అళియ రామరాయలు/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఏడవ ప్రకరణము

రామరాయల ధర్మపరిపాలనము

కృష్ణదేవరాయలు వానితమ్ము డచ్యుతదేవరాయలు విజయనగరసామ్రాజ్యమును బరిపాలించు కాలముననే సామ్రాజ్యమున భూమిశిస్తు మొదలగునవి క్రమపద్ధతులపై స్థిరముగా నేర్పాటుచేయబడియుండుటచేత నాపద్ధతులనే సదాశివదేవరాయని కాలమునగూడ రామరాయలచే నవలంబింప బడియుండుటచేత రామరాయలకాలమున సామ్రాజ్యమున నెన్నడు నార్ధికదారిద్ర్యము సంభవించి యుండలేదు. ఆర్ధికాభివృద్ధికై యాతడెన్నడును సామ్రాజ్యప్రజలను బాధించియుండలేదు. సామ్రాజ్యమునకు లోబడినసామంతనృపతులు అమరనాయకులు మొదలగువారు ప్రతిసంవత్సరము తాము చెల్లింపవలసిన కప్పములను వరుసదప్పక సకాలమున జెల్లించు చుండుటయే తటస్థింపుచువచ్చెనుగాని యన్యధా జరిగి యుండలేదు. అందువలన ధనలోభముచే ధర్మపరిపాలనమునకు భంగము కలుగలేదు. ఇతని పరిపాలనమున ముఖ్యముగా సంరక్షింపబడినది హిందూమత ధర్మపరిపాలనమె. చక్రవర్తియగు సదాశివదేవరాయలును, వానిమంత్రియగు రామరాయలునుగూడ సామ్రాజ్యప్రజలు తమజాతీయమతము నందభిమానము వీడకుండునట్లు ప్రోత్సాహపరచుచుండునటుల వారికాలమునాటి దానధర్మములను లిఖింపజేసినవారి శిలాశాసనములే వారి తామ్రశాసనములే వేనోళ్ల వక్కాణించుచున్నవి. సదాశివదేవరాయని పేరిటి దానశాసనములు పెక్కులు కనంబడుచున్నను నవియన్నియు రామరాయలు ప్రోత్సహించిన వనియే మనము విశ్వసింపవచ్చును.

