Jump to content

అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/మాఊరు

వికీసోర్స్ నుండి

హోసూరు తావు నవల

అగరం వసంత్‌ 094883 30209


"సవరెయ్యి పొద్దులా తాయప్పమాస్టర్ని పోలీసులు అరెస్టు చేసిరంటా” అనే సుద్ది వూరువూరంతా మాట్లాడతా వుండారు. జనం గుంపులు గుంపులుగా జగిళ్లతావ గుదితావ చేరిండారు. ఇంకొందరు పోలీస్‌స్టేషన్‌కి పోయేకి సురువు అవతా వుండారు. నేనూ కాకన్నా తాతకూడా ఆవులు మేపేకని కావలి పక్మకు కదలి పోతిమి.

“ఏల తాతా తాయప్పమాస్టర్ని పోలీసులు అరెస్టు చేసింది” అంటా అడిగితిని.

“తరతరాలనింకా మన తావుల్లా వుండే ఇస్మూలుల్లా తెలుగు తల్లి ప్రార్ధన పాడేది వాడిక. ఈనడమ కొత్తగా సర్మారువాళ్లు తెలుగుతల్లి ప్రార్థనకి బదులుగా తమిళతల్లి ప్రార్థన పాడాలని రూలేసిరంట, దాన్ని ఎదిరిచ్చి తెలుగుసంఘమోళ్లు ఆర్భాటము చేస్తా వుండిరంట. ఆపొద్దు బుదవారము సంత కదా, ఈ విషయము సంతలాని జనాలకి తెలిసి గలాటాలు సురువు అయ్యి, అంగళ్లపైన వుండే తమిళబోర్జుల్ని పీకేసి, పోలీసులపైన రాళ్లేసిరంట. ఓసూరులా వుండే పోలీసుల చేతిలా గలటాలు అదుపు చేసేకి కాకుండా ధర్మపురినింకా పోలీసుల్ని పిలిసిరంట. వాళ్లు వచ్చే దోవలా జీపుకు ఆక్సిడెంట్‌ అయి దాంట్లో కొందరు పోలీసులు సచ్చిపోయిరంట. ఆ కోపమో ఇంగే కోపమో తెల్లేదు, తెలుగుమాస్తర్లని, తెలుగుసంఘమోళ్లని అరెస్టులు చేసి కేసులు పెడతా వుండారు” అనె.

నేను తమిళనాడులా వుండాను అనె సొరణ (స్పృహ) నాకు అబుడు కదా తట్టె.

“మన తావు తెలుగుతావు, పల్లెలంతా తెలుగు. ఇప్పటికీ చానా పల్లెల్లా ఒగే ఒగ తమిళ కడప కూడా లేదు. అట్లాతప్పుడు ఆంధ్రాలా కదా వుండాల్సింది. ఏల తమిళనాడులా వుండాము అని అడిగితిని.

“ఇపుటి తమిళనాడు, ఆంధ్రా, కర్నాటక ఇట్లా దక్షిణభారత దేశమంతా అపుడు మద్రాస్‌ స్టేట్‌లానే వుండె. అట్లాతబుడు మన తావులా తెలుగు ఓ వెలుగు వెలిగె. తాటి ఆకుల పొత్తాలు, పట్టుబట్టా నెమలిపించం రాతల్లా మెరసి నిలిచె. ఇండ్లు, అస్తి పాస్తులు, వూర్ల సమాచారాలు, కొండల చరిత్ర అంతా తెలుగే, ఇంగ్లీషువాని కాలంలా

సేలం జిల్లాలో మన తావు వుండె. అబుడు ఇంగ్లీషు సర్కారు వేసిన (ముద్రించిన) కాసుల్లా (నాణ్యాలు) తెలుగు -ఇంగ్లీషు రెండు బాసలు మాత్రమే వుండె. మనకి స్వాతంత్ర్యము వచ్చిన కొన్నేండ్లకి, మాకు వేరే తెలుగురాష్ట్రము కావాలని తెలుగన్నలు పోరాటము సురువు చేసిరి. దేశములా వుండే తెలుగుతావుల్లా అంతా కూడా గలాటాలు జాస్తి ఆయె. బళ్లారి, బరంపురము, మన ఓసూరులాను ఇంగా జాస్తిగా గలాటాలు ఆయె. దేశనాయకుడైన రాజాజీ పుట్టింది, పెరిగింది మన తొరపల్లిలానే, మన తాలూకాలానే. అట్లా నాయకుణ్ణి ఎదురించి ఫోరాడితిమి. ఎందరో జైలుకి పోయిరి, మన తావుల్లా వుండే నూరారు పంచాయితీలలా ఓసూరు ఆంధ్రాకి చేరాలనే తీర్మానాలు చేసిరి. అబుడు నాయట్ల వయసు చిన్నోళ్లంతా చేరి ఆంధ్రా వచ్చిస్తావుందని పండగ చేసుకొంటిమి. మదరాసు సర్మారు కూడా, ఇది ఆంద్రాకి చేరే తావే అని మత్తిగిరి కేటిల్‌పారంలా వుండే గొడ్డూ గోదానంతా మద్రానుకి సాగిచ్చిరి. అందాతలికే ఏమాయెనో మన ఓసూరు లేకుండానే ఆంధ్రరాష్ట్రము వచ్చిడిసె. 'రాజాజి చావాల... ఓసూరు ఆంధ్రాలా చేరాల” అని ఓసూరు వీదుల్లా పెట్ట పెద్ద అక్షరాలు రాసి కొందరు తిరగా గలాటాలు సురువుచేసిరి.

