Jump to content

అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/అడుగుజాడలూ ఆనవాళ్లు

వికీసోర్స్ నుండి

ధారావాహిక

అడుగుజాడలు ఆనవాళ్తు-8

ఈమని శివనాగిరెడ్డి 98485 98446

నా అద్దంకి - ధర్మవరం యాత్ర

నేను అప్పటికే సగం ప్రయాణంలో ఉన్నా. ఎందుకైనా మంచిదని విద్వాన్‌ జ్యోతిచంద్రమౌళిగారికి ఫోన్‌ చేశా. ఆయన వెంటనే స్పందించి 'సార్‌ ఇప్పుడు ఉదయం 4:30 గం అవుతుంది. మీరు ఆరుగంటలకు రండి. మనం 7.00గంటలకల్లా ధర్మవరం వెళదాం. తరువాత అద్దంకి వచ్చి టిఫినుతిని, అద్దంకిలోని చారిత్రక కట్టడాలు, శిల్పాలు, శాసనాలను చూద్దామన్నారు. నేను అప్పుడే చిలకలూరిపేట దాటి మార్టూరు చేరువలో ఉన్నాను. ఈ సారి అద్ధంకీ, ధర్మవరం, మణికేశ్వరం, కుదిరితే దర్శి వెళతామని అనుకొంటున్నా ఇంతలో మేదరమెట్ల బోర్టు కనిపించి, అటు నుంచి ఇటు తిరిగి అద్దంకిబాట పట్టామోలేదో ఊళ్లో వాలిపోయి మళ్లీ చంద్రమౌళిగారికి ఫోన్‌ చేస్తే రాంనగరు సెంటరుకు రండి నేను ఐదునిముషాల్లో అక్కడుంటానన్నారు. ఆయన వచ్చిన తరువాత మసకచీకట్లోనే, కారులో ప్రకాశం జిల్లా మ్యాపు తెరచి, పోవాల్సిన ఊళ్లను ఒక సారి చూచుకొన్నాం. పొట్టి శ్రీరాములు సెంటర్లో అల్లంచాయ్‌తాగి మంచి ఉత్సాహంతో బయలుదేరాం. తెల్లటిగుడ్డలో నల్లటి చంద్రమౌళిగారు మెరిసిపోతున్నారు. మాచర్ల చెన్నకేశవుని వెండి మీసాలను పోలిన తన తెల్లటి మీసాలను సవరించుకొంటూ మురిసిపోతున్నారు. ఆయన తిరుపతి ప్రాచ్య కళాశాలలో ప్రాచ్యభాషలో మాస్టర్సు డిగ్రీ చేశారు.తెలుగు సాహిత్యంలో పీ. హెచ్‌.డీ. చేశారు. సాహిత్యాభిలాషతోపాటు, చరిత్రపై మమకారం పెంచుకొన్నారు. తిరిగేకాలు ఊరుకోదన్న సామెతను నిజం చేస్తూ, ప్రకాశం జిల్లా అంతాగాలించి, చరిత్ర పరిశోధకులుగా ప్రసిద్దులయ్యారు. 2004లో అద్దంకి చరిత్ర 2008లో ప్రకాశం జిల్లా దర్శనీయ స్థలాలు, 2019లో కొణిదెన చరిత్ర శాసనాలు, 2020లో ప్రకాశంజిల్లా ప్రాచీన చరిత్ర అంతకు ముందే ఆంధ్రప్రదేశ్‌లో బౌద్దక్షేత్రాలు అన్న పుస్తకాల్ని రాసి, తాను విన్నంత, కన్నంతను ఉన్నంతలో నలుగురికీ పంచి పెట్టారు. “ధర్మవరంలో ఇనుప యుగపు సమాధులు నాశనమవుతున్నాయి. మీరొచ్చారంటే వాటిని ఎలాగైనా కాపాడుకోవచ్చు” అని నిన్నటి రోజునే నాకు ఫోను చేసినప్పుడు, వారసత్వ సంపద పరిరక్షణ పట్ల ఆయన ఎంత ఉబలాట పడుకున్నాడొ అర్ధమైంది. ఇదిగో వచ్చేస్తున్నానని ఊరించి, అనుకొన్నట్లుగానే అద్దంకి చేరిన నన్ను చూచి ఆయన ఎంత సంబరపడిపోయాడో. ధర్మవరం వైపు వెళుతున్నాం. సినీనటులు, ఆం.