దేవాలయ పోషకత్వము

నల్లచెర్వుపల్లెలోని పురాతనభైరవేశ్వరాలయము సదాశివదేవరాయనిచే విశాలపఱుపబడుటయెగాక సొగసుగా నలంకరింపబడినది. గోపాలకృష్ణదేవునియాలయమునుండి యెట్టి సుంకమును గైకొనకుండ జేసెను. తానుపట్టాభిషిక్తుడయినప్పుడు మార్కాపురములోనిదేవునకు నొకగ్రామమును దానముచేసెను. సచ్చిదానంద స్వామివారికి పుదూరుగ్రామము నిచ్చెను. పొత్తపినాడులో పులుపటగ్రామముతో సహామూడుగ్రామములను, ఒంటిమిట్టలో గొంతభూమిని ఒంటిమిట్టగ్రామములోని కోదండరామస్వామి వారికి దానముచేసెను. కృష్ణాపురములోని విష్ణ్వాలయమునకు ననేకగ్రామము లొసంగబడియెను. హిందూపురముతాలూకాలోని తిమ్మసముద్రమనుపేరుతో కాగల్లుగ్రామము మల్లికార్జునస్వామివారి కర్పింపబడియెను. జమ్ములమడుగు తాలూకాలోని కోసానెపల్లె గ్రామము చెన్నూరుసీమలోని తిరువేంగళనాధుని యుత్సవ కైంకర్యములకై సమర్పింపబడినది. శ్రీవిల్లిపుత్తూరులోని యమ్మవారికి రామనాథమండలములో పులియంగుల మనుగ్రామము నొసంగెను. కోడూరుగ్రామములో దుర్గాదేవి పూజా కైంకర్యమునకై సంవత్సరోత్సవమునాడు తిరునాళ్లకు వచ్చు ప్రజలనుండి సుంకములను గైకొనుటకై యనుమతి యిచ్చెను. మఱియు సిద్ధేశ్వరభోజేశ్వరస్వాములకు గడగిరేలను గ్రామము నొసంగుటయెగాక వారిమహోత్సవములకై కొంతధనసహాయము చేయుటకు నేర్పాటు గావించెను. ఉదయగిరిదుర్గసీమలో నుండుగ్రామములనుండి తేబడుచిల్లరవస్తువులనుండి వసూలు చేయబడు సుంకముల మూలమున శ్రీరంగనాథస్వామివారికి మంచిరాబడిని కలుగజేయుటయె గాక సూర్యగ్రహణకాలమున సువర్ణదానమునుగూడ జేసియుండెను. 'యధారాజాతథాప్రజా' యన్నట్లు సామ్రాజ్యప్రభువులమార్గమును వారిసామంతులును, ప్రజలుగూడ నవలంబించిరి. సదాశివదేవరాయల చక్రవర్తిగా నున్నకాలమున ననేకనూతన దేవాలయములు నిర్మింపబడినవి. శిధిలములయినవి విశాలపఱుపబడుటయెగాక నూతనాలంకారములతోను చిత్రములతోను చిత్రింపబడినవి. మహామండలేశ్వర జిళ్లేళ్లరంగపతిరాజయ్య దేవమహారాజుగారి కార్యకర్తయగు అమరినాయనివేంగళ నారాయనింగారు రాయచోటి గ్రామములోని వీరేశ్వరస్వామివారి ప్రాకారములోపల నడుమ నున్నయాలయమును బాగుచేయించెను. దేశాంతరినరసింగదాసు తిరువళిక్కేణిలోని పార్థసారధిదేవాలయము ననేకవిధములుగా నభివృద్ధిపఱచెను. తిరుమలరాయనిదళవాయి యగు జంగమయ్య యొకనూతనదేవాలయమును నిర్మించెను. గుత్తి తిరుమలరాజయ్యగారు మన్నూరు గ్రామములోని చెన్నకేశవస్వామివారి దేవాలయములో మంటపనిర్మాణము గావించెను. తిమ్మరంగరాజను వారు విజయనగరములోని మహాదేవాలయములో 25 భాగములుతో నొప్పునొకధర్మశాలాభవనమును నిర్మించి దానికిరంగమంటపమనిపేరిడెను. చిన్నఔబలరాజనునాయని ఆరకటవేముల యగ్రహారములో నొకదేవళమును గట్టించి యందుగోపాలకృష్ణదేవుని విగ్రహమును ప్రతిష్ఠాపించి గండికోటదుర్గసీమలోవచ్చు నాదాయమునుండి సాలునకు 31 1/2 వరహాలు సమర్పించుటకు నేర్పాటుచేయుటయేగాక యాయగ్రహారములోనిశివార్లనుగూడ నాదేవుని కర్పించెను. ఔబలరాజయ్యదేవమహారాజు కడప, వెలదుర్తి గ్రామములలో లోహవిగ్రహములను బ్రతిష్ఠాపించి చెన్నకేశవపెరుమాళ్ల భోగకైంకర్యములకై పండ్రెండువరహాలు సమర్పించుటకై యనుజ్ఞచేసెను. ఆత్రేయగోత్రజుడును చంద్రవంశ్యుడునునైన రాచిరాజదేవమహారాజు దేవాలయమును నిర్మించియందు మదనగోపాల విగ్రహమును బ్రతిష్ఠాపించి భూదానములు మొదలగువాని బెక్కింటిని గావించెను. పెమ్మసాని చినతిమానాయ డనునొకసామంత మండలేశ్వరుడు తాడిపర్తిలోనితిరు వేంగళనాథస్వామివారికి నెనుములచింతలయను గ్రామమును దానము చేసెను. యలదుఱ్ఱులోని శ్రీరంగనాధస్వామివారి యర్చకత్వమును సలుపుటకై తమ్మయగౌడునకు మహానాయకాచార్య నాగినాయకుడును నాయనగొట్టెకుంటయను గ్రామమునుదానము చేసెను. గుందుర్తి పాపయ్యయను నతడు వేల్పుచర్లలోని యమ్మవారికి మూడుగ్రామముల నొసంగెను. నంద్యాల తిరుమలయ్య దేవమహారూజు చెన్నకేశవస్వామివారికి కోడూరుగ్రామము నొసంగుటయెగాక నందపాడుగ్రామమున గొంతభూదానముగూడ చేసియుండెను. కొండ్రాజుచిన్నతిమ్మరాజు అహోబలనృసింహస్వామివారి కొకగ్రామము సమర్పించెను. ఒంటిమిట్టరఘునాయకదేవునికి నాగరాజయ్యగారు గంగపేరూరనుగ్రామము నొసంగెను. నంద్యాలతిమ్మయ్యదేవమహారాజు, చిన్నఔబలేశ్వరదేవమహారాజు ఘండికోటరఘునాయక దేవునకు భూదానములను గావించిరి. నంద్యాలయౌబలరాజు నందలూరు సౌమ్యనాథస్వామివారికి భూదానములను చేసెను. బొల్లవరములోని వేణుగోపాలస్వామివారికి పాపతిమ్మయదేవమహారాజుగారొక గ్రామము నిచ్చిరి. ఇమ్మడిబసవనాయడు త్రిపురాంతకదేవరకు ముప్పదితూముల మెట్టపొలమును సమర్పించెను.