అబుడు సర్మారోళ్లు పటాస్మర్‌ కమిషన్‌ వేసిరి. వాళ్లు కొన్నాళ్లకి తమ రిపోర్టును సర్మారుకి ఇచ్చిరి. దాంట్లో, ఓసూరులా శానా పెద్ద గుంపుగా తెలుగువాళ్లు, ఆమీట కన్నడమువాళ్లు, కడగా తమిళులు వుండారు. ఇది మూడు బాసలు వుండే తావు, అని వుండే విషయాన్ని చెప్పకుండా ఏదేదో చెప్పిరి. ఆమీట సర్మారోళ్లు మెల్లిమెల్లిగా తెలుగు ఆర్బాటాన్నీ అణచిరి” కాకన్న తాత బాధగా అనె.

కాకన్న బాధని చూసి ఎండలకి కూడా బాగా మండినట్లుంది. బండలు పగిలే మాదిరిగా ఎండలు కాస్తా వుండాయి. నా ఒంట్లోనింకా చెమట చుక్కలు కారి నేలని నానపతా వుండాయి.

“నీ తావు గురించి అసలు విషయము ఏమని ఇపుడు తెలిసెనా పా” గుట్టన్న అంటా వుండాడు.

“ఆంధ్రరాష్ట్రము వచ్చినపుడు మిగిలిన మద్రాసు రాష్ట్రములా, అదే ఇబుడు తమిళనాడులా వెయ్యారు తెలుగు ఇస్ఫూళ్లు వుండె. ఇబుడయి నూర్లకి దిగిండాయి. ఆంధ్రాలా తెలుగుని ఇంగ్లీషు మింగతా వుంటే, బయట వుండే తెలుగు తావుల్లాని తెలుగుని తమిళము, కన్నడము, మరాటి, ఒరియా బాసలు మింగేస్తా వుండాయి. అది తెలుసుకోప్పా” అని చెట్టు నా చెవిలా చెప్పతా వుంది.

“తేటతెలుగు మాటలు అంటే మాకు చానా ఇష్టము. దాన్నింకానే మేమూ ఇంతకాలం పలికితిమి. మా బిడ్డలు కూడా అదే చేస్తారు. కాని మీరేల ఇట్ల చేసిరి. మీ బిడ్డలు ఏల తెలుగు బాసకి దూరమైరి” గువ్వమ్మలు గూటిపైనింకా అంటా వుండాయి.

వాళ్లు అనేదంతా నేను వింటా వుండాను. ఇంగా ఎంత వినాల్సి వుందో. ఈ కండ్లలా ఎంత చూడాల్సి వుందో. యోచన చేస్తా వుండా... ఆ యోచనలా అమ్మ గేణానికి వచ్చె.

“మూపుసారి వచ్చేతబుడు చేనుతాకి పోయి కట్టెలు తేప్పా” అని అమ్మ చెప్పిన మాట అట్లే తట్టె. ఇదే మాట కాకన్న తాతకి చెప్పి, నేను చేను తాకి పోతావుండా...

"బూలోకములా మనిషిగా పుట్టినంక వాని బాస వాడు చదవతా, వాని పని వాడు చేస్తా, వాని బతుకు వాడు బతికేకి అయ్యే లేదా? ఏలిట్ల, ఏడ తప్పు జరిగె, ఎవరు తప్పు చేసిరి, ఎవరో... ఏదో.. చేసిన తప్పుకి మాకు శిక్షనా? మాకు బాధలా” అనుకొంటా కట్టెలు ఏరి మోపు కడతా వుండా.

“తాయప్ప మాస్టర్నే కాదు, ఇంగా చానా జనము మాస్టర్లని, తెలుగు సంఘమోళ్లని జైలులా పెట్టి పోలీసులు బాగా కొట్టిండారంట, ఇది చానా అన్యాయమని వీళ్లంతా చేరి ఆంధ్రా సి.యం. తావుకి పోయి మా పరంగా ఒగ మాట మాట్లాడండ అని అనిరంట. దానికి ఆ పెద్దమనిషి మీరు తమిళనాడులా చేరిపొతిరి, అట్లాతబుడు మీరే అన్ని సరుసుకొని పోవాల, అది తెలుసుకోకుండా ఈడికి ఎగేసుకొని వస్తిరా, అని ఉమిసెనంటా, మనోళ్లకి పోలీసులు కొట్టిన వేటుల కన్నా ఆయప్ప మాటలు చానా జోరుగా తగిలి తలతిరిగెనంటా” అని పెద్దోళ్లు మానునీడలా మాట్లాడతా వుండారు. వాళ్ల మాటలు వింటానే నాకు అదో మాదిరిగా అయిపోయె. ఉసూరని ఆడే రవంతసేపు కూకొనేస్తిని.

