అళియ రామరాయలు/ఐదవ ప్రకరణము
ఐదవ ప్రకరణము
విఠలునిదక్షిణదేశ దండయాత్ర
సదాశివదేవరాయనికి బూర్వము విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన యచ్యుతదేవరాయలు జయించినది మొదలుకొని తిరువడిరాజ్యము (Travancore) విజయనగరసామ్రాజ్యమునకు గప్పముగట్టుచుండెను. 1541 సంవత్సరమున నచ్యుతదేవరాయలు మరణము జెందుటయును, విజయనగరమున సలకముతిమ్మరాజు రాజ్యము నపహరించుటకు బ్రయత్నించుటయు నేతన్మూలమున సంభవించిన విప్లవమును బురస్కరించుకొనియు దిరువడిరాజ్యమును బరిపాలించుచున్న 'ఉన్నికేరళవర్మ' యను నామాంతరము గలభూతలవీరశ్రీవీరకేరళవర్మ యనురాజు కప్పమును గట్టుట మానుకొనియెను. అదియునుంగాక యాకాలమున విజయనగరసామ్రాజ్యసామంతనృపతులలో నొక్కడగువిశ్వనాధ నాయకుడు మధురాపురము రాజధానిగా బాండ్యమండలమును బరిపాలించు చుండెను. ఈతనిపరిపాలనమునకు లోబడి తెంకాశ రాజధానిగా దిన్నెవెల్లిసీమను బరిపాలించు పంచపాండ్యులనువా రాతనికి శత్రువులై యలజడి కలిగించు చుండిరి. మఱియు దూర్పుసముద్ర తీరమున సముద్రమునుండి ముత్తెపు చిప్పలను దేవితెచ్చుట కులవృత్తిగా గలపరవజాతివారు లబ్బెలతో విరోధము పెట్టుకొనిరి. మధురనాయకుడు లబ్బెలపక్షముననుండుటచేత పరవజాతివా రాకాలమున దక్షిణదేశమునకు జేరిన పోర్చుగీసుఫాదిరుల యండజేరి క్రైస్తవమతము నవలంబించి మహమ్మదుమత మవలంబించిన లబ్బెలతో జరుగుపోరాటములందు పోర్చుగీసువారి తోడ్పాటును బొందుచు మధురనాయకుని నలక్ష్యభావముతో జూచుటయెగాక పాండ్యదేశమున గలవరము పుట్టించు చుండిరి. ఇంతియగాక మొదటవచ్చిన ఫ్రాన్సిస్కానుక్రైస్తవ సన్యాసులును, జెస్యూటుక్రైస్తవ సన్యాసులును హిందూదేవాలయములను బగులగొట్టి క్రైస్తవ దేవాలయముల గట్టుటకు బ్రారంభించిరి. ఇందు మొదటివారు సింటుథోము (మైలాపురము) నందును నాగూరు నాగపట్టణమునందును గట్టించిరి. 1542 వ సంవత్సరములో నిట్టిక్రైస్తవాలయములు నాగపట్టణమునందు రెండు నిర్మింప బడినవి. ఆసంవత్సరమున మూడువేలమంది కాథలిక్కుమతము స్వీకరించిరి. ఈపరవజాతివారు క్రైస్తవులయినది మొదలుకొని హిందూప్రభువయిన విశ్వనాథనాయకునికి లొంగియుండక కప్పముగట్ట నిరాకరించిరి. విజాతీయులయిన పోర్చుగీసువారి సాహాయ్య ముండుటవలన వారిని వశ్యులనుగా జేసికొనుట సాధ్యముగాక యాతడు విజయనగర సామ్రాజ్యాధీశ్వరులకు విజ్ఞప్తి పంపించుకొనియెను. అప్పుడు రామరాయలు దక్షిణదేశమున సామ్రాజ్యము బలపడునట్లుగా జేయు టత్యావశ్యక మయినదిగా భావించి పెనుగొండరాజ్యమును బరిపాలించుటకై నియమింపబడిన విఠలరాయలను దనపెదతండ్రి (అవుకుతిమ్మరాజు) కుమారుని సైన్యాధ్యక్షునిగాను చంద్రగిరిరాజ్యమును బాలించుటకు నియమింపబడిన వానితమ్ముని చినతిమ్మరాజు నుపసేనాధ్యక్షునిగను నియమించి కొంతసైన్యముతో దక్షిణదేశమునకు బంపెను. అవక్రపరాక్రమవంతు లగునీయిర్వురుసోదరులును విజయనగరసైన్యములతో దండయాత్ర సాగించి యాసంవత్సరము జూలయిమాసారంభమున దక్షిణమధురాపురమును జేరుకొనిరి. పాండ్యమండలాధీశ్వరు డయినవిశ్వనాథ నాయకుడు వారలకు భక్తిపూర్వకమైన స్వాగతము నొసంగి తానుగూడ గొంతసైన్యము నొసంగుటయెగాక తనకుమారు డైనకృష్ణప్పనాయకుని వారికి దోడుగా నొసంగెను.వీరికి ఇక్కేఱినాయకుడయిన సదాశివప్ప నాయకుడు గూడ దోడ్పడియెను. వీరు తొలుదొల్త దిరువడిరాజ్యముపై దండయాత్ర వెడలుటకు నిశ్చయించుకొని స్వసైన్యములతో బయలుదేఱి 'ఆఱవామొఱి' (Arawboly) యను కనమ మార్గమున దిరువడి రాజ్యములో బ్రవేశించి జయభేరి మ్రోగింప జేసిరి. ఇట్లు విజయనగరసైన్యములు తమరాజ్యముపై దండెత్తివచ్చిన వనువార్త తిరువడిరాజ్యము నందంతటవ్యాపించి యారాజ్యము లోనిప్రజలను భయకంపితులను గావించెను. ఉణ్ణికేరళవర్మ యీభయంకర మైనవార్తను విని కొంతసైన్యమును సమకూర్చెను గాని యాసైన్యము తెలుగుసైన్యములముందు దివిటీ ముందు దీపమువలె నుండెను. విజయనగరసైన్యములు యుద్ధముల యందాఱితేఱినవిగ నుండెను. తిరువడిరాజ్యాధిపతి విజయనగర సైన్యములను జయించుట కష్టసాధ్య మనియెంచి "ప్రాన్సిస్‌గ్షేవియర్" అను ఫాదిరిద్వారా పోర్చుగీసువారితో నొడంబడిక చేసికొని వారిసాహాయ్యమును బడసి విజయనగర సామ్రాజ్యాధి పత్యమును ధిక్కరింప బ్రయత్నించెను. ఫాదిరి ప్రాన్సిస్‌గ్షేవియరును రప్పించుకొని యాతని సాహాయ్యమునకై వేడుకొనగా నాత డిట్లు ప్రత్యుత్తర మిచ్చె నట !