ఇట్లుధనరూపకముగా నిచ్చినశాసనములు పెక్కులు గనుపట్టుచున్నవి.

పెద్దముడియము సోమేశ్వరస్వామివారి కొకొప్రభువు వసూలుచేయుసుంకములలో నొకసుంకమును సమర్పించెను. విప్రవినోదివీరముష్టివీరప్పయనునాతడు గ్రామమునుండి తనకువచ్చు నాదాయమునంతయు విశ్వేశ్వరదేవునికి సమర్పించెను. అగ్రహారము బ్రాహ్మణులనుండి తనకువచ్చెడు నాదాయమునంతయు విప్రవినోదసిద్ధయ చెన్నకేశవస్వామివారి మహోత్సవమునకై సమర్పించెను. కంబదూరుమల్లికార్జున దేవరకు విరూపాణ్ణనాయకుడు 50 వరహాల నొసంగెను. విప్రవినోదిబ్రాహ్మణులు తాము బ్రాహ్మణులనుండి సంపాదించినసొమ్మును దేవుళ్లకు సమర్పించెడివారు పెక్కండ్రు కలరు. గారిడివాండ్రు వేలమూరినుండివచ్చెడు నాదాయమునంతయు చెన్నకేశవస్వామివారి కైంకర్యములకు వినియోగించు చుండిరి. మహామండలేశ్వర చినతిమ్మరాజకొండయదేవ మహారాజు జిల్లేళ్ల గ్రామములో దానువసూలు చేసెడు కొన్నిసుంకముల నాయూరిలో వీరభద్రదేవునకు సమర్పింపు చుండెను. ఇట్టివే పెక్కులు దానశాసనములు గనుపట్టుచున్నవి.