“శీలంక తమిళుల గురించి, మన దేశంలాని, దేశాను దేశాలలాని తమిళుల గురించి తమిళసర్మారు కేంద్రసర్మారుని మూడు చెరువుల నీళ్లు తాపతా వుందే, అట్లాతబుడు తెలుగుసర్మారు మా గురించి ఒగ మాట మాట్లాడేకి ఏల కాలే” అంటా గోపన్న అనిన మాటల్ని గేణము చేస్తా కాకమ్మ పక్క చూస్తిని.

“ఒగ్గట్టు లేని జాతిరా మీది, మీ జాతికి నా జూటీ కొట్టా” అంటా నన్ని ఉమిసె.

మొదలే సుస్తు అయింటిని. ఆయమ్మ అట్ల ఉమిసేతలికి కళతప్పి కిందకి పడిపోతిని.

“ఉండావా... పోయేసిండావారా" అంటా చీమక్క దోమక్క వచ్చినన్ని కరిచిరి. అబుడు నేను కండ్లు తీస్తిని. మెల్లిగా లేచి కట్టెల మోపును తలపైన పెట్టుకొని ఇంటిదావ పడితిని.

“చింతలేని బతుకునా జీవాలది” ఆవుల్ని అదిలిస్తా మీసాల మామ అంటా వుండాడు.

“బూలోకములా ఛింత చేసే జీవి మనిషి ఒగడే. ఆ చింతే మనిషిని జీవాలనింకా తనీ (వేరు) చేసె” బోగొప్పగా బెగ్గిలన్న అనె.

“ఊ... ఊ.. ఆ చింతే మనిషిని మనిషిగా చూడకుండా చేసె. కులమతాలు పుట్టిచ్చి కొట్టుకొని చచ్చే మాదిరిగా చేసె” మేకల్ని తోలతా కిట్టన్న అనె.

“ఏలిట్ల చింతన చేసిరి, ఎవరీ చింతన చేసిరి " సీరామన్న అడిగె.

“ఒళ్లు వూనము కాకుండా బతికేకి, ఓసిగా (ఊరకే) నక్కేకి, కొందరు నాయాళ్లు కలిసి ఇట్లా చింత చేసిరి” సాకన్న చెప్పె.

“సత్యమైన మాట చెప్పితివినా... ఈ గుట్టు తెలీక, తెలిసినా తెలియనట్ల జనం నాటకం ఆడతా వుండారు” గట్టిగా అనె బొట్టన్న

“ఈ బూలోకములా మనిషి మనిషిగా బతకాలంటే ఇంగెందరు చావాల? ఇంగేమి చేయాల?” గుండప్ప గంట కొట్టినట్ల అంటా వుండాడు.

గుండప్ప దణిని (ధ్వని) రంగన్న విననట్ల వుండాడు. “చింతా చేసిన ఇబుడే సిద్దించు పరమపదవి” అని అంటా వుండాడు. అందరు అనిన మాటల్ని వినుకొంటా కట్టెలమోపు తెచ్చి జగిలిమింద వేస్తిని. యోచన పైన యోచన చేస్తా గుడితాకి పోయి మెట్లమింద కూకొంటిని.

“ఆ ఇస్మూలు, తెలుగు ఇస్మూలు. కోదండరామయ్య కాలములా కట్టింది. ఆ మేస్టరు, ఈ మేస్టరుకే కాదు మన తావులా చానా తెలుగు మేస్టర్లకి గవర్నమెంటు ఉద్యోగాలు వచ్చింది అబుడే. అంతేల, ఈ పొద్దు మన తావు రైతులు నీళ్లకి కొదవ లేకుండా పంటలు పండిస్తా వుండారంటే దానికి కారణము కోదండరామయ్య. కెలవరిపల్లి డ్యాం కట్టింది ఆయప్ప కాలములనే. ఓసూరులోని ఆంధ్ర సాంస్కృతిక భవనాన్ని కట్టించింది ఆయప్పే” అంటా గొప్పగా చెప్పతా వుండాడు చూడన్న.

“రాయలను ఆశ్రయించిన తొలి తెలుగుకవి ఎవరు? కృష్ణదేవరాయల కుటుంబము, మహాత్మాగాంధీ ఈ బుక్కులన్నీ ఆయప్ప రాసిండె. అంతేకాదు రాయల యుద్దవిజయము, పరిపాలన, సాహిత్యపోషణ, వంశము, భక్తి, దేవాలయ కైంకర్యాలు, జానకీపతి శతకము, అచ్యుతరాయ శతకాలు రాసిండె. కాని ఆయన పోయినంక అవి బుక్కులుగా లెక్కకి రాలే " బాదపడతా అనె కెంపన్న.

“ఓసూరు తావు ఆంధ్రాలా చేరాలని కంకణము కట్టుకొని తిరిగి, ఈ సమాచారాన్ని ఆంధ్రా పెద్దలతావ చెప్పి చానా తిరిగె. చానా బాదపడె. కాని తమిళనాడులానే నిలచిపోయె మన ఓసూరు. అట్లా తబుడు తను చేస్తా వుండిన సర్మారిమేష్టరు పనికి రాజీనామా ఇచ్చి మన తావునింకా ఎమ్మేల్యేగా నిలచి గెలచి అబుటి తమిళనాడు చట్టసభలా తెలుగువాణిని వినిపించి తెలుగు కోసరము పాటుపడె, ఆంధ్రాలా వావిలాల గోపాలయ్యకి మన కోదండరామయ్యకి చానా బందముంది. అది ఏమప్పా అంటే బాసాబందము, బాసాసేవ, నిండుతనము, నిరాడంబరము... ఇది మన అందరికి ఆదర్శమే.