"నేను మతప్రచారకుడనేగాని యోధుడనుగాను. నేనుచేయు సాహాయ్య మంతయు నీకువిజయము కలుగుటకై ప్రార్ధనలు సేయుటతప్ప మఱియొండు లేదు."
అయిన నత డిట్లుతనవాగ్దత్త మీక్రింది విధముగా నెఱవేర్చు కొనియె నట !
అట్లు విజయప్రదము లగుశంఖా రావములతోను, జయభేరి ధ్వనులతోను విజయనగర సైన్యములు 'కొట్టా' లనుగ్రామమును సమీపించునప్పటికి మున్ముందుగ నడచుచున్న ముంగటిసేన యాకస్మికముగా నిలిచిపోవుట చూచి వెనుకనున్నవారు సైనికుల 'నడుపుం' డని యాజ్ఞాపించినను వారు కాళ్లు కదల్పలేకపోయి రట. అంతటవారికి గారణము దెలియ వచ్చెనట ! నల్లనిదుస్తులను ధరించి గాంభీర్యతను గన్పఱచెడు నొకమహానుభావుడు మాయెదుట ప్రత్యక్షమై మమ్ము చీవాట్లుపెట్టి తత్క్షణమె మరలిపొండని పలికె ననివారు చెప్పిరట ! అప్పుడు సేనాధిపతులు, అందుముఖ్యముగా విఠలరాయలు మొదలగువారువచ్చి రాజధానికి బోకుండ దారినడ్డగించినఫాదిరి ప్రాన్సిస్‌గ్షేవియరుయొక్క యాగాంభీర్య దృశ్యమును గాంచి వారుచెప్పిన దంతయు సత్యమేయని భావించి రట. అటువంటి మహాపురుషుని నోటనుండి వచ్చిన యుత్తరువు నాపరాక్రమవంతు డయినమహాశూరు డెట్లతిక్రమింప గలడు ? వెంటనే సైన్యముల వెనుదీయు డనియాజ్ఞాపించె నట ! ఈప్రకారముగా గ్షేవియరు తనప్రార్ధనలమూలమునను కోరికమూలమునను విజయనగరసైన్యముల దండయాత్రనుండి తిరువడిరాజ్యమును సంరక్షించె నట ![1]
ఇయ్యవి పోర్చుగీసుఫాదిరీల దంభోక్తులు ! వీనిని విశ్వసించి హీరాసుఫాదిరి తనగ్రంథమున నెంతోగౌరవ భావముతో నెక్కించి పయిగ్షేవియరుగారి మహిమ నంతయు లోకమునకు బ్రదర్శింపు చున్నారు. విజయనగర సేనాపతులెల్లరును మహావీరులుగాని యఱ్ఱగుడ్డను జూచి బెదరి పాఱిపోవు పసరముల వంటివారు కారు. ఇయ్యదివట్టి యసత్యకల్పనమని నిస్సంశయముగా నుడువ వచ్చును. ఇంతకు నీఫాదిరి గ్షేవియరు తనజాబులలో నెచ్చటను నీమహత్తర విషయమునుగూర్చి యొక్కమాటయైన వ్రాసి యుండలే దట ! అయిన నిదియెంతవిపరీతముగా గన్పట్టినను నిష్పక్షపాత మైనట్టియు, విమర్శాపూర్వక మైనట్టియు చరిత్రముకా దనితిరస్కరింపజాల దట ! ఇందలిసత్య మేమన దిరువడిరాజ్యాధిపతి యైన 'ఉన్నికేరళవర్మను' వశ్యునిజేసికొని ఫాదిరిప్రాన్సిస్‌గ్షేవియరే వానిని గప్పము గట్టకుండ విజయనగర సామ్రాజ్యము నెదుర్కొనజేసి యుండవలయును. ఉన్ని కేరలవర్మకు నీఫాదిరి యత్యంత మిత్రుడుగానుండి యుండెను. ఈపోర్చుగీసుఫాదిరీలు కొందఱు విజయనగరసామ్రాజ్యమునకు గర్భశత్రువులుగానుండి రనికొందఱ వ్రాతలవలన స్పష్టపడ గలదు. వీరిదుర్బోధనలను వినియు, వీరిసాహాయ్యమును నమ్ముకొనియు బరవజాతివారు సుఖముగా నున్నతమస్థితిని జెఱచుకొని యాకాలమున విజయనగరసామ్రాజ్యము నెదుర్కొని కష్టములపా లయిరి. ఈయుద్ధములలో విజయనగరసైన్యము లెచ్చటను నపజయము బొందియుండలేదని స్పష్టముగా వక్కాణించుటకు దగినయాధారములు లేకపోలేదు. 1547 వ సంవత్సరమున (శా. శ. 1469 ప్లవంగనామ సంవత్సరము) ద్విపదబాలభాగవతమును దోనూరికోనేరునాధకవి రచించి యీదండయాత్రలో నుండి విజయము గాంచినయారవీటిచినతిమ్మరాజున కంకితము గావించెను. ఈకవి యీమహావీరునితో గూడ నుండినవాడగుటచేతనే యీదండయాత్రాసందర్భమున చినతిమ్మరాజు పొందినవిజయములను, చేసినఘనకార్యములను నబివర్ణించి యున్నాడు.