బ్రాహ్మణవిద్వాంసుల పోషకత్వము

ఇట్లు రామరాయల ప్రభుత్వకాలమున దేవాలయధర్మాలయపోషకత్వమెగాక విద్వాంసులయిన బ్రాహ్మణులపోషకత్వముగూడ జక్కగా నిర్వహింప బడుచు వచ్చినవి. 1545 సంవత్సరములో సదాశివదేవరాయలు కొందరుబ్రాహ్మణులకు దానములను బెక్కులు చేసెను. గోవిందవామపురమను గ్రామము నొకబ్రాహ్మణున కొసంగెను. రెండుసంవత్స రముల కనంతరము రెండుగ్రామములను బ్రాహ్మణుల కనేకులకు దానముచేసెను. 1548 లో కనుమయను గ్రామమును బ్రాహ్మణవిద్వాంసులకు దానముచేసెను. వేదాంగపారగులైన పెక్కండ్రు బ్రాహ్మణులకు బెవినిహల్లిగ్రామమును దానముచేసెను. 1544 మొదలుకొని 1546 వఱకు వరుసగా మూడు గ్రామములను ఒంగోలు పురవాస్తవ్యు డయినతాళ్లపాకతిరుమలయ్యగారికుమారుడు చిన్నకోనేటి తిరువేంగళనాథయ్యగారికి నగ్రహారములుగా నొసగబడెను. వీరు వేదవేదాంతమార్గ ప్రతిష్ఠాపనాచార్యు లయినవారు. మఱియు బ్రాహ్మణులకు జేయబడిన భూదానశాసనములుగూడ వందలకొలది గలవు.

సరిహద్దులతగవుల పరిష్కారము

వీరిపరిపాలనమున సరిహద్దులనుగూర్చిన వివాదములు పుట్టుచు వచ్చెను. అట్టితగవుల నన్నిటిని సామ్రాజ్యకార్యకర్తలవలన పరిష్కారము లగుచు వచ్చిన వని కొన్నిశాసనములనుబట్టి తెలిసికొన నగును. అనంతపురమండలములో రెండు గ్రామములవారికి నీటిహక్కులనుగూర్చి 1553 లో వివాదము తటస్థించినప్పుడు రామరాజుకోనప్పదేవమహారాజు గారివలన బరిష్కారము గావింపబడినది. అదేమండలములో బెదమల్లెపల్లెయను గ్రామమున సరిహద్దులనుగూర్చి వివాదములు పొసగినపుడు దానప్పనాయ డనునాతడు తానుస్వయముగా బరిశోధించి వారివివాదములను బరిష్కరించి సరిహద్దులలో ఱాళ్లు పాతించెను. అదేవిధముగా బుక్కరాయపురము బ్రాహ్మణపల్లె గ్రామములవివాద తటస్థించినపుడు సరిగా కొలతలుకొలువబడి స్పష్టముగా దెలియునటులు సరిహద్దుగుర్తు లేర్పఱచబడినవి.

వ్యవసాయాభివృద్ధి

వ్యవసాయాభివృద్ధినిగుఱించి యెట్టిశ్రద్ధ వహించినది మనకు దెలిసికొనుట కంతగా సాధ్యముగాక పోయినను కొన్ని దృష్టాంతములనుబట్టి కొంతవఱకు గ్రహింపవచ్చును. పొత్తపియనుగ్రామమున వ్యవసాయముకొఱకు వరదరాజు, ఎల్లమరాజు ననువారు 60 కుంటలభూమి నిచ్చి యొకకాలువను ద్రవ్వించిరి. అదేగ్రామమున మట్లవరదరాజనునాత డంతరంగకాలువ యనుపేరితో మఱియొకకాలువను ద్రవ్వించెను. మొలకలమూఱుసీమలో చవిటిమన్ను తొలగించుటకై యుప్పరవాంద్లకు సదాశివదేవ రాయలు పన్ను చెల్లింపకుండుపద్ధతిని కొంతభూమి నిచ్చినట్లు గనుబట్టుచున్నది. అనేకవిషయములను బట్టి వ్యవసాయాభివృద్ధి సంరక్షింపబడుచున్నదనియె తలంపవచ్చును.