ప్ర. సాంసృతిక మండలి అధ్యక్షులుగా పని చేసిన ధర్మవరం సుబ్రహ్మణ్యంగారు, ఆరోజుల్లో నన్ను ఆయన ఆఫీసుకు పిలిపించుకొని, ధర్మవరం గురించిన చారిత్రకతను చర్చించుకొన్నాం. అద్దంకిలో ఎర్రాప్రగడ విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా నన్ను రమ్మన్నారు. ఆ తరువాత ధర్మవరం వెళదామన్నారు.ఆయనలేడు. అయినా ఆయన మాటలు వినబడుతూనే ఉన్నాయి. ఇంతలో ధర్మవరం చేరుకొన్నాం. చంద్రమౌళిగారు ముందుగా జైన దేవాలయానికి వెళదామన్నాను కాదు, విధ్వంసానికి గురౌతున్న ఇనుపయుగపు ఆనవాళ్ళను చూద్దామన్నాను. ఊరికి దక్షిణంగా మూడు కిలోమీటర్ల దూరంలోగల పాండవులమెట్ట అని పిలుచుకొనే ఒక కొండదగ్గర కారుదిగి, అప్పటికే కొన్ని వందల లారీల మట్టిని తోడుకెళ్లటంవల్ల ఏర్పడిన గుంటలగుండా నడుస్తున్నాం. బృహత్ధిలాయుగమని పిలువబడే ఇనుపయుగపు సమాధుల్ని కూడా, కోరపళ్ళ బకెట్టుతో నిర్ధాక్షిణ్యంగా ఎత్తి అవతల పారేసిన జేసీబీ కంటే, దాన్ని నడిపిన డైవర్‌ కంటే చరిత్రమీద ఏమాత్రం అవగాహనలేని రోడ్డు కాంట్రాక్టరు, ఆ ఇంజనీర్లమీద కోపంవచ్చింది. చెల్లాచెదురుగా పడిఉన్న నలుపు-ఎరుపు మట్టిపాత్రలు, ఎముకల ముక్కలు, అస్తవ్యస్థంగా విసిరివేయబడిన సమాధులచుట్టూ ఉండే గుండ్రటి బండరాళ్ళు విధ్వంసానికి గురై, రక్షించేవారు లేరా ఇటురారా అని మౌనపోరాటం చేస్తున్నాయి. కొండవాలుమీద అక్కడొకటి, ఇక్కడొకటి పది-పదిహేను గుండ్రంగా రాళ్లతో అమర్చిన సమాధులు మాసంగతేమిటిటంటూ దీనంగా చూస్తున్నాయి. 'సార్‌, పైకి తరువాత వెళ్లచ్చు. నిట్టనిలువుగా జరాసంధుడిని భీముడు చీల్చినట్లు ఈ సమాధిని జేసీబీ ఎలా భీభత్సంగా సగానికి సగం తెగ్గొట్టిందో చూడండి.” అన్నారు చంద్రమౌళిగారు. చనిపోయిన వ్యక్తి పుర్రె,ఎముకలగూడు, అతడు బతికుండగా వాడిన కుండ, అన్నీ సగానికి తెగిపోయి ఉన్నాయి. కళ్ళముందే చరిత్రకు గర్భస్రావం జరుగుతుంటే జీవశ్చవంలా నిస్సత్తుతో నిలబడ్డామే తప్ప నేనుగానీ, చంద్రమౌళిగారు గాని, మాతోపాటు వచ్చిన మరో ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు కడియాల వెంకటేశ్వరరావుగారు గానీ ఏమీ చేయలేకపోయాం. ఎలాగైనా ఈ విధ్వంసాన్ని ఆపమని చంద్రమౌళిగారిని కోరుకొని, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లమన్నాను. ముగ్గురమూ కలసి అక్కడున్న సమాధులన్నంటినీ పరిశీలించి, పదిలపరచాల్సిన అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని అనుకున్నాం. కొండవాలుపైన ఆరు అడుగుల పొడవు, ౩అడుగుల వెడల్పు, ౩ అడుగుల ఎత్తు గుంటలో చనిపోయిన వారి అస్తికలను, వారి పనిముట్లు, పాత్రలను వారితోపాటే పాతిపెట్టి, మట్టితోపూడ్చి, ఏవిధంగానూ, హానిజరుగకుండా భద్రపరచి, చుట్టుగుండ్రంగా రాళ్లను పాతి, కట్టడ కళకు 'ప్రాణంపోశారు క్రీ.పూ. 1000నాటి మానవులు.

