అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/రవీంద్రనాధ టాగూరు 'ముక్తధార'

వికీసోర్స్ నుండి

సాహిత్యరంగం

డా॥ మధురాంతకం నరేంద్ర 98662 43659

రవీంద్రనాధ టాగూరు 'ముక్తధార '

సమకాలీన సాంఘిక రాజకీయ సాంస్కృతిక కల్లోలాల్ని గమనించినప్పుడల్లా వెంటనే గుర్తుకువచ్చే రచన రవీంద్రనాథ్‌ టాగూర్‌ నాటకం ముక్తధార. ఇటీవలి కోవిడ్‌ విపత్మర పరిస్థితి మళ్ళీ మళ్ళీ'ముక్తధార 'ను జ్ఞాపకం చేస్తోది.

1922 రవీంద్రుడు రాసిన నాటకం ముక్తధార. అప్పటికి భారతదేశ స్వాతంత్రోద్యమం పుంజుకోలేదు. అప్పటి విదేశీయ పాలన నేపథ్యంలో వుత్తరకోట, శివతరాయి అనే రెండు రాజ్యాల మధ్య రగిలిన సంఘర్షణను రవీంద్రుడు గొప్ప అన్యార్థ రచన (Allegory)గా తీర్చిదిద్దాడు.

వుత్తరకోట పర్వతాల్లోంచి పుట్టిన ముక్తధార నది శివతరాయి పంటలకు జీవదాయినిగా వుంటోంది. అయితే వుత్తరకోట రాజు రంజిత్‌ శివతరాయినెప్పుడో తన పాలనలోకి తెచ్చేశాడు. శివతరాయినుంచీ విదేశాలకు వ్యాపారం చేయడానికి వెళ్ళే నందికొండ మార్గాన్ని మూసేసి, శివతరాయి ప్రజలు తాము పండించిన పంటల్ని ముడి పదార్ధాల్ని కేవలం వుత్తరకోటకు అమ్ముకునే పరిస్థితి తెచ్చాడు. తక్కువ ధరలకవి కొనుక్కొని, వాటినుంచీ తయారు చేసిన వస్తువులను వాళ్ళకే అధిక ధరలకు అమ్మి, వాళ్ళను తన చెప్పుచేతల్లో వుంచుకున్నాడు. అంతటితో సంతృప్తిపడక ముక్తధార నదికి ఆనకట్ట కట్టి నదినీళ్ళను తన అదుపులో వుంచుకోవడం ద్వారా శివతరాయిని మరింతగా అణగతొక్కాలని నిర్ణయించుకున్నాడు.

అయితే ముక్తధారకు ఆనకట్ట కట్టడం అంత సులభమైన పనేమిగాదు. యెందరో ప్రయత్నించారు. ఆనకట్ట సగంలోనే విరిగి నదివేగానికి తట్టుకోలేక, కొట్టుకుపోయింది. చివరకు విబూతి అనే రాజయంత్ర నిపుణుడు ముక్తధారకు ఆనకట్ట కట్టేశాడు. మొత్తం వుత్తరకోట రాజ్యమంతా, రాజుతో సహా విబూతిని భైరవస్వామి ఆలయంలో సన్మానం చేయడానికి పూనుకుంది. మొత్తం 'ముక్ష్తధార" అనే నాటకం విబూతికి సన్మానం జరుగుతున్న రోజులో జరుగుతుంది.

రవీంద్రుడి నాటకాల్లో రాజులు, నాయకులవంటి ముఖ్య పాత్రలకంటే బిచ్చగాళ్ళూ, యాత్రికులూ, పాటలు పాడేవాళ్లు, దీపాలు అమ్మేవాళ్ళు, 'పెరుగమ్మే పడతులు మొదలైన సామాన్యులే యెక్కువ సేపు కనబడతారు. వాళ్ళు వాళ్ళ నాయకులకంటే యెక్కవగా వుద్రేక పడుతూవుంటారు. శివతరాయి ప్రజలను చూస్తే వుత్తరకోట ప్రజలకు చులకన కంటగింపూ.