"నిలిచివెంటాడితానెమ్మెలుదిరుగు
ఖలశత్రురాజమృగశ్రేణిమీద
శ్రీరంగనాథుని సిరినిల్వ జేసి
తారసి పలుదుర్మదాంధుల నణచి
నాగూరు గైకొని నవమౌక్తికముల
ద్యాగంబు బెట్టితి తనియ నర్థులకు
పరుషత లగ్గలు వట్టించి బోన
గిరి గొంటి వుప్పొంగికీర్తిదై వార
తలచినయంతలోదన్న రుసునాట
గలమహీపతులచే గప్పంబు గొంటి
శరణన్న యాపాండ్యజననాధు రాజ్య
పరినిష్టుతుని జేసి పాలించి రర్థి
బెడిదంబు గలబెట్టుపెరుమాళిమదము
ముడిగించి తెలుగోలుమూకలచేత
పంచతిరుపతుల దర్పంబుల చెరిచి
పంచబంగాళమై పరగంగ జేసి
శరణన్న తిరుపతి జక్కగా నిలిపి
తరుదుగామున్నటియట్ల రాజ్యమున
తోవాళఘట్టాఖ్య దుర్గంబు దాటి
సావిజేరి యనంతశయను సేవించి
అక్షీణగతి నిల్పి తాకన్నె కుమరి
దక్షిణాశాజయస్తంభంబుమెఱయ
రణసమాగమవైరి రాజశార్దూల
గణకంఠనవరక్తకణసిక్తమైన
యడిదంబు గడిగితి వంబోధిలోన
ఈచినతిమ్మరాజేంద్రచంద్రముని
రాచర్కమేరికిబ్రణుతింపదరమె
ధీరులు కేరళతిరువడిపాండ్య
చేరచోళధికక్షితినాధవరులు
తెలివిమీరగజినతిమ్మభూపాలు
కొలువువేళల గాచుకొనియుందురర్థి
శ్రీరాఘవుడుదక్షిణదిగంతమున
నారూడియున్నశౌర్యముపెంపునెఱపి
పౌలస్త్యులంకలో పట్టంబు గట్టి
యాలీల నిల్పలే దయ్యె దిరువడిని
పదపడి యారామభద్రుడే తనదు
కొదువ దీర్చుటకునై గొబ్బున మరల
చినతిమ్మనృపతియై సిరిమించ బుట్టి
ఘనత నిద్దిశయెల్ల గ్రమ్మర గెలిచి
బలిమిమై దిరువడి బట్టంబు గట్టె
కృతకృత్యునకు చంద్రగిరి దుర్గముఖ్య
వితతమహైశ్వర్యవిలసితాత్మునకు
తిరువడిరాజ్య ప్రతిష్ఠాపకునకు
విరచితపాండ్య భూవిభుశాసనునకు
చేర చోళాదికక్షితినాధమకుట
హారనీరాజనహృద్యపాదునకు."
తిరువడిరాజ్యము పంచతిరుపతు లనుపేరుతో నైదుభాగములుగా నుండె ననియు, వానినెల్లను జయించి కన్యాకుమారికడ జయస్తంభము పెట్టించె ననియు, తిరువడిరాజ్యమును జయించియు నారాజు శరణోగతు డగుటచేతమరల నారాజ్య మతనికి నొసంగి తిరువడిరాజ్య ప్రతిష్ఠాపకు డన్నబిరుదము గాంచినట్టు పైకవి వర్ణించి యున్నాడు. [2] [3]
ఈచినతిమ్మరాజుకడ గొంతకాల మాస్థానపండితుడుగా నుండినమహా మహోపాధ్యాయబిరుదాంచితులగు నప్పయ్యదీక్షితులవారు సయితము తనప్రభువుకోరిక ననుసరించి యాదవాభ్యుదయ మనుకావ్యమునకు వ్యాఖ్యరచించి యందు దనప్రభువు వంశమును బ్రశంసించి యీతడు తనవిజయములను సూచించుటకుగాను మలయాద్రి (తిన్నెవెళ్లి, ట్రావన్కూరు మండలములలోని పడమటికనమలు) సమీపమున జయస్తంభమును నెలకొల్పె నని వక్కాణించి యున్నాడు. [4] ఇక్కేరినాయకు డయిన సదాశివనాయకుడుగూడ చక్రవర్తియాజ్ఞను శిరసావహించి కేరళముపై దండెత్తిపోయి విజయమును గాంచి జయస్తంభమును నాటించె నని శివతత్త్వరత్నాకర మనుగ్రంథమున వర్ణింప బడియుండెను. [5]
ఈశివతత్త్వరత్నాకర మనుగ్రంథము మఱియొకగొప్ప సత్యమును వెల్లడించు చున్నది. కృష్ణదేవరాయల కాలమునుండి విజయనగర సామ్రాజ్యమునకు మిత్రులుగా నుండినపోర్చుగీసువారు సదాశివదేవరాయని పట్టాభిషేక కాలమునుండి విజాపురసుల్తానుతోడి మైత్రివలననో లేక స్వప్రయోజనముకొఱకో సామ్రాజ్యముతోడి సఖ్యతను విడనాడి శత్రువులుగ నేర్పడి దక్షిణదేశమునందలి సామంతనృపతులను గప్పము కట్టకుండ జేసి సామ్రాజ్యమును భగ్నపఱచుటకై పన్నాగములు పన్నుచు విశ్వప్రయత్నములు చేసియున్నట్టు