ఒకచారిత్రక ప్రదేశాన్ని చూడబోతున్నామన్న ఆనందం కాస్తా చెదురుమదురుగా, చెల్లాచెదురుగా ఆనవాళ్లు కోల్పోతూ, చెరిగిపోతున్న తెలుగు వారి సంతకాలైన ఇనుపయుగపు సమాధుల్ని చూడగానే ఆవిరైపోయింది. నిరుత్సాహంతోనే ముగ్గురమూ, ధర్మవరంలో తూర్పుదిక్కున పోలాల్లోఉన్న శిధిల భీమేశ్వరాలయంపైపు వెళ్లాం.


సగంపడిపోయిన 12వందల ఏళ్ల ఆలయాన్ని చూచి విలపించాలో లేక సమీప పట్టణాల్లో ఆంబరాన్నంటే అధునాతన భవంతుల్ని చూచి ముచ్చట పడిపోవాలో తెలియక తికమక పడుతున్ననాకు, ఒకచిన్న ఆలయం గోడకు వారగా అనించిన పాఠ్వనాధ విగ్రహం, భీమేశ్వరాలయం ముందుగోడ పక్కనున్న మహిషాసురమర్దని విగ్రహం, ఆలయంలోపల శివుడు కొలువై ఉన్నాడని చెప్పకనే చెబుతున్న ఓపికలేక ఒత్తిగిల్లిన నందివిగ్రహాలు కొంత ఊరటనిచ్చాయి.

