అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/తెలంగాణా తెలుగు భాషాభివృద్ధి: భాషానిధి ఆవశ్యకత
అమ్మనుడి పండుగ ప్రత్యేకం
డా. గట్ల ప్రవీణ్: పి. ప్రకాష్
తెలంగాణా తెలుగు భాషాభివృద్ధి: భాషానిధి ఆవశ్యకత
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆర్థిక, భౌగోళిక, రాజకీయ, సామాజిక అంశాలతోపాటు, తెలంగాణ భాష కూడా ప్రముఖ పాత్రను ఫోషించిందన్న విషయం అందరికీ తెలిసినదే. దానికి ముఖ్య కారణం మనం మాట్లాడే తెలుగు ప్రామాణిక తెలుగు కంటే భిన్నంగా ఉండడమే. అంతే కాకుండా తెలంగాణ తెలుగు అవహేళనకు గురవుతందనే భావన తెలంగాణలో చాలా బలంగా నాటుక పోయింది. అందువలన ఎక్కడ చూసినా ప్రామాణిక తెలుగు (వాడుకలో) తప్ప, మనం మాట్లాడే భాష ప్రభుత్వ విద్య, సినిమా, దినవారమాస పత్రికలలో వివిధ రంగాల్లో ఉండక పోవడం లేక ఆడక పోవుట్ల తెలంగాణా తెలుగుకు ఒక ప్రత్యేక గుర్తింపు రాకపాయే. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ప్రజలంతా గొంతెత్తి మా నీళ్లు మాకేనని, మా ఉద్యోగాలు మాకేనని, మా భూములు మాకేనని అన్న గద్దరన్న మాటలూ పాటలూ, కళాకారుల పాటలూ, కార్మికుల ఆకలికేకల రాగాలూ మొదలైనవి ప్రజలలోకి చొచ్చుకొని పోయి ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. ఇలాంటి నినాదాలు ప్రజల్లో ఎంత ప్రభావాన్ని చూపాయో, అదే విధంగా మన తెలంగాణ భాష కూడ అంతే బలంగా ఉద్యమంలో పని చేసింది అని చెప్పవచ్చు. అదే విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయంలో ముందెన్నడూ రానంత విధంగా తెలంగాణలో జ్ఞాన సృష్టి, సాహిత్య సృష్టి జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మాటలూ, ఆటపాటలూ, ఉద్యమ గేయాలూ, కవితలూ, తెలంగాణ బతుకు తెరువును చిత్రీకరించే కథలూ మొదలైనవి. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకూ రకరకాల రచనలు చేశారు. ఈ సాహిత్యమంతా కేవలం తెలంగాణ గురించి కాకుండా వారి బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించారు. ఇవన్నీ ప్రజల భాషలో అంటే తెలంగాణ మాండలికంలో రావడం వలన, అవి ప్రజల మనస్సుల్లోకి చాలా లోతుగా చొచ్చుకొని, పాతుకు పోయాయి. ఇక్కడ మనం మరో విషయాన్ని గమనించాలి, ఏదైనా ఒక విషయం మన సొంత భాషలో అంటే మన మాతృభాషలో అమ్మభాషలో వ్యక్తపరిస్తే అది మన హృదయానికి ఎంత బలంగా హత్తుకుంటుందో మనం అనుభవించే ఉంటాము. దీనిని బట్టి మనం మాతృభాష ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
{{c|తెలంగాణ తెలుగు |]]
తెలంగాణ తెలుగుకూ, ప్రామాణిక తెలుగుకూ మథ్య వ్యత్యాసం ఉందన్న విషయం మనందరికీ తెలిసినదే. అవి ధ్వని వర్ణ, పద, వాక్య, అర్ధ స్థాయిలలో ప్రస్పూటమవుతాయి. మన మాండలికం ప్రామాణిక తెలుగు కంటే భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు వచ్చాడు :: వచ్చిండు, పోయాడు :: పోయిండు, తింటాడు :: తింట్టుండ్రు, అబ్బాయి :: పిల్లగాడు, వంకాయ ::అంకాయ మొదలైనవి. తెలంగాణ తెలుగును అన్ని రంగాల్లో ఆడకుండా నిర్లక్ష్యం చేయడానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాలు ఉండివుండవచ్చు. ఈ విషయం తెలంగాణ సామాన్య ప్రజలు గ్రహించడం వలన, అన్ని సమస్యలతో సమానంగా తెలంగాణ భాష కూడా ఉద్యమంలో అంతే బలంగా తెలంగాణ పోరాటంలో పనిచేసిందని చెప్పవచ్చు. కానీ తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, తెలంగాణ భాష గురించి ప్రభుత్వం చేసింది తక్కువ అని చెప్పవచ్చు. కానీ తెలంగాణ భాషను చూసే దృష్టి కోణంలో ఎంతో మార్పు వచ్చింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర, సినిమా, దృశ్యశ్రవణ మాధ్యమం మొదలైన రంగాలలో తెలంగాణ భాష అవహేళనకు గురైంది. అందులో ముఖ్యంగా సినిమా రంగంలో చాలా విరివిగా కనిపించేది. ఎందుకంటే సినిమాలో ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలకు లేదా విలన్ పాత్రలకు మాత్రమే తెలంగాణా యాస ఎక్కువగా ఉపయోగించేవారు. ఉదాహరణకు తెలంగాణ శకుంతల అనే నటీమణికి డైలాగ్స్ తెలంగాణ మాండలికంలోనే రాసేవారు, చెప్పించేవారు కూడా. అందువలన జనాల్లో తెలంగాణా భాష పట్ల సినిమా రంగంలో, పరిపాలనా రంగంలో ఛిన్న చూపు ఏర్పడింది. కానీ తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణా భాష కేవలం సినీమా రంగంలోనే కాకుండా అనేక రంగాల్లో ఎంతో మార్పును తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఉదాహరణకు కరీంనగర్, వరంగల్లు జిల్లాల్లో, సికింద్రాబాదు, హైదరాబాదు జంట నగరాలలో హోటళ్ల పేర్లూ. భోజన శాలల పేర్లూ, కర్రీ పాయింట్ల పేర్లూ తెలంగాణ పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా పెడుతున్నారు. కానీ అంతటితో సరిపోదు. మనం తెలంగాణా భాషనూ మరింత అభివృద్ది పరుచుకోవాలి. అప్పుడే మనం తెలంగాణా ఉద్యమంలో నినదించిన నినాదాలు సార్థకమవుతాయి. అప్పుడే మన భాష మన యాస అనే నినాదానికి సరైన అర్ధం లభిస్తుంది. అందుకోసం తెలంగాణా భాషను అన్ని రంగాల్లోకి విస్తరించాలి. ఇప్పటికే తెలంగాణ తెలుగుపై అనేక భాషల (మరాఠీ, కన్నడం, ఉర్ధూ, పర్షియన్) ప్రభావం ఉండడం వలన, అందులో ఎంతో వైవిధ్యం కలిగి ఉండడం చేత, తెలంగాణ తెలుగు ఒక భాష కాదని అదొక మాండలికమే అనే భావన ప్రజల్లో ఇంకా ఉంది. కావున మనం దీనిని శాస్రీయంగా నిరూపించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ తెలుగు పై పూర్వ పరిశోధనలు
ఇప్పటి వరకు చాలా మంది తెలంగాణా తెలుగుపై కొన్ని చెప్పుకోదగ్గ పరిశోధనలు చేశారు, అందులో ముఖ్యమైనది తెలుగు అకాడమీ, హైదరాబాదు. తెలుగు అకాడమీ ప్రచురించిన జిల్హాలవారీ మాండలికాల బులెటెన్లూ, తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి తెలంగాణా తెలుగు భాషానిధిని సమకూర్చి నిఘంటువులను అందుబాటులోకి తెస్తున్నారు అని ప్రచారంలో ఉంది. కానీ ఇంతవరకూ కార్యరూపం దాల్చినట్టుగా అయితే కానరాలేదు. దానికి పరిశోధకుల కొరత, నిధుల కొరత, ఇంచార్జీ ఉపకులపతులతో విశ్వవిద్యాలయం నడపడం ఇలాంటి అనేక కారణాలు కావచ్చు. ఇంకా చాలా మంది పరిశోధకులు వివిధ స్థాయిలలో వ్యక్తిగత అసక్తితో తెలంగాణా భాష పైన పరిశోధనలు చేశారు చేస్తున్నారు కూడా.
తెలంగాణ తెలుగు భాషానిధి ఎందుకు ?