రంజిత్‌కు అభిజిత్‌ అనే పెంపుడు కొడుకున్నాడు. శివతరాయి ప్రజలంతా థనుంజయుడనే బైరాగిని నాయకుడుగా గౌరవిస్తూ, వుత్తరకోటపైన తిరిగబడ్డానికి ఆయన అనుమతి కోనం వేచి చూస్తున్నారు. ముక్తధార నదిలో ఆగకుండా పడిలేచే తరంగాల్లా ఆ రెండు దేశాల్లోని ప్రసిద్దులూ, అప్రసిద్దులూ, వరసగా యెదురై భేటీ పడతారు. యొప్పుడో అనాదిలో మొదలై నిరంతరంగా సాగుతూ, భవిష్యత్తులోనూ ఆగకుండా సాగే యీ మానవతరంగాల సమూహాలు వొకదినంలో చేసిన భేటీలతో రవీంద్రుడు మొత్తం సమకాలీన ప్రపంచానికంతా నిలువెత్తు ప్రతిబింబాన్ని నాటకంలో అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. చాలా ముక్తసరిగా చెప్పిన యీ కథనింతవరకూ చదివిన వాళ్లకు శివతరాయి నాటి భారతదేశానికీ, వుత్తరకోట నాటి యింగ్లీషు ప్రభుత్వానికీ ప్రతీకలని స్పష్టంగానే అర్ధమయిపోతుంది. అయితే దాన్ని రెండు సంస్కృతులకు జరిగిన సంఘర్షణగా మాత్రమే గాకుండా సార్వకాలికమైన మానవ జీవన గమనంగా రూపొందించడంలోని రవీం[ద్రుడి ప్రతిభ విస్మయుల్ని చేస్తుంది.

“ముక్తధార” నాటకం అఖిజిత్‌, ధనంజయుడు అనే రెండు యిరసుల పైన సాగే రథం. అఖిజిత్‌ రంజిత్‌ కన్నకొడుకు కాదు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం రంజిత్‌ వొకనాడు వాహాళికోసం ముక్తధార నదీ తీరానికెళ్ళాడు. అప్పుడక్క్మడ నతీ తసిగాల డొలల్లో వూగుతున్నాడేమో కనిపించేలా తీరంలో వో పని బాలుడు కనిపించాడు. ఆ బాలుడు భవిష్యత్తులో రాజాధిరాజు అవుతాడనీ ఆస్థాన జ్యోతిష్యుడు చెప్తాడు. రాజు ఆ బాలుడ్ని అఖిజిత్‌ అని పేరు పెట్టి పెంచుకుంటాడు. యువకుడయ్యాక అతడ్ని శివతరాయి రాజ్యానికి పంపి తన ప్రతినిధిగా పాలించమంటాడు.

అయితే శివతరాయికి వెల్లిన అభిజిత్‌ ఆ దేశప్రజలను పీడించడానికి బదులుగా ప్రేమించడం మొదలు పెడతాడు. కరువు వచ్చిందని పన్నుల్ని వసూలు చేయడు. పైగా ముక్తధార నదిపైన ఆనకట్ట పూర్తవగానే తానో చెరసాలలో పడ్డట్టుగా విలవిల్లాడిపోతాడు. అతనిలోని యీ ఆందోళనను గమనించిన అతని ఆత్మీయ స్నేహితుడు, సంజయుడనే మరో యువరాజు, అతడ్ని వీలయినంతగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన జీవితపు ఆలంబన యేమిటో క్రమంగా యిప్పుడే తెలిసివచ్చిందని - అభిజిత్‌ మిత్రుడికి చెప్తాడు. అతడికి పుట్టుకతోనే ముక్తధార నదితో మానసిక బంధం పడిపోయివుంది. ఆ నదిని బంధించినప్పుడు అతడి మనస్సూ పంజరంలో కట్టుబడిపోయినట్టయి పోయింది. అతనికి మళ్ళీ స్వేచ్చకావాలంటే ఆ పంజరాన్ని పగలగొట్టక తప్పుదు. అది అతడి మానసిక అవసరం. తప్పదు.

