అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/కొయ్యబొమ్మలాట కళాకారుడు గొంబేగౌడరరామనగౌడ ఆత్మకథ

వికీసోర్స్ నుండి


ఆత్మ కధ కన్నడ మూలం: డా.చంద్రప్ప సొబటి; తెలుగుసేత: రంగనాథ రామచంద్రరావు 90597 79289

కిరాయిబండి చివరి ప్రయాణం

ఆ సంవత్సరం ఆటకు వచ్చిన సంభావన పెరిగింది. అయితే నా బండి కిరాయి మాత్రం పెరగనేలేదు.

ఉద్దేశపూర్వకంగా పెంచలేదని కాదు. పెంచాలనే చర్చ మేళంలో జరిగింది. ఆటకు వస్తున్న సంభావన చూసి రోజు కిరాయి వంద రూపాయలు కావచ్చని, కనీసం ఎనభై అయినా కావచ్చని ఆశగా ఎదురుచూడసాగాను.

అయితే నా ఆశను షావుకారిగారి బస్సులు మింగేశాయి.

అప్పుడప్పుడే పల్లెపల్లెకూ షావుకారుగారి బస్సులు రావటం మొదలయ్యాయి.

మేళంవారు ఎద్దుల బండిలో కార్యక్రమాలకు వచ్చిపోవడం కన్నా బస్సులో వెళ్ళిరావటమే సౌకర్యంగా ఉంటుందని అన్నారు. ఎందుకంటే అప్పటికే మేళంలోని కొందరు సభ్యులు బస్సులలో వచ్చిపోయేవారు. దాంతో మేము ఏమీ మాట్లాడలేదు. మాట్లాడలేదని అనటంకన్నా మా నోట మాటలే రాలేదని చెప్పాలి.

నేను మౌనంగా నాన్న ముఖం చూశాను. ఏమ్హైనా చెబుతారేమోనని ఎదురుచూశాను. ఆయన కూడా షావుకారు బస్సులో వెళ్ళిరావటమే మంచిదని అన్నారు. అది నాన్న నుంచి ఊహించిన జవాబే. అందువల్ల నాన్నపట్ల ఎలాంటి కోపం రాలేదు. నాన్న ఎన్నడూ స్వార్ధంతో నిర్ణయాలు తీసుకున్నవారు కాదు.

కిరాయికి బండి వద్దన్న రోజున నేను శికారిపుర తాలూకాలోని ఓ గ్రామంలో ఉన్నాను.

ఉదయం ఆట కావటం వల్ల తొందరగా ముగిసింది.

ఎద్దుల బండిలో బొమ్మలు పెట్టెలను వేసుకున్నాను.

ఎన్నడూ భారంగా అనిపించని ఆ పెట్టెలు ఆ రోజు ఎందుకనో భారంగా అనిపించాయి.

వాటిని ఎత్తి బండిలో పెట్టడానికి మేళంవారి సహాయం తీసుకోవాలని అనిపించింది.

వాళ్ళవైపు చూశాను.

వాళ్ళంతా డబ్బులు పంచుకోవడంలో మునిగివున్నారు.

నేను ఆ రోజు కిరాయి విషయానికి పోనేలేదు.

రోజుకు యాఖై, అరవై సంపాదించేవాడిని.

ఈ రోజ ముగిసిందికదా అని దుఃఖం కలుగుతోంది.

ఆగకుండా కన్నీళ్ళు బుగ్గల మీదుగా జారిపోతున్నాయి.

నా దుఃఖాన్ని ఎవరికీ చూపించుకోవాలని అనిపించలేదు.

ఆ దుఃఖంలో ఎద్దులబండి కట్టుకుని ఊరివైైపు ప్రయాణమయ్యాను. ఇది కళా జీవితపు ఎద్దులబండి చివరి ప్రయాణమని దారిపొడుగునా అనిపించింది. నా అంతట నేను ఏడుస్తున్నాను. ఇది బండిలో నా వెనుక కూర్చున్న వారు అది గమనించలేదు. గమనించినా వారికి అర్ధం కాలేదని అనుకుంటాను. బహుశా అందుకే నా సంకటం, దుఃఖంలో వాళ్లు భాగం వహించలేదు. నన్ను ఓదార్చటానికి ప్రయత్నించలేదు.