అవిభక్త ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1985 నుంచి తెలుగువిశ్వవిద్వాలయం) భద్రిరాజు కృష్ణమూర్తి గారి అధ్వర్యంలో మాండలిక వృత్తిపదకోశాలు అనే పేరుతో ఒక సమగ్రమైన సర్వేను 1974 లో చేపట్టింది. అందులో ముఖ్యంగా వారు వ్యవసాయం, చేనేత వడ్రంగం, మేదర, కళలు, కమ్మరం, కుమ్మరం, మొదలైన అనేక సాంప్రదాయిక వృత్తుల నుంచి పద సేకరణ చేసి, వివిధ సంపుటాలుగా తెలుగు అకాడమీ 25 వృత్తిపదకోశాలను ప్రచురించారు. వీటిని ఆధారంగా చేసుకొని భద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగును నాలుగు మండలాలుగా విభజించారు (చూ. తెలుగు భాషాచరిత్ర). ఇలాంటి గొప్ప సర్వే భారతదేశంలోని ఏ భాషలోనూ దీనికి ముందుగాని లేదా తరువాత గానీ జరగలేదు. తెలంగాణా తెలుగులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాన భాండాగారాన్ని బయటికి తీయాలన్నా తెలుసుకోవాలన్నా పరిశోధనలు చేయాలన్నా తెలంగాణ భాషపై అధ్యయనాలు జరగాలన్నా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తెలుగుపై పరిశోధనలు చేయడానికి తెలంగాణ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానితో పాటుగా ఇప్పటివరకు వివిధ రంగాల్లో తెలంగాణా తెలుగులో ప్రచురితమైన సాహిత్యాన్ని ప్రచురణ కర్తల నుంచి, రచయితల నుంచి సేకరించి మన తెలంగాణా తెలుగుకు కావలిసిన సాంఖ్యీక భాషానిధిని సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతికంగా అభివృద్ది చెందని భాషలు ఆపన్న లేదా అత్యాపన్న భాషల జాబితాలో చేరడానికి ఇదొక కారణమని యునెస్కో హెచ్చరికలు జారీ చేసింది. ఈ జాబితాలో చేరకుండా ఉండాలంటే మన భాషని ఆధునీకరించుకాని ఆధునిక అవసరాలకు వాడుకునే విధంగా అభివృద్ది చేసుకోవాలి. అప్పుడే మన తెలుగు నాలుగు కాలాల పాటు నిలబడుతుంది.
ఆంగ్ల భాషానిధులు:
1960 నుండి ఆంగ్లంపై భాషానిధి ఆధారిత పరిశోధనలు మొదలయ్యాయి. సాంఖ్యిక రూపులో ఉన్న పాఠనిధులు లేక భాషానిధులు భాషాశాస్త్ర విశ్లేషణ చేయడానికి ఉపకరిస్తాయి. ఆంగ్ల భాషాశాస్త్ర పరిశోధకులు సాంఖ్యిక రూపంలో సమాచారాన్ని నిక్షిప్త పరిచి వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్షలు, స్వచ్చంద సంస్థలు, భాషానిధి నిర్మాణం, భాషావిశ్లేషణ, భాషోపకరణాలను తయారు చేశారు. ఉదాహరణకు బ్రిటిష్ అమెరికన్ ఇంగ్లీషు మధ్య ఉన్న భేదాలను వైవిధ్యాన్నీ వెలికి తీయడానికి బ్రౌన్, బ్రిటిష్ నేషనల్ భాషానిధులను రూపొందించారు. సాంఖ్యిక నిధులను మొదటి తరం, రెండో తరం అంటూ రెండు భాగాలుగా విభజించారు. మొదటి తరం నిధులలో భాగంగా బ్రౌన్ కార్బస్ (ఫ్రాన్సిస్, కుసెరా 1964), లాన్ కాస్టర్ ఒస్త్లో బర్గెన్ (ఎల్ ఓ. బి.) (మూడు విద్యాసంస్థలు సంయుక్తంగా బ్రిటిష్ ఇంగ్లీషు భాషానిధి నిర్మాణం చేపట్టారు), లండన్ లుండ్ కార్పస్ (ఎల్.ఎల్‌సి.) (జన్ స్వార్తిక్,1975) మొదలైనవి అభివృద్ది చేశారు. రెండో తరం నిధులలో భాగంగా కోబిల్డ్ ప్రాజెక్ట్ (జాన్ సిన్ క్లేర్ 1980), లాంగమెన్
కార్పస్ నెటవర్క్ (జోహన్సన్స్ 1970-78) బ్రిటీష్ నేషనల్ కార్పస్ (లాంగ్మెన్ అండ్ డబ్లూ. ఆర్. చాంబర్స్, 1991-94), ఇంటర్నేషనల్