మనిషి ప్రకృతిలో వేరుగా వుండడానికి వీల్లేని భాగం. ప్రకృతిలోని వాటిని వాడుకుని మాత్రమే మనిషి జీవిస్తున్నాడన్నదే అందుకు నిదర్శనం. మనిషి మనస్సుకూ, ప్రకృతికీ అవినాభావమైన సంబంధముంది. మనిషీ, ప్రకృతీ సుఖదు:ఖాల్ని పరస్పరం పంచుకోక తప్పదు. ప్రతి మనిషి మనసూ ప్రకృతిలో యేదోవొక దానితో విడదీయరానంతగా ముడిపడి వుంటుంది. అది గుర్తించగలిగిన వాళ్లకు స్వాంతనముంటుంది. ఆయా ప్రాకృతిక భాగానికి దెబ్బతగలడం వల్లనే తమలో అశాంతి పెరుగుతుందని గుర్తించిన వాళ్ళు ప్రకృతిలో సమన్వయంకోసం తమ వంతుపని తాము చేస్తారు. అలా గుర్తించుకున్నవాళ్ళ శాతం బాగా తగ్గిపోయినప్పుడు విపత్తులు తప్పవు.

తన జీవనానందం ముక్తథార నదితో ముడిబడివుందని గుర్తించిన అపురూపమైన మానవుడు అఖిజిత్‌. ఆ నది పాదాల్ని సంకెళ్ళతో బంధించినప్పుడు, అతడు వులిక్కిపడి నిద్రలోంచి మేలుకున్నాడు. అప్పుడతడికి ముక్తధార నదికి కట్టిన ఆనకట్ట మాత్రమే తన చెరశాల కాదని తెలిసింది. వుత్తరకోట సింహాసనం కూడా యిప్పుడతన్ని బంధిస్తోంది. వొకదేశాన్ని వొక ప్రాంతాన్ని మాత్రమే ప్రేమించడం కూడా సంకుచితత్వమే ! రవీంద్రుడు మూర్థంగా మారే దైవభక్తినిగూడా నిరసిస్తాడు. సంకుచితమైన గోడలులేని విశ్వమానవ ప్రేమనే ఆయన గౌరవిస్తాడు.

మానవుడిలో ప్రకృతిపైన వుండాల్సిన, వున్న బంధాన్ని చూపడమే ఈ నాటకపు ప్రధాన వస్తువని చాలాసార్లు రవీంద్రుడు చెప్పాడు. దాన్ని అఖిజిత్‌కు నదితో వుండే బంధంతో మాత్రమే గాకుండా, మిగిలిన యితర ప్రాంతాలతో వుండే బందాలతో గూడా స్పష్టంగా వ్యక్తీకరిస్తాడు. ప్రకృతిలో వున్న ముక్తధార నదితో బాటూ అఖిజిత్‌కు ప్రకృతిలోని భాగమైన మనుషులతోనూ గొప్ప సంబంధముంది. ఆ సంబంధాన్ని గుర్తించడం చేతనే వాళ్ళ పైన ప్రేమతోనే, అతను, తాను, చేయవలసిన, చేయకుండా వుండడానికి వీల్లేని పనికి వున్ముక్తుడవుతాడు.

ముందుగా అఖిజిత్‌ను అత్యధికంగా ప్రేమించే అతడి పెంపుడు తండ్రి కూడా అతడి పైన కోప్పడతాడు. శివతరాయినుంచీ పన్నులు వసూలుచేసి తన దేశానికి కీడు చేశాడని కోప్పడతాడు. చెప్పుడు మాటలు విని పాడయ్యాడని, అతనికా పుట్టుక రహస్యాన్ని చెప్పి తప్పుదారి పట్టించారనీ ఆశ్రితుల్ని తీవ్రంగా మందలిస్తారు.

స్నేహితుడైన సంజయుడు చివరి వరకూ అఖిజిత్‌ను ముక్తధార ఆనకట్టను పడగొట్టనివ్వకుండా ఆపాలనే ప్రయత్నిస్తాడు. అతడ్ని గౌరవించే శివతరాయి ప్రజలను గుర్హుచేస్తాడు. పైగా ఆనకట్టను పడగొట్టడమంటే మరణాన్ని చేరుకోవడమేననీ హెచ్చరిస్తాడు. తనను వదలి వెళ్లవద్దని బ్రతిమాలుతాడు. అయితే యెవరి జీవన గమనం వాళ్ళదని యెవరి గమ్యం వాళ్ళే వెతుక్మోవాలనీ, యింకొకరికి నీడలా జీవించడం తప్పనీ- అభిజిత్‌ మిత్రుడ్ని వారిస్తాడు.

