు రాజధానీ నగరమును విడిచిపోయినపుడు, ఆదవానిప్రభుత్వమున నియోగింపబడిన తిమ్మరాజు, గోవిందరాజు ననుసోదరు లిర్వురును నాతడు లేకుండుట సందుచేసికొని యాదవానియాధిపత్యము నాక్రమించుటయె గాక" "కొంతసైన్యమును సమకూర్చుకొని తమయధికారమునకు ననేకమండలములవారిని లోబడునట్లుచేసి వశ్యులను గావించుకొని రట. రామరాయలు విజయనగరమునకు దిరిగివచ్చినతోడనే తనసోదరులకు జాబులుపంపెనట ! కాని వారు తమబలమునే యాధారపఱచుకొని యాతని జాబుల నలక్ష్యభావముతో నుపేక్షించి రట ! వారల జయించుటసాధ్యము గాక రామరాయలు గోల్కొండవారి సాహాయ్య మపేక్షింప బురికొల్ప బడె నట ! అంత రామరాయలు గోల్కొండకు సహాయముకొఱకు రాయబారులను బంపగా ఇబ్రహీమ్‌కుతుబ్షా యారువేలపదాతి సైన్యముతో కాబూల్ ఖానుని పంపె నట ! ఈసైన్యము విజయనగరముచేరినతోడనే రామరాయలు సిద్ధిరాజు తిమ్మరాజును, నూరుఖానుని, బిజ్లీఖానుని వారిసైన్యములతో కాబూల్‌ఖానుని సైన్యములను గలిసికొని పితూరీదార్లపై దండయాత్రసాగించి జయించి పట్టి తీసికొని రావలసిన దనియుత్తరువుచేసె నట ! వారు ప్రభుత్వ సైన్యములను గెలువంజాలక యాదవానిదుర్గములో దాగొని యుండ నాఱుమాసముల వఱకు ముట్టడించి వారిని విడువక పోగా నాహారపదార్ధములు చిక్కనందున వారుక్షమింపవలసినదని విజయనగరమునకు విజ్ఞాపనలను బంపుకొని రట ! వారలను క్షమించి రామరాయలు తనసైన్యములను రప్పించుకొని కాబూల్‌ఖానునకు బహుమానము నొసంగిపంపెనట. అతడు గోలకొండ జేరిసుల్తానువలన 'ఐన్ - ఉల్ - ముల్కు' అనుబిరుదమును గాంచె నట !"

ఈపైవిధ మంతయు నాయనామధేయచరిత్రకారుడు దెలిపినది. [8] ఈయనామధేయ చరిత్రకారునకు రామరాయల తమ్ములపేరు లయినను సరిగా దెలియ కుండెను. తిరుమలరాజు, వేంకటాద్రివారిపేరు లయియుండగా వానిందెలిసి కొనంజాలక తిమ్మరాజు, గోవిందరాజు నని వక్కాణించినాడు. తిరుమలరాజును తిమ్మరాజని వ్యవహరింపగూడదా యని యందురేని గోవిందారా జనుపేరుగలవా రారవీటివంశమువారిలోనే గానరారే ? విజయనగరసామ్రాజ్యమునందు లక్షలకొలదిసైన్యము లుండగా వీనితోజయింపలేక రామరాయ లంతటివాడు గోల్కొందవారిసహాయమును గోరవలసివచ్చినదా ? వారు పంపినది యాఱువేల సైనికులనా ? ఈయాఱువేల సైనికులు వచ్చినతోడనే శత్రువులు వీరిని జయించుట సాధ్యముకా దని శత్రుసైన్యము లాదవానిదుర్గమున దాగొన్నారా ? పాపమీయనామధేయచరిత్రకారు డాదవానిదుర్గ మెంతసైన్యమును దనలో నిముడ్చుకొనశక్తిగలిగియున్నదో తెలిపియున్నయెడల నెంతో చక్కగా సత్యము బైటబడియుండునుగదా ! ఈయనామధేయ చరిత్రకారు డిట్టియబద్ధమును గల్పించి వ్రాసినందుకు మాకు వింతలేదుగాని హీరాసుఫాదిరి యీయబద్ధములను సత్యములని నొక్కి వక్కాణించుట వింతగొల్పుచున్నది.