ఆ రోజు నేను దారిలో ఎద్దులను కొట్టలేదు.

కసరలేదు.

అదిలించలేదు.

బండి ఎప్పటిలా రోజుకన్నా కాస్త ఆలస్యంగా వచ్చి ఊరు చేరింది.

అవి తెల్లటి ఎద్దులు.

మా ఇంట్లో తెల్లఎద్దులనే బండికి కట్టాలనే నియమం ఉంది.

ఎద్దుల మెడలకు పెద్దపెద్ద కంచు బిళ్ళలున్న పట్టీలను అలంకారంగా కట్టాం.

మా బండి ఊళ్ళోకి వెళ్ళడమే ఒక వినోదం. బండి ఊళ్ళోకి వెళితే చాలు! జనం మా బండినే చూసేవారు. మేము ఎవరో పరిచయం చేసుకోవటానికి ముందే మా ఎద్దులబండి మా రాకను పరిచయం చేసేసేది. అలాంటి ఎద్దులకు ఒక్కోసారి మేత దొరికేదికాదు. ఊరి జనాన్ని అడిగితే తెలిసినవారు ఇచ్చేవారు. ఒక్కో ఊళ్ళో కుళ్ళిన తడిసిన మేతను ఇచ్చేవారు. ఆ రోజున నాకు చాలా దుఃఖం కలిగేది. మేము భోంచేసి, వాటిని ఉపవాసం 'పెడుతున్నామని కుమిలిపోయేవాళ్ళం. పల్లెలలో కొంతమంది పోకిరీలు ఉంటారు. ఎద్దుల మెడలోని పట్టీలకున్న కంచు వస్తువులనురాళ్ళతో కొట్టడం, కంచు బిళ్ళలను విరగ్గొట్టడంలాంటి చిదుగుపనులు చేసేవారు. అప్పుడు చాల కోపం వచ్చేది.

గ్రామాలకు ఎద్దులబండిలో ఫోయి ఆట ప్రదర్శించటం ఎంతో సంబరంగా ఉండేది.

ఈ రోజు ఆ సంగతులను గుర్తుచేసుకుంటే ఎంతో దుఃఖం కలిగింది.

ఇంటికి రాగానే ఎద్దుల మెడలను కాడిమాను నుంచి విడిపించి, గాడిపాయ దగ్గర కట్టి మేత వేశాను.

కొద్దిసేపటి తరువాత వాటి ఒళ్ళు కడగటానికి పూనుకున్నాను.

రాయితో ఒళ్ళు రుద్దాను.

అప్పుడు దుఃఖం పొంగుకు వచ్చింది.



ఒక ఎద్దును కరుచుకుని ఏడ్చేశాను.

నా బాధ దానికి అర్ధమైందేమో?

పెద్దముక్కుపుటాల నుంచి వేడి ఊర్పులను వదులుతూ నా ఒళ్ళు నాకింది.

అది “నువ్వు ఏడకు” అని ఓదార్చినట్టు అనిపించింది.

ఇన్ని సంవత్సరాలు నా కళా జీవితపు బండిని నడిపించినందుకు ఎద్దుల కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశాను.

మరింత మేత వేసి, బండి నుంచి బొమ్మలు దించుతున్న అన్నదమ్ములకు సహాయం చేయడం కోసం బండివైపు భారమైన అడుగులు వేశాను.

షావుకారు బస్సుల హమాలిగా...

1980 దశకంలో పల్లెపల్లెకూ షావుకారు బస్సులు వచ్చాయి.

అప్పుడు ఎద్దుల బండి వద్దన్నారు.