కార్పస్ ఆఫ్ ఇంగ్లీషు (గీన్ బామ్, 1988) మొదలైనవి. వీటిని లిఖిత, మౌఖిక భాషలను ఆధారంగా రూపొందించారు. అంతే కాకుండా బ్రౌన్ కార్బస్, బ్రిటీష్ నేషనల్ కార్పస్లను నిర్మించిన పద్దతిలోనే కెనెడియన్, న్యూజిలాండ్, స్విట్టర్ లాండ్ ఇంగ్లీషు భాషానిధుల
(కార్పొరా) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లీషు భాషానిధుల నిర్మాణం వివిధ విశ్వవిద్యాలయాలలో చేపట్టారు. బ్రౌన్ కార్చస్, బ్రిటీష్ నేషనల్
కార్పస్లను (బి.ఎన్.సి) ఆధారంగా చేసుకొని ఇండియన్ ఇంగ్లీషు భాషానిధిని ఆచార్య ఎన్.వి. శాస్తి (1988) గారు శివాజీ
విశ్వవిద్యాలయం, మహారాష్ట్రలో నిర్మించారు.
భారతీయ భాషలలో భాషానిధులు:
భారతీయ భాషల (ఎమిల్లీ) భాషానిధిని యు.కె. లోని లాంకాస్టర్ విశ్వవిద్యాలయం (ఎనెబిలింగ్ మైనారిటీ లాంగ్వేజ్ ఇంజనీరింగ్) (ఆన్దోని, వారి టీమ్ మెంబర్లు), భారతీయ భాషా కేంద్రం(జయరాం, ఉదయ్ నారాయణ్ సింగ్), భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఎమిల్లీ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ లో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, సింహళ, తమిళం, తెలుగు మరియు ఉర్ధూ మొదలైన భారతీయ భాషలకు పాఠనిధులను అఖివృద్ధి చేశారు. భారతీయ భాషలకు భాషాశాస్త్ర సమాచార సమితి (లింగ్విస్టిక్ డేటా కన్నార్టియం ఫర్ ఇండియన్ లాంగ్వేజస్) అనే పేరుతో భారతీయ భాషా సంస్థ, మైసూరు డిపార్టమెంట్ ఆఫ్ ఎలక్షానిక్స్, భారత ప్రభుత్వం సహకారంతో భారతీయ భాషల భాషానిథిని నిర్మించారు. ఇందులో దాదాపు ముప్ఫై లక్షల పదాల నిడివిగల భాషానిధిని ప్రధాన భారతీయ భాషలకు (ద్రావిడ, ఆర్య) నిర్మించారు. వివిధ భారతీయ విశ్వవిద్యాలయాలు (హైదరాబాదు విశ్వవిద్యాలయం, ఐ.ఐ.ఐ.టి., హైదరాబాదు, ఐ.బ.టి కాన్పూర్, జవహరలాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ వివిధ పరిశోధన సంస్థలు) ఈ భారతీయ భాషానిధిని ఉపయోగించి, ప్రధాన భారతీయ భాషలకు భాషోపకరణాలను అభివృద్ధి చేశారు.
ఆ తరువాత లింగ్విస్టిక్ డేటా కన్సార్నియం ఫర్ ఇండియన్ లాంగ్వేజస్ ప్రాజెక్టులో భాగంగా భారతీయ భాషలకు (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ) భాషాభాగాలను గుర్తించారు, టీకాసహిత పాఠనిధులను తయారు చేశారు. ఆ తరువాత జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హిందీ నుండి ఇతర భారతీయ భాషలకు (తెలుగు, ఒడియా, పంజాబీ, బెంగాలీ మొదలైనవి) సమాంతర పాఠనిధులను తయారు చేశారు. ఇలాంటి సమాంతర పాఠనిధులు యంత్రానువాద ఉపకరణాలను అభివృద్ధి చేయడానికి ఉవయోగపడతాయి. అదే విధంగా ఆచార్య జి. ఉమామహేశ్వరరావు గారు కోటి పదాల తెలుగు భాషానిధిని లాంగ్వేజ్ టెక్నాలజీ లాబరేటరి, అనువర్తిత భాషాశాస్రజ్డుల మరియు అనువాద అధ్యయనాల కేంద్రం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేశారు. ఈ భాషానిధి ఆధారంగా తెలుగు పద విశ్లేషిణీ పద జనకం, భాషాభాగాల గుర్తింపు, వాక్య విశ్లేషిణి, యంత్రానువాదం, తెలుగు దిద్దరి మొదలైనవి ఎన్నింటినో అభివృద్ది చేశారు. ఈ ఉపకరణాలన్నీ కాల్ట్స్ జాలతావు (వెబ్ సైటు) లో ప్రజలకు వాడుకోడానికి అందుబాటులో ఉంచారు.