మనమూహించుటకు దగినప్రమాణములు గలవు. ఇక్కేఱినాయకు డయిన సదాశివనాయకుని కుమారుడు దొడ్డనంకన్ననాయకుడు జంబూరదేశపాలకు డగు విరూపణ్ణనాయకుడు సామ్రాజ్యమునకు జెల్లింపవలసిన కప్పమును చెల్లింపక శత్రుత్వమును వహించుటను సహింపజాలక వానిపై దండెత్తి వానినోడించి ఖైదిగా బట్టుకొని చక్రవర్తికి నొప్పగించెను. అందుకు సంతోషించి రామరాయలు వానిరాజ్యమును వానిసోదరుని కప్పగించి వానిని దనకొల్వు కూటమున రాజధానీనగరమున నుండ నియమించెను. అతని యాజ్ఞకు బద్ధుడై యత డట్లు గావించెను. అతనికొక్క కుమారుడు కలుగగా నాతనికి రామరా జనిపేరు పెట్టెనట. అళియరామరాయలు తనపేరు వానికుమారునకు బెట్టుటకు సంతోషించి వానిరాజభక్తినిమెచ్చి హోళెహొన్నూరు, మాశూరు, బేళమల్లూరును వానిపాలనమునకు జేర్పించుటయే గాక యాతని నాతనిరాజ్యమునకు బంపివేసెను. కాని పోర్చుగీసువారికిని సామ్రాజ్యమునకు వైరములు పొసగినందున నత్యల్పకాలములోనే వానిని సామ్రాజ్యసంరక్షణసేవకై మరల రప్పించి వానిని వానిసైన్యములను విఠలరాయనికి దోడుగా నుండున ట్లుత్తరు విచ్చివారలనిర్వురును గోవానగరమునందలి పోర్చుగీసువారిని జయించుటకై పంపెను. వార లిర్వురును గోవానగరముపై దండెత్తిపోయి యుద్ధములో వారినోడించుటయెగాక గోవాగవర్నరును బంధీకృతుని గావించి చక్రవర్తికొల్వుకూటమునకు గొనివచ్చిరి. విఠలరాయనికి దోడ్పడి యిట్టిమహాకార్యమును నిర్వహించినందుకు సంతోషించి చక్రవర్తివానికి మహాదేవపురమును బహుమానముగా నొసంగెను. ఈవృత్తాంతము శివతత్త్వరత్నాకరమున దెలుపబడినది. [6]
విఠ్ఠలరాయలు వేంకటాద్రివంటిమహాయోధుడుగాని సామాన్యుడు గాడు. అప్రతిమాన ప్రతాపాడ్యుడు. ఇతడు కృష్ణదేవరాయల పూర్వదిగ్విజయయాత్రలో బాల్గొనియుండినవా డగుటచే నప్పటినుండియు సామ్రాజ్యమున వన్నెగాంచిన యోధులలో నొక్కడుగా నుండెను. ఇతడు రామరాయలకు బెదతండ్రికుమారు డగుటచేత వారలతో సమానవయస్సుగలవా డయియుండు ననుటకుసంశ యింప బనిలేదు.ఇత డట్టివాడగుటచేతనే దోనూరికోనేరునాధకవి తనపద్య బాలభాగవతమున నిట్లభివర్ణించి యున్న వాడు. "సీ. కటకాఖ్యకటకస్థకరటిరాడ్గజఘటా
సంభూతమదభరస్తంభకంబు,
పాండ్యభూమీభృత్సభాసభాజితభటో
ద్భటభుజాబలగర్వభంజకంబు,
మబ్ఖామహాదుర్గతుబ్ఖారపతివపు
స్థాయివేపధుసముద్ధానదంబు,
డిల్లీపురాధీశపల్లవోష్టీభావి
విప్రలాభకదాభయప్రదంబు,
రామనరనాధతిమ్మభూరమణపుత్ర
విఠ్ఠలేశాభిధానపృధ్వీకళత్ర
ధాటికారంభసంభ్రమధ్వనితపటహ
గణసముత్థితధణధణంధణరవంబు"
ఇటువంటి మహాపరాక్రమశాలి యని యెఱింగియే యళియరామరాయ లీకార్యభారము నంతయు నీతనిపై బెట్టి తానును తనసోదరులును దక్కనుసుల్తానులతో నుత్తరదేశమున నాకాలమున బోరాడుచు దనరాజనీతిచాకచక్యత నంతయును గనుబఱచగల్గెను. విజయనగరసామ్రాజ్యమునకును పోర్చుగీసువారికి మనస్పర్ధలు విరోధము లున్నట్టుచూపున దీగ్రంథమొక్కటియె గాదు. ఇయ్యది హిందూపక్షమును దెలుపుప్రమాణగ్రంథము. విఠ్ఠలుడుదక్షిణదేశములో దండయాత్రలునడపుచు దిరువడిరాజ్యాధిపతితోను పోర్చుగీసువారిసాహాయ్యమును బడసిన పరవజాతివారితోను, తదితరసామంతశత్రువర్గము తోడను బోరాడు చున్నకాలమున ననగా 1544 సంవత్సరమున గోవాగవర్నరుగా నున్న 'మార్టిమ్‌అప్ఫాన్సోడిసౌజా' అనునాతడు తిరుమల దేవస్థానమున