ఈ ఆదర్శమే మన ఎమ్మెల్యే వెంకటసామన్నని తమిళనాడు చట్టసభలా తెలుగుమాట వినిపించే మాదిరి చేసె. మన తావు ఇంగో ఎమ్మెల్యే రాజారెడ్డిగారిని తెలుగుదండోరా వేపిచ్చి, తెలుగుకు జై కొట్టేలా చేసె. అట్లే ఆమీట ఎమ్మెల్యే అయిన గోపీనాథ్‌ ను తమిళనాడు చట్టసభలా తెలుగుతల్లి మీద ప్రమాణం చేసి చరిత్రకి ఎక్కే మాదిరిగా చేసె. ఇదే అభిమానమే ఎందరో తెలుగు అభిమానుల్ని తయారు చేసి ఇబుడికీ ఈడ తెలుగుకు జై కొట్టే మాదిరిగా చేసె” అని వీరముగా లేచె ఈరన్న.

అబ్బబ్బ ఎట్లా వాడప్ప మా కోదండరామయ్య. అందరూ కాలములా కలిసిపోతారు. ఈయన ఏమప్పా కాలమునే తనదిగా చేసుకొనిండాడు. “అది కోదండరామయ్య కాలము” అని జనం అంటా వుండారే. ఎట్లా ఘనమైన బతుకు ఆయనది. బతుకంటే ఇది కదా... కుక్కా బతుకుతుంది, నక్కా బతుకుతుంది. మనిషీ బతుకుతాడు. ఏమి ఫలము. వీడు ఎబుడు చస్తాడ్రా అని అనిపించుకొని బతికేది ఏమిటికి? అది ఒగ బతుకేనా... ఇట్లా వాళ్లు బతికేది ఏమిటికి.. గతికేది ఏమిటికి.. యోచన చేయండ.

“మండలి వెంకట కృష్ణారావుగారు మొదటి తెలుగు ప్రపంచ మహాసభల్ని ఏర్పాటు చేసింటే దాంట్లో కలుసుకానె. 1984 జూన్‌ 4న హైదరాబాద్‌ కార్యాలయములా ఫోను ఎత్తుకొని “తెలుగు...తెలుగు” అనే మాట అంటా కోదండరామయ్య కన్నుమూసిరంట. వేలవేల తెలుగుజనం మనతావు తెలుగుజనం చేరి ఓసూరులా మన్ను చేసిరంట. మన్నులా నింకా వచ్చిన మనిషి తిరగా మన్నులాకే చేరిపాయె”. బోబుద్ది వుండేవోళ్లు, బుద్ధిలేని వాళ్ల మాటలు వినుకొని ఒగొగ మెట్టు గుడిమెట్టు దిగతా ఇంట్లోకి పోతిని.

ఇంగా ఎక్కాల్సిన మెట్లు ఎన్నుండాయో! నక్మాల్సింది (తినాల్సింది) ఎంతుందో! పెద్దోళ్లు చెప్పేది, చిన్నోళ్లు చేసేది. మంచి విన్నపము, చెడ్డ బుద్ధి, ఇస్మూలు పాఠాలు, వీది గుణపాటాలు, నన్ను సాకిన బావురపిల్లి, బాలాబిక్షం పెట్టిన పులి, కతలు చెప్పిన శెనిగి నక్క వెతలు విన్న బుడిగి నక్క, కష్టం విలువ కొలిచిన కాకన్న, నష్టం విలువ తనలా నింపుకొన్న నాగన్న, కాసుల వేటని... కసాయి మాటని, వింటా నేను, కంటా నేను, కాలంలా కలిసి కదలి పోతావుండాను. అబుడు నన్ను చూసి నగి (నవ్వి) రమ్మని పిలిచె ఇస్మూలు, సర్మారి ఇస్మూలు. రామ్‌ప్రకాష్‌ విజయలక్ష్మి హైయర్‌ సెకండరి ఇస్మూలు ఈ ఇస్మూలులా పదోక్లాసు నాది.

ఇస్మూలు బయట లోపల తెలుగు వినబడతా, కనబడతా వుంది. పచ్చని తెలుగుతోటలా మా ఇస్మూలు, తోట చుట్టూరా తన గమ్ములని గుమ్మరిస్తా నిలచిండే కన్నడమ్మ. తోటలా ఆడాడ అరవ మొలకలు.

అయితే ఏమి? తోట మాదే. తోట అంతా మేమే. మాదే పెద్ద గుంపు. పదో క్లాసులా నాది ఆ పొద్దు మొదలు దినము. ఇస్మూలు బెల్లు కొడతానే పోయి గ్రౌండ్లా నిలుచుకుంటిని.