అంతలో చంద్రమౌళిగారందుకాని, ఈ ఆలయంముందు పొలందున్నుతుంటే 24 జైనతీర్ధంకరులను అందంగా చెక్కిన జైన శిల్చం బయల్చ్బడగా దాన్ని హైదరాబాదు స్టేట్‌ మ్యూజియానికి తరలించుకెళ్లారని చెప్పాడు. అంతేకాదు వేంగీచాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని సైన్యాధ్యక్షుడు అద్దంకి పండరంగడు, ఈధర్మవరంలోనున్న తన గురువైన ఆదిత్యభట్టుకు కొంతభూమిని దానం చేసినట్లు క్రీ. శ. 850ఏళ్లనాటి కడియరాజు శాసనం వల్ల తెలుస్తుందని కూడా చెప్పాడు. అయితే ఈ భీమేశ్వరాలయం, చాళుక్యభీముని కాలంలో నిర్మించబడి ఉంటుంది. తరువాత పంగరంగని మునిమనుమడైన దుగ్గరాజు, ఈ ప్రాంత పాలకుడుగా, రెండో అమ్మరాజు కాలంలో ధర్మవరంలో కటకాభరణ జినాలయాన్ని నిర్మించినట్టు, ఆలయ నిర్వహణకు మలియంపూడి గ్రామాన్ని అమ్మరాజు చేత దానం చేయించిన శాసనాధారాలు ధర్మవరంలోనే ఉన్నాయి. ధర్మవరానికి జినధర్మవరమనే మరోపేరు కూడా ఉంది. అయితే, ధర్మవరంలోని పండరంగని శాసనం తెలుగుభాషాపరంగా ప్రాధాన్యతను సంతరించుకొందని కూడ చంద్రమౌళిగారు చెప్పారు.ఇక అక్కణ్ణించి కారెక్కి ఊళ్ళోఉన్న సీతారామాలయంలోకెళ్లాం. చాళుక్యభీముడు క్రీ.శ. 897లో వేయించిన శాసనాన్ని ఆలయంలోని భిన్నమైన వర్దమానమహావీర, అమ్మవారు, చెన్నకేశవ విగ్రహాలను చూశాం. ఒకప్పుడు రాజపోషణలో, జైన,శైవ మతసామరస్య కేంద్రంగా భాసిల్లిన ధర్మవరం, ఆ తరువాత, కొణిదెనచోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర పాలకుల ఆదరణ చవిచూచింది. గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్‌షా అధీనంలోకొచ్చిన ధర్మవరం వద్ద మరో గ్రామాన్ని నిర్మించి, అప్పటివరకూఉన్న ధర్మవరంఅన్న 'పేరునుకాదని, అతని సేనాని ఎకలస్‌ఖాన్‌, తనపేరట ఎకలసపురమనే కొత్తపేరు పెట్టాడు. ఆ సంగతిని తెలియజేసే శాసనం రామాలయంముందు నిలబెట్టి ఉంది. అందులో అతడు గ్రామంలో కల్పించిన వసతులు, నీటి పారుదల సౌకర్యం, పంటలకు గిట్టబాటుధరలను నిర్ణయించి,ప్రజల అభిమానాన్ని సంపాదించిన వివరాలున్నాయి.

ధర్మవరాన్ని గురించి ముగించేముందు ఇప్పటికీ జనంనోళ్లలో నానుతున్న కాటమరాజు కథలు, పల్లికొండ, యలమంచి వెళుతూ ధర్మవరంలో ఆగి, కొలిచిన స్వామి భీమేశ్వరుడా చెన్నకేశవుడా అనే ఆలోచనలో పడ్డాను.

అప్పటికే ఉదయం 9.30అవుతుంది. మనపని మనం చేసుకొంటుంటే ఆకలి తన పనిగా నిశ్శబ్ద సంకేతాలిచ్చింది. ధర్మవరంనుంచి 20 నిమిషాల్లో అద్దంకి చేరుకొని వేయిస్థంభాల గుడిదగ్గర ఒక హోటల్లో టిఫిన్‌చేస్తూ,చూడాల్సిన వాటిగురించి ముచ్చటించుకున్నాం.

అద్దంకి అనగానే మనకు పండరంగడు, అతడి శాసనం గుర్తుకొస్తాయి. అద్దంకి అనగానే అప్పుడెప్పుడో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం, ఆత్మగౌరవంతో పుట్టుకొచ్చిన స్వతంత్రపాలకులైన రెడ్డిరాజులు గుర్తుకొచ్చారు. ప్రజల్ని పరపీడననుంచి కాపాడి 'స్వేచ్చావాయువుల్ని పేల్చే అవకాశాన్నిచ్చి, అద్దంకిని రాజధానిగా తీర్చిదిద్ది రెడ్డిరాజ్యానికి పురుడుపోసిన నెపథ్యం గుర్చుకొచ్చింది. గుండ్లకమ్మ తీరంలో కమ్మని పంటపొలాలనడుమ, ఎత్తైన కోటసౌధాలు, చూడచక్కటి ఉద్యానవనాలు, కవులు, కళాకారులతో భూతలస్వర్థాన్ని తలపించింది అద్దంకి అన్న సాహితీ వర్ణనలన్నీ కళ్లముందు కదలాడాయి. అద్దంకి మహానగరంలో 'ప్రోలయవేముడు నిర్మించిన నగరీశ్వర, కమఠేశ్వర, గణపతి ఆలయాలను చూడాలనుకొన్నాం. ఇంతలో