దేవుని విగ్రహము క్రిందను బంగారము ధనము విశేషముగా స్థాపితమై యున్న దని తెలిసికొని దాని నపహరించుటకై 45 యుద్ధనావలను 27 గురుకెప్టనుల యధికారమున నుండువానిని సిద్ధముగావించి తూర్పుతీరమునకు బంపుటకై ప్రయత్నించె నని ఫెరియాయి - సౌజా వ్రాసియుండె నని హీరాసుఫాదిరియె తెలిపి యున్నాడు. కాని వీరిప్రయత్నము సఫలీకృతముకాక మఱియొకవిధముగా బరిణమించిన దట ! ఈవార్త యళియరామరాయలకు దెలియవచ్చి నందున నాతడు దానికిం దగినరక్షకసైన్యమును వెంటనే పంపియుండె నన్నవార్త గోవాగవర్నరునకు దెలియ వచ్చెనట. అందుచే నాత డాప్రయత్నమును విడిచి యా నావికాబలమును తిరువడిరాజ్యమునకు బంపగా వారారాజ్యములోని దేవాలయములను దోచుకొని రట ! ఇట్లని కోరియా దెలుపు చున్నట్టు హీరాసుఫాదిరియే తనగ్రంథమున వక్కాణించి యున్నాడు. ఇప్పుడు విఠ్ఠలుడు గోవానగరముపై దండయాత్ర సాగింపవలసివచ్చినకారణమును చదువరులు చక్కగా గ్రహింప గలరు. శివతత్త్వరత్నాకరమున జెప్పబడినవృత్తాంత మసత్య మనుటసమంజసముగా గన్పట్టదు. ఇక్కడ చదువరులకు మఱియొకశంక కలుగవచ్చును. తిరువడి రాజ్యాధిపతి తమకుమిత్రు డేయైయున్నపుడు వీరేల యిట్టిదౌ ష్ట్యమునకు బూనుకొనవలసి వచ్చెను? ఆకారణము గూడ స్పష్టపడ గలదు. ఉన్నికేరళవర్మ విఠ్ఠలునకు స్వాధీనుడు గాక పోర్చుగీసుఫాదిరీల యండనుజేరియున్నను తిరువడిరాజ్యము సంపూర్ణముగా జయింపబడినతరువాత మూడుసంవత్సరముల కాలము, విజయనగరసేనానులవశమై యున్న దనియే యూహింపవలసి యుండును. ఆకారణముచేతనే పోర్చుగీసువారారాజ్యములోని దేవళములను కొల్లగొనుట సంభవించినది. ఈవిపత్తునుండి దేశము నుద్ధరించుటకై 1545 సంవత్సరాంతముననో ప్రారంభముననో చక్రవర్తియాజ్ఞానుసారము విఠ్ఠలుడు గోవానగరముపై దొడ్డసంకన్ననాయకునితోడ్పాటుతో దండెత్తిపోయియుండును. అట్లు వెడలునపుడు దక్షిణదేశము నంతయు బరిపాలించుభారము తనతమ్ముడయిన చిన్నతిమ్మరాజుపై బెట్టి యుండును. ఆదండయాత్ర విఠ్ఠలున కనుకూలముగా బర్యవసించినందువలనను గోవాగవర్నరు ఖైదిగా బట్టువడినందువలనను పోర్చుగీసువారు 1546 సంవత్సరము ఫిబ్రవరినెలలో సంధిచేసికొనవలసివచ్చినది. ఉన్నికేరళవర్మయు, ఆతనిమిత్రు డయిన ఫాదిరిఫ్రాన్సిస్‌గ్షేవియరును విఠ్ఠలునితో సంధిచేసికొనవలయునని యెంతప్రయత్నించినను వీరు చెప్పినపద్ధతులకు నాత డొప్పుకొనకపోవుటకు గారణము పోర్చుగీసుఫాదిరీలదుస్తంత్రమార్గములేగాని యన్యములు గావు. తుదకు సంధికార్యము నెఱవేఱుటకు బూర్వమే ఉన్నికేరళవర్మ మృతినొందుట సంభవించినది. తుదకు గత్యంతరము లేక వానికుమారుడు విఠ్ఠలుని శరణు వేడగా నాతడు సంధి కొప్పుకొనియెను. ఈసంధికార్యము 1545 సంవత్సరములో జరిగియుండు నని నాయభిప్రాయము. తుదకు ఫలితమేమనగా తిరువడిరాజ్యాధిపతియైన రామవర్మ తిరువణిదేశము (తిన్నెవెల్లిమండలము) విజయనగరసామ్రాజ్యమున కొసంగుటకును,ఎప్పటివలె దానుబ్రతిసంవత్సరము సామ్రాజ్యమునకు గప్పము చెల్లించుటకును, ఇకముందెన్నడు విజయనగరమువారు తిరువడిరాజ్యముపై దండయాత్ర నెఱపి యలజడి పుట్టింప కుండుటకును నొప్పుకొని తానుస్వయముగా తిన్నెవెల్లికివెళ్లి విఠ్ఠలునిసమ్ముఖమ్మున సంధిపత్రముపై సంతకము చేయవలసివచ్చినది. ఇయ్యది తిరువడి రాజ్యము పోర్చుగీసువారియండను జేపట్టి