1551 సంవత్సరమున విజాపురసుల్తానునకును, అహమ్మదునగరసుల్తానునకును జరిగినయుద్ధములో అహమ్మదునగరమునకు దోడ్పడుటకయిరామరాయలు దండయాత్రకు బోయియుండె ననియు, అట్లుపోయి విజాపురసుల్తాను వగురాచూరు, ముదిగల్లుదుర్గములను జయించి అహమ్మదునగర సుల్తానుతో జరిగినయొడంబడిక ప్రకారము వానిని స్వాధీనపఱచుకొని కొంతసైన్యముతో దనతమ్ముడయిన వేంకటాద్రి నచట నిలిపి తాను విజయనగరమునకు మరలివచ్చి ననియు, తరువాత వేంకటాద్రి సాహాయ్యముతో నహమ్మదునగరసుల్తాను షోలాపురమును ముట్టడించి కొలదికాలములోనే స్వాధీనము చేసికొనియె ననిఫెరిస్తా మొదలగువారి గ్రంథములనుండియె హీరాసుఫాదిరి యెత్తి వ్రాసి యుండియు బైయనామధేయచరిత్రకారుని వ్రాతలోసత్య ముండె ననియెట్లు విశ్వసింపగలిగెనో యదియే వింతగా నున్నది. [9] వీరివిమర్శజ్ఞాన మల్పమయిన దనిచూపుట కీయొక్క విషయమే చాలును. ఇట్టివి వీరిగ్రంథము నందుబెక్కులు గలవు. హీరాసువ్రాతలప్రకారము రామరాయ లెప్పుడు పట్టాభిషిక్తు డయ్యెనో సత్యము తెలిసికొన బ్రయత్నింతము. 1563 సంవత్సరాంతము వఱకు బదుమూడు సంవత్సరములు పరిపాలనము జరిపిన వెనుక రామరాయలపాలనము తృప్తికరమగునట్లుగా దృడపడినందున సదాశివదేవరాయలు మృతినొంది నట్లు వదంతులు వ్యాపింపజేయబడిన వట. పిమ్మట దురాశాయుక్తుడగు నీతడుతనంతటతానే రాజపట్టము గైకొనియె నట ! ఆంక్విటిల్, సీజరుఫ్రెడరిక్క వ్రాసినదానినిబట్టి రామరాయలు విజయనగరములో బట్టాభిషిక్తుడయినట్లే తమకు గన్పట్టుచున్న దట. ఒకశతాబ్దమునకు దరువాత ననగా 1688 లో 'మనుప్సి' అనునతడు రామరాయలను నరసింగరాజ్య (విజయనగర రాజ్య) చక్రవర్తి యని వ్రాసినా డట ! 1565 లో ముద్రింపబడినయొక పూలవరహాపై రామరాయలపే రొకప్రక్కన గన్పట్టుచున్న దట. 1562 - 63 సంవత్సరమునాటి దేవదుర్గ తామ్రశాసనములో రామరాయలు సర్వాధిపత్యము వహించి విజయనగరములో బరిపాలించుచుండె నని వ్రాయబడిన దట. ఆసంవత్సరములోనే యొకసామాన్యగృహస్థుని శాసనములో సదాశివరాయలపే రెత్తకుండ రామరాయలు సామ్రాజ్యమును బరిపాలించుచుండెనని వ్రాయబడిన దట. రామరాయలు చక్రవర్తిబిరుదములు వహించినట్లుగా సూచించునవి రెండుశాసనములు గలవనియు వానిలో నొకటి 1543లో పెనుగొండనగరమున "రత్నసింహాసనా రూడుడై రాజాధిరాజ రాజపరమేశ్వరవీరప్రతాప మహారాయరామదేవ అయ్యంగారు పరిపాలనము చేయుచుండగా" అని వ్రాయబడియున్న దనితెల్పుచు నియ్యదికల్పితశాసన మనియు గల్పితశాసన మయ్యును రామరాయలను విజయనగరచక్రవర్తియని తెలుపుచున్నదనియు, మఱియొకటి 1565 సంవత్సరములోనిది సదాశివరాయలపేరెత్తక విద్యానగరసింహాసనాధిపతులయిన కుంతలాధిపతి రాజాధిరాజ రాజపరమేశ్వర వీరప్రతాపవీరరామదేవరాయ మహారాయలు రత్నసింహాసనారూడులై శాంతియుతులై విశ్వమును బరిపాలించుచుండె నని వ్రాయబడియుండె నట. ఈశాసనములతో బాటు అనంతాచార్యకవి తనప్రపన్నామృత మనుగ్రంథమున కృష్ణరాయలతరువాత పరిపాలనము చేసినరామరాయలను విజయనగరచక్రవర్తి యని వ్యవహరించినా డట ! ఇన్నిప్రమాణములు చూపినప్పుడు హీరాసు గారియభిప్రాయము నిరాకరించు టెట్లని చదువరులకు సంశయము కలుగవచ్చును. కాని వీనిని జాగరూకతతో బరిశీలించినయెడల దుర్ర్భమలపాలుకా జాలము. అనంతాచార్య కవి తనప్రపన్నామృతమున రామరాయలను విజయనగర సార్వభౌమునిగా వర్ణించియుండలేదు. అతడు కృష్ణరాయల యనంతరము గురుభక్తిపరాయణు డైనరామదేవరాయా ఖ్యుడు ధర్మముతో రాజ్యపరిపాలనము చేసె ననిమాత్ర మీక్రిందిశ్లోకమున జెప్పి యున్నాడు.