“ఎవ్వని చే జనించు...” తెలుగుతల్లి ప్రార్ధన పాడినంక“ నీరారుం కడలుడుత్త” తమిళతల్లి ప్రార్ధన పాడినంక క్లాసుకి పోతిని.

మొదలు పిరియడ్‌ తెలుగు. చంద్రశేకర మాస్టరు వచ్చి తెలుగు పద్యము రాగము తీస్తా వుంటే... మేమంతా కిసిక్‌ మిసిక్‌ (సైలెంట్‌ గా) అనుకుండా వింటిమి. తెలుగుపద్యము గనత కనుగొంటిమి.

మా ఓసూరు తావులా ఊరికొగరు పద్యాలు రాసేవాళ్లు వీదికొగరు పద్యాలు పాడేవాళ్లు వుండారు.

నేను పెద్దవాడుగా అవుతా వుండాను.

మా ఓసూరు పెద్దదవుతా వుంది.

ప్యాక్టరీలకని చేనులిచ్చిన మాతావు రైతులు మాత్రం దినదినానికి చిన్నోళ్లె పోతావుండారు.

పాలు అమ్మతా ఒగరు. కూరాకు అమ్ముతా ఇంగొగరు. ఒగనాడు వూరిని సాకిన రైతులు, దేశానికి అన్నం పెట్టిన రైతులు. ఇబుడు అన్నానికి అలస్తా వుండారు.

ప్యాక్టరీలకి పనికి వచ్చిన దిగువసీమ వాళ్లు పెద్దోళ్లె దర్జాగా గాడీల్లా (టూ వీలర్స్‌) తిరగతా వుండారు.

ఇది కాలానికి తగినట్ల కోలాట కాదు. కాలంలా ఇదే కాలంలా మా కాలంలానే కుతంత్రాలు పన్నిన కొందరు కంత్రీల ఆట ఇది.

"రేయ్ చిన్నా ఈ తమిళాయమ్మ ఏమో అడగతా వుంది, నువ్వు వచ్చి అర్థం చెప్పు” అమ్మ అంటా వుంది.

ప్యాక్టరీలలా పనిచేసేకి వచ్చిండే తమిళులు మా వూరి చుట్టూ ఇండ్లలా బాడిగకు దిగిండారు. కొందరు చిల్లర అంగళ్లు పెట్టిండారు.

మా ఇంట్లో తమిళము మాట్లాడేకి ఎవరికీ వచ్చేలేదు. నేను పదోతరగతి చదవతా వుండా పెద్ద ఇస్మూలులా. దాన్నింకా నాకు తమిళము వస్తుందని అమ్మకి నమ్మకము.

ఏట్లో బాదపడి ఆయమ్మ కందిబ్యాళ్లు అడగతా వుందని అమ్మకి చెప్పితిని కాని నాకు మాత్రం తమిళం ఏం తెలుసు? ఎట్ల తెలుసు?

ఇంట్లో మాట్లాడేది తెలుగు, వీదిలా మాట్లాడేది తెలుగు, ఆడేది తెలుగు ఆట, పాడేది తెలుగు పాట, చూసేది తెలుగు సినిమా.

మా ఇంటి పక్మబా తమిళాయన చిల్లర అంగడి పెట్టిండాడు. ఆయప్పకి సరుకుల పేర్లు తెలుగుపేర్లు నేర్చేకి పోయి నేను తమిళం నేర్చుకొంటిని. కాని ఆ అప్ప ఒక తెలుగుమాటనూ నేర్సుకోలే. వాడు గుగ్గు నేను గొప్ప అని ఆపొద్దు అనుకొంటిని. వాడు కాదు నేను గుగ్గు అని తెలుసుకొనేకి నాకు చాన్నాళ్లు కాలే.

ఆపొద్దు మట్టమద్దేనము మబ్బులు ముసురుకొనిండాయి. ఆకాశములా పొద్దప్పని జాడ కానము (లేదు) పడీపడనట్ల వానచినుకులు. మమ్మలందర్ని కలస్తా కలపతా చల్లనిగాలి. గాలికి లేనిది, ఎండకు లేనిది, నేలకి, నిప్పుకి లేనిది మనిషికి మాత్రమే వుండేది, అదేమని మీకందరికీ తెలుసు కదా! అది మా క్లాసులా కొందరి చిన్నోళ్లకి చానానే వుందని ఈ నడమే నాకు తెలుస్తా వుంది. అబుడు కిష్టారెడ్డి మాస్టరు చరిత్రపాటము చెప్పేకి క్లాసులాకి వచ్చిరి.

“ఈ పొద్దు నేను పాఠాలు చెప్పేలే. మీరే మీ మనసుని కదలించిన లేదా మీరు దిగులు (భయం) పడిన విషయము గురించి నాలుగు మాటలు రాయండా” అనిరి.

మేమంతా పెన్ను పేపరు ఎత్తుకొని రాసి, ఒగొగరే మేము రాసింది చదవతా వుండాము.

మల్లిగాడు వచ్చి తాను రాసింది చదివె.

“నేను మొన్న మన ఓసూరు బస్టాండులా బస్సుకని నిలుచుకొని వుంటిని. అదెబుడు వచ్చేసెనో పెద్దపులి వచ్చి నా పక్కలా నిలుచుకొని వుండె. దాన్ని చూసి నాకు దిగులాయె”.