అయినా మేళంతోపాటు ఆట ప్రదర్శన కోసం పల్లెలకు వెళ్ళడం మానలేదు.

ఇలా వెళ్ళడం మొదలుపెట్టినపుడు జీతం ఏమీ ఇవ్వలేదు.

కేవలం భోజనం, చాయ్‌ ఖర్చులు చూసుకునేవారు.

అయ్యో, నువ్వు జీతం తీసుకునే కళాకరుడివి కావాలంటే ఇంకా చాలాకాలం పడుతుందని అనేవారు.

అలా పని చేయడం మొదలుపెట్టాను.

మూడునాలుగు రోజులు వెళ్ళివుండాలి.

అప్పుడు షావుకారు బస్సుల మీద బొమ్మల పెట్టెలు, 'అట్ట 'కు (వేదికకు) కావలసిన సామానులను, వాయిద్యాలను బస్సుపైకి చేరవేసేటటువంటి- దించవలసినటువంటి పని; అలాగే బస్సు ఆగిన చోటి నుంచి ఆట ఆడించే స్థలానికి వీటన్నిటిని మోసుకెళ్ళే పని నాకు అప్పగించారు. ఆ పనికి రోజుకు 20 రూపాయులు కూలీ నిర్ణయించారు.

అప్పుడు సంతోషపడ్డాను. ఎద్దులు, బండి లేకుండానే ఇరవై రూపాయ సంపాదన అన్నది గొప్ప విషయంగా అనిపించింది.

ఆ నాటి కాలంలో షావుకారు బస్సులకు ఎవరైనా హమాలి పని చేయొచ్చు. ఇప్పుడు లేదనుకోండి. ఈ రోజు జనం అన్నిటిని తామే చేయాలంటారు. స్వార్ధపూరితమైన బతుకు ఈనాటిది. ఈ స్వార్థం ఇంకొకరిని బతకడానికి వదలదు.

మా నాన్నగారి మేళంలో వయను దాటిన కళాకారులు ఉండేవారు. ఒక విధంగా ఇది నాకు మంచే చేసింది. వయస్సు దాటినవారు ఉన్న కారణంగా హమాలి పని దొరికింది. ఆ పనిని చాలా సంతోషంతో చేస్తుందేవాడిని. గతంలో ఎద్దులబండిలో ఎత్తి పెడుతున్న బొమ్మల పెట్టెలను ఇప్పుడ బస్సు మీదికి ఎక్కించడం,దించడం ఆరంభించాను.

ఒకట్రెండు వారాలు కష్టమనిపింఛింది.

తరువాత అలవాటుపడద్దాను.

ఆ సందర్భంలో నేను చాలా శ్రమపడ్డాను. ఆ శ్రమ జీవితానికి అర్ధాన్ని తెలిపింది.

కిరాయి బండి వద్దన్నప్పుడు ఆ సమయంలో నాకు ఏమనిపింఛిందో తెలియదు. అయితే. ఎందుకో మా కౌొయ్యబొమ్మ ఆటలు ఆడటం, ప్రదర్శించడం నేర్చుకోవాలని మనస్సులో దృడంగా నిర్ణయించుకున్నాను.

పొలం దున్నేటప్పుడు, ఎద్దులను మేపుతున్నప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడిని.

సాయంకాలం పొలం నుంచి బండి తోలుకుని ఇంటికి తిరిగొస్తున్నప్పుడు మరింత బిగ్గరగా పాటలు పాడుతుండేవాడిని.

పాటలు విసుగొస్తే కథ చెప్పేవాడిని.

నేల తల్లే వేదికగా, చెట్లు, చేమలు, పుట్టలు, పురుగులు ప్రేక్షకులుగా భావించి కథలు చెప్పేవాడిని.

కథ అంటే ఆ ఆటలో వచ్చే డైలాగ్స్‌ చెప్పేవాడిని.

ఖాలీగా ఉన్నప్పుడు “అడుగులు” వేస్తూ పాట పాడేవాడిని, డైలాగులు చెప్పేవాడిని. .