చంద్రమౌళిగారు అందుకొని ఒక సమకాలీన గ్రంథంలో అద్దంకి నగరవర్ణనలను వినిపించిన తరువాత, ఆసక్తికరమైన సంగతిని చెప్పారు. అదేమిటంటే అద్దంకి నగరంలో

వారవనితలు తమ వెంట్రుకలనే చీకటిలో కలసిన మంగళకర రాత్రి కలవారు. నుదురు అనే చంద్రరేఖతో ప్రకాశించే విదియ వంటివారు. కనుబొమలనే లతల సొబగుల లాస్యం యొక్క మనోహర రంగస్థలం వంటివారు. కళ్ళుఅనే చేపలతో కలసియున్న మన్మథ పతాకవంటివారు. అధరమనే బంధూకపుప్ప విలాసంతో విభ్రమ మందిన శరత్కాలం వంటివారు. శంఖాల్లాంటి అందమైన కంఠాలు కలిగినవారు. చక్రవాక పక్షి జంటల వలె ఉన్న స్టనాలతో శృంగారమనే బావి వంటివారట. వింటుంటే నేనుకూడా మదన క్రీడొత్సాహ పీడితుణ్ణై, మట్టెవాడలో మంచనశర్మ, టిట్టిభశెట్టి వారకాంతల కోసం పడ్డ తిప్పల్ని గుర్తుకు చేసుకున్నాను. టిఫిన్‌ ముగిసింది. ఇక అద్దంకి నగర పర్యటనకు బయలుదేరాం!చంద్రమౌళిగారే మా టూర్‌ గైడ్.

ముందుగా రెడ్డిరాజులు కులదైవంగా భావించి పూజించుకున్న నందికంత పోతరాజనే కఠారికి (ఆయుధం) అద్దంకికిగల అనుబంధం, ఆపైన ఆకత్తి అద్దంకినుంచి కొండవీడుకు రాజధానితో తరలిఫోయినవైనం, అతరువాత పెదకోమటి వేముడు, వెలమ ప్రభువు సింగభూపాలునికి మధ్య జరిగిన పోరులో చేయిజారి, మళ్ళీ శ్రీనాధుడు, కొండవీడుకు చేర్చిన వైనం చరిత్ర జ్ఞాపకాల్ని 'ప్రవహింపజేసింది. ఒకసారి ప్రొలయవేముడు, తమ్ముడు మల్లారెడ్డితో కలసి శ్రీశైలయాత్ర ముగించుకొనుచుండగా, శతృవులదాడినుంచి మోటుపల్లిని రక్షించటానికి మల్లారెడ్డి, అద్దంకిని రక్షించటానికి ప్రోలయవేమారెడ్డి, అద్దంకికి చేరుకున్నప్పుడు, వారి తల్లి అన్నమ్మ, నందికంతపోతరాజు కఠారిని, కోటతూర్పుభాగంలో నిలిపి పూజించిన పోతురాజుగండిని చూద్దామని బయలుదేరిన మాకు నిరాశే మిగిలింది. మట్టికోటగోడ కేవలం దిబ్బలా మిగిలింది. అదికూడా ఒక పంతులమ్మగారు కొని కాపాడుతుందిగాబట్టి పోతురాజుగండి, అదుగో ఆపెద్ద బిల్టింగ్‌ కిందే ఉండేదని చంద్రమౌళిగారు చూపించారు. ఇలా చారిత్రక ఆనవాళ్లు ఒక్కొక్కటీ చెరిగిపోతుంటే గుండె తరుక్కుపోతుంది.