“ఆహా! ఏమి రాస్తివిరా, ఓసూరు బస్టాండు, ముందర మాదిరిగానా వుంది. ఎబుడు చూసినా వేయారుమంది జనం నూరారూ బస్సులు నిండిపోయి వుంటుంది. అట్లా జాగాకి వచ్చిన పులి నిన్ను కరిచి నోట్లో వేసుకోకుండా నిన్నే చూస్తా వుందా. అయినా ఇపుడు అడవుల్లానే పులులు లేవు కదరా, అట్లాతబుడు అదెట్ల ఆడికి వచ్చె. నీ రాతని చూస్తే నాకు నగువస్తుందిరా” అంటా నగిరి సారు.

మేము అంతా నగినగి పెట్టేస్తిమి. అందాతలికే పీను (ప్యూన్‌) ఒగ పేపరుకట్ట తెచ్చి మాస్టరికి ఇచ్చిరి.

“వచ్చే ఆయితారము మన ఆంధ్ర సాంస్కృతిక సమితిలా శ్రీకృష్ణదేవరాయల పట్టాభి షేకము జరుగుతుందంటా, అందరు ఫొండా” అని చెప్పి పోయిరి సారు.

ఆయితారము సొద్దిననే నేను నా సావాసగాళ్ల జతలా సమితికి పోతిని. ఓసూరుకి గుండెకాయ అట్లా జాగాలా వుంటుంది సమితి భవనము. సమితికి పోయే దోవ పొడువునా బేనర్లు కట్టిండారు.


కోదండరామయ్య కాలము నింకా, ఈపొద్దు వరకు తెలుగు కళలకి, నాటకాలకి, కతలకి, కవితలకి, పాటలకి, పద్యాలకి తెలుగు ఉద్యమాలకి ఇది పుట్టినిల్లుగా వుంది.

సమితి గేటు దాటి లోపలికి పోతిని. అబిటికే ఆడ కోదండరామయ్య విగ్రహానికి పెద్దోళ్లు పువ్వులు వేసి మొక్కుతా వుండారు. నేనూ అట్లే చేసి హాలులాకి పోతిని. జనం నిండిపోయి వుండారు.

శ్రీకృష్ణదేవరాయలుగా బాగలూరు బాలక్రిష్టప్పగారు, అల్లసాని పెద్దనగా కలువకుంట నారాయణ పిళ్లెగారు, రామరాజు భూషణుడుగా నాగప్రసాద్‌ మేస్టరు, దూర్ణటిగా అలసపల్లి చంద్రారెడ్డి, అయ్యల రాజు రామబద్రుడుగా సత్యనారాయణా చారి, మాడయ్యగారి మల్లనగా బారందూరు ఎస్‌.టి.రాజు మేస్టరు, పింగళి సూరనగా పాతమత్తిగిరి సుబ్రమణ్యం, రామకృష్ణ కవిగా దేవిశెట్టిపల్లి మునిరాజు గార్లు వేషాలు వేసిండారు.

సమితి అధ్యక్షులు లక్ష్మ్మీనారాయణయ్య మరియు కార్యదర్శి అన్నయప్ప మేస్టరు వేదిక మీదకి వచ్చి శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకాన్ని దీపము వెలిగించి ఆరంబము చేసిరి.

ఒగొగ ఘట్టాన్ని రక్తి కట్టిస్తా వాళ్లు పద్యాలు పాడతా మాటలు మాట్లాడతా వుంటే చూసే కండ్లకి వినే చెవులకి ఈ జన్మకిది చాలు అనిపిచ్చి.

ఆమీట రవంతసేపు తెలుగు సంఘము వాళ్లు అదే వేదిక మీద మీటింగు పెట్టిరి.

“తెలుగుమేస్టర్ల పోస్టులు బర్తీ చేస్తా లేరు” ముగళూరు రామస్వామిరెడ్డి గారు మాట్లాడిరి.

“బస్సుల్లా, బస్టాండుల్లా, తెలుగుపేర్లు తుడిచి తమిళపేర్లు రాస్తా వుండారు. దీన్ని ఖండించి వచ్చే శుక్రవారము నాడు పోరాటము చేయాల, మీరంతా తప్పకుండా రావాల” అగ్గాండపల్లి సత్యనారాయణ రెడ్డిగారు చెప్పిరి. తెలుగుబాస తొందర్లే కాదు రైతుల తొందర్ల గురించి వడ్డపల్లి చిన్నగుట్టప్పగారు మాట్లాడిరి. కిష్టగిరి జిల్లా తెలుగు రచయితల సంఘము నింకా మాట్లాడిన అగ్గరారం నారాయణన్న మాటలు జోరుగా వినబడతా వుంటే నాగొండపల్లి కిష్ణన్న మాటలు చిన్నగా వినబడతా వుండాయి.

మాటలు ఎట్ల వినబడినా దాని భావము మాత్రము ఒగటే. తెలుగుకు అన్యాయం జరగతా వుంది దాన్ని ఎదురించి పోరాడాల, మనము అనుకొనింది సాదీయాలనేదే అందరి మాట.