కుల వృత్తులు

ఈకాలమున విజయనగరసామ్రాజ్యమునందు కులవృత్తులు చక్కగా బోషింపబడుచువచ్చిన వనేకదృష్టాంతములను జూపవచ్చును. విజయనగరసామ్రాజ్యమునం దీకాలమున నరువదిరేవు పట్టణములు సంరంక్షింపబడుచు విదేశములతో వ్యాపారములు జరుపుచుండుటచేత కులవృత్తు లభివృద్ధిలో నున్నవని వేఱుగ జెప్పవలయునా ? అన్నివృత్తులమాట యటుండనిచ్చి యొకమంగలివృత్తిమాట విచారించిన దక్కినవృత్తులయందు గూడ నెట్టియభిమానము గలిగియుందురో చదువరులు చక్కగా గ్రహింప గలరు. అళియరామరాయలు మంగలివృత్తిని నీచవృత్తిగను, మంగలి వృత్తిగలవారిని నీచులనుగను జూచినట్లు గనుపట్టదు. అంతియగాక వారిని దుర్భరదారిద్ర్యమునుండి తప్పింప బూనినట్లుకూడ గానబడును. అళియరామరాయలకాలమున నీవృత్తియందు నేర్పరులయిన పనివాండ్రు పెక్కండ్రు కలరు. వారిలో బాదామికాపురస్థుడగు మంగలతిమ్మోజుకొండోజుగారు చాలప్రఖ్యాతుడై యుండెను. ఇతడు గడ్డముగీయునపుడు తననేర్పరితనము నంతయు జూపించు నట ! ఇతడు రామరాయల సొంతమంగలి యని చెప్పవలసి యున్నది.

ఏవృత్తియైనను శ్రద్ధతో నభ్యసించిన నావృత్తియందే గొప్పఖ్యాతిని సంపాదింపవచ్చుననుటకు మంగలికొండోజుగారిని నిదర్శనముగా జూపవచ్చును. యళియరామరాయ లీవృత్తినేర్పరితనమును మెచ్చుకొని చక్రవర్తితో గూడ నీతనిగుఱించి ప్రశంసింపుచు వచ్చెనట. అందువలన రామరాయలకు మాత్రమెగాక చక్రవర్తిదయకు గూడపాత్రుడయ్యెను. ఇట్టిదయను సంపాదించుటవలననే యితడు తనకులమువారి కెల్లరకు మహోపకారముచేయ గలిగెను. అళియరామరాయలు 1545 సంవత్సరము కొండోజు పనివానితనమును మెచ్చుకొని మంగలివారు చెల్లింపవలసిన కులపన్ను, వృత్తిపన్ను, యితరములయిన పన్నులనేమియు నాతడు చెల్లింప నవసరములేదని యుత్తరువు చేసెను. 1554 సంవత్సరములో రామరాయలకు గొప్పసేవచేసి ప్రభువునకు విజ్ఞప్తిపంపుకొన నాతడు దయతో విశ్వసించి మంగలివాండ్రపై గలసుంకమును దీసివేయవలసిన దనిశాసనమును బ్రకటించెను. ఆతడును, అతనికుటుంబమువారును 1556 వ సంవత్సరమునుండి సామ్రాజ్యము నాలుగుసరిహద్దులలోపల నిర్బంధసేవనుండియు విరద, స్థిరముగా బన్నులను జెల్లింపవలసిన నిర్బంధములనుండియు దొలగింప బడియెను. అళియరామరాయల దయకు బాత్రు డయినదీకొండోజు మాత్రమెగాదు. అళియ రామరాయలు 'తిమ్మోజు, హొమ్మోజు, భర్రోజు' ననుమూవురు మంగలుల పనితనమునుగూడ మెచ్చుకొని పన్నులనిర్బందము నుండి వారినివిముక్తులను గావించి నట్లుగా హిరెకెరూరు శాసనమువలన దెలియుచున్నది. చక్రవర్తికిని, మంత్రికి నిట్టి మంగలనాయకులతోడి పొత్తువలన సామ్రాజ్యములోని మంగలవాండ్ర కెల్లరకు మహోపకారము కలిగినది.