ప్రజల కర్తవ్యం
తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నాా ఏ ఖండంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా తూచ తప్పకుండా తెలంగాణా తెలుగులో జ్ఞానసృష్టి చేయాలి. అందుకు విరివిగా ఈ మాండలికంలో కథలూ, కవితలూ, నవలలూ, సృజనాత్మక సాహిత్యాన్నీ ఎప్పటికప్పుడు అంతర్జాలంలో ప్రకటించాలి. అవి యూనికోడులోనే ఉండాలి. వాటిని అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో పెట్టాలి. ఫేస్‌బుక్, వాట్సాప్, కోరా, ట్విట్టర్, ఇన్నాగ్రామ్, టెలిగ్రామ్ మొదలైన సామాజిక మాధ్యమాలలో మన భాషలోనే రాయాలి. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న తెలంగాణ వాళ్ళందరూ స్వచ్చందంగా జ్ఞానసృష్టి చేయాలి. రచయితలూ కవులూ గాయకులూ కళాకారులూ, విమర్శకులూ, నవలాకారులూ వారి వారి రచనలను, రాతప్రతులను యూనికోడ్ లోనే రాయాలి. అవన్నింటినీ కూడా చదువుకోవడానికి ప్రజలు దిగుమతి చేసుకోడానికి అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉంచాలి. అప్పుడే తెలంగాణ తెలుగు అంతర్జాలంలో విశ్వవ్యాప్తంగా కనపడుతుంది, వినపడుతుంది. అలా ఉంచిన వాటిని సమయానుసారంగా అంతర్జాలం నుండి భాషాశాస్రజ్ఞులు, భాషానిపుణులు సాలెగూళ్లలో ఉన్న సమాచారాన్ని దిగుమతి చేసుకొని భాషానిధిని అఖివృద్ధి చేస్తుండాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. ఒక యంత్రాంగం ఈ ప్రక్రియ పై ఎల్లప్పుడూ పనిచేస్తుండాలి. అప్పుడే తెలంగాణ భాషానిధిని నిర్మించగలము.
చేయాల్సిన పరిశోధనలు
తెలంగాణ భాషా స్వరూపం, వర్ణనాత్మక వ్యాకరణాలనూ, నిఘంటువులనూ కూర్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఇతర భాషల ప్రభావం మొదలైన వాటిపై మరింత విస్తృతస్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వాటితో పాటు తెలంగాణ తెలుగును అన్ని రంగాలకు విస్తరించి అమలు చేయడానికి ఒక శాస్రీయ అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మన భాషపై మనకు అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవం, అనుబంధం, ఇష్టం ఉండడం వేరు శాస్రీయ దృక్పథంతో భాషని అధ్యయనం చేయడం వేరు. ఎందుకంటే ఇంకా నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల ప్రభావం చేత అనేక భారతీయ భాషలు (గిరిజన, లిపిలేని భాషలు, అల్పసంఖ్యాక భాషలు కోకాల్లలు) అంతరిస్తున్న సమయంలో మన భాషనూ కాపాడుకోవాలంటే, అన్ని రంగాలలో భాషను తప్పకుండా అమలు చేయాలి. అందుకు తెలంగాణా భాషపై ఒక సమగ్ర అధ్యయనం జరగాలి. దాని కోసం ముందుగా కావాల్సింది భాషానిధి. దీన్ని నిర్మించుకోవడానికి ఒక పక్కా కార్య ప్రణాళికను తయారుచేసుకొని దానికి అనుగుణంగా నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఒక భాషకు భాషానిధి సమకూర్చడం వ్యక్తిగతంగా చేసేపని కాదు, అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగం వారు ఆర్థిక సహాయం అందించే ఏర్పాటు చేయాలి. వాటితోపాటు తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ, ఐటి శాఖ, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం లాంటివారి అర్ధిక సహాయం, ప్రోత్సాహం కూడా ఉండాలి. కారణం భాషానిధి సమకూర్చడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. మనం పైన చెప్పుకున్నట్టుగా తెలంగాణా భాషపై కొన్ని అధ్యయనాలు జరిగినాయి కానీ ఇప్పటి వరకు తెలంగాణా భాషానిధి సేకరణ మాత్రం జరగలేదు. తెలంగాణ తెలుగుతో పోల్చుకుంటే ప్రామాణిక తెలుగులో భాషానిధి సేకరణ విస్తృత స్థాయిలో జరిగిందని చెప్పాలి.