సామ్రాజ్యాధికారమును ధిక్కరించుటవలన గలిగినఫలితము. ఇయ్యదియె యారవీటిచినతిమ్మరాజును తిరువడిరాజ్యప్రతిష్ఠాపకు డనిద్విపదబాలభాగవతము వక్కాణించుటకు ముఖ్యకారణము. తిరువడి రాజ్యము సామ్రాజ్యసైన్యములచే సంపూర్ణముగా జయింపబడక యున్న నిట్టిసంధి కొడంబడుట యెట్లుసంభవించెను ? కావునఫాదిరీలవ్రాత లన్నియు వట్టియసత్యకల్పనము లని త్రోసివేయవలసినదే. ఈహీరాసుఫాదిరియె మఱియొకవిపరీత విషయమును దెలుపుచున్నాడు. చూడుడు 1558 లో రామవర్మ తాను చెల్లింపవలసినకప్పము చెల్లింప కుండెనట ! విఠ్ఠలరాయలు వానినుండి కప్పము గైకొనుటకై యాఱువేల సైనికులతో దిరువడిరాజ్యముపై మరల దండెత్తి వచ్చె నట. రామవర్మకడ వేయిసైనికులకన్న నెక్కువలే రట. ఇంతస్వల్ప సైన్యముతో నాతని నెదుర్కొన జాలక తిరువడిరాజ్యములోని క్రైస్తవమతబోధసంఘమునకు బెద్దయధికారి యగుఫాదిరి 'ఫెరేజ్' అనునాయనకడకు నొకదూతను బంపితనసేనకు జయము కలుగు నట్లుగా దేవుని బ్రార్థింపవలసినదిగా గోరె నట ! కాల్కుల మనుప్రదేశమునం దున్నయాఫాదిరి యట్లు చేయుటకు వాగ్దత్తచేసి యాతడొక జెండానడుమ జీసస్సుని నామమును రంగుతో వ్రాయించి దీనిని సైన్యమునకు ముందుంచుకొని యుద్ధముచేయునపుడు జీసస్సునామమును స్మరించు చుండవలసిన దనిచెప్పి యాదూత కిచ్చిపంపె నట ! అట్లు కావింపబడె నట ! ఈస్మరణఘోష విని తెలుగుయోధులు బెగ్గడిలిపోయి పఱువిడగా రామవర్మసైనికులు వారిని వెంటాడించి తఱిమి యనేకులను నఱకి వైచి రట ! ఈజెండా రాజుగారి ధనాగారమున నుంచబడిన దట. ఈకథను వ్రాసిన ఫాదిరి సౌజాకధాంతమున నిట్లు వ్రాసె నట ! "ఈరాజ్యమునుగుఱించి యిక నేనేమియు జెప్పదలంచుకొనలేదు. ఎందుచేత నన లిఖితపత్రములలో నేమియు నేను గనుపెట్ట లేకుండుటయే."
ఈవాక్యములను గ్రంథస్థము గావించి హీరాసుఫాదిరి యాదిగువను 'ట్రావెన్కూరునుండి తనసైన్యముతో వెనుదీయునపుడు విఠ్ఠలుడు చంప బడెనా ?' యని ప్రశ్నించి "అదిమే మెఱుంగముగాని హిందూశాసనములలోగాని, పాశ్చాత్యచరిత్రలలోగాని యుదాహరింప బడియుండలే దని యెఱుంగుదుము" అని తమకుదామే ప్రత్యుత్తర మిచ్చియున్నారు. ఎట్లయినేమి ? ఈ 1558 సంవత్సరముతో నాతని దక్షిణదేశపాలనాధికారప్రభుత్వము తుదముట్టిన దనివక్కాణించిరి. పైకథను వ్రాసినఫాజాగారే 1560 సంవత్సరములో విఠలుడు దక్షిణదేశమున నున్నవాడని వ్రాసియున్నప్పటికిని యితరపోర్చుగీసు గ్రంథములకు భిన్నముగానుండుటచేత హీరాసుఫాదిరి తానువిశ్వసింప జాల డట ! [7] ఆహా! ఎట్టి నిష్పక్షపాతమైనచరిత్రమును వ్రాయసమకట్టిరి? ఇట్టికథలు కల్పించి చెప్పెడువారు చెప్పినను వినువారికైన మతు లుండవని హీరాసుఫాదిరితలంపు గాబోలు ! ఈవిఠలు డీదండయాత్రలో బొందినవిజయ మంతవిశేషమైనదిగాకపోయినను రామరాజీయ మనుగ్రంథములో నళియరామరాయలను "కన్యాకుమారీభీమరధీతలాంతనిక్షేపవిజయస్తంభ" యని స్తుతింపబడినా డట ! అళియరామరాయలనుగూర్చిన యీపొగడ్త లేక యాయనకిచ్చిన యీబిరుదము హీరాసుఫాదిరి వెటకారమున కేలగుఱి గావలసివచ్చినదో? గ్షేవియరు, ఫెరేజ్‌ఫాదిరీలవాక్కుల కారోపింపబడినమంత్రశక్తి దీనిలో లేదని వీరితలంపు గాబోలు. అళియరామరాయలపేరు చెప్పిన వీరి కింతయస హనమెందుకో? హీరాసుఫాదిరి యింకొక విచిత్రచరిత్రమును గ్రంథథ చేసి యున్నాడు.