ఎప్పుడు సామ్రాజ్యప్రభుత్వమువారియుత్తరువు రామరాయలసంతకముతో బయలువెడలినదో అప్పటినుండి సామ్రాజ్యోద్యోగస్థులును, తదితరసామంతమండలాధిపతులును ప్రభు త్వశాసనమును శిరసావహించి మంగలకులమువారెల్లరు నెట్టిపన్నును చెల్లింపవలసినపనిలేదని శాసనములం బ్రకటించిన ట్లనేకశాసనములవలన దెలియగలదు. ఇట్టిమహోపకార మీకులమువారికి విజయనగరసామ్రాజ్యమున మరేపూర్వప్రభువుకాలమునను జరిగియుండలే దనుట సత్యము.

స్వమతాభిమానము

ఆరవీటివంశమువారు మొదలనుండియు వైష్ణవమతస్థులై యుండుటచే నళియరామరాయలును వైష్ణవ మతమునందే నిలిచి యుండెను. విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన సంగమవంశము వారుమాత్రము శైవులుగ నుండురికాని తక్కినవంశములవా రెల్లరును వైష్ణవమతమువారై యున్నారు. ఈసామ్రాజ్యాధిపతులలో మొదటివంశములోనివా డయిన విరూపాక్షరాయలుదక్క తదితరప్రభువు లెవ్వరునుమతములను మార్చుకొనలేదు. మొదటివంశమువారైన శైవప్రభువులును తరువాతి వంశములవారయిన వైష్ణవప్రభువులును మతపరిపాలనాసందర్భమున శైవవైష్ణవమతభేదము లెంచకుండ దేవస్థానములను మతములను నిష్పక్షపాతబుద్దితోనే పోషింపుచు వచ్చిరని నిస్సంశయముగ నుడువవచ్చును. రామరాయలగురువు శ్రీనివాసాచార్యులపుత్రు డగుతాతాచార్యులు. రామరాయలును గురువుతాతాచార్యులును చంద్రగిరిదుర్గమున గొంత కాలము విద్వద్గోష్ఠి యందుండెనని ప్రపన్నామృత మనుగ్రంథమునుబట్టి దెలియుచున్నది. ఈశ్రీనివాసతాతాచార్యుడు శ్రీరామానుజులవారి మేనమామ యగు శ్రీశైలపూర్ణునివంశములోనివాడు. మొదటస్మార్తమతము నందున్నబ్రాహ్మణ కుటుంబమె రామానుజునికాలముననే వైష్ణవములోనికి మాఱినది. వాధూలగోత్రోద్భవు డయినదొడ్డ యాచార్యుడు వాదమునశైవాచార్యుల గెలిచినందున నతడు చిదంబరదేవాలయములో క్రిమికంఠ చోళునికాలము నాటినుండియు బూజాపునస్కారములులేక మూలపడియున్న గోవిందరాజస్వామివారి విగ్రహమును మరల నాదేవాలయములో బ్రతిష్ఠాపించి పూజాసంస్కారములు జరుగునట్లు చేయవలసినదని రామరాయలనుకోరగా నతడాఘనకార్యమును నిర్వహించెనని పైగ్రంథము దెలుపుచున్నది. ఈదొడ్డయాచార్యులు చండమారుతమను గ్రంథమును తాతాచార్యులు పంచమత భంజనమును వ్రాసెను.