భాషానిధి నిర్మాణం: ఉపయోగాలు
తెలంగాణా తెలుగుపై ఒక సమగ్రమైన అధ్యయనం చేసి తెలంగాణ తెలుగుకు వర్ణనాత్మక, సంగణాత్మక వ్యాకరణాలు, నిఘంటువులూ, భాషానిధులూ, పదనిధులూ, పదజాలితలూ (వర్డ్‌నెట్ ), సాంకేతిక భాషోపకరణాలు లేక వనరులు లేదా సంగణాత్మక వనరులు అఖివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత భాషాస్టితిగతులని తెలుసుకోవడానికి భాషానిథి ఎంతగానో ఉపకరిస్తుంది. భాషలలో ఉన్న భిన్నత్వంలోని ఏకత్వాన్ని నిరూపించడానికి ఉపయోగపడతాయి. నిఘంటు నీర్మాణం, పాఠ్యపుస్తకాల తయారీ, నూతన పదాల సేకరణ, పదస్థాయిలో ఉన్న పదవిశ్లేషిణి, పదజనకం, భాషాభాగాల గుర్తింపు, వాక్య విశ్లేషణి, యంత్రానువాదం, భాషాసాంకేతికత, సమాంతర భాషానిధులు, వ్యాకరణ రచన, థేసరస్, రిఫరెన్స్ గ్రామర్, ప్రథమ లేక ద్వితీయ భాషాబోధన, పదప్రయోగ కోశాలు, పదజాలికలు, సమాచార వెలిపరపు (ఇన్ఫరమేషన్ రిట్రీవల్ మొదలైనవి. దీనితో పాటు వివిధ రంగాలలో తెలంగాణ తెలుగును విస్తరించేలా చేయాలి. దానీతోపాటు తెలంగాణ తెలుగును సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ అధునిక యుగంలో సాంకేతికంగా అభివృద్ధి చెందని భాషలను వెనుకబడిన భాషలుగా పరిగణిస్తారని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందని భాషలు కొన్ని సంవత్సరాలలో అపన్న భాషల జాబిజాలో చేరడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. అందుకే తస్మాత్ జాగ్రత్త! అందరం నడుం కట్టి తెలంగాణ తెలుగులో విజ్ఞానాన్ని సృష్టిద్దాం, అంతర్జాలంలో, సామాజిక మాధ్యమాల్లో విరివిగా తెలంగాణ తెలుగులో రాద్దాం. అప్పుడే మన తెలంగాణ తెలుగులో మనం వెలుగులను చూడగలం. ఆ వెలుగులే మనందరికీ సోపానాలు అవుతాయి. దానీతో మన తెలుగు అభివృద్ది చెందుతుంది.
జి. ప్రవీత, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, 8179407778.
పి.ప్రకాష్ హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 000000
మాతృభాషలో చదివిన పిల్లలు, ఇతర భాషలో చదివిన పిల్లలకంటే మెరుగుగానూ, త్వరగానూ నేర్చుకొంటారు.ఇంటి భాషలో చదివిన పిల్లలు, తర్వాత పాఠశాలలో పరీక్షలలో పనితీరు బాగుంటుంది. ప్రతిభా నైపుణ్యాలకు మించి ప్రయోజనాలతోబాటు మెరుగైన ఆత్మనిర్భరత, ఆత్మగౌరవం, ఆత్మధైర్యం అలవడతాయి-యునెస్మో