తరువాత రెడ్డిరాజులు నిర్మించిన పాత(అగస్తేశ్వర) శివాలయం, లోపల సప్తమాతృక శిల్చం, ఇంకా అనేక విరిగిన విగ్రహాలను చూశాం. బాగా పేరుమోసిన అద్దంకి పోలేరమ్మ ఆలయం కొత్తకొత్త రంగుల్లో పొంగిపోతూ, ప్రాచీనతకు పాతరేసిన సంగతిని మరచిపోయినట్లుంది. తరువాత అద్దంకిలో రెడ్డిరాజుల కాలంలోనే నిర్మించిన గణపతి ఆలయాన్ని చూశాం. అద్దంకి పరిసర గ్రామాల రైతులు ఆరోజు ఆలయంచుట్టూ తమ అరకల్ని తిప్పి, ఏరువాక పున్నమినీ జరుపుకుంటున్న తీరు మళ్లీనాకు మావూళ్లో ఏరువాక తిరునాళ్లను గుర్తుకుచేసింది. విశాల ప్రాంగణం కుంచించుకుపోయి, ఆధ్యాత్మిక పరిమళాలు ప్రసరించిన చోట అంగళ్లు రాజ్యమేలుతున్నాయి. రెడ్డిరాజుల కాలపు వీరభద్రాలయం కూడా కొత్తరూపుతో పాతదనాన్ని పోగొట్టుకుంది. ఆ తరువాత కాలంలో తాతాచార్యులు నిర్మించాడంటున్న లక్ష్మ నరసింహాలయం, మాధవస్వామి ఆలయాల్ని చూచ్చి గత వైభవప్రాభవాలు ఇంతగా నిర్తక్ష్యానికి గురికావాలా అన్న ప్రశ్న మమ్మల్ని వేధించసాగింది. మధ్యాహ్నం 1.00గంట అవుతుంది. చంద్రమౌళిగారు ఒక పూటకూళ్లమ్మ ఇంటికి తీసుకెళ్ళి అన్నం తినిపించారు. ధర్మవరం సుబ్రహ్మణ్యంగారికి నేనిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చి, అద్దంకి వేయిస్థంభాల గుడిముందు ప్రతిస్టించిన ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన విగ్రహానికి నమస్మరించుకున్నాను. అద్దంకిలోని 6వజార్డి చక్రవర్తి-విక్టోరియారాణి శిల్పాలు, 1850 నాటి తాలూకా ఆఫీసు, 1933 నాటి పోలీస్‌ స్టేషన్‌, ఆస్పత్రి, సబ్‌జైళ్లను చూచి, అవి వెదజల్లే పాత వాసన పరిమళాల్ని ఆస్వాదించాను. అయితే, ఎప్పుడో 800 ఏళ్లక్రితం నిర్మించిన వేయిస్థంభాలగుడి రోడ్డుకంటే 3అడుగుల గుంటలో ఉంది. వాస్తు కళా విన్యాసానికి మారుపేరైన వినాయకుడిగుడిని అంగళ్లు మింగేస్తున్న తీరు మనసును కలచివేసింది. పాత శివాలయంలో చారిత్రక శాసనానికి సున్నంగొట్టి అక్షరాలు కనిపించకుండా చేయటం మరింత బాధను కలిగించింది. ఒకనాటి పౌరుషానికి ప్రతీకగా ఉన్న న్కోటదిబ్బ దిగులుగా మూలుగుతుండటం నన్ను మరింత కృంగదీసింది. నీలిమందు తయారీ తొట్లు, గుట్టు చప్పుడు కాకుండా మాయమవటం తట్టుకోలేని నిజం. ఇన్ని బాధలమథ్య, వేంగీ చాళుక్యరాజు గుణగ విజయాదిత్యుని సేనాని అద్దంకి


పండరంగడు తరువోజ వృత్తంలో వేయించిన క్రీ.శ.848నాటి శాసనం నా మదిలో మెదిలి కొంత ఊరట, తెలుగు సాహిత్య చరిత్రకు పట్టంగట్టిన విషయం గుర్తుకొచ్చి మరికొంత ఉపశమనమూ కలిగాయి.