నదికి ఆనకట్టకట్టిన విబూతికి ఆ రోజు ప్రత్యేకమైనది. అందరూ ఆరోజు తననుతప్ప యింకేమీ పట్టించుకోగూడదని అతగాడి వుద్దేశం. సరిగ్గా అదేరోజున శివతరాయి రాజ్యపు నందికొండ మార్గానికున్న అడ్జ్దుగోడను పగలగొట్టారనీ, దాని వెనక అభిజిత్‌ హస్తముందనీ అతడికి తెలుస్తుంది. తన కీర్తికీ, ప్రాబల్యానికి ఆ వార్త గండి కొడుతోందని విబూతి కోప్పడతాడు. సరిగ్గా అదే సమయానికి అభిజిత్‌ తన వార్తాహరుణ్ణి విబూతి దగ్గరకు పంపిస్తాడు. “ఆనకట్టను కట్టడం ద్వారా నీ మేధస్సును నిరూపించుకున్నావు. దాన్నిపుడు పడగొట్టడం ద్వారా గొప్ప మానవుడవని నిరూపించుకో” అంటాడా వార్తాహరుడు. ఆనకట్ట అన్నది విబూతిలాంటి శాస్త్రవేత్తకు కేవలం తన అహాన్ని నిరూపించే వైభవం మాత్రమే. దానిద్వారా శివతరాయి ప్రజల పంట, తిండీ పోతాయనీ, అది వాళ్ళను అదుపుచేసే దుర్మార్గపు ఆయుధమనీ గుర్తించే వోపికా, వెసులుబాటూ విభూతికి లేవు. దాన్ని నిర్మించడం కోసం ప్రాణాలిచ్చిన అనేకమంది యువకుల గురించి అతను పట్టించుకోడు. యెందరో తల్గుల శాపం తనపైన వుందని లక్ష్యపెట్టడు. చివరకు నదిని నియంత్రించడం ద్వారా తానిప్పుడు దేవుడంత గొప్పవాడినయ్యానని భావిస్తాడు. కానీ మానవ నిర్మితమైనవేవీ సంపూర్ణమైనవిగావనీ, ఆనకట్టలో కొన్ని బలహీన భాగాలున్నాయనీ వార్తాహరుడంటాడు. వులిక్కిబడ్ద విబూతి ఆనకట్టకు మృత్యువనే కాపలావాడున్నాడనీ, దాన్నేమైనా చేయబోయిన వాళ్ళనా కాపలావాడు వదలడనీ బెదిరిస్తాడు. అయితే మృత్యువుకు జంకని వాళ్ళుంటారని విబూతికి తెలియదు.

అఖిజిత్‌ను పాడుచేసిన వాళ్ళలో ధనంజయుడనే బైరాగి ప్రముఖుడని రాజు నమ్మకం. అయితే ధనంజయుడనే బైరాగీ, అఖిజిత్‌ అనే యువరాజూ యీ నాటకంలో యెప్పుడూ కలవరు. కానీ ధనంజయుడు చేయాలనుకున్న పనిని అభిజిత్‌ నిర్వర్తిస్తాడు. అభిజిత్‌ జీవన గమనంతో ధనుంజయుడు మానసికంగా మమేకమవుతాడు. ధనంజయుడొకడు మాత్రమే అభిజిత్‌ తనద్దైన కర్తవ్యాన్ని నిర్వర్తించడంకోసం నది దగ్గరకి వెళ్ళాడని తెలుసుకుంటాడు. తమకు మేలుచేసిన అఖిజిత్‌ను తీసుకెళ్ళి తమకు రాజుగా చేసుకోవాలని శివతరాయి ప్రజలూ, తమదేశానికి కీడు తెచ్చినవాణ్ని శిక్షించాలని వుత్తరకోట మనుషులూ యెదురు చూస్తున్నారు. అఖిజిత్‌ను అటు వెళ్ళనివ్వకుండా సంజయుడు వెంటాడుతూనే వున్నాడు. ధనంజయుడు అఖిజిత్‌ తననితాను యెర్రటి తామరలా సాయంకాలపు వేళ ఆవలితీరంలో సమర్పించుకోబోతున్నాడని యెలుగెత్తి చెప్తాడు.