       "శ్లో. శ్రీరామదేవరాయాఖ్య: కృష్ణరాయాదనంతరమ్
           శశాసరాజ్యంధర్మేణగురుభక్తిపరాయణ:"

ఈక్రిందనే ఒకప్పుడు రామరాయలు తనగురువయిన తాతార్యుని వెంటదీసికొని చంద్రగిరికి వెళ్లె ననిమఱియొక శ్లోకమున నిట్లుచెప్పియున్నాడు.

       "శ్లో. సభూపతిర్మహాతేజా: యయౌచంద్రగిరింప్రతి
           గురుంతాతార్యమాదాయ రామరాయాభిధస్తదా"

ఇంకొకశ్లోకములో రామరాయలసహాయముచేత మహాయశుడయిన దొడ్డయాచార్యుడు శైవశాస్త్రవిదులను జయించెనని యిట్లుచెప్పియున్నాడు.

       "శ్లో. రామరాయసహాయేనమహా చార్యోమహా
           యశా: దుర్జయానపినిర్జిత్యశైవాన్‌శాస్త్రవిదుత్తమ:"

హీరాసుఫాదిరి వీనిని విజయనగరచరిత్రమునకు మూలప్రమాణము లనియర్ధమిచ్చు "సోర్సెస్‌ ఆఫ్ విజయనగర్‌ హిస్టరీ" అను గ్రంథమునుండి యెత్తికొని చూచి వ్రాసి యున్నారు. అందువీని నింగ్లీషునకు తర్జుమాచేసినవారు రామరాయలను విజయనగరచక్రవర్తిగా బేర్కొనియుండుటచేత నిత డట్లు వ్రాసియుండెనే కానిమూలమున నట్లుగానరాదు. [10] పూర్వకాలమున నొకసామ్రాజ్యములోని సామంతప్రభువులు మండలాధిపతులుకూడ దమ పేరిటనాణెములు ముద్రించుకొనుసంప్రదాయానుకరణము గలదు. అందువలన నొక నాణెముపై రామరాయలపేరు కన్పట్టినంతమాత్రమున రామరాయలు విజయనగరసామ్రాజ్యమునకు బట్టాభిషిక్తు డయిన సార్వభౌము డనుటకు బరమప్రమాణము కాజాలదు.