“ఇటు చూసినా తెలుగే అటు చూసినా తెలుగే ఎటు చూసినా తెలుగే... తెలుగు వినబడాల... తెలుగు కనబడాల... జోరుగా కిర్లతా తెలుగుసంఘమోళ్లు ఎం.జి. రోడ్డులా పోతా వుండారు. నేనూ నా సావాసగాళ్ల జతలా చేరి ఇంగా జోరుగా కిర్లతా పోతా వుండాను.

నేతాజిరోడ్డు దాటి ధర్మాసుపత్రి దాటి తాలూకా ఆఫీసు కంటా పోతిమి. ఆడ రవంతసేపు నిలిస్తిమి. తెలుగు సంఘమోళ్లు పై అధికారులకి వినతి పత్రాలు ఇచ్చిరి.

ఆమీట నెలకి ఆర్భాటము చేసిన ఫలితము అందరికి అందె. అంటే బస్సుల పైనా, బస్టాండులా తెలుగులా పేర్లు గవర్నమెంటు వాళ్లు రాసిరి.

తెలుగుకోసం ఉద్యమించిన గడ్డ, తెలుగు ఉద్యమాల గడ్డ మా ఓసూరంటే అది అతిశయోక్తి కాదు.

నేను పదోక్లాసు ఫస్టుక్లాసులా పాసైంది మాత్రము మా వీది వాళ్లకి అతిశయోక్తి గానే వుంది. ఏలంటే నేను ఎబుడు చూసినా చేనుకి, చెట్టుకి తిరగతానే వుంటిని. ఇంగ ఇస్మూలుకి చక్కరు కొట్టి (డుమ్మా కొట్టి) తెలుగు ఫోరాటాలకి, తెలుగు సినిమాలు చూసేకి పోతా వున్నింది వాళ్లకి బాగా తెలుసు.

“పదిపనులు చేసేవాడు పదకొండో పని చేస్తాడు. నువ్వ సరిరా” అని రామన్న నన్ను మెచ్చుకొనె. అమ్మ నన్ను తబ్బుకొని చానా ఆనందము పడె.

వీళ్ల మెచ్చుకోలుని మెడమింద వేసుకొని పదకొండొ క్లాసుకి చేరితిని. కానీ ఆడ అసలుకత సురువాయ. ఏలంటే పదికి పైన క్లాసులు తెలుగులా చదివేకి మాస్ఫూల్లాలే. దాన్నింక ఇంగ్లీషు మీడియంకి చేరిండాను. రెండేండ్లు ఇంగ్లీషు చదువుల్లా మునిగి తేలి కడకి పెయిలై ఇంట్లో సోడ మొకము పెడితిని.

“నువ్వు పెద్ద చదువులు చదివి ఉద్యోగము చేసి, మమ్మల్ని సాక్కుంటే పోనీ పోయి సేద్యమే చేయి పోప్పా” ఇంట్లో అబ్బా అమ్మా అంటా వుండారు.

చదువా, 'సేద్యమా నా ముందర రెండు విషయాలు వచ్చి నిలిచిండాయి. నేను అవిటిల్ని (వాటిని) చూసి అంటిని “సేద్యము చేస్తా చదువుతా...” అని. “అదీ చూస్తాము " అని అనె. చూడాల్సింది మీరు కాదు. నేనే మిమ్మల్ని చూస్తానని నా పని నేను చేస్తా పోతిని.

చేనుతావ కానతావ, ఇంట్లో వీదిలా, బయిల్లా ఇట్ల ఏడపడితే ఆడ చదివితిని, కానీ నాకు ఆ ఇంగ్లీషు చదువులు బుర్రకి ఎక్కలే.

మనకి స్వాతంత్రము వచ్చి ఇన్నేండ్లు అయినా వాని బాస వాని బతుకు, వాని బుద్దులు, సుద్దులు అంటేనే ఇష్టము. ఇది చాలదని వాని మతము వూర్లాచేరి వూరి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తా వుంది. అంతా కర్మ కర్మ ఈ బుక్కులు వొద్దు ఆ చదువు వొద్దు అని ఆ బుక్కుల్ని పారేస్తిని.

“ఆ బుక్కులు పారేస్తే పారేస్తివి కాని ఇందా” అంటా కొన్ని బుక్కులు నా చేతికి ఇచ్చె నా సావాసగాడు శివన్న నా కంద్లని నేనే నమ్మలేదు. అవి పన్నెండోక్లాసు తెలుగు బుక్కులు.

“తిరుతణ్సి జిల్లాలా మా సొంతమోళ్లు వుండారు. ఆడనింకా తెప్పిస్తిని బాగా చదివి పరీక్షలు రాయిరా” అని చెప్పి పాయె.

ఆ ఏడాదే తెలుగులా పరీక్షలు రాస్తిని. పాసైతిని. కాలేజీకి చేరేదాంట్లో బెంగళూరు, సేలం, తిరుపతి ఇట్లా తిరగతా వుండా.