సెంటుథోముపై దండయాత్ర
అళియరామరాయలజీవితచరిత్రములో 1558 సంవత్సర మత్యంతప్రాముఖ్యత వహించినదిగా నున్నది. ఎందుకన నింతకు బూర్వము రామరాయ లహమ్మదునగరసుల్తానుపక్షమ ను వహించి విజాపురసుల్తానుతో బోరాడుచుండు వాడు. అట్లుగాక యీసంవత్సరము విజాపురసుల్తానుపక్షము నవలంబించి యహమ్మదునగరము, గోల్కొండసుల్తాను లగుహుస్సేనునిజాముషా, ఇబ్రహీమ్ కుతుబ్షాలతో ఘోరమైనయుద్ధముచేసి విజయము గాంచినాడు. ఈవిషయమును తన గ్రంథమున హీరాసుఫాదిరి తెలిపియే యున్నాడు. ఇందలివివరణ మీగ్రంథములోని మూడవప్రకరణమున దెలుప బడినది. కానియీసంవత్సరమే అళియరామరాయ లైదులక్షలసైన్యముతో దూర్పుతీరమున మైలాపురమునకు సమీపమున నున్న 'సెంటథోము' అనుచిన్నపట్టణముపై దండయాత్ర వెడలెనని హీరాసు వ్రాయుచున్నాడు. ఇయ్యది పోర్చుగీసువారి చరిత్రలలో గాన్పించుచున్న దట ! మహమ్మదీయ చరిత్రకారులుగాని హిందూగ్రంథకర్తలుగాని యీదండయాత్రను గూర్చి తెలిపి యుండలేదు. ఈపోర్చుగీసుక్రైస్తవమతగురువులు చేసినదుండగములను గూర్చి బ్రాహ్మణు లప్పటప్పట రామరాయలకు విజ్ఞప్తులు పంపుచున్నను నాత డుపేక్ష వహించె నట ! పోర్చుగీసువారు గుఱ్ఱములవ్యాపారముచేయు వర్తకులగుటచేతను, రామరాయలకు గుఱ్ఱము లత్యావశ్యకములై యుండుటచేతను, వారితోవిరోధము పెట్టుకొనుట కిష్టములేకుండె నట ! అయినను మహమ్మదుమతస్థు లగుదక్కనుసుల్తానులతో యుద్ధములు జరుపుచుండినవా డగుటవలన నాతనికి ధనము కావలసివచ్చెనట ! తనదేశమునకును తనమతమునకును ద్రోహియైన యొక పోర్తుగల్‌దేశస్థుడు దుర్మార్గుడై సెంటుథోమునందు నివసించు పోర్చుగీసువారికడ విశేషముగా ద్రవ్యముగలదనియు వారిని ముట్టడించినయెడల వారివలన నిరువదిలక్షలబంగారు పూలవరహాలు లభింప గలవని దండయాత్రనడపు మనిప్రోత్సహించె నట. సామ్రాజ్యసంరక్షణముకొఱకును, దక్కనుసుల్తానులతో యుద్ధములు నడపుటకును ద్రవ్యాపేక్ష కలిగియున్నవా డగుటచేత రామరాయ లాతనిదుస్సలహా నంగీకరించి యైదులక్షల సైన్యముతో సెంటుథోముపై దండెత్తి వచ్చె నట ! ఫాదిరి గ్షేవియరు తెలిపినదానినిబట్టి సెంటుథోమునందు నివసించుపోర్చుగీసువారు వివాహములు చేసికొన్నవారుకలుపుకొని నూర్గురు కన్న నెక్కువమందిలేరు. 'పిచ్చుకమీదబ్రహ్మాస్త్ర' మన్నట్టు వీనిని సాధించుటకై రామరాయ లైదులక్షలసైన్యముతో దండెత్తవలసివచ్చిన దనిపోర్చుగీసులేఖకులు వ్రాయు చున్నారు. ఆసమయమున నాపట్టణమున నున్నయొకగోవా వర్తకుడు (వానిజాతివాడే) గ్రామములోని పెద్దలను, నాయకులను రప్పించి రాయలకు మందుగుండుసామానుతక్కువ గనుక రాయలసైన్యము నెదురించుట సాధ్య మనియు నాతనికంటె వారలకు సముద్రము కూడ నదనముగా నున్నదిగావున నాతనిసైన్యముల నిరోధించుటయె తగుమార్గ మనికూడ బోధించె నట ! తమపట్టణము విజయనగర సామ్రాజ్యములోనిది గావునను, సామ్రాజ్యభారమును వహించినపాలనకర్తను ధిక్కరించుట సమంజసము కానందునను ధిక్కరించినను సుస్థిరముగా నిలుచుట సాధ్యముగా దనియు వారుతలంచి యాతనిసలహా నిరాకరించి రట ! తనసలహాను వారాదరింపలే దనికోపించి యావర్తకు డొకవర్తకపునావనెక్కి గోవానగరమునకు వెడలిపోయె నట ! అటుపిమ్మట గృహస్థులలో ముఖ్యులగువారిని నల్వురను నాలువేలవఱకువరహాల కాన్కతో రామరాయల కెదురుగ రాయబారము నడపుటకై పంపి రట. రామరాయలు పోర్చుగీసువారు పంపినకాన్కకును, రాయబారమునకు మిక్కిలిసంతోషించె నట ! ఈలోపల నాతనికి స్వాగతము నొసంగుటకై తమపట్టణము నంతయు జక్కగా నలంకరించి రట ! అట్లు రామరాయలు పట్టణమునకు విచ్చేసి యొకవిశాలమైన ప్రదేశమున దండువిడిసి పురములోని యాబాలవృద్ధులుసహా యావత్ర్పజలను రప్పించి తనసంతోషమును తెలుపుటకుగాను వారలకు నొకగొప్పవిందు గావించి యాసమయమున దనసేనాను లను బెక్కండ్రను పురములోనికి బోయివారివారియిండ్లుపరిశోధించి ద్రవ్యమునంతయు గొనిరావలసిన దనియుత్తరువుచేసె నట ! ఆతనియాజ్ఞను శిరస్సునబెట్టుకొని వారెల్లరును వారి కొయ్యకంపలనుగూడ విడువక కొంతద్రవ్యమును గూడ గొనివచ్చిరట. వారుగొనివచ్చిన దంతయు నూఱువేలవరహాలమొత్త మయినలేదని 'కోటో' తెలుపుచున్నాడు. దానిని జూచి రామరాయలు తానుమోసపుచ్చ బడితి ననిభావించి యాగ్రహమహోదగ్రుడై తనకు సలహాచెప్పినపోర్చుగీసువాని శిక్షించుటకు నిశ్చయించుకొనె నట ! అదివఱకే యాతడు సైన్యమునుండి తప్పించుకొని పాఱిపోయె నట ! తుదకాతడు 'కలితురె' యనుప్రదేశమున బట్టువడి వాని సన్నిధికి గొనిరాబడె నట ! అతడు తరువాత వానినేనుగులచే ద్రొక్కించి చంపించె నట ! ఈమహాద్రోహమును గావించిన యావ్యక్తి పేరేమో యేపోర్చుగీసు చరిత్రకారుడును నుడువ సాహసింపలేదు.