ఇయ్యవి యప్పయదీక్షితులవారు వ్రాసినయద్వైత దీపికపై ఖండనగ్రంథములు. రామరాయ లితరమతశాఖలను ద్వేషింపకపోయినను స్వమతాభిమానమును విశేషముగా జూపించెను. ఇతడేగాదు వీనిపూర్వులును వైష్ణవమతవ్యాప్తికి బాటుపడిరి. ఈవిజయనగర సామ్రాజ్యపాలకులకాలముననే, దక్షిణదేశమున వైష్ణవమతము విస్తరింప బడినది. తాతాచార్యులవారి ముద్రయని లోకులచే బ్రశంసింపబడు తాతాచార్యులవారు వీరిగురువుతాతాచార్యులవారే. చక్ర వర్తి సదాశివదేవరాయలుకూడ విష్ణుభక్తుడు. వీనిపూర్వులుకూడ వైష్ణవమత మవలంబించినవారే. వైష్ణవమతము నభివృద్ధిపఱచుటకై యితడు 1556 సంవత్సరమున 30 గ్రామములను రామానుజులవారి కనగా నాతనిచే నేర్పాటుకావింపబడినశాఖవారికి దానముచేసి యుండెను. సదాశివదేవరాయనికి మరణించుట యన 'వైష్ణవపదముచేరుటయే' యని యభిప్రాయ మున్నట్టుగా 1558 సంవత్సరము లోనియొకశాసనము వలన దెలియుచున్నది.

భాషాభిమానము - కవిపండితగోష్ఠి

ఇతడు సంస్కృతాంధ్రములయం దసమానపాండిత్యముకలిగి యుండుటయెగాక సంస్కృతాంధ్రకవులను పోషించినట్లు కనంబడుచున్నది. ఇతనిమంత్రి రామయామాత్యుడు సంగీతశాస్త్రజ్ఞు డనియు, సంస్కృతకవి, స్వరమేళకళానిధి యనుగ్రంథమును రచించి రామరాయల కంకితముచేసి యున్నవాడని యిదివఱకె తెలిపి యున్నాడును. రామరాయలకు సంగీతశాస్త్రజ్ఞానము కలదనియు, వీణపాట యందును సంగీతమునందు నెక్కువయభిరుచి గలవాడయి యుండెనని వీరవేంకటపతి రాయలవారు 1589 లో లిఖింపించినయొక శాసనము వలన దెలియుచున్నది. 1545 లో బాలుడైన సదాశివదేవరాయచక్రవర్తి మహాకవు లయిన తాళ్లపాక తిరుమలయ్యగారికిని వారికుమారు డయినచిన్నకోనేటి తిరువేంగళనాథయ్యగా రికిని గ్రామముల నొసంగె ననిపైనియుదాహరించి యున్నాను. వీరాంధ్రకవులయిన నియోగి బ్రాహ్మణులు, వైష్ణవమతమవలంబించినవారు. తెలుగుద్విపదలలో వైష్ణవగ్రంథములు రచించినవారు వీరే. వీరిద్విపదలు రాగిరేకులమీద వ్రాయబడి యట్టివి వందలకొలదిరేకులు తిరుపతిదేవస్థానములో నున్నవని వినుచున్నారము. మహాపండితుడును మధ్వమతబోధకుడునగు విజయేంద్రస్వాములవారు రామరాయలచే ననేకాగ్రహారములను, కనకాభిషేకములను గాంచెను. అహోబలమఠాధిపతు లయినషష్టపరాంకుశు లనువారు సిద్ధాంతమణిదీపము, పంచకాలదీపిక, ప్రపత్తిప్రయోగ, నృసింహస్తవము మొదలగుగ్రంథములను రచించెను. ఇతడు కొంతకాలము రామరాయలకు కార్యకర్తగ నుండెను.

కాని యీతనియాస్థానకవులలో ముఖ్యుడయినవాడు భట్టుమూర్తి. రామరాజభూషణు డన్నబిరుదమును పొందినవాడు. ఇతడురచించిన వసుచరిత్రము, నరసభూపాలీయము, హరిశ్చంద్రనలోపాఖ్యానము మొదలగుగ్రంథములు రామరాయలమరణానంతరము రచింపబడినవిగా నున్నవిగాని యితనికాలమున రచింపబడినగ్రంథము లేవియు గానరావు. ఇతడు సుప్రఖ్యాతిగాంచిన యాంధ్రకవి యనియెల్లవారికిం దెలియును.


____________