ఇంట్లోనూ అడుగులు వేస్తూ పాటలు పాడేవాడిని.

నేను అలా చేయడం చూసి మా తల్లితండ్రులు మురిసిపోయేవారు.

అదిచూసి నేను పదే పదే '“అడుగులు” వేసేవాడిని.

నేను అడుగులు తప్పుగా వేసినపుడు, నాన్న సరిదిద్దేవారు.

అంతేకాకుండా నాకు అర్థం కావటానికి నా చేయి పట్టుకుని నృత్యం చేస్తున్నట్టు “అడుగులు " వేస్తూ చూపించేవారు.

నా ఆసక్తిని గమనించిన నాన్న ఈ మధ్యన ఆటలో నాకు చిన్నచిన్న పాత్రలు ఇవ్వడం మొదలుపెట్టాడు.

అందుకు పది, పదిహెను రూపాయలు సంభావనగా ఇవ్వసాగారు.

కూలీ డబ్బులు, ఆటకు వచ్చిన సంభావన కలిసి మొత్తం ముప్పయి నుంచి ముప్పయి అయిదు రూపాయల వరకు అందేవి.

అయినా నాకు ఎందుకో సంతృప్తి కలిగేది కాదు.

కారణం ఇతర కళాకారుల్లా నేను కూడా నూరు, నూటాయాభై తీసుకునే కళాకారుడిని కావాన్నదే నా పట్టుదల.

ఇది కళాకారులకు ఉన్న సహజమైన కోరిక అనుకుంటాను.

ప్రతిఒక్క ప్రతిభావంతుడు, బుద్ధివంతుడు అయిన కళాకారుడు మేళం సభ్యులతో సమాన స్థాయిలో బతకడానికే ఇష్టపడుతాడు. అది తప్పుకాదు. ఇతర కళాకారుల్లా అంటే ఉత్తమ కళకారుడు కావటానికి శ్రమించాలి.

శ్రమ పడకుండానే డబ్బు రావాలనుకోవటం తప్పు.

అలా డబ్బు తీసుకోవాలి అనుకోవటం తప్పు.

అలాంటి భావన కళాకారుడికి ఉండకూడదు!

మేము పొపులం ...

నాన్న నా కోసం చిన్నచిన్న పాత్రలు ఇస్తున్న సమయంలో హఠాత్తుగా ఇద్దరు కళాకారులు మా మేళం వదిలి వేరే మేళంలో చేరారు. ఎందుకు మేళం వదిలిపోయోరో కారణం తెలియదు. అప్పుడు నాకు అంత అవగాహన లేదు. అవగాహనా శక్తి ఉన్నప్పటికి నాన్న ఉన్న కారణంగా నేను తెలుసుకోవటానికి ప్రయత్నించేవాడిని కాను.

అలా మేళం నుంచి బయటికి వెళ్ళిన మా అల్లుడు హనుమప్ప కూడా సొంతగా మరో మేళం కట్టుకున్నాడు.

ఇద్దరు కళాకారులు వెళ్ళిపోవటంతో మా మేళంలో సంఖ్య తగ్గిపోయింది.

ప్రజాభిమానం పొందిన ఒక మేళం హఠాత్తుగా ఆగిపోయిందంటే ఆ మేళం నాయకుడికి అది పెద్ద అవమానం. అలాంటి అవమానాన్ని ఆ సమయంలో మేము అనుభవించాము. చుట్టుపక్కలున్న గ్రామాల్లో చాలామంది కళాకారులున్నారు. అప్పట్లో కళాకారులకు కొరత లేకపోయినా, ఇంటిగౌరవం పాడవుతుందని, వంశగౌరవం పోతుందని నాన్న భోజనం చేయకుండా కూర్చున్నారు.