“రేయ్‌! నువ్వు ఇంగెట్లో కాలేజికి చేరతావు, తెలుగు మీటింగులకి, పోరాటాలకి వచ్చేకి అయ్యేలే. ఈపొద్దు మన ఆర్‌. వి.స్కూలు పెద్ద గ్రవుండలా ధర్మపురిజిల్లా తెలుగు మహాసభలు సురువు అవతా వుండాయి. సి.నా.రె. గారు, సినీమా యాక్టరు అక్కినేని నాగేశ్వరరావు గారు, రోజాగారు వస్తా వుండారంట పోదాము” అనె శివన్న నేను సరే అంటిని.

మేము పోయేతలికే పెద్దగా వేసిండే స్టేజి ముందర సుమారుగా ఐదువేల జనం వుండారు. నా సావాసగాళ్లు కొత్తగొండపల్లి రాజగోపాల్‌, క్రిష్టమూర్తి, వేణుగోపాల్ , రవీంద్ర, మురళి, మురుగేష్‌ ఉమేశ్‌ రెడ్డి, మురుగేషన్‌ని కూడ ఆడ కలుసుకొంటిని.

ఆ మీటింగులా మాట్లాడిన అక్కినేనిగారు, సి.నా.రె.గారు “మీ తమిళనాడుని ఏలతా వుండే కరుణానిధిగారు మాకు బాగా తెలుసు. ఆయప్ప తావ మీ తొందర్లు చెప్పి అవి తీరుస్తాము” అనిరి. చప్పట్లు కొడతా మేమంతా ఫొంగిపోతిమి.

“కోదండరామయ్య కాలమునింకా ఆంధ్రానింకా ఎందరు మినిస్టర్లు, సినిమా వాళ్లురాలే. వచ్చినవాళ్లంతా ఇట్లే మాట్లాడిరి. అయినా మనకి చేసిందేమీ లేదు” వెంటుకలు నరసిండే తాత అంటావుండాడు.

(తరువాయి వచ్చే సంచికలో...)


27వ పుట తరువాయి

పరివర్తించాలన్నమాట. పై మచ్చులో ప్రతినిధి అలాంటి ముఖ్యమైన పదం.

1. to abbreiate (ప్రత్యాహారముగా కల్సించు) 2. to abdicate-పద (పదవీ) త్యాగము చేయు 3. to abet - నేఱము చేయుటకై సహాయము చేయు 4. to abridge - క్లుప్తముగా చేయు 5. to abrogate - చట్టమును/ శాసనమును/ నిబంధనను/ఒప్పందమును రద్దుచేయు (పదం ముందు అ గానీ వి గానీ వాడండి) 6. to accelerate - వేగిరం చేయు, వేగవంతం చేయు, శీఘ్రతరం చేయు 7. acclimatize - ఒక వాతావరణానికి అలవాటు చేయు/అలవాటుపడు 8. to accommodate - విడిది ఇచ్చు 9. to conceptualize - మనసులో ఒక పరిభావననీ/ భావనని ఏర్పఱచుకొను 10. to complicate - సంక్షిష్టం చేయు 11. to condescend - ఇతరుల కంటే సర్వోత్తముడైనట్లు ప్రవర్తించు 12. to conscript - బలవంతంగా సైన్యంలో చేర్చుకొను, సైనికుడుగా చేసుకొను 13. to countersign - ఒకఱు ఇప్పటికే సంతకం చేసిన పత్రం మీద తాను మళ్లీ సంతకం చేయు (పదానికి ముందు ప్రతి అనే ఉపసర్గ చేర్చండి) 14 to debillitate - అశక్తం చేయు 15. to de-glacialize - హిమానీనదాలు లేకుండా చేయడం/ లేకుండా అవడం (అ-హిమానీ అనే పదాన్ని వాడండి)

ఈ క్రింది క్రియాధాతువులకి పదకుటుంబాల్ని నిష్పాదించండి:

1. వర్గీకరించు 2. సులభీకరించు 3. జటిలీకరించు 4. వలసీకరించు 5. పత్రీకరించు 6. విశదీకరించు 7. నిగూఢీ కరించు (to mystify) 8. వాహినీకరించు (to channelize) 9. నవలీకరించి (నవలగా వ్రాయు) 10. కవనీకరించు (ఒక ఆలోచనను కవిత్వంగా మార్చి చెప్పు) 11. తద్భవించు (సంస్కృతశబ్దం కాకపోయినా వినికిడికీ, వ్యాకరణ కార్యాలకీ ఆ విధంగా ప్రవర్తించు : ఉదాహరణకు సేకరణ అనే పదం) 12. వ్యాసీకరించు (ఒక ఆలోచనను వ్యాసరూపంలో రఛించి వ్యక్తం చేయు) 13. చిత్రీకరించు (to shoot) 14 క్రియాపించు (క్రియగా మార్చి వ్యక్తం చేయు) 15. సమీకరించు 16. తరూకరించు (పూర్వం ఇది, ప్రస్తుతం ఇది, పరం ఇది అని ఒకదాని కింద ఒకటి సూచిస్తూ ఒక చెట్టులాంటి పటాన్ని గీచు) 17. తటస్టీకరించు (to neutralize) 18 ప్రతీకరించు (పగ తీర్చుకొను) 19. శుద్దీకరించు (to purify) 20. పవిత్రీకరించు.

(తరువాయి వచ్చే సంచికలో...)