ఇంకశాసనములనుగూర్చి చెప్పవలసినది కొంత గలదు. రామరాయలయెడ దోషారోపణము జేయ దలంచినవారు రామరాయల మరణానంతరమును, సదాశివదేవరాయల మరణానంతరమును, లిఖింపబడిన శాసనములనుండిగాని గ్రంథములనుండిగాని సాక్ష్యమును జూప బ్రయత్నించుటకంటె నాతనికాలమున నాతనిచేవ్రాయింప బడిన శాసనములనుండి గాని గ్రంథములనుండిగాని సాక్ష్యప్రమాణములను జూప బ్రయత్నించుట యుత్తమమార్గము. ఏదేనియొక శాసనములో సదాశివదేవరాయలపేరు లేకరామరాయలపే రుదహరించినంతమాత్రముచేత నద్దాని నాధారపఱచుకొని వానిపేరిటశాసనములు సామ్రాజ్యము నలుప్రక్కల గన్పట్టుచుండగా వానినెల్లను విస్మరించి సదాశివరాయని కారాగృహవాసశిక్షకు బాల్పఱచి యాతని బ్రపంచము మఱచిపోయినతరువాత రామరాయలు దనంతటతానే పట్టాభిషిక్తుడై రాజాధిరాజని రాజపరమేశ్వరుం డని ప్రకటించుకొనియె నని సిద్ధాంతము చేయసాహసించుట సంభావ్య మగునా ? ఈసందర్భమున వీరుచూప గలిగినది యొక్కటి. కర్ణాటికాశాసన సంపుటములనుండి యెత్తిచూప గలిగినారుకాని యది యేసందర్భమున నెవ్వనిచే నేప్రదేశమున బుట్టబడినదో వివర మేమియు దెలిపి యుండలేదు. 1564 సంవత్సరములో వీరప్రతాప సదాశివదేవరాయలు తానుసింహళ ద్వీపమును కొల్లగొట్టితి ననిచిత్తూరుమండలములో తిరుత్తనిగ్రామమున లిఖింపజేసినశాసనము నేలయెత్తి కొనరు ? విజయనగరసామ్రాజ్యమునకు లోబడినమధురమండలాధీశ్వరు లగువిశ్వనాథనాయకుడును, వానికుమారుడు కృష్ణప్పనాయకుడును 1560 సంవత్సరము మొదలుకొని 1570 సంవత్సరమువఱకు ప్రతిసంవత్సరము వ్రాయించిన దానశాసనములు సదాశివదేవరాయలు రాజ్యముచేయుచున్నట్టు లాతని నామము గన్పట్టుచుండగా వానిం బెడచెవిం బెట్టనేల ? పెడచెవిని బెట్టుటయెగాదు; విజయనగర సామ్రాజ్యములోని హిందూప్రజలు సదాశివదేవరాయలు మరణముజెందె ననియూహించి యాతని మఱచిపోయి రామరాయలనే విజయనగరచక్రవర్తిగాబేర్కొని నప్పుడు ఫెరిస్తా మొదటివానినిగుఱించి యేమియు జెప్పక రామరాయలనే ప్రత్యర్ధిసామ్రాజ్యప్రభు వనివ్రాయుట వింతయేమియులే దట ! నిజాముశాహి రాజులచరిత్ర గ్రంథ మగు 'బురహాన్ - ఇ - మాసీర్‌' అనుగ్రంథమునువ్రాసిన 'ఆలీఇబుఅజీజ్‌అల్లాతపతాబాయి' హిందువులు మఱచిపోయినను తానుమాత్రము మఱువక యెచటనో యొకటి రెండుప్రదేశములం దక్క గ్రంథమునంతటను రామరాయల పేరునకుమాఱుగా సదాశివదేవరాయల నామమునే వ్యవహరించు చుండుట వింతగా గన్పట్టలేదు కాబోలు !

'ఫెరియా - యి - సౌజా' అనునాతడు సదాశివరాయలు కర్ణాటరాజనిప్రశంసించినా డటగాని 1559 లో తనకు దెలిసినవిజయనగరరాజు రామరాయ లొక్కడేయని తెలిపినవా డట !