ఆయన మౌనాన్ని చూసి నేను, మా అన్న వీరన్న గౌడ 'మేము ఆట ఆడుతాం” అని ధైర్యం చెప్పాం. అయినా మా నాన్నకు సంతృప్తి కలగలేదు. ఎందుకంటే ఆయన స్థాయిలో కళా ప్రదర్శన చేయడం మా వల్ల కాదని ఆయనకు తెలుసు. మూడునాలుగు రోజులు ఆట ఆగిపోయింది. అంటే “ఇళెవు” (తాంబూలం తీసుకోవటం) వదిలేశాం.

దీనివల్ల నాకు, మా అన్నయ్యకు బాధ కలిగింది. దాంతో మేము ఈ కళలో పూర్తిగా నిమగ్నమయ్యాం. ఆ సమయనికే ఆట గురించి మాకు తగినంత జ్ఞానం ఉంది. అదే పరిసరాల్లో పుట్టిపెరిగిన వాళ్ళం కావటం వల్ల, నేర్పించవలసిన అవసరం లేకపోయినా నాన్న అప్పుడు చిన్న ప్రమాణంలో తర్భీదు ఇచ్చారు. అంతేకాకుండా నాలుగైదేళ్ళ నుంచి నేను వారి వెంబడి వెళుతుండటం వల్ల వందలాది ప్రదర్శనలు చూశాను. చిన్నచిన్న పాత్రలు చేశాను. కథలు తెలుసు. డైలాగులూ చాలా వరకు గుర్తున్నాయి. కావల్సింది ధైర్యం. అభ్యాసం అంతే. ఇక మా అన్నయ్య ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. చదువుతున్నాడు. ఇలా చెబితే చాలు అలా పట్టేసేవాడు. కథ చెప్పటంలో మంచి నిపుణుడు అతను.

నాన్న అప్పుడు మరో ఇద్దరిని వెతికి ఖాయం చేసుకుని 'ఇళెపు ' తీసుకుని ఆట ప్రదర్శించారు.

ఆ రోజు నాన్నతో కలిసి నేను, మా అన్నయ్య ఆట ప్రదర్శనలో పాల్గ్టొన్నాం.

ముగ్గురూ కలిసి ఆట ఆడటం అదే మొదటిసారి. అప్పుడు మాకు డబ్బు రూపేన సంభావనలు బాగా వచ్చాయి.

సుమారు 3000 రూపాయలు వచ్చాయి.

నాన్న మా ఇద్దరిని దగ్గరగా కూర్చోబెట్టుకుని, “చూడు, నేనాక్కడిని ఆట ఆడితే 1000 రూపాయలు వచ్చేవి. దేవుడు ఎలా ఇచ్చాడో చూడండి. ఒక మేళంలో ఎవరైతే కలిసి కష్టపడుతారో వాళ్ళకు అంతే సుఖం లభిస్తుంది” అని అన్నారు.

నాన్న బతికి ఉన్నంత వరకూ ఈ తత్వాన్నే పాటిస్తూ వచ్చారు.

ఆ కారణంగానే మా నలుగురు అన్నదమ్ములను ఈ కళలో పాల్గొనేలా చేశారు.

చనిపోయే సమయంలోనూ “మీరు ఏ కారణంగానూ బొమ్మలు పంచుకోకండి” అని మా చేత ప్రమాణం చేయించుకున్నారు.

దాని అర్థం మేమందరం ఒకే “అట్ట” (వేదిక) మీద ఆట 'ప్రదర్శించాలనే కోరిక ఆ ముసలాయనది.

మేము పాపాత్ములం.

నాన్న కోరికను సంపూర్ణంగా తీర్చడానికి మాకు సాధ్యం కాలేదు.

అందుకు నాన్నను ఇప్పటికీ క్షమాపణలు అడుగుతుంటాను.

“పెద్దల పండుగ” రోజునైతే నాన్న నాన్న ఆట, నాన్నకు ఇచ్చిన మాట గుర్తుకొస్తాయి.

ఆ రోజు ఆయనను క్షమించమని మరీ మరీ వేడుకుంటాను.

(తరువాయి వచ్చే సంచికలో...)