అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/జర్మన్ల భాషావేశం
జర్మనీ నుండి
శ్రీగణేష్ తొట్టెంపూడి
జర్మన్ల భాషావేశం
“ఆంధ్రత్వమాంధ్రభాషాచ నాన్యః తపసః ఫలం”. అంటే, తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు మాట్లాడటం, తెలుగు దనం పొందటం ఎంతో తపస్సు చేసుకుంటేగానీ లభించవు అని పై దానికి అర్ధం. ఇది అన్నది తమిళుడైన అప్పయ్య దీక్షితులు అని అంటారు. మరి ప్రస్తుత సమాజంలో తెలుగు పరిస్థితి ఎలాఉందో వేరే చెప్పనక్కర్లేదు. అమ్మ భాషకు పట్టిన ఈ స్థితిని అధిగమించాలంటే ఏంచేయాలి? అమ్మభాషను భావి తరాలకు అందించాలంటే తెలుగును ప్రాచీన ధోరణిలో కాకుండా ఆధునిక విధానాలలో అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒక్క విషయాన్ని మన తెలుగు సమాజం గుర్తించుకోవాలి. “మానవుని ఆథునిక అవసరాలను తీర్చని దేనినైనా ఆయా మానవ సమాజాలు అటకెక్కిస్తాయి”. ఈ ఒక్క విషయాన్ని తెలుగు సమాజం, భాషమీద పరిశోధన చేస్తున్నవారు ఎప్పుడూ గుర్తించుకోవాలి.
భాష పట్ల చూస్తున్న మన దృష్టి మారాలి. సంప్రదాయ కళ్ళద్దాలతో కాకుండా ఆధునిక కటకం పెట్టుకాని భాషను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ ఆధునిక దృష్టి విధానంలో మన భాషని ఎలా చూడాలి? 84 మిలియన్ల (2011 జనాభా గణాంకాల ప్రకారం) జనాభాచే మాట్లాడబడుతున్న తెలుగు -వాళ్ళ అవసరాలను తీర్చుతోందా? ఈ వ్యాసంలోనూ రాబోయే సంచికలో నూ కొన్ని విభాగాలు తెలుగుభాషకు ఆధునిక హంగులు ఎలా అద్దాలి, భాషను ఎలా సామాజిక అవసరాలకు అనుగుణంగా ఎలా సంసిద్దం చేసుకోవాలి? మన విద్యావ్యవస్థలో తెలుగును ఎలా నిలపాలి? డిజిటల్ రంగానికి తెలుగును ఎలా సంసిద్ధం చేసుకోవాలి- అన్న విషయాలను అలాగే జర్మనీ దేశంలో జర్మన్లు అనుసరిస్తున్న మాతృభాషావిధానాన్ని కూడా వివరించటానికి ప్రయత్నిస్తాను.