ఆనకట్ట విస్ఫోటనం ముందుగా విబూతే వింటాడు. పరిగెత్తి వస్తున్న నదినీళ్లలో అభిజిత్‌ బుడి బుడి నడకల సవ్వడి రంజిత్‌ కు వినబడుతుంది. ఆనకట్ట అనే యంత్రం తిప్పికొట్టినప్పుడు, నది అభిజిత్‌ శరీరాన్ని తల్లి బిడ్డను మోసుకెళ్ళినట్టుగా లాక్కెళ్ళిపోయిందని చెప్తాడు సంజయుడు. యిప్పుడు అభిజిత్‌ శివతరాయి, వుత్తరకోటల రెండింటి వాడూ అయ్యాడని ధనంజయుడు ఘోషిస్తాడు.

రవీంద్రుడి మార్మికత (mysticism) అస్పష్తమైనదీ, అయోమయమైనదీ గాదు. ఆయనకు మనిషీ, ప్రకృతి, దైవమూ అన్నీ వొకటే. మానవత్వమే దైవమనీ, ప్రకృతికీ దైవానికీ తేడా వుండదనీ ఆయన రచనలన్నీ చెప్తాయి. ప్రకృతిలో జీవించే మానవుడే గొప్ప సంపన్నుడనీ, ప్రపంచంలోని గొప్ప సంపద ప్రకృతేననీ రవీంద్రుడు గుర్తించాడు. అందుకే ప్రకృతిని యిబ్బంది పెట్టే దేన్నీ మనిషి చేపట్టకూడదని అంటాడు. అవసరాలకు తగినంతగా నీటిని ఆపి వాడుకోవడం తప్పుకాదుగానీ, అందరికీ అయిన నీటిని తాము మాత్రమే దోచుకోవడాన్నీ యితరులను యిబ్బంది పెట్టేందుకు నీటిని అదుపులో పెట్టుకోవడాన్ని ఆయన 1922 లోనే నిరసించాడు.

ప్రకృతితో ప్రతిమనిషికి మానసిక బంధముంటుందని ఆయన గుర్తించమంటాడు. ఆ అవగాహన, సత్యం బొధపడినప్పుడు మనిషి ప్రకృతికి విధేయంగా జీవించ గలుగుతాడు. ప్రకృతిలోని భాగమైన తోటి మానవులతోనూ అంతే సమన్వయంతో జీవిస్తాడు. అప్పుడు జీవనం ఆనందప్రదమవుతుంది.

'ముక్తధార' అనే పేరులోనే అ నది స్వభావం స్పష్టమవుతుంది.దాన్ని ఆపడం మనుషుల చేతనయ్యేపనిగాదు. అది ప్రకృతి అంత స్వేచ్చవున్న నది. రవీంద్రుడీ గొప్ప నాటకంలో అనేక అడ్డుకట్టల్నీ వాటినన్నింటినీ పగలకాట్టాల్సిన అవసరాన్ని పేర్కొంటాడు. ప్రేమ, స్నేహం, సాన్నిహిత్యం, త్యాగం లాంటివాటి నన్నింటినీ పునర్విచించుకోవాల్సిన అవసరాన్ని రవీంద్రుడెప్పుడో గుర్తుచేశాడు. దురభిమానాన్ని దునిమేదీ, సందేహాల్ని పోగొట్టేదీ, సంకెళ్లను పగలగొట్టేదీ అయిన ప్రకృతినే ఆయన దైవంగా భావించాడు. ఆ జ్ఞానం మనుషులందరికీ కలిగినప్పుడు మాత్రమే యీ ప్రపంచం నివాసయోగ్యంగా వుండగలుగుతుంది.