రామరాయలమంత్రియు అనుకూలమిత్రుడు నగురామయామాత్య తోడరమల్లు తన 'స్వరమేళకళానిధి' యను గ్రంథమున నుదాహరించిన విషయము బహుశ: ఈకాలమునె దెలుపు నట.

అతడు తనమంత్రిచేవినిర్మితమైన 'రత్నకూట^ మను రాజభవనము గలిగియుండెను. దేవతాభవన మగువైజయంతమును మించి నిర్మింపబడుటచేత నాతని కాశ్చర్యమును గొల్పుచుండె నట ! ఈరాజభవనము హంసలతోగూడి చల్లనైనసలిలసరస్సులనుగలిగి చిత్రప్రతిమలచే నలంకరింపబడినట్టి విశాలములయిన యారామములతో జుట్టుకొనబడి యుండె నట.

ఈకాలముననే 1559 రామరాయలు రాజ్యాంగవ్యవహారముల నన్నిటిని తనసోదరుల కప్పగించి తాను సంగీతసాహిత్యగోష్టిలో నుండె నట.

"ఈరత్నకూట భవనమున నాసీనుడై యుండి సంగీతసాహిత్యాదివిద్యలం దాఱితేఱిన పండితులతో దనకాలమును వినియోగించు చుండెనని రామయామాత్యుడు నుడువుచున్నాడు. రామరాయలు సంగీతమునందును వీణావాద్యమునందును నత్యంతాభిలాషకలవా డని 1589 నాటి రెండవవేంకటపతిరాయల శాసనము దెలుపుచున్న దట. మఱియు నీకాలముననేకాబోలు తనగురువును శ్రీనివాసార్యుని పుత్రుడునగు తాతాచార్యులతో చంద్రగిరిదుర్గమునకు బోయితనవిరామకాలమును శాస్త్రార్ధచర్చల నాలించుటయం దంకితముచేసి యుండు నట. విరామకాలమునందు గడపినయీ కడపటిసంవత్సరము లొక శతాబ్దముదాటినవెనుక 'మనుస్సి' వ్రాసిన తన 'Memoirs' అను గ్రంథమున నుదాహరించి యున్నవాడట !"

ఈవిభాగమైనవెనుక దొరతనమువిషయమైగాని మఱియేవిషయమైగాని యేమిజరుగుచున్నను జోక్యముకలిగించు కొనక సుఖతరమైనజీవితమును గడపె ననియాతడు వ్రాసియున్నాడట ! తల్లికోటయుద్ధమునకు బూర్వపు దినములలో సర్వాధికారముగల మంత్రిత్వ పదవియు, రాజ్యాంగమును తిరుమలరాయల హస్తగతము గావింపబడె నట. ఇత డిట్టిపదవికివచ్చుటచేత కొండవీటిరాజ్య ప్రతినిధిప్రభుత్వపదవి రామయామాత్యునికి బహుశ: సమర్పింపబడియుండు నట. ఈనూతన ప్రభుత్వపరిణామము నందువేంకటాద్రి సకలసామ్రాజ్య సైన్యాధిపత్య మందుంచబడె నట. ఈపై విషయములను వ్రాయుచు హీరాసు మరలతలక్రిందుగ బోల్తా కొట్టు చున్నాడు.

స్వరమేళకళానిధిగ్రంథము రచింపబడినది 1559 గాక 1549 అయి యున్నది. ఈసంగతియందే తెలుపబడి యున్నది. [11]

        "శ్లో. శాకేనాత్రధరాధరాబ్ధిధరణీగణ్యే చసాధారణే
            వర్షేశ్రావణమాసిన్మిలతరేపక్షే దశమ్యాంతిథౌ
            రామామాత్యవినిర్మితస్వరదతోస్సడ్గతిరత్నాకరాత్
            స్సోయంమేళకళానిధిర్మతిమతామాకల్పమాకల్పితాన్."

            అనుశ్లోకము గ్రంథముచివరను జేర్పబడి యున్నది.