ఐరోపా ఖండాన్ని ఒకసారి పరిశీలిస్తే... .ఐరోపా ఖండంలోని పెద్ద దేశాలు, రష్యాని మినహాయించుకుంటే జనాభా లెక్కల ప్రకారం (2019 - గణాంకాలు)జర్మనీ 83,019,218 మందితో (ఐరోపా జనాభాలో 16.17% ) మొదటి స్థానంలో ఉంది. 67,102,883 మందితో. (ఐరోపా జనాభాలో 13.05%) ఫ్రాన్స్ రెండొ స్థానంలో ఉండగా, 66,647,112 మందితో (ఐరోపా జనాభాలో 12.98%) యునైటెడ్ కింగ్‌డమ్ మూడవ స్థానంలోనూ, 60,359,546 మంది (ఐరోపా జనాభాలో 11.76%)తో ఇటలీ నాల్గవ స్థానంలోనూ, 46,937,812 మందితో (ఐరోపా జనాభాలో 9.14%)తో స్పెయిన్ ఐదవ స్థానంలోనూ ఉంది. ఈ మొదటి ఐదు పెద్ద దేశాలను మన ఉభయాంధ్ర రాష్ట్ర జనాభా 84,580,777 (మొత్తం భారతదేశ జనాభాలో 6.99%)తో పోల్చుకుంటే .... ఆ ఐదు ఐరోపా దేశాల్లో ఆయా దేశాల మాతృభాషలు శాస్త్ర సాంకేతిక రంగాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక్కడ వ్యక్తిగతమైన ఒక అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చదలచాను. జర్మన్ పరిశోధనా తృష్ట అదీ వాళ్ళ మాతృభాషలో... ఎలా ఉంటుందంటే నేను మాస్టర్స్ డిగ్రీ చదివే విద్యార్థులకు డేటా ఎనాల్టిక్స్ బోధిస్తాను. తరగతిలో ఏ విద్యార్థి అయినా గనక (ఎం.ఎస్. స్థాయిలో) పరీక్ష ఇంగ్లీష్‌లో రాయను, జర్మన్ భాషలోనే రాస్తాను అంటే అధ్యాపకుడు ఒప్పుకోవలసిందే. ఇంకా చెప్పాలంటే వైద్య రంగంలో పీహెచ్‌డీ సిద్దాంత గ్రంథం కూడా విద్యార్థికి ఆసక్తి ఉంటే అతని మాతృభాషలో రాసుకోవచ్చు. ఒక్కసారి మనసుపెట్టి మన విధానంతో ఆలోచించండి.
ఇక్కడ నేను చెప్పదగ్గ ఇంకో విషయం ఏమిటంటే జర్మన్ భాష నేర్చుకొనకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువే. అన్యదేశం వారికి ఈ దేశంలో శాశ్వత నివాసం ఏర్చరచుకోవాలంటే ఇచ్చే పి. ఆర్. రావాలన్నా జర్మన్ భాషలో బి2 పూర్తి చేసి ఉండాలి. దీనిద్వారా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ జర్మన్ భాషని నేర్చుకోవలసి ఉంటుంది. ఇంతవరకూ నేను ప్రభుత్వ కార్యాలయాల్లో పనిమీద వెళ్ళినప్పుడు ఎప్పుడూ వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడటం వినలేదు. వారి భాషాభిమానానికి ఇది పరాకాష్ట ఒక్క భాషని నేర్చుకొనటం మీదే నెలకి బిలియన్ల యూరోల వ్యాపారం జరుగుతుంది అంటే మీకు ఆశ్చర్యం వేయక మానదు.
భాషతో వీరు చేసే వ్యాపారం అద్భుతం. ఎక్కడ విజ్ఞానం ఉన్నా ఈ జర్మన్లు తమ భాషలోకి తెచ్చేయాలని చూస్తారు. ఇక ఈ జర్మన్‌లకు భారతీయ భాషల మీద ఉన్న పరిశోధనా తృష్టని పరిశీలిద్దాం.
జర్మనీలో 12 ప్రభుత్వరంగ విశ్వవిద్యాయాల్లో భారతీయ భాషల గురించి, భారతీయ సంస్కృతుల గురించి అద్యయన కేంద్రాలున్నాయి. మాక్స్ మ్యూలరు (1823-1900) మొదలుకొని నేటి డిజిటల్ యుగం వరకు అనేక మంది జర్మన్ శాస్త్రవేత్తలు భారతీయు భాషలమీద పనిచేస్తున్నారు. ఇక్కడ విభిన్న విశ్వవిద్యాలయాలు భారతీయ భాషలకి అభివృద్ధి చేసిన సాంకేతిక ఉపకరణాలను మీకు ముందుముందు శీర్షికల్లో వివరిస్తాను.
వారి భాషాభీిమానానికి ఇది పరాకాష్ట. ఒక్క భాషని నేర్చుకొనటం మీదే నెలకి బిలియన్ల యూరోల వ్యాపారం జరుగుతుంది అంటే మీకు ఆశ్చర్యం వేయక మానదు.
భాష లేకపోతే భావం లేదు;నీ భావాల్ని నీ భాషలో చెప్పడమే సరైనది