పిమ్మట రామరాయలు నూఱువేలవరహా లిచ్చినవారిని మరల వారిపురమునకు బంపుదు ననియు, అందుసగము ముందుచెల్లింపవలెననియు, తక్కినసగము సంవత్సరముజరిగిన వెనుక చెల్లింప వలసినదనియు శాసింపగా వెంటనే సగము చెల్లింప బడెనట ! తక్కినసగము చెల్లించువఱకును వారిలో ముఖ్యుల నైదుగురను తాకట్టుగ దనతో నుంచుకొనుట కొప్పుకొనియె నట ! వారిసొత్తు నంతయు వారలకు దిరుగ నిచ్చి వేసె నట. అట్లిచ్చునపు డొకవెండిగరిటె కానుపింపలే దట. దానిని వెదకించి తెప్పించి దానియజమాని కిప్పించువఱకు నాతడు కదలలేదట ! రామరాయలు పట్టణము విడిచిపోయి విజయనగరము జేరినవెనుక వారుచేసినసేవకు సంతోషించి రాయ లాపోర్చుగీసుగృహస్థుల నైదుగురును వారి స్వస్థలమునకు బోవుట కనుజ్ఞ నొసంగెనట !
ఈపైకథ నిర్వురు పోర్చుగీసు లేఖకులు వ్రాసినారని నుదాహరించుచు హీరాసుఫాదిరి "రామరాయల కుండుద్రవ్యము నెడగలదురాశవలన నిట్టిది సంభవించెనేకాని విజయనగరమునకును పోర్చుగీసువారికిని తరువాతిసంవత్సరములు స్నేహముతోనే గడుప బడిన" వని వ్రాయుచున్నాడు.
కాని, తిరుపతిదేవస్థానమును కొల్లగొనుటకై పోర్చుగీసువారు ప్రయత్నించియు భగ్నమనోరథులై వారు దీనిని విడిచిమలయాళ దేశమునందలి దేవాలయములను దోచుకొనిరను నప్రఖ్యాతినికమ్ముదలచేయుటకై యాపోర్చుగీసు లేఖకులే దీని నెవ్వరోకల్పించి యుందురు. ఎక్కడనోయుత్తరదేశమున నహమ్మదునగర గోల్కొండ సుల్తానులతో బోరాడు రామరాయ లైదులక్షల సైన్యముతో దూర్పుతీరమునకు దండెత్తివచ్చుట యెట్లు సంభవించును? రామరాయలు దురాశాపాతకు డనిలోకు లనుకొనుటకై పోర్చుగీసువారు కల్పించిన కల్పనాకథగాని యిదిసత్యమైన చరిత్రాంశముగా దని మనము విశ్వసింపవచ్చును. ఉత్తరదేశమున దక్కనుసుల్తానులతో బోరాడుచు రామరాయాదు లెట్లుజయమును బొంది సామ్రాజ్యములోని యుత్తరభాగమున నెట్లుశాంతి నెలకొల్పి పాటుపడిరో యట్లే విఠలరాయలు, చినతిమ్మరాజు మొదలగువారు దక్షిణదేశములోని యల్లరులను మాన్పి శాంతి నెలకొల్పిరి. విఠలరాయలు వృద్ధు డగుటవలన దరువాత మృతినొంది యుండును. ఇతడు పరవజాతివారితోను, వారికి సాహాయ్యము జేసిన పోర్చుగీసుఫాదిరులతోను జేసినయుద్ధములు బహుస్వల్పమయినవిగను, ప్రాముఖ్యతగాంచనివిగ నున్నవిగావున వానివివరణ మిటనుదాహరింప బూనకొనలేదు. తుదకు పరవజాతివారు కప్పము చెల్లించుట కొప్పుకొని మధురాపురాధీశుడైన విశ్వనాథనాయకునితో నొడంబడిక జేసికొనిరి.
- ↑ The Aravidu Dynasty of Vijianagar, p. 143 - 144
- ↑ భారతిసంపుటము 6, సంచిక 6, పేజీలు 820, 821, 822, 823.
- ↑ Sources of Vijianagar p. 207, 208, 209.
- ↑ Sources of Vijianagar, p. 210
- ↑ I bid, p. 195, 200.
- ↑
"సచప్రాప్యానుజాభ్యాశంతేనసాక మపరత్త|
అనంతరంపరంజ్గెషసార్వభౌమవిరోధిషు||
పునరేవసమానాయ్యమేళయిత్వానుచేతనమ్|
నామ్నావిఠ్ఠలరాజేనయాపయామాసతాన్ర్పతి||
తతస్తాన్వైరిణో రాజాగోవాదేశనివాసిన:|
పరాభవక్సార్వభౌమౌనుజేనసహసజ్ఞత:||
తతోగోవాపురాధీశంతస్మైజిత్వార్పయత్యతి|
అస్మిన్ర్పముదిత:ప్రాదాన్మహాదేవపురస్తలమ్||"
(శివతత్త్వరత్నాకరమ్)
Sources of Vijianagar History, p. 340 - ↑ The Aravidu Dynasty of Vijianagar, p. 162 - 163.