సదాశివదేవరాయలు పట్టాభిషిక్తు డయినవెనుక నేడెనిమిది సంవత్సరములలోపలనే స్వరమేళకళానిధి ప్రారంభింపబడి 1549 లో ముగింపబడియుండగా మఱిపదిసంవత్సరముల తరువాతనే రచింపబడినట్టు తలంచుచున్నాడు. వైజయంతమును మించినసౌధరాజ మనివర్ణింపబడిన రత్నకూటము 1549 సంవత్సరమునకుబూర్వమె రామయామాత్యునిచే నిర్మింప బడినది. అంతకుబూర్వమె రామయామాత్యుడు కొండవీటిరాజ్యమునకు బాలకుడుగా నియమింపబడి బ్రాహ్మణులకు నగ్రహారము లొసగుట కధికార మీయబడినవాడు గావున నందుకు దనకృతజ్ఞతను జూపుటకుగాను సంగీత శాస్త్రమునందు వివాదాస్పదములుగా నుండువానివిషయమైయొక సంగీతశాస్త్రగ్రంథమును 'స్వరమేళకళానిధి' యనుపేరిట రచించి రామరాయల కంకితముచేయుటకు నిశ్చయించుకొంటినని యాగ్రంథమునందే వక్కాణించి యున్నాడు. ఇయ్యది రామరాయలు తనసామ్రాజ్యపరిపాలనమును ముగించి విశ్రాంతిగైకొన్నకాలముగా దనిస్పష్టముగా నాగ్రంథమె తెలుపుచున్నది. సత్యమిట్లుండగా సమస్తసామ్రాజ్య పరిపాలనాభారము నంతయు సోదరులభుజములపై నిడి రామరాయలు 1559 నుండి విశ్రాంతిగైకొని పండితగోష్టితో గాలము గడపెనని యొకమూల వ్రాయుచు మఱియొకమూల 1563 లో దురాశాప్రేరితుడై రాజ్యమాక్రమించి పట్టాభిషిక్తుడై తానేచక్రవర్తిగా బ్రవర్తించె ననుట యెంతహాస్యాస్పదమై యుండెనో చదువరులె గ్రహింపగలరు. ఇట్టిదురభి ప్రాయములను బ్రకటించుట నాటి హిందూసామ్రాజ్యసంరక్షణకొఱకు రామరాయాదు లవలంబించిన ప్రాచీన సంప్రదాయపద్ధతులమార్గ మెఱుంగని విదేశీయు డగుటయే ముఖ్యకారణముగా గ్రహింప దగియుండును. ఇవన్నియు హీరాసుస్వకపోల కల్పనలేగాని యిందెంతమాత్రమును సత్యముగానరాదు. రామరాయలు సదాశివదేవరాయని నెన్నడును జెఱసాలం ద్రోచి యుండలేదు. సామ్రాజ్యములోపలను వెలుపలను సామ్రాజ్య శత్రువులు బలిసియుండుటచేత చక్రవర్తిని గాపాడుకొనుట తనకు విధ్యుక్తధర్మ మనుకొనియె రామరాయలు తనప్రాణ మున్నంత వఱకు భద్రముగా గాపాడుకొనుచు వచ్చినాడు. ధర్మరాజు నకు భీమార్జును లట్ల రామరాయలకు తిరుమలరాజును వేంకటాద్రియు భక్తివిశ్వాసములతో సామ్రాజ్య సంరక్షణమునందు దోడ్పడుచువచ్చిరేగాని యెన్నడు నాతనిధిక్కరించి యుద్ధములు సలుపుటకు బ్రయత్నించి యుండలేదనుట సత్యము.





  1. The Aravidu Dyanasty of vijianagar, p. 37
  2. Sources of vijianagar History, p. 302 - 303
  3. Ep. Ind., IX, p. 340 - 341. V. V. 44 - 45, 70, 96 and 102 - 4.
  4. The Aravidu Dynasty of vijianagar, p. 31 - 32.
  5. I bid p. 221
  6. The Aravidu Dynasty of vijianagar page 41.
  7. Ep. Carn, XI, Mk. 1
  8. The Aravidu Dynasty of vijianagar p. 33
  9. The Aravidu Dynasty of vijianagar p. 84.
  10. Sources of Vijianagar History, p. 202.
  11. Sources